కళాపూర్ణోదయం – 6 : అభినవకౌముది – శల్యాసురుడు

వ్యాసకర్త: జాస్తి జవహర్
*********

మహిషాసురుని మేనమామకొడుకు శల్యాసురుడు. అతనికి ఒంటినిండా ఏదుముళ్ళు ఉండటం వలన అతనికాపేరు వచ్చింది. దుర్గాదేవి మహిషాసురుని వధించిన కారణంగా, ఆమె మీద పగతో ఉన్నవాడు శల్యాసురుడు. ఎవరినైనా ఎదిరించగల శక్తి తనకున్నది. పగతీర్చుకోవటం ఒక లెక్క కాదు. కాని అందుకు ప్రతిగా విష్ణుమూర్తి తన రాక్షస సంతతిని మొత్తం అంతం చేస్తాడేమోనని అతని భయం. ఆప్రమాదం లేకుండా దుర్గాదేవి మీద పగ తీర్చుకోవటం ఎలాగని ఆలోచిస్తున్నాడు. అతనికి కామరూపధారణశక్తి ఉన్నది. ఒక తాపసి రూపంలో ఒక వనంలో సంచరిస్తుండగా అభినవకౌముది అతని కంట పడింది. కనిపించినదే తడవుగా మోహావేశంతో ఆమెను వెంబడించటం మొదలు పెట్టాడు.

అభినవకౌముది ఒక అప్సరాంగన. తుంబురుని వద్ద గానవిద్యాభ్యాసం కోసం భూలోకంలో ఉన్నది. ఏదైవ సంకల్పమో, ఆమె శల్యాసురుని కంట పడింది. పడిందే తడవుగా అతనికి మతి పోయింది. దుర్గమీద పగతీర్చుకునే ఆలోచన ప్రక్కనపెట్టి, ఆమె వెంట పడ్డాడు. తనను వరించమని ప్రాధేయపడ్డాడు. తన తాపసిరూపం తాను తెచ్చుకున్నదేనని, ఆమె రూపరమణీయతకు తగిన ఆకర్షణీయమైన పురుషాకృతిని ధరించి ఆమెను రంజింపజెయ్యగలనని, అందువలన తనను వరించి కృతార్థుణ్ణి చెయ్యవలసిందని ప్రార్థిస్తాడు. అతనివంక ఈసడింపుగా చూచి, మారుమాటాడకుండా వెళ్ళిపోతుంది అభినవకౌముది. అతని అహంకారం దెబ్బతిన్నది. ఆమెను బెదిరించాలని చూచాడు. ఈభూలోకంలో తననెదిరించగలవాడెవ్వడూ లేడని, తాను కోరిన యువతిపైన కన్నువేసే ధైర్యం వేరెవరికీ ఉండదని, అందువలన తనను తిరస్కరించటం ఆమెకేవిధంగానూ శ్రేయస్కరం కాదని ఆమె వెంటపడతాడు. ఆమె కోపించి “నిన్ను చంపినవాడినే నేను పెళ్ళాడతాను” అని శపథం చేస్తుంది. అతనికది సవాలుగా తోచింది. తనలో తానే నవ్వుకున్నాడు. తనను చంపగలవాడెవ్వడు? ఎప్పటికైనా ఆమెతనదేనన్న నమ్మకం అతనికి కలిగింది. ఆమెనుగురించి ఆలోచిస్తూ తిరుగుతుండగా మృగేంద్రవాహనాలయం కనిపించింది.
ఆలయంలో శిలాఫలకం మీద ఉన్న శాసనం చూచాడు. “ఈ గండకత్తెరతో తన శిరసు ఖండించుకున్న వానికి శిరసు తిరిగి పొందటమేగాక తనను వధింపజూచువానిని చంపగల శక్తి అబ్బునని”  ఆశాసనంలో ఉన్నది. అతనికి అభినవకౌముది ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చింది. తనను చంపినవానినే పెళ్ళాడతాననిగదా ఆమె శపథం! మరి అతడు తనచేతిలోనే హతుడైనప్పుడు ఆమె ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుంది? గత్యంతరం లేక ఆమె తనను వరించక తప్పదు, అని ఆలోచించాడు.

