యుగకర్త నిర్యాణం – 1983 నాటి వ్యాసం

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. తెలుగు రచయిత శ్రీశ్రీ మరణించినపుడు వచ్చిన వ్యాసం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్. ఈ పుస్తకం నుండి స్వీకరించిన ఇతర సాహిత్య సంబంధిత వ్యాసాలను ఇక్కడ చూడవచ్చు)
******

శ్రీశ్రీ లేని ఆధునికాంధ్ర కవిత్వాన్ని ఊహించుకోవడం కష్టం. అర్థశతాబ్ది పాటు ఆయన తెలుగు కవిత్వాన్ని శాసించాడు. వందలాది కవులకు దేశికుడు, పథనిర్దేశకుడు అయ్యాడు. అక్షరాలా అసంఖ్యాక పాఠకులకు అభిమాన కవి అయ్యాడు.

తెలుగు కవిత్వంలో ఒక ఉజ్వల యుగానికి కర్త శ్రీశ్రీ. ఆయన మరణంతో ఆ యుగం అంతం కాబోవడం లేదు. తెలుగు కవిత్వం రానున్న తరాలలో ఎన్ని మలుపులు తిరిగినా, దానిపై ఆయన ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొనసాగుతుంది.

అధినికాంధ్ర సాహిత్యానికి ఆదివైతాళికుడు గురజాడ. ఆధునికత్వానికి ఆయన తలుపులు తెరిచాడు. ఆంధ్ర సరస్వతికి ఆయన “ముత్యాల సరాలు” సంతరించిన సంవత్సరమే శ్రీశ్రీ ప్రభవించాడు. గురజాడ అడుగుజాడలో మునుముందుకు సాగిపోయాడు.

శ్రీశ్రీ కళ్ళు తెరిచేనాటికి తెలుగులో భావకవితా మార్గానిదే ప్రాబల్యం. దాని ప్రభావంలోనే శ్రీశ్రీ తన కవితా సౌధానికి పునాదులు నిర్మించుకున్నాడు. ఆరోజులలో విశ్వనాథ, కృష్ణశాస్త్రి ప్రభృతుల రచనలకు ప్రతిధ్వను లనదగిన వృత్తాలు, గీతాలు రచించాడు. అనతికాలంలోనే ఆయనకు దానిపై మొహం మొత్తింది. పూర్తిగా తనదే అనిపించుకోదగిన నూతన వ్యక్తిత్వానికై అన్వేషించాడు. ఆ అన్వేషణ ఫలితమే 1933లో ఆయన రచించిన “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను..” అని ప్రారంభమయ్యే అపూర్వ గీతం. ఆధునికుల వ్యష్టివాదానికి, ప్రాచీనుల సమిష్టి వాదానికి అవినాభావాన్ని అంత కవితాత్మకంగా సంభావించిన గీతం సాహిత్య చరిత్రలోనే కనబడదు. పాత కొత్తలకు వారధి వంటి ఆ గీతానికి ఇది స్వర్ణోత్సవ సంవత్సరం కూడా.

ఆ మరుసటి సంవత్సరమే శ్రీశ్రీ పూర్తిగా నూతన మార్గానికి మరలి “మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది..” అనే సుప్రసిద్ధ గీతంతో ఒక నవశకాన్ని ఆవిష్కరించాడు. ముద్దుకృష్ణగారి “జ్వాల”లో ప్రచురితమైన ఆ గీతం ఆనాడు గొప్ప సంచలనం కలిగించింది. ఎందరో యువకవులకు స్ఫూర్తినిచ్చింది. తెలుగులో అభ్యుదయ కవితా స్రవంతికి అది జన్మగీతమైంది.

ఆ తర్వాత శ్రీశ్రీ మరి వెనుదిరిగి చూడలేదు. మునుముందుకే ప్రయాణించాడు. తెలుగునాట అప్పుడప్పుడే వామపక్ష భావాలు వ్యాపిస్తున్నాయి. ఆ భావాల ప్రభావం శ్రీశ్రీ పై పడింది. ఒకవైపు మార్క్సిస్టు దార్శనికతను పుణికి పుచ్చుకున్నాడు. మరొకవైపు సంఘంలో దగాపడిన తమ్ముల బాధల గాథలు ఆకళించుకున్నాడు. వేరొకవైపు ప్రాచీనాథునాతనాంధ్ర సాహిత్యావలోకనం వల్ల కలిగిన వ్యుత్పత్తి, భావుకతా వుండనే ఉన్నాయి. ఇంకొకవైపు పాశ్చాత్య వాఙ్మయ మథనం వల్ల కలిగిన ఆధునిక దృక్పథం వున్నది. ఇన్ని ప్రభావాల సమ్మేళనం నుంచి తరువాత కాలంలో యుగకర్తగా గణనకెక్కిన శ్రీశ్రీ ఆవిర్భవించాడు.

