మరో మజిలీకి ముందు

వ్యాసం రాసిన వారు: మూలా సుబ్రమణ్యం
[ఈ వ్యాసం మొదట తెలుగుపీపుల్.కాంలో ఆగస్టు 2004 లో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం.]

‘నాతో నేను ప్రయాణించక తప్పదని
ఇంత కాలానికి తెలుసుకున్నాను’

అంటారు ‘సహ ప్రయాణీకుడు’ అన్న కవితలో ఇస్మాయిల్‌. కవిత్వమంటే మరేమీ కాదు కవి జరిపే ఒంటరి రైలు ప్రయాణమే! అలా తమ కవితా ప్రస్థానంలో రెండవ మజిలీ అయిన ముకుంద రామా రావు గారి ‘మరో మజిలీ కి ముందు’ కవితా సంకలనం పై ఒక సమీక్ష.

చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశ్శబ్దం గా గమనిస్తూ ఆ అనుభవిక ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడు కవి. కవికి సాధనం భాష. అలా ఆవిష్కరించడానికి గంభీరమైనవీ, గులక రాళ్ళ డబ్బాలా మ్రోగేవీ చాలా శబ్దాలే ఉండవచ్చు. కానీ అనుభవ హరిత సౌందర్యం ఆ శబ్దాల్లో కనిపించదు. ఆ శబ్దాచ్ఛాదన లో భావం మరుగునపడిపోయే ప్రమాదం చాలా ఉంది. అందుకే కవిత్వానికి శబ్దం ఎంత ముఖ్యమో నిశ్శబ్దం కూడా అంతే ముఖ్యం అంటారు ‘కవిత్వంలో నిశ్శబ్దం’ వ్యాసం లో ఇస్మాయిల్‌ గారు . కవిత్వం లో నిశ్శబ్దం ఏమిటో తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పక తెరవాల్సిన పుస్తకాల్లో మన ముకుంద రామారావు గారి ‘మరొక మజిలీ కి ముందు’ ఒకటి . లోతైన భావాల్ని చిన్న చిన్న పదాల్లో సున్నితం గా చెప్పిన తీరు ఆకట్టుకొంటుంది.

40 కవితలున్న ఈ పుస్తకం మడతల్లో ఎన్నో ఏళ్ళ అనుభవాల, అనుభూతుల నిశ్శబ్ద సంపుటలున్నాయి. దీని వెనక అనుభవజ్ఞుడైన కవి అంతరంగ నేపథ్యమే కాదు, తాత్విక ప్రశ్నలు వేధిస్తుంటే మనిషి జరిపే అన్వేషణ కూడా ఉంది. ఆ అన్వేషణ లో వెలువడిన కవితలు మొదటి కవితల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

రాత్రి కీ, ఏకాంతానికీ, కవికీ, అన్వేషణ కీ ఏనాటిదో సంబంధం! అందుకే మొదటి కవిత ‘అలలు’ ఇలా మొదలౌతుంది.

‘రెండు తీరాల మధ్య ప్రయాణం
ఏకాంతం నుండి ఏకాంతానికేనా?’

సందేహాల రాత్రినీ, మిగిల్చిన అడుగుజాడల్నీ వర్ణించి ‘సందేహం’ అన్న కవిత ఇలా ముగుస్తుంది.

‘అడుగుజాడలెన్నున్నా
గడచిన రాత్రి నాకెప్పుడూ సందేహమే!’

ఈ అన్వేషణ చీకటి తర్జుమా, వక్ర రేఖల్లో, స్వయం అన్వేషణ, మరో మజిలీకి ముందు కవితల్లో మరింత తీవ్రమవుతుంది.

చీకటి తర్జుమా చివర్లో తాత్వికంగా ఇలా ప్రశ్నిస్తారు.

‘నిన్ను నా కెమెరా ని చేస్తాను
నా సమస్తాంతరంగ
అనంతాకాశాల్నీ
అన్ని కోణాల్లో బంధించు

చీకట్లో నీ తర్జుమా ని
వెలుగు లో చూద్దాం
నే కనిపిస్తానా అందులో?’

ఈ అన్వేషణ ని రెండు లైన్లలో క్లుప్తం గా చెప్పాలంటే ‘మరో మజిలీ కి ముందు’ లోని కింది వాక్యాలు చదవాలి!

