పుస్తకం
All about booksపుస్తకభాష

September 2, 2015

Hallucinations – Oliver Sacks

More articles by »
Written by: సౌమ్య
Tags: ,

Hallucinations ని తెలుగులో చిత్త భ్రాంతి అనో, మానసిక భ్రాంతి అనో అనవొచ్చుననుకుంటాను. మనలో మనం అనేకం ఊహించుకూంటాం – కానీ అవన్నీ బయటి ప్రపంచంలో ఎదురుగ్గా కనబడిపోయి మనల్ని తికమక పెట్టేయవు అందరికీ. కొందరికి పెడతాయి. అవే నిజం లాగ కూడా అనిపిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో, పక్క పక్కన నిలబడ్డ ఇద్దరు మనుషులు ఉన్నారనుకుందాం. ఒకడికి ఎదురుగ్గా కుక్క కనబడితే రెండో వాడికి కూడా కనిపిస్తుందని ఆశిస్తాము. కానీ, ఒకవేళ అది ఒకరికి కనబడి పక్కనున్న మనిషికి కనబడకపోతే ఆ ఒకడేదో చిత్తభ్రాంతికి లోనైయి ఉంటాడు అని అనుకుంటాము. ఇది మామూలు దైనందిన జీవితంలో వాడుక. అయితే, పైన అన్నట్లు, కొంతమందికి విపరీతమైన చిత్తభ్రాంతులు ఉండొచ్చు. అలాంటి చిత్తభ్రాంతుల మూలాల గురించి, అలాంటివి కలిగినపుడు మెదడులో ఏం జరుగుతుంది? అన్న అంశం గురించి, అసలు వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? అన్న ప్రశ్నకు జవాబుగా ప్రముఖ న్యూరాలజిస్టు ఆలివర్ సాక్స్ రాసిన పుస్తకం ఈ Hallucinations.

ఈ చిత్తభ్రాంతులు ఇప్పుడు కొత్తగా పుట్టినవి కావు. అయితే, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని ఇప్పుడు మెదడులో జరుగుతున్న చర్యలను వివిధ పరికరాల సాయంతో పర్యవేక్షించగలుగుతున్నారు. పుస్తకం చదువుతున్నపుడు ఏమవుతుంది? అంకెలు లెక్క పెడుతున్నపుడు మెదడులో ఏ భాగం చైతన్యవంతం అవుతుంది? మాట్లాడుతున్నప్పుడు మెదడు ఎలా ప్రవర్తిస్తుంది? -ఇలాంటివి EEG, MRI వంటివి ఉపయోగించి పరిశోధిస్తున్నారు. అలాగే, మానసిక అనుభవాలకు గురి అవుతున్నప్పుడు ఏం జరుగుతోంది? అన్నది కూడా పరిశోధించగలుగుతున్నారు. ఈ పుస్తకంలో రచయిత చిత్తభ్రాంతుల గురించి శాస్త్రజ్ఞులు కనుగొన్న విషయాలు, తన ఎరుకలోని పేషంట్ల కథలు – అన్నీ కలిపి వీలైనంత సులభ గ్రాహ్యమైన పద్ధతిలో చెప్పుకొచ్చారు. శాస్త్రీయ అంశాలే కాక, ఈ విధమైన భ్రాంతులకి మన సాంఘిక, సాంస్కృతిక, వ్యక్తిగత జీవితాలలో, కాల్పనిక సాహిత్యంలో ఉన్న పాత్ర వంటి అంశాల గురించి కూడా చర్చించారు. ప్రపంచంలో ఉన్న అన్న్ని రకాల చిత్తభ్రాంతులనీ ఇక్కడ లిస్టు చేయడం పుస్తకం ఉద్దేశ్యం కాదు. కొన్ని ఎంపిక చేసుకున్న శారీరక/మానసిక సమస్యలను తీసుకుని వాటిలో ఎలాంటి భ్రాంతులు ఉంటాయో, అవి ఎందుకు కలిగే అవకాశం ఉందో శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం చేశారంతే.

