కళాపూర్ణోదయం – 7: కళాపూర్ణుడు – మధురలాలస

వ్యాసకర్త: జాస్తి జవహర్
*********

బ్రహ్మ చెప్పిన కథ ప్రకారం కళాపూర్ణుడే కథానాయకుడు. కళాపూర్ణుడు జన్మిస్తాడని చెపుతాడేగాని, అతని పూర్వజన్మవృత్తాంతం ఏమీ చెప్పడు. అతడే పూర్వజన్మలో మణికంధరుడు. కావ్యంలో మణికంధరునికున్న ప్రాధాన్యత , స్థానబలిమి కళాపూర్ణునికి లేవు. కానీ కలభాషిణి విషయంలో అలాకాదు. చిలుక కలభాషిణి అనే వేశ్యగా అవతరిస్తుందని, తరువాతి జన్మలో మధురలాలసగా జన్మించి పవిత్రజీవనం గడుపుతుందని బ్రహ్మవాక్కు. మధురలాలసకు ఆవిధంగా ప్రాముఖ్యత ఉన్నా, కావ్యంలో కలభాషిణికి ఉన్న ప్రాధాన్యత మధురలాలసకు లేదు. పండితులు, విమర్శకులుకుడా కలభాషిణిని కథానాయికగా గుర్తించారుగాని మధురలాలసనుకాదు. కావ్యంలో ఆమెది శిఖరాగ్రస్థానం. మణికంధరుడు కళాపూర్ణుడుగాను, కలభాషిణి మధురలాలసగాను అవతరించిన విధం చూడాలి.

రంభానలకూబరుల ప్రహసనం తరువాత మృగేంద్రవాహనాలయానికి చేరిన కలభాషిణీమణికంధరులు తమపరస్పర ప్రేమభావాలను పంచుకున్నారు. మణికంధరుడు రంభాపరిష్వంగంలో కొన్నాళ్ళు తరించినా, కలభాషిణికి కలిగిన అనుభవం నలకూబరుని రూపంలో ఉన్న మణికంధరునితోనేగాని, నిజమైన నలకూబరునితోగాదు. కాని తాననుభవించినది మణికంధరుని సాంగత్యమేనని ముందుగా తెలిస్తే ఇంకా సంతోషించేదాననుగదా! అని కలభాషిణి అతనిపైనగల ప్రేమభావాన్ని సూచిస్తుంది. కాని ఇప్పుడిద్దరూ శాపగ్రస్తులయ్యారు. మణిస్తంభుని కత్తి ఒకసారి కలభాషిణిపైకి ఎత్తి ఉన్నది. అది ఆమెను వధించకమానదు. అది ఆఖడ్గ ప్రభావం. అదీగాక రంభ ఆమెను “హేతిఘాత నిమిత్తంబుచేతన వియోగంబునొందు”మని శపిస్తుంది. అందువలన ఆ ఖడ్గం ద్వారా ఆమెకు మరణం తప్పదు. అదేవిధంగా నలకూబరుడుగూడా మణికంధరుని “అల్పావశిష్టాయు”వని శపిస్తాడు. ఆ అల్పాయువు ఎంతకాలమో చెప్పలేదు. కాని త్వరలోనే తనకు మరణం తథ్యమని మణికంధరుడు నమ్మాడు. ఇద్దరికి ఉన్న శాపాలను దృష్టిలో పెట్టుకుని సుముఖాసత్తీమణిస్తంభులు ఆకత్తితో కలభాషిణిని దేవికిబలి ఇవ్వవలసిందిగా మణికంధరుని ప్రోత్సహిస్తారు. అక్కడి శిలాశాసనం ప్రకారం “సదమలరూపసుగానాస్పద వారవధూటిని” బలియిచ్చినవానికి “నిర్విపక్షాభ్యుదయ మహారాజ్యలక్ష్మి” వరంగా కలుగుతుందని చెప్పి ఉన్నది. అచిరకాలంలోనే చావబోయేతనకు ఈరాజ్యాలెందుకు? భోగాలెందుకు? అని మణికంధరుడు సందేహిస్తాడు. రాజ్యకాంక్షతోగాక, కలభాషిణి శాపవిముక్తికైనా ఆపని చెయ్యకతప్పదని అతనిని ప్రోత్సహిస్తారు. కలభాషిణిమాత్రం నిర్వికారంగా తనశాపఫలం అనుభవించటానికి ఉద్యుక్తురాలై, దేవిముందు పద్మాసనం వేసుకుని మణికంధరుని ప్రోత్సహించింది. తనపైన అంత మక్కువచూపిన సహాధ్యాయిని వధించటానికి మనసురాకపోయినా చివరికి మనసుదిటవుచేసుకుని కలభాషిణిని దేవికి బలియిస్తాడు.

