పుస్తకం
All about booksఅనువాదాలు

January 8, 2015

ఏకాత్మమానవదర్శనం—అందరం ఒక్కటేనా? అదెలా?

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
************

వ్యక్తుల పరస్పర ప్రయోజనాల సంరక్షణ కొఱకై సమాజాలు ఏర్పడ్డం జరిగింది. వ్యక్తి లేనిదే సమాజానికీ , సమాజం లేని వ్యక్తికీ మనుగడ కష్టసాధ్యం. పరస్పర ఆవశ్యకత తెలిసినప్పటికీ వ్యక్తి, సమాజాల మధ్య ఘర్షణ తప్పట్లేదు. వ్యక్తి సమాజాన్ని నిర్దేశించాల్నా, సమాజం వ్యక్తిని నియంత్రించాల్నా అనే అయోమయం చుట్టూ ఆవరించి నిరంతరం ఒక దాని మీద ఒకటి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అనేక వాదాలు పుట్టుకు వచ్చినాయి. కమ్యూనిజం, సామ్యవాదం, మార్క్సిజం, స్త్రీవాదం, పురుషవాదం అన్నీ అవతలిపక్షం మీద అసంతృప్తితో పుట్టినవే.  ఒక వాదం పుట్టుకొస్తుంటే ఒక వాదం విఫలమని నిరూపింపబడడం, లేదా ఒక వాదాన్ని అణచి ఇంకొక వాదం పుట్టడం వంటి అసంతృప్తితో అసహజంగా పుట్టిన వాదాలు నిలువలేకపోవడానికి కారణం ఏమని , ప్రకృతిలోని ప్రాణుల పరంపర, గ్రహాల కూటములు మొదలైనవన్నీ సహజంగా పుట్టినవి ప్రళయాలను, ఉత్పాతాలను తట్టుకొని నిలిచినట్టుగా ఇవి నిలువలేకపోవడానికి కారణం ఏమి? వీటి మూలస్తంభంగా ఏదైతే ఉందో అది పరస్పర పూరకంగా లేకుండా పరస్పర వైరుధ్యభావనతో పుట్టినదే.

ఈ విషయాలను స్పష్టంగా , క్లుప్తంగా, హేతుబద్ధతతో నిరూపిస్తూ, ముఖ్యమైన విషయాలపై చక్కటి మార్గదర్శనం ఇచ్చేవిధంగా  విశ్వగతికి మేధోశక్తి గల మానవజాతి ఏవిధంగా తోడ్పడగలదో చర్చించి , శాశ్వత పరిష్కారపద్ధతిని నిరూపించి చూపే పుస్తకమే మరాఠీ రచయిత వి వి నెనె వ్రాసిన ఏకాత్మ మానవ దర్శనం.

మానవుని అంగాలుగా కాళ్ళు చేతులు ఒకదానికొకటి ఎప్పుడూ యుద్ధం ప్రకటించుకోకుండా సహకారబుద్ధితో ఎట్లుంటాయో అదే విధంగా సృష్టిలోని సమస్తప్రాణులు ఉండగలిగితే; (వర్గాలుగా మారిన మనుష్యజాతి పరస్పరం కలహాలు మాత్రమే కాక ) మనుష్యుల దురాశా మూర్ఖత్వాల వల్ల ప్రకృతి సంపదనీ, ప్రకృతి విలయతాండవంతో ప్రాణిసంపదనీ నాశనం చేయకుండా మానవశరీరాంగాలవలె పరస్పరం సహకరించుకుంటే అదే ఏకాత్మమానవ దర్శనం. పేరు చూసి మాకు సంబంధం లేనిది అనుకోడానికి ఏమీ లేదిక్కడ. అందరిలో ఉన్నదొక్కటే అందరి ఆకలిదప్పులు ఒక్కటే. అందరి మానసికానందం ఒక్కటే. అందరి చిదానందం ఒక్కటే.

ఆకలి దప్పులు అందరికీ ఒక్కటేనని అందరికీ తెలిసిందే. ఎంత ఉన్నతస్థాయికి చేరుకున్న మనిషైనా , సమస్తం సాధించగలిగిన వాడైనా ప్రపంచం ఇంకొంచెం అందంగా , శాంతిగా  ఉన్నప్పుడే మానసికంగా పరిపూర్ణానందం పొందగలననుకుంటాడు. ఆకాలపు బుద్ధుడే కాదు ఎప్పటికప్పుడు ఆగర్భశ్రీమంతులు ఆస్తులు విడిచి అష్టకష్టాలు పడుతూ కష్టజీవులనాదుకోవడం చూస్తే మానసికానందం అందరికీ తృప్తినిచ్చే వస్తువు ఎట్లయిందో తెలుస్తుంది. తన పరుగు గమ్యం చేరిన తరువాత తెలిసే విషయాన్ని ముందే తెలుసుకోగలిగే పరిణతి సాధించడమే ఆత్మోన్నతి.