“మహాప్రస్థానం” గీతసంపుటి తెలుగు ఆధునిక కవిత్వంలో ఒక మైలురాయి. దాని తర్వాత శ్రీశ్రీ ఎన్నో కవితా ఖండికలు, వచన రచనలు, ప్రయోగాత్మకమైనవి, ప్రయోజనాత్మకమైనవి, ప్రచారాత్మకమైనవి – రచించాడు. వాటిలో ఆయన గాఢ ప్రతిభ, విలక్షణ వ్యక్తిత్వ ముద్ర ప్రస్ఫుటంగా ప్రత్యక్షమవుతాయి. కానీ అనంతర కాలంలో ఎన్ని వ్రాసినా “మహాప్రస్థానం” గీతాలలో ఆయన అందుకున్న ప్రతిభా శిఖరాల ఔన్నత్యం ఈనాటికి కూడా పఠితలను ఆశ్చర్యపరుస్తుంది.

ఒక తాత్విక సిద్ధాంతాన్ని కవితామయంగా పలకడం సాధారణులకు సాధ్యం కాదు. ఆ విధంగా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని కవితాత్మకంగా పలికినవారిలో ముఖ్యుడిగా జర్మన్ కవి బెర్టాల్డ్ బ్రెక్ట్ ను పేర్కొంటారు. తిరిగి శ్రీశ్రీ తెలుగులో ఆ “ఫీట్” చేశాడు. “ఏ దేశచరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం – నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం” అని ప్రారంభమయ్యే గీతం “కమ్యూనిస్టు మేనిఫెస్టో”లో “ఇప్పటివరకు నడిచిన సమాజచరిత్ర అంతా వర్గ సంఘర్షణల చరిత్ర” ని ధ్వనించే ప్రారంభవాక్యాలను కవితీకరించినట్టు వుంటుంది. “kAదేది కవితకనర్హం, ఔనౌను శిల్పమనర్ఘం” అనే పాదాలతో కూడిన శ్రీశ్రీ రచన “ఋక్కులు” రమ్యమైనదైనా, జుగుప్సితమైనదైనా, ఏదైనా కవి భావుక భావ్యమానమై రసస్ఫోరకమవుతుందని సూత్రీకరించే సంస్కృతాలంకారిక శ్లోకానికి ఆధునిక రూపంవలె భాసిస్తుంది.

“ఏకో రసః కరుణ ఏవ” అని భవభూతి వాక్యం. అన్ని నదులు సముద్రంలో విలీనమైనట్టు అన్ని రసాలు కరుణరసంలో పర్యవసిస్తాయి. శ్రీశ్రీ కవితలో స్థూల దృష్టికి ఎంత రౌద్రం, భీభత్సం కనిపించినా అంతర్లీనంగా కరుణరసం ప్రవహిస్తూనే వుంటుంది; మానవతావాదం ప్రచలిస్తూనే వుంటుంది. “మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం” అని ఎలుగెత్తి చాటిన కవి శ్రీశ్రీ.

తన రచనలలో లోకం ప్రతిఫలించాలని, తన గీతం జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని, తన ఆకాశాలను లోకానికి చేరువగా, తన ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వలజడిగా కురిపించాలని జీవితమంతా ఒక తపస్సుగా గడిపిన మహాకవి శ్రీశ్రీ. ఆయన మహాప్రస్థానం చేసినా ఆయన కవితకు, ఆదర్శాలకు “మహాప్రస్థానం” లేదు. ఏ వెలుగులకో, ఏ స్వప్నానికో, ఏ దిగ్విజయానికో మార్గసూచికలై అవి మనలను నిత్యం మంత్రిస్తూనే వుంటాయి, ఆమంత్రిస్తూనే వుంటాయి.

(జూన్ 17, 1983)

You Might Also Like

One Comment

  1. B J S REDDY

    నాకు తెలుగు మీద ఇంతటి అభిమానము కలగడానికి ప్రేరణ మొదటిగా మా తాతయ్య , రెండవది శ్రీ శ్రీ గారు
    ధన్యవాదాలు…

Leave a Reply