పుస్తకం
All about booksపుస్తకాలు

February 26, 2015

శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర – డా. సంగనభట్ల నరసయ్య

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక
********

శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర అనే ఈ పుస్తకాన్ని శ్రీ సంగనభట్ల నరసయ్యగారు రచించారు. పుట్టిపెరిగిన వూరి మీద అందరికీ అభిమానం వుంటుంది. ఆ వూరు ఎంత సాధారణమైనదైనప్పటికీ అక్కడ పెరిగినవాడు ఎంత సామాన్యుడైనప్పటికీ తన జన్మభూమి గురించి చెప్పవలసి వస్తే పులకించిపోయి మాట్లాడటం సహజం. అటువంటి పులకింతని చూడటం వినడం ఎప్పుడూ ముచ్చటగానే వుంటుంది. అటువంటిది ఆ వూరు సాధారణమైనది కానపుడు, మహాపుణ్యక్షేత్రమైన “ధర్మపురి” అయినపుడు, ఆ చెప్తున్న వ్యక్తి వివిధ విషయాలలో ప్రజ్ఞ వున్న నరసయ్యగారి వంటి పండితులైనపుడు అది మరింత ఆనందదాయకంగా వుంటుంది. ఈ పుస్తకం అటువంటి ఆనందాన్ని యిస్తుంది.
ముందుమాటలో శ్రీ కోవెల సుప్రసన్నాచార్య గారు చెప్పినట్లుగా ఈ పుస్తకం “కేవలం క్షేత్రమాహాత్మ్యము కాదు. కేవలం చరిత్ర కాదు. చారిత్రకాంశముల ప్రాధమ్యము మీద నిర్మితమైన క్షేత్రమాహాత్మ్యము.” అందుకే దీనిని “ధర్మపురి క్షేత్ర చరిత్ర” అన్నారు.

ధర్మపురి గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయంతో మొదలు పెట్టి ఈ గ్రామానికి సంబంధించిన ఎన్నో విశేషాలను ఈ పుస్తకంలో ప్రేమగాను సాధికారికంగాను వివరించారు నరసయ్యగారు. గోదావరి దక్షిణాభిముఖంగా ప్రవహించే ధర్మపురి ఒక తీర్థంగా ఎంత విశిష్టమైనదో, ధర్మపురిని దర్శిస్తే యమపురిని చూసే అవసరం రాదన్న ఖ్యాతి గాంచిన ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటో భక్తులకి ఆనందం కలిగేలా చెప్పారు.

అలాగే పురావస్తు శాఖ వారి దృష్టికి కూడా రాని ఎన్నో చారిత్రకాంశాలను బయటకి తెచ్చారు. సాహిత్యంలో ధర్మపురి ప్రస్తావననీ, కవి పండితులతో ధర్మపురి అనుబంధాన్నీ వివరించారు. స్థానికమైన భాషనీ, సంస్కృతినీ, ఆచారవ్యవహారాలనీ, పండుగలనీ – ఇలా ఎన్నో విషయాలను వివరంగా ఆసక్తికరంగా చెప్పారు. తన పరిశోధనతో కొన్ని కొత్త ప్రతిపాదనలనూ చేశారు.

గోదావరి, భద్ర నదుల సంగమస్థలమయిన ధర్మపురి అయిదు నరసింహాలయాలున్న ఏకైక గ్రామం. అందులో మూడు నరసింహాలయాలు నేటికీ పూజలందుకుంటున్నాయి. ఉపనిషత్తులు, పురాణాలలో నారసింహుని రూపము, తత్వము ఎలా చెప్పబడ్డాయో అవి ధర్మపురిలో ఎలా మనకి గోచరమవుతున్నాయో నరసయ్యగారు వివరించారు. 32 రకాల నారసింహ రూపాలు స్థలపురాణాలలో వర్ణించబడినాయట. ధర్మపురి గర్భాలయంలో ఉన్నది ప్రహ్లాదయుతుడైన నారసింహుడు. అలాగే నవవిధమైన నారసింహ తత్వాలున్నాయి. ధర్మపురిలో యోగనారసింహుడు, ఉగ్రనారసింహుడు, ప్రహ్లాదనారసింహుడు, లక్ష్మీనారసింహుడు అనే తత్వాలు ప్రకాశించాయి.

