­­­నాహం కర్తాః, హరిః కర్తా

వ్యాసకర్త: పి. రామకృష్ణ, విశాఖపట్నం
********
ఈ పుస్తకం శ్రీ వేంకటేశ్వరుని మహత్యాలని (సాధికారంగా) తెలిపే అధికారి స్వీయ అనుభవాల సమాహారం. శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ (పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్)­­­­­­­­­ గారు టి.టి.డి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నాలుగు సంవత్సరాలు పనిచేశారు. ఆ కాలంలో
ఆయనకు ఎదురయిన అనుభవాలను “సర్వసంభవామ్” (నాహం కర్తా, హరిః కర్తా) అనే శీర్షికలో వ్రాయటం జరిగింది. తరువాత కాలంలో ఎమెస్కో వారు పుస్తకంగా ప్రచురించారు.

ఇందులో మొదటి వ్యాసంలో తనకు జరిగిన స్వీయ అనుభవం “మోకాలి నొప్పి” ఆశ్చర్యంగాను, ఆలోచింప చేసేదిగాను ఉంటుంది.
రెండవ శీర్షికలో వర్షం గురించి యజ్ఙం చేయటం చాలా సార్లు విన్నదే.

ఇలా మొదటి కొన్ని శీర్షికలు చదివినప్పుడు ఇవి పూర్తిగా శ్రీ వేంకటేశ్వరుని లీలలు పుస్తకంగా అనిపిస్తుంది. నిజమే కదా ఇవన్నీ భగవంతుని లీలలే కదా, క్రొత్త ఏముంది అనుకోవాలి. కాని రచయిత ఇక్కడ అలా చెప్పలేదు. ఆయన ఉద్దేశ్యేం వేరే. ఏదైనా ఒక పని పూర్తవ్వాలంటే దానికి తగిన యెగ్యత, ప్రయత్నం, భగవదనుగ్రహం కావాలి అని చెప్పడం రచయత యెక్క ముఖ్యద్దేశ్యంగా కనిపిస్తుంది. సాధారణంగా మన ఇంట్లో ఒక బీరువా లేదా ఏదైనా వస్తువు ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మార్చలంటే చాలా ఆలోచించి, తగిన వాస్తు సలహాలు తీసుకొని, బంధువులని-స్నేహితులని సంప్రదించి చివరికి ఎందుకొచ్చిందిలే, ఏంచేస్తే ఏమువుతుందో, అన్న భయంతో పూర్తిగా ఆ పనినే విరమించుకుంటాం. అలాంటిది కొన్ని కోట్ల భక్తులకు ఆరాధ్య దైవమైన శ్రీవారి ఆలయంలో మార్పులు, చేర్పులు చేయాలంటే ఏంతో మానసిక సంఘర్షణకు లోనై ఉండాలి. సాధారణంగా ఏ ప్రభుత్వాధికారి అయినా ఏదైనా మంచిపని చేయాలని అనుకొన్నపుడు బయటి నుంచి బోలెడన్ని సవాళ్ళు, అవరోధాలు ఎదుర్కోవాల్సి వుంటుంది. కాని తన మనస్సుకి ఎటువంటి భయం, అపరాధ భావం వుండవు. కాని ఇక్కడ తన మనస్సుకి మంచి అనిపించినప్పటికి, తప్పు చేస్తున్నానా అనే భయం, నా వల్ల (నా నిర్ణయం వల్ల) భగవంతునికి లేదా భక్తులకు ఏదైనా చెడు జరిగే పరిస్థితి తలెత్తుందా అన్న అపరాధబావం కలగక మానవు. వాటన్నిటిని అధిగమించి ముందుకు పోవడం ఒక నూతన వ్యక్తిత్వవికాసానికి నాంది. ఆధునిక వ్యక్తిత్వవికాస పుస్తకాలేవీ కూడా యెగ్యత, భగవదనుగ్రహం గురించి మాట్లాడవు.

“మాష్టర్ ప్లాన్” అమలు విషయంలో మాత్రం భగవదనుగ్రహం కంటే ప్రసాద్ గారి పట్టుదల,సమయస్పూర్తి కనిపిస్తుంది. “ముఖ్యమంత్రి ఆగ్రహజ్వాలల్లో” అనే శీర్షిక ఈ పుస్తకంలో కంటే “అప్పుడేం జరిగింది” పుస్తకంలో (ఈ రచయతదే ఇంకొక పుస్తకం) సరిగ్గా ఇమిడివుండేది అని అనిపిస్తుంది.

“అద్భుతయజ్ఞం” శీర్షిక లో చైర్మన్ డాక్టర్ రమేశన్ అడిగిన ”రేపు ఇంకెవరన్నా స్వామిజీ వచ్చి మరో యాగం చేస్తానంటే ఏం చేస్తావ్” అన్న ప్రశ్నకు కూడ వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. “హరే,శ్రీనివాస” శీర్షిక లో దాసజీవితం గురించి ఎవ్వరికి తెలియని మంచి విషయాలు తెలుసుకొంటాం.

