కొల్లాయిగట్టితేనేమి? – నేనెందుకు రాశాను? – 2

రాసిన వారు: మహీధర రామమోహనరావు
(మొదటి భాగం లంకె ఇక్కడ)
********
నా జీవితంలో 5వ ఏడాది నుంచీ నలభై ఏడు వరకూ చూసినవీ, విన్నవీ, చదివినవీ విశదంగా గుర్తున్నాయి. వానికి ఈ సిద్ధాంతాన్ని జోడించి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను. దానిని చూసి మార్క్స్ సూత్రాలకి జీవిత ఘటనలని మెకానికల్‍గా అమరుస్తున్నానని 1941-44 జైలుకాలంలో ఎస్వీ ఘాటే అధిక్షేపించేరు. నేను ఒప్పుకోలేదు. మన బంధుత్వపు పిలుపులు పెద్దనాన్న, చిన్నాన అనేవి పెద్దల్లి, పినతల్లి అనేవి, వాళ్ళందరి పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లుల్లుగా పిలుపులు – మనలో కూడా వ్యూవలాన్ కుటుంబాలు పరిపాటిగా ఉండేవనటానికి సాక్ష్యం అని నేను జైలులో క్లాసులు నడిపినప్పుడు చెప్పేవాడిని. దానికి ఆయన మొదట ఒప్పుకోలేదు. కానీ మన పిలుపులకు కారణం ఏమైయ్యుండాలని నేను మొదలకించా. ఏమీ చెప్పలేక అర్థాంగీకారంగా ఊరుకున్నారు. (వ్యూలాన్ కుటుంబం మొదలైన వాని వివరాలు ఆంగిల్స్ రాసిన Origin of family private property and stateలో చూడండి.) ఇటువంటి నాలుగైదు సందర్భాలు తటస్థపడి నా ఆలోచనలు సరైన దారిలో నడుస్తాయని విశ్వాసం కలిగింది. నా నవలలన్నీ ఆ విధమైన సమన్వయ ధోరణితో రాసినవే – నా ’కొల్లాయిగట్టితేనేమి?’ని సమాజ పరిణామ గతిని కథలో చూపటం కోసమే రాశాను. ఆ నా ఉద్దేశ్యాన్ని రామచంద్రారెడ్డి సరిగ్గానే గ్రహించారు. అయితే ఆయన కూడా దేశరాజకీయాలకే, అన్వేషణను పరిమితం చేశారు. సమాజ పరిణామ క్రమగతి పరిశీలన ఆయన విశ్లేషణకు బయటనే ఉండిపోయింది. నేను ముంగండనే కథారంగంగా తీసుకోవడం మీద ఆయన తన వ్యాసంలో చేసిన వ్యాఖ్య అందుకు ఉదాహరణ. “చాంధసవాదాన్ని, ఈ వ్యవస్థ యొక్క (ఫ్యూడలిజమ్) పరమైన (absolute) రూపాన్ని చూడాలంటే బ్రాహ్మణ అగ్రహారాలలోనే సాధ్యం. అందుచేత రచయిత ముంగండను కార్యరంగంగానూ, రామనాథాన్ని కథానాయకునిగానూ ఎన్నుకొన్నారు.” అని రాశారు. ఇది రాజకీయ విశ్లేషణతో హేతుబద్ధమైన వ్యాఖ్యయే గానీ, సామాజిక పరిణామ చిత్రణను ఉద్దేశించిన దృష్ట్యా సరికాదు. ముంగండ బ్రాహ్మణ అగ్రహారమే. నేను విన్నంత వరకూ పందొమ్మిదవ శతాబ్ధం ప్రారంభం నుంచి దేశచరిత్ర గతితో దాని పాత్రను వింటున్నాను. 20వ శతబ్దారంభం నుండి సామాజిక పరిణామ గతి ఛాయలను చూస్తున్నాను.

