ప్రేమలేని లోకంలో నిర్గమ్య సంచారి ఇక్బాల్‌చంద్‌

వ్యాసం రాసిన వారు: మూలా సుబ్రమణ్యం
[ఈ వ్యాసం మొదట తెలుగుపీపుల్.కాంలో 2006 లో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం.]

ఆధునిక తెలుగు కవిత్వం రెండు పార్శ్వాలు గా చీలుతుంది. గురజాడ ప్రతినిధి గా మొదటి పార్శ్వంలోని కవులు జీవితంలోని ఉజ్వలమైన కాంతిని చిత్రించారు. అప్పుడు తెలుగు కవిత మహోత్తేజంతో వికసించిన వైతాళిక గీతం. దేశభక్తి కవిత్వమైనా, భావ కవిత్వమైనా, అభ్యుదయ కవిత్వమైనా జీవితంలోని ప్రకాశవంతమైన క్షణాల్లోంచి వికసించినదే. ఇక బైరాగి ప్రతినిధిగా రెండో పార్శ్వంలోని కవులు జీవితంలోని భయగ్రస్త, విషాదభరిత క్షణాల్లోంచి కవితా సృజనకి పూనుకున్నారు. నమ్మిన ఒక్కో విలువా కళ్ళెదుటే కూలిపోతుంటే ఆధునిక జీవితం అట్టడుగున నిరాకారంగా కనిపించే అస్తిత్వం ఎదుట నిస్సహాయంగా నిలబడ్డ కవిని వీరి కవిత్వంలో చూడొచ్చు. సత్యం సౌందర్యమే కాదు భయానకం కూడాఅని వీరు తెలుసుకున్నారు కాబట్టే వెలుగుకి అవతలివైపున్న చీకటి ని ఆర్ద్రంగా చిత్రించగలిగారు. ఆకోవలో ఇక్బాల్‌చంద్‌ తన అస్తిత్వ వేదన నీ, ఆత్మలోకంలో దివాలానీ, అంతుపట్టని అన్వేషణనీ అద్భుతంగా ఆవిష్కరించారు తన ‘ఆరోవర్ణం’ కవితా సంకలనంలో..

నవీన జీవితంలోని అత్యంత సూక్ష్మమైన ప్రశ్నలకి ప్రతినిధిగా కనిపించే మహాకవి బైరాగి తన అస్తిత్వ వేదనని గానం చేసేందుకు శబ్ద కవిత్వాన్నే వాహకంగా వాడుకున్నాడు. ఆయన కవిత్వంలో నిశ్శబ్ద పద చిత్రాలు ఎక్కడా కనిపించవు. అయితే నిశ్శబ్ద పద చిత్రాలతో సైతం ఆ ఆవేదనని అంతే గాఢంగా ఆలపించొచ్చు అని నిరూపించాడు ఇక్బాల్‌చంద్‌. బాధని పలికించడానికి ఇతను వాడే పదచిత్రాలు మచ్చుకి కొన్ని….

మత్తు రెప్పలపై ఇనుపనాడాల కసరత్తు, రోదసీ యాత్ర అలసట, విసిరేసిన వేశ్య కొప్పులోని పుష్పాలు, నిర్జలనది ఒడ్డున సిద్ధంగా పడవ, బిడ్డకి పాలివ్వలేక ఒట్టిపోయిన
స్తన్యంవైపు నిస్సహాయంగా చూస్తున్న ఆది కాలపు తల్లి……

ఇప్పుడు వస్తున్న కవుల్లో ఇతనిది విలక్షణ శైలి.. వస్తు వైవిధ్యంతో పాటు భాష కూడా కొత్త గా ఉంటుంది.. ని తో ప్రారంభమయ్యే వ్యతిరేక పదాలంటే ఇతనికి మక్కువ ఎక్కువ.. నిర్గమ్యం, నిర్మోహం, నిరాసక్తి, నిర్జల, నిర్లిప్తత పదాలు ఎక్కువగా కనిపిస్తాయి…