ఆగండకత్తెరతో దేవి ముందు తనతలను ఖండించుకున్నాడు. రక్తం పారింది. కని శిరసు తిరిగి అతనికి అతికింది. శిలాశాసనం ప్రకారం అతనికి కావలసిన శక్తి లభించింది. బలోన్మతుడై, దేవి ఆలయాన్నే కూల్చివెయ్యాలనే దురూహతో ఉన్నాడు.
అప్పుడే అక్కడికి ఆలయాన్ని వెదుక్కుంటూ వచ్చింది అభినవకౌముది. ఈరాక్షసుడిబారినుంచి రక్షణ పొందటం ఎలాగని చింతిస్తున్న సమయంలో మృగేంద్రవాహన ప్రభావం గురించి విన్నది. ఆమె ఆశీర్వాదంతో తాను క్షేమంగా ఉండగలనని ఆశించి వచ్చింది. కాని అక్కడ తిరిగి ఆరాక్షసుడే ప్రత్యక్షమయ్యేసరికి భయపడింది. ఆమె కంటపడితే శల్యాసురునికి ఇతరమేమీ కనిపించదు. అదే అతని మోహావేశం. “నన్ను చంపిన వానినే పెళ్ళాడతానన్నావుగదా! ఇక్కడచూడు. ఈశిలాఫలకం మీద ఉన్నట్లుగా నాశిరసును ఖండించుకున్నాను. దీనితో నాకు కలిగిన వరంప్రకారం నన్ను చంపదలచిన వానిని నేనే సంహరిస్తాను. ఇక నన్ను చంపేదెవడు? నీవు పెళ్ళాడేదెవరిని? ఇప్పటికైనా నాశక్తిని గుర్తించి, నన్ను వరించితే సుఖపడగలవు.” అని ఆమెకు బోధించాడు. అతడు శిరసును ఖండించుకున్నాడనటానికి నిదర్శనంగా అక్కడ రక్తపు మడుగు కనపడుతున్నది. శిలాఫలకం మీది శాసనం అతనికి కలిగిన వరప్రభావాన్ని సూచిస్తున్నది. ఇక తనకు దిక్కెవ్వరని ఆమె ఆక్రోశించింది. ఏవిధంగానైనా ఈమృగేంద్రవాహనయే తనను రక్షించాలని గర్భగుడిలో చేరి దేవి పాదాలనాశ్రయించింది. ఆమె గత్యంతరం లేక తనదగ్గరకే వస్తుందని ఎదురు చూస్తూ బయటనే తచ్చాడుతున్నాడు శల్యాసురుడు. దేవి తనశాసనాన్ని తానే ధిక్కరించదుగదా! అదే అతని నమ్మకం.

