భారతీ నిరుక్తి (వేద స్వరూప దర్శనం)

వ్యాసకర్త: Halley
*************
ఈ పరిచయం హరి సోదరులు రచించిన “భారతీ నిరుక్తి (వేద స్వరూప దర్శనం)” గురించి. తెలుగులో నేను చదివిన పుస్తకాలలో నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన పుస్తకాలలో ఇది కూడా ఒకటి అని చెప్పగలను. పుస్తకము లభించు చోటు archive.org.

నేటి కాలంలో “భారతీయత”, “హిందూ మతము”, “సనాతన ధర్మము” వంటి విషయాల పైన రక రకాల ఆభిప్రాయాలు చలామణీలో ఉన్నాయి. గత కొద్ది కాలంగా వైదిక సంస్కృతి తాలుకా ప్రధాన విశేషాలను తెలుసుకోవాలనే కుతూహలం నాలో పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విషయం పైన ఆంగ్లంలో రాసే రచయితలు చాలావరకూ outsider చుచినట్టుగా రాయటం గమనించాను నేను. ఒక వేళ వారి వారి ఉద్దేశాలు మంచివైనా కూడానూ వారి ఆలోచనా విధానములో పరిశోధనా పద్దతిలో పాశ్చాత్య ఛాయలు కొంచెం ఎక్కువగానే కనపడ్డాయి నాకు. ఉదాహరణకి “వేదము అపౌరుషేయం అనాది” అన్న విషయమును తీసుకుంటే, ప్రతీ దానికీ ఒక నిశ్చితమైన మొదలు తుది ఉండాలి అని నమ్మే రచయిత రాసే విధానము వేరుగా ఉంటుంది, కాలస్వరుపమును గురించి తద్భిన్నమైన అభిప్రాయం కలిగెడి రచయిత రాసే విధానము వేరుగా ఉంటుంది అదే విధంగా ఆయా రచయితలు పుట్టి పెరిగిన వాతావరణమూ వారు చదువుకున్న పాఠశాలలూ వాటి తాలూకా విద్యా విధానాలూ వారు వైదిక సంస్కృతిని చూసెడి విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని కూడా అనిపించింది. ఈ విషయం పైన నేను చదివినంతలో కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి “హిందూ ధర్మము“, విశ్వనాథ సత్యనారాయణ నవలా సాహిత్యము, పీఠికలూ, సాహితీ వ్యాసాలూ తదితర సాహిత్యమూ శ్రీపాద “అనుభవాలు జ్ఞాపకాలూనూ” లోని కొన్ని భాగాలూ, పుల్లెల శ్రీ రామచంద్రుడు గారి సాహిత్యమూ వగైరాలు చదివినప్పుడు ఒక రకమైన ప్రమాణ భావమూ గురు భావమూ కలగటం జరిగింది. ఆ విధమైన భావన ఈ పుస్తకం చదివాక కూడా కలిగింది.

ఈ పుస్తకంలో మొదట చెప్పుకోవలసింది వంద పేజీలకు పైగా ఉన్న పీఠికలూ పరిచయాలూ పండితాభిప్రాయల గురించి. నన్ను మొదట ఈ పుస్తకానికి కట్టిపడేసినది ఈ పీఠికలూ పండితాభిప్రాయలే. ఈ పరిచయంలో ప్రధానంగా వీటి గురించే ప్రస్తావన.