19వ శతాబ్దం నాటికి పీష్వాల దర్బారులో ముంగండ పండితులకు ప్రవేశం ఉంది. 1818లో కిర్కీ వద్ద యుద్ధంలో కంపెనీల సేనల చేతిలో పీష్వా సేనలు ఓడిపోయాయి. ఆ యుద్ధంలో పాల్గొన్న పీష్వా సేనా నాయకులలో ఒకడైన విశ్వనాథ రావు అనే ఆయన తప్పించుకొని, తనకు పరిచితులు, మిత్రులు అయిన పండితుల సాయముతో సన్యాసిగా ముంగండలో శేషజీవితం గడిపారని నాకు నాటక అలంకార శాస్త్రాలు పాఠం చెప్పిన ఉపద్రష్ట సుబ్రహ్మణ్య శాస్త్రిగారు చెప్పారు. ముంగండకు సన్యాసులకు ఆశ్రయం ఇచ్చే సంప్రదాయం ఉంది. నేను బాగా చిన్నప్పుడు, ఓ అవధూత స్వామి దిగంబరంగా వీధుల వెంట నడిచిపోతుండడం చూసాను. ఆయన కోసం గ్రామస్థులు మంచినీళ్ళ చెరువు గట్టు మీద ఆశ్రమమో, చెరువులోని కంటా పావంచాలు కట్టించి ఇచ్చారు. ఈ మఠం 1930 తర్వాత గ్రంథాలయానికి, యువజన సంఘానికి స్థావరమయ్యి, 1942 వరకూ పోలిసు దాడులకు గురి అయ్యింది. దిగంబర స్వామి అనంతరం అగ్నిహోత్ర స్వామి (ఈయనే మా అమ్మగారి మేనమామ) ఆయన తర్వాత పొట్టిస్వాములూ, చివరగా తల్లావఝుల శివశంకర శాస్త్రి గారి సోదరుడు (ఈయనే ఆఖరివారు. 1936వరకూ జీవించి ఉన్న జ్ఞాపకం.) అటు తర్వాత మఠం శిధిలం అయిపోయింది. మాకోసం సాగిన పోలిసు దాడులకు బెదిరిపోయారో ఏమో కొత్త వారు రానూ లేదు. ఈ పోలీసు దాడులలో మాకు గ్రామీణుల సాయం బాగా ఉండేది. ఒకరోజున తెల్లవారేసరికి పోలిసు బలగం చెరువుగట్టున ఉన్న మఠం, గ్రంథాలయం, యువజన కార్యాలయం సముదాయాన్ని చుట్టుముట్టుతారన్న వార్త వచ్చింది. ఆ రోజుల్లో మా వద్ద ఒక రివాల్వరు (పాతది, తూటాలు లేనిది) ఉండేది. దానిని పొరపాటున గ్రంథాలయపు బీరువాలో పుస్తకాల వెనుకపడేసి, రాత్రి ఇంటికి వెళ్ళేను. దానిని తీసేయాలి. వెంటనే గ్రంథాలయ కార్యదర్శికి వెళ్ళి విషయం చెప్పేను. ఇద్దరం ఆలోచనలలో పడి మఠం కాంప్లెక్స్ కి బయలుదేరాం. మా కంగారును చూసి పక్కింటిపడుచు ఒకామె చెరువుకు మంచినీటికి బయలుదేరినట్లు బిందె చంకన వేసుకొని బయలుదేరింది. నా మిత్రుడు పోలిసు ఆఫీసర్ను మాటల్లో పెట్టి చెరువు వేపు తీసుకెళ్ళాడు. నేను వెనుక తలుపు తెరచి గ్రంథాలయంలో ప్రవేశించి, బిరువాలో ఉన్న రివాల్వరు తీసి కిటికీలోంచి క్రింద వున్న పొదల్లో పడేశాను. మా వెనుక వస్తున్న ఆమె చూసింది. దారిన పోతున్నట్లు వచ్చి, దానిని బిందెలో పెట్టుకొని, ఏమీ ఎరగనట్లు వెళ్ళిపోయింది. ఊళ్ళో ఇంటికి వచ్చిన వాళ్ళు పేడనీళ్ళు తొక్కి రావాలని శాసించే శివరామయ్య తల్లులూ, పురోహితుని ఇంట తిండి తినటం పాపంగా భావించే నరసమ్మలూ నేనా ఉన్నది. పైన చెప్పిన ఘటనలోని సీతమ్మూలూ ఉండేవారు. 