One Part Woman – Perumal Murugan

ప్రస్తుతం వివాదాల్లో ఉన్న రచన ఇది. తమిళ మూలం, దాని ఆంగ్లానువాదం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా వివాదం మాత్రం తాజాగా, వాడిగా జరుగుతుంది. కొందరు ఆర్.ఎస్.ఎస్ మనుషులు ఈ పుస్తకాన్ని కాల్చారు. రచయితను అరెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఇతర తమిళ రచయితలు రచయితకు అండగా మాట్లాడారు. అయినా, ఆయన తనలోని రచయిత చనిపోయాడని, ఇకపై రచనా వ్యాసంగాన్ని కొనసాగించనని భావోద్వేగంగా ప్రకటించారు. ఇవన్నీ సోషల్ మీడియా మాహా జోరుగా షికార్లు చేస్తున్నాయి. వాటితోనే వాదోపవాదాలు కూడా!

ఏదో ఒక ఫిక్షన్ – సినిమా అయినా, పుస్తకమైనా, మరేదైనా – గురించి వివాదం రేగినప్పుడు, ఆ వివాదం గురించి వివరాలు తెల్సుకొని, దాన్ని బట్టి ఆ వర్క్ మీద అభిప్రాయం ఏర్పర్చుకునే బదులు, ఈ హోరునంతా పక్కకు తోసి, నేరుగా ఆ వర్క్ ని చూడ్డమో, చదవడమో మేలు అని నా అభిప్రాయం. అందుకే, వివాదం వల్లే ఈ రచన గురించి నాకు తెలిసినా, వివాదం గురించి కాక, ఆ రచన గురించే ఈ వ్యాసం.

కథ:

ఇది తమిళనాడులో ఒక ప్రాంతంలో జరిగే కథ. అక్కడి కాళి, పొన్నా అన్న భార్యాభర్తల కథ. వాళ్ళిద్దరి మధ్య దాంపత్య సుఖానికి కొదువ లేదు. అనోన్యతకు కూడా లోటు లేదు. పెద్దగా సంపద ఉన్నవారు కాదుగానీ, లేనివారూ కాదు.  అయితే, వాళ్ళని పీడించే ఒకటే ఒక బాధ: బిడ్డలు లేకపోవడం. పెళ్ళై పన్నెండేళ్ళైనా పిల్లలు కలగరు. చేయని ప్రయత్నం, కొలవని దేవుడు, మొక్కని మొక్కు అనేది లేకుండా అన్ని విధాలా ప్రయత్నిస్తారు. అయినా ఫలితం కలుగదు. పిల్లలు లేని ఒకే ఒక్క కారణాన ఊరు, వాళ్ళని అయినదానికి, కానిదానికి ఆడిపోసుకుంటుంది. ఓ రకంగా వాళ్లు ఊర్లోనే ఉంటున్నా, ఊరిలో లేనట్టే లెక్క.

అందరితో సరదా, స్నేహంగా మెలిగే వాళ్ళిద్దరూ ఓ రకంగా ఒంటరివారైపోతారు.

వాళ్ళ బాధను చూడలేక అతడి తల్లి, ఆమె తల్లిదండ్రులు – అన్నయ్య కలిసి వాళ్ళకు సంతానం కలగడానికి ఓ ఉపాయం చెప్తారు. అదేమిటంటే, అక్కడ గుడిలో జరిగే ఒక పెద్ద జాతరలో ఒక రాత్రి ఆ తిరునాళ్లకి వచ్చే ప్రతి మగవాడు “దేవుడు”కి రూపంగా, ఆ రాత్రి అక్కడికి వెళ్ళిన స్త్రీలు వచ్చిన దేవుళ్ళల్లో ఎవరో ఒకరితో కూడితే, కలిగిన సంతానం దైవప్రసాదంగా భావిస్తారు. అక్కడికి పొన్నాను పంపాలని అందరు నిశ్చయించుకుంటారు. కానీ దానికి కాళి ఒప్పుకోడు. రెండేళ్ళు ఆ జాతరకు దూరంగా ఉంటాడు. ఆ జాతరకు వెళ్ళడు, ఆమెను పంపడు. చిట్టచివరకు, కుటుంబసభ్యుల నడిపే నాటకం వల్ల, అతడు ఒప్పుకున్నాడని అనుకున్న ఆమె ఆ జాతరకు వెళ్తుంది. ఆపై ఏమి అయ్యిందన్నది ముగింపు.

