పుస్తకం
All about booksపుస్తకభాష

June 5, 2015

చెప్పులు కుడుతూ… కుడుతూ…

More articles by »
Written by: Srinivas Vuruputuri
Tags:

క్రీస్తు శకం 1878వ సంవత్సరం జులై 2వ తేది ఒంగోలు సమీపంలోని వెల్లంపల్లి గ్రామ సమీపంలో గుండ్లకమ్మ నదీతీరంలో చెప్పుకోదగ్గ సంఘటన ఒకటి జరిగింది. ఆరోజు 614 మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. అంతకన్నా మహత్తరమైన సంఘటన – అలనాడు క్రైస్తవ మతావిర్భావం జరిగిన పెంతెకోస్తుతో పోల్చబడ్డ సంఘటన – ఆ మరునాడు జరిగింది. ఆనాడు మరో 2,222 మంది క్రైస్తవాన్ని స్వీకరించారు. మూడోనాడు మరో 700 మంది. సాలాఖరు లెక్కలు వేసేనాటికి ఒంగోలు చర్చి సభ్యుల సంఖ్య 13 వేలు, ఆ ఏడాదే బాప్తిస్మం తీసుకున్నవారి సంఖ్య 9,606! ఈ కొత్త క్రైస్తవుల్లో అత్యధిక సంఖ్యాకులు మాదిగ కులం వాళ్ళు. నూటికి తొంభయి తొమ్మిది మందీ ఆ కులం వాళ్ళే అనటం అతిశయోక్తి కాదనుకుంటాను.

ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడ్డ ఈ “ఆత్మల దిగుబడి” క్రైస్తవ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తింది. ఈ అద్భుతం కేవలం దైవ మహిమ మాత్రమే అని విశ్వసించారు కొందరు. అంతకు క్రితం – 1876-78 సంవత్సరాలలో – వచ్చిన కరువూ, అది మిగిల్చిన ఆకలీ ఈ “మత వలస”కి కారణమయ్యాయని వాదించారు మరికొందరు. ఆకలిగొన్న నిరుపేదలను మతం మార్చటం అర్థరహిత ప్రయత్నమని వాదించిన వారు క్రైస్తవులే కావటం గమనార్హం!

ఏది నిజమైన కారణం – లౌకికమా, దైవికమా?

కొత్తగా క్రైస్తవాన్ని స్వీకరించిన వారి నేపథ్యం ఏమిటి? వాళ్ళు చెప్పుకునే కథల్లోంచి తొంగిచూసే చరిత్రా, మతం ఎలాంటివి? మిగతా సమాజంతో వాళ్ళకెలాంటి సంబంధాలుండేవి? క్రైస్తవం బీజాలు వాళ్ళ మనస్సుల్లో ఎవరు నాటారు? తమ కొత్త విశ్వాసాన్ని నిలుపుకునేందుకు తొలి క్రైస్తవులు ఎలాంటి యుద్ధాలు చేసారు? అంతమంది ఒక్కసారిగా మతం మార్చుకోవటం… కరువు కారణంగానే, అన్నం దొరుకుతుందన్న ఆశతోనే చేసారా? కరువు తొలగాక, ఆ “అన్నార్త క్రైస్తవులు” (“rice Christians”) క్రైస్తవంలోంచి తప్పుకున్నారా?

పై ప్రశ్నలకు సమాధానాలనిస్తూ, 1899లో ఎమ్మా రొషాంబు క్లౌ (Emma Rauschenbusch Clough; 1859- 1914) అనే ఆవిడ While Sewing Sandals Or Tales of a Telugu Pariah Tribe అనే పుస్తకాన్ని రచించారు. ఒంగోలు మిషనరీ (ఇంకా చెప్పాలంటే – “తెలుగువారి అపోస్తలుడు”) అని పేరుబడ్డ జాన్ ఎవరెట్ క్లౌ (John Everett Clough; 1836-1910) భార్య అయిన ఎమ్మా – స్వయానా మతప్రచారికా, విదుషి కూడా (బెర్న్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌.డీ చేసింది, రాయల్ ఏషియాటిక్ సొసైటీ సభ్యురాలు)

“మాదిగలు కొన్ని వందల ఏళ్ళపాటు చర్మాలను సాపు చేసారు. చెప్పులు కుట్టారు. తోలు బాల్చీలను, ఎద్దుల మెడపట్టీలను తయారు చేసారు. అలా చెప్పులు కుడుతూ కుడుతూనే తమ సత్యాన్వేషణను కొనసాగించారు. ఆ అన్వేషణే వారిని క్రైస్తవం వైపుకి నడిపించింది.” – ఇదీ ఈ పుస్తక సారాంశం!