దేవి ప్రత్యక్షమై అతడు బలియిచ్చినదానికి ఫలితంగా అతనికి రాజ్యాధికారం కలుగుతుందని, కాని అతడు బలియివ్వటానికి మనసొప్పక ఆలస్యం చేసినందున ఆరాజ్యాధికారం ఈజన్మలోగాక మరుజన్మలో కలుగుతుందని చెపుతుంది. ఆవిధంగా అతనికి మరుజన్మ ఉన్నదన్న విషయం మొదటిసారిగా చెప్పబడుతుంది. అంతవరకు అక్కడున్న వారికెవరికీ మణికంధరునికి ఇంకొక జన్మ ఉన్నదన్న విషయం తెలియదు. మరుజన్మతోపాటు అతనికి సద్యోయవ్వనము, మహారాజ్యవైభవము కలుగుతయ్యనిగూడా దేవి చెపుతుంది. కాని మణికంధరుని దృష్టి వాటిపైన లేదు. దాపురించిన తనమరణం తానుకోరినవిధంగా ఒక పుణ్యక్షేత్రంలో జరగాలని కోరుకుంటాడు. అందుకోసం శ్రీశైలం చేరుకోవాలని అతని ప్రయత్నం. అతడావిధంగా ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి అలఘువ్రతుడనే బ్రాహ్మణుడు చేరతాడు. అక్కడిశాసనం ప్రకారం ఎవరైనా జితేంద్రియులై రెండేళ్ళపాటు భువనేశ్వరీమంత్రాన్ని జపిస్తూ కాలం గడిపితే కోరినకోర్కెలు సిద్ధించగలవని తెలుసుకుంటాడు. అతడక్కడ ఉన్నప్పుడే కలభాషిణి కళాపూర్ణుని కథ విన్నవారికి సకలైశ్వర్యములతోపాటు దీర్ఘాయువు పుత్రపౌత్రాభివృద్ధియు కలుగునని చెపుతుంది. అదివిని అలఘువ్రతుడు తనకు పుత్రభాగ్యం ఎలాగూ లేదు. కాని ఐశ్వర్యం కలిగితే తన అన్నదానవ్రతం నిర్విఘ్నంగా సాగుతుందని ఆశించి, ఆకథను దేవిద్వారా వినవలెనని అక్కడ భువనేశ్వరీమంత్రం జపించటానికి పూనుకుంటాడు. మణికంధరుడు నిస్పృహచెందినవాడై తనదగ్గర ఉన్న మణిహారాన్ని అలఘువ్రతునికి ‘కృష్ణార్పణం’ అని బహూకరించాడు. శ్రీకృష్ణుని దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు అతనిని కీర్తించినందుకు కృష్ణుడు బహుమతిగా మణికంధరునికిచ్చిన హారమది. నారదునిద్వారా తనకు లభించిన వీణనుకూడా మణికంధరుడు ఆలయంలోనే ఒకచోట దాచి శ్రీశైలం చేరుకుంటాడు. అక్కడ కొండకొమ్మునుంచి లోయలోకి దూకి తనువు చాలించాలని అతని ప్రయత్నం.

అతడాప్రయత్నంలో ఉండగా స్వభావసిద్ధుడనే యోగి అతనిని సమీపించి అతని ఆత్మహత్యాప్రయత్నానికి కారణమడుగుతాడు. అందుకు మణికంధరుడు తనగతాన్ని వివరించి చెపుతాడు. అందులో తాను సుగాత్రీశాలీనులను కలుసుకున్న విషయము, ప్రస్తుతం వారు మృగేంద్రవాహనాలయంలో సుముఖాసత్తి, మణిస్తంభులుగా ఉన్న విషయము చెపుతాడు. అదివిని స్వభావసిద్ధుడు సంతసించి తాను సుగాత్రి తండ్రినని పరిచయం చేసుకుంటాడు. తనకూతురికి అల్లునికి శారదాదేవి యిచ్చిన విరుద్ధ వరాలేవిధంగా పరిణమిస్తయ్యోనని వ్యధచెందుతాడు. ఐనా ఆవరాలు వృధాకావని, ఏదోవిధంగా ఫలిస్తవని నమ్ముతాడు. మణికంధరునికి మరుజన్మలో రాజ్యప్రాప్తి ఉన్నదని మృగేంద్రవాహన చెప్పింది. అతడు శ్రీకృష్ణునికృపతో సంగీతాన్ని అభ్యసించాశ్డు. తీర్థయాత్రలు చేశాడు. ఆపుణ్యకార్యాలఫలం ఊరకేపోదు. ఐనా ఇంకా ఏకోరికతో ఆత్మాహుతి చేసుకుంటున్నాడోనని అతన్ని అడిగాడు. అందుకు మణికంధరుడు తనకు రాజ్యభోగాలనుభవించటంకన్నా శ్రీహితులై, శుచివర్తనులైనవారికి పుత్రుడుగా జన్మించవలెనని కోరికగా ఉన్నదని చెపుతాడు. అందుకు సిద్ధుడు సంతోషించి తనకూతురు, అల్లుడు అతనికి తలిదండ్రులు కావటం సమంజసమని, అది తనకెంతోసంతోషం కలిగిస్తుందని చెపుతాడు. అదీగాక తనగురువులొకప్పుడు తనది క్షాత్రవంశం కాగలదని సూచించారని, అదిగూడా ఈవిధంగా ఫలించగలదని చెపుతాడు. అందుకు మణికంధరుడు తన ఇంకొక కోరికగూడా వివరిస్తాడు.

