శివా రెడ్డి – జైత్ర యాత్ర ( శివా రెడ్డి గురించి ఒక అంచనా)

రాసిన వారు: ఆంధ్రుడు

[ఈ వ్యాసం మొదటిసారి 17 ఫిబ్రవరి 2006 న తెలుగుపీపుల్.కాం వెబ్సైటులో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం]

జైత్రయాత్ర అనే కవితా సంకలనం 1973 లొ ప్రచురించిన రక్తం సూర్యుడు నుండి మొదలు 1997 వరకు రాసిన ‘ నా కలల నది అంచున ’ వరకు ఉన్న compilation .

jaitrayatraనాకెందుకో శిల్పం గురించి చర్చ జరిగినప్పుడల్లా శివా రెడ్డి గుర్తొస్తాడు. కవిత్వంలో తనదంటూ ఒక style పెట్టుకుని ముక్కు సూటిగా కవిత్వం రాసుకుంటూ వెళ్ళి పోయే తత్వం తన కవిత్వం లో కనిపిసుంది. ముందుమాటలో నందిని సిధారెడ్డి అన్నట్టు కవిత్వం లో శివా రెడ్డి శైలి, శివా రెడ్డి శిల్పం , శివా రెడ్డి ఎక్స్ప్రెషన్‌ అని గుర్తించేంతగా ఉన్నత దశకు చేర్చాడు .

శివా రెడ్డి – భావ , అనుభూతి వాద కవిత్వం లో డోలలాడుతున్నట్టు ఉండడు. ఒక విభిన్నత ఉంటుంది ఎక్స్ప్రెషన్‌ లో. ఉదాహరణకు రిజరెక్షన్‌ కవితలో ఇలా అంటాడు.

ఈ చిరుగాలి
నా తల వెంట్రుకల సరివి చెట్లను ఊపి, ఊపి
ఫ్లూటులా ఊదేస్తుంది

చిరుగాలి అంటే ఏదో ఆహ్లాదంగా అలా సున్నితంగా తాకుతూ మెత్తగా సవ్వడి చేస్తూ సోకే గాలి అనిపించదు. కవిలో ఒక చిరాకు ను చిరుగాలి గుర్తు తెస్తుంది.

ఇతని శైలి లో ఒక గజిబిజి ఆలోచన సమూహం ఉన్నట్టు చప్పున అనిపిస్తుంది. సాధారణంగా ఏదన్నా కవిత చదివితే అందులో శైలి అక్కడో ఎప్పుడో ఒక లింకు ఉన్నట్టు ఒక మూల తడ్తుంది. అది కవిత లో ఉన్న మాత్రల సంఖ్య వల్లనో, వాక్య నిర్మాణం వల్లనో, సమాసాల వల్లనో, వాడుక శైలిలోనో, గమనించే విషయం లో ఉన్న విధానమో…ఎక్కడో ఒక చోట ఎప్పుడో చదివిన కవితతో పోలిక కుదిరినట్టు ఉండడం చాలా వరకు సాధారణం. ఐతే ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి లింకు కనిపించని కవిత చదివితే అది శివా రెడ్డి కవిత అయిఉంటుంది.

భూమ్మీద పాదం మోపుతావు
భూమ్మీద కళ్ళని మోపుతావు కంటి చూపుల్ని మోపుతావు
చూపుల్లో ఎగిరి పడుతున్న సముద్రాలని ఒంపుతావు

ఒక విషయాన్ని ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా…ఒక aerial view లో దృశ్యాన్ని చిత్రీకరించడం శివా రెడ్డి ఎత్తుగడ. అందుకే భూమ్మీద కళ్ళను మోపుతావు కంటి చూపుల్ని మోపుతావు అంటాడు. ఇందులో ప్రత్యేకత ఏమంటే ప్రతి సన్నివేశం – అనగనగా ఒక రాజు తో మొదలైతే గాని కథ మొదట్నుంచీ మొదలైనట్టు కాదు అని చెప్పడం. ఎక్కడో మధ్యలో నుండి వివరించడం మొదలు పెడ్తాడు. మొదటగా పాఠకుడు తాను ఏ దిశలో వెల్తున్నాడో తెలుసుకునే లోపు విషయన్ని అర్థం చేయించడం మొదలు పెడ్తాడు. అలాగే ambiguity ని ఒక కవితా పనిముట్టుగా వాడుకునే కవి ఆయన. అంటే కవికి ambiguity ఉందని కాదు. కవికుండే observation power ను గుట్టుగాఅ విప్పడం.

