మొదటితరం రాయలసీమ కథలు

కథ – ఇది సంస్కృతశబ్దమయినా, ఆధునికకాలంలో కథగా వ్యవహరించబడుతున్న ప్రక్రియ మనకు పాశ్చాత్యుల నుండి ఏర్పడిందని విమర్శకులంటారు. అనాదిగా భారతదేశపు సాహిత్యానికి ముఖ్యమైన లక్ష్యం – ఆనందం కలిగించటమే. ఆనందమొక్కటే లక్ష్యం కాక, సామాజిక ప్రయోజనాన్ని ఆశించి, లేదా కనీసం సమాజపు స్పర్శతోటి వచ్చిన రచనలు చాలా కాలంగా ఉన్నా, ఈ విషయానికి ప్రాముఖ్యత వచ్చినది పత్రికలు వచ్చిన తర్వాతనే. ఈ నేపథ్యంలో ఆంధ్రదేశంలో ఒక ప్రాంతపు కథ ఆనవాళ్ళను, ఆ కథ తాలూకు అందమైన తొలి బుడిబుడి నడకలను పరిశోధించి, కూర్చిన ఆసక్తికరమైన సంకలనమే ఈ పుస్తకం.

మొదటితరం రాయలసీమ కథలు – కథలను సంకలనం చేసిన సంపాదకుడు శ్రీ అప్పిరెడ్డి హరినాథరెడ్డి గారు. వీరు ఇదివరకు శ్రీ సాధన పత్రిక ఆనవాళ్ళను కనుగొని ఆ పత్రికలో వచ్చిన ప్రముఖ రచనావ్యాసంగాలను “సీమ సాహితీస్వరం – శ్రీసాధన పత్రిక” అన్న పుస్తకరూపంలో కూర్చారు. అందుకు వారికి కేంద్ర సాహిత్య అకాడెమీ వారి యువపురస్కారం దక్కింది. ప్రస్తుత సంకలనాన్ని కూడా ఆయన అంతే ఉత్సాహంతో, ఆహ్లాదకరంగా తీర్చారు.

ఇందులో ప్రముఖ పాత్రికేయులు, చందమామ, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సంపాదకత్వం వహించిన విద్వాన్ విశ్వం గారి తొలినాళ్ళ కథలు, కందాళై శేషాచార్యులు, ఆర్మొగం పిళ్ళై వంటి కథకుల కథలు, స్వాతంత్ర్య యోధులు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి ఒకానొక కథ, ఇంకా పేరు తెలియని కొందరు రచయితల కథలూ, రాయలసీమ మొదటి కథ గా అదివరకు భావించబడిన కడగండ్లు కథ (రచయిత సభా) ఇందులో చోటు చేసుకున్నాయి.

రాయలసీమ అన్న మాట నేపథ్యాన్ని మాత్రమే సూచిస్తుంది. ఈ పేరు వెనుక ప్రాంతీయ తత్త్వం కానీ, సంకుచితత్వం కానీ లేదు. మొదటి తరం కథలు కావడం మూలాన కాబోలు, ఈ నాటి సీమ కథలలో ’యాస’ కనబడదు. గ్రాంథికం ఉన్నా అన్ని కథల్లో గ్రాంథికపు బరువు కానరాదు. ఆ గ్రాంథికమూ చక్కగానే ఉంది. అనాయాసమైన శైలి. కథల్లో మెలోడ్రామా ఎక్కువగా కనబడదు. జీవితంలోని చిన్ని సన్నివేశాన్ని లేదా, చెప్పదల్చుకున్న విషయానికి ప్రతీకను ఉపయోగించటం కానీ ఎక్కువగా ఉన్నది. దాదాపు అన్ని కథలలోనూ మధ్యతరగతి నేపథ్యం చాలా హృద్యంగా ఇమిడిపోయింది. ఈ సంకలనానికి సంబంధించి సీమ అనగానే కరవు – అని మాత్రమే అర్థం కనబడదు.

గొప్ప కథలు కొన్ని, సరదా కథలు కొన్ని, తేలికపాటి చిక్కటి హాస్యపు కథలు కొన్ని, తీవ్రమైన నిర్వేదంతో (విద్వాన్ విశ్వం గారి) కథలు కొన్ని, ప్రతీకను చూపే కథలు కొన్ని, వ్యాసరూపంలో ఒకట్రెండు, … ఇలా విభిన్నమైన కథలను ఏరి, ఎంపిక చేసి, ఆసక్తికరంగా దిద్దడంలో సంపాదకులు కృతకృత్యులయినారు.