‘నా వేర్లని తెలుసుకునేందుకిప్పుడు
నన్ను నేనే తవ్వుకోవాల్సి వస్తోంది’

ప్రతి కవికీ కవిత్వం ఒక తపస్సు. అలాంటి కవిత్వం గురించి ప్రతి కవీ కవిత్వం రాసుకోవాలని తహతహలాడతాడు. ఆ నేపథ్యం లో వెలువడిన కవితలు ‘మనం రాసుకున్న పద్యాలే’, ‘గుండె గువ్వ’

కవితల్ని పిల్లలతో పోల్చిన ‘మనం రాసుకున్న పద్యాలేమో’ అన్న కవిత ఇలా ముగుస్తుంది

‘బహుశా జీవితమంతటి కవిత్వంలో
పిల్లలు మనం రాసుకున్న పద్యాలేమో’

ఒక్క ‘గుండె గువ్వ’ కవిత మీదే ఒక పరిశోధనా వ్యాసం రాయొచ్చేమో అనిపిస్తుంది. అప్పుడే మాటలు వస్తున్న పిల్లలు వాళ్ళకి తెలిసిన పదాల్లోనే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. భాష ముక్కలు ముక్కలైనా ఎంతో అందంగా, భావం అందీ అందనట్టు ఉంటుంది. ఆ దశకీ, కవిత్వానికీ తేడా లేదని చెప్పే ఈ కవిత

‘ఏమీ తెలియని తనం నుంచి
ఏదో తెలుస్తున్న తనం లోకి
ప్రవహిస్తున్న పరిణామం
నా పద్యం లాంటి పసితనం’

అన్న వాక్యాలతో ముగుస్తుంది. కవిత్వానికి ఇంత అందమైన, అద్భుతమైన నిర్వచనం ఎవరూ ఇవ్వలేరేమో!

ఈయన కవిత్వం లో గమనించాల్సిన మరొక విషయం చాలా కవితలకి ఒకటి కన్నా ఎక్కువ Dimensions ఉండటం. చదువుతున్నకొద్దీ అప్పటిదాకా గుర్తించని కొత్త కోణాలు, కొత్తలోతులు అవగతమౌతాయి. ఇది గొప్ప కవిత్వ లక్షణం అని ఎక్కడో చదివాను.

ఇక తర్వాతి కవితల్లో సున్నితమైన మానవ సంబంధాలు, అనుభవాలూ అత్యంత సహజంగా, నిరాడంబరంగా ఒదిగిపోతాయి. ‘నాన్న’ అనే కవిత ఆర్ద్ర స్పర్శతో కదిలిస్తుంది. హైకూల పేరిట చెత్తనంతటినీ చెలామణీ చేస్తున్న వారికోసం ‘ఇవి హైకూలు కావు’ అని కొన్ని మూడు లైన్ల కవితలు రాయడం నవ్వు తెప్పిస్తుంది.

మోనికా సెలెస్‌ మీద రాసిన కవితలో

‘అన్ని రంగాల్లోనూ
మానవ అంతరంగాలొకటే కదా
తామో? తమవారో? ’

అన్న వాక్యం

క్రీ(నీ)డ అన్న కవితలో

‘అంచనాకీ, ఆశకీ మధ్య
ఆసక్తికరమైన ఆట’

లాంటి వాక్యాలు చదినప్పుడు, చిన్న చిన్న అనుభవాల గురించి రాసినా వ్యక్తుల గురించి రాసినా వాటిల్లో
భావాల్ని విశ్వజనీనం చేసే నేర్పు ఈయన కవితల్లో చూడొచ్చు.కవిత్వ లక్ష్యం కూడా ఇదే!

తమలోని అంతరంగ ప్రపంచం, చుట్టూ పరవళ్ళు తొక్కే బాహ్యప్రపంచం మధ్య ఈయన సృజించిన ఈ కవిత్వం లో ఏకాంతం నుండి ఏకాంతానికి యుగయుగాలుగా కవి జరుపుతున్న యాత్ర పాద ముద్రలున్నాయి. పరిమళాలు మిగిల్చిన అడుగుజాడలున్నాయి. పుస్తకం తెరవండి, ఆయనతో పాటు చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తారు ఏకాంతపు మనిషి అంతరంగపు లోతుల్లోకి…లోలోతుల్లోకి……

[ముకుంద రామారావు గారి ఇతర రచనలపై పుస్తకం.నెట్ లో ప్రచురించిన వ్యాసాలు: ‘ఎవరున్నా, లేకున్నా’ పై ఇక్కడ, మరియు ‘నిశబ్దం నీడల్లో‘ పై ఇక్కడ. – పుస్తకం.నెట్]

You Might Also Like

One Comment

  1. ramnarismha

    Very nice article.

    Congratulations.

Leave a Reply