ఇటీవలే, వి.వి.న.మూర్తి  గారు ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు  – “చెప్పులు కుడుతూ కుడుతూ” అన్న పేరుతో.  ఈ పుస్తకానికి ‘అనువాదం చేస్తూ.. చేస్తూ..’, “దాదాపు వందేళ్ళ క్రితం రాయబడిన పుస్తకాన్ని ఈనాడు ఎందుకు చదవాలి?” అన్న ప్రశ్నకు ఆయన చెప్పుకున్న సమాధానం:

“ఇది మన కథ. మన అందరి కథ. మనలో కొందరి జీవిత దుర్భర పరిస్థితులకు చారిత్రక కారణాలను వెదకడానికి మనలో ఒకరు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం తాలూకు కథ. మనం అంటే నా దృష్టిలో మానవులమే. మనలో కొందరంటే భరత ఖండమనే ఈ భౌగోళిక ప్రదేశంలో నివసిస్తున్న వాళ్ళమే. మాదిగలమే. మనలో ఒకరంటే పాశ్చాత్యదేశాల్లో పుట్టి ఇక్కడ అనేక సంవత్సరాలుగా నివసించి మనలో కొందరి జీవితాలను శ్రద్ధగా పరిశీలించిన క్లౌ గారే!”

***

“అనగా అనగా ఆది జాంబవంతుడనే ఆయన ఉండేవాడు.” దగ్గర మొదలవుతుంది, ఈ పుస్తకం. ప్రపంచం పుట్టే కన్నా ఆరు నెలల ముందు పుట్టిన ఆది జాంబవంతుడు మాదిగలకు పూర్వీకుడు. ఏ విషయంలోనూ ఎవ్వరికీ తీసిపోనివాడు. వెల్లమనువు అనే “కామధేను కాపరి” కుర్రాడికీ దేవతలకీ వచ్చిన తగవులో మధ్యవర్తిత్వానికి ఒప్పుకొని, తన తప్పేమీ లేకపోయినా దేవతల శాపానికి గురి అయి తన శక్తిని కోల్పోతాడు. మాదిగలు వర్ణవ్యవస్థకు అవతలే ఉండిపోయిన చారిత్రిక పరిణామాన్ని పురాణీకరించిన కథ కావచ్చును ఇది.

ఆవు మాంసం తినాలని వెల్లమనువుకు కోరిక కలగటం, మరణించిన పశువు మాంసాన్ని రుచి చూడటం, అది శాపానికి దారి తీయటం… ఆహారానికి సంబంధించిన విధినిషేధాలకూ, కులానికీ ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తాయి. ఇంతకీ వెల్లమనువు ఎవరు? శబ్దసామ్యాన్ని ఆధారంగా చేసుకొని కాబోలు ఈ వెల్లమనువుకూ తమిళనాట ఉండే వల్లువలు అనే “పరియా” పూజారులకు లంకె పెట్టబోయారు రచయిత్రి. అది సుదూర (far-fetched) సంబంధమేమోననిపించింది నాకు.

పురాణాలను దాటి మాదిగల చరిత్రను అవగతం చేసుకునేందుకు మాదిగలను “మాతంగులు”, “మాతంగి వారసులు” అని వ్యవహరిస్తారన్న మాట అంది వచ్చింది, ఈ రచయిత్రికి. ఆ ముక్కను పట్టుకొని రామాయణ మహాభారతాల రెఫరెన్సులు ఏరుకొచ్చారు. కథా సరిత్సాగరంలోనూ ఈదులాడారు. ఐహోలు శిలాశాసనంలోని 12వ శ్లోకంలోని “మాతంగ తమిస్ర సంచయం” అనగా “the darkness which was the race of the Matangas” అని అర్థ వివరణ చేసి, ఇది మాదిగలకి రెఫరెన్సు కాకపోవచ్చును, ఇక్కడ మాతంగాలంటే ఏనుగులే అయి ఉండవచ్చును అని తేల్చారు. ఇదంతా ఏకరువు పెట్టటం రొషాంబు-క్లౌ యొక్క పరిశోధక స్వభావానికీ తను ఎంచుకున్న విషయంపై తనకున్న ఆసక్తికీ ఒక ఉదాహరణ చూపించటం కోసమే.