పుస్తకంలో 15 అధ్యాయాలు ఉన్నాయి. మొదట పరిచయం చేసిన hallucination అనుభవం Charles Bonnet Syndrome గురించి. పాక్షిక లేదా పూర్తి గుడ్డితనం ఉన్నవారికి కలిగే visual hallucinations గురించి. ఇదివరలో V.S.Ramachandran రాసిన ఒక పుస్తకంలో దీని ప్రస్తావన ఉంది. అక్కడ ఆయన James Thurber కి ఈ సిండ్రోం ఉందేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తారు. ఈ పుస్తకంలో దీన్ని గురించి మరింత వివరంగా, వివిధ పేషంట్ల వ్యక్తిగత అనుభవాలతో చర్చించారు. ఇదే అంశాన్ని కొనసాగిస్తూ తరువాతి అధ్యాయంలో sensory deprivation వల్ల కలిగే చిత్తభ్రాంతుల గురించి చర్చిస్తారు. “Total visual deprivation is not necessary to produce hallucinations – visual monotony can have much the same effect. Thus, sailors have long reported seeing things (and perhaps hearing them too) when they spent days gazing at a becalmed sea”” అంటారు. మొదటి దానికంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగింది నాకు వీటి గురించి చదువుతూంటే.

అయితే, చిత్తభ్రాంతులు ఇలా పూర్తిగా దృష్టి సంబంధమైనవే కానక్కర్లేదు. లేని వాసనలు అనుభవంలోకి రావడం, లేని గొంతుకలు/సంగీతాలు వినబడ్డం కూడా జరుగుతాయి – వీటి గురించి, వీటి గురించి జరిగిన శాస్త్రీయ పరిశోధనల గురించి తరువాతి రెండు అధ్యాయాలలో చర్చించారు. రచయిత parkisons disease గల పేషంట్లతో కొంతకాలం పని చేశారు. ఆ అనుభవాలు ఆయన రాసిన పుస్తకాల్లో తరుచుగా కనిపిస్తూ ఉంటయి. ఇందులో కూడా ఒక అధ్యాయంలో ఈ వ్యాధి కలవారికి కలిగే చిత్తభ్రాంతుల గురించి ప్రత్యేకంగా రాశారు. తరువాతి అధ్యాయం – ఇలా ప్రత్యేకమైన వ్యాధి ఏదీ లేకపోయినా భ్రాంతులు కలిగించగలిగే మాదక ద్రవ్యాల (hallucinogenic drugs) గురించి. ఈ అధ్యాయంలో రచయిత 60లలో యువ డాక్టరుగా ఉన్నప్పుడు తాను స్వయంగా వివిధ drags వాడ్డం గురించి కూడా రాశారు. ఈ డ్రగ్స్ వల్ల కలిగే భ్రాంతుల గురించిన పరిశోధన ఆ కాలంలోనే కొంచెం ఊపందుకోవడంతో, ఆ పరిశోధనల గురించి చదవడం వల్ల, అసలేం జరుగుతుందో తెలియాలంటే తాను కూడా ఆ డ్రగ్స్ ప్రయత్నించాలి అనుకున్నాడట!

ఇక పార్కిసన్స్ వారికి ప్రత్యేకంగా కలిగే భ్రాంతుల్లాగానే, మైగ్రేన్ గల వారికి కూడా visual hallucinations ఉంటాయట. వాటి గురించీ, మూర్చ, “దేవుడు పూనడం” టైపు సమయాల్లో కలిగే చిత్త భ్రాంతుల గురించీ, ఏదన్నా పక్షవాతం వల్ల కలిఏ పాక్షిక గుడ్డితనం వల్ల వచ్చే భ్రాంతుల గురించీ, తరువాతి మూడు అధ్యాయాల్లో చర్చించారు. ఇక బాగా జ్వరం వచ్చినపుడో, మరేదో శారీరక సమస్య వల్లనో, వాటి తాలుకా మందుల వల్లనో కలిగే భ్రాంతుల (delirium అన్నారు వీటిని) గురించి విడిగా మరో అధ్యాయంలో చర్చించారు.

