పుస్తకం
All about booksపుస్తకభాష

April 8, 2015

గృహభంగం

More articles by »
Written by: Srinivas Vuruputuri
Tags: ,

ప్లేగు భయం సద్దు మణిగి రేపో, మాపో షెడ్డులనొదిలేసి రామసంద్రం గ్రామస్థులు మళ్ళీ ఊళ్ళోకి అడుగుపెట్టబోతున్న సమయం.

“నువ్వింట్లో ఏరోజు అడుగెట్టావో చుప్పనాతి, ఇల్లు గుల్లయిపోయింది. పొలమంతా తుడుచుకపోయింది. వూళ్ళోకి వస్తే నువ్వు, నీపిల్లలు వేరే వుండండి. మేమింట్లో వుంటాం” అని తెగేసి చెప్పింది గంగమ్మ తన కోడలు నంజమ్మతో.
***

కొందరుంటారీ లోకంలో – “మాట పెళుసు-మంచి మనసు” ధోరణి మనుషులు. గంగమ్మగారు అలాంటిది కాదు. మనసా, కర్మణా కూడా ఆవిడ దుష్టురాలే. సూర్యకాంతాన్ని ఛాయాదేవితో హెచ్చవేస్తే వచ్చే లబ్ధం గంగమ్మ. దుష్టురాలే కాదు, మూర్ఖురాలు కూడా. తన హితవేమిటో తనకే తెలియకపోవటం, రేపటి గురించి ఆలోచన లేకపోవటం, నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందన్న ఎరుక లేకపోవటం, నిరుడు చేసిన తప్పుల కన్నా పెద్ద తప్పులను ఎప్పటికప్పుడు చేస్తూ పోవడం – ఇవీ ఆవిడ లక్షణాలు.

బద్ధకం, పెంకితనం, మొరటుదనం – ఆవిడ పిల్లలు తమకు తాము కూర్చిపెట్టుకున్న అదనపు విలువలు. మొదటి అధ్యాయం నాలుగు పేజీల లోపే – తలో రోకలి పుచ్చుకొని, ఇంటికప్పెక్కి కనబడతారు పదహేనేళ్ళ చెన్నిగరాయడూ, పదమూడేళ్ళ అప్పణ్ణయ్యా, తల్లి మీద కోపం చూపించుకునేందుకు బిళ్ళపెంకులను చితగ్గొట్టే ఉద్యమంలో నిమగ్నులై.

ఆ రోజు రాత్రి, చెరువవతలకి పారొచ్చిన అప్పణ్ణయ్య బీడీ వెలిగించి పారేసిన అగ్గిపుల్ల రగిల్చిన నిప్పు – ఊళ్ళోవాళ్ళ పొలాలను, గానుగలను తగలేసి నష్టపరిహారపు చెల్లింపుల కోసం చేసిన రెండువేల రూపాయల అప్పుగా రూపం మార్చుకుంది. ఏడేళ్ళ తరువాత వడ్డీ, పైవడ్డీ లెక్కలతో నాలుగున్నరవేల బకాయీ అయి కూర్చుంది.

“తిన్నది కాదు-చేసింది లేదు” బాపతు అప్పునెందుకు తీర్చాలని గంగమ్మ పంతం. ఊరి గద్దల్లో ఒకడైన రేవణ్ణశెట్టి అనే పేకాటరాయడు ఎగదోసి కోర్టులో దావా వేయిస్తే, అది కాస్తా వీగి కూర్చున్నది. అయింది చాలనట్లు, ఎదుటిపక్షపు కోర్టు ఖర్చులూ తామే చెల్లించుకోవాల్సి వచ్చింది. పొలం అమ్మేసుకున్నాక వచ్చిన రెండువేల రూపాయలు – చిల్లర అప్పులు తీర్చడానికీ, ఆ ఊరి పురోహితులైన అయ్యాశాస్త్రీ-అణ్ణాజోస్యులు గంగమ్మను ఉబకేసి చేయించిన ఋషిపంచమి వ్రతం కోసమూ హరించుకుపోయాయి.

