ఫ్రెంచిపాలనలో యానాం

వ్యాసకర్త: బొల్లోజు బాబా
(ఈ వ్యాసం “ఫ్రెంచి పాలనలో యానాం” పుస్తకానికి బొల్లోజు బాబా గారు రాసుకున్న ముందుమాట. వ్యాసాన్ని పుస్తకం.నెట్ లో ప్రచురణకు పంపినందుకు వారికి ధన్యవాదాలు)
***************

నా రచనలకు మొదటి పాఠకుడిగా ఉంటూ నన్ను ప్రోత్సహించే ఓ సాహితీ మిత్రుడు, ఈ పుస్తకం వ్రాతప్రతి రూపంలో ఉన్నపుడు చదివి ‘‘ప్రపంచం జెట్టుస్పీడులో ముందుకు పోతూంటే ఈ పాత విషయాలు ఎవరికి కావాలి?’’ అంటూ ఓ మౌలికమైన ప్రశ్నను సంధించి నన్ను అయోమయంలో పడేసాడు. ఇదే విషయాన్ని నేను నా బ్లాగులో ప్రస్తావించినపుడు ప్రముఖ కవి అఫ్సర్‌ ‘‘స్థానిక చరిత్రల మీద ఎంత వీలయితే అంత పని జరగాలి. ఆ దిశగా మీరు అడుగు వేసినందుకు సంతోషంగా ఉంది’’ అంటూ వ్యాఖ్యానించి నాలో ధైర్యం నింపారు. నా బాల్యమిత్రుడు డా.సలాది “Those who cannot remember the past are condemned to repeat it” అనే George Santayana కొటేషన్‌ మెయిల్‌ చేసి ఉత్సాహాన్ని కలిగించాడు. వారికి నా ధన్యవాదాలు.

భారతీయులలో కనిపించే భిన్న కులాలు, అస్పృశ్యత, సతి ఆచారం, మతపరమైన మూఢత్వం, స్త్రీల అణచివేత, బాల్యవివాహాలు వంటివి, వ్యాపారనిమిత్తం వచ్చిన యూరోపియన్లకు భారతీయులపై ఆధిపత్యం సాధించటానికి మంచి ముడిసరుకుగా మారాయి. తాము భారతీయులకన్నా నాగరీకులమని, ఈ దేశాన్ని పాలించటానికి తాము అర్హులమని వారు భావించుకొన్నారు. ఆ విధంగా బ్రిటిష్‌ వారు బ్రిటిష్‌ ఇండియా, ఫ్రెంచి వారు ఫ్రెంచి ఇండియాను స్థాపించారు.

బ్రిటన్‌ పరోక్షపాలనను ప్రోత్సహించింది. తనకు అనుకూలంగా ఉండేవారిని ప్రోత్సహించి ప్రజలను నిర్లక్ష్యం చేసింది. తన కాలనీలలో జరిపే వ్యాపారాలకు బ్రిటన్‌ ప్రాధాన్యత నిచ్చింది తప్ప ఆయా ప్రాంతాలను తన దేశఅంతర్భాగాలుగా ఏనాడూ అనుకోలేదు.

