పుస్తకం
All about booksపుస్తకాలు

July 17, 2015

శివతాండవము – ప్రత్యక్షప్రసారమూ, చక్షురానందమూ

More articles by »
Written by: అతిథి
Tags: , ,

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
**********

చదలేటి అలలు, ఆ అలలపై తేలియాడే నెలవంక !
చదలు అంటే ఆకాశము, అక్కడున్న ఏరు మందాకిని. చదలేరు అంటే మందాకినీ నది, ఆకాశగంగ. ఆ ఆకాశగంగ అలలపై తేలియాడుతున్న జాబిలి! ఎంత అందమైన ఊహ! గంగ, నెలవంక ఒక్కచోటే ఉన్నది శివుని శిరోభాగాన. విశ్వమంతా శివమయం అన్నలోతైన భావన కూడా అంతర్దృశ్యంగా అగుపింపజేశారు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారు. శివతాండవాన్ని కన్నులకు కట్టినట్టు చూపించారు. హోహో ఊహాతీతమీ యానందము ఇలాతలమున! నిజమే కదా!

ప్రాతఃకాలపు పక్షుల కువకువలు ‘ప్రాబలుకులు’ ఆ హైమవతీ విలాసవంతమైన నూపురనినదములకు అనుకరణములే నట!
ఆయమ లాస్యముగని ఆనందపరవశలై కొమ్మలు తలయూచెనేమో అన్నట్టు వాని నుండి పువ్వులు జలజలా రాలుచున్నవట!
సెలయేటి కన్నియలు ఆ ఆనందమయ దృశ్యాన్ని కనులారా గాంతమని పరుగిడుతున్నాయట, వారి కోక కుచ్చిళ్ళు దుసికిళ్ళాడుతున్నాయట. కొండకోనల్లో సెలయేళ్ళ దృశ్యాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకుంటే చీర కుచ్చిళ్ళ మడతల్లా ఉండవూ మరి ఆ జల తరంగిణులు!

యథో హస్తః తథో దృష్టిః
యథో దృష్టిః తథో మనః
యథో మనః తథో భావః
యథో భావః తథో రసః

ఎక్కడైతే చేతులు (ముద్రలు) ఉంటాయో అక్కడ దృష్టి, ఎక్కడ దృష్టి పెట్టబడిందో అక్కడే మనస్సు, ఎక్కడ మనస్సుందో అక్కడే భావము, ఎక్కడ భావముంటుందో అక్కడే రసోత్పత్తి జరుగుతుందని నాట్యశాస్త్రములోని ప్రాథమిక అంశము. నాట్యశాస్త్రములోని పలు విషయాలపై అవగాహన కలిగిన ఆచార్యుల వారు అనేక చోట్ల ఆ భంగిమలను చక్కగా తమ పలుకుల్లో ఇమిడ్చి చూపించారు.

కరముద్రికలతోనె గనులచూపులు దిరుగ
తిరుగు చూపులతోనె బరుగెత్త హృదయమ్ము
హృదయమ్ము వెనువెంట కదిసికొన భావమ్ము
కుదిసి భావముతోనె కుదురుకోగ రసమ్ము

శిరము గ్రీవమ్ము పేరురము హస్తయుగమ్ము
సరిగాగ మలచి గండరువు నిల్పినయట్లు

కుడికాలునంబువలె గొంచెముగ మునువంచి
యెడమపాదము వైపు నింత శీర్షము వంచి
……
ఒక కాలు వెనకకై యొకకాలు ముందుకై
….
కరశాఖలను వంచి శిరము వెన్కకు మలచి
….
అందమైన, మనోహరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ…

తరగలను జిఱుగాలి పొరలు లేచినయట్లు (నీటి తరగల్లో గాలి పొరలు కదలగా ఆ తరగలు ఎంత అందంగా మెలికలు తిరుగుతాయి!)
చిరుగాలిలో దమ్మి విరులు గదలినయట్లు (చిరుగాలి తాకగా తామర పూవులు అలవోకగా ఎలా కదలుతాయి!)
విరులలో నునుతావి తెరలు లేచినయట్లు (పూవుల్లో తావులు తెరలు తెరలుగా ఎలా వ్యాపిస్తాయి!)