ఎవడో స్కూలు కుర్రాడు
నాలుగైదు కిరణాల్ని సంచిలో వేసుకుని మధ్యలో వచ్చిపోతాడు
( నల్ల పిల్ల)

రెండు పరుపులు కలిపి కుట్టిన నావ మీద
రెండు శవాలు సముద్రాంతర్భాగానికి ప్రయాణమౌతాయి
( లో లాకులు)

శివారెడ్డి లో కనిపించేది కవిత రాస్తూ రాస్తూ మధ్యలో ఆకస్మికంగా శుద్ధ వాక్యంలోకి వెళ్ళిపోవడం…మధ్యలో ఒక విరామ సమయాన్ని ప్రకటిస్తున్నట్టుగా. ఇది చాలా మంది పాఠకులకు కొంత చిరాకుగానే ఉండవచ్చు. ఇక్కడ శుధ్ధ వచన ప్రక్రియను కవిత్వంలో ఎలా నింపాలో ఒక systematic అవగాహనతో చేసే ప్రక్రియ వల్ల నిజానికి కవిత్వానికి వచ్చిన చేటు ఏమీ లేదు.

చేరా గారు అన్నట్టు ఊహల ద్వారా వ్యక్తమైన ఉక్తి వైచిత్రి శివారెడ్డి కవితల్లో కనిపిస్తుంది. ‘ నెలవంక ముక్కుకి మురికి చొక్కా వేలాడ దీస్తుంది ’ లాంటి కొన్ని extreme ప్రయోగాలు అతని కవిత్వం లో కనిపిస్తాయి. చెప్పే విషయం చాలా బండగా చెప్తాడు శివా రెడ్డి. అతనిలో సున్నితత్వం లేదు. అంటే మధ్య తరగతి సున్నితత్వం లేదు. బాధ పడే విషయాన్ని పెదవి విరిచి ‘ ప్చ్‌ ’ అని కవిత రాయడు. ‘ పొడవాటి దరిద్రం నాలుకతో గాయాల్ని నాక్కుంటూ కూర్చుంటాను ’ అని ఒక భావాన్ని, అనుభూతిని సాంద్ర తరం చేస్తూ చెప్తాడు. ఇతడి కవితల్లో వాక్యాలను cut cut చేస్తూ మధ్యలో లేదా చివర్లో విరగ్గొట్టేసి లేదా ఒక కర్త కర్మ నుంచి క్రియను మాత్రం సగం గా చేసి economy of words పేరుతో వాక్యాన్ని కట్టె – కొట్టె – తెచ్చె లాగ ముగించి ఇది కవిత అని చేతులు దులుపుకునే విధానం శివా రెడ్డి ది కాదు. అలాగే అతని కవిత్వం లో విపరీతమైన repetition and redundancy ఉందనే విమర్శలో నిజమూ లేకపోలేదు. మరి అది అతను తెలియకుండా ఏదో ఊకదంపుడులో భాగంగా చేస్తున్నాడు అని reckless గా నిందించబుద్ది కాదు అతని తతిమ్మా రచనలు చూస్తే. perhaps అది అతడి తీవ్రమైన limitation అనుకుంటాను. అందుకే చేరాగారు ఒక చోట ( 1985 ) ‘ ఔన్నత్యంతో పాటు సారళ్య,్‌ ఆవేశం తో పాటు సమ్యమనం అలవర్చుకుని ఇంకా గొప్ప కవిగా ఎదగమని నిర్మొహమాటంగా చెప్పటానికి ఆ విమర్శ ’ అని శివా రెడ్డి కి హిత భొధ చేసే ప్రయత్నం చేస్తాడు. especially ఈ ధోరణి 1980 ల నాటి కవితల్లో తీవ్రంగా అగుపిస్తుంది. ఇటువంటి అకవిత్వ ధోరణులనబడే కవితా ప్రయోగాలు రాను రాను తగ్గుముఖం పట్టాయి అన్నది కూడా గమనిక. ( 2002 లో చేరా శివా రెడ్డి కవిత్వం లో ఆశించిన మార్పు కనిపిస్తుంది అంటూ శివా రెడ్డి మీద పరుషమైన భాషతో చేసిన విమర్శ గురించి regret అవుతాడు. )

ఒక్కో సారి శివా రెడ్డిని అధివాస్తవైక కవి అని ఖచ్చితంగా క్లాసిఫై చేయొచ్చా అని సందేహం కలుగుతుంది.

