పుస్తకం
All about booksఅనువాదాలు

August 12, 2009

Istanbul: Memories and the City

More articles by »
Written by: Purnima
Tags:

నేను పరిచయమైన ఐదు నిముషాల్లో అవతలివాళ్ళు నాకేసి జాలిగా చూసే రెండు సందర్భాల్లో,  మొదటిది నేను సాప్ట్ వేర్ ఇంజినీరని చెప్పినప్పుడు, రెండోది “చిన్నప్పటి నుండీ హైదరబాదే! అంతా ఇక్కడే!” అని చెప్పినప్పుడు. “అబ్బా.. ఒకటే ఊరా? బోర్ కదూ?!” అని వాళ్ళు వాపోతూ ఉంటే ఏం చెప్పాలో తోచక.. ఏం చెప్పను. ఊరూరా తిరగటం వల్ల భిన్న ప్రాంతపు ప్రజలనీ, అలవాట్లనీ, ఆచారాలనీ, కట్టుబాట్లనీ, వాతావరణాన్నీ అనుభవించొచ్చు. ఆస్వాదించొచ్చు. లోకం తీరూ, పోకడలూ తెల్సుకోవచ్చునూ. కొత్త ప్రదేశాల్లో ఇమిడిపోగల స్వభావాన్ని అలవర్చుకోవచ్చు. కాకపోతే ఒకే ఊరిలో ఉండడం వల్ల ఒకలాంటి ఆత్మీయత ఏర్పడుతుంది. అది ఇష్టమూ, కష్టమూ, కోపమూ, జాలీ, అసహ్యమూ, ప్రేమ అన్నీ కలగలిసిన ఆత్మీయత. Too long, together వల్ల కలిగే అవినావభావ సంబంధం అది. మనిషి ఉనికిలో అంతర్భాగం అయ్యేంతగా ఊరుతో అనుబంధం ఏర్పడాలంటే ఓ జీవితకాలం పట్టచ్చు. అలాంటి ఊరుని కళల్లో ఆవిష్కరించాల్సి వచ్చినప్పుడు, “ఊరు – నేను” అనే విభజన కుదరదు. ఇద్దరూ ఎంత మమేకయ్యిపోయారో కళ మాత్రమే ఆవిష్కరించగలదు, బహుశా. అలాంటి ఓ కళాఖండమే Orhan Pamuk రాసిన Istanbul: Memories and the City!

istanbul-bookఅసలైతే.. “ఒర్హాన్ పాముక్ అనే నోబెల్ ప్రైజ్ గ్రహీత తన సొంతూరైన ఇస్తాన్‍బుల్ గురించి మూడొందల పేజీలకి పైగా చేసిన వ్యాఖ్యానమూనూ, మధ్య మధ్యన బ్లాక్ ఆండ్ వైట్ ఫోటోలూ ఉంటాయి. దీని ధర మూడొందల యాభై రూపాయలు. ఇస్తాన్‍బుల్ సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర, కళలూ, నగర నిర్మాణము, అర్థిక పరిస్థితులూ తో పాటు, రచయిత కుటుంబ నేపధ్యమూ, బాల్యమూ, వ్యాపకాలూ గురించి రచయిత తనదైన శైలిలో మహాద్భుతంగా వివరిస్తారు. ఆపకుండా చదివించే రచనల్లో ఇదీ ఒకటి. ఓ నగరం గురించీ, ఆ నగరమందించిన సాహితీమూర్తి గురించీ తెల్సుకోవాలంటే ఇది తప్పకుండా చదవాల్సిన పుస్తకం” అని చెప్పేస్తే సరిపోతుంది ఈ పుస్తకం గురించి. అంతగా కాదనుకుంటే, ఒక awesome, ఒక amazing అక్కడక్కడా పెట్టి చెప్తే ఇంకాస్త బలంగా ఉంటుంది. కాకపోతే నాకీ పుస్తకం అంతకన్నా ఎక్కువ నచ్చేసింది. కాబట్టి ఇక్కడ నేను ఆపలేను. మీరు ఆపేయచ్చు.. పుస్తకం కొనడానికి వెళ్ళొచ్చు! ఉన్నవాళ్ళు మళ్ళీ తిరగేయచ్చు! 🙂