ఐతరేయ బ్రాహ్మణంలోని అగస్త్యుడి వృత్తాంతం, విష్ణుపురాణం మొదలైన వాటిలోని అశ్మక (నేటి నిజామాబాద్) ములక (నేటి కరీంనగర్) రాజ్యాల ప్రస్తావన వంటివి ఉదాహరణలుగా చూపుతూ రెండున్నర నుండి మూడు వేల ఏళ్ళ చరిత్ర ఈ గ్రామానికి వున్నదన్న విషయాన్ని వివరిస్తారు.

ధర్మపురికి 15 కి.మీ దూరంలో వున్న కోటిలింగాలలో బయటపడిన శిలాఫలకాలు, శాతవాహనుల కాలం నాటి అంతకన్నా ముందరి రాజుల నాటి (సామగోపుని గోభద్రుడు) నాణేలు, అలాగే 2003లో పుష్కరాల సమయంలో భూమిని చదును చేస్తున్నపుడు బయటపడిన యజ్ఞవాటికలు, వాటిలో వాడిన ఇటుక, ఇసుక మొదలైన ఆధారాల గురించి వివరించారు.

శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, పాండురాజు సంతతి వారైన విజయార్కుడు, సోమేంద్రుడు, కాకతీయులు – ఇలా వివిధ రాజవంశాలకు ధర్మపురితో వున్న సంబంధం గురించి వివరించారు. ధర్మపురిలోని రామేశ్వరాలయం భువనేశ్వర్ లోని లింగరాజస్వామి దేవాలయాన్ని పోలి వున్నదన్న విషయం, హంపిలోని షద్భుజ నారసింహ విగ్రహానికి మాతృక ధర్మపురిలోని మసీదు నారసింహాలయంలోని విగ్రహమేనన్న విషయం, ఇంకా ధర్మపురిలోని ఆలయ నిర్మాణాలకి, హంపిలోని నిర్మాణాలకి మధ్యన వున్న పోలికలు మొదలైనవి వివరించి అందుకు కారణమైన చారిత్రక విశేషాలనూ పేర్కొన్నారు.

కొన్ని శతాబ్దాల క్రితం ధర్మపురి ఎలా వుండేది ఇప్పుడు ఎలా వుంది అన్న విషయాలనూ వివిధ అంశాలను ఆధారంగా చేసుకుని ఆసక్తికరంగా వివరించారు. స్థలపురాణాలు, సాహిత్యగ్రంథాలు, శాసనాలు, నిర్మాణాలు, దానపత్రాలు మొదలైన ఆధారాలను వివరంగా ఈ పుస్తకంలో పొందుపర్చారు. చరిత్ర పట్ల ఆసక్తి వున్నవారిని ఆ అధ్యాయాలు విశేషంగా ఆకర్షిస్తాయి.

ధర్మపురిలోని బ్రాహ్మణుల గురించి వారి వేదాధ్యయన పద్ధతుల గురించి ఒక అధ్యాయంలో వివరించారు. ఆ అధ్యాయమంతా చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఎందరో మహానుభావుల గురించి తెలుస్తుంది. ఇక “సాహిత్యంలో ధర్మపురి” అన్న అధ్యాయం సాహిత్యం మీద ఆసక్తి వున్నవారికి చాలా విలువైనది. ధర్మపురికి చెందిన ఎందరో కవుల గురించి, ప్రసిద్ధ కవులు తమ కావ్యాలలో ప్రస్తావించిన ధర్మపురి విశేషాల గురించి ఈ అధ్యాయంలో వివరించారు రచయిత. భవభూతి ఉత్తర రామ చరితలో రాసిన గోదావరినదిలోని సీతాతీర్థమనే గుండం ధర్మపురిలోనిది. కన్నడంలో ఆదికవిగా విఖ్యాతుడైన పంప మహాకవికి అరికేసరి ప్రభువు ధర్మపురిని ధారాదత్తం చేసినట్లు శాసనం వుంది. పుష్టి మత ప్రవక్తలయిన వల్లభాచార్యుల వారి తల్లి ధర్మపురి ఆడపడుచే.