ఇక కవితల విషయానికి వస్తే –

మొదటి కవితలో

ఈ దారంటే వెళ్ళిపోవాలి
చివరికి చేరాక అసలు రావాల్సింది
ఇక్కడికి కాదు

అనడంలో ఆధునిక జీవిత అసంగత్వాన్ని రెండు వాక్యాల్లో చెప్పేసినట్లయ్యింది. ఇలాంటి కవిత్వాన్ని రాయడానికి కవి మనుషుల్ని అమితంగా ప్రేమించేవాడై ఉండాలి. ఇతను ప్రేమని ఎంతలా కాంక్షిస్తున్నాడో చూడండి…

లక్ష ఆకలి చావులకు మించి
ఒక్క ప్రేమ రహిత హృదయ హత్యోదంతం
అతి పెద్ద నీచ కావ్యం

చాలామంది కవుల్ని వేధించిన అస్తిత్వ వేదన ఇతని చాలా కవితల్లో కనిపిస్తుంది….

ఒక్క ఉన్నానన్న స్పృహే
అనంత వ్యధలకు
మూలం
(చాలా దూరం నడవాలి)

రెండు శరీరాల మధ్యే కాదు
ఒకే ఆత్మలో
రెండు దారుల్‌ మధ్య
వంతెనా అతి సున్నితమైనది
(అస్తిత్వ వేదన)

ఒంటరి గది కిటికీ పై
తచ్చాడుతున్న పిచ్చి గాలీ
నాకు నేను లేని చోట
వేకువ కోసం పరదానెందుకు తొలగిస్తావు
(నిరాసక్తి)

ఈ వేదన పర్యవసానం ‘నిష్క్రమణ’ అన్న కవిత లో ఇలా కనిపిస్తోంది…..

తెర మీద లేకపోవడం కన్నా
ఉండి వివర్ణ మవడం దుర్బరం

ఏ అవయవమైతే అవిటిదో
దానిపై జాలి పడటంకంటే
తొలగించడం మంచిది

పురుగుని తినేస్తున్న పువ్వు
పందిరి కి వెక్కిరింతయ్యే బదులు
తెగిపోవడమే సరైనది
వెళ్తున్నాను

దిష్టిబొమ్మై వెళ్తున్నాను
కరెంటు తీగలకి వేలాడుతున్న
కాకి మృత కళేబరమై వెళ్తున్నాను
ఆకాశమ్మీద ఎగిరే
పక్షి రెక్క పుండులోని బాధనై వెళ్తున్నాను

తన ఆత్మ ని అగ్ని పరీక్షకు పెట్టే ఒక సత్యాన్వేషకుడిని పై కవితలో చూడొచ్చు..తన అంతరంగ మథనంలో జన్మించింది అమృతమో విషమో తేల్చుకోడానికి తనే ముందు స్వీకరించే ధైర్యం నిజాయితీ ఈ కవికి ఉన్నాయి.‘నా రెక్కల ముడి విప్పు’ అన్న కవితలో ఈ పంక్తులు చూడండి….

నాకు దీపం కావాలి
నన్ను నేను కాల్చుకుని
నిరాకారంగా ఎగిరిపోయేందుకు

జీవితపు పై పై మెరుగులు చూసి సంతృప్తి పడిపోయే అర్భక కవి కాదితడు…‘మెలాంకలి’ అన్న కవిత ఆఖర్లో ఇలా అడుగుతున్నాడు

నాకు నీ రహస్యం వెనకటి రహస్యం కావాలి
కనిపించే అందం వెనకటి
కనిపించని తీరం కావాలి

అందరికీ ఆహ్లాదం కలిగించే సాయంత్ర దృశ్యం ఇతను వర్ణించే తీరు చూడండి….

బల్లి నోట్లో ఇరుక్కున్న పురుగు కంట్లోని నెత్తురు కల్సిన
కన్నీటి చారిక లా సూర్యుడు రోదిస్తున్నాడు.