చిగురుటాకులు గాలి వగలు వోయినయట్లు (చిగురుటాకులు పిల్లగాలికి వగలు పోతూ నాట్యాలాడతాయి!)
….
నెలపాప బెదవి పై మలయు నవ్వును వోలె
కులపాలికా ముగ్ధ కిలికించితము వోలె
జలదాంగనా లలిత సంచారాములు వోలె

ఒక్కొక్క పాదములోనూ రసజ్ఞులు మైమరచిపోయే సన్నివేశం ఆవిష్కరించబడుతూ ఉండే భావాలంకారాల సౌందర్యం ఒకపక్క అయితే… మృదుమధురంగా వీనుల విందు చేసే శబ్దాలంకారాల సౌందర్యం ఇంకోవంక….

తమ్ములై, ఘటికమోదమ్ములై , సుకృత రూ
పమ్ములై, శాస్త్ర భాగ్యమ్ములై, నవకోర
కమ్ములై, వికచపుష్పమ్ములై, తుమ్మెదల
తమ్ములై, భావమంద్రమ్ములై, విశ్రాంతి
దమ్ములై, రక్తకిసలమ్ములై…….
…..
వల్లకీ సుందరులు ఫుల్ల రాగములీన
కల్లోలమయిపోవ గంధర్వహృదయములు
అచ్చరల గన్నులందానందబాష్పములు
బెచ్చుగా గండముల విరిసికొన హాసములు

వృత్యనుప్రాసాలంకారము, ఛేకానుప్రాసాలంకారము, అంత్యనుప్రాసాలంకారము, ముక్తపదగ్రస్తాలంకారము మొదలైన శబ్దాలంకారాలు ఎక్కడికక్కడ విలసిల్లుతుంటే అర్థాలంకారాలన్నీ నాకు స్వభావోక్తి అలంకారంలోనే సమ్మిళితమైనట్టు అనిపించింది నాకు. శివమయమీ విశ్వమన్నప్పుడు అన్నీ స్వభావసిద్ధమైనవే కదా!

పైన మనము స్థిర చిత్రదృశ్యావిష్కరణ చూశాము, ఇప్పుడు చలన చిత్రదృశ్యావిష్కరణ చూద్దాము.
స్థల పద్మములవోలె నిలుకడగ నిలువబడి
మెలగు కూర్మమువోలె మెల్లగా, జలియించి
యావైపు నీవైపు నల్లనల్లన దిరిగి
భావింప గజగమన భంగి ముందుకు సాగి
వాలుగల కులుకువలె వంకరలు జిత్రించి
వ్రాలి, నాగమువోలె పార్థ్షి భాగం బెత్తి
వెనుకభాగంబెత్తి, మునుము నేలకు నొత్తి
…….
నృత్యానికి సంబంధించిన పారిభాషిక పదాలెన్నో!

వెలయంగ దొమ్మిదగు విధములను చెలువముగ
నలినాక్షి భూచారి నాట్యములు జూపించి
పదునాఱగు ఖచారి పద్ధతులు నెసగించి
..

నటరాజు నృత్యమిందులో ప్రధాన అంశము. ఇందులో సంగీత, నృత్యశాస్త్రాంశాలు అనేక చోట్ల ప్రస్తావించబడ్డాయి. షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము అన్నీ సమయానుకూలంగా వీనులనలరిస్తాయి.

వెన్నెలలు, చీకటులు; నలుపులూ, తెలుపులూ; మంచి, చెడులూ రెండూ సమమే ఆ పరమేశునికి. అందరినీ ఆదరించే తండ్రి ఆయన అని చెప్పకనే చెప్తుంది ఇందులోని దృశ్యము.

తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన
చలికొండ మంచుకుప్పలు గూర్చినవిధాన
పొసగ ముత్తెపు సరుల్పోహళించువిధాన
ఘనసారమును దెచ్చి కలయజల్లు విధాన (ఘనసారము=కర్పూరము)
——
నల్లగలువలు దిక్కులెల్ల విచ్చు విధాన
మొల్లముగ దుమ్మెదలు మొనసికొన్న విధాన
వగలు కాటుకకొండ పగిలి చెదరు విధాన
తగిలి చీకటులు గొప్పగగప్పెడు విధాన
—–
ఆ అమల హస్తముల గతులు, గమనాలు చూస్తే..

పడగలెత్తును నాగుబాములై యొకసారి
ముడిచికొను కమలంపు మొగ్గలై యొకసారి
పటుముష్టి బంధసంపద ఒకసారి జూపితే ప్రకట భ్రమరీ సరళి ఒకసారి చూపుతూ..