నిన్న సాయంకాలం రాలిన సూర్యుడు ఇప్పుడు
నా వేళ్ళ కొసల మీద నారుమళ్ళలా మొలుస్తున్నాడు

( ఆగస్టు ఆరు )

భాష కూడా పగులుతుంది కదా
పదేళ్ళకే బతుకు బరువంతా మీద పడి
కళ్ళల్లో లోకాల ఏకాకి తనం గూడు కట్టుకుని
అద్దం పలకల మీద నేరస్తులు నిద్ర పోతున్నప్పుడు
భాష తప్పకుండా పగులుతుంది

( భాష కూడా )

నన్ను దాటి అంతా వెళ్ళిపోతున్నారు
నన్ను దాటి అంతా కదిలిపోతుంది
నేనో నీటి మట్టంగానే మిగిలి

శివా రెడ్డి ఒక కవిగా మొహమాటం లేని expressions కలిగిన వ్యక్తి. ఈయన కవిత్వంలో మనం వెదికే చిక్క దనం ఉండదు. గాలిలా పారదర్శకంగా ఉండదు కూడానూ. నీటి తెరలా ఇతని కవితల్లో మనల్ని మనమే చూసుకుంటూ మరో వేపు ఉన్న ప్రాపంచిక అస్తిత్వాన్ని దర్శించొచ్చు కూడా.

ధ్వంసం చేయ తగిందేదీ లేకపోతే నీకీ లోకంలో
నువ్వు తప్పకుండా ధ్వంసం చేయతగిన వ్యక్తివి

తనను గురించి తాను నిశ్కర్హ్సగా వివరించుకుంటాడు. తాను కమ్యూనిజం అన్న అభిమానం చూపిస్తే తాను కవి కాడు రాజకీయ వాది అని ఎవడు వెలివేస్తాడో అన్న సంకోచం లేని వాడు. తాను నమ్ముకున్న నియమాన్ని ముందుగా నే వివరిస్తాడు. ‘ నేనెప్పుడూ ఇతరుల్ని సంతోష పెట్ట డానికో సంతృప్తి పరచడానికో లేదూ వాళ్ళ చేత మెప్పు పొందడానికో రాయ లేదు. నన్ను నేను చీల్చుకుని దహించుకుని పుటం పెట్టి పరీక్షించుకుని, అదొక పవిత్ర ధర్మం లానే రాశాను ’ . కవికి కావాల్సిన నిబద్ధత శివా రెడ్డి లో కనిపిస్తుంది. సాయంకాలం టేంక్‌ బండ్‌ మీద కూర్చొని చల్లటి సాయంత్రం లో మెల్లగా కదిలే హుస్సేన్‌ సాగర్‌ నీటి పొరల గురించి వర్ణించి దీనంగా చేత్తో ఒక్క రుపాయి వెయ్యమని అడిగే పిల్లాడిని neglect చేసే రకం కాదు.

తనను ఏది కదిలించిందో స్పష్టత కలిగిన కవి. విరసం లో నేను సభ్యున్ని కాకపోయినా విరసం నా మీద అపారమైన ప్రభావం చూపింది అని ఒప్పుకుంటాడు. అందుకు సంకోచము సందేహమూ లేవు ఆయనకు. ముందు మాట లో తాను మొదట్లో ఎలా తలా తోక తెలియని పరిస్థితిలో ఎలా ఊగిస లాడాడు అని కొత్తలో ఉదయించే కవిగా తనలో ఉండే సంఘర్షణ బయట పెట్టుకుని తానెలా అధ్యయనమ్‌ అన్న కృషితో ముందుకెదిగిందో చెప్పుకుంటాడు.

శివారెడ్డిలో సున్నితత్వం లేదు అని కాదు. అతనిలో ఒక బండ సున్నితత్వం ఉంది. అది మధ్య తరగతి బాధల్ను చూసి ప్చ్‌ అని పెదవి విరిచే సున్నితత్వం కాదు. బతుకు బండల్ని పగల కొట్టి సీసం లా కరిగించి పోఅయలనే ప్రయత్నం.

