పుస్తకం
All about booksఅనువాదాలు

April 15, 2015

The Myth of Wu Tao-tzu

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు

(ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు సెప్టెంబర్ 2014లో ఫేస్బుక్ లో పోస్టు చేసారు. తిరిగి పుస్తకం.నెట్ లో వేయడానికి అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు.– పుస్తకం.నెట్)
*******

ప్రపంచ చిత్రకళారీతులమీద రాసిన వ్యాసాల్లో సంజీవ దేవ్ ఒకచోట ఒక చీనా చిత్రకారుడి గురించి రాసారు. ఉతావూ చూ అనే ఒక చిత్రకారుడు అప్పటి చక్రవర్తి మింగ్ హువాంగ్ ప్రాసాదంలో గోడమీద ఒక ప్రకృతి దృశ్యాన్ని చిత్రించాడట. చక్రవర్తి ఆ చిత్రాన్ని చూసి ఆనందిస్తుంటే, ఉతావ్ చూ ఆ చక్రవర్తిని చేతిని పట్టుకుని ఆ చిత్రంలోని గుహలోకి వెళ్ళి అదృశ్యమైపోయాడట. ఆ కథ గురించి చెప్తూ సంజీవదేవ్ ‘..అంటే, ఆ చిత్రం అంత వాస్తవికంగా ఉన్నదన్నమాట, దాని మూడు ఆయతనాల ఆభాస కంటికి కనిపించేది మాత్రంగా మాత్రమే కాక చిత్రంలోకి ప్రేక్షకులు వెళ్ళిపోయే అంత వాస్తవికంగా ఉన్నదన్న మాట’ అని రాసారు. (సంజీవ దేవ్ వ్యాసాలు-1, 2012, పే.89)

ఆ కథ నన్ను ఎక్కడో సూక్ష్మలోకాల్లో కదిలించింది. ఉతావ్ చూ అనే చిత్రకారుడి గురించి మరికొంత తెలుసుకోగలనా అని ప్రయత్నించాను. ఆ చిత్రకారుడి పేరు ఊ-తావో-జూ అనీ, ఇప్పటి ఉచ్ఛారణ ప్రకారం ఊ దావోజి అని పలకాలనీ తెలియడమే కాకుండా, ఆ కథ విని సంభ్రమానికి లోనై ఒక స్వీడిష్ భావుకుడు ఏకంగా ఒక పుస్తకమే రాసాడని తెలిసింది. ఆ పుస్తకం తెప్పించుకుని చదివేదాకా నా మనసు ఊరడిల్లలేదు.

స్వెన్ లిండ్ క్విస్ట్ (1932-) స్వీడిష్ రచయిత. దాదాపు ముఫ్ఫైకి పైగా పుస్తకాలు రాసాడు. ప్రధానంగా వ్యాసకర్త, యాత్రా చరిత్రకారుడు, సామాజిక విశ్లేషకుడు. అస్వాల్డ్ సిరేన్ అనే స్వీడిష్ కళావిమర్శకుడు చీనా చిత్రలేఖనం మీద రాసిన ఏడు సంపుటాల్లో ఒకచోట ఊ-తావో జూ గురించి రాసిన కథ లిండ్ క్విస్ట్ కంటపడింది. ఆ కథ చదివి ఉండబట్టలేక చీనా వెళ్ళిపోయాడు. అవి వియత్నాం యుద్ధం జరుగుతున్న రోజులు. బీజింగ్ లో ఒక గురువుదగ్గర కాలిగ్రఫీ నేర్చుకున్నాడు. అక్కణ్ణుంచి భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ ల మీదుగా తిరిగి స్వదేశానికి వెళ్ళాడు. కొన్నాళ్ళు ఆఫ్రికాలో సంచరించాడు. తన యాత్రానేపథ్యంలో The Myth of Wu Tao-Tzu (1967) అనే పుస్తకం రాసాడు. అతడి రచనలన్నిటిలోనూ సర్వశ్రేష్టమైనదిగా గుర్తించబడ్డ ఆ రచన ఇంగ్లీషు అనువాదం 2012 లో వెలువడింది.