ఇటువంటి ఎన్నో విషయాలు ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తాయి. ఈ అధ్యాయంలో ముఖ్యంగా గమనించవలసిన విషయాలు కొన్ని వున్నాయి. అవి రచయిత తన పరిశోధన ఆధారంగా ప్రతిపాదించిన విషయాలు. శృంగేరి శారదా పీఠాన్ని అధిరోహించిన శ్రీవిద్యారణ్యస్వామి ధర్మపురి వారేనన్న విషయాన్ని ప్రతిపాదించి అందుకు ఆధారాలను వివరించారు. అలాగే పోతన భాగవత రచనకు ప్రేరణ పొందిన గోదావరీ తీరం ధర్మపురియేనన్న విషయాన్ని ప్రతిపాదించి చక్కటి ఆధారాలను చూపారు. “మహనీయ మంజుల పులినతల మండప మధ్యంబున” పోతన భాగవత రచనకు రాముడు ప్రేరేపించినాడు. ఆ మండపం (నదిలో శివపంచాయతనం) ధర్మపురిలోనే వుంది.

ఇంకా ఈ అధ్యాయంలో పింగళి సూరన, ధర్మపురి నరసింహ శతకం రచించిన శేషప్ప, సుప్రసిద్ధ విష్ణుభక్తి గీతం “వైష్ణవ జనతో” రాసిన నరసయ్య మొదలయిన వారి గురించి చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ గారి పాముపాట, మ్రోయుతుమ్మెద మొదలయిన రచనల గురించి చెప్పారు. ప్రయోగపారిజాతం రాసిన నరసింహసూరి, చతుర్వర్గ చింతామణి రాసిన హేమాద్రి కవి, పద్మపురాణం రాసిన మడికి సింగన మొదలయిన 38 మంది ప్రాచీనకవుల గురించి అలాగే కొందరు ఆధునిక కవుల గురించి వివరించారు. ధేనువకొండ శ్రీరామమూర్తిగారు ‘ఆయతనం’ అనే కథ వ్రాశారట. ఆ కథ మొత్తం ధర్మపురిలో నడుస్తుందట.

లిఖిత సాహిత్యంలో ధర్మపురి ఎంత విశిష్టంగా పేర్కొనబడిందో అంతకంటే ఎక్కువగా గేయ సాహిత్యంలోనూ ప్రస్తావించబడింది. ఇతర మతముల రాజులు, సైనికులు ధర్మపురిపై చాలాసార్లు దాడులు చేశారు. దాడుల విషయంలో ధర్మపురి గుజరాత్‌లోని సోమనాథ దేవాలయం వంటిదంటారు రచయిత. క్రీ.శ 1303లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలికాఫర్ కాకతీయ రాజ్యాన్ని కొల్లగొట్టి తిరిగి పోతూ పోతూ ధర్మపురిలో చేసిన విధ్వంసం మొదలుకొని పలుమార్లు పలురాజులూ సైనికులూ చేసిన దాడులను, ఆ సందర్భాలలో ధ్వంసమైన ఆలయాలను ఒక అధ్యాయంలో ప్రస్తావించారు. నిజాం నవాబు అఫ్జలుద్దౌలా కాలంలో కాళయుక్తి నామ సంవత్సరం (1858 లో) కార్తీక బహుళ దశమినాడు రోహిలాలు ధర్మపురిపై దాడి చేసి భీభత్సాన్ని సృష్టించి గ్రామాన్ని స్మశానం చేసి ఆలయాలని అపవిత్రం చేసి వెళ్ళారట. అప్పుడు వూరు వదిలి పారిపోయిన గ్రామస్థులు రెండు నెలల తర్వాత మరలా తిరిగి వచ్చి ఆలయాలను శుద్ధి చేసుకున్నారట.
ఆ విధ్వంసకాండ “రోహిలాల పాట” పేరుతో గేయరచనగా మారింది. “పరులన్న మాట నమ్మవద్దు ప్రాణనాయకా” అన్న త్యాగరాజ కీర్తనలో ధర్మపురి ప్రస్తావన వుంది. జాజర పాటలకు ధర్మపురి ప్రసిద్ధి చెందిందని చెప్తూ ఆ వివరాలు ఇచ్చారు ధర్మపురికి సంబంధించిన గేయసాహిత్యాన్ని వివరించే ఈ అధ్యాయంలో. ఇంకా గంగ పాట, పాముపాట, బొడ్డెమ్మ పాటలు, బతుకమ్మ పాటలు, భజనగీతాలు వంటివి కూడా వివరించారు.

