In the Footsteps of Gandhi – Catherine Ingram

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు
(ఈ వ్యాసం మొదట చినవీరభద్రుడు గారు సెప్టెంబర్ 2014లో ఫేస్బుక్ లో పోస్టు చేసారు. తిరిగి పుస్తకం.నెట్ లో వేయడానికి అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
*****
కొన్ని పుస్తకాలు మనతో చాలాకాలం పాటు ఉంటాయి గాని, వాటి గురించి పట్టించుకోం. కాని హటాత్తుగా ఎప్పుడో ఒక్కసారి వాటిని చేతుల్లోకి తీసుకోగానే కొత్త ప్రపంచమొకటి చేతుల్లో ప్రభవిస్తుంది. పద్మం వికసించిన రోజున నాకు తెలీదని కవి అనుకున్నట్టే, ఆ పుస్తకం కొన్న రోజున నాకు తెలీదు, అందులో ఇంత అనుగ్రహం పొంగిపొర్లుతున్నదని.

కాథరిన్ ఇన్ గ్రాం రాసిన In the Footsteps of Gandhi (పారలాక్స్ ప్రెస్, 2003) అటువంటి పుస్తకం. అందులో ప్రపంచవ్యాప్తంగా శాంతి, ప్రేమ, సత్యాగ్రహాల మీద నమ్మకం పెట్టుకుని జీవిస్తున్న 12 మంది మహనీయులతో ఆమె చేసిన ఇంటర్వ్యూలు ఉన్నాయి. వారు : చైనా ఆక్రమణకు లోనైన టిబెటన్లకు ఏనాటికైనా స్వాతంత్రం సిద్ధిస్తుందని ఆశతో ప్రవాసజీవితం కొనసాగిస్తున్న దలైలామా, పాలస్తీనా విమోచనోద్యమాన్ని అహింసామార్గంలోకి మళ్ళించడం కోసం ఇజ్రాయిల్ కారాగారాల్లోకి నడిచిన ముబారక్ అవద్, చిన్న వయసునుంచే పౌరహక్కుల పరిరక్షణ కోసం శాసనోల్లంఘనోద్యమాన్ని ఒక జీవనశైలిగా మార్చుకున్న జోన్ బాయెజ్, కల్లోలిత వియత్నాం గడ్డమీద బుద్ధుడి శాంతిసందేశాన్ని ఆచరణసాధ్యం చేస్తున్న బౌద్ధభిక్షువు తిచ్ నాత్ హన్, అమెరికా చరిత్రలో మొదటిసారిగా వ్యవసాయకూలీలను సంఘటితపరిచిన సెసార్ చావెజ్,అడుగడుగునా మందుపాతరలు దట్టించిన శ్రీలంకలో శాంతిదూతగా సంచరిస్తున్న ఎ.టి.అరియరత్నె,ప్రపంచానికి అణ్వాయుధాలనుంచి మాత్రమే కాదు, అణుశక్తి కర్మాగారాలనుంచీ, అణువ్యర్థాలనుంచీ సంభవించగల ప్రమాదాలగురించి హెచ్చరిస్తూ భావి సంరక్షణదళాల్ని రూపొందిస్తున్న జొవానా మేసీ.

వారితో పాటు సౌకర్యవంతమైన హార్వర్డ్ ఉద్యోగాన్ని వదులుకుని, సత్యాన్వేషిగా ఎన్నో తావుల్లో సంచరించి చివరకి ఒక భారతీయ యోగి అనుగ్రహం పొంది రాందాస్ గా మారి అమెరికాలో ఒక ఆధ్యాత్మిక గురువుగా పనిచేస్తున్న రిచర్డ్ ఆల్పెర్ట్, శ్వేతజాతీయులు సాగించే జాతివివక్షకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన, సత్యాగ్రహాలు చేపడుతున్న డయానె నాష్, బీట్ కవి, రైతు, జెన్ సాధువు గారీ స్నైడర్, నాజీ కాంపులనుంచి బయటపడి, సామాజిక కార్యకర్తగా మారి ఆఫ్రికానుంచి అరిజోనా దాకా శాంతిసందేశాన్ని మోసుకుపోతున్న బ్రదర్ డేవిడ్ స్టైండెల్ రాస్ట్, దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి దురహంకారానికీ,జాతి వివక్షకూ వ్యతిరేకంగా పోరాటం చేసిన బిషప్ డెస్మండ్ టూటూ కూడా ఉన్నారు.