“బిరీన”, “మెటికలు”,”చౌకలించుతూ”, “మెరవణి”,”కడుపులో సంకటం”, “అయ్యవారు” – ఇలాంటి మాండలికాలు, పలుకుబడులూ అక్కడక్కడా మెరుస్తాయి.

ఈ సంకలనంలో బ్లాకీకుక్క చరిత్ర – కందాళై శేషాచార్యులు గారి కథ ఇది. శ్రీసాధన పత్రికలో 1936 లో ప్రచురించబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే – అదే సంవత్సరం ప్రతిభ అనే ద్వైమాసిక పత్రికలో విశ్వనాథ సత్యనారాయణ గారి ’మాకళీదుర్గంలో కుక్క’ కథ ప్రచురితమయ్యింది. ఇది విశ్వనాథ వారి కథలపుస్తకంలోనో లేక అంతర్జాలంలోనో వెతికి చదువుకోవచ్చును. రెండు కథలున్నూ శునకపు జీవితాన్ని నాటి సమాజంతో అన్వయించి చెప్పిన కథలే.

’సమానత్వం గురించి మాట్లాడే వారు, వారి కుక్కల విషయంలో కూడా సమానత్వం పాటించరు. జాతికుక్కను పెంచుకునే వాడు తన కుక్క – వీథి కుక్కతో కలవడానికి ఒప్పడు’ అని విశ్వనాథ వారి కథ ప్రతిపాదించే సిద్ధాంతం. ఈ కథకు కూడా ఆశ్చర్యంగా రాయలసీమ శివార్లలో కన్నడ రాజ్యానికి ఆనుకుని ఉన్న మాకళీదుర్గం అన్న చిన్న పల్లె నేపథ్యం.

బ్లాకీ కుక్క చరిత్ర – నడమంత్రపు సిరి తలకెక్కి, మూలాలను మరచిపోతే వచ్చే ’పర్యవసానాన్ని’ కథ ద్వారా చెబుతుంది. ఓ వీథికుక్కకు అదృష్టవశాత్తూ రాచయోగం పట్టి ఆంగ్లదొర ప్రాపు దొరికి మదరాసుకూ, ఆపై లండనుకూ వెళ్ళే యోగం పడుతుంది. మదరాసుకు చేరుకున్న కుక్కకు తన ఊరు, ఆపై లండను చూసిన కుక్కకు మదరాసు లోకువగా కనబడతాయి. ఆ దొర తిరిగి మదరాసుకు చేరుకుంటాడు. కొంతకాలానికి అతను తన దేశానికి మరలిపోతూ, కుక్కను ఒక మొదలియారుకు ఒప్పజెపుతాడు. ఆ మొదలియారు కుక్కను వీథికి తరుముతాడు. ఆ కుక్క ఇప్పటి బ్రతుకు బతకలేక కుక్కచావు చస్తుంది.

శేషాచార్యుల వారి కథ – నాటి స్వాతంత్రోద్యమ నేపథ్యంలో ఆంగ్లేయుల అడుగులకు మడుగులొత్తే వారికి మెత్తటి చెప్పుదెబ్బ. ఈ నాటికీ కూడా ఎన్నో విషయాలకు ఈ కథ వర్తిస్తుంది.

విశ్వనాథ వారి మాకళీదుర్గంలో కుక్క కథ – మారుతున్న సమాజ ధోరణిని గర్హిస్తూ, ఆంగ్లేయుల సామాజిక సంస్కరణలలో కనిపించే వర్గరహితసమాజ భావనకు వ్యతిరేకిస్తూ సాగిన రచన. ఈ కథలో ఉపన్యాస ధోరణి కొంత. గ్రాంథికం వంటి వ్యావహారికం. కథలో ఒకింత హాస్యం, అసహజత్వం. అంత సులభంగా అర్థం కాని తత్త్వం.

శేషాచార్యుల వారిది డ్రామా, వర్ణనలూ లేని సహజమైన కథ. అక్కడక్కడా కొంత నీతిపాఠం. గ్రాంథికం లేశమాత్రంగా ఉన్న సులభవ్యావహారికం. సులభంగా అక్షరాల వెంబడి జారిపోయే శైలి. కథ ద్వారానే తెలియవచ్చే నీతి.