1929లో 2-3వందల మంది సత్యాగ్రహులతో కాకినాడలో ఉప్పు సత్యాగ్రహానికి ఊరేగింపుగా వెళ్తూ వచ్చిన బ్రహ్మజోష్యుల సుబ్రహ్మణ్యం గారికి ప్రతివీధిలో వార్లు పోసి, పుష్ప హారుతులిచ్చిన బాలలూ, పడుచులూ, గృహిణులు ఎందరో గ్రామములో ఛాందస్సులున్నారు. కానీ వారి సంఖ్య తగ్గిపోతూ ఉంది. బ్రహ్మ సమాజ భోధన బలంతో అందరినీ గౌరవంగా పిలవాలని నియమం మా నాన్నగారిది. అందరూ పుల్లిగా అని పిల్చే ఒక పనివాడిని ఆయన పుల్లన్న అని పిల్చేవారు. ఆ పిలుపుతో అతడు కనబరచిన ఆనందం, ఆత్మాభిమానం నాకు గుర్తుంది. ఈ పరిణామాలన్నీ ఏ బ్రహ్మ సమాజ మత బోధనలతో ప్రభావితులైన యువకుల ప్రభావమే అనుకోకూడదు. ముంగండ దేశ చరిత్రలో ఒక భాగంగానే ఉంది. 19వ శతాబ్దపు ప్రధమ పాదంలో పిండారి దండుల చివరి దశలో ఒక దండు ముంగండ మీద పడి ధ్వంసం చేసింది. కానీ అంతలో గ్రామంలోని యువకులు తేరుకొని కూడగట్టి, తిరిగిపోతున్న దండులో చివరనున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారిద్దరిని కట్టేసి బ్రతికి ఉండగానే మంటల్లో వేసి చంపేశారు. వారి పేర్లు రాజిగాడు, గన్నడు. వారిని ఆ విధంగా చంపించిన పాప పరిహారానికై ఆ జట్టు నాయకుడు తన ఇంటి మొదటి సంతానానికి వారి పేర్లు పెట్టుకుంటానని మొక్కుకున్నాడట. ఆ సంప్రదాయం ఆ కుటుంబంలో నేటికీ పాటిస్తున్నారు. 1857 సిపాయల తిరుగుబాటు కాలంలో ముంగండ వాసి చెల్లూరి సుబ్బారాయుడు అనే ఆయన ఝాన్సీ రాణి సైన్యాలలో పనిజేసాడు. ఆమె ఓటమి అనంతరం ఆయన నానా సాహెబ్ తమ్ముడు రావు సాహెబ్ దళాలతో హైదరాబాదు వచ్చి ఆ బలగం విఛ్ఛిన్నం అయ్యాక ముంగండ తిరిగి వచ్చేశారు. ఝాన్సీ సేనలలో తాము చేసిన దురంతక చర్యలను (పట్టుబడిన ఆంగ్లేయులని, స్త్రీలు, పిల్లలు అనే విచక్షణ లేకుండా చెరుకు గానుగులకు అందించిన చంపారట) గొప్పగా కథలుగా చెప్పుకునేవారట. ఆ కథలన్నీ నా చిన్నప్పుడూ కూడా గ్రామంలో చెప్పుకునేవారు. ఆయన ఇంటికి వచ్చేక, అకారణంగానే భార్యను గునపం ఒదవేసి చంపేసిన ఘటన చూశాక ఆయన చెప్తూండిన ఘాతుకాలు నిజమే అయి వుంటాయని గ్రామం నమ్మింది. అసహ్యపడింది. తరువాత ఆయన రెండో పెళ్ళాం ఆయనకు కలిగించిన అవమానాలూ, పెట్టిన తిప్పలూ జనం హాస్యంగా చెప్పుకొని ఆనందించేవారు. దురంతర చర్యలలో పాల్గొన్నాడని అసహ్యించుకున్నా, ఒక ముంగుండవాసి దేశ స్వాంతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడనేంత వరకే ఇక్కడ ప్రసక్తి. ఈయన నా భార్య ముత్తాత తమ్ముడు.