ఇక ఫ్రాన్స్‌ విషయానికి వస్తే, 1784 లో జరిగిన ఫ్రెంచి విప్లవ ఫలితంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆలోచనలను ఫ్రెంచి వారు నరనరానా జీర్ణించుకొన్నారు. అంతేకాక డిస్కార్టెస్‌, రూసో, వోల్టెయిర్‌ వంటి మేధావుల తాత్విక చింతనలు ఫ్రాన్స్‌ విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసాయి. తదనుగుణంగా ఫ్రాన్స్‌ తనకాలనీల ప్రజలను పరిపాలనలో భాగస్వామ్యులను చేసి ప్రత్యక్షపాలన జరిపింది. ఈ కాలనీల ప్రజలు మున్సిపల్‌ కౌన్సిల్‌, స్థానికమండలి, ఆలయ కమిటీ, హెల్త్‌ కమిటీ, విద్యా కమిటీ, ప్రజా సంక్షేమ కమిటీ, జుడిషియల్‌ కమిటీ వంటి వివిధ మార్గాల ద్వారా పాలనలో పాలుపంచుకోవటం పంతొమ్మిదో శతాబ్దం నాటికే మొదలైంది. అలా ఫ్రెంచి ప్రభుత్వం తన సంస్కృతి, భాష లను తన కాలనీల ప్రజలలో ఇంకేటట్లు చేసింది. ఇక్కడి ప్రజలకు ఫ్రాన్స్‌ లో ఉన్న ఫ్రెంచి పౌరులతో సమానంగా పౌర, రాజకీయ హక్కులను కల్పించింది. తన కాలనీల ప్రజలు ఏదో ఒకనాటికి ఫ్రాన్స్‌ లో నివసించే ఫ్రెంచి పౌరుల లాగ జీవించాలని ఆశించింది. ఫ్రెంచి వారు భారతదేశాన్ని వీడి వెళిపోతూ ఈ కాలనీల ప్రజలకు ఫ్రెంచి పౌరసత్వాన్ని ‘‘నిలుపుకొనే’’ ఒక సౌహార్థ్రపూర్వక ఐచ్ఛికతను ఇవ్వటం, ఈ కాలనీలను (పాండిచేరీ, మాహే, కారైకాల్‌ మరియు యానాం) ప్రత్యేకంగా చూడమని, ఇక్కడి ఫ్రెంచి సంస్కృతిని కాపాడమని భారతదేశంతో ఒప్పందం చేసుకోవటం దీనికి పరాకాష్ఠ. అందుకనే ఫ్రెంచిపాలనకు వ్యతిరేకంగా 1954 లో పెద్దఎత్తున ఉద్యమం జరిగినప్పుడు యానాంలో కూడా కొంతమంది ఫ్రెంచి పాలన కొనసాగాలని విఫల ఉద్యమం చేసారు.

కొద్దిగా చరిత్ర
1723 లో ‘కుంపనీ దె ఇందీస్‌’ అనే ఫ్రెంచి కంపెనీ ఒక వ్యాపార గిడ్డంగి ఏర్పాటు చేయటం ద్వారా ఫ్రెంచి వారు యానాంలో కాలుమోపారు. గోల్కండ రాజముద్ర కలిగిన ఓ పత్రం ద్వారా 1747 లో గోల్కండ నవాబు మహమ్మద్‌ అలీఖాన్‌ యానాం యొక్క సంపూర్ణ హక్కులను ఫ్రెంచివారికి ధారాదత్తం చేసాడు. ఆ తరువాత ఫ్రెంచి బ్రిటిష్‌ వారికి మధ్య జరిగిన యుద్ధాల కారణంగా యానాం మూడు సార్లు బ్రిటిష్‌ వారి పరమై చివరగా 1817 లో ఫ్రెంచి వారి చేతుల్లోకి వచ్చింది. అప్పటినుంచీ 13 జూన్‌, 1954 న ఫ్రెంచివారి నుంచి విమోచనం చెందే వరకూ యానాం ఫ్రెంచి పాలనలోనే ఉంది.

ఈ పుస్తకం గురించి
చరిత్ర పుస్తకాలు వ్రాసేటపుడు ‘‘మనం ఎవరి పక్షాన ఉండి వ్రాస్తున్నామనేది అత్యంత కీలకం’’. ఈ ప్రశ్న నాకు నేను వేసుకొన్నపుడు సాద్యమయినంత మేరకు నిష్పక్షపాతంగానే ఉన్నానని అనిపించింది. కొన్నిచోట్ల ఫ్రెంచి వారిని బ్రిటిష్‌ వారితో పోల్చినపుడు మాత్రం కొంత ఫ్రెంచి అనుకూల ధోరణి కనిపిస్తుంది.

