Tagore: The World Voyager

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు
(ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు జనవరి 2014లో ఫేస్బుక్ లో పోస్టు చేసారు. తిరిగి పుస్తకం.నెట్ లో వేయడానికి అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు.– పుస్తకం.నెట్)
*******
టాగొర్ 150 వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్నో పుస్తకాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్క పుస్తకం టాగోర్ ని మళ్ళా కొత్తగా మనకు పరిచయం చేస్తూనే ఉంది. ఆ వరసలో నా చేతుల్లోకి వచ్చిన మరొక సుందరగ్రంథం Tagore: The World Voyager ( రాండం హౌజ్,2012). హార్వర్డ్ యూనివర్సిటీలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న సుగత బోస్ అనువాదం చేసిన 90 కవితలు.

టాగోర్ మనందరికీ కవిగానే తెలుసు. ఆయన గీతాంజలికి చేసుకున్న ఇంగ్లీషు వచన అనువాదాలు ఎన్నో భారతీయభాషల్లో వచనకవిత్వానికి దారితీసాయి. కాని ఆయన ప్రధానంగా గీతరచయిత. గీతాంజలి కవితలు బెంగలీ లో గీతాలు. ఆ గీతాల్లోని సంగీతం, లయ, సుకుమారనాదం అనువాదానికి లొంగేవి కావనుకుని టాగోర్ వాటిని వచనకవితలుగా ఇంగ్లీషులోకి అనువదించుకున్నాడు. గత శతాబ్దకాలంగా ఎందరో భారతీయ రచయితలు ఆ పాటల్ని తమ భాషల్లోకి అనువదించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఉదాహరణకి అబ్బూరి రామకృష్ణరావు తెలుగులో వాటిని గీతాలుగా మార్చాలని చూసారు. గత ముఫ్ఫయ్యేళ్ళుగా ఎందరో బెంగాలీలు వాటిని ఇంగ్లీషులో గీతాలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లాంటి ప్రయత్నాల్లో చెప్పుకోదగ్గది ఆక్స్ ఫర్డ్ ప్రచురించిన Of Love, Nature And Devotion: Selected Soings of Rabindranath Tagore (2008).కాలిఫొర్నియా యూనివెర్సిటిలో ఎకనమిక్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న కల్పన బర్ధన్ బెంగాలీ గీతమాధుర్యాన్ని లేశమైనా ఇంగ్లీషుపాఠకులకి పరిచయం చెయ్యాలని ప్రయత్నించారు.

టాగోర్ బెంగాలీ తూలికాతుల్యపదజాలంతో లలితంగా, శ్రవణపేయంగా, తంత్రీగానంలాగా ఉంటుంది. దాన్ని ఇంగ్లీషులాంటి జెర్మానిక్ భాష అందిపుచ్చుకోగలగడం అసాధ్యం. ఆ విషయం అందరికన్నా ముందు టాగోరే గ్రహించాడు. అందుకనే భాషాపరమైన సంగీతాన్ని వదిలిపెట్టి భావనాత్మక సంగీతాన్ని మాత్రమే నింపి ఇంగ్లీషులోకి అనువదించాడు.

సుగతబోస్ తన అనువాదాల్లో గీతమాధుర్యాన్ని పూర్తిగా అందించే ప్రయత్నం చెయ్యలేదుగానీ, వాటిని పూర్తి వచనంగానూ మార్చలేదు. 2500 పై చిలుకు టాగోర్ గీతాల్లోంచి చక్కని పాటల్ని ఏరి మాలగుచ్చినట్టుగా తన సంకలనం తీసుకువచ్చాడు.