ఈ పన్నెండు మందిలోనూ, దలైలామాకి, డెస్మెండ్ టూటూకి నోబెల్ శాంతిబహుమతి లభించింది. ఎ.టి. అరియరత్నెకి గాంధీ శాంతిబహుమతి లభించింది. కాని మొత్తం పన్నెండు మందిలోనూ కనీసం ఆరుగురి పేర్లు నాకు ఈ పుస్తకం వల్లనే తెలిసాయి. అది నాకెంతో సిగ్గనిపించింది. నాకు తెలీకుండానే నా ప్రపంచం ఇంతదాకా చాలా ఇరుకైపోయిందనిపించింది.

తాను ఈ ఇంటర్వ్యూలు ఎందుకు చెయ్యవలసివచ్చిందో కాథరిన్ ముందుమాటలో ఇలా రాసుకుంది:

‘ప్రేమ గురించీ, శాంతి గురించీమాట్లాడేవాళ్ళు పూర్వం ఎప్పుడో సత్యయుగంలో మాత్రమే ఉండేవారనుకోవడం మనం తరచూ చేస్తున్న తప్పు.అట్లాంటి మనుషులు ఏ అతీతకాలంలోనో ఏ చారిత్రిక యుగాల్లోనో జీవించిఉండేవారనుకుంటున్నాం. ఒకవేళ మన కాలంలో కూడా మనకెవరైనా ఉదాత్తమానవులు కనిపిస్తే వారింకా ప్రాచీన విలువల్ని పట్టుకు వేలాడే సాంప్రదాయిక సంస్కృతులకు చెందినవాళ్ళయి ఉంటారనుకుంటున్నాం. కాని వాళ్ళు మనం ఒకప్పుడెలా జీవించామన్నదానికన్నా కూడా రేపు మనమెటు ప్రయాణించవలసిఉంటుందో ఆ మార్గం గురించి మాట్లాడుతున్నట్టయితే దాని అర్థమేమిటి? వాళ్ళు మన భూతకాలపు అవశేషాలు కాకుండా మన భవిష్యత్తును వెలిగించే దీపాలయితే వారిమాటేమిటి? బహుశా తక్కిన మానవాళి అంతాకూడా వారు సాధించుకున్న సంస్కారాన్నైనా అలవర్చుకోవాలి, లేదా నశించాలని అర్థం.’

‘అదృష్టవశాత్తూ అటువంటి సంస్కార అభివ్యక్తితో, మనకి స్ఫూర్తి నివ్వడానికి నేడు మనం మనచుట్టూ ఎన్నో అమూల్య వ్యక్తిత్వాలు ఉదాహరణగా ఉన్నాయి. ఈ పుస్తకంలో నేను ఎత్తి చూపిన కొన్ని ఉదాహరణలూ అటువంటి ఎన్నో అసంఖ్యాక ఉదాహరణలకు ప్రతినిధిగా మాట్లాడతాయి. వారి మాటలు రికార్డు చేసి చాలా కాలమే అయినప్పటికీ, అవి మన కాలానికీ, కాలాతీత సత్యానికీ కూడా చిహ్నాలుగా నిలబడతాయి.వాళ్ళు మనల్ని జీవించమని చెప్తున్నారు. ఒకప్పుడు గాంధీ జీవించాడే అట్లా. సత్యానికీ, ప్రేమకీ, సేవకీ, అహింసకీ అంకితమై జీవించిన గాంధీ జీవీతాన్ని చూసి వాళ్ళు కూడా స్ఫూర్తి పొందారు. ఆ విలువలకోసం మనం కొన్ని సార్లు త్యాగాలు చెయ్యవలసిరావచ్చుకాక,కానీ రాజీపడటం మరింత హీనమని వారు మనకి గుర్తు చేస్తున్నారు. జీవితమసృణత్వాన్ని ఎదుర్కోవడంలో మనమొక్కరమే లేమనీ, మనం ఒంటరివాళ్ళం కామనీ కూడా వాళ్ళు మనకు తెలియచెప్తున్నారు.’