కథనం:

రెండేళ్ళ పాటు జాతరకు దూరంగా ఉండి, ఎట్టకేలకు, దానికి వెళ్ళడానికి అత్తారింటికి కాళి, భార్య సమేతంగా రావడం వద్ద కథ మొదలవుతుంది. అక్కడి నుండి దశలు వారిగా, వారిద్దరి కథను, కష్టాన్ని ఫ్లాష్‌బాక్ లో చెప్పుకొస్తున్నట్టుగా కథ నడుస్తుంది. వాళ్ళకి సంతానం లేకపోవడమే తీరని లోటు అన్నది మనకి ఒకటి-అరా పేజీలలో తెల్సిపోయినా, ఆ లోటు తీవ్రత, ఆ లోటు వల్ల వాళ్ళు పోగొట్టుకున్నది ఏంటో మనల్ని బలంగా తాకేలా ఉంటాయి ఆ ఫ్లాష్‌బాక్స్. దానితో పాటే, వాళ్ళిద్దరి మధ్య అనురాగం, పిల్లలు లేరన్న బాధలోనూ ఒకరికొకరు అండగా నిలవడం, సమాజమంతా నీచంగా చూసినా ఒకరిపట్ల ఒకరికి గౌరవమర్యాదలు తగ్గకపోవడం లాంటివి హృద్యంగా కథలో అల్లారు.

అలానే, చెప్పకనే అప్పటి సమాజంలో పేరుకొని పోయిన మూఢనమ్మకాలను చెప్పారు. వాటిని గుడ్డిగా నమ్మేవాళ్ళు, వాటికి ఎదురుతిరిగేవాళ్ళు ఈ కథలో కనిపిస్తారు. వయసంటూ వచ్చాక పెళ్ళి చేసుకోవాలి, పెళ్ళంటూ అయ్యాక పిల్లలు పుట్టాలి. ఇవి జరగని పరిస్థితుల్లో సమాజం ఎంత కర్కషంగా మారుతుందో చూపడానికి ఆ భార్యాభర్తల బంధువులు, ఊరివాళ్ళ పాత్రలు సరిపోయాయి. అలా చూసే సమాజాన్ని విస్మరించగలిగి, ఆనందంగా ఉండగలిగే  పాత్రను – మామ వరుస ఒకడిని – ఉపయోగించుకున్నారు. ఆ ఊరి మొత్తానికి, ఆ భార్యభర్తలకు కొంచెం ధైర్యాన్ని, ఊరటని ఇచ్చింది ఈ పాత్రే!

కథ చాలా వడివడిగా సాగుతుంది. ఎక్కడా అవసరానికి మించిన ప్రసంగం కనిపించదు. పాత్రలు చేస్తున్న పనులు, మాట్లాడుకుంటున్న మాటల్లో చెప్పాల్సిందా చెప్పేయడమే కానీ, రచయిత ఎక్కడా మైకు పుచ్చుకోరు. గ్రామీణ వాతావరణంలో జరిగే కథ కాబట్టి పాడిపంటల ప్రస్తావన కూడా కథలో అంతర్భాగంగా ఉంటాయి.

కథను చాలా సస్పెన్స్ గా నడిపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ వరకూ బాగా నడుస్తుంది. అయితే, కథ కొంచెం త్వరగా ముగించినట్టు నాకు అనిపించింది. ఆమె ఆ జాతరకు వెళ్ళివచ్చిన మరుసటి ఉదయం వరకూ కథ కొనసాగుంటే, ఇంకా నిండుగా ఉండేది అని అనిపించింది. అయితే, బహుశా, ఆమె ఆ పని చేయటం వల్ల కలిగే పర్యవసనాలకన్నా అసలు ఆమె అలా వెళ్ళడంపైనే పాఠకుల దృష్టి నిలపడానికి అలా ముగించి ఉండచ్చు.

అనువాదం:

తమిళం చదవలేనివారికి ఆంగ్లానువాదం గొప్ప అవకాశం. అయితే, ఇంగ్లీషులో కొన్ని తమిళ పదాలను అలానే ఉంచేయడంతో చదవడంలో కొంత ఇబ్బంది కలుగచ్చు. ముఖ్యంగా, ఆ తమిళ పదాలవీ విని ఉండకపోతే, ఇంగ్లీషు వచనంలో మధ్యలో వాటిని చదవడం విసుగు కలిగించచ్చు. అలాగే, కథంతా గ్రామీణ ప్రాంతం జరుగుతుంది కాబట్టి అక్కడి భాషలోని నుడికారం, నానుడులు అన్ని ఆంగ్లంలో కనిపించవు.

అయితే, దాదాపు అన్ని అనువాదాల్లో ఉండే సమస్యలే ఇవి కూడా. ఎట్గర్ కెరెట్ ఓ చోట అన్నట్టు, అనువాదంలో మిగిలేది రసమంతా తీసేశాక మిగిలే పిప్పి మాత్రమే. ఈ కథలో ప్రాణం ఉంది. భావావేశం ఉంది. విశ్వవ్యాప్తంగా మనుషులు తమ మనుగడకై ఏర్పర్చుకున్న విధివిధానాలను గురించి మళ్ళీ ఆలోచించుకునేలా చేస్తుంది ఈ రచన. అందుకని, తమిళం చదవలేని వారు, ఈ అనువాదాన్నే ఆశ్రయించవచ్చు.

 కథలోని సామాజింకాంశాలు:

రెండొందల ముప్ఫై పేజీల ఈ నవల, భారతీయ గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. అందులోని అందమూ, వికారమూ కూడా సమపాళ్ళల్లో మన ముందుంచుతుంది.

ఈ రచనలో కీలకమైన అంశం, సంతానలేమి. మనిషికి కూడు, గూడు, గుడ్డ తర్వాత తన అంశ ఈ భూమిపై కొనసాగుతుండేలా ఉండాలని ఆశిస్తాడు. దానికోసం అవలంబించే పద్ధతులు మొదట్లో నాటుగా ఉన్నా, తర్వాతర్వాత నాగరికత, నాజుకుతనం సంతరించుకున్నా, ఆ ఆశ ప్రాధమికమైనది. కారణాలు ఏవైనా, ఆ ఆశ తీరనప్పుడు కలిగే మానసిక వేదనే కాక, సమాజం వారిపై తెచ్చే వత్తిడి ఎలాంటిదో తెలిపే రచన ఇది. డబ్బు, మంచితనం ఎంత ఉన్నా, కేవలం పిల్లలు లేరన్న కారణాన వారిని  social outcasts గా చూడ్డం ఎలా జరుగుతుందో, ఆ వత్తిడి ఎలాంటిదో చక్కగా చూపిస్తుంది. ఓ రకంగా ఆ వత్తిడి వల్లే మనుషులు తాము ఏం చేస్తున్నారో ఆలోచించుకోలేకపోతారని అనిపించింది. పిల్లలు పుడుతారని చెప్పి ఏవో ఒక ఆకులూ,అలమలూ తినిపించడం, ప్రాణాంతకమైన పరిస్థితుల్లో మొక్కులు తీర్చడం లాంటివన్ని ఆలోచింపచేస్తాయి.

ఇందులో చెప్పక చెప్పిన మరో విషయం భార్యాభర్తల అనుబంధం – మానసికంగానూ, శారీరకంగానూ. వాళ్ళ మధ్య బంధంలోని మాధ్యుర్యాన్ని మర్యాదలు అతిక్రమించని వచనంలో వివరించారు. ముఖ్యంగా, పిల్లలు లేరన్న బాధనూ, సమాజం చూస్తున్న చిన్నచూపునూ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మధ్యే కలబోసుకోవడం, ఒకరికొకరు తోడు-నీడగా ఉండడం ముచ్చట కలిగిస్తుంది. పెళ్ళై ఇన్నేళ్ళైనా పిల్లలు పుట్టడం లేదుగనుక, మళ్ళీ రెండో పెళ్ళి చేసుకోమని అతడికి సూచిస్తే, అతడి ఆలోచనలు ఈ విధంగా సాగుతాయి: “నేను మళ్ళీ పెళ్ళి చేసుకున్నా, నాకు పిల్లలు పుట్టకపోతే, లోపం నాలో ఉందని తేలిపోతుంది. ఒకవేళ పుడితే, తప్పు మొత్తం ఆమెదని తేలిపోతుంది. పుట్టినా, పుట్టకపోయినా నేనింకో పెళ్ళి చేసుకుంటే ఆమె పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అలాంటప్పుడు, నేను రెండో పెళ్ళి చేసుకోవడం అవసరమా?”

వాళ్ళిద్దరి మధ్య దాంపత్య సుఖం ఉన్నా కూడా, సంతానం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా పిల్లలు కలగకపోవడంతో వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. చుట్టుపక్కల ఊర్ల వరకూ ఎన్ని గుళ్ళునా, ఎందరు దేవుళ్ళున్నా అందరికి మొక్కుతారు. ఒకచోట, “అసలు వీళ్లకి పిల్లలే కనుక పుడితే, శేషజీవితమంతా ఈ మొక్కులు తీర్చడానికే సరిపోతుంది.” అని కూడా నరేటర్ అంటాడు.  మనకి దొరకని సమాధానాలన్నీ దేవుడు దగ్గర ఉంటాయని, దేవుడే ఆ సమాధానాలు సమయం వచ్చినప్పుడు మనకి ఇస్తాడని  నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈ నవల ప్రశ్నించినట్టు నాకు అనిపించలేదు.

అయితే, ప్రతిదానికి దాటకూడని ఒక గీత ఉన్నట్టే ఆ నమ్మకానికి ఉంటుందని. దాన్ని దాటితే అది మూఢనమ్మకం అవుతుంది. ఒకానొక జాతరకి ఒకానొక రాత్రి వచ్చే పురుషులంతా దేవుళ్ళని, వారి వల్ల కలిగిన బిడ్డలు మహాప్రసాదమని అనేదాని గురించి ఆలోచింపచేసే విధంగా ఈ కథ ముగుస్తుంది. అసలు అలాంటి ఓ ఆచారం కొన్ని దశబ్దాల వరకూ మన మధ్యనే ఉందనేది కొందరికి రుచించకపోవచ్చు. ఉన్నా కూడా, దాని గురించి ఇప్పుడు ఎందుకని ఇంకొందరు అనుకోవచ్చు. అనుకోవడాలు, అనడాలు దాటి పుస్తకాలని తగలబెట్టచ్చు. అంతమాత్రాన, ఇది చదవకూడని పుస్తకం అయిపోదు.

Book is also available in Kindle format in amazon.in

 

One Part Woman
Perumal Murugan
Fiction
Penguin India

You Might Also Like

4 Comments

  1. kothapalli ravibabu

    కధ చదివితే హిందుత్వ వాదులు చేసిన దాడి అసందర్భం అని తెలుస్తోంది .కధ విపులంగా రాసినందుకు ధన్యవాదాలు.

  2. వురుపుటూరి శ్రీనివాస్

    పూర్ణిమ గారికి

    థాంక్స్. ఇప్పుడే ఈ నవల చదవటం పూర్తి చేసాను. చివరి పేజీ తిప్పేసాక, “అరే, అప్పుడే అయిపోయిందా” అనిపించింది. కొంచెం హడావుడిగా ముగించారనిపించింది.

    నాకిందులో వివాదాస్పదమైనదేమీ కనిపించలేదు. ఒకప్పటి సమాజమూ, దాని preoccupations and concerns, గుళ్ళూ వాటి చుట్టూ ఏర్పడ్డ సాంస్కృతికావరణమూ – అన్నింటినీ విశ్వసనీయంగా చిత్రీకరించినట్లు అనిపించింది.

    “ఇలా జరిగింది” అని చెప్పటమే కానీ రచయిత మధ్యలో చొరబడి చెప్పింది చాలా తక్కువ కావటం ఇందులో మరో సుగుణం అనిపించింది.

    బావుంది.

    శ్రీనివాస్

  3. gsrammohan

    ఈ వివాదం పూర్వాపరాలు తెలియనివారికి ఉపయోగం. సరైన సమయంలో రాశారు. ఇంగ్లిష్‌లో రాసేవాళ్లు అనువాదం బాగుందని రాస్తున్నారు. దానిమీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చుకానీ ఇదైతే అవసరమైన సమాచారం.

  4. Halley

    Very interesting. Thanks for this. I was just reading an article on this book when i saw the fb notification from pustakam.net about this piece. Clearly it is getting a lot of attention these days.

Leave a Reply