ఇక ఒక పెద్ద అధ్యాయంలో ధర్మపురిలోని చిన్నా పెద్దా, ప్రాచీన, అర్వాచీన ఆలయాలన్నిటి గురించీ చాలా వివరంగా చెప్పారు. ఆలయ నిర్మాణం, అందులోని విగ్రహాలు, శిల్పాలు, వాటి ప్రత్యేకతలు – మొదలైనవి కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. చాయాచిత్రాలూ పొందుపరిచారు. దేవాలయాలలోని విగ్రాహాలే కాక దేవాలయానికి వెలుపల గ్రామంలో వివిధ ప్రదేశాలలో కనబడే విగ్రహాలనూ మరొక అధ్యాయంలో వివరంగా చిత్రాలతో సహా చూపారు. భారతదేశంలో మరెక్కడా మనం చూడలేని జాంబవతి విగ్రహం ఒకటి ఇక్కడ ఉందట.
ఇక గోదావరీ నది అందులోని బ్రహ్మగుండం, యమగుండం, సత్యవతి గుండం మొదలైన గుండాల విశిష్టతలు చదువుతూ చిత్రాలు చూస్తుంటే ఆ పరిసరాలలో తిరుగుతున్నట్లే అనిపించింది. బ్రహ్మ పుష్కరిణి, వరాహతీర్థం, భద్రానది, విమలా సరోవరం మొదలైన జలవనరుల చరిత్ర వివరంగా ఇచ్చారు. ధర్మపురిలో చింతామణి చెరువు నుండి శివాలయం వరకు శివాభిషేకానికి అనువుగా నిర్మించబడిన 16వ శతాబ్ది నాటి జలసారణి (పైపులైను) ఉందట.

ఇంకా ధర్మపురిలోని పండుగలను గురించి ధర్మపురి దేవాలయాలలో జరిగే అంగభోగాలను, రంగభోగాలను గురించి ధర్మపురిలో మాత్రమే కనబడే ‘పొన్నచెట్టు సేవ’ను గురించి వివరించారు. కోజాగిరి పున్నమ, గోపాల కాలు, బొడ్డెమ్మ పండుగ వంటి ధర్మపురికి ప్రత్యేకమైన పండుగల వివరాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉత్తరదిగ్యాత్ర పేరుతో స్వామికి జరిగే ఊరేగింపులో స్వామి పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళి పూజలందుకొని తుపాకులతో వందనం స్వీకరించి వచ్చే వింత ఆచారం వుందట ఇక్కడ.
ధర్మపురి భాషా చరిత్ర అన్న అధ్యాయంలో ఈ గ్రామములోని భాష కరీంనగర్ మాండలికంలోనే కొంత విశిష్టత కలిగినదని చెప్తూ అందుకు కారణాలను, ఆధారాలను ప్రస్తావించారు. అయిదారు వందల పదాలను ఈ అధ్యాయంలో పరిచయం కూడా చేశారు.
చివరి అధ్యాయాలలో ధర్మపురిలోని విద్యాసంస్కృతీ వైభవాన్ని గురించి, అక్కడ విలసిల్లిన వివిధ మతములను గురించి – బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, మధ్వ, ఇస్లాం మతములు – వివరించారు.

‘నూతన నిర్మాణంలో కరిగిన ప్రాచీనత్వం’ అన్న ఆఖరి అధ్యాయం చదువుతుంటే ధర్మపురిని ఒక్కసారి కూడా చూడని నాకే చాలా బాధగా అనిపించింది. మరి అక్కడే పుట్టి పెరిగిన నరసయ్యగారు ఇంకెంత బాధతో వ్రాసివుంటారో ననిపించింది. పుస్తకం చివర్లో పర్యాటక వివరాలు (వసతి సదుపాయాలు మొదలైనవి) అనుబంధంగా ఇచ్చారు. కనుక ఈ పుస్తకం చదివితే ధర్మపురి లోని విశేషాలన్నిటినీ సమగ్రంగా తెలుసుకోవచ్చు. వెంటనే వెళ్ళి వాటన్నిటినీ దర్శించీ రావచ్చు.