ఈ పుస్తకాన్ని చదవాలనుకునేటప్పటికి ఒర్హాన్ (రచనల) తో నాకు చక్కటి సాన్నిహిత్యం కుదిరింది. “ఇస్తాన్‍బుల్” కాదు, అంతరిక్ష్యంలోకి తీసుకెళ్తానన్న “నేను రెడీ” అంటూ వెళ్ళగలిగే అంతటి నమ్మకం ఏర్పడింది. తమ మాటల మాయాజాలంతో నన్ను సమ్మొహితం చేసిన రచయితలు చాలానే మంది ఉన్నారు. కానీ, వారందరిలో ఒర్హాన్ పాముక్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాని గురించి సవివరంగా మరోసారి చెప్తాగానీ, ఇప్పటికి రెండు ముక్కల్లో చెప్పాలంటే: కళను చాలా మంది కళాకారులు ఆరాధిస్తారు, తమ జీవితాలనే అంకితం ఇస్తారు. ఆ ప్రయాసలో కళను కేవలం ఆస్వాదించగల వారికి చాలా దూరమైపోతారనే భావన కలుగుతుంది నాకు. ఒర్హాన్‍వి నేను చదివిన / చూసినవాటిలో నాకు అనిపించింది ఆయన నా చుట్టూనే ఉన్నారనీ, నాకర్థమయ్యేలా విషయాన్ని చెప్పగలరని. కళను అభ్యసించటంలోని సాధకబాధకాల గురించి చెప్పినప్పుడు కళను ఓ కొత్త కోణం నుండి ఆస్వాదించే అవకాశం కల్పిస్తారు. అందుకే ఒర్హాన్ రచనల కన్నా, ఒర్హాన్‍తోనే నాకు పరిచయం ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది.

“ఇస్తాన్‍బుల్” ఆ నమ్మకాన్ని ఇంకా బలపరిచింది. మా ఎదురింట్లో ఉండే బామ్మగారు, “నీళ్ళ రుణం, నిద్ర రుణం ఎక్కడుంటే అక్కడే మనం ఉంటాం. ఎవరూ తప్పించలేరు.” అంటుండేవారు. ఈ పుస్తకం కూడా ఎంచుమించు అవే మాటతో మొదలవుతుంది, “This book is about fate” అంటూ. మన పుట్టుక మన చేతుల్లో లేనట్టే, మన బంధువర్గాన్ని, మన రూపురేఖలనీ, మన పరిస్థితులనీ ఆమోదించినట్టు మన ఊరునీ ఆమోదించాలి. మిగితా అన్నింటితో అలవాటుపడి ఒక స్నేహమో, వైరమో ఏర్పచుకున్నట్టే మన ఊరితో కూడా అనుబంధం ఏర్పడుతుంది. ఏ బంధానికైనా అందం వచ్చేది ఆ బంధంలో ఇమిడినవారి అందం వల్ల. ఈ పుస్తకంలో వివరింపబడ్డ, వర్ణించబడ్డ ఇరువురునీ తీసుకుంటే, ఒర్హాన్ – ఇస్తాన్‍బుల్. సాహిత్య కృషికి నోబెల్ పురస్కారం పరాకాష్ఠ అయితే ఒర్హాన్ పరిచయ కార్యక్రమం ఆడంబరమే అవుతుంది. ఇస్తాన్‍బుల్ – లేచి పడిన కెరటం. చరిత్రల్లోని ఎన్నో పుటల్లో విశేషంగా పేర్కొనబడి, అటు తర్వాత కాలక్రమాన ప్రపంచపు చిత్రపటం పై తన ఉనికినే వెత్తుక్కునే దయనీయ పరిస్థితీనీ చూసిన నగరం. సంప్రదాయానికీ, అధునికరణకీ మధ్య నలిగిన నగరం. ఎందరో కళాకారులని అందించిన నగరం.

తిరగడం, తిప్పడం – రచయిత చేసే పనులు. మన వేలు పట్టుకొని వీధీవీధినా ఇస్తాన్‍బుల్ మొత్తం తిప్పిస్తారు, ఒర్హాన్. ఈ పుస్తకం చదివిన ఒక ఫ్రెండ్ “ఇస్తాన్‍బుల్ నగరం కన్నా బాగుండదు పుస్తకం. అక్కడెళ్ళి చూడాల్సిందే దాని అందం” అన్నారు. అయ్యుండచ్చు. అసలు ఇస్తాన్‍బుల్ అందాన్ని ఒక రవ్వంత కూడా రచయిత తన మాటల్లో తీసుకురాకపోయి ఉండచ్చు. కాకపోతే, ఇందాక నేను వేలు పట్టుకొని తిప్పుతారూ అన్నది, మాప్ లో గుర్తుపట్టి, అటు వెంటనే ఫ్లైట్ ఎక్కి వెళ్ళి చూడగలిగే ఇస్తాన్‍బుల్ కాదు. రచయిత బుర్రలో నిక్షిప్తమైన ఇస్తాన్‍బుల్. ఆయన బాల్యంతో ముడిపడిన ఇస్తాన్‍బుల్, ఆయన ఆలోచనల్లో నిండిన ఇస్తాన్‍బుల్, ఆయన ఊహలకి ఊపిరిగా మారిన ఇస్తాన్‍బుల్. ఎన్నో ఏళ్ళ అనుబంధం ద్వారా ఆయన మెదడులోనే నిర్మితమైన ఇస్తాన్‍బుల్!  (చిన్నప్పుడు స్కూల్ ఎగ్జిబిషన్స్ లో పెట్టే నమూనాల్లా!) ఈ ఇస్తాన్‍బుల్ ఒక స్వాప్నికుడి నగరం కాబట్టి ఇందులో అందం, ఆనందం, ఆవేదన, melancholy అన్నీ ఉంటాయి. అలా అని ఇది పూర్తిగా ఊహాజనితమూ కాదు. ఓ మనిషి ఆయుష్షు మహా అయితే వందేళ్ళు! నగర ప్రస్థానంలో ఏదో కొంత శాతమే! గతించిన కాలపు అవశేషాలూ ఈ రచనలో భాగం. (ఇస్తాన్‍బుల్ చరిత్ర ఉంటుంది, అది అర్థం చేసుకోడానికి గూగుల్ ని ఆశ్రయించక తప్పదు.) తన గురించి తనకే చెప్పిన కథల్లో, తనకు తానుగా ఏర్పరుచుకున్న జ్ఞాపకాల్లో, తనకి తెలీని గతాన్ని తవ్వే ప్రయాసలో, ప్రణయాల్లో, ఏకాంతాల్లో, ఆనందాల్లో, ఆవేదనలో – అన్నింటా పూవులో దాగున్న దారం లాంటి ఇస్తాన్‍బుల్ ని మళ్ళీ మన కళ్ళ ముందుకి తీసుకొస్తారు ఈ రచన ద్వారా!