చెప్పేందుకు చరిత్ర చాలా దొరకనందున ట్రాక్ మార్చి, అప్పటి సామాజిక సంబంధాల గురించీ, మాదిగలనుసరించిన వివిధ మతాల గురించి, తొలి స్థానిక క్రైస్తవ బోధకుల (preachers’) నేపథ్యం గురించీ, క్రైస్తవాన్ని స్వీకరించిన తరువాత వాళ్ళెదుర్కొన్న సవాళ్ళ గురించీ చెప్పుకొస్తారు తరువాతి అధ్యాయాల్లో. ఈ అధ్యాయాల్లోని విషయాలు చాలా మటుకు సంభాషణల ద్వారా గ్రహించినవే.

ఈ ప్రకరణంలో – కోమటి వారికీ, మాదిగ వారికీ మధ్య ఉండే సంబంధాన్ని వివరించే అధ్యాయం నాకు ఆసక్తికరంగా తోచింది. కోమటి ఇండ్లలో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు, మాదిగపల్లెకు  దొంగచాటుగా వెళ్ళి, ఓ పొద చాటున నక్కి, ఓ కుంచాన్ని నోటికి అడ్డం పెట్టుకొని “చిన్న వాళ్ళింట్లో పెళ్ళి జరగనున్నది. పెద్ద ఇంటివారు రావలసినది” అని ఆహ్వానించే ఆచారం ఒకటున్నదట. అంతే కాదు, పెళ్ళి తంతుకు కావాల్సిన నిప్పును మాదిగల ఇంటినుంచే – దొంగిలించి అయినా సరే – తీసుకు రావాలట. ఈ రెండు కులాల మధ్య సంబంధాన్ని వివరించే కథనూ, ఏడాదికోసారి కోమటిళ్ళలో బియ్యప్పిండితో గేదె బొమ్మను చేసి తినే “నబశని ముద్ద” (spelt in the original book as “nabasani mudda”; నాపసాని ముద్ద?) ఆచారాన్నీ ప్రస్తావిస్తారు రచయిత్రి. ఈ సమాచారం దక్షిణ భారతదేశంలోని కులాల గురించి ఎడ్గర్ థర్‌స్టన్ చేసిన అధ్యయనంలోనుంచి సేకరించిననటున్నది.

ఇదొక్కటే కాదు, అరుంధతి శాపం, మాతంగి ఆచారం, చర్మనిష్టల వారి రహస్య సమావేశాలు, రాజయోగి సంప్రదాయం, నాసరయ్య మతం – ఇలాంటి వాటి గురించి చదువుతుంటే బోలెడు ఆశ్చర్యం కలిగింది. వుడ్‌హౌస్ మాటల్లో చెప్పాలంటే – It just shows you how true it is that one-half of the world doesn’t know how the other three-quarters lives. మొదటగా గుర్తించాల్సిన విషయం – మనదేశమంతటా పరచుకొని ఉన్న వైవిధ్యం. రెండో విషయం – వివిధ కులాల వారి మధ్యన ఉండే పరస్పర సంబంధాలు.

మూడోది, ముఖ్యమైనది – ఇక్కడి ప్రజల ఆధ్యాత్మిక చలనశీలత! ఈ చలనశీలతే – క్రైస్తవానికి “బోధకులు” (preachers) అని పిలవబడ్డ తొలి కార్యకర్తలను అందించింది. బంగారపు తాతయ్య, పుల్లెకూరి (పల్లెకూరి?) లక్ష్మయ్య, ఎండ్లూరి రత్నం, కొమ్ము పున్నయ్య, ఉల్లూరి (అల్లూరి?) కుటుంబం, నంబూరి అన్నదమ్ములు – ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ.