దాదాపు ముప్పై పేజీలు పైగా ఉన్న పీఠిక ‘సాంగ స్వాధ్యాయ భాస్కర’ కుప్పా లక్ష్మావధాని రాసినది. ఈ పీఠిక ఒక్కటి చదివి అర్థము చేసుకుంటే పుస్తక సారం అర్థమవుతుంది. చారిత్రకులు కేవల చరిత్ర కల్పనా లక్ష్యముతో వేద పరిశీలనము కావించారనీ వారి సృష్టి క్రమ పద్ధతి వేరనీ శృతి సంప్రదాయము వేరనీ అన్నారు. మొదట జ్ఞాన ప్రకాశాధిక్యము కలిగిన సృష్టి రాను రానూ జ్ఞాన ప్రకాశము సన్నగిల్లి, సాంద్రతర అజ్ఞానావరనాధిక్యము కలిగిన సృష్టి విస్తరిల్లింది అనటము శ్రుతి సంప్రదాయమనీ, అదే చారిత్రకుల దృష్టిలో అయితే మొదట సాంద్రతమగు అజ్ఞానముతో (జడమగు పదార్థజాతముతో) సృష్టి యుపక్రాంతమై క్రమ క్రమముగా విజ్ఞానము వికసించి వికసించి మానవ సృష్టి అయ్యెనని అంటారనీ ఇదే రెంటికీ ప్రధాన భేదమనీ అన్నారు. మానవులు బ్రహ్మ భావమును పొందుటకు ఉపకారక మగుచూ దేశీకుని వలెను, చెలికానివలెను, సఖివలెను వెంటనంటియుండి పరమ శ్రేయస్సును సమకూర్చేదే వేదమని భారతీయుల ఆశయమనీ అన్నారు. అయితే పాశ్చాత్య చరిత్రకారులూ వారి అనుయాయులు ఈ తీరుగా వేద వాక్యార్థ విచారము చేయలేదనీ వేదములు ఆదిమ వాసుల రచనలు అన్నారనీ వారు మొదట ప్రకృతి దృశ్యాలను సూర్యాది జ్యొతిస్సులనూ చూసి భ్రమించి రాసారనీ క్రమముగా అరణ్యకోపనిషద్భాగ రచనా కాలము నాటికి దేవతాది విజ్ఞానవిషయమున క్రమ వికాసముకలిగినదని ఈ చరిత్ర కారులు అంటారనీ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ప్రాచ్యాప్రాచ్య సిద్ధాంతాలలో ఉన్న తేడాలను విశదీకరించటానికే ‘భారతీ నిరుక్తి’ అన్న ఈ గ్రంథం అవతరించిందని అన్నారు.

ఇక తరువాతి పరిచయం కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసినది. విశ్వనాథ ఈ గ్రంథానికి నేను పీఠిక రాస్తాను అని మొదట అంటే హరి సోదరులు సహృదయంతో ఒప్పుకున్నారట. అయితే కంచి కామ కోటి పీఠాధిపతులునూ కుప్పా లక్ష్మావధాని గారునూ అప్పటికే పీఠికాకర్తలుగా నిర్ణయింపబడ్డారని తెలుసుకొని “అయ్యా! వారు వ్రాయగా నేను వ్రాయుట ఏమి? పొరపాటున అన్నాను. క్షమించవలయు”నని అన్నారట! ఈ గ్రంథము పాశ్చాత్య చరిత్ర కారుల యొక్కయు, పాశ్చాత్య పండితుల యొక్కయు, వారి యనుయాయుల యొక్కయు సంప్రదాయేతర భావములను ఖండించుటకై నిర్దేశింపబడినదనీ అచ్చముగా సంప్రదాయమును పోషించుటకు వ్రాయబడినదనీ అన్నారు. వేదములో ఒకనాటి సాంఘిక రాజకీయాది చరిత్రను చూచుట న్యాయము కాదనీ విశ్వనాథ తన మార్కు స్టైలులో ఒక ఉదాహరణ ఇచ్చారు. పరమ సౌందర్యవతి యొక్క శరీరావయములను వర్ణించునప్పుడు ఆమె లావణ్యము ఆమె శృంగార రసమును పరిత్యజించి ఆమె ఎన్ని పౌండ్ల బరువున్నది? ఆమె కరచరణముల దైర్ఘ్యమెంత? ఆమె ఎంత ఎత్తు ఉన్నది అని విచారించటం పాశ్చాత్యుల తత్త్వమనీ చురకంటించారు. ఇదే విషయముపై తన పరిచయంలో మరొక చోట వేదము యొక్క నిత్యత్వమును గురించి ప్రాచ్యాప్రాచ్య దృక్కోణములోని తేడాలను తెలుపుతూ ఇలా అన్నారు. ప్రతీ వాడు గాయకుడు అవటం లేదు. ప్రతీ వాడు భాషా వేత్త అవటం లేదు. ప్రతీ వాడు కవి అవటంలేదు. ఎందుచేత? అన్న ప్రశ్న ఉదయిస్తే, ఈ దేశము తత్తపూర్వజన్మ సంస్కార విశేషమని సమాధానమిస్తే పరదేశములు దీని గురించి ఆలోచించవనీ, వారికి ఆలోచించుట బరువనీ, ఆ వ్యక్తి గొంతు చీల్చి వాని కంఠ నాళములు పరీక్షించి నిర్ణయించుటకు ప్రయత్నిస్తారనీ లేదా వాని బుర్రలోని మెదడులను పరీక్షిస్తారనీ, అందువలన దాని మార్గము వేరు మన మార్గము వేరనీ అన్నారు.