ఈ విధంగా ముంగండ చరిత్ర గతిలో దేశంతో పాటు ముందుకు అడుగువేసింది. దేశం అంతటితో పాటు మంచి చెడ్డల్ని అనుభవించింది. ఈ దృష్టితోనే నేను ఒక్క కొల్లాయిగట్టితేనేమి?లోనే కాదు అన్ని నవల్లోనూ దానినే కార్యరంగంగా తీసుకున్నాను.

అలాగే నవలలోని పాత్రలు, ఘటనలు, మాతృకలూ నిజజీవితంలో చూసినవీ అనుభవించినవే. అయితే చాలా మందిలాగా “నేను చూసినవే రాశానరోయ్” అని చెప్పను. ఏమంటే మనం చూసిన మనుష్యుల జీవితాలు వేరు. వారిని యథాతధంగా లేము. “కొల్లాయిగట్టితేనేమి?” నవలలో స్వరాజ్యం పాత్రకు, దాని మాతృకకు పోలిక వారికి చదువుమీద గల ఆసక్తి కుటుంబ జీవితాన్ని భగ్నం చేసిందన్నంతవరకే. రామనాథం పాత్రా అంతే. వీరేశలింగం గారి ప్రభావంతో బాల్యవివాహం చేసుకోకూడదనుకున్నాడు. చేసుకున్నాడు. చిన్నప్పుడే భార్యతో కాపురం వద్దనుకున్నాడు. సాగలేదు. ఆ విషయం వరకూ రామనాథంలో నవలా రచయిత తనను చూపించుకున్నాడు. తరువాత అతని జీవితం అంతా భిన్నమే. బాలకృష్ణ అస్త్రాలు సంపాదించటానికి ప్రయత్నించిన కథ, రాజకీయాలకు protestగా టోపీలు తీసేయడం, టీచరు కొట్టటం, దాని మీద తాతగారు (తండ్రిగారు) వెళ్ళి హెడ్‍మాస్టర్‍ను సంజాయిషి కోరడం ఘటనలు నా జీవితంలోనివి. కాని బాలకృష్ణ జీవితం నాకు ప్రతిబింబం కాదు. అలాగే గాంధీగారిని గన్నవరం వద్ద గోదావరి దాటడానికి వీలుగా ఆక్విడక్టులోకి సొలుపులు చేయించిన ఇంజినీరు కథ నిజం. ఆ ఇంజినీరు కొడుకు, అతని కథా కల్పితం. నిన్ననే ఆ నవల చదివిన ఒక అమ్మాయి “గాంధిగారు నిజంగా ముంగండ వచ్చారా?” అని రాసింది. రావడమే కాదు. ఆయనకు “యదా యదాహి ధర్మస్య” శ్లోకం తాటాక మీద రాసి, పసర పూసి కనబడేలా చేసి ఇవ్వడం కూడా నిజమే. కాని, తరువాత నవలలో కనిపించే ’సుందర రాట్నమే’ పాట అబద్దం. నిజానికి ఆ క్షణంలో నేనక్కడే వున్నాను.

అల్లాగే బెజవాడ ఎఐసిసి బహిరంగ సభలో ఆలస్యం మూలంగా గాంధీ గారి భోజనం ఆగిపోవడం, ఆ జనం మధ్య నుంచి కోడూరు వస్తాదు సోదరులు ఆయనను భుజాన ఎత్తుకొని బస చేర్చడం నిజం. అయ్యదేవర కాళేశ్వరరావు గారి మీద అయిష్టంతో గోపాలకృష్ణయ్యగారు రామదండు వలంటీర్లను withdraw చేయడం నిజం. కానీ పేచికి కారణంగా చెప్పింది అబద్ధం. ఆ ఘట్టంలో చిత్తరంజన్ దాసు, అయ్యదేవర వారు చేసుకున్న హాస్యాలు ’మీ తెలుగువాళ్ళకి తెలుగు అభిమానం జాస్తి.’ – “అది మీ బెంగాలీల వద్ద నేర్చుకున్నదే” అనే వ్యాఖ్యలు యదార్థం. ఆ రోజున దాసుగారికి సహాయకులుగా ఉన్న వలంటీరు కాట్రగడ్డ మధుసూదనరావు గారు చెప్పినవే, దానినక్కడ ఆ రూపంతోనే అమర్చాను. ఆ విధంగా జరిగిన వానిని యదార్థంగానే చిత్రించాను. కానీ నాటి పూర్వపరాలు భిన్నం.

ఈ విధంగా వాస్తవాలు కథ నడకలో కల్సిపోయినందుచేతనే నోరి నరసింహ శాస్త్రిగారు దానిలో తమ చిన్ననాటి జీవితాన్ని చూసుకున్నట్లు భ్రమపడ్డారు. ఇందులోని కథా భాగం ఏదో సత్యం కాదు. ఉదాహరణకు, అమలాపురం హాస్పిటల్ లో కాంపౌడరుతో జరిగిన ఘర్షణ కథ. కానీ ముంగండలో శంకర శాస్త్రి జొరపడినప్పుడు పూజారి వైద్యుడితో జరిగిన పంతం (పాత్రలు మినహా) యదార్థం. ఫలితం ఏమయ్యింది? నవలలో ఏ అంశమూ అసత్యం కాదు. ప్రత్రి ఒక్కటి ఎక్కడో ఒకచోట, ఎవరికో ఒకరికి ఏదో రూపంలో అనుభూతమైనవే. కానీ అవి అల్లాగే జరిగేయననుకున్నా ఈ పాత్ర నేనే నర్రోయ్ అన్నా, నన్ను చూసే రాశాడన్నా తామెరిగిన వ్యక్తులని పాత్రల్లో చూసిన అది అసత్యం, వట్టి భ్రమ.

