Geek Heresy – Kentaro Toyama

Geek Heresy: Rescuing Social Change from the cult of technology అన్న ఈ పుస్తకాన్ని రాసినాయన Kentaro Toyama. గతంలో మైక్రోసాఫ్ట్ రిసర్చి ఇండియా శాఖ స్థాపించిన వారిలో ఒకరిగా బెంగళూరులోనే కొన్నేళ్ళు పనిచేశారు. “Information and communication technologies for development (ICTD)” అన్న అంశంపై చాలా కాలం కృషి చేశారు. గత దశాబ్దంలో మైక్రోసాఫ్ట్ రిసర్చ్ – ఇండియా వారి Technology for Emerging Markets అన్న గ్రూపు ఆధ్వర్యంలో నడిచిన అనేక ICTD ప్రాజెక్టులకి నేతృత్వం వహించారు.

పుస్తకం గురించి:
పుస్తకం ప్రధానంగా ప్రతిపాదించేది ఏమిటంటే: సాంకేతికత తనంతట తానుగా సర్వకాల సర్వావస్థలయందు సమస్యలని పరిష్కరించలేదు, సరైన సామాజిక వ్యవస్థ, వ్యక్తులు ఉన్నప్పుడే అది విజయవంతం అవుతుంది అని. One Laptop per child, Hole in the wall వంటి ప్రముఖ ప్రాజెక్టుల ఉదాహరణలు తీసుకుని ఈ ప్రతిపాదనకు బలం చేకురుస్తూ పోయారు పుస్తకంలో. ఆ విధంగా సాంకేతికత విజయానికి mere mortals కారణం అంటున్నారు కనుక దీన్ని geek heresy అని పిలిచారు అనమాట recovering technoholic అని చెప్పుకుంటున్న రచయిత.

పుస్తకాన్ని రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో – సాంకేతికత వల్ల లాభపడ్డాయి అని అనుకుంటున్న కొన్ని రంగాలలో (ఉదా: విద్యా రంగం, సామాజిక రంగం) అసలు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడ ఉపయోగపడింది? ఎక్కడ పనిచేయలేదు? ఎందుకు? అన్న ప్రశ్నలని గురించి వివరంగా చర్చించారు. ఇక్కడ ప్రధానంగా రచయిత technology as amplifier అన్న ఒక మాట వాడతారు. “Technology only magnifies existing human intent and capacity” అని ఆయన ప్రతిపాదన. అంటే సామాజిక అంశాలలో technological interventions విజయవంతం కావడానికి అవి ప్రయత్నించిన చోట్లలో అవి నిర్వహించిన వారిలో ఉన్న సంకల్ప బలం వంటి వ్యక్తిగత అంశాలు కారణం కానీ, అదే సాంకేతిక పరిజ్ఞానం అన్ని వేళలా అన్ని చోట్లా విజయం సాధించదు అని. బాగా motivated గా ఉన్న వాళ్ళకి తమ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చేందుకు టెక్నాలజీ ఉపకరిస్తుంది కానీ, మొదట ఆ మోటివేషనే లేని చోట్ల అది పని చేయదు అని. రెండో భాగం మొత్తం టెక్నాలజీని విజయవంతం చేసే మనుషుల గురించి. వాళ్ళలో కలిగే స్పూర్తి గురించి. వాటి మూలాలను గురించి. వాళ్ళకి సరైన సమయంలో సరైన గైడెన్స్ లభించడం గురించి. రెండు భాగాల్లోనూ చెరో ఐదు అధ్యాయాలు.

నాకు ఏమనిపించిందంటే:

ఆ రెండో భాగం మొత్తం చాలా వరకు సైకాలజీ/సోషల్ సైకాలజీ వైపుకి మళ్ళిందని నా అభిప్రాయం. అది అక్కర్లేని విషయం అని నేననను కానీ, ఈ పుస్తకంలో అవసరానికి మించి చర్చించిన విషయం అని అనుకుంటున్నాను. మొదటి భాగానికి కొనసాగింపుగా కొంత వరకూ ఈ రెండో భాగంలోని అంశాలు పనికొచ్చినా, ముందుకు సాగే కొద్దీ అసలు మొదటి భాగంలో చెప్పిన ప్రధాన విషయాలు మరుగున పడిపోయాయని నా అభిప్రాయం. దానికి తోడు చివ్వర్లో రాసిన conclusions అధ్యాయం నిండా ఈ రెండో భాగమే ఉన్నట్లు తోచింది నాకు. ఊరికే ఆ మొదటి భాగం ఒక్కదానితో ఓ చిరు పుస్తకం వేసుంటే పోయేది అనిపించింది లాస్టుకి.

అయితే, ఆ technology as an amplifier అన్న ఆలోచన నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది అన్నది నిజం. ఆయనంత అనుభవం, తెలివి తేటలూ నాకు లేకపోయినా, నేను కొన్నాళ్ళ బట్టి ఇలా వ్యక్తులను వదిలేసి తనంటత తానే “ప్రపంచాన్ని మార్చేయగలదు” అని వర్ణించబడే టెక్నాలజీ గురించి అనుమానిస్తూ వచ్చాను. ఈ పుస్తకంలో అది అనుమానం కాదు, నిజం అని ఆయన సోదాహరణంగా చూపినందుకేమో, నాకు చాలా నచ్చింది. టెక్నాలజీ తాలుకా transformational power మీద అచంచల విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక భిన్న దృక్కోణం కోసం తప్పకుండా ఈ పుస్తకం చదవాలని నా అభిప్రాయం.

పుస్తకంలోని కొన్ని భాగాలు దాని తాలూకా వెబ్సైటులోనూ, గూగుల్ ప్రివ్యూ లోనూ లభ్యం. అవి చదివి పుస్తకం చదవొచ్చో లేదో నిర్ణయించుకోవచ్చు.

పుస్తకం వివరాలు:
Geek Heresy: Rescuing Social Change from the cult of technology
Kentaro Toyama
పుస్తకం వెబ్సైటు
Amazon.in లంకె
అమెరికాలో లోకల్ బుక్ స్టోర్స్ వివరాలు

You Might Also Like

Leave a Reply