రమణ గారి రచనలు – నేను

(గమనిక: ఇది పుస్తకాల గురించి కాదు. ఇది ఏదో ఒక పుస్తకం గురించో, రమణగారి గురించో కాదు. ఏదో, ఆయన రచనలతో నేను ఏర్పరుచుకున్న అనుబంధం గురించి, వాటి గురించి నాక్కలిగిన self-realization కథ అని చెప్పవచ్చు.)
***
కొన్నాళ్ళ క్రితం”కొసరు కొమ్మచ్చి” చదివాను. ఈ మధ్యనే ఒక ఫ్రెండు హార్డు కాపీ ఇవ్వడంతో మళ్ళీ మధ్య మధ్య తిరగేశాను. శ్రీదేవి గారు ఇంకా రమణగారి కుటుంబ సభ్యులు, స్నేహితులు రాశారనగానే, బాపు గారు కూడా రాశారనగానే – ఏదో కుతూహలం. ఏమాటకామాటే – వ్యాసాలు చదువుతూంటే రమణ గారు ఆయన కో.కొ. మూడుభాగాల్లోనూ చెప్పనిదెంత ఉందో కొంచెం తెలిసింది. ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టాక నేను వ్యక్తిగా, రచయితగా కూడా రమణ గారిని కొత్తగా చూడ్డం మొదలుపెట్టాను. రచయిత పార్టుకి కారణం – ఎం.బీ.యస్. ప్రసాద్ గారు రమణ గారి సాహితీకృషిని గురించి రాసిన అద్భుతమైన వ్యాసం. వ్యక్తి పార్టుకి కారణం – ఇతరులు రాసిన వ్యాసాల్లో తల్చుకున్న కొన్ని సంఘటనలు.

2010లో రమణ గారిని కలవక ముందు – ఆయన కథలని, వెండితెర నవలలని, సినిమా సంభాషణలని అభిమానిస్తూ కోతి కొమ్మచ్చి చదివే దాక వచ్చాను. ఆ తరువాత 2011 లో రమణ గారు మరణించడానికి నెల ముందు వాళ్ళింట్లోనే ఆయన్ని, బాపు గారిని కలిశాను – అదే ఆఖరు నేను అసలు వారిని కలవడం, మాట్లాడ్డం. ఈ సరికి నేను తక్కినవన్నీ వదిలేసి ఆయన కోతికొమ్మచ్చి కి వీరాభిమానిని అయిపోయి ఉన్నాను. గత మూడు నాలుగేళ్ళలో దాదాపు రోజూ ఎంతో కొంత కోతి కొమ్మచ్చి మూడు భాగాల ఆడియో బుక్స్ లో ఏవో కొన్ని ఎపిసోడ్స్ వింటూనే ఉన్నాను. అడపా దడపా ఆయన సినిమాలకి రాసిన సంభాషణలు ఆ సినిమా చూడ్డం సంభవిస్తేనో, ఏందుకో గుర్తువస్తేనో తల్చుకోడం తప్ప, ఆయన తక్కిన రచనల గురించి ఆలోచించలేదు. ఈ నేపథ్యంలో, ప్రసాద్ గారి వ్యాసం నన్ను ఒక్కసారి నిద్రలేపింది.

మనకెంత ఆయనంటే ఇష్టమైనా, ఆత్మకథ తప్పిస్తే మరోటి చదవకుండా/వినకుండా ఉండడం అన్యాయం కదూ? అనిపించింది. ఇంతలో నవంబర్లో అనుకుంటాను, నా ఫ్రెండు వాళ్ళ ఇంట్లో “కథా రమణీయం” కనబడితే కాసేపు తిరగేశాను. దానికీ ఎం.బీ.యస్ గారి ముందుమాట ఉంది. అదీ చదివాను – మళ్ళీ అదే ఆలోచన – “అరే, నేనెలా మిస్సయాను.” అని. ఇందులో కొన్ని కథలు నేను ఇదివరలో చదివినవే అయినా, నేను ఇప్పటి దాకా రమణ గారి రచనలు ఇష్టపడ్డానికి ప్రధాన కారణం – రచనా శైలి. నేను అస్తమానం – ఎంత బాగా రాస్తున్నాడీయన! అనో, “ఏం కామెడీగా చెప్పాడో!” అనో, ఈ బుడుగ్గాడు భలేటోడు అనో – ఇలా అనుకుంటూ చూశా కానీ, కథా వస్తువుల గురించి “ఆహా, ఓహో” అనుకున్న గుర్తు లేదు. ఈ నేపథ్యంలో, “అర్థాన్వేషణ” కథ చదివా ఈ పుస్తకం నుండి. ఎంత గొప్పగా రాశాడీయన! అనిపించింది. కథ నన్ను కొన్ని రోజులు వెంటాడిందని చెప్పాలి.