ఇక నా నవలలో ఎప్పుడూ ఎక్కడా ఎరిగి వుండి ఎవరినో, ఎవరి చేష్టలనో బయటపెట్టాలని, దుయ్యబట్టాలని ఆలోచించలేదు. సామాజికంగా ఎదురయ్యే మంచి చెడ్డలను గానే వానిని పరిగణించాను. అందుచేత ఎవరి ముఖమైనా వానిలో కనిపించవచ్చు. పైన స్వరాజ్యం కథకీ చరిత్రగా మారిన ఒక ఘటనకీ గల పోలిక చెప్పేను. రామనాధం బావమరిది చంద్రశేఖర్రావు అనాధ శరణాలయం పిల్లని పెళ్ళి చేసుకున్నట్లు రాసేను. నిజజీవితంలో కంభంపాటి తారకం గారు అటువంటి వివాహం చేసుకున్న ఉదాహరణ వుంది. కానీ బ్రహ్మసమాజం ఆంధ్రసమాజంలో ప్రవేశబెట్టిన సంస్కరణ స్వభావం, అవి కాలక్రమంలో కులాంతర వివాహాలకు దారితీసిన ప్రధమ సంఘటనలుగా చూపడానికే ఉపయోగించాను. ఇల్లా చెప్పుకుపోతే నవలలోని ప్రతి పాత్రకి ఒక ఉద్దిష్ట లక్ష్యం నిజజీవితంలో ఓ సాక్షి ఉన్నారు.

ఈ సందర్భంలో ఇంకొక్కటి గుర్తు వస్తుంది. “కొల్లాయిగట్టితేనేమి?” ఆంధ్రపత్రికలో బు.వెం.ర, (బహుశా మిత్రులు బులుసు వెంకట రమణగారేమో) స్వాతంత్రోద్యమ ప్రచారానికి రామనాధం తలపెట్టిన ఒకే ఒక పని చిరుత పూడిలో బహిరంగ సభ పెట్టబోవటం. కానీ తీరా చూస్తే ఆ సభ జరగలేదని హాస్యం చేసేరు. తమ సమీక్షలో, మనసులోని కోరికలూ వేసుకున్న పథకాలకి, అవి క్రియారూపం ధరించటానికి మధ్య ఎంతదూరం ఉంటుందో మనకి తెల్సు. రామనాథం తానే పెట్టుకున్న వివాహ వయోనియమాన్ని మరచి పెళ్ళి ఆడేశాడు. కారణం అటువంటి నియమాలు సమాజ సంస్కారములో భాగం కాలేదు. భార్యతో కాపురం వెంటనే పెట్టుకోవటం తప్పు అనే ఆందోళనతో బయలుదేరి అత్తవారింటికి వచ్చినప్పుడు ఒంటరిగా చిక్కిన భార్యతో చెలగాటం ప్రారంభిస్తాడు. ఆ ఘట్టం చాలా సహజంగా, చక్కగా వున్నదని రంగనాయకమ్మగారు ప్రసంసించారు. ఈ రెండు విషయాలలోనూ రామనాథానికి నేనే ఉదాహరణ, సాక్ష్యమూనూ. వీరేశలింగంగారి ప్రభావంతో వివాహంతో చిన్నతనంతోనే చేసుకోరాదని మనసులో అనుకున్నాను. ఆ రోజుల్లో అంటే – ఈ శతాబ్ద ప్రారంభంలో మగవానికి పదేళ్ళు, ఆడపిల్లకు ఎనిమిదేళ్ళు వస్తుండగానే వివాహ సంబంధాలు వెతికేవారు. బ్రహ్మసమాజ ప్రభావముతో మా ఇంట మూడు నాలుగేళ్ళు గ్రేస్ పీరియడ్‍గా వదిలేరు. నేను 13 ఏళ్ళ వయసులో ఉండగా మా వీధిలో మా ఇంటికెదురుగా ఇల్లు కొనుక్కొని పొరుగూరు నుంచి ఒక కొత్త కుటుంబం కాపురం వచ్చింది. మర్నాడు ఉదయం మా ఇంటి గుమ్మంలో ఒక కొత్త అమ్మాయి, 10ఏళ్ళది – పచ్చని ఛాయ, నవ్వు ముఖం, నల్లని మజలీసు దుస్తులతో హాజరయ్యింది. దానికి ప్రేమ, దోమ అని పేరు వద్దు. ఆడ, మగ మధ్య ఉండే ఆకర్షణ. అప్పటినుంచి ఆమె మా ఇంటికే ఒక విధంగా అతుక్కుపోయింది. ఒక ఏడాది పోయాక ఆమెతో పెళ్ళి అన్నారు. నేను వీరేశలింగం గారి హితభోద మర్చిపోయేను. ఎగతాళి చేసి లాభం లేదు. వ్యక్తులు ఏర్పర్చుకునే నియమాలు సమాజ గత సంస్కారంగా మారేలోపున వ్యవధి తీసుకుంటుంది. ఆ లోపున ఈ మాదిరి వైఫల్యాలు కలగవచ్చు. కానీ ఇక్కడ ప్రధానం సంస్కరణల ఆలోచన ప్రారంభం కావటమే. అది సమాజంలో నిలదొక్కుకోవటంలో వ్యవధి పడుతుంది. “రాశిలో పెరగటం, వాసిలో మార్పు” “From quantity into quality”అనే గతి తర్క సూత్రం వినియోగం ఇక్కడే ఉంది. ఆ దృష్టితోనే నా అనుభవంతో రామనాధం పాత్రను తీర్చేను. ఆ పాత్ర వేసిన ప్రతి అడుగులో వాస్తవజీవితంలో ఎవరిదో ఒకరి అనుభవం ఉంది. వివిధ భాషల్లో నేను చదివిన అనంత సాహిత్యం నాకు ఎందరివో, ఎక్కడెక్కడివో అనుభవాలను సమకూర్చి పెట్టాయి. దానికి ఒక్క ఉదాహరణనిస్తా.

