ముగ్గురు మహాకవులు

రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్

[ఈ వ్యాసం మొదటిసారి 1 డిసెంబర్ 2005 న తెలుగుపీపుల్.కాం వెబ్సైటులో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం]

ఇస్మాయిల్‌ ద్వితీయ వర్ధంతి సంస్మరణలతో….
*********
మహావృక్షాలన్నీ చీకట్లో మునిగిపోతున్నాయి.పొదల్లో మిణుగుర్లు మెరిసిపోడానికి ఇంకా కొంత సమయం ఉంది.చల్లగాలికి పండు బారిన ఆకులు రాలిపడి పచ్చికలో ఒదుగుతున్నాయి… శీతల సాయంత్రం..అలా తిరిగివద్దామని.. అడుగు బయట పెట్టానా… పోస్టువాడు పుస్తకాల్ని చేతపెట్టి దస్కత్తు చేయించుకుని వేగంగా నిష్క్రమించాడు- కుదురైన పుస్తకం… Post-war Polish Poetry …

సంకలనం అంటే అలా ఉండాలనిపించింది.చేసినవాడు సామాన్యుడా? ‘జెస్వావా మిలోష్‌ ’. కవితాభిరుచికి నిలువెత్తు దర్పణం.. కమ్యూనిస్టు దురాగతాలను ఖండించినా, లిధువేనియా నిసర్గ సౌందర్యాన్ని శ్లాఘించినా, సాహితీవేత్తలను క్లుప్తంగా పరిచయం చేసినా నానా ప్రక్రియలను చేపట్టినా ఆయన శైలీ వైభవం అనితర సాధ్యం.

అటువంటి పోలిష్‌ పద్యకారుడు ప్రళయమ్మీద పాట (ఇస్మాయిల్‌ గారి అనువాదం) తో తెలుగులో పీఠం వేసుక్కూర్చున్నారు.ఈ విషయం బహుశా ఆయనకి తెలియకపోవచ్చు.తొమ్మిది పదుల నిండు జీవితాన్ని సాహిత్యానికి అర్పించి కన్ను మూశారు.ఈ నడుమ ఇస్మాయిల్‌ గారు ఈయనలా అవలీలగా మరో ఇరవై యేళ్ళు చుక్కల్లో చంద్రునిలా తేలిపోతూ , మన మధ్య హాయిగా జీవిస్తారని భావించేవాణ్ణి నేను.కానీ తాడి చెట్ల నీడలను మాయం చేసి , మేఘాల నడుమ దోబూచులాడే జాబిల్లి అకస్మాత్తుగా అస్తమించింది.

ఒక్క కవితతో ప్రపంచ ఖ్యాతిని పొందిన కవులు అతి అరుదు. poet,lover, birdwatcher కవిత ద్వారా అటువంటి చిర యశస్సుని ఆర్జించిన ‘నిస్సిం ఎజెకిల్‌ ’ భారతీయ ఆంగ్ల కవిత్వానికి కొత్త నడకలు నేర్పించాడు. నగరాత్మ నడయాడుతుంది ఈతని కవితా చరణాల్లో. ‘చెట్టు నా ఆదర్శం’ కవితానువాదాలు ‘ఇండియన్‌ లిటరేచర్‌ ’ పత్రికలో వెలువడుతున్నప్పుడు అనువాదకులైన డి.కేశవరావు గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపారాయన. అనగా ఇస్మాయిల్‌ కవితలను ఇంగ్లీషు ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈయన పాత్ర ఉంది. పోతే వీరిద్దరినీ బంధించే సూత్రం పూర్తిగా ఆధునికం!

‘ఎటో తెలియని
ఎడతెగని ప్రయాణంలో
కనుమరుగైన కవులకు
మాంసమూ ఎముకలే కాదు
అర్ధమూ కనిపిస్తుంది
అక్కడ బధిరుడూ వినగలడు
అంధుడూ చూడగలడు’

అని, ఈ కవి నిష్క్రమించాడు. మూడు వసంతాల్లో ముగ్గురు మహాకవుల్ని కోల్పోయిందీ ప్రపంచం. అప్పటినుండీ ‘తరుచాపము వీడిపోయి గురి మరిచిన బాణంలా తిరుగాడుతునే ఉన్నాయి’ పిట్టలు.

— తమ్మినేని యదుకుల భూషణ్‌

You Might Also Like

One Comment

  1. ramnarsimha

    కవిత బాగుందండీ!!

    ఎటో తెలియని
    ఎడతెరుగని ప్రయాణంలో
    కనుమరుగైన కవులకు!!
    మాంసమూ, ఎముకలే కాదు
    అర్ధమూ కనిపిస్తుంది..

    అక్కడ బధిరుడూ వినగలడు
    అంధుడూ చూడగలడు..

Leave a Reply