రాజునైనా అరిషడ్వర్గాలను జయించాలని తాను కోరుకుంటున్నట్లు మణికంధరుడు తెలుపుతాడు. రాజ్యాధికారం రాగానే కొన్ని అవలక్షణాలు కలుగుతయ్యని, వేదశాస్త్రాది సద్విద్యలందారితేరిన సద్బ్రాహ్మణుల సాంగత్యంతో అటువంటి లక్షణాలను అధిగమించవచ్చునని, కాని అటువంటి విజ్ఞులసాంగత్యం పొందటానికి ఎంతకాలం పడుతుందోనని విచారం వెలిబుచ్చాడు మణికంధరుడు. అందుకు స్వభావసిద్ధుడు సంతసించి “దత్తాత్రేయుని కృపతో నీకోసం జయం ప్రసాదించే విల్లును, నవశరాలను సృష్టిస్తాను. సకల శాస్త్రాలలో నిష్ణాతులైనవారిని నీవద్దకు ఆకర్షించే ఒకమణిని గూడా ఇస్తాను.” అని వాటిని అప్పుడే తన తపశ్శక్తితో సృష్టించి చూపాడు. కాని వాటిని అప్పుడే అతనికివ్వక “నీవు మరుజన్మ పొందగానే నేనే వచ్చి నీకు వీటిని బహూకరిస్తాను” అని చెపుతాడు. ఆతరువాత అభినవకౌముది అతనిని చేరి, మృగేంద్రబవాహన ఇచ్చిన కత్తిని అతనికిచ్చి, తనవెంటపడుతున్న శల్యాసురునినుంచి తనను రక్షించవలసిందిగా వేడుకుంటుంది. దానివలన అతనికి భృగుపాతఫలంగూడా సిద్ధిస్తుందని దేవిచెప్పినట్లుగా చెపుతుంది. శల్యాసురునితో తలపడి మణికంధరుడు తనువు చాలిస్తాడు.

ఆసమయంలో సుముఖాసత్తి, మణిస్తంభుడు తమ లైంగిక ప్రవృత్తులను, శరీరాలను పరస్పరం మార్చుకుని రతిక్రీడావినోదంలో మునిగి ఉన్నారు. అంటే సుముఖాసత్తి పురుషుడుగాను (మణిస్తంభుడుగాను), మణిస్తంభుడు స్త్రీగాను (అంటే సుముఖాసత్తిగాను) మారి మరుక్రీడలలో తేలియాడుతున్నారు. మృగవాహనం మీదప్రయఆణిస్తూ కాసారపురం చేరారు. అక్కడ కొంతకాలం విశ్రమించాలని యోచించారు. ఆపురాధీశుడు సత్వదాత్ముడు సుముఖాసత్తిని (మణిస్తంభుని స్త్రీరూపాన్ని) చూచి, మోహించి, అటువంటి అందగత్తెకు సిద్ధుని సాంగత్యమేమిటని ఈసడించి, కపటవినయం చూపుతూ వారిని చేరి, క్షేమసమాచారాలడిగి, తనమందిరంలో విశ్రమించి కొన్నాళ్ళు వారిని సేవించేభాగ్యం అందించవలసిందిగా ప్రార్థించాడు. అందుకు వారిద్దరూ అంగీకరించి అతనిభవనం ప్రవేశించారు. సత్వదాత్ముడు వారికి సకలసౌకర్యాలూ అమర్చి గౌరవించాడు. కాని మనసులో దుష్టభావం ఉండనే ఉన్నది. వారిబాగోగులు విచారించే నెపంతో వారిని తరచు కలిసి సుముఖాసత్తిపైన మనసుపెంచుకున్నాడు. విటులతో రాయబారం నడిపి ఆమెను తనమందిరానికి ఆహ్వానించాడు. అందుకు సుముఖాసత్తి కోపించినా అతనిని కించపరచక తాను గర్భవతినని, సిద్ధుని పుత్రుని అతనికివ్వకుండా అన్యులను అంటనని చెప్పి పంపుతుంది. ఒకసుముహూర్తాన ఆమెకు మగశిశువు జన్మించాడు. జన్మతోనే యవ్వనం పొందాడు. సుముఖాసత్తి రూపంలో ఉన్న మణిస్తంభునికి ‘స్త్రీత్వం’ అనుభవించాలన్నకోరిక తీరింది. తిరిగి తమ సహజస్థితికి చేరాలని అనిపించింది. అదే సుముఖాసత్తితో చెప్పాడు. ఆమెనోటిమీదుగా ఆకోరికరావటంతో అది నిజమయింది. వారు తమసహజరూపాలను పొందారు. ఆవిధంగా ఇద్దరికీ శారదాదేవి ఇచ్చిన విరుద్ధవరాలు నిజమయ్యాయి. బ్రహ్మ చెప్పినట్లుగా కళాపూర్ణునికి తండ్రి ఆడుది, తల్లి పురుషుడు అయ్యారు. వెంటనే స్వభావసిద్ధుడు ప్రత్యక్షమై అతనికి కళాపూర్ణుడని నామకరణం చేశాడు. విల్లమ్ములను, మణిని బహూకరించాడు. కళాపూర్ణుని జన్మ తరువాత జరిగినవన్నీక్షణంలో జరిగినవని, ఏదిముందో ఏదితరువాతో చెప్పటం కష్టమని చెప్పటం జరిగింది.