పుస్తకంలో రెండు భాగాలున్నాయి. మొదటి భాగంలో 1912 నుంచి 1934 మధ్యలో చేసిన వివిధ ఖండాంతర ప్రయాణాల్లో టాగోర్ రచించిన పాటలనుంచి ఏరిన కవితలున్నాయి. ప్రతి కవితకీ ముందు నాలుగైదు పరిచయవాక్యాలున్నాయి. ఈ కవితలు నాబోటి పాఠకుడికి ఇంతదాకా తెలియని ఎన్నో విశేషాల్ని కొత్త సీమల్ని పరిచయం చేస్తున్నాయి. రెండవభాగంలో టాగోర్ గీతాలనుంచి ఎంచిన కవితలున్నాయి. టాగోర్ గీతాల్ని సాధరణంగా ప్రేమ, ప్రకృతి, భక్తి, దేశభక్తి, విచిత్రం అని అయిదురకాలుగా వర్గీకరించడం పరిపాటి. ఈ కవితల్ని కూడా ఆ వర్గీకరణలోనే ఎంపిక చేసి అనువదించడం జరిగింది. ఇందులో కొన్ని కవితలు టాగోర్ ఇంగ్లీషు అనువాదంలోనూ, తెలుగు లో మరెన్నో అనువాదాల్లోనూ చదివినప్పటికీ, మరొక ఇంగ్లీషు అనువాదంలో చదవడం కొత్తగా, ఆసక్తికరంగా ఉంది.

ఆ కవితల్లోంచి ఒక కవిత మీకోసం. అది ‘బొదొల్’ అనే గీతం. టాగోర్ 1925 లో పెరూ దేశం ఆహ్వానం మీద దక్షిణ అమెరికాలో అడుగుపెట్టి, అనారోగ్యం వల్ల అర్జెంటీనాలో ఆగిపోవలసివచ్చింది. అక్కడాయనకు విక్టోరియా ఒకెంపొ అనే భావుకురాలి స్నేహం, ఆదరణ లభించాయి. బోర్హెస్ వంటి మహారచయిత ప్రశంసలకు కూడా నోచుకున్న ఒకెంపో టాగోర్ ని హృదయపూర్వకంగా అభిమానించింది. వారిద్దరి స్నేహం ప్రపంచ సాహిత్యచరిత్రలో మధురమైన ఒక పేరాలాంటిది. టాగోర్ ఆమెని ‘విజయ’ అని పిలిచాడు. తన ‘పూరబి’ అనే గీతసంపుటిని ఆమెకు అంకితం చేసాడు. బ్యునోస్ ఎయిర్స్ నుండి యూరోప్ నౌకా ప్రయాణంలో టాగోర్ కోసం ఆమె ఒక వాలుకుర్చీ బహుమతి చేసింది. ఆ కుర్చీలో కూచుని రాసిన కవిత ఇది.

బదులు

మందహాసాలపూలమాల
చేతధరించినిలిచిందామె.
అశ్రుపూర్ణవర్ణభరితమైన
దుఃఖఫలభారంతో నేను.

ఉన్నట్టుండి, మనదగ్గరున్నవి
మార్చుకుందామందా సుందరి
నేమామె ముఖం చూసాను
నిర్దయాత్మక సౌందర్యమామెది.

వానకు తడిసిన నా పండ్లబుట్ట
సంతోషంగా చేతుల్లోకి తీసుకుంది
ఆమెచేతుల్లోని నవఫాల్గుణసుగంధ
మాల నా గుండెకు హత్తుకున్నాను.

నాదే జయమంటూ వడివడిగా
నడిచివెళ్ళిపోయిందామె.
వేసవి దినాంతానికి, చూద్దునుకదా
నా చేతుల్లో వడిలిన పూలమాల.

You Might Also Like

One Comment

  1. varaprasad.k

    ఆహా ఎంత చక్కగా, ఆహ్లాదంగా రాశారు.విశ్వకవి గురించి చిన్నపుడు చదువుకున్న ఏవో కొన్ని విషయాలు మాత్రమే చాలా మందికి తెలుసు.వీర భద్రుడు గారి లాంటి వారికి మాత్రమే ఆయన లాంటి విశిష్ట వ్యక్తుల గురించి మదించి ఎన్నో గొప్ప విషయాలు వెలికి తీయటం సాధ్యం.చక్కని సమీక్షతో పాటు,మంచి కవితను అందించినందుకు అభినందనలు.

Leave a Reply