పుస్తకం
All about booksపుస్తకభాష

December 27, 2014

కళాపూర్ణోదయం – 5 : సుముఖాసత్తి – మణిస్తంభుడు

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: జాస్తి జవహర్
*********
వయస్తంభన ప్రభావం కలమణిని పొంది నిత్యయవ్వనుడుగా ఉన్న కారణంగా శాలీనుడు మణిస్తంభుడయ్యాడు. తనకు వరాలను, బహుమానాలను ఇచ్చిన సిద్ధుని పట్ల గౌరవసూచకంగా అతడుగూడా సిద్ధునిరూపంలోనే తిరుగుతున్నాడు. సింహవాహనం మీద తిరుగుతూ తాను చూడదలుచుకున్న తీర్థాలన్నీ చూచి చివరికి మృగేంద్రవాహనాలయానికి చేరాడు. అక్కడ శిలాఫలకం మీదఉన్న శాసనం ప్రకారం గోరుగల్లుతో కనులు పెరుకుకున్నాడు. దూరదృష్టిని పొందాడు. చెవులలో నారసంతో పొడుచుకున్నాడు. దూరశ్రవణశక్తి వచ్చింది. దానితో అతని స్వభావం మారిపోయింది. అంతవరకూ ఉన్న సాత్విక స్వభావం పోయి కర్కశత్వము, కోరికలూ పెరిగాయి.  ఆశలకంతు లేకుండా పోయింది.”ఇంత పాట్లనుబడికన్న యీవిచిత్రమహిమకుందగ్గ రాజ్యసంపదలుగనిన ఎంతయింపగునో”యని ఉవ్విళ్ళూరటం మొదలుపెట్టాడు. “సదమల రూప సుగానాస్పద వారవధూటి” ని బలియిస్తే రాజ్యసంపద సిద్ధిస్తుందని శిలాశాసనంలో ఉన్నది. అటువంటి స్త్రీకోసం వెదకటం మొదలు పెట్టాడు. అతనికోరికలూ, ప్రయత్నాలూ అక్కడే ఉన్న సుముఖాసత్తి కనిపెడుతూనే ఉన్నది. కాని అతడె తన భర్త అన్నవిషయం తెలియదు. అనుమానించటానికి గూడా ఆస్కారం లేదు. అతడు బ్రతికి ఉంటే తనలాగే ముసలివాడై ఉండాలి. ఉన్నా ఇంతకఠినుడు కావటానికి అవకాశంలేదు. తన భర్త సౌమనస్కుడు, సౌమ్యుడు. మణిస్తంభుని ప్రవర్తన చూచి భయపడింది. ఇతడెంతకైనా సమర్ధుడని తలచింది. ఆమె మాత్రం అటువంటి ఆశలకు పోక దేవిపూజలోనే నిమగ్నమయింది.

మణిస్తంభుని దూరదృష్టికి ద్వారకాపురిలో వీణాగానం చేసుకుంటున్న కలభాషిణి కనపడింది. తన ప్రయత్నానికి తగిన స్త్రీ ఆమెయేనని గుర్తించాడు. సంగీతవిద్యాపారంగతురాలు, అతిలోక సౌందర్యవతి, వేశ్య! ఇంకేంకావాలి? సింహవాహనాన్నెక్కి ఆమెవిహరిస్తున్న ఉద్యానవనంలో దిగాడు. ఆమె గతాన్ని ఆమె అడగకుండానే వివరించాడు. తన శక్తిసామర్ధ్యాలమీద నమ్మకం కలిగించటంకోసం మణికంధరుని తీర్థయాత్రలు వర్ణించాడు. రోజూ అతని వీణాగానం విని తరించేవాడినని, కాని అతడు తపసులో ఉండటం వలన ఆ అవకాశం పోయిందని, అతనికి దీటైన సంగీత విద్య ఆమెవద్దనే ఉండటం వలన విని ఆనందించటం కోసం వచ్చానని వివరించాడు.అవి విన్నతరువాత కలభాషిణికి అతని దివ్యశక్తులమీద నమ్మకం కలిగింది. ఆనమ్మకం కలిగించటమే అతని ఉద్దేశంకూడా. తాను మాత్రం సిడ్ఢుడననీ, ఏకోరికలూ లేవనీ, ‘రాతిబొమ్మకు చక్కిలిగింతలా’ అని తనను తానే వర్ణించుకున్నాడు. ఆమెకు నలకూబరునిపైన ఉన్న కోరికను గుర్తించి, రంభ మణికంధరుని తపసు భగ్నం చేసి అతనితోనే ఉన్నదనీ, ఆమె కోసం ఎదురుచూస్తూ నలకూబరుడు ఒక చెట్టుక్రింద కూర్చుని ఉన్నాడనీ చెపుతాడు. నలకూబరుని కలవటానికి అది సమయమన్న భావం ఆమెలో కలిగించి తాను మాత్రం తిరిగివెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్లు నటిస్తాడు. తననెలాగైనా నలకూబరుని వద్దకు చేర్చమని ఆమె ప్రాధేయపడుతుంది. అందుకోసమే అతడు ఎదురుచూస్తున్నాడు.