ఈవింతలన్నీ చూచేసరికి సత్వదాత్మునికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వీరెవరో దివ్యపురుషులని గ్రహించాడు. ఆమెను కామించటంతొ తాను క్షమించరాని నేరం చేసినట్లు భావించి, ఆమెను చేరి, నమస్కరించి, దయతో తనను క్షమించవలసిందిగా వేడుకున్నాడు. పరిహారంగా తన రాజ్యాన్ని కళాపూర్ణునికి ధారాదత్తం చేసి అతనిదగ్గరే మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆవిధంగా మృగేంద్రవాహన ఆశీర్వాదం ఫలించింది. ఇది కళాపూర్ణుని జన్మవృత్తాంతం.

మృగేంద్రవాహనాలయం చేరిన కలభాషిణి తన అనుభవాలను నెమరు వేసుకుంటూ, తనమరణం తథ్యమని గ్రహించింది. అందుకు చింతించకుండా తనకు తగినశిక్ష అని అంగీకరించింది. తన అపవిత్రజన్మకు అంతంగా భావించి సంతోషంగా స్వికరించింది. తనను మొదట దేవికి బలియివ్వబోయిన మణిస్తంభునినుంచి తనను రక్షించిన సుముఖాసత్తిపైన ఆమెకు ఎనలేని గౌరవం ఏర్పడింది. సుగాత్రీశాలీనులుగానేకాక సుముఖాసత్తీమణిస్తంభులుగా కూడా వారి అన్యోన్నత, సుముఖాసత్తి పాతివ్రత్యము ఆమెనెంతగానో ప్రభావితం చేశాయి. ఆపాతివ్రత్యపు వెలుగులో తనవేశ్యాజీవితాన్ని చూచినప్పుడు ఆమెకు న్యూనతాభావం కలిగింది. అందుకే సుముఖాసత్తి, మణిస్తంభులకు నమస్కరించి, తనువు చాలించవలసిరావటంకన్నా, వారిని విడిచి వెళ్ళవలసి వస్తున్నందుకు విచారంగా ఉన్నదని కన్నీరు పెట్టుకుంటుంది. సుముఖాసత్తిని ‘పుణ్యంపుటిల్లాలని’ పొగడుతుంది. ఆమె పాతివ్రత్యప్రభావాన్ని తనపైనగూడా ప్రసరింపజెయ్యమని వేడుకుంటుంది. తాను మరణానికి సిద్ధమవుతున్నది. పాతివ్రత్యాన్ని కోరుకోవటంలో అర్థమేమిటి? పునర్జన్మ ఉంటుందనేది అందరికీ ఉన్న నమ్మకం. ఆవిధంగానే తనకు తరువాతి జన్మలోనైనా పతివ్రతగా ఉండే భాగ్యం కలిగించమని కోరుకున్నది. తన శృంగారకలాపాలను రంభకు వినిపిస్తున్నదన్న కోపంతొ సరస్వతి చిలుకను శపించింది – భూలోకంలో వేశ్యగా జీవించమని. అందుకు బ్రహ్మ కరుణించి తరువాతి జన్మలో మధురలాలసగా జన్మించి కళాపూర్ణునికి భార్యవై పతివ్రతగా పేరుతెచ్చుకుంటావని దీవిస్తాడు. కాని ఆకథ అక్కడున్నవారెవరికీ తెలియదు. కాని పునర్జన్మ ఉంటుందన్న నమ్మకం అందరికీ ఉన్నట్లే ఆమెకూ ఉన్నది. ఆజన్మలోనైనా సుముఖాసత్తిలాగా పతివ్రతగా జీవించాలని ఆమెకోరిక. అందుకు సుముఖాసత్తిగూడా ఆమెనభినందించి ‘పరమపతివ్రతవై వెలయుము’ అని దీవిస్తుంది. భర్తతో కలసి రాజ్యభోగాలనుభవిస్తూ తమవంటివారిని రక్షిస్తూ ఉండాలని సుముఖాసత్తి కోరుతుంది. మరుజన్మలో కలభాషిణి ఒకరాజుకి భార్య అవుతుందని సుముఖాసత్తికెలా తెలుసు? అప్పటికే ఆమె మణికంధరుని చేతులమీదుగా బలి అవుతుందని నిశ్చయమయింది. ఆకారణంగా శిలాశాసనం ప్రకారం మణికంధరుడు రాజవుతాడు.