రామనాధం అమలాపురంలో సుందరితో సరాసరి మాట్లాడి ఆమెను సుముఖం చేసుకొని ప్రయత్నం కథాఘట్టం. (2వ భాగం 11వ ప్రకరణం) సుందరి విముఖత కనబరిచింది. “మీ వాళ్ళే పంపితే”? తాళికట్టించుకున్నాక తప్పుతుందా?” ఈ ఘట్టం రాస్తుంటే నేను ఎప్పుడో చదివిన దేశిరాజు పెదబాబయ్యగారి జీవితం గుర్తు వచ్చింది. అందులోని మాటలే కాకపోవచ్చు. కానీ అటువంటి ఘట్టములో పలికించే మాటలు ఒకే విధంగా ఉంటాయి. అయినా, భార్య శాశ్వతంగా విడిపోయే ముందు జరిగిందన్న సంభాషణ నా మనసులో నిలిచిపోయింది.

శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారితో నేను సంధ్యావందనం వగైరాలను అపహాస్యం చేసేనే అని గుర్తు చేసినట్లు పైన రాశాను. కానీ అస్త్రాలు, మంత్రాల మీద మనకున్న నమ్మకం childishness తప్ప వేరు కాదు. ఆ పేరుతో మనల్ని మోసం చేస్తున్నారని కథలోకి ప్రవేశబెట్టిన ఘట్టం స్వానుభవం. జెలియన్‍వాలా భాగ్ దురంతాలు జరిపించిన బ్రిటిష్ జాతిని, బ్రిటన్‍నూ భూతలం నుంచి తుడిచేయాలనే అంత కోపం వచ్చింది. ఎల్లాగ? అగ్రహారంలో చెప్పే గొప్పలు, భారత రామాయణాది హరికథల్లో వర్ణించిన అస్త్రాలు, కథలూ విన్న మన మా అన్నదమ్ములకు వాటిని సంపాదిస్తే పని తీరిపోతుందనిపించింది. అప్పటికి నాకు పదకొండేళ్ళు. మా తమ్ముడు జగన్మోహన్‍కి తొమ్మిదేళ్ళు. అప్పటికే నేను మూడవ ఫారం పాస్ అవటం, సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా చదువు మానేయటం జరిగింది. సహాయనిరాకరణం కాదు, అసలు సహాయం ఇవ్వవలసిన వాడే లేకుండా చేసే ప్రయత్నం ప్రారంభించాం. మా తరగతిలో తురగా శేషగిరిరావు అనే అతడు చదివాడు. మా కంటే పెద్దవాడు. స్కూల్లో చదివే రోజుల్లోనే తన తండ్రిగారి నైష్టికత్వం గురించి, అటక మీద వున్న తాటాకు పుస్తకాలు గురించి, వానిలో ఉన్న అస్త్రశస్త్రాల మంత్రాల గురించి తెగ వర్ణించేవాడు. అతణ్ణి పట్టుకున్నాం. అతడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు యెండా వాన అనకుండా ఓ ఆర్నెళ్ళి తిరిగాం. చివరకు వాడు చెప్పేవన్నీ గొప్పలని అర్థం అయింది. ఆ ఘట్టం చదివి మంచికి, చెడ్డకి వ్యాఖ్యానించినవాళ్ళు చాలా మంది తగిలేరు.