ఆమె చేత బ్రతిమాలించుకున్నాడు. దయతలచినట్లుగా తన సింహవాహనం మీద కూర్చుండబెట్టుకుని గగనమార్గాన ప్రయాణమయ్యాడు. మృగేంద్రవాహనాలయం దగ్గరకు వచ్చేసరికి వాహనం ముందుకు కదలటం లేదనీ, అందుకు అక్కడ ఉన్న మృగేంద్రవాహనాలయమే కారణమనీ, ఆ దేవిని పూజించి ప్రయాణం సాగించవచ్చునని నమ్మబలికి వాహనాన్ని ఆలయం దగ్గర దింపుతాడు. తాను పూజాపుష్పాలు తీసుకువస్తానని ఆమెను ఆలయంలో ఉండమని పంపుతాడు. అప్పుడు కలభాషిణి మొదటిసారిగా మృగేంద్రవాహనాలయం ప్రవేశించింది. అక్కడ ముగ్గుబుట్టలాంటి తలతో, ‘భావజుడు వెళ్ళిపోయిన పాడుమేడ’లా ఉన్న ఒక ముదుసలిని చూచింది. కలభాషిణిని చూడగానే ఆమెను మణిస్తంభుడే తీసుకు వచ్చి ఉంటాడని పసిగట్టింది. అతడామెను తీసుకు వచ్చినకారణం తెలిపి వెంటనే పారిపోయి ప్రాణాలు దక్కించుకోమని చెప్పింది. తాను మోసపోయిన విషయం కలభాషిణికి అప్పుడు తెలిసి వచ్చింది. కాని తాను తప్పించుకోలేనన్న విషయంగూడా తెలిసింది. అతనికి దూరదృష్టి, దూరశ్రవణ శక్తులున్నవి. ఆమెను ఎలాగైనా పట్టుకోగలడు. తాను ప్రయత్నించినా ఫలితం ఉండదు. అతనిచేతిలో బలికావటం తప్ప తనకు గత్యంతరంలేదని గ్రహించింది. ఆశలు వదులుకుని ఆక్షణంకోసం ఎదురుచూస్తున్నది. అక్కడి శిలాఫలకం మీద ఉన్న శాసనాలు చదివి దేవిశక్తులను తెలుసుకున్నది. ఇంతలో మణిస్తంభుడు పూలతో తిరిగి వచ్చాడు. ‘క్షేమంగా ఉన్నావా?’ అని ముసలిని పరామర్శించాడు. ఆలస్యం చెయ్యకుండా పూజకు గుడిలోనికి రమ్మని కలభాషిణితో అన్నాడు. ఆమె తనకు భయంగా ఉన్నదని ఆముసలిని తోడురమ్మని కోరింది. తనరహస్యాన్ని ఆముసలి కలభాషిణికి చెప్పి ఉంటుందని గ్రహించాడు. ఆలస్యం ప్రమాదమని గ్రహించి కలభాషిణిని జుట్టుపట్టి దేవిసమ్ముఖానికి లాగాడు. “అవ్వా! నీబిడ్డను, కావవే!” అని ఎలుగెత్తి అరచింది కలభాషిణి. సుముఖాసత్తి మనసు కరిగింది. “ఆమెను చంపకు. దేవిమీద ఆన” అని వారించింది. అతడదేమీ పట్టించుకోకుండా కలభాషిణిమీదకు కత్తి ఎత్తాడు. అంతలో సుముఖాసత్తి “దేవీ! నా వాక్కు నిజం చెయ్యవే!” అని తన తలను అడ్డంగా పెట్టింది. కత్తివేటుకి ఆమె తల తెగిపడింది. మణిస్తంభుడు తిరిగి కత్తెనెత్తి కలభాషిణిని వధించటానికి ప్రయత్నించాడు. దేవి ఆనను మీరిన కారణంగా ఎత్తిన చెయ్యిపట్టి దేవి అతనిని దూరంగా విసరివేసింది. అతని చేతిలో కలభాషిణి జుట్టు ఉన్నకారణంగా ఆమెకూడా అతనితోపాటు దూరంగా పడింది. ఇద్దరూ ఒక పర్ణశాలలో పడ్డారు. కత్తి ఎత్తిన అతనిని చూచి కలభాషిణి భయకంపితురాలయింది.