కలభాషిణి మరుజన్మలో మణికంధరునికి భార్యకావాలని సుముఖాసత్తి కోరిక. ఒక విధంగా ఆశీస్సు. ‘మనమనసులలోని అనురాగం వృధాకాదు. నీవు, నీపతియు మమ్ములను గురుభావంతోనే చూస్తారు. పోయిరమ్మని’ ఊరడిస్తుంది. జరగబోయేది అదే!
స్వభావసిద్ధుడు చెప్పినట్లుగా మణికంధరుడు సుముఖాసత్తికి, మణిస్తంభునికి పుత్రుడుగా జన్మించి కళాపూర్ణుడవుతాడు. కాని కలభాషిణి మధురలాలసగా జన్మించటానికి గలకారణాలను ఎక్కడా వివరించలేదు. మృగేంద్రవాహనముందు మణికంధరుని చేతిలో బలి అయిన తరువాత ఆమె తిరిగి నూతన యవ్వనంతో ద్వారకానగరంలోని ఉద్యానవనంలో వుయ్యాలలూగుతున్నట్లుగా చెప్పబడింది. ఆతరువాత ఆమెకథ ఏమయిందో చెప్పలేదు. మణికంధరుడు కళాపూర్ణుడు కావటానికి గల కారణాలను వివరించినట్లుగా, కలభాషిణి మధురలాలసకావటానికి గలకారణాలను వివరించలేదు. అందుకుగల ఒకేఒక కారణమ్ బ్రహ్మ చిలుకైచ్చిన ఆశీర్వాదం. కాని ఆవిషయం అప్పటివరకు కథలో వచ్చిన పాత్రలకెవరికీ తెలియదు – ఒక్క రంభకుతప్ప. నారదుడు దివ్యశక్తితో తెలుసుకుని ఉండవచ్చు.

శ్రీశైలంలో స్వభావసిద్ధుడు మణికంధరునితో కలిసినప్పుడు అక్కడికి మదాశయుడనేరాజు తన భార్య రూపానుభూతుతోను, నలుగురు పురోహితులతోను వచ్చాడు. అతనికి దత్తాత్రేయుడు కలలో కనిపించి అతని కోర్కెలు స్వభావసిద్ధుని ద్వారా తీరగలవని చెప్పాదు. అందుకోసం ఆసిద్ధుని వెదుక్కుంటూ వచ్చానని చెపుతాడు. అందుకు సిద్ధుడు అతని కోరికలేమిటి? అని అడుగుతాడు. “విజయము, సంతానము” తనకోరికలుగా చెపుతాడు. (పుత్రుడు అని అడగడు. సంతానం అనిమాత్రమే అంటాడు.) “ఇకముంది నీవు రాజులమ్దరినీ జయించగలవు. కాని ఈఒక్కనిని మాత్రం జయించలేవు. ఇతనికి నేనిచ్చిన విల్లమ్ములే అందుకు కారణం” అని చెప్పాడు సిద్ధుడు. అందుకు మదాశయుడు “తమదయ కలిగింది. అంతేచాలు. తరువాతి విషయం నేనుచూసుకుంటాను. అతని ధనుస్సాయకాలు అప్పుడేమాత్రం ఉపయోగించగలవో నేను చూస్తాను.” అని గర్వంగా అన్నాడు. దానికి సిద్ధుడు కోపించి “ఈతడు నిన్నోడించటమేకాదు. నీచేత నీభార్యచేత ఊడిగం చేయించుకుంటాడు” అని శపిస్తాడు. అందుకు భయపడిన పురోహితులు మూర్ఖత్వంతో అతడన్న మాటలు మరచి క్షమించవలసిందిగా వేడుకుంటారు. ‘మీమీద ఆశతీ వెదుక్కుంటూ వచ్చాము. దయచూడండి’ అని ప్రాధేయపడ్డారు. సిద్ధుడు శాంతించి “నేను చెప్పినది జరగక మానదు. ఇతనిని తప్ప ఇతరరాజులందరినీ మదాశయుడు జయిస్తాడు. కాని ఇతనిసేవలో తరిస్తాడు.

నేనతనిఇచ్చిన మణిప్రభావం కారణంగా అతనికి సంతానం కలుగుతుంది. ఆమణిస్పర్శతో మీరుకూడా సుఖసంతోషాలు పొందుతారు.” అని వారిని ఓదార్చాడు. ఆవిధంగానే మదాశయుడు రాజులందరినీ ఓడించి, మణికంధరుడు కళాపూఈర్ణుడుగా జనించిన తరువాత అతనితో ఓడి అతనిదగ్గర సేవలు చేస్తూ కాలం గడుపుతాడు. అప్పటికి సిద్ధుడిచ్చిన మణి కళాపూర్ణుని దగ్గరే ఉన్నది దాని ప్రభావంతో మదాశయునికి, రూపానుభూతికి మధురలాలస జనిస్తుంది. కాని కలభాషిణియే మధురలాలసగా జనిస్తుందని సిద్ధుడు చెప్పలేదు. మధురలాలస జననానికి ముందే కలభాషిణి జీవితం అంతమయి ఉండాలి. ఆవిషయం కావ్యంలో లేదు.