రచయిత వీటిని medical అనీ, neurological కానీ, psychiatric కాదనీ అన్నారు. ఇన్ని చర్చించాక నిద్ర కి సంబంధించిన భ్రాంతుల గురించి చర్చించడం తప్పనిసరిఏమో. మెలుకువ నుండి నిద్రలోకి జారుతున్న సమయంలో కలిగే చిత్త భ్రాంతులని hypnagogia అంటారట. ఇవి కూడా కొంతమందికి “కనిపిస్తే” కొంతమందికి “వినిపిస్తా”యట. ఇప్పటిదాకా చదివినవి ఒక ఎత్తు – ఇది ఒక ఎత్తు – ఎందుకంటే ఈ hypnagogia అనుభవం ఏదో నాకు కూడా తరుచుగా జరుగుతందని నేను అనుకుంటూంటాను. దానితో ఈ అధ్యాయం నాకు అన్నింటికంటే ఆసక్తికరంగా అనిపించింది ఈ పుస్తకంలో. దీనికి కొనసాగింపు గా తరువాతి నిద్ర మీద నియంత్రణ లేకపోవడం, అతి నిద్ర వంటి వాటి వల్ల కలిగే hallucinations గురించి చర్చించారు. ఏవో గత అనుభవాలు వెంటాడడం వల్ల కలిగే చిత్త భ్రాంతులు, సినిమాల్లోలా అంతరాత్మతో సంభాషణలు, దయ్యాలు-ఆత్మలు వంటి అంశాల గురించి చివరి రెండు అధ్యాయాల్లో చర్చించారు. పుస్తకం దేని గురించంటే – వీటన్నింటి గురించీ!

మొదట పుస్తకం చదవడం మొదలుపెట్టినపుడు నాకు ఉన్న అభిప్రాయం ఈ భ్రాంతుల వల్ల జరిగే మంచి ఏం ఉంటుంది? మనశ్శాంతి ఉండదు వీటివల్ల…అని. కానీ, పుస్తకంలో కొందరు పేషంట్ల అనుభవాలు చదివాక ఈ విషయంలో కొంచెం జ్ఞానోదయం కలిగింది. మచ్చుకి ఒక అభిప్రాయం:
“David Stewart speaks of his hallucinations as being “altogether friendly”, and he imagines his eyes saying, “Sorry to have let you down. We recognize that blindness is no fun, so we’ve organized this small syndrome, a sort of coda to your sighted life. It’s not much, but it’s the best we can manage.”

పుస్తకం అలవోకగా చదివేగలం అని చెప్పలేను. చాలా అంశాలకి ఆ ఫుట్నోట్లు చదవడం తప్పనిసరి కావొచ్చు. అవేమో ఒక్కో చోట ఆ అధ్యాయమంత పొడుగ్గా ఉంటాయి. పైగా అన్నీ అర్థమవుతాయన్న గ్యారంటీ లేదు. కానీ, ఈ పరిమితులతో కూడా ఈ పుస్తకాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. “కథ” అంటే నా దృష్టిలో fiction కాదు. రిసర్చి పేపర్లలో కూడా నేను మొదట కథనే వెదుకుతాను. కనుక, ఈ పుస్తకం చదువుతున్నప్పుడు కూడా ఒక గొప్ప ఫాంటసీ నవల చదువుతున్న అనుభూతి కలిగింది నాకైతే. చిత్తభ్రాంతుల్లో ఇన్ని రకరకాలు ఉంటాయని, ఇంత రంగుల ప్రపంచం అని ఊహించలేదు. రెండు మూడేళ్ళ తరువాత ఇందులో చదివిన శాస్త్రీయాంశాలలో ఎన్ని గుర్తుంటాయో నేను చెప్పలేను కానీ, ప్రస్తుతానికి ఇది చదవడం మట్టుకు నాకు ఒక అద్భుతమైన అనుభవాన్ని మిగిల్చింది అని చెప్పగలను. శాస్త్రీయమైన అంశాల గురించి చదవడంలో కూడా ఫిక్షన్ లో ఉన్నంత వైవిధ్యం, నవరసాలూ ఉంటాయని నా పఠనానుభవాల్లో నాకు అర్థమైన విషయం. ఆ విధంగా చూస్తే, ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవమని చెబుతాను imagination ని ఇష్టపడే అందరికీ.

పుస్తకం వివరాలు:
Hallucinations
Oliver Sacks
publisher: Alfred A. Knopf
year: 2012About the Author(s)

సౌమ్య0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Gratitude – Oliver Sacks

వ్యాసకర్త: Nagini Kandala **************** చాలా మందికి జీవితాన్ని ప్రేమించడమంటే మృత్యువుని అంగీకరించల...
by అతిథి
0

 
 

Musicophilia – Oliver Sacks

Musicophilia – Tales of music and the brain by Oliver Sacks సంగీతం వినడంలో మనుషులకి ఉండే అభిరుచి శిక్షణ-పరిజ్ఞానం, పరిస...
by సౌమ్య
2