ఆకులో ఆకాశాన్ని
ఆకాశం లో అడవుల్ని చూడ లేని వాడు
మనుషుల్లో మహత్తర ఆకాశ అటవీ సౌందర్యాల్ని చూడలేడు

( చూపు)

నల్ల మేఘం రవిక వెనక రవి స్తనాన్ని చూడ లేని వాడు
మనుషుల్లోని తిరుగు బాటు పొద్దుటిపూటల్ని చూడ లేడు

(చూపు)

కళ్ళల్లో సూర్యుడు కదలాడని వాడు ప్రపంచాన్ని స్పృశించలేడు

( భార మితి )

బిక్షగాడి దీన చూపులకు రేకెత్తిన జాలి కెరటాలు అణా కానీ విదిల్చి అణిచేసి తన మానవీయతను, కవిత్వపు గ్రీజు చిక్కదనాన్ని ప్రకటించుకుని మానవతా దృక్పథాన్ని సంకుచితం చేసి బంధించే కవిత్వం కావాలంటే శివా రెడ్డిని చదవొద్దు. శివా రెడ్డి ఒక సీరియస్‌ కవి. కవికి నిబద్ధత ఉండడం అంటే ఎలానో, చుట్టూ ఉన్న పరిసరాల్లో మనల్ను మన జీవితాల్ను చూడాలనుకుని ఆశ పడితేనో ఆయన కవిత్వాన్ని చదవండి. మన చుట్టూ మనకు తెలీకుండా అల్లుకున్న కృత్రిమత్వాన్ని, మనలో పేరుకుపోయిన మొహమాటాల్ని, మధ్య తరగతి సున్ని తత్వాన్ని నిర్మొహమాటంగా తన్ని నిజాయితీగా తరిమేస్తూ కవిత్వాన్ని ఎలా పుట్టించొచ్చా అనుకున్న వాళ్ళకు శివారెడ్డి ఉపయోగపడ్తాడు.

శూన్య శబ్దాలు నిండిన గుప్పెళ్ళలా
చినుకులు రాలేటప్పుడు
చెరువు మీద ఏర్పడ్డ లలితంగా వణికే
చిన్న దోనెల్లాంటి గుంటలు
దుఃఖాఙి నింపుకున్న పెదాల్లా వణుకుతాయి

‘ప్రజల రహస్య భాష తెలిసిన వాడే కవి’ అని ముందు మాట లో నందిని సిధా రెడ్డి రాసినట్టుగా శివా రెడ్డి ఒక వేగులవాడు. అతని దగ్గర రహస్యాల్ని పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదులే అనుకుంటే యధా విధిగా కవిత్వం లో రొటీన్‌ చిక్క దనం గురించి అలోచించవచ్చు. రుబ్బు రోలుతొ రుబ్బితే మజ్జిగకు చిక్క దనం రాదు….అందుకు కవ్వం సరి చేసుకోకపోతే తప్ప.

సాహిత్యమెన్నడూ చవి చూడని ఒక శైలిని ఎలా నిర్మించొచ్చో అన్న సీరియస్‌ దృష్టి ఉన్న వాళ్ళు మిస్‌ చేయ కూడని కవి శివా రెడ్డి. చదివి ఉంటే ఓసారి నిశితంగా మళ్ళీ మళ్ళీ చదవండి. ప్రతి వాక్యం దగ్గర ఆగి ఆగి చదవండి. ఒక blank paper లా మారి చదవండి. చదవకుంటే ఓ సారి ప్రయత్నించి చూడండి.

Annexure:

వృత్తి రీత్యా ఇంగ్లీషు లెక్చరర్‌ గా మొదలై కాలేజీ ప్రిన్సిపాల్‌ గా రిటైర్‌ అయ్యారు. కొన్ని కవితా సంపుటులు :
రక్తం సూర్యుడు
చర్య
ఆసుపత్రి గీతం
నేత్ర ధనుస్సు
భార మితి
మోహనా ! ఓ మోహనా !
శివా రెడ్డి కవిత
అజేయం
నా కలల నది అంచున
వర్షం వర్షం
వృత్త లేఖిని
అంతర్జనం

1974 రక్తం సూర్యుడు ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు
1990 మోహనా ! ఓ మోహనా ! కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

కోఠి దగ్గర నవోదయ బుక్‌ హౌస్‌ విశాలాంధ్ర ల లో దొరుకుతాయి.

*************************************

You Might Also Like

One Comment

  1. Sivaramakrishna Valluru

    pustakam net chaala bagundi. Naa mitrudu Afsar gurinchi perkonnaaru. Marikondaru kavi mitrula vyasaalu… kavitalu… sameekshalu… kadilimchaayi. Veelaite navanthu sahakaaram andinchadaaniki sadaa sidhdhm.
    Sivaramakrishna Valluru.
    Apnewsline.com

Leave a Reply