ముచ్చెమటలతో తడిసిపోయింది. ఆకర్ణాయత నేత్రాలు భయంతో విచ్చుకున్నవి. పయ్యెద తొలగింది. ఆస్థితిలో ఆమెను చూచేసరికి మణిస్తంభుడు కామోద్దీపితుడయ్యాడు. తనప్రయత్నాన్ని విరమించి, కత్తిని పారవైచి ఆమెను కౌగిలించాడు. ఆమె ఎలుగెత్తి ఏడ్చింది. రక్షించమని అరచింది. ఆమె ఆర్తనాదం విన్న నలకూబరుడు దగ్గరలో ఉన్న పొదరింటినుంచి వచ్చాడు. అతనిని చూచినవెంటనే ఆమెను విడిచి పారిపోయాడు మణిస్తంభుడు. ఆస్త్రీ ఎవరని గమనించకుండా నలకూబరుడు అతనిని వెంబడించి, పట్టుకుని, తీసుకువచ్చేసరికి అక్కడ ఆమె లేదు. “ఆమె ఎవరు? ఆమెనేం చేశావు?” అని మణిస్తంభుని నిగ్గదీశాడు నలకూబరుడు. ఆమె ఏమైపోయిందొ తనకుగూడా తెలియదన్నాడు మణిస్తంభుడు. ఇంతలో అక్కడికి రంభ వచ్చింది. వచ్చి, నలకూబరుని చెయ్యిపట్టి “చేతిలో ఆయుధం లేకుండా వస్తే ప్రమాదంగదా! ఐనా ఆమె ఎటో వెళ్ళిపోయిందిగదా! ఇంకా వీనితో పనేమిటి? వెళ్దాం పద” అని మణిస్తంభుని విడిపించి అతనితో వెళ్ళిపోయింది. మణిస్తంభుడు ఊపిరి పీల్చుకున్నాడు. కాని కలభాషిణి ఏమైపోయిందో అతనికి అంతుపట్తలేదు. అతని దూరదృష్టికి గూడా దొరకలేదు. తాను తిరిగి వెళ్ళేవాడే. కాని అతని కత్తి నలకూబరుని చేతిలో ఉండిపోయింది. అది విడిచి వెళ్ళటం కుదరదు. మహిమాన్వితమైన ఖడ్గం! అందుకోసం ఎదురుచూస్తూ అతడక్కడే ఉండిపోయాడు. ఇంతలో అక్కడికి ఇంకొక రంభ వచ్చింది. అతనికి సహజంగానే ఆశ్చర్యం కలిగింది. రంభకు ప్రతిగా ఇంకొక రంభ! ఆశ్చర్యం కదూ! వచ్చీరావటంతోనే నలకూబరుని ‘ఏమిటిదని’ ప్రశ్నించింది. తనరూపంలోనే ఇంకొకస్త్రీ ఉండటంతో ఆశ్చర్య పడింది. నలకూబరుడు ఇద్దరినీ చూచి తబ్బిబ్బయ్యాడు. ఇద్దరిలో ఎవరు నిజమో, ఎవరు మాయయో తెలుసుకోలేకపోతున్నానన్నాడు. ఇద్దరూ తానే నిజం రంభనంటున్నారు. అతనికోసం తిట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు. నలకూబరుడేమీతోచక చూస్తున్నాడు. ఇంతలో వచ్చాడు కలహభోజనుడు. నలకూబరుడు ఆశపడ్డాడు – అతనికి నిజం తెలుసుననీ, అతడుతప్పక ఈతగవు తీరుస్తాడనీ అనుకున్నాడు. నారదుడదేమీ చెయ్యకుండా నలకూబరునితో పరిహాసమాడి వెళ్ళిపోయాడు. ఇదంతా మణిస్తంభుడు చూస్తూనే ఉన్నాడు.