అలాగే ఆ దురంతాలకి అసమ్మతి తెలుపుతూ టోపీలు తీసేసి, క్లాసుకి వెళ్ళి దెబ్బలు తిన్న ఘటన. దానిలోనూ ప్రధానపాత్రను నేనే. ఆ రోజుల్లో టోపియో, తలపాగాయో ఉండితీరాలని స్కూళ్ళల్లో నిబంధన ఉండేది. దానిని నిరాకరించాం, అసమ్మతి తెలపటానికి. ఇలాంటి చర్యలే జాతీయోద్య చరిత్రలో భాగాలు. అంటూ పూర్వకాలపు పిచ్చి నమ్మకాల నిరాకరణం జాతీయోద్యమ పురోగతికి ఓ ఆలంబనం. టోపి పెట్టుకోమని వ్యతిరేకించటం ఆ ఉద్యమంలో ఒక సాధనం. అవి చిన్న చిన్న ఘటనలే. కానీ రాసిగా విస్తరించి జాతీయ జీవనంలో ఒక అడుగు ముందుకు వేయిస్తాయి. వాసి హెచ్చుతుంది.

దీనికి తరువాయి కథగా ఎత్తుకున్న “దేశం కోసం, జ్వాలాతోరణం” నవలలూ వాసి పెరుగుదల దశలు చూపుతున్నాయి.

ఇక్కడ ముంగండ గ్రంధాలయం గురించి, గ్రామ యువజన సంఘం గురించి కొంత రాస్తే తప్ప గ్రామంలో వచ్చిన పరిణామాలు స్పష్టముగా తెలియవు.

ముంగండ గ్రంధాలయం జిల్లాలోనే మొట్టమొదట ఏర్పర్చినవానిలో ఒకటి అని మా నాన్న చెప్పేవారు. గ్రామములో మొదట రెండు గ్రంధాలయాలు పోటాపోటీగా ఏర్పడ్డాయి. ఒకటి మా నాన్న, ఆయన మిత్రులు పుల్య కృష్ణయ్యగారు ఏర్పరిచిన రామమోహన గ్రంధాలయం. దీనిలో కొత్తగా వస్తున్న గ్రంధాలు వుండేవి. రెండోది గ్రామంలోని పండితులు పోటిగా పెట్టిన గజనాన గ్రంధాలయం. తెలుగు కావ్యాలు, పురాణాలు మొదలైనవి ప్రధానంగా ఉండేవి. 1910 ప్రాంతంలో రెండిటినీ ఏకం చేసి, వివేకోదయ పుస్తక భాండాగారం అని పేరు పెట్టారు. నాకు గుర్తు తెల్సిన 5వ ఏడాది నాటికి ఆ గ్రంధాలయం మా చావడిలో ఉండేది. నా చదువు దానిలోనే గనుక నాకు బాగా తెల్సు.

నన్ను 5వ బడిలో వేశారు. మొదటి రోజునే ఎందుకో గుర్తులేదు. మాస్టారు తొడపాశం పెట్టేరు. పసుపు రాసిన పచ్చని ఒంటి మీద నల్లగా కమిలిపోయిన తొడను చూసి మా నాన్న వెళ్ళి మాస్టార్ని తిట్టి నన్ను బడి మాన్పించేరు. ఇంటి వద్దే తానే అక్షరాలు నేర్పి, మా సావడిలోని గ్రంధాలయంలో వదిలేరు. ప్రధమంలో నేను వాచకం నేర్చుకున్న “ఆర్య కథానిధి” పుస్తకాలు (వావిలకొలను సుబ్బారావుగారివి) నాకిప్పటికి గుర్తు. అలాగే శెట్టి లక్ష్మీ నరసింహంగారి గ్రీకు పురాణ కథలూ, చిలకమర్తి వారి రాజస్థాన కథాకళి, గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారి అబ్రహం లింకన్ మొదలైనవి జ్ఞాపకం. ప్రపంచ యుద్ద కథలను ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక బొమ్మలతో వేసేది. ఆ ఏడేళ్ళ వయసులోనే అవన్నీ బహు ఆసక్తిగా చదివేవాడిని. ఐదు, ఆరు ఏళ్ళ వయసులోని పట్టుబడీన పుస్తక పఠనాసక్తి ఈ యనభైదు ఏళ్ళవయసుకి కూడా తగ్గలేదు.