ఈ సంకలనంలో “భగీరథుని ప్రయత్నం” – వ్యక్తిగతంగా ఈ వ్యాసకర్తకు నచ్చిన కథ, గొప్ప కథ. భగీరథుడు అనంతపురం జిల్లా నుంచి బళ్ళారికి వెళుతుంటాడు. అనంతపురం సరిహద్దులో మోటారు ఆగి ఒక పల్లెలో చిక్కుబడిపోతాడు. ఆ రోజు అతడికి పితృకార్యం ఉన్నది. పల్లెలో శ్రాద్ధం జరిపించడానికి బ్రాహ్మడు, ఆదరించే గృహస్తులు దొరుకుతారు. సంబారాలు సమకూరుతాయి. కానీ ఒక్క చిక్కు.అక్కడ కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఉండవు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న తపనతో భగీరథుడు శివుడి దగ్గరకెళతాడు. శివుడికి జటాజూటమే లేదు. క్రాఫు. ఆపైన విష్ణువు దగ్గరకెళతాడు. ఆయన కాళ్ళకు షూస్ వేసుకుని కూర్చున్నాడు. గంగ ఆయన కాళ్ళ దగ్గర జన్మించే అవకాశం లేదు. తిరిగి గంగ దగ్గరకే వెళతాడు. ఆమె సీమకు రావడానికి ఒప్పుకుంటుంది అయితే మధ్యలో జ్యేష్టమాత దరిద్రాదేవిని చూసి కాశీకి పారిపోతుంది. ఇలా కాదని తాను ప్రజానాయకుడైతే ఎగువ తుంగభద్రకు డామ్ కట్టి కాలవల ద్వారా నీళ్ళు దిగువకు పారించవచ్చని భగీరథుడు అందుకు సిద్ధమౌతాడు. ఆయన ప్రయత్నం చివరకు నెరవేరిందా? ఈ కథ – రాజకీయంలోని స్వార్థం, సమాజంలో పేరుకుపోయిన కులతత్త్వం, వంచన, ఇలా అనేక విషయాలకు అద్దం పడుతుంది. అవి బహుశా ఎప్పటికీ మారవు కాబోలు.

ఈ కథకు కథకుడి పేరు లేదట. అయితే నిశ్చయంగా ఇది “పప్పూరి రామాచార్యులు” గారి కథలా అనిపిస్తుంది. శ్రీ పప్పూరి రామాచార్యులు గారు శాసనసభ సభ్యులు, గొప్ప నేత, పత్రికాధిపతి,సాహిత్యకారులు. వదరుబోతు అన్న పేరు మీద గొప్ప సెటైరికల్ వ్యాసాలు వీరు వ్రాశారని ప్రచారంలో ఉన్నది.

వచ్చిన జీతం అంతా అప్పులకు సరిపోయి, రాబోతున్న పండుగ ఎలా గడవాలి అన్న బడి అయ్యవారి నిరాశను చాలా సాధారణంగా చిత్రించి అందమైన ముగింపును చూపిన కథ – ఉగాది కానుక.

కూతురు పెళ్ళికి డబ్బుల్లేక. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి తద్వారా వచ్చే పీ ఎఫ్ డబ్బులతో సరిపెట్టడానికి ప్రయత్నిస్తే కలిగిన పర్యవసానం, చివరకు సమస్య దొరికిన పరిష్కారం – ఆర్ముగం పిళ్ళై గారి ’రాఘవేంద్రరావు గారి రాజీనామా’ కథలో కనబడుతుంది.

మదరాసు బ్రాడ్వే థియేటరు లో మాయాబజారు సినిమా టికెట్లు దొరికి, అదే రోజు బంధువులు ఇంటికి రాబోతున్నారని తెలిస్తే? ఆఖరు నిముషంలో ఆ బంధువులు రావట్లేదని సినిమాకెళితే అక్కడ ఏమయింది? అలవోకగా సాగే ఆహ్లాదమైన కథ ఇది.

సీమ జానపద గీతం “బేట్రాయి సామి దేవుడా..” అన్న పాట తాలూకు కూనిరాగం నేపథ్యమైన కథ మరొకటి.

పెన్నేటి పాట – విద్వాన్ విశ్వం గారి తొలినాళ్ళ కథలు ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. ఇవి శ్రీసాధన పత్రిక నుండి స్వీకరించారు. విశ్వం గారి కథల్లో కమ్యూనిజాన్ని వివరించే తత్వం, నిర్వేదం, కాస్త చర్చాధోరణీ కనిపిస్తాయి. కందాళై శేషాచార్యులు అనే కథకుడు శ్రీసాధన పత్రికకు మాత్రమే పరిమితమై రచనలు చేసినట్లు కనబడుతుంది. కారణమేమో తెలియదు. ఈ రచయిత మరిన్ని కథలు వ్రాసి ఉంటే బావుండేదని అనిపిస్తుంది.