ఈ పుస్తకాన్ని కేవలం ఫ్రెంచి రికార్డులపైనే ఆధారపడి వ్రాయలేదు. అప్పట్లో ఫ్రెంచి వారిచే ‘‘Jealous Nation’’ గా వర్ణింపబడిన బ్రిటిష్‌ వారి రికార్డుల నుంచి కూడా సమాచారాన్ని గ్రహించాను. ఆనందరంగ పిళ్ళై (పాండిచేరీ), శ్రీ సమతం కృష్ణయ్య, శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి వంటి స్థానికులు లిఖించిన విషయాలను సందర్భోచితంగా వాడుకోవటం జరిగింది. యానాన్ని సందర్శించిన ప్రపంచ యాత్రికుల ట్రావెలాగ్స్‌ నుంచి, ఆనాటి మత ప్రచారకుల Memoirs నుండి యానానికి సంబంధించిన ఆశక్తికర అంశాల్ని తీసుకొన్నాను. అయినప్పటికీ నా దృష్టికి రాని, నేను స్పృశించని అంశాలెన్నో ఉండవచ్చు.

ఒక కాలాన్ని ప్రతిబింబించే నమూనాగా ఉంటుందని ఈ పుస్తకంలో కొన్నిచోట్ల ఓ సంవత్సరానికి సంబంధించిన సంపూర్ణ గణాంకాలను పొందుపరచటం జరిగింది (ఉదా.1883 నాటి యానాం బడ్జెట్‌, 1914 లో యానాం ప్రజలు కట్టిన పన్నుల వివరాలు వంటివి). ఇవి చూడటానికి మరీ స్థానీయ వివరాలుగా అనిపించినా ఆనాటి సమాజాన్ని అర్థం చేసుకోవటానికి ఉపకరిస్తుందని భావిస్తున్నాను. అంతే కాక వర్జీనియా వుల్ఫ్‌ చెప్పినట్లు “ Nothing has really happened until it has been recorded” అన్న ఆలోచనతో కూడా.

యానాం చరిత్రకు సంబంధించి ఈ పుస్తకంలో రెండు కొత్త విషయాలను ప్రతిపాదించటం జరిగింది.

1. 1723-1758 మధ్యకాలంలో యానాంలో ఫ్రెంచి వారు సాగించిన కార్యకలాపాలపై సరైన సమాచారం లభించదు. ఈ సమయంలో వ్యాపారాలు లాభసాటిగా లేవని ఫ్రెంచివారు యానాన్ని విడిచిపెట్టిపోయారని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. కానీ ఫ్రెంచి వారు ఈ కాలంలో యానాన్ని విడిచిపెట్టి ఉన్నది రెండు సంవత్సరాలు మాత్రమేననీ, అదికూడా వ్యాపారాలు లాభసాటిగా లేకపోవటం వల్లకాక, స్థానిక రాజుల అలజడి కారణమని చూపుతూ, ఆ కాలంలో జరిగిన వ్యాపార లావాదేవీలు, పరిపాలించిన పెద్దొరల వివరాలు ఆధారాలతో ఇవ్వటం జరిగింది. (యానాన్ని పరిపాలించిన పెద్దొరల అనే చాప్టరులో).

2. యానాంకు ఫ్రెంచి వారు రాక పూర్వం ఈ ప్రాంతం ఒక డచ్‌ కాలనీగా ఉండేదన్న ఒక ఊహాగానం చలామణీలో ఉంది. ఫ్రెంచివారు రాకముందు ఈ ప్రాంతమంతా నివాసయోగ్యం కాని ఒక చిట్టడవిలా ఉండేదనటానికి ఆధారాలు కనిపిస్తున్నాయి కనుక నిస్సందేహంగా ఇది వదిలివేయబడిన డచ్‌ కాలనీ కాకపోవచ్చని చెప్పటం జరిగింది. ఇవే కాక యానాం ఫ్రెంచి సమాధులలోని వ్యక్తుల వివరాలు, బానిస వ్యాపారం, సతీసహగమన దురంతం, ఆనందరంగ పిళ్ళై డైరీలలో యానాం ప్రస్తావన, వివిధ పెద్దొరలు, యానాం రినౌన్సర్లు వంటివి యానాం చరిత్రకు సంబంధించి వర్జిన్‌ అంశాలు.