ఆ గ్రంధాలయం 1910నాటికి మా ఇంటి నుండి మారింది. 1929లో గ్రామ యువజన సంఘం ఏర్పడింది. మొదట కర్ర సాము నేర్చుకోడానికి ప్రారంభమైన యువకుల సంఘం ఆనాడు మా ఈడు వాళ్ళు ఊళ్ళో 10-15మంది ఉండేవారు. సత్యాగ్రహ ఉద్యమానికి వాలంటీర్లను పంపటం, పోలిసుల చేత దెబ్బలు తిన్నవారిని రహస్యంగా దాచి, వైద్యం చేసి తిరిగి పంపటం వంటి పనులతో బలమైన యువజన సంఘంగా ఏర్పడ్డాం. వారిలో సత్యగ్రహ శిబిరంలో చేరిన నలుగురిలో నేనొకడిని.

ఆ ప్రాంతంలోనే మా ఊరి చెరువుగట్టు మీద కట్టిన మఠంలో చేర్చి ఉన్న ఒక గది శిధిలం అయ్యింది. దానిని గ్రామ యువజన సంఘం మరల కట్టింది. డబ్బుకోసం ఊరి చెరువుకి నీరు పెట్టటం బాధ్యత తీసుకొని ఓ పాతిక, గ్రామములో లక్షపత్రి పూజలు తలపెట్టిన ఇద్దరు, ముగ్గురికి పదేసి రూపాయలు తీసుకొని పత్రి తెచ్చి ఇచ్చే డబ్బు సంపాదించాం. మేస్త్రి సాయముతో నేనే కూలిపని చేసి ఆ కొద్ది డబ్బుతోనే పడిపోయిన గదిని వేశాం. అందులోకి గ్రామ గ్రంధాలయాన్ని మార్చాం. నలిగిపోయిన పుస్తకాలను బైండింగు పని నేర్చుకొని మేమే చేశాం. ఈ కార్యక్రమాలతో ముంగండ యువజన సంఘం పోలీసు రికార్డులలోకి ఎక్కింది. ఒకదశలో ముస్తాఫ్ అలీ ఖాన్ (డివైఎస్సీ) గ్రామం మీద దాడి చేసి సంఘం నామరూపాల్లేకుండా చేయాలని ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. సమావేశం అయ్యాం. పోలీసుల చేతిలో దెబ్బలూ, చావులూ తప్పవు గనుక మనం వాళ్ళని చుట్టుముట్టి చంపేద్దామని నిర్ణయం చేసేశాం. కత్తులు, బళ్ళాలు, ఒక రివాల్వరు, ఒక లైసెన్సెడ్ గన్ (మా బావమరిదిది) సిద్ధం చేసుకున్నాం. కానీ ముస్తాఫ్ ఆలీ దాడికి రాలేదు. మేమూ సర్దేసుకున్నాము.

– మహీధర రామమోహనరావు.

You Might Also Like

3 Comments

  1. మంజరి లక్ష్మి

    “దేశం కోసం, జ్వాలాతోరణం” నవలలు ఇప్పుడు దొరుకుతున్నాయా? ఇదివరకు పుస్తకము చదివినప్పుడు ఈ ముందు మాట వెనుక మాట చదివాను. తరువాత దీనిమీద కామేశ్వర రావు గారు రాసిన వ్యాసం చదివి దానికి బదులు రాయటానికి మళ్ళా కూడా చదివాను. ఆయిన సరే ఇప్పుడు మళ్ళా చదువుతుంటే – ఆయన తన స్వంత అనుభవాలను ఎలా పుస్తకం లోని ఘట్టాలుగా మార్చింది – మళ్ళా కొత్తగా తెలుసుకున్నట్లుగా అనిపించింది. చాలా బాగుంది. అలాగే రా. రా. గారు గుర్తించని విషయాలను కూడా కొంత వివరంగా రాశారు. బాగుంది. దీని మీద కామేశ్వర రావు గారు రాసిన వ్యాసాలు కూడా లింక్ గా పెడితే బాగుంటుందేమో.

    1. సౌమ్య

      మంజరి గారు: మీ సూచనకి ధన్యవాదాలు. ఈ పుస్తకం గురించిన అన్ని వ్యాసాలకి ఒక ట్యాగ్ పెట్టడం నయమేమో. చూస్తాము.

Leave a Reply