ఈ కథలన్నినింటిలో ప్రధానమైన అంతస్సూత్రం – ఆయా కథల్లోని ప్రధాన పాత్రల “ఆధ్యాత్మిక ఆకలి”. బ్రహ్మంగారి బోధనల నుంచి పుట్టుకొచ్చిన రాజయోగమో, రామానుజ వైష్ణవమో, రామానుజ మతానికి తాంత్రికతను జోడించిన చర్మనిష్టల మతమో, ఇస్లాం (సూఫీ?) ప్రేరితమైన నాసరయ్య మతమో – తమ తోటి ప్రజలు సాధారణంగా పూజించే దేవతలను వదిలేసి విభిన్న మార్గంలో ప్రయాణిస్తున్న వారే క్రైస్తవం వంక తొలిగా మొగ్గు చూపిన వారు.

వారి వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్ర అనుచరులు, వారి పట్ల సదభిప్రాయాన్ని కలిగి ఉన్న మిగతా ప్రజలు కాలక్రమేణా తమ తమ ప్రథమ భయ సంకోచ వ్యతిరేకతలను జయించి కొత్త మతాన్ని స్వీకరించారు. కుటుంబాలకి కుటుంబాలు క్రైస్తవాన్ని స్వీకరించటం క్రైస్తవ మతాంతరీకరణలో కొత్త పరిణామం. మాదిగల్లో (మిగతా కులాలలో సైతం) కనబడే “తెగ లక్షణాలు” (tribal/clannish traits) వారిలో క్రైస్తవ మతం దృఢంగా వేళ్ళూనుకొనేందుకు, మరింత విస్తరించేందుకు దోహదపడ్డాయి. ఈ “తెగ లక్షణాలు” జాబితాలో – నాయకుణ్ణి అనుసరించే ధోరణి, సుదృఢ సామాజిక సంబంధాలు, సమష్టిగా కీలక నిర్ణయాలను తీసుకొనే సంప్రదాయం వగైరా ఉంటాయి కాబోలు.

కొత్త మతంలో చేరిన మాదిగలు తప్పనిసరిగా నాలుగు నియమాలను పాటించేవారు: సారాయి ముట్టకపోవటం, చచ్చిన గొడ్డు మాంసం మాంసాన్ని తినకపోవటం, ఆదివారాన్ని విశ్రాంతి దినంగా ప్రార్థనా దినంగా పరిగణించటం, అన్య దేవతల పూజల్లో పాల్గొనకపోవటం. మొదటి నియమాన్ని వదిలేస్తే మిగిలిన మూడూ – క్రైస్తవులకు ఊళ్ళో వాళ్ళతో చిక్కులు తెచ్చిపెట్టాయి. పోలేరమ్మ ఎదుట బలిపశువును నరకలేదని, అమ్మవారి జాతరల్లో  డప్పు వాయించలేదని, నూర్పిళ్ళ రోజుల్లో సైతం ఆదివారం పని చేసేందుకు ఒప్పుకోలేదని – రైతులకు, కరణాలకు, మునసబులకు కోపాలు వచ్చాయి. వేధింపులు, బహిష్కరణలు ప్రారంభమయ్యాయి.ఆ హింసకు ఎదురొడ్డి నిలిచారు క్రైస్తవులు. This too shall pass అన్నట్లు వీగిపోయాయవన్నీ.

***
1876లో వాన మబ్బులు వెక్కిరించి వెళ్ళిపోతునప్పుడు, ఒంగోలు మిషనరీ ప్రతిరోజూ తన “పలకా-సన్నని గొట్టపు సీసా-అందులోని మట్టి” (బారోమీటర్)ని గమనిస్తూ, రానున్న పెనుప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించాడు. అప్పుడే మొదలైన బకింగ్‌హాం కాలవ ప్రాజెక్టులో ఒక మూడు మైళ్ళ పనికి కాంట్రాక్టును సంపాదించాడు. రాజుపాలెం అనే ఊరి దగ్గర సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేయించి, “కూలీ ఇప్పించి అన్నం పెడతాము” అని చెప్పి జనాలను పిలుచుకు రమ్మని బోధకులను సమీప గ్రామాలకు పంపించాడు.