అయితే ఇంతకీ ఊతావో జూ కథని సంజీవదేవ్ గారు కొంత మార్చి రాసారు, లేదా ఆ కథని ఆయన పొరపాటుగా విని ఉంటారు. ఆ కథలో ఊ తావో జూ తను గీసిన కుడ్యచిత్రం చూడమని చక్రవర్తిని ఆహ్వానించి, తను ఆ చిత్రం ముందు నిల్చుని చప్పట్లు చరచాడట. అప్పుడు ఆ చిత్రలోని గుహ తెరుచుకుందట. ఊ తావో చక్రవర్తిని తన కూడా రమ్మంటూ ఆ గుహలోకి అడుగుపెట్టాడట. ఆశ్చర్యంతో ఆ చక్రవర్తి అతణ్ణి అనుసరించబోగా ఆ గుహ మూసుకుపోయిందట.

సంజీవదేవ్ విన్నదాని ప్రకారం చక్రవర్తి కూడా గుహలో అడుగుపెట్టాడంటే, దాని అర్థం, ప్రేక్షకుడు కూడా ఆ కళాకృతిలోకి వెళ్ళగలిగాడని. అలాకాక, ఆ చిత్రకారుడు మాత్రమే ఆ చిత్రంలోకి ప్రవేశించి అదృశ్యమయ్యాడంటే దాని అర్థమేమిటి? లిండ్ క్విస్ట్ ఈ ప్రశ్నతోనే తన పుస్తకం మొదలుపెట్టాడు. అది కళావిమర్శ కాదు, రెండవప్రపంచ యుద్ధానంతరం, వియత్నాం యుద్ధకాలంలో ప్రపంచ స్థితిగతుల విశ్లేషణ. కొంత యాత్రానుభవం, కొంత ఆత్మానుభవం. తన ఎనభయ్యో ఏట, అంటే, 2012 లో లండన్ లో ఓ హోటల్లో కూచుని తన పుస్తకం ఇంగ్లీషు అనువాదానికి ముందుమాట రాసుకుంటూ ఆయనిట్లా రాసాడు:

‘ఊ తావో జూ కథ విన్నప్పుడు నా ప్రశ్న: అతడికది ఎట్లా సాధ్యమైందని? చప్పట్లు చరవగానే గుహాద్వారం తెరుచుకోవడం వెనక రహస్యమేమిటి? తనకు తానుగా అదృశ్యం కాగలిగే కళని అతడికెట్లా పట్టుబడింది? చూడబోతే అతడు తన చిత్రలేఖనంలోకి చొచ్చుకుపోయి అక్కడ తాను జీవించగల ఒక లోపలిగదిని, ఒక ఆంతరంగిక స్థలాన్ని కనుగొన్నాడనిపిస్తోంది. ఆ భ్రాంతిని అతడెట్లా సృజించగలిగాడు? బహుశా అది భ్రాంతి కాదేమో. ఆ మాటకొస్తే అత్యుత్తమ జర్మన్ నవలా రచయిత హెర్మన్ హెస్ తన జీవితకాలమంతా చేస్తూ వచ్చిన సాహిత్యసృష్టి ఊ తావో జూ మిత్ ని పునరభినయించడమే కదా. ముసిల్, ప్రూ చేసింది కూడా అదే కదా. ఊ తావో జూ కథని నేను మరింత మరింత అధ్యయనం చేసినకొద్దీ అది మరిన్ని మరిన్ని ఆలోచనలు నాలో సంచలింపచేస్తూ వుంది. మరిన్ని ప్రశ్నలు. ఇంతకీ అతడెందుకు అదృశ్యమయ్యాడు? అతడి వెనక ఇక్కడే ఉండిపోయినవాళ్ళెవరు? అతడికి తన కాలం నాటి సంస్కృతి భరించలేనిదిగానూ, అర్థరహితంగానూ అనిపించిందా? లేదా అతడు చేసిందంతా ఒక కళాకారుడిగా తనను తాను పరీక్షించుకోవడమా? తన కళని జీవితంమీద గీసి చూసుకోవడమా? ఊ తావో జూ కి ఒంటరిగా మిగిలిపోగల సాహసముంది. ఆ కథలో నన్ను తీవ్రంగా ప్రలోభపరుస్తున్న అంశమదే. అతడికి కళలో దర్శనీయ పార్శ్వంనుండి అవతలి తీరానికి అదృశ్యంకాగల ధైర్యముంది, ఒంటరిగా కొనసాగగల సాహసముంది.’