దేవి పాదాలనాశ్రయించి అభినవకౌముది తనగోడు వెళ్ళబోసుకున్నది. ఆరాక్షసుడినుంచి తనను రక్షించమని వేడుకున్నది. తనప్రతిజ్ఞ నెరవేరే దారి చూపమని ప్రార్థించింది. దేవి ప్రత్యక్షమయింది. అతనిద్వారా తన ఆలయానికి కలుగగల ప్రమాదాన్ని నివారించటానికి అభినవకౌముది ద్వారా ఒకదారి దొరికిందని సంతోషించింది. ఆమెనోదార్చింది. “అతడు చేసిన సాహసానికి ప్రతిఫలంగా అతనికి శక్తిరాకతప్పదు. కాని నీకొక ఉపాయం చెపుతాను. అతనికి కలిగిన వరం ప్రకారం అతనిని చంపగోరువానిని అతడు చంపుతాడు. కాని అతని చేతిలో ఇతడు చావడని ఏమీలేదు. అతనిని చంపగలవాడొకడున్నాడు. అతడే మణికంధరుడు. ఇప్పుడతడు శ్రీశైలంలో భృగుపాతసన్నద్ధుడై తనువుచాలించే ప్రయత్నంలో ఉన్నాడు. అతడొక ఖడ్గాన్ని ఇక్కడవిడిచి వెళ్ళాడు. ఈఖడ్గాన్ని దత్తాత్రేయుడు స్వభావనామధేయుడైన ఒక సిద్ధునకిచ్చాడు. అతడు దానిని తన అల్లుడైన మణిస్తంభునకిచ్చాడు. దానిని అతడొక సందర్భంలో మణికంధరునకిచ్చాడు. అప్పటి తనపని ముగిసిన తరువాత మణికంధరుడు దానిని ఇక్కడ వదిలి వెళ్ళాడు. కాని అది అతనికి సక్రమంగా సంక్రమించిన ఆయుధం. అందువలన అతని చేతిలో శక్తివంతమవుతుంది. ఈకత్తి ఎవరిపైన ఎత్తినా అతనిని తునుమాడకమానదు. అందువలన దానితో ఈరాక్షసుని సంహరించటం తథ్యం. మణికంధరుడెలాగూ తనువు చాలించే ప్రయత్నంలోనే ఉన్నాడుగనుక అతడు తనమరణానికి సంకోచించడు. ఆవిధంగా ఈరాక్షసునికిదక్కిన వరప్రభావం నిజమవుతుంది. మణికంధరుడు మరణం తరువాత కళాపూర్ణుడుగా నిత్యయవ్వనుడుగా జన్మిస్తాడు. అప్పుడు నీవాతనిని పెండ్లాడి నీప్రతిజ్ఞను నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడీరాక్షసుడు నీమీది మోహం కారణంగా నిన్నేమీ చెయ్యడు. చాకచక్యంతో అతనిని శ్రీశైలం వరకు తీసుకుపోయి, ఈకత్తిని మణికంధరునికిచ్చి ఇతనిని వధించి నిన్ను రక్షించవలసిందిగా వేడుకో. దాని వలన భృగుపాతఫలంగూడా సిద్ధిస్తుందని చెప్పు. అన్నీ నీవనుకున్నట్లే జరుగుతవి.” అని ధైర్యం చెపుతుంది.

అభినవకౌముదికి ధైర్యం వచ్చింది. పైట సవరించింది. నడుం బిగించింది. జుట్టుముడివేసింది. కత్తిని చేతబట్టింది. చేతిలో కత్తితో బయటికి వస్తున్న ఆమెను చూచి శల్యాసురునికి ఆమె తనను చంపే ఉద్దేశంతో వస్తున్నట్లు అనుమానం కలిగింది. తనకు ప్రాణభయం లేదు. కాని ఆకారణంగా ఆమెకు ప్రాణహానికలుగుతుందని అతని భయం. ఆమె అతని ప్రియురాలు. ఆమెకేవిధమైన అపకారమూ కలగటం అతడు సహించలేడు. ఆమెను బలవంతంగా వశపరచుకోవటం గూడా ఇష్టం లేదు. ఆమె తనను ఈసడించినా ఆమె మనసుకోసం ఆరాటపడుతున్నాడుగాని మనసుమరల్చుకునే ప్రయత్నం చెయ్యలేదు. ఆమె అతని మరణం కోరుతున్నా అతడామెను రక్షించటానికే ప్రయత్నిస్తాడు. ఆమె ఒక్కచూపుతో పరవశుడవుతాడు. ఒక్క మాటతో మూర్చపోతాడు. అదే అతని ప్రేమలోని విశిష్టత! అది మూర్ఖత్వం కూడా కావచ్చు. “నీవు నన్ను వధించాలనుకుంటే ఇష్టదేవతలమీద ఒట్టు. నాకు ప్రాణభయం లేదు. కాని ఆప్రయత్నంలో నీవేమవుతావోనని నాబాధ” అని వివరిస్తాడు.