అదేమిటి, ఈయన ఇంత గొప్ప కథాంశాలు తీసుకున్నాడన్న విషయం నేను ఇదివరలో ఎక్కువ గమనించినట్లు లేదే..అనుకున్నాను. రమణ గారి కథలు నేను చదివినవి -ఎప్పుడో అరవై-డెబ్భైలలోనో ఎప్పుడో కథల సంకలనాలుగా వచ్చినవి, ఆయన రాసిన వెండితెర నవలు, బాపు గారి సినిమాలకి వచ్చిన వెండితెర నవలలు (రమణగారు సంభాషణలు రాసినవన్నమాట – నవలీకరణ ఎవరు చేసినా) – ఇవన్నీ చదివినప్పుడు నేను టీనేజర్ని. అదొక కారణం కాబోలు నేను కొన్ని అంశాలు గమనించకపోవడానికి..అనిపించింది.

మొత్తానికైతే, ఈ నేపథ్యంలో , ఆ జ్ఞానోదయం అయినప్పటి నుండి ఇంక ఈసారి తీరిగ్గా రమణ గారి రచనలు మొదట్నుంచి అన్నీ చదవగలిగే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను 🙂 కొన్నేళ్ళ క్రితం Bart Marshall అన్నాయన అనువదించిన అష్టావక్ర గీత వర్షన్ చదివాను. 16వ అధ్యాయం మొదట్లో ఒక వాక్యం ఉంటుంది – “But, until you forget everything, you will never find the truth”అని. అదనమాట సంగతి. ప్రస్తుతం రమణ గారి సాహిత్యం గురించి నాకలాగే ఉందని నేను అనుకుంటూన్నా!

ఇవన్నీ అటు పెట్టినా, కోతికొమ్మచ్చి రూపంలో రమణ గారు నాకు చేసిన మేలును గురించి మాటల్లో చెప్పడం నాకు చేతకాదు. దానిని ఆడియో రూపంలో తెచ్చి, రోజూ నా చెవుల్లోకి అమృతం పోస్తున్న అను-వర ముళ్ళపూడి గార్లకి, కొసరు కొమ్మచ్చి లో వ్యాసం ద్వారా నన్ను రమణ గారి ఇతర రచనల వైపుకి మళ్ళీ మళ్ళించిన ఎం.బీ.యస్. ప్రసాద్ గారికి సదా రుణపడి ఉంటాను, ఆడ అప్పారావు లా…. (అప్పీరావు అనాలా?)

***
(ముఖచిత్రం తెలుగువన్ వారి జాలగూటి నుండి స్వీకరించినది)

You Might Also Like

3 Comments

  1. ka va na sarma

    ముళ్ళపూడి పై నా భక్తి ద్రోణా చర్యుడి పై ఎకలవ్యుడికి ఉండిన భక్తి కంటే ఒక బొటకన వేలుడు ఎక్కువ కథకులు కథన రీతులు అన్న పుస్తకం లో ఆయన పై నా వ్యాసం లో పాండిత్యం తక్కువ భక్తి ఎక్కువ గమనించండి
    ఆయన మరణానికి ముందు నాకు వ్రాసిన ఉత్తరం నా కవన శర్మ కబుర్లు లో చూడవచ్చు

  2. g b sastry

    ఛి సౌ సౌమ్యగారు
    అప్పా రావు అన్నా అప్పి రావు అన్న తప్పేమ లేదనుకుంటాను తప్పకుండా రమణ గారి పుస్తకాలన్నీ( రాసినవి చాల కొంచమేననుకొండి) చదివితే అన్ని దోషాలు పోయి సద్గతుల మాట ఎట్లా ఉన్నా సదానందం మన్ని వెన్నంటి ఉంటుంది తల్లి.
    భాపురమణీయాభిమాని
    జి బి శాస్త్రి
    919035014046

  3. pavan santhosh surampudi

    ‘‘భగ్నహృదయాలు-భాష్పకణాలు’’, ‘‘ఆకలీ-ఆనందరావూ’’, ‘‘మహారాజు-యువరాజు’’, కొన్ని కొన్ని రాజకీయ భేతాళ పంచవింశతి కథలూ ఆయనను కథావస్తువు విషయంలో అగ్రస్థానంలో నిలుపుతాయి. రాధాగోపాలంలోవి కూడా తక్కువేమీ కాదు. ఆయన వస్తువులు అసామాన్యమే. టీనేజీలో తట్టదు నిజమే.

Leave a Reply to g b sastry Cancel