సముద్రపుటలలలా వచ్చారట ప్రజలు. ఆకలితో తొక్కిసలాడుకునే జనాలు, నకనకలాడుతూ వచ్చి ఎంత వద్దన్నా వినకుండా ఉడికీ ఉడకకని అన్నమే తిని మరణించే జనాలు, ఇంకా, ఇంకా, తట్టుకోలేనంత ఇంకా తిని మరణించే జనాలు, సహాయ శిబిరానికి చేరుకునేలోపే మరణించిన జనాలు, నిన్నటి శవాలను పూడ్చేసేలోపే కొత్త శవాలుగా మారే జనాలు…

ఆ విపత్కర సందర్భంలో క్లౌ, అతని అనుచరులూ చేపట్టిన సహాయ కార్యక్రమాలూ, “సమాజపు అట్టడుగున ఉన్న వారిని – మాదిగలను సైతం – ఆకలి నుంచి కాపాడేందుకు పడ్డ నిర్విరామ శ్రమా” – వేలాది ప్రజల మన్ననలను అందుకున్నాయి. అంతకు మునుపు ఎన్నిసార్లు చదివి/విని ఉన్నానో, “ప్రయాస పడి భారము మోసికొని పోవుచున్న జనులారా నాయొద్దకు రండు. నేను మీకు శాంతినిత్తును.” అనే బైబిల్ వాక్యాలను. రాజుపాలెంలోని సహాయక శిబిరంలోని బాధితులు బోధకుల నోట మళ్ళీ మళ్ళీ చెప్పించుకొని ఊరట పొందేవారని చదివినప్పుడు ఆ మాటల సార్థకత కొంత తెలిసి వచ్చింది.

ఆ కాలంలో, క్లౌ పట్ల ఏర్పడ్డ కృతజ్ఞతాభావమే, క్రైస్తవం పట్ల ఏర్పడ్డ సదభిప్రాయమే తదనంతరకాలంలో అక్కడి ప్రజలను క్రైస్తవాన్ని స్వీకరించేందుకు పురిగొల్పాయి.

కరువు చాయలు పూర్తిగా తొలగేదాకా ఒక్క మత మార్పిడి కూడా జరగటానికి వీల్లేదని పట్టుబట్టాడు క్లౌ, తన పైనున్న చర్చి అధికారులకి ఎంత కోపం వచ్చినా సరే. సహాయ చర్యలను కట్టిపెట్టిన ఆరు నెలల తరువాతే – ఇక తననుంచి ఏ సహాయమూ అందదని స్పష్టం చేసాకే, ఒక్కొక్క బోధకుడి వెంట వచ్చిన సమూహంలోని వ్యక్తులు – కొత్త మతాన్ని, కొత్త జీవితాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నారని – విచారించిన తరువాతే, పైన పేర్కొన్న బాప్తిస్మ కార్యక్రమాన్ని నిర్వహించాడు.

ఓ వేళ కరువే రాకుండా ఉంటే?

“వేలాది ప్రజలు మూకుమ్మడిగా క్రైస్తవులుగా మారే వాళ్ళు కాదేమో కానీ కాస్త నెమ్మదిగానైనా వ్యాపించి క్రైస్తవం మాదిగల్లో బలంగా వేళ్ళూని నిలబడేదే” అని అంటారు రచయిత్రి. “కొత్త మతం కోసం, జ్ఞానం కోసం, మెరుగైన జీవితం కోసం, ఆత్మోద్ధరణ కోసం ప్రయత్నం చేయటం మాదిగల్లో ఏనాడో ప్రారంభమయ్యింది. ఆ నేపథ్యమే వారిని క్రైస్తవం వైపుకి నడిపించింది. క్రైస్తవం ఇక్కడి సమాజాల నిర్మాణ స్వభావాలకు అనుగుణమైన బోధకులను రూపొందించుకొన్నది. అది చాలు – క్రైస్తవ మత వ్యాప్తికి.” – ఇదీ ఆవిడ నమ్మకం!