అందుకామె “నన్ను బాధించటం ఇష్టం లేని నిన్ను వధించేటంతటి మూర్ఖురాలను కాను. ఇక నీయిష్టప్రకారమే నడచుకుంటాను.” అని ప్రయాణం మొదలు పెడుతుంది. ఆమాటలకు సంతసించి ఆమెనే అనుసరిస్తాడు. ఆమె శ్రీశైలం వైపు దారి తీసింది. దారిలో చూపులతోను, కవ్వింపు మాటలతోను అతనిని భ్రమింపజేస్తూ తనవెంట తీసుకుపోతున్నది. కొంతసేపటికి అతనికి విసుగు కలిగింది. “నాయిష్టప్రకారం నడచుకుంటానన్నావు. ఇదేమిటి?” అన్నాడు. “ఏంచేశాను? నీమీదకు రావద్దన్నావు. రాలేదుగదా!” అని ఇంకా వేగంగా నడవటం మొదలుపెట్టింది. “మన్మధాతురుడు కానన్ నేర్చునే ఏమియున్”. ఆమె మీది మోహంతో ఆమెవెన్నంటి నడుస్తూనే ఉన్నాడు. కొంతసేపటికి అతనికి తిరిగి అనుమానం కలుగుతుంది, ఆమె తనను ఆటపట్టిస్తుందేమోనని. “నీమాటనమ్మినందుకు నేను చేతగాని వాడిననుకుంటున్నావేమో! జాగ్రత్త. నీదారి ఎడారి చేస్తాను. ముళ్ళకంపలతో నింపుతాను చూడు.” అని అతని శరీరాన్ని విదిలించాడు. శరీరంలో ఉన్న ఏదుముళ్ళు విడివడి నలువైపులా చిమ్మినట్లు పడ్డాయి. ఆ ముళ్ళుతగిలిన జంతువులు బాణాలుతగిలినట్లుగా పడిపోయాయి. ఆమెకు భయం కలిగింది. శ్రీశైలం దగ్గరపడుతున్నది. వేగం పెంచింది. అతడామెను అనుసరిస్తూనే ఉన్నాడు.

ఆమె శ్రీశైలం చేరేసరికి శివరాత్రి మహోత్సవసందర్భంగా జనం గుమిగూడిఉన్నారు. శల్యాసురుని కారణంగా ముళ్ళవాన కురుస్తుందని అందరినీ హెచ్చరించింది. మణికంధరునికోసం వెదకి అతనిని సమీపించింది. అప్పటికే శల్యాసురుడు కోపంతో ముళ్ళవర్షం కురిపిస్తున్నాడు. ఆవర్షానికి కారకుడైన ఆరాక్షసుని సంహరించి తనను, ప్రజలను కాపాడమని మణికంధరుని కోరుతుంది. ఆమె ఎవరని, అతడెవరని మణికంధరుడు వేసేప్రశ్నలకు సమాధానం చెప్పటానికి సమయం లేదని, అతనిని సంహరించటంవలన మణికంధరునికి భృగుపాతఫలం లభిస్తుందని, అది మృగేంద్రవాహన వచనమని మాత్రం చెపుతుంది. ఇంతలో శల్యాసురుడు దగ్గరగావటంతో ఇద్దరూ తలపడ్డారు. ఇద్దరూ మరణించారు.

ఆవిధంగా తనువు చాలించిన మణికంధరుడు కళాపూర్ణుడుగా జన్మించాడు. జన్మతోనే యవ్వనుడయ్యాడు. అతనిని సమీపించి అభినవకౌముది తన కథను వినిపించి, ఎప్పుడూ భూలోకం విడిచి వెళ్ళనని ప్రమాణం చేసి అతనిని గాంధర్వవిధిగా పెళ్ళాడుతుంది. ఆవిధంగా తన శపథం నెరవేర్చుకుంటుంది.

You Might Also Like

Leave a Reply