వెల : రూ 180/-
ప్రతులకు: జి-3, ప్లాట్ నంబర్ 199,
గాయత్రీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్, శ్రీపురం కాలనీ,
మలక్‌పేట్, హైదరాబాద్ – 500 036
సెల్ : 9440073124About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.4 Comments


 1. badige Umesh

  ఈ పుస్తక సమీక్ష చదివిన తర్వాత ఈ పుస్తక రచయిత ఎంతో పరిశోధనాత్మకంగా, ఆలోచనాత్మకంగా, వివిధ ఆధారాలతో రాయటం అనేది నేటి భవిష్యత్ పరిశోధకులకు ఎంతగానో ఉపయోగ పడే పుస్తకం అనిపించింది. ఇదే కాకుండా వీరు రాసిన పుస్తకాలన్ని ఎంతో విలువైనవని అనిపిస్తుంది. ఇలాంటి కృషి చేసిన ఆచార్య సంగన భట్ల నరసయ్యగారికి నా నమో వాకాలు.


 2. bhanukemburi@gmail.com

  చాలా కుతూహులంగా ఉంది ఎప్పుడు చదువుదామా అని, ఇంట పెద్ద పరిచయం రాయడం నిజంగా అభినందనీయం


 3. Desu Chandra Naga Srinivasa Rao

  ఈ వ్యాసం చదివిన తరువాత వెంటనే వెళ్లి ధర్మపురిని సందర్శించాలనిపిస్తుంది. డా.నరసయ్య గారు ఎంతో అభినందనీయులు. పుస్తకాన్ని పరిచయం చేసిన రాధిక గారికి ధన్యవాదాలు.


 4. N JHANSI LAKSHMI

  సాధారణంగా క్షేత్ర మహత్యాల గురించి పుస్తకాలూ వస్తాయి కాని క్షేత్ర చరిత్ర గురించి పుస్తకం రచించిన నర్సయ్య గారి అభిరుచి,ఊరిపట్ల ఆయన అభిమానం తెలుపుతుంది. గోదావరి పుష్కరాలు ఆసన్నం అవుతున్న సమయంలో ,అందులోను,ముఖ్య మంత్రి గారు పుష్కరాలు ధర్మపురి లో అధికారికంగా ప్రారంభిస్తామని ప్రకటించిన తరుణం లో ఆ క్షేత్రం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి చాల మందికి కలుగుతుంది. రాధిక గారి పుస్తక పరిచయం ఎంతో ఉపయోగ పడుతుంది. చారిత్రక పునాదులు,సాహిత్య విశేషాలతో సహా ,నేటి ధర్మపూరి పట్టణం రూపు రేఖలు చాల విపులంగా వివరించారు రాధికగారు.పుస్తకం చదవాలి,వెళ్ళాలి అనే ఆసక్తిని కలిగించారు  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నివేదిత – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** ‘నివేదిత’ పురాణవైర గ్రంథమాలలోని పన్నెండవ (చివరి) న...
by అతిథి
2

 
 

వేదవతి – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** ‘వేదవతి’ పురాణవైర గ్రంథమాలలోని పదకొండవ నవల. విక్రమ...
by అతిథి
5

 
 

హెలీనా – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** ‘హెలీనా’ పురాణవైర గ్రంథమాలలోని పదవ నవల. ఈ నవల లోని క...
by అతిథి
1

 

 

నాగసేనుడు – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** ‘నాగసేనుడు’ పురాణవైర గ్రంథమాలలోని తొమ్మిదవ నవల. ఎప...
by అతిథి
0

 
 

పులిమ్రుగ్గు – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

ఇది పురాణవైర గ్రంథమాలలో ఎనిమిదవ నవల. ఏడవ నవల ‘అమృతవల్లి’ కాణ్వాయన వంశీయుడైన వాసుదేవ...
by అతిథి
2

 
 

యాభై ఏళ్ల వాన – కొప్పర్తి

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక ******** ఈ కవితా సంకలనంలో దాదాపు అన్ని కవితలూ నాకు నచ్చాయి. ...
by అతిథి
2