క్రైస్తవ మతవ్యాప్తి కోణాన్ని పక్కనబెడితే – కరువు కాలంలో వేలాది ప్రజలను ఆదుకోవటం ఒంగోలు మిషన్ చేసిన అతి మంచి పని. అది కాక – పిల్లలకి చదువు చెప్పేందుకు బడులు నడపటం, మాదిగల సరసన నిలబడి వారిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేయటం – మరో రెండు మంచి పనులు.

***
ఇప్పటికే చాలా రాసేసాను ఈ పుస్తకం గురించి. నాకు అసంతృప్తి కలిగించిన ఒకట్రెండు అంశాల గురించి చెప్పి ఈ పరిచయాన్ని ముగిస్తాను.

మాదిగల మూలాల గురించి రాస్తున్నప్పుడు – బహుశా వాళ్ళు దక్షిణ భారత దేశపు మూలవాసి (aboriginal) సమాజాల్లో ఒకరై  ఉండవచ్చునని ప్రతిపాదిస్తారు. “ఈ మూలవాస భావన కరెక్టేనా లేక అది వలసవాద పండితులు ప్రవేశపెట్టిన దుర్భ్రమలలో ఒకటా?” అనే సంశయం నాలో ఉన్నది. హక్కుల, ఘర్షణల, ఉద్యమాల స్వాతంత్ర్యానంతర కాలంలో – మనదేశంలో అనైకమత్యాన్ని పెంపొందించుకోవటానికి పనికొచ్చిన భావనల్లో ఈ మూలవాసిత్వం ఒకటని నాకనిపిస్తుంది. I could be wrong here.

మాదిగలతో ఆర్య ఋషుల సంబంధాల గురించి రచయిత్రి చేసిన ఊహాగానాలు సైతం తన “వలసవాద ఫాదరీ” నేపథ్యం నుంచి వచ్చినవే అని అనుకుంటాను. రామాయణంలో శబరి కథకు ఆవిడ చేసిన ఈ వ్యాఖ్యానాన్ని చూడండి: “The ascetic, Matanga, belonged to the day when Aryan hermits adopted conciliatory measures in the colonization of Southern India. With his disciples he formed a colony, but they do not seem to have dwelt in proud isolation. They honoured a Pariah woman by leaving her in charge of the deserted hermitage until Rama should come. They taught her to desire the heaven of Brahmin ascetics.”

పాత మతానికీ – కొత్త మతానికీ నడుమ ఘర్షణను చిత్రించిన ఈ కథల్లో కొన్ని చోట్లలో బోధకుల ప్రవర్తన, రచయిత్రి కంఠస్వరం చాలా చికాకు పెట్టాయి నన్ను. బడిని కట్టేందుకు “రామస్వామి” గుడిని కూల్చేసిన సంఘటన, క్రైస్తవ ప్రీచరులు పేరంటాళ్ళ పసుపు కుంకుమ గుర్తులను చెప్పులతో చెరిపేసిన సంఘటన, “స్వామి గురవడు” విగ్రహాన్ని కాలవలో విసిరిన సంఘటన, పోలేరమ్మ విగ్రహాన్ని పెకలించి ఒంగోలు మిషన్‌కు తరలించిన సంఘటన… – “క్రైస్తవం మంచిది, నమ్మి చూడండి” అని చెప్పటం సరైనదే, “మీ దేవుళ్ళు నన్నేమీ చెయ్యలేరు. రుజువు చేస్తాను చూడండి”, అని దురుసుగా ప్రవర్తించటం మాత్రం సమర్థనీయం కాదు కదా. (బంగారపు తాతయ్య అనే పెద్దాయన – అసలు పేరు ఎర్రగుంట్ల పేరయ్య – ప్రవర్తించిన తీరు మాత్రం తద్విరుద్ధంగా ఎంతో హుందాగా ఉంటుంది.)

రామానుజాచార్యులు బోధించిన వైష్ణవంపై క్రైస్తవం ప్రభావం ఉండిఉండవచ్చునని చేసిన ప్రతిపాదన ఒకటి ఇందులో కనిపించింది (“The teachings of Ramanuja were moral. He forbade the use of animal food and intoxicating drinks. He probably came in contact with Christian missionaries, for his insistence on the spiritual equality of all men points to Christian principle”). It sounded a little facile and presumptuous to me.