ఒక సాయంత్ర చిత్రం
పెచ్చులూడుతున్న చిత్రకారుడి స్వప్నంలోని వర్ణాలు

సంక్షోభం, సంశయం, నిరాసక్తి, నిర్లిప్తత, అలజడి అన్నీ కలగలిపిన చీకటి ని ఇంత భయంకరంగా చూపించిన ఈ కవి కాంతిని చిత్రించాల్సి వస్తే ఎంత అందంగా ఉంటుందో చూడండి……………

కనుచూపు మేరలో దీపకాంతి
బ్రతకడానికి ఒక నమ్మకం దొరికింది
సుదీర్ఘ జ్వరకాలం
పథ్యం తర్వాత ఆకలి లా
ఒక విశ్వాసం భవిష్యత్తుని పుష్పించింది

తనని తాను వెతుక్కోవడమే కవిత్వానికి పరమావధి అని ఇతను ఎంత కవితాత్మకం గా చెప్తాడో..

వేసవి
ఎడారి ఇసుకలో తలదూర్చి
తనని తాను వెతుక్కునే
ఉష్ట్ర పక్షి ని చూశావా?
కవీ!
దాహం తెలుసా?

ఇది ఎప్పటి వెతుకులాట?
చివరి అనుభవంనీంచి?
లేదా
అనుభవ రాహిత్యం నీంచి?
లేదా
గత జన్మాల్నించి?

కాలాన్నీ మరణాన్నీ అవహేళన చేసే కళ ని ఇతను అభివర్ణించే తీరు అబ్బుర పరుస్తుంది..

దైవ స్వర్గానికి ప్రతిరూపంగా
ఊహాత్మక సురనగరు నా ఈ సృష్టి
నాకు తెలుసు
నా స్వర్గ సృష్టి చూడటానికి వెళ్ళిన
నా అడుగులు
గుమ్మానికి తాకగానే తల పగిలి చచ్చిపోతాను–

కావచ్చు
అయినా నేనే గెలిచాను.

బాధ కవిత్వానికి పర్యాయపదం అన్న శ్రీ శ్రీ మాటలకి నిలువెత్తు నిదర్శనం లా కనిపించే ఇక్బాల్‌ చంద్‌ కవిత్వం అత్యంత నిరాడంబరం గా ముందు మాట కూడా లేకుండా ప్రదర్శితమౌతుంది…

ఆఖరి కవితలో అతను అన్నట్లుగానే

పఠితకు ఎదురుగా ఉన్న కవి
కవిత్వానికి మొదటి శత్రువు
కవి అజ్ఞాత సంచారి కావాలి
కవిత్వం ప్రదర్శితమవ్వాలి
అందుకే నా ఈ నిష్క్రమణ

అజ్ఞాతంగా ఉండి పోవాలని నిర్ణయించుకున్నారేమో…

ఏది ఏమైనా కవిత్వ యోగం లో రహస్యాల అన్వేషకుడు, స్వాప్నికుడు అయిన ఇక్బాల్‌ చంద్‌ సృజించిన చిక్కటి కవిత్వం లో ముక్కలు ముక్కలౌతున్న తన ఆత్మ శకలాల్ని
చిత్రించారు… వాటిల్లో ప్రతి పాఠకుడు తనని తాను చూసుకోవచ్చు… చూసి తట్టుకోగల ధైర్యం ఉంటే మీరూ పుస్తకం తెరవండి.

You Might Also Like

2 Comments

  1. పుస్తకం » Blog Archive » “బంజార” – ఇక్బాల్ చంద్ కవిత్వం

    […] కవితలు రాసే కవి మూలా సుబ్రహ్మణ్యం పుస్తకం.నెట్లో రాసిన వ్యాసం చూసి  ఇక్బాల్ చంద్ కవిత్వం చదవాలన్న […]

  2. బొల్లోజు బాబా

    ఇక్భాల్ చంద్ గారి గురించి గొప్ప వ్యాసాన్ని అందించారు.

    పఠితకు ఎదురుగా ఉన్న కవి
    కవిత్వానికి మొదటి శత్రువు

    అద్బుతమైన వాక్యాలు ఇవి.

    బొల్లోజు బాబా

Leave a Reply to పుస్తకం » Blog Archive » “బంజార” – ఇక్బాల్ చంద్ కవిత్వం Cancel