అదిగో, ఆ వ్రతం ముగిసిన వారానికే, గంగమ్మ తన కోడలిని “ఇంట్లోంచి” వెళ్ళిపొమ్మని ఆదేశించింది!
***

ఆరోజు మధ్యాహ్నం నిద్రకుపక్రమిస్తున్న తన భర్త చెన్నిగరాయలతో అత్తగారి ఆదేశాన్ని తెలిపి, ఏం చేద్దామో చెప్పమని అడిగితే –

“నిన్నూ, నీ నడతను చూసే మా అమ్మ అలా అంది. నువ్వూ, నీ పిల్లలూ ఏమైనా చేసుకొండి…నేను మా అమ్మతోటే వుంటాను” అని ముసుగు తన్ని పడుకున్నాడు ఆ పతిదేవ మహానుభావుడు. పచ్చగా ఉన్న చోట తిని వెచ్చగా ఉన్న చోట పడుకోవటం – శ్రీవారి జీవితలక్ష్యాలు. రేపటి గురించి ఆలోచించటం, బాధ్యత నెత్తిన వేసుకోవటం, చొరవ తీసుకొని ఒక పని చేయటం తన సుకుమార ప్రవృత్తికి ఎంతమాత్రమూ సరిపడవు.

అప్పటికి నంజమ్మకి కొంచెం అటుదిటుగా ఇరవయ్యేళ్ళుంటాయేమో. ఇద్దరు పిల్లలు. ఆరునెలల గర్భం. పుట్టినింటికెళ్ళి తలదాచుకోగలిగే అవకాశం లేదు. పరిస్థితులతో పోరాటం వినా మార్గం లేదు. మంచిమాట, గుండె ధైర్యం, కష్టించే తత్త్వం, నిలకడగా ఆలోచించే స్వభావం – ఇవీ తన ఆయుధాలు.

తలపైకో కప్పు సంపాదించుకోవాలి. వండుకునేందుకు పాత్రలు కావాలి. ఆ పాత్రల్లోకి సంభారాలు. “రేపేం పెడతాం, పిల్లలకి?” అనే ప్రశ్న తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ఈయేడే కాదు, ఆ పైయేడు, ఆపైయేడు… అంతకన్నా ముఖ్యంగా, పిల్లలను చదివించి ప్రయోజకులుగా దిద్దుకోవాలి.

అదే ఊళ్ళో ఎప్పట్నుంచో ఉంటున్న మాదేవయ్య అనే సన్యాసీ, పొరుగున ఉన్న కురబరహళ్ళి గ్రామ మునసబు గుండేగౌడ, ఎనభయ్యేళ్ళ వయస్సులోనూ నిలబడి మనవరాలికి పురుడుపోసేందుకొచ్చిన నాయనమ్మా – బతగ్గలమన్న భరోసా ఇచ్చారు. రెండో సంతానం రామణ్ణ కడుపులో ఉన్నప్పుడు, తిమ్మలాపురం దేవరసయ్యగారి దగ్గర నేర్చుకున్న కరణం లెక్కలు ఇప్పుడు అక్కరలోకి వచ్చాయి. పది మైళ్ళ దూరం ఎక్కీ దిగీ వెళ్ళి మోదుగాకులను తెచ్చుకొని విస్తళ్ళు కుట్టి అమ్మి ఇంకాస్త ధైర్యాన్ని సంపాదించింది.

ఎప్పటికప్పుడూ చికాకులే.