1876-78 కరువు కాలంలో ప్రభుత్వం అందించిన సహాయాన్ని రచయిత్రి మెచ్చుకోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది. వలస ప్రభుత్వపు పాపాల చీకటి చరిత్రపై వెల్లవేయబోయినట్లనిపించింది – ముఖ్యంగా ఈ వ్యాసం చదివినప్పుడు.

ఈ పుస్తకాన్ని అనువదించేప్పుడు వి.వి.న.మూర్తిగారు మరీ ఊపిరాడనంత మూలవిధేయకంగా ఉండాల్సింది కాదేమో. ఇంకాస్త ఓపిక పడితే అనువాదం రాణించి ఉండేదేమో. దురనువాదాలను ఎత్తి చూపించాలనుకుంటే అట్టే శ్రమ పడక్కరలేదు. అచ్చుతప్పులో? ఉన్నాయున్నాయి.

ముఖ్యంగా – ఇది అకడమిక్ దృష్టితో రాసిన పుస్తకం కనుక, తెలుగు అనువాదంలో నోట్స్, ఇండెక్స్, అపెండిసెస్ వంటి పండిత సరంజామాను చేర్చి ఉంటే నాబోటి వారికి ఎంతో ఉపయోగపడేది.

“ఎందుకు?” అని అడిగితే చెప్పలేను కానీ చాలా ఎక్కువ సమయమే గడిపాను ఈ పుస్తకంతో. ఇంటర్నెట్‌కి జేజేలు చెప్పుకుంటూ! కొంత తెలుసుకున్నానన్న తృప్తినీ, ఇంకా తెలుసుకోవాలన్న ఆకలినీ మిగిల్చిన పఠనానుభవాన్ని పొందాను.

***
అదనపు వివరాలు:

 1. తెలుగునాట అమెరికన్ బాప్టిస్ట్ మిషన్
 2. ఎమ్మా రొషాంబు క్లౌ

మనసు ఫౌండేషన్ ప్రచురణ; ద్వితీయ ముద్రణ: 2011; 144 పేజీలు; 40 రూపాయలు (కినిగె లింకు)About the Author(s)

Srinivas Vuruputuri

శ్రీనివాస్ వురుపుటూరి; హైదరాబాద్‌లో నివాసం; సాఫ్ట్‌వేర్ ఉద్యోగం; చదవడం హాబీ; చర్చించడం సరదా; రాయాలంటే బద్ధకం, బోలెడన్ని సందేహాలున్నూ.2 Comments


 1. మంజరి లక్ష్మి

  “ “ఈ మూలవాస భావన కరెక్టేనా లేక అది వలసవాద పండితులు ప్రవేశపెట్టిన దుర్భ్రమలలో ఒకటా?” అనే సంశయం నాలో ఉన్నది.” అంటే ఆర్యులు భారత దేశం బయటినించి వచ్చినవాళ్ళు అనే దాని గురించా మీరు ఇక్కడ ప్రస్తావించినది.


  • వురుపుటూరి శ్రీనివాస్

   మంజరి లక్ష్మి గారికి

   ఈ పుస్తకంలో మాదిగల మూలాలను వివేచిస్తూ, రచయిత్రి ఇలా అన్నారు: “It is possible that they are among the aboriginal tribes of Southern India who are descendants of the Kolarian race, a very rude and primitive race, which may have occupied India previous to the advent of the Dravidians.” ఇంకా ఈ aborigine ఐడియా మీద ఆధారపడి ఇంకా చాలా చెప్పారు. మీరు ఉదహరించిన వాక్యం దానికి సంబంధించినది.

   అయితే ఈ విషయంలో కచ్చితమైన నిర్ధారణలకు అవకాశం తక్కువేమో అని నాకనిపించింది. ఒక ప్రాంతంలో నివసించే ఓ రెండు కులాల వారి మధ్య తేడాల కన్నా పోలికలే ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటాను (ముఖ్యంగా జన్యు లక్షణాల విషయంలో). అంచేత మాదిగలు మూలవాసులయి ఉంటారు/మరో కులం వారు బయటి వారై ఉంటారని చెప్పటం కరెక్టు కాదేమోనని అనుకుంటాను.

   శ్రీనివాస్  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1