కళాపూర్ణునికథ వినాలన్న తలంపుతో అలఘువ్రతుడు మృగేంద్రవాహనాలయంలో భువనేశ్వరీదేవి మంత్రాన్ని జపిస్తున్నాడు. అందుకు రెండేళ్ళగడువు తీరేసరికి మృగేంద్రవాహన అతనితో నీకోరిక వేరొకచోట సిద్ధించగలదని చెప్పి ఒకఊపులో అతనిని విసరివేసింది. అతడు ఒక రాజాస్థానంలో పడ్డాడు. కళ్లుతెరిచేసరికి ఎదురుగా ఒకరాజు, అతని ప్రక్కనే ఉయ్యాలలో ఒక శిశువు కనిపించారు. అతడు తెప్పరిల్లి, మణికంధరుడు తనకిచ్చిన మణిహారాన్ని రాజుకి కానుకగా సమర్పించుకున్నాడు. “ఈసమయంలో వచ్చిన కానుకలన్నీ ఈపాపకే చెందాలి” అని ఆరాజు దానిని ఆశిశువు మెడలో వేశాడు. ఆపాప “ఈమణిహారాన్ని రెండేళ్ళతరువాత మళ్ళీ చూస్తున్నాను.” అన్నది. అమ్దుకు అక్కడున్నవారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. రెండునెలలైనా నిండని పాప మాటాడటమేమిటి? రెండేళ్ళతరువాత మణిహారాన్ని చూచాననటమేమిటి? దానితో అందరూ ఆమెను దైవకృపవల్ల కలిగిన దివ్యాంగనగా భావించారు. “నీవు పుట్టి రెండు నెలలైనా కాలేదు. రెండేళ్ళనాటి విషయం నీకెలాతెలుసు?” అని అడిగాడు రాజు. అందుకాపాప తన పూర్వకథను వినిపించింది. తాను సరస్వతీబ్రహ్మల పెంపుడు చిలుకనని, వారి సరసగాథలను రంభకు వివరిస్తుండగా సరస్వతి కోపించి తనను భూలోకంలో వేశ్గాగా జన్మించమని శపించిందని, అందుకు బ్రహ్మ కరుణించి తనతరువాతి జన్మలో మదాశయునికి పుత్రికగా జన్మించి, కళాపూర్ణునికి భార్యనై పతివ్రతగా జీవిస్తానని ఆశీర్వదించాడని, ఆకారణంగానే ఇప్పుడు మధురలాలసగా జన్మించానని వివరిస్తుంది. కళాపూర్ణుని కథ వినటంకోసం రెండేళ్ళుగా జపం చేస్తున్న అలఘువ్రతునికి ఉత్సాహం కలిగింది. ఆకళాపూర్ణుడెక్కడున్నాడో తెలుపవలసిందిగా ఆపాపను అర్థించాడు. అందుకాపాప ‘అవి నేను ఘెప్పవలసినవి కావు. ఇక్కడున్నవారికి తెలుసు. వారినే అడుగు” అని దాటవేసింది. అప్పుడు అలఘువ్రతునికి ఆరాజు కళాపూర్ణుడు తానేనని వివరిస్తాడు. అలఘువ్రతునికి కోరిక సిద్ధిస్తుంది.

కళాపూర్ణుడు మదాశయుని, రూపానుభూతిని పిలిపించి మధురలాలసను జాగ్రత్తగా పెంచవలసిందని వారికి సకల సౌకర్యాలు కలిగిస్తాడు. ఆతరువాత కళాపూర్ణుడు రాచకార్యాలలోను, అబినవకౌముది పరిష్వంగంలోను పడి మధురలాలస సంగతి మరచిపోతాడు. కాని మధురలాలస మాత్రం నిత్యమూ కళాపూర్ణుని ఆలోచనలోనే మురిసిపోతుంది. అతని పేరువిన్నంతనే కిలకిలా నవ్వుతుంది. పెద్దదైన తరువాత ఆపేరుకు సిగ్గుపడుతుంది. యవ్వనంలో అడుగుపెట్టింది. తండ్రి మదాశయుడు కళాపూర్ణుని నుంచి వర్తమానంకోసం ఎదురుచూస్తున్నాడు. కాని తనకు తానై అడిగే ధైర్యం లేదు. మధురలాలస మాత్రం కళాపూర్ణునికోసం తపిస్తున్నది.