తీర్థం,శటారి గర్భగుడి గుమ్మం లోపల కాకుండా బైట ఇవ్వాలని రూలు పెట్టడం సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే ఇది సాంప్రదాయానికి, నమ్మకానికి సంబంధించిన విషయం. అలాగే శ్రీవారి సేవల విషయంలో కూడ ఒక సేవకు ఇంకొక సేవకు మద్య గ్యాప్ లేకుండా వరుసగా జరిపించడానికి నిర్ణయం తీసుకోవడం, ఇంకా వెయిటింగ్ సమయాన్ని తగ్గించడం, టాయలట్ సమస్య పరిష్కరించడం మెదలగు విషయాలు, పుస్తకాన్ని ఆపకుండా చదివిస్తాయి.

స్వామి వారి కళ్యాణోత్సవంలో చాల మార్పులు చేసినప్పటికి ఆ సేవను గర్భగుడి దాటించి బయటకు తీసుకొని వచ్చి మరింతమంది భక్తులకు అవకాశం కల్పించాలన్న ఆశయానికి స్వామివారి అనుగ్రహం లేకపోవడాన్ని ప్రసాద్ గారు అంగీకరించారో లేదో తెలియచేయలేదు. తిరుమలలో చాలాపెద్ద అపోహ ఏమిటంటే స్వామి దర్శనం ఒక్క వి.ఐ,పి లకు మాత్రమే వేగంగా లబిస్తుంది, సామాన్య భక్తులకు దొరకదు అని. కాని దర్శన భాగ్యం కేవలం స్వామి వారి అనుగ్రహం మీదే ఆధారపడి వుంటుంది అని నిరూపించే శీర్షిక “అర్థరాత్రి చీఫ్ సెక్రటరీ”.

పద్మావతి అతిథి గృహం,హైదారాబాద్ లో రామకృష్ణ మఠం నిర్మాణాల విషయంలో భగవదనుగ్రహం కంటే ప్రసాద్ గారి చొరవే ఎక్కువగా కనిపిస్తుంది. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్ణి గారి బాలాజీ పంచరత్నమాల ప్రాజెక్టు, ఎమ్.ఎస్ గార్కి ఆర్థిక సహాయం కోసం ప్రారంభించినా, దాని ద్వారా టి.టి.డి వారికొచ్చిన లాభం కంటే కూడ ఆవిడ గాత్రం ద్వారా వేంకటేశ్వరుని కీర్తనలు ఆలకించే భాగ్యం ద్వారా భక్తులకు లభించే లాభం ఎక్కువ.

“శ్రీవారి నామం“ శీర్షికలో నామం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకొంటాం. నామం సైజు తగ్గించాలని ప్రయత్నించడం, దానికి భగవదనుగ్రహం లేకపోవడం చాలా విచిత్రంగాను, ఆశ్చరంగాను వుంటుంది.

అలాగే హిందూ ధర్మ పరిరక్షణ భాధ్యత టి.టి.డి తీసుకోవటం, శ్రీవిల్లిపూత్తూరులో గల గోదాదేవి కళ్యాణానికి పట్టుచీరె పంపించే సాంప్రదాయం, స్వామి వారి పాలాభిషేకంలో జరిగే వింతలు, తన కూతురు, కొడుకు పెళ్ళిళ్ళ విషయంలో స్వామి వారి అనుగ్రహం, చివరగా తనకు బదిలీ అయ్యి వేరొక ఉద్యొగంలో చేరేటప్పుడు స్వామి వారి సమక్షంలో చార్జి తీసుకోవాలని అనుకోవడం, ఇలాంటి విషయాలన్ని చాలా ఆసక్తికరంగా వుంటాయి.

“నాహం కర్తా, హరిః కర్తా“ అనే శీర్షికలో పాడయిపోయిన ధ్వజస్తంభాన్ని మార్చి నూతన ధ్వజస్తంభం స్థాపించటం, నిజంగా స్వామి వారే ఆ ఏర్పాటు చేసుకొన్నట్లుగా వుంటుంది.ఈ పుస్తకానికి టైటిల్ గా అర్హత సాధించుకొంది.

ఇది నవల, కథానిక లేదా అలాంటి సాహిత్యరచన ఏదీ కాకపోయినప్పటికి, ఆయన రచనా శైలి పుస్తకాన్ని ఏకబిగిన చదివిస్తుంది.
తిరుమల గురించి పూర్తిగా తెలిసినవారు, ఏమి తెలియనివారు, ఏవో అపోహలు వున్నవారు తప్పక చదవాల్సిన పుస్తకంగా చెప్పవచ్చు.

You Might Also Like

One Comment

  1. Sitha rentala

    చాల మంచి పుస్తకం ఈ నాహం కర్తా ….ఒక fiction novel ఎల్లా చదివిస్తుందో అంతటి ఉత్కంఠ కలిగిస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇది జరిగిన సంఘటనల సజీవ రూపం .బాలాజీ అంటేనే ప్రజల హ్రిదయాలలో కొలువైన దేముడు. ఆయనకు సంభందించిన అనుభవాలు,అనుభూతులు చదువు తుంటేమనసు మనసుపులకరించి పోతుంది .ttd యాజమాన్యం పై గౌరవం పెరుగుతుంది .రామకృష్ణగారి విశ్లేషణ చాలాబాగుంది అన్నిముఖ్య విషయాలు స్ప్రిశించారు పెద్దచదువులు చదివిన ఒకగోప్పఅధికారి వ్రాసిన ఈగ్రంథం ఆస్తికులకు విందుభోజనమే !

Leave a Reply to Sitha rentala Cancel