నిడివి ఎక్కువగా ఉన్న కథలు కూడా రెండు మూడింటిని ఈ సంకలనంలో కూర్చారు. ఒక కథావిమర్శ, విమర్శ మీద ఒక వ్యాసం, ఇద్దరు ప్రముఖ కథకుల ముందుమాటలు కూడా ఉన్నాయి. ఈ కథలను జనవినోదిని, సౌందర్యవల్లి, శ్రీ సాధన, శారద …ఇలా ఎనిమిది పత్రికల నుండి సేకరించారు. మొత్తం నలభై రెండు కథలు. కథాపరిశోధకులకు ఇది ఒక గైడ్. పాఠకులకు చక్కని వినోదం. అన్ని కథలూ గొప్ప కథలు అన్నమాట నిజం కాకపోవచ్చు, అయితే విభిన్నమైన కథలు అనడం సత్యదూరం కాదు. సీమ సాహిత్యపు మొదటి తరం కథలు – నిజానికి ఇలాంటి పరిశోధనలు యే విశ్వవిద్యాలయం వాళ్ళో చేబట్టాలి. అయితే ఆ పరిస్థితి లేని కారణాన ఇతర వ్యక్తులు పూనుకుంటున్నారు. అబ్జ క్రియేషన్స్ వారు తమ శక్త్యానుసారం ఇలాంటి గొప్ప పరిశోధనలను పుస్తకరూపంలో తీసుకువస్తున్నందుకు నిజంగా అభినందించాలి. కినిగె వారి ఈ లంకె లో పుస్తకం దొరుకుతుంది. వెల తక్కువే. చదువుకోవడమే కాక దాచిపెట్టుకోవలసిన పుస్తకం.

ఈ అపురూపమైన సంకలనానికి ఒక చిన్న దిష్టి చుక్క. ఇబ్బంది పెట్టేంతగా స్ఖాలిత్యాలు లేకపోయినా, ప్రూఫ్ రీడింగ్ మరోమారు చూచుకుని ఉండవలసింది.

You Might Also Like

3 Comments

  1. లక్ష్మీదేవి

    ముందుగా అసలు సమీక్షను విడిచిపెట్టి, ఉపోద్ఘాతంమీద చర్చించినందుకు మన్నించండి.

    అంతా కలిపి సాహిత్యచరిత్రగా చూడబడాలని నా అనుకోలు.
    వేదములు అతి ప్రాచీనములన్నప్పుడు అంతకు ముందే లక్షణాలు నిర్దేశింపబడడం సాధ్యంకాదు.(వాటిల్లో కూడా బ్రహ్మానంద ప్రసక్తి ఉన్నదేమో)
    కానీ పురాణాలనుంచీ మిగతా సాహిత్యమంతా ఆనందం మరియు లోకకల్యాణం/సామాజిక ప్రయోజనం ఉద్దేశించే వ్రాయబడినదని రచనాకారులు ప్రస్తావనలోనే చెప్తారు.
    చతుర్వర్గ వ్యుత్పత్తియు, కళాపరిజ్ఞానము,కీర్తి, ఆనందము కావ్యప్రయోజనాలని భామహుడు, యశస్సు,అర్థము, వ్యవహారజ్ఞానము, అమంగళపరిహారము,సద్యఃపరనిర్వృతి (పరమానందము), యుపదేశము గలుగునని ముమ్మటుడు అన్నారని సాహిత్యసోపానములులో తెలుపుతారు దివాకర్లవేంకటావధానిగారు.

  2. లక్ష్మీదేవి

    అనాదిగా భారతదేశపు సాహిత్యానికి ముఖ్యమైన లక్ష్యం ఆనందం కలిగించటమే—–???
    లోకకల్యాణం కోసమే వ్రాయడం ఋషులకాలం నుంచీ ఉన్నదే. లోకకల్యాణం అన్నా సామాజిక ప్రయోజనం అన్నా ఒకటి కాదా?

    1. రవి

      మీరు ప్రస్తావిస్తున్నది వేద వాఙ్మయాన్ని, పురాణాలను గురించి. నేనంటున్నది రూపక సాహిత్యాన్ని, అనూచానంగా మారుతూ వస్తున్న రూపాలను గురించి. రూపక సాహిత్యానికి లక్ష్య లక్షణాలు స్పష్టంగా ఏర్పడి ఉన్నాయి. మీరంటున్న వేద, పురాణ వాఙ్మయాలకు లక్ష్యలక్షణాలు, వాటి ఆశయాలు పుస్తకరూపంలో నిర్దుష్టంగా ఏర్పడలేదు.

Leave a Reply