కృతజ్ఞతలు
ఈ పుస్తకానికి సందేశాన్ని వ్రాసి ఇచ్చిన యానాం శాసన సభ్యులు, గౌరవనీయులు శ్రీ మల్లాడి కృష్ణారావుగారికి,
ఈ రచనకు ఉపయోగపడే మంచి సమాచారాన్ని అందించిన హిస్టారికల్‌ సొసైటీ ఆఫ్‌ పాండిచేరీ అధ్యక్షులు షెవాలియర్‌ డా. నల్లం బాబు గారికి,

ఈ వ్యాసపరంపరను తమ పత్రికలో ఆగస్టు 2010 నుండి మార్చ్‌ 2011 వరకు ధారావాహికంగా ప్రచురించి ప్రోత్సహించిన, జనమిత్ర ఎడిటర్‌, దళితమేధావి, అంబేద్కరిస్టు శ్రీ పొనుగుమట్ల విష్ణుమూర్తి గారికి,

ఎప్పుడు కలిసినా ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ, ప్రోత్సహించే ప్రముఖ కవి ‘యానాం చరిత్ర’ పుస్తక రచయిత శ్రీ దాట్ల దేవదానం రాజు గారికి,

యానాం గురించి మంచి విశేషాలు వ్రాస్తున్నావు అంటూ ఆప్యాయంగా వెన్నుతట్టిన నా సాహితీ గురువు శ్రీ శిఖామణి గారికి,

అలనాటి రాజకీయ వేత్తలు, సాహితీ వేత్తల గురించి మంచి సమాచారాన్ని అందించిన మా తెలుగు మాస్టారు, పూజ్యులు అయిన శ్రీ సలాది రామ వెంకట సుబ్బారావు గారికి,

యానానికి సంబంధించిన అనేక డాక్యుమెంట్ల ను పరిశీలించే అవకాశం కల్పించిన పాండిచేరీ నేషనల్‌ ఆర్చైవ్స్‌ అధినేత శ్రీ ఎమ్‌.మురుగేశన్‌ గారికి,

ఈ పుస్తకంలోని అచ్చుతప్పుల్ని ఎంతో ఓపికగా సరిచేసిన ప్రముఖ పద్యకవి శ్రీ గుర్రం ధర్మోజీ గారికి,

ఈ పుస్తకం వ్రాయాలి అన్న నిప్పు నాలో రగిల్చిన మా తండ్రి గారు కీ.శే. శ్రీ బొల్లోజు బసవలింగం గారికి, ఈ ప్రయత్నంలో నన్ను ముందుకు నడిపించిన నా సోదరులు శ్రీ రవీంద్రనాథ్‌, దుర్గాప్రసాద్‌, వెంకటేశ్వర ప్రసాద్‌ లకు మరియు నా భార్య శ్రీమతి సూర్య పద్మ కు,

ఈ పుస్తకానికి అందమైన కవర్‌ పేజీ డిజైన్‌ చేసి ఇచ్చిన బాల్యమిత్రుడు శ్రీ చిన్నారి కి,

శ్రీ ఆకెళ్ళ రవిప్రకాష్‌, శ్రీ పి.ఎల్‌. ఆర్‌. స్వామి, శ్రీమతి విజయలక్ష్మి, చెల్లి రాం, మధునాపంతుల, ఫణి, సారధి, ప్రభాకర రావు లకు,

ఇంకా అనేక ఫ్రెంచి డాక్యుమెంట్లను ఇంగ్లీషులోకి తర్జుమా చేసిపెట్టిన గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌ వెబ్‌ సైటు రూపకర్తలకు, ఈ రచన సీరియల్‌ గా వస్తున్న సమయంలో ఫోన్లు చేసి, ఉత్తరాలు వ్రాసి అభినందించిన వారందరకూ..

సదా నమస్సులతో
భవదీయుడు
బొల్లోజు బాబా

***
పుస్తకం కినిగె.కాం లో లభ్యం

You Might Also Like

One Comment

  1. sridhar

    its a great book on colonial history of yanam an erstwhile french colony

Leave a Reply