కళాకారుడు జీవితవాస్తవం నుంచీ, ప్రపంచం నుంచీ బయటపడి తన కళలోకి వెళ్ళిపోగల అవకాశం ఊ తావో జూ కథలో ఉందని లిండ్ క్విస్ట్ అభిప్రాయపడ్డాడు. ప్రసిద్ధ జర్మన్ రచయిత, నోబెల్ పురస్కారం పొందిన నవలాకారుడు హెర్మన్ హెస్, మరొక ప్రసిద్ధ రచయిత Man Without Qualities రచించిన రాబర్ట్ ముసిల్, సుప్రసిద్ధ ఫ్రెంచి నవలారచయిత మార్సెల్ ప్రూ కూడా ఊ తావో జూ దారిలోనే నడిచారని లిండ్ క్విస్ట్ ఎంతో ఆసక్తికరంగా వ్యాఖ్యానిస్తాడు.

కాని ప్రపంచం అందరికీ ఆ అవకాశం ఇవ్వదు. ముఖ్యంగా, ఇండియా చూసిన తరువాత తానంతదాకా నిర్మించుకున్న కళాహర్మ్యం పూర్తిగా కుప్పకూలిపోయిందని లిండ్ క్విస్ట్ రాస్తాడు. అపారమైన ఆత్మవంచన, మనిషికి మానవత్వంగాని, రాజ్యంగాని, సంఘంగాని, సంప్రదాయంగాని ఏదీ కూడా రక్షణ ఇవ్వలేని స్థితిలో భారతీయసమాజం అతడికి కనిపించింది. అది 1967 లో మాట. ఇప్పటి మన సమాజాన్ని చూస్తే అతడేమంటాడో? ప్రతి ఒక్కరూ కొద్దిగా కష్టపడితే ఈ ప్రపంచాన్ని ప్రతి ఒక్కరికీ నివాసయోగ్యంగా మార్చగలమనే నమ్మకం తనకుండేదనీ, కాని ఇండియా లో ఆ నమ్మకం పూర్తిగా కుప్పకూలిపోయిందనీ, తన భావాలు కేవలం కల్పనలు మాత్రమేనని తెలిసొచ్చిందనీ రాస్తాడు.

నిష్టుర యథార్థం ముందు కళాకారుడు మనిషిగా ప్రవర్తించవలసిన పద్ధతి ఏమిటని భారతీయ సాహిత్యవేత్తలూ, కళాకారులూ యుగాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. కొందరు,ఈ లోకంలోనే ఈ మనుషుల మధ్యనే తాము కూడా నిలబడి వాళ్ళ కష్టసుఖాలు పంచుకోవాలనుకున్నారు. మరి కొందరు ఊ తావూ జూలానే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి తిరిగిరాని తీరాలకు చేరాలనుకున్నారు. ఇంకొందరు తమ కళాస్వప్నలోకపు ద్వారం దగ్గరే నిలబడి ఉంటారు, ఇటు వైపు రాలేరు, అలాగని పూర్తిగా అటువెళ్ళిపోరు.

లిండ్ క్విస్ట్ పుస్తకం పూర్తిగా చదివేసేటప్పటికి అర్థరాత్రి దాటింది. కాని ఆ పుస్తకం నాకేమీ తోవ చూపించలేకపోయింది. ఇంకా చెప్పాలంటే, మరింత వేదన కలిగించింది. మరీ ముఖ్యంగా ఈ వాక్యం: We have created a lifestyle which makes injustice permanent and inescapable.

ఇంతకీ ఊ తావో జూ తన చిత్రంలోకి తానొక్కడే ఎందుకు వెళ్ళిపోయినట్టు?About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

క్షేత్రయ్య పదములు

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు మార్చి 2014లో ...
by అతిథి
2

 
 

Tagore: The World Voyager

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు జనవరి 2014లో ఫ...
by అతిథి
0

 
 

Reduced to Joy – Mark Nepo

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2014లో ఫేస్బు...
by అతిథి
0

 

 

సాదత్ హసన్ మంటో కథలు

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2013లో ఫేస్బు...
by అతిథి
1

 
 

Poems in Translation: Sappho to Valéry

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2013లో ఫేస్బు...
by అతిథి
2

 
 

Confucius from the Heart

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2013లో ఫేస్బు...
by అతిథి
1