వాదోపవాదాలు, జగడాలు ఐనతరువాత రెండవ రంభ తన నిజాయితీని ఋజువు చేసుకోవటానికి ఇక్కడ తనకు తెలిసినవారెవరూ లేనికారణంగా ఇంద్రసభకు రావలసిందిగా  సూచించింది. అందుకు మొదటిరంభ అక్కడికి రావటం తనకు అవమానమని, ఇన్నాళ్ళుగా అసమాన లావణ్యం కలదానినిగా గౌరవం పొంది ఇప్పుడు తనను పోలినవారు ఇంకొకరు వచ్చారని అందరిముందూ నిలవటం తాను భరించలేనని, అందువలన ఎప్పుడూ భూలోకం విడిచి రానని చెప్పింది. అక్కడికి రాగల శక్తి ఆమెకు లేదని, ఆమె కేవలం మానవకాంతయేనని రెండవ రంభ నలకూబరునికి సూచించింది. నలకూబరుడు కాదనలేకపోయాడు. మొదటి రంభను విడిచి రెండవ రంభను చేరాడు. రెండవ రంభ మొదటి రంభను ‘కత్తివేటుతో మరణిస్తావని’ శపించింది. మొదటి రంభ పారిపోయింది. తరువాత నలకూబరుడు నిజరంభతో వెళ్ళిపోయాడు. మణిస్తంభుని కత్తి ఇంకా అతని దగ్గరే ఉన్నది. దానికోసం ఉన్న మణిస్తంభుడు జరిగిన వింతలు చూస్తూనే ఉన్నాడు.

ఇంతలో వింతగా ఇంకొక నలకూబరుడు వచ్చాడు. మణిస్తంభుడు తనకన్నులను తానే నమ్మలేని స్థితిలో ఉన్నాడు. నలకూబరులిద్దరూ తగవాడుకుంటున్నారు.కొట్లాటకు దిగారు. రంభకు ఎవరు నిజమైన నలకూబరుడో తెలియలేదు. ఏమీ చెయ్యలేక చూస్తూ ఉన్నది. అంతలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. వారిద్దరినీ ఆపి తన ప్రశ్నకు సమాధానం చెప్పమంది. సరయిన సమాధానం చెప్పిన వాడే నిజమైన నలకూబరుడన్నది. అందుకు ఇద్దరూ అంగీకరించారు. వారిని వేర్వేరుగా పిలిచి ప్రశ్నించింది. రెండవ నలకూబరుడే నిజమైన వాడుగా తేల్చి చెప్పింది. నలకూబరుడు మొదటి వానిని ‘అచిరకాలంలోనే మరణిస్తావని’ కసిదీరా శపించి రంభతో కలిసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు మణిస్తంభుని కత్తిని అక్కడే వదిలి వెళ్ళాడు. అది తీసుకుని మణిస్తంభుడు మృగేంద్రవాహనాలయానికి బయలుదేరాడు. మాయారంభ ఎటుపోయిందో, మాయానలకూబరుడు ఎటుపోయాడో అతనికి తెలియలేదు. అతడు ఆలయానికి చేరేసరికి అక్కడ కలభాషిణి, మణికంధరుడు ఉన్నారు. వారితోపాటు ఒక నవయువతి గూడా ఉన్నది.  ఆమెను ఎవరివని ప్రశ్నించాడు. అందుకు సుముఖాసత్తి తాను మొదట ఉన్న సుముఖాసత్తినేనని, దేవిముందు బలికావటం వలన యవ్వనంతో పునర్జన్మ లభించిందని చెపుతుంది. తాను చూచిన వింతలను మణిస్తంభుడు వారికి వినిపించాడు. కలభాషిణిని ‘నీవెక్కడికి పోయావు? ఇక్కడికెలా వచ్చావు?’ అని అడిగాడు. అతడు చూచిన మాయారంభను తానేనని కలభాషిణి చెపుతుంది. నలకూబరునికోసం ఆశపడి, ఎవరో నలకూబరుని రూపంలో ఉన్నఅపరిచితునికి తన శీలం అర్పించవలసి వచ్చినదని చింతిస్తున్నది. అందుకు మణికంధరుడు ఆమాయానలకూబరుడు తానేనని చెపుతాడు. 

