Left Neglected – Lisa Genova

Still Alice సినిమా/నవల అనుభవం తరువాత ఆ రచయిత్రి రాసిన మరొక రచన ఏదన్నా చదవాలి అన్న కోరికతో ఈ నవల మొదలుపెట్టాను. ఎంతకీ కథ మొదలవకపోవడంతో పక్కన పెట్టేసి ఇతర విషయాల వైపుకి మరలాను. కొన్ని వారాలకు అనుకోకుండా మళ్ళీ ఈ పుస్తకం వైపుకి వచ్చి, ఈసారి పూర్తి చేశాను. ఈ నవల గురించి నా అభిప్రాయం:

ఇల్లూ, కుటుంబమూ, విజయవంతమైన కెరీర్ – ఇలా అన్నీ ఉండి, పరమ బిజీగా జీవితం గడుపుతున్న సారా అనే ఒకావిడకి ఒక రోడ్డు ప్రమాదంలో తలకి తగిలిన గాయం వల్ల left neglect వస్తుంది. అంటే, ఎడమ వైపుకి ఉండే దేని గురించీ ఆవిడకి స్పృహ ఉండదు. ఎడమ వైపున ఉండే మనుషులు కనబడరు, వస్తువులు కనబడవు ఇలాగ. ఇక ఆ తరువాత ఆమె జీవితంలో, కుటుంబ సంబంధాల్లో వచ్చిన మార్పులూ – ఇదీ ఈ నవల కథ.

స్టిల్ ఆలిస్ నవల వల్లనే నేను ఇక్కడికి వచ్చాను కనుక దానితో పోల్చుకోవడం అనివార్యమైంది నాకు. దానితో పోలిస్తే కథనం ఇందులో చాలా బలహీనంగా ఉంది. పావు భాగం నవల అయ్యేదాకా సారా బిజీ జీవితమూ, కుటుంబ వ్యవహారాల పట్లా, కెరీర్ పట్లా ఆవిడ ధోరణులు, ఇంట్లో పిల్లల పనులు, ఇత్యాది దైనందిన జీవిత విశేషాల వర్ణనతో సరిపోయింది. ఈ భాగంలో మరీ అంత చదివించేలా నాకైతే ఏమీ కనబడలేదు. ఇదొక కారణం మొదట్లో పక్కన పెట్టేయడానికి. చాలాసేపు దాకా ఇలాగే అనిపించాక లాస్టుకి ఆమెకి ఆక్సిడెంటు అయిన దగ్గర కథ మొదలవుతుంది. అప్పటిదాకా నేనింకా కుటుంబం left neglected ఏమో అనుకున్నా, left neglect అన్న సమస్య గురించి ఇదివరలో V.S.Ramachandran గారి పుణ్యమా అని చదివినప్పటికీ. అంతసేపు చర్చించారు ఆవిడ కుటుంబ జీవితం గురించి మరి!

కానీ కథ మొదలైనాక అయితే మట్టుకు రచయిత్రి ఆసక్తికరంగానే నడిపింది తక్కిన నవలని. Left neglect ఉండే వ్యక్తి జీవితం గురించి సుమారైన అవగాహన కలిగింది నాకు. దానితో పాటు పనిలో పనిగా ADHD గురించి కూడా కొంచెం తెలిసింది. ఇది ఫిక్షన్ కనుక కథాపరిధిలోనే ఈ అంశాల గురించి కాస్త వివరంగా చర్చించడానికి వీలుపడింది కూడా. అయినా, V.S.Ramachandran గారి Phantoms in the brain లో ఇదే సమస్య గురించి రాసిన పద్ధతి – అది వ్యాసమే అయినా కూడా దీనికి తీసిపోదని నా అభిప్రాయం.

నవల నాకు బొత్తిగా నచ్చలేదని అనలేను. కొన్ని బాగా నెరేట్ చేసినట్లు అనిపించిన సన్నివేశాలు లేకపోలేదు… ఉదాహరణకి, నాకు ప్రత్యేకంగా నచ్చిన సన్నివేశాలు మూడు:
1) సారా కి left neglect, కొడుకు చార్లీ కి ADHD. ఇద్దరూ ఒకరిని ఒకరు మానిటర్ చేసుకుంటూ ఎవరి “హోంవర్క్ ఎక్సర్సైజు” వాళ్ళు విజయవంతంగా ముగించుకోవడం నాకు చాలా బాగా నచ్చిన సన్నివేశం.
2) సారా కి వాళ్ళమ్మ కి మధ్య ఆవిడ గత ప్రవర్తనకి కారణం గురించిన చర్చని వర్ణించిన విధానం కూడా నాకు బాగా రాసినట్లు అనిపించింది.
3) సారా కి పరిస్థితులు ఇంకెంత దారుణమై ఉండొచ్చో తల్చుకుని ఉన్నంతలో ఈమాత్రం కోలుకోవడం అదృష్టమే అన్న జ్ఞానోదయం కలిగిన దృశ్యం.

మొత్తానికి, నేను కొంచెం నిరాశ చెందినా, ఈ విధమైన neurological సమస్యల గురించి కాల్పనిక కథల ద్వారా అవగాహన కలిగించాలన్న రచయిత్రి ఆలోచన నచ్చినందువల్ల బహుశా ఆవిడ మరొక రచనను కూడా చదువుతానేమో. ఈ నవల పుణ్యమా అని నేను ఐదారేళ్ళ బట్టి చదవాలి అనుకుంటున్న Oliver Sacks పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అందుకు ఈవిడకి ధన్యవాదాలు తెలుపుకోవాలి.

You Might Also Like

Leave a Reply