‘అవధాన శిరోమణి’ కాశీ కృష్ణాచార్యులు రాసిన పరిచయం మరొకటి. సర్వభాషా మాతృ భాష అయిన దేవ భాష (సంస్కృత భాష) యొక్క ప్రాశస్త్యము తెలియవలయు నంటే ఈ గ్రంథము కంటే నుత్కృష్టకర మగు గ్రంథము పూర్వ కాలమునందు కానీ ఉత్తరకాలమునందు కానీ ఉండి ఉండదు అని అన్నారు.

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారిదీ, ‘వేద భాష్య విశారద’ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిదీ, కుప్పా శ్రీ ఆంజనేయ శాస్త్రి గారిదీ చిన్న పరిచయ వ్యాసాలు ఉన్నాయి. ఇవి కాక కొన్ని ఆంగ్ల పరిచయ వ్యాసాలూ దివాకర్ల వెంకటావధాని గారి వ్యాసమూ, ‘ఆర్ష విద్యాభూషణ’ జటా వల్లభుల పురుషోత్తం గారిదీ, ‘మహోపాధ్యాయ, బాల వ్యాస, తర్క వ్యాకరణ వేదాంత కేసరి’ శ్రీ వారణాసి సుబ్రమణ్య శాస్త్రి గారిదీ, ‘సాంగ వేద సామ్రాట్, మీమాంస విద్యా ప్రవీణ’ రేమిల్ల సూర్య ప్రకాశ శాస్త్రి గారిదీ, ‘వ్యాకరణ రత్న, వ్యాకరణాచార్య, ఉపనిషదర్థ వాచస్పతి, దర్శనాచార్య’ శ్రీ పేరి సూర్య నారాయణ శాస్త్రి గారిదీ, మరెందరో పండితులదీ పరిచయ వ్యాసాలు ఉన్నాయి. ఇంత మంది పండితులను మెప్పించింది అంటేనే ఈ గ్రంథం ప్రాశస్త్యము తేట తెల్లమవుతోంది. ఇది కాక హరి సోదరులు స్వయముగా రాసిన ముప్పై పేజీలకు పైగా ఉన్న అవతారిక ఎంతో చక్కగా ఉంది. రెండు మూడు సార్లు చదివినా కుతూహలం తగ్గలేదు నాకు ఈ అవతారిక పై. దాదాపు ముప్పై ఏళ్ళ పరిశోధన తరువాత వెలువడ్డ గ్రంథమట ఇది! ఇక ‘వేదములు’ అని అప్పటి కామ కోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి వ్యాసం యొక్క తెలుగు అనువాదం కూడా ఈ గ్రంథములో పొందు పరచారు .