“అమ్మతోటే వుంటాను” అన్న స్వార్థి, అదేరోజు మధ్యాహ్నం భోజనానికి హాజరై రాత్రికల్లా పడకచుట్టను చంకలో పెట్టుకొని దిగబడ్డాడు. జరిగినంతకాలం భార్య సంరక్షణలో ఆవిడ వల్లకానప్పుడు పుట్టింట్లో. చేతిలో నాలుగు డబ్బులుంటే కన్న పిల్లలకు కూడా పెట్టకుండా హోటల్లో మేసి వచ్చేవాడు. చిన్ని మా చెన్నిగరాయడి పొట్టకు శ్రీరామరక్ష.

అత్తగారి అక్కసూ, నిష్కారణ వైరమూ వీడని నీడల్లా వెన్నాడాయి. నోటికొచ్చినన్ని తిట్లు సరేసరి, కరణీకం డబ్బుల్లో వాటా ఇమ్మని పోరు. అవకాశం దొరికినప్పుడల్లా, గ్రామ పెద్దలను వెంటేసుకొచ్చి వీరంగం ఆడేది. అయ్యాశాస్త్రి-అణ్ణాజోస్యుల జంటను పురమాయించి నంజమ్మను కులంలోంచి వెలేసేందుకు శృంగేరి నుంచి లేఖను పట్టుకొచ్చింది కూడా.

నిజానికివన్నీ చిన్న గీతలే – కరువు, యుద్ధం, దరిమిలా ఆకాశాన్నంటిన ధరలతో పోలిస్తే. ఇంకా పెద్ద విలన్ – “పిళేగమ్మ మారి” అని జనం పిలుచుకున్న ప్లేగు వ్యాధి. గద్దలా వాలింది. అప్పుడే పెళ్ళైన కూతురు పార్వతినీ, కనీసం రెవిన్యూ ఇనస్పెక్టరైనా కాకపోతాడా అని తల్లి ఆశ పెంచుకున్న రామణ్ణనూ తన్నుకుపోయింది. ఒకేరోజున. రెండుమూడు గంటల వ్యవధిలో. ఇంకొన్నాళ్ళకి నంజమ్మనూ పొట్టనబెట్టుకుంది.

ఎనిమిదేళ్ళ విశ్వం మిగిలాడు. మేనమామ ఇంట్లో గొడ్డుచాకిరీ చేస్తూ, గొడ్డులా దెబ్బలు తింటూ. చురుకుదనాన్ని, జీవితోత్సాహాన్ని కోల్పోతూ. ఎట్టకేలకు రామసంద్రాన్నొదిలిపోతున్న మాదేవయ్యగారే పూనుకొని ఆ పిల్లాణ్ణి అక్కణ్ణుంచి తప్పించి తన కూడా తీసుకెళ్ళేదాకా.
***

స్వీయ జీవితానుభవాల నేపథ్యంలో భైరప్పగారు 1970లో రాసిన ఈ నవల ఆయన రచనల్లో ప్రత్యేకంగా గణించదగ్గది.

జీవితాన్ని చించుకొని పుట్టిన కథ, చేయి తిరిగిన చిత్రకారుడు ఓ పెద్ద కాన్వాస్ మీద సుదీర్ఘ కాలం శ్రమించి రచించిన తైలవర్ణచిత్రాలను గుర్తుకు తెచ్చే వాతావరణ కల్పన – ఈ రెండూ ఈ నవలకి ఆయువుపట్లు.

నేషనల్ బుక్ ట్రస్టువారు తమ “అంతరభారతీయ పుస్తకమాల”లో ఈ పుస్తకాన్ని అనువదింపజేసి, చౌక ధరకు అందించి పుణ్యం కట్టుకున్నారు. ఏకకాలంలో ఆ సంస్థ మీద గౌరవమూ, కోపమూ, జాలీ కలిగాయి నాకు. ఇలాంటి సంస్థలు నష్టాల్లో పడి మూసుకుపోయే రోజొస్తుందేమో అని అనుమానం కలిగినప్పుడు దిగులు వేస్తుంది.