డేగలతో పక్షులను వేటాడటం కళాపూర్ణుని వినోదాలలో ఒకటి. ఒకనాడు ఒకపక్షివెంట పడిన డేగను పిలుచుకుంటూ వెళ్ళినప్పుడు అతనికి చెలికత్తెలతో జలకాలాదుకుంటున్న మధురలాలస కనిపించింది. అప్పటిఇ ఆమె ఎవరో గుర్తురాలేదు. ఆమె అందానికి ముగ్ధుడై ఆమెకోసం తపించటం మొదలుపెట్టాడు. కళాపూర్ణుని చూడకపోయినా, మధురలాలసగూడా అతనికోసం కలలు కంటున్నది. చివరికి తమకం ఆపికోలేక కళాపూర్ణుడు తన ఆంతరంగికసఖునితో తన మనసు చెప్పుకుంటాడు. తాను చూచిన ఆకన్యను వివరించి ఆమెనెలాగైనా తనకు కూర్చవలసిందిగా కోరతాడు. అందుకాసఖుడుకూడా ఎగతాళిగా “ఏమేకావాలా? ఆమెను మించిన కన్నెలను ఇస్తామని ఎందరో రాజులు వర్తమానాలు పంపుతున్నారు. చూపమంటావా?” అని అడిగాడు. అందుకు కళాపూర్ణుడు కోపించి ‘నీకుచేతగాకపోతే చెప్పు’ అని నిష్ఠూరమాడుతాడు. అందుకా సఖుడుఅ నవ్వి అంతా వివరించాడు.”ఒకప్పుడు నీవే రూపానుభూతిని, మదాశయుని అత్తమామలన్నావు. మధురలాలసను జాగ్రత్తగా పెంచమని ఆజ్ఞచేశావు. అవన్నీ మరచి ఇప్పుడెవరినో వలచి, వగచి బాధపడుతున్నావా?” అని చమత్కరించాడు.

చివరికి మధురలాలసతో పెళ్ళి నిశ్చయమయింది. కాని అది ప్రథమపత్ని అభినవకౌముదికి ఇష్టమవుతుందో లేదోనని అనుమానం కలిగింది. అంతఃపురకాంతలతో సందేశం పంపించాడు. అందుకామె “చల్లదనంతో బంధువుల మనసులను సంతోషపెట్టటమే స్వభావంగా కలిగినదాననుగనుకనే నాకు అభినవకౌముది అన్నపేరు కలిగింది. అటువంటి నేను పతికోర్కెను కాదని ఎలా అంటాను? అతనికోర్కెను చెల్లించటమే నా అభిమతం.” అని కబురు పంపుతుంది. కళాపూర్ణునితో మధురలాలస వివాహం వైభవంగా జరుగుతుంది. ఇద్దరు భార్యలతో కళాపూర్ణుడు సంతోషంగా, సరసంగా కాలం గడుపుతుంటాడు.

ఒకనాడు అభినవకౌముది మందిరంలో వీణాగానం వింటూ, ఆమె సంగీతప్రావీణ్యానికి ముగ్ధుడై, ఆమె గానం వినటానికి మధురలాలసనుగూడా పిలిపిస్తాడు. అభినవకౌముది గానం విన్నతరువాత మధురలాలసతో “నీవుగూడా వీణాగానంలో ఆరితేరిన దానవుగదా! ఈవీణపైన నీవుగూడా పాడి వినిపించు.” అని అడుగుతాడు. అందుకు మధురలాలస సందేహిస్తుంది. “నాస్వరానికి, శృతికి ఈవీణ కలుస్తుందోలేదో” అని అనుమానం వ్యక్తం చేస్తుంది. “ఐతే వీణలేకుండానేపాడు.” అని ప్రోత్సహించాడు కళాపూర్ణుడు. పతికోర్కెను కాదనకుండా మధురలాలస వీణలేకుండా ఒక పాట పాడింది. ఆమె కంఠమాధుర్యానికి, సంగీతప్రావీణ్యానికి కళాపూర్ణునితోపాటు అభినవకౌముదికూడా ఆశ్చర్యంలో మునిగిపోయింది. “నీకనువైన వీణ ఎలా ఉండాలో చెప్పు. తప్పకుండా తెప్పిస్తాను.” అని వాగ్దానం చేశాడు కళాపూర్ణుడు. కాని అది అసంభవమంటుంది మధురలాలస. అప్పుడు అభినవకౌముదితో “నీ ఎరుకలో ఎక్కడైనా ఈమెకు తగిన వీణ ఇన్నదా?” అని అడుగుతాడు. అందుకామె “ఈవీణ అద్భుతమైనదని తుంబురుడు వాడుతుండేవాడు. నేనతనికి ప్రియశిష్యురాలిని కావటం వలన అది నాకు బహుమతిగా ఇచ్చాడు. దీనిని మించిన వీణదొరకటం దుర్లభం. .. కాని ఈమధ్య తుంబురుడు నారదునితో ఓడిపోయాడని విన్నాము.” అని చెప్పింది. నారదుని మాటవినగానే కళాపూర్ణునికి తన పూర్వజన్మవృత్తాంతం గుర్తుకు వచ్చింది. తనకు నారదుడిచ్చిన వీణను మృగేంద్రవాహనాలయంలో దాచిన విషయం గుర్తుకు వచ్చింది. ఎలాగైనా దానిని తెచ్చియిస్తానని మధురలాలసకు వాగ్దానం చేశాడు.