దానితో కలభాషిణికి కొంత ఊరట కలిగింది. తనకు మణికంధరునిపైన మొదటినుంచి ప్రేమ ఉన్నదనీ, కాని అతనికి తాను తగనని తన ప్రేమను అణచుకున్నానని, నలకూబరునిలో మణికంధరుని ఛాయలు కనపడటం వల్లనే అతనిమీద మనసయిందనీ చెపుతుంది. కాని ఇప్పుడు తనమాటలనెవరూ నమ్మరని, తానొక వేశ్యనని బాధపడుతుంది. ఆమెను ఓదార్చటానికి మణికంధరుడు వివిధ సందర్భాలలో వివిధరీతుల ప్రేమ జనిస్తుందనీ, అందుకు సుగాత్రీశాలీనుల కథ ను ఉదాహరణగా చెపుతాడు. అది కాశ్మీరదేశంలో జరిగిన కథగావటం వలన అది సుముఖాసత్తికి గూడా తెలిసి ఉండవచ్చునని చెపుతాడు. అందుకు సుముఖాసత్తి ఆకథలోని సుగాత్రిని తానేనని చెప్పి భర్త మరణం తరువాత తాను శాస్త్రవిదుల సాంగత్యంలో కాలం గడపటంవలన అందరూ ఆమెను సుముఖాసత్తి అని పిలిచేవారని, అప్పటినుంచి తాను సుముఖాసత్తిగానే ఉంటున్నానని చెపుతుంది. తీర్థయాత్రలు చేసి మృగేంద్రవాహనాలయానికి చేరానని చెపుతుంది. అది విన్న మణిస్తంభుడు ఆ శాలీనుడను తానేనని చెపుతాడు. అందరికీ అమితాశ్చర్యం కలిగింది. అందుకు ఋజువులడిగారు.

అతడు తటాకంలో దూకటానికి ముందు సుగాత్రి చెవిలో చెప్పిన రహస్యమేమిటి? అతనికి అంతకోపం రావటానికి కారణమేమిటి? అవి చెప్పగలిగితే అతనిని శాలీనుడేనని నమ్మవచ్చునని సుముఖాసత్తి ఒప్పుకుంటుంది. కాని ఆవివరాలు తాను మధ్యవర్తికి చెపితే అతనికి ఉన్న దూరశ్రవణ, దూరదృష్టిశక్తుల కారణంగా అతనికి తెలిసే ప్రమాదం ఉన్నది. అందువలన అతడె ముందుగా ఆవివరాలను మణికంధరునికి చెప్పాలని కోరుతుంది. ఆరహస్యాన్ని మణిస్తంభుడు మణికంధరునికి వివరించాడు. తన భార్య నిత్యరూపవతిగా ఉండటంకోసం ఆమెకు ఎప్పుడూ గర్భం రాకుండా ఉండాలని శారదాదేవిని వరం కోరానని, కాని తన భార్య అందుకు విరుద్ధంగా తనకు సంతానం కావాలని కోరి వరం పొందినదనీ ఆకారణంగా తాను కోపించి తటాకంలో దూకానని వివరిస్తాడు. సుముఖాసత్తిగూడా అదేకథను మణికంధరునికి చెపుతుంది. అందువలన అతడు శాలీనుడేనని, వారిద్దరూ భార్యాభర్తలేనని మణికంధరుడు ప్రకటిస్తాడు. వయఃస్తంభనమణిప్రభావం కారణంగా మణిస్తంభుడు