ఈ నవలను తెలుగులోకి అనువదించినాయన పేరు “సంపత్”. అసలు పేరేమిటో తెలియదు కానీ అద్భుతమైన అనువాద శైలి ఆయనది. భైరప్పగారివే ఒకట్రెండు పుస్తకాలను ఇంగ్లీషులో చదివి విసిగి ఉన్న నాకు ప్రాణం లేచి వచ్చింది కన్నడ కస్తూరి-తెలుగు తేటల కలగలుపైన ఈ అనువాద నవలను చదువుతుంటే.
***

అదనపు వివరాలు:

1. కథా కాలం: 1920 – 1945; కథాస్థలం: అప్పటి మైసూరు రాజ్యంలో తుమకూరు జిల్లాలోని కొన్ని ఊళ్ళు
2. నేషనల్ బుక్ ట్రస్టు వారి అనువాదం నవోదయా, విశాలాంధ్ర వంటి అంగళ్ళలో దొరకవచ్చును. వంద రూపాయల ధర ఉన్న ఈ పుస్తకం నాకు నిరుటి పుస్తక ప్రదర్శనలో సగం ధరకే దొరికింది.
3. మరికొన్ని సమీక్షలు/పరిచయాలు (1, 2, 3)About the Author(s)

Srinivas Vuruputuri

శ్రీనివాస్ వురుపుటూరి; హైదరాబాద్‌లో నివాసం; సాఫ్ట్‌వేర్ ఉద్యోగం; చదవడం హాబీ; చర్చించడం సరదా; రాయాలంటే బద్ధకం, బోలెడన్ని సందేహాలున్నూ.3 Comments


 1. varaprasaad.k

  నాయనా శీను మంచి కథ చెప్పావు,కాస్త బద్ధకం తగ్గించుకుని మరిన్ని మంచి కతలు చెపితే సంతోషం.


 2. రవి

  ఏడాది క్రితం కొన్న పుస్తకం. కాస్త చదివిన తర్వాత ఈయనదే “పర్వ” నవల ఆగకుండా చదివించింది. ఆ పై గృహభంగం అటకెక్కి ఇంకా దిగలేదు. ఇప్పుడు దింపాలి.


 3. Jampala Chowdary

  మంచి పుస్తకాన్ని చక్కగా పరిచయం చేశారు.
  గృహభంగంలో నంజమ్మ, శివరామకరంత్ ‘మరల సేద్యానికి’ (http://hyderabadbooktrust.blogspot.in/2015/01/blog-post_28.html ) లో నాగమణిల పాత్రలకు, వారి కుటుంబాలకు ఉన్న సారూప్యత పరిశీలించతగ్గది.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

సార్థ

“సార్థ” – ఎనిమిదవ శతాబ్ద ప్రథమ పాదం నాటి భారతదేశ చరిత్రలో పొదగబడ్డ కథ. “మన దేశ ...
by Srinivas Vuruputuri
2

 
 

భైరప్పగారి ‘దాటు’

1975లో కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతిని అందుకున్న భైరప్పగారి దాటు నవలను ఓ నాలుగేళ్ళ క్...
by Srinivas Vuruputuri
8

 
 

ఆవరణ – ఎస్.ఎల్.భైరప్ప

“ఆవరణ అంటే నిజాన్ని దాచివేయటం. విక్షేపం అంటే అబద్ధాన్ని ప్రచారం చేయటం. వ్యక్తి స్థ...
by Srinivas Vuruputuri
7

 

 

కులాలను అధిగమించే దాటు ఎప్పుడు?

‘గతం నీకు చూపించే దారి బ్రతుకు మీద కులం గుర్రాల సవారీ!’ అంటారు వాస్తవిక దృష్టితో ...
by అరుణ పప్పు
10

 
 

మహాభారతానికి ఒక పంచనామా – పర్వ

ప్రసిద్ధ కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్ప గారి ‘పర్వ’ నవల చదవడానికి నాకు ప్రేరణ కలిగించ...
by nagamurali
44