అందమైన , మనం మరచిపోయిన పదాలు – చదలు, అంచకొదమ, క్రొవ్విరులు, కసినవ్వు, కసిమొగ్గలు, కెమ్మోవి వంటి అలతి పదాలూ ఉన్నాయి. శ్రీరమణీ లలితకటాక్షారోపణచంపక ప్రసవమాలా శృంగారిత వక్షుండు, శ్యామసాంధ్యస్ఫూర్తి చంద్రికలు, నవజటాపటల సంధ్యాకాలవారిదాంతి వికాసచంద్రమంద్రాతపార్ద్రశరీర, నగకన్యకానేత్రయుగళనిర్యత్కటాక్షగణతాపింఛ పింఛాధీనగురువక్ష వంటి దీర్ఘసమాసాలూ ఉన్నాయి.

ఒక యోగసమాధిస్థితిలో ఉండి నేరుగా చూస్తున్న అనుభూతితో సాగుతున్న ఈ వర్ణన చదువరులను కైలాసానికి కాకపోయినా మనోకైలాసం లో దృశ్యావిష్కరణ జరుపుకోగల స్థితికైతే తప్పనిసరిగా తీసుకెళ్తుంది.

మళ్ళీ మళ్ళీ చదివినా….. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే సుందరకృతి.

శివతాండవాన్ని చర్మచక్షువుల ముందు ఆవిష్కరింపజేసిన తపోధనులు పుట్టపర్తి నారాయణాచార్యులవారు. వారి గురించి పరిచయవాక్యాలు సూర్యుడిని దివిటీ వెలుగులో చూపించినట్టు అనవసరమని అందరకూ తెలిసినదే.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.6 Comments


 1. ఫణీంద్ర గారూ, నాకూ అలా అనిపించింది. ☺


 2. కొన్నేళ్ళ క్రితం మా ఇంట్లోని శివతాండవం పుస్తకం శిథిలావస్థకు చేరుకున్నప్పుడు ఆ రచన మొత్తాన్నీ చేతిరాతలో కాపీ చేసుకున్నాము. అలా రాసుకుంటున్నప్పుడు ప్రతీ వాక్యానికీ ఒళ్ళు జలదరించడమే. గగర్పొడవడమే. సగం సగమే అర్ధమైన నాకే అలా ఉంటే అందులోని రసాన్నీ స్వారస్యాన్నీ ఆస్వాదించగల వారి తన్మయత్వం ఇంకెంత స్థాయిలో ఉంటుందో!


 3. వేంకటేశ్వర రావు గారూ,
  ధన్యోస్మి. ఎంత వ్రాసినా తక్కువే , ఆ రచనకి.


 4. Tammineedi Venkateswarara Rao

  Sivatandavam oka adbhuta kavyam. Antati adbhuta kavyam meeda meeru vrasindi ante adbhutamga undi. Sivatandavavyakhyanamla vundi. Nice writing. Good expression of inner feelings.Thank you.


 5. Mythili Abbaraju

  మీ మనసు నిలిచిన కావ్యం అది లక్ష్మీ దేవి గారూ, మీ భావం వెన్వెంట రసం కాల్వలు కట్టింది …


  • అవునండి. ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా వ్రాయగలగడం చాలా గొప్ప విషయం. చదువుతుంటే పరవశం కావడమంటే తెలుస్తుంది.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

ఆడెనమ్మా! శివుఁడు!!! పాడెనమ్మా! భవుఁడు!!!

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** షుమారు 103 సంవత్సరాల క్ర...
by అతిథి
2

 
 

పుట్టపర్తి నారాయణాచార్యులు

అది 1989 అనుకుంటాను సరిగ్గా గుర్తు లేదు. నా కాలేజీ మొదటి రోజులు. మా అప్పకు పుట్లూరి శ్రీ...
by రవి
2

 
 

నీలాంబరి – నా అభిప్రాయం

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ******************* కథలు అనేకకోణాల్ని స్పృశించి ఆలోచించ...
by అతిథి
1

 

 

కథా కబుర్లూ కాలక్షేపమూ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************* పొత్తూరి విజయలక్ష్మి గారు హాస్యకథలకు ప...
by అతిథి
0

 
 

ఇమ్మడి పులకేశి – చారిత్రక నాటకం

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ******** “పండురంగడు అనే చాళుక్యసేనాని పండ్రెండు ...
by అతిథి
0

 
 

మేరల కావల…….

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి **************** ’మేరలకావల’ అనే పేరుతో తెలుగు ఉన్న ప్ర...
by అతిథి
2