తరువాత చెలులు అభినవకౌముది చుట్టూ చేరి ఆమెకు జరిగిన అవమానాన్ని వివరించారు. ‘నీమందిరంలో వీణాగానం వింటున్నవాడు వినక ఆమెను పిలిపించటం ఎందుకు? వీణలేకపోయినా ఆమెగానం అద్భుతంగా ఉన్నదని, ఆమెగానానికి నీవీణ పనికిరాదని చెప్పించటానికా? పైగా తనవీణను తెచ్చి ఆమెకే ఇస్తాడట! ఇంతకన్నా అవమానమేమైనా ఉన్నదా? నువ్వు బెట్టు చెయ్యకపోతే నీభర్త నీకు దక్కడు. తరువాత నీయిష్టం.” అని పురికొల్పారు. ఆమె కూడా ఆలోచనలో పడింది. తుంబురుని వీణకూడా పనికిరానంత గొప్పగా ఉన్నదా, ఆమె పాట? ఆమాట తనకవమానంకాదా? అనిపించింది. పతిచేరినప్పుడు మనసుపెట్టక సేవలు చేసింది. శృంగారభావం లోపించింది. అతనికనుమానం కలిగింది. ఆమె మనసులోని బాధ ఏమిటో చెప్పమని ప్రాధేయపడ్డాడు. అందుకామె “సంగీతకళలు నేర్చినవారి బెడంగులు మాకురావుగదా!” అని మర్మగర్భంగా అన్నది. ఆమె మనసును గ్రహించాడు కళాపూర్ణుడు. “అద్వితీయమైన నీవీణ వేరొక గాయనికి తగదని అన్నందుకు అవమానించినట్లయిందని బాధపడుతున్నావుగదూ? నేను గతజన్మలో దాచినవీణను నీకే ఇస్తాను. సరేనా?” అని ఆమెను ప్రసన్నం చేసుకున్నాడు. దక్షిణనాయకులంతేగదా! ముందున్న మగువను ప్రసన్నం చేసుకోవటానికి ఏప్రతిజ్ఞలైనా చేస్తారు! కాని ఆవార్త మధురలాలస మందిరానికి చేరింది. తనకు తెచ్చి ఇస్తానన్న వీణను ఆమెకిస్తానని వాగ్దానం చెయ్యటమేమిటి? తనకన్నా ఆమె ముఖ్యమా? అది తనకవమానంకాదా? ఆమె అలుక వీడలేకపోయింది. కళాపూర్ణుడు సంగీతం విషయంలో ఆమెకేమీ సమాధానం చెప్పలేడు. తప్పు జరిగిపోయింది. ఆమెను వేరేవిధంగా ప్రసన్నం చేసుకోవాలి. తాను దిగ్విజయయాత్రచేసి ఇతరరాజ్యాలరాణుల కిరీటాలలో ఉన్న మణులతో కాలి అందెలు చేయిస్తానని మధురలాలసకు ప్రమాణం చేశాడు. రాణుల కిరీటాలలోని మణులతో తనకు కాలి అందెలు! ఎంత ఔన్నత్యం! తనగొప్పతనమేమనుకోవాలి? మధురలాలస సంతసించింది. అతని కోరిక తీరింది. కళాపూర్ణుడు ఎంతగానో ఆలోచించాడు. అభినవకౌముది అప్సరాంగన. వీణ ఎక్కడున్నదో చెపితే ఆమె ఏవిధంగానైనా తెచ్చుకోగలదు. కాని అది తాను బహుమానం చేసినట్లు కాదు. ఎవరినైనా రహస్యంగా పంపి ఆవీణను తెప్పించవచ్చు. కాని ఎవరిని నమ్మాలి? ఆదేశపు రాజుకి వర్తమానం పంపి తెప్పించుకోవచ్చు. కాని అతడె దానిని దక్కించుకోవాలని చూస్తే ఏమిచెయ్యాలి? ఇవన్నీ అనవసరం. తానే జైత్రయాత్రచేసి అందరినీ జయించాలి. రాణులకిరీటాలను కొల్లగొట్టి మధురలాలసకు అందెలు చేయించాలి. తప్పదు. అని నిర్ణయించుకున్నాడు.

జైత్రయాత్ర దిగ్విజయంగా పూర్తిచేశాడు. వీణను తెచ్చి అభినవకౌముదికి ఇచ్చాడు. అందెలు చేయించి మధురలాలసకిచ్చాడు. ఇద్దరూ తృప్తి చెందారు. కలహాలు లేకుండా కాపురం చేశారు. అభినవకౌముది ద్వారా సుప్రసాదుడు, మధురలాలసద్వారా సరసుడు అనే పుత్రులు కలిగారు. కళాపూర్ణుడు నిరంతరం విష్ణుసేవ చేస్తూ, రాజ్యాన్ని ధర్మబద్ధంగా ఏలి కృతార్ధుడయ్యాడు.

You Might Also Like

Leave a Reply