‘ఉభయ మీమాంస విశారద’ వీరేశ్వర కృష్ణ డొంగ్రె శాస్త్రి గారు మరియు ‘సాంగ స్వాధ్యాయ భాస్కర’ సన్నిధానం లక్ష్మి నారాయణ మూర్తి గారూ రాసిన పరిచయ వ్యాసములో అన్నట్టుగా వేదము అనాది సిద్ధమైనది పురుష ప్రణీతము కానిదీ అన్న సిద్ధాంతము నందు శ్రద్ధ లేని ఆధునిక చరిత్ర కారులు వైదిక వాజ్ఞ్మయము పురుష ప్రణీతమనియు అందలి వేర్వేరు భాగములు వేర్వేరు కాలములలో రచింపబడినవనియు, అందున ఋగ్వేదము అతి ప్రాచీన మనియు, పిదప క్రమముగా బ్రహ్మణారణ్య కాది గ్రంథములు బయలుదేరినవనియు కొన్ని యుహాలు చేసారు. ఇట్టి ఊహలను ఆధారము చేసుకున్న చారిత్రిక గ్రంథాలు ప్రస్తుత కాలమున విశ్వవిద్యాలయాదులలో ప్రధాన పాఠ్య గ్రంథాలయ్యాయి. అందువలన అనాది సిద్ధముగా భారతీయులకు వేదములందు ఉన్న శ్రద్ధ తగ్గిపోయింది. దీని వలన వైదిక ధర్మము యొక్క మూల స్తంభానికే ఆఘాతము ఏర్పడింది. నేను చదివిన పాఠాలు కూడా నాకు ఇవే చెప్పాయి. ఇటువంటి పుస్తకములు చదివినప్పుడు మాత్రమే అసలు సంప్రదాయం ఏమి చెబుతోంది అన్నది తెలిసేది. నిజానికి ‘ఓపెన్ మైండ్’ తో ఉండాలి అని నూరి పోసే మేధావులు అంతానూ ఇది ఆధునిక చరిత్ర కారుల వాదనా ఇది సాంప్రదాయికుల వాదనా ఇది కమ్యునిస్టుల వాదనా అని అంటూ ఇలా అందరి వాదనా వినిపిస్తే ఎవరి చిత్త సంస్కారాన్ని బట్టి వారికి నచ్చిన పార్టీలో వారు చేరిపోతారు కదా! ఇలా పాఠ్య గ్రంథాలను మార్చి వేసి అంతర్జాలం నిండా కూడా అవే వాదనలతో నింపేస్తే మా బోటి వారికి మిగిలిన perspectives తెలిసేది ఎలాగు! హరి సోదరుల పుణ్యమా అని ఈ మాత్రమైనా తెలిసింది. ఇది జీవితాంతం మళ్ళీ మళ్ళీ reference కు వాడుకునే పుస్తకం నామటుకు నాకు. వేరే ఎవరికైనా కూడా నచ్చుతుంది ఏమో అన్న ఉద్దేశ్యంతో రాసిన పరిచయం ఇది. తెలుగులో ఉన్న ఇటువంటి గొప్ప పుస్తకాలను గురించి రాసే వారే కరువయ్యారు అంతర్జాలంలో. ఈ పుస్తకం గురించి ఎంత వెతికినా ఏమీ కనపడలేదు నాకు!

You Might Also Like

5 Comments

  1. శరత్ కుమార్

    చాలా థాంక్స్ ప్రసాద్ గారు,

  2. ka va na sarma

    పుస్తకం చదవాలని అనిపించేలా వ్రాసిన పరిచయం
    క వ న శర్మ

  3. శరత్ కుమార్

    ఈ పుస్తకం హార్డ్ కాపీ ఎక్కడైనా దొరుకుతుందా? దయచేసి చెప్పగలరు.

    1. prasad

      భారతి నిరుక్తి హార్డ్ కాపీ హైదరాబాద్ కాచిగుడా ఆర్య సమాజ్ మందిరం ఎదురుగ ఉన్న సందులోని గోపాల్ బుక్ హౌస్ లో దొరుకుతుంది.

  4. bmaitreyi

    చాల బాగుంది మీ పిచ్ :). పెద్దవాళ్ళ పేర్లు మీరు రిఫర్ చేసిన తీరు మర్యాదగా ఉన్నది. ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?

Leave a Reply