ఒర్హాన్  గొప్ప రచయిత కాబట్టీ, ఆయన గురించీ, ఆయన పుట్టి, పెరిగి, జీవించిన నగరం గురించి రాశారు కాబట్టీ.. ఇది చదవాల్సిన పుస్తకం. ఇరువురి మధ్య బంధం ఏర్పడీ, వెనక్కి తిరిగి చూసుకుంటే “ఇది నీది.. ఇది నాది” అని విడదీయడానికి వీల్లేనంతగా ముడిపడిపోయిన వైనం తేటతెల్లం అవుతుంది కాబట్టే.. ఇది నాకు ఇష్టమైన రచనల్లో కాక, నన్ను కదిపిన రచనల్లో ఒకటిగా మిగులుతుంది. ఈ పుస్తకానికి “Orhan Pamuk” అనే టైటిల్ పెట్టినా అంతే సరిగ్గా కుదురుతుంది. It is Orhan Pamuk’s Istanbul! It is also Istanbul’s Orhan Pamuk! It is Orhan Istanbul Pamuk!

****************************************************************************************

Istanbul: Memories and City

Author: Orhan Pamuk

Translated by: Maureen Freely

Price: Rs 350/-

Available in all leading bookstores and online stores.About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..5 Comments


 1. sujata

  My most fav book. I liked Orhan’s granny! Read this in Jul 2007. Loved the book. Good illustrations – pictures!


 2. ఇస్తాంబుల్ చాలా వైవిధ్యభరితమైన నగరం అని నేషనల్ జియోగ్రఫిక్ వ్యాసాల్లోనూ, మా మిత్రుల ఆన్ సయిట్ అనుభవాల్లోనూ కనుక్కున్నాను. ఈ నగరం మీద మంచి మంచి సినిమాలూ వచ్చాయి. వాటిలో కొన్ని చెడుగా చూపించేవి కూడా.

  పరిచయం బావుంది.


 3. Nice Intro…

  >>నీళ్ళ రుణం, నిద్ర రుణం ఎక్కడుంటే అక్కడే మనం ఉంటాం. ఎవరూ తప్పించలేరు
  Thats so true..


 4. kurmanath

  Pamuk raasindi aksharala correct. office pani meeda last year I spent 4 days in Istanbul and Ankara. I fell in love with the city and its people. annitikante nachchinadi yemitante, they love, respect their culture. vandala yella naati Wallni yenta goppaga, premaga chusukunnarante, Golkonda godale gurtochchayi!!
  Inko sangatemitante, Istanbul rendu Continentslo vuntundi. Yekkuva Asialo, konchem Europelo!
  India (Hindustan) nunchi vachchinavallante vallaki ishtam.
  Kondaru kontevallu, Bellydance choostaru, Turkish bath chesostaru. 😛


 5. raman

  చాలా బాగా వ్రాసారు
  ఒక సారి ఇస్తాంబుల్లొ ఓ వారం గడిపాను
  ఛాలా దేశాలు, ఊళ్ళు తిరిగినా కూడా ఇస్తాంబుల్ ప్రత్యెకం
  ఒక మరచిపొలెని అనుభూతి.
  సందులు, గొందులు, బజార్లు అన్ని రైల్లొ, బస్సులొ , పడవలొ
  పిచ్చి పిచ్చిగా తిరిగాను
  మళ్ళి మళ్ళి చూడాలనిపించె నగరం
  ఈ పుస్తకం తప్పకుండా చదవాలి  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

కథల్లో కథగా కథై – Pamuk’s My Name is Red.

ఒర్హాన్ పాముక్ పుస్తకాలేవీ చదవకముందే ఆయన వీరాభిమానిని అయ్యాను. అందుకు కారణం ఆయన నోబ...
by Purnima
3