పుస్తకంలో పన్నెండుమంది మీదా మొదట వారి వారి జీవితాల ఒక రేఖామాత్రచిత్రణ, ఆ మీదట వారితో చేసిన ఇంటర్వ్యూ పాఠాలూ ఉన్నాయి. అవి ప్రతి ఒక్కటీ చదవడం గొప్ప అనుభవం. అవి చదువుతున్నప్పుడు మనం మన రోజువారీ జీవితంలో మనచుట్టూ పేరుకున్న పొట్టు ఎగిరిపోతుంది. మన మనం ఆత్మలోతుల్లోకి దూకి సముద్రగర్భంలో అనుభవమయ్యే ప్రగాఢత్వాన్ని అనుభూతి చెందుతాం. ఒక కారణంకోసం, ఉన్నత ప్రయోజనం కోసం, సత్యం కోసం జీవించినప్పుడు మనిషి జీవితం ఎట్లా మహత్వపూర్ణమవుతుందో తెలుసుకుంటాం. మనం కూడా అట్లా జీవించడానికి ఏ చిన్ని అవకాశమేనా దొరుకుతుందా అని చుట్టూ పరికించడం మొదలుపెడతాం.

పుస్తకం ఎవరికివారు పూర్తిగా చదువుకోవలసిందే. కాని మచ్చుకి ఒక సంభాషణ మీతో పంచుకుందామనుకుంటున్నాను. దలైలామాతో సంభాషణనుంచి:

కాథరిన్: భారతదేశంలో గాంధీ స్మారకచిహ్నంగా ఉన్న రాజఘాట్ ని మీరు మొదటిసారి సందర్శించినప్పుడు,అహింసకి కట్టుబడి ఉండటమే మీ జీవితాశయమని చెప్పారు. కాని మీరెక్కడో చెప్పిన మరోసంగతి కూడా నేను విన్నాను. ఒక పడవలో బోధిసత్త్వుడు ప్రయాణిస్తున్నప్పుడు ఆ పడవలో ఒక దుష్టుడు కూడా ఉన్నాడనీ, అతడు ఆ పడవనిముంచెయ్యాలని ఆలోచిస్తున్న సంగతి బోధిసత్త్వుడికి తెలిసిందనీ, తక్కిన వందమందినీ కాపాడటంకోసం బోధిసత్తువుడు ఆ దుష్టుణ్ణి వధించాడనీ, ఆ విధంగా మరొక మనిషిని వధించడమనే కర్మ తలకెత్తుకున్నాడనీ మీరు చెప్పింది విన్నాను.

దలైలామా: అవును, చెప్పాను.

కా: అంటే హింస కూడా తప్పనిసరి అయ్యే పరిస్థితులు ఉండక తప్పవంటారా?

ద:టిబెటన్ సమస్యకు నా సమాధానం అహింస మాత్రమే. అక్కడ హింస ఎంతమాత్రమూ ఉపయోగపడదన్నది నిశ్చయమే. అసలు హింసామార్గంలో పరిష్కారం వెతకడమన్న ప్రశ్నే లేదక్కడ. అయితే ఆ కథలో మనిషి బోధిచిత్తాన్ని పొందినవాడు. పూర్తిగా బోధిసత్త్వుడిగా రూపొందినవాడు. అటువంటి స్థితికి చేరుకున్న మనిషికి కలిగే కరుణ ఎంతో నిష్కళంకంగా ఉంటుంది. అటువంటి కరుణాప్రచోదనం వల్ల ఆ మనిషి తక్కినవారి క్షేమాన్ని కోరి ఏమి చేసినా, ఒకవేళ హింసకు పాల్పడ్డా కూడా అది ఎంతో ఆత్మవిశ్వాసభరితంగా ఉంటుంది. నా వరకూ నేనంత పరిపూర్ణ దయాళువుగా ఎదగలేదు. ఎదగాలని మటుకు ప్రయత్నం చేస్తున్నాను. కాలం గడుస్తున్న కొద్దీ నాలో ఆ కారుణ్యం పెంపొదుతున్నది. అయినా కూడా నన్ను నేనొక బోధిసత్త్వుడిగా భావించుకోలేను. బహుశా బోధిసత్త్వత సాధించడానికి ప్రయత్నిస్తున్న ఒక అభ్యర్థిని మాత్రమే. కాబట్టి నాకు అటువంటి నిశ్చయజ్ఞానం, ఆత్మవిశ్వాసం లేవు. అవి లేకుండా అటువంటి పనులు చేయడం ప్రమాదకరం. కాబట్టి నాకు తెలిసినంతమటుక్కి అహింస మాత్రమే మరింత విశ్వసనీయ సాధనం.

You Might Also Like

Leave a Reply