మనిషి తను, తన కుటుంబం అనే చిన్న వలయం స్థాయినుంచీ విశ్వాత్మ స్థాయి ఆనందం పొందగలగాలంటే మానసికోన్నతిunnamed (1) ముఖ్యం. చిన్నవలయంలో ఉన్నవాడు పెద్ద వలయపు పరిధినీ, పెద్దవలయంలో ఉన్న వాడు చిన్న వలయపు స్థాయినీ గుర్తించలేనంత దూరాల్లో ఉంటే  ప్రపంచశాంతి ఎగబాకుడు దిగజారుడు చందంలోనే ఉంటుంది. అట్ల కాకుండ వీటిని విడివిడి స్థాయిలుగా కాక ఒకే స్థాయి యొక్క వృద్ధిగా తెలుసుకునే పరిణతి గురించి ఏకకేంద్రక వృత్తం, సర్పిలాకార వృత్తం సరిగ్గా ఉపయోగపడినాయి పుస్తకంలో.

ఏ దేశమైనా తన సహజమైన స్వభావాన్ని విడచి ఎంత ఆర్థిక రాజకీయస్వాతంత్ర్యాలను సంపాదించుకున్నా భావస్వాతంత్ర్యాన్ని (అంతర్లీనంగా మనందరిలోనూ ఉన్నదే) సంపాదించుకోకుంటే  ఎన్నటికీ తీరని సుడిగుండం వంటి కష్టాల్లో మనదేశం మాదిరే ఎట్ల చిక్కుకుంటుందో అనే ఆలోచనను రేకెత్తించే రచన ఇది.

సరిగ్గా ఇక్కడ మన ఆశ్రమధర్మాల స్థాయి విస్తృతి, పరిణతి ఎంతగా సంతరించుకోబడి ఉన్నాయో చక్కటి వివరణతో నిరూపించినారు. ధర్మమును ( మతం కాదు; ధృ అంటే ఆధారం. ధృ ధాతువు తో ఏర్పడ్డ శబ్దమే ధర్మం ) ఆధారంగా అంటే వ్యష్టి ధర్మము, సమిష్టి ధర్మము పునాదిగానే మిగిలిన పురుషార్థాలను సాధించేందుకు ఆశ్రమధర్మం ఉందని తెలుస్తుంది. బ్రహ్మచర్యాశ్రమం ధర్మనిర్వహణకు తగినశిక్షణ తీసుకొని తయారు కావడానికి ఉద్దేశించినదనీ, గృహస్థాశ్రమములో తనకు, సమాజానికి పూర్తిగా ఉపయోగపడేందుకే తన శక్తి సామర్థ్యాలను ఎట్ల వాడాలనీ, వానప్రస్థాశ్రమంలో వ్యక్తి  తన అన్నదాని మీద హక్కును, ఆధిపత్యపుభావననీ విడిచిపెడుతూ సమాజాభివృద్ధికీ, ఆత్మోన్నతికీ ప్రయత్నించాలనీ, చివరదీ, పైమెట్టు అయిన సన్యాసాశ్రమంలో ప్రపంచానికి సంబంధించిన ప్రతీదీ, చివరకు తన శరీరానికి సంబంధించిన ప్రతి మోహాన్నీ విడిచిపెట్టుకుంటూ ప్రతి అణువునుంచీ బ్రహ్మాండం వరకూ తనను తాను అర్పించుకుంటూ సాగే పయనాన్ని ఉన్నతలక్ష్యంగా ఏర్పడిన వ్యవస్థ ఇదనీ చక్కగా నిరూపించే ఈ నూరు లోపలే పుటలు గల ఈ పుస్తకాన్ని మరాఠీలోంచి ఆంగ్లానికి ఎంకె పరాంజపే, డి ఆర్ కులకర్ణి అనువదించగా తెలుగులోకి అనువాదాన్ని పేరున్న రచయిత్రి టి.శ్రీవల్లీ రాధిక గారు చేసినారు. భాష సహజంగా ఉన్నది. అనువాదానికి కావలసిన ముఖ్యలక్షణమది. రచయిత్రికి అభినందనలు.

unnamed (2)చింతకుడు అనే మాట కొత్తగా అనిపించి, తత్త్వవేత్త వంటి ఇంకోపదమేమీలేదా అనుకున్నాను. గానీ నిఘంటువులో మరికొన్నిచోట్ల చింతకుడు అనే ప్రయోగం ఉంది. నాకే ఇప్పుడు తెలిసింది. 🙂 కానీ సమాజపు ఆత్మకు చితి అనే మాట కన్నా చిత్ అన్న మాట సరిగ్గా సూటయ్యేదని నా ఉద్దేశ్యం. ఏకకేంద్రక వృత్తం, సర్పిలాకార వృత్తం సహాయపడినాయి.

తెలుగు అనువాదం సహజమైన చక్కటి భాషలో ఆపకుండా చదివించేటట్లు చేసిన శ్రీవల్లీ రాధిక గారికీ, ఒకటీ అరా తప్ప అచ్చు తప్పులు లేకుండా ప్రచురించిన నవయుగభారతివారికీ  అభినందనలు.

ప్రతులకు  బర్కత్ పురా హైదరాబాద్; గవర్నర్ పేట విజయవాడలోనూ సాహిత్యనికేతన్ ను సంప్రదించవచ్చు.

గమనిక- ఈ పుస్తకము ఆధ్యాత్మికవేత్తలకు మాత్రమేననుకుంటే పొరబాటే. అందరికీ అంటే రాజనీతివేత్తలకు, సాంస్కృతికవేత్తలకు, అభ్యుదయవాదులకు అందరికీ అధ్యయనం చేయదగ్గపుస్తకమని నా అనుకోలు.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.2 Comments


 1. 1965లో విజయవాడలో జనసంఘ్ విధానపత్రంగా ఈ ఏకాత్మమానవవాదాన్ని ఆమోదించిందని, దీనదయాళ్ ఉపాధ్యాయ ఈ దేశపు సాంస్కృతిక స్వభావాన్ని గురించి ఈ కోణంలో అవగాహన పెంచేందుకు కొన్ని ఉపన్యాసాలిచ్చినారనీ, ఢిల్లీలోని దీనదయాళ్ శోధ్ సంస్థాన్ లో పొందుపఱచబడిన సాహిత్యాన్ని కూడా వీటితో పరిశీలించి ఈ గ్రంథం రాసినట్టుగా వివినెనె గారు పుస్తకంలో ముందుమాట వ్రాసినారు. మరాఠీలో ఎప్పుడు విడుదలయిందో తెలియదు నాకు.
  (ఈ సమాచారం ఇప్పటికే ఒకరి బ్లాగులో ఇచ్చినదే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ప్రత్యేకంగా వద్దనుకోడాలు ఏమీ లేవు.)
  హేలీ గారు, మూలమైన మరాఠీ పుస్తకంపేరు, ఆంగ్ల అనువాదపు పేరు పుస్తకంలో లేవు. కానీ జనసంఘ్ విధానపత్రం గా అంగీకరించడాన్నీ, దీనదయాళ్ ఉపాధ్యాయ ఉపన్యాసాల గురించి ముందుమాటలో ఉంది.
  ఏకాత్మ గా సృష్టినంతట్నీ చూడడం ఎలా అన్నది వివరించిన పద్ధతి చాలా బాగా అనిపించిందినాకు.
  అందుకని పుస్తకంలో ఏముందో పరిచయం చేద్దామని వ్రాసినానుగానీ, ‘వద్దని’ అనుకోవడాలు ఏమిటి?
  ప్రచురించిన పుస్తకంలో ఆ మాట ఉండగా ఇక్కడ ‘వద్దను’కోవడంలో అర్థం ఏమీ ఉండదు.
  మీరు చెప్పిన పుస్తకం గురించిగానీ భారతీయజనతాపార్టీ మూలగ్రంథం గురించి గానీ నాకేమీ తెలియదు.


 2. Halley

  ఇది ముందు జన సంఘ్ అటు తర్వాత భారతీయ జనతా పార్టీ తమ తమ మూల గ్రంథంగా భావించిన “Integral Humanism” తాలూకా అనువాదమేనా? అలాంటప్పుడు ఆ ప్రస్తావనే లేదేమిటి? పుస్తకములోనూ లేదా లేక పరిచయంలో మాత్రమే వద్దని అనుకున్నారా?  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నీలాంబరి – నా అభిప్రాయం

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ******************* కథలు అనేకకోణాల్ని స్పృశించి ఆలోచించ...
by అతిథి
1

 
 

కథా కబుర్లూ కాలక్షేపమూ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************* పొత్తూరి విజయలక్ష్మి గారు హాస్యకథలకు ప...
by అతిథి
0

 
 

ఇమ్మడి పులకేశి – చారిత్రక నాటకం

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ******** “పండురంగడు అనే చాళుక్యసేనాని పండ్రెండు ...
by అతిథి
0

 

 

మేరల కావల…….

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి **************** ’మేరలకావల’ అనే పేరుతో తెలుగు ఉన్న ప్ర...
by అతిథి
2

 
 

స్వర్గానికి నిచ్చెనలు – అస్తి నాస్తి ల గంభీర చర్చ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ భారతీయ భాషల్లో ఆలోచనాత్మకమైన రచనలకు ఏ క...
by అతిథి
0

 
 

రైతురాయ-గుత్తి జోళదరాశి చంద్రశేఖరరెడ్డి గారి కన్నడ రచన

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ********** రైతే రాజు అన్నమాటను అక్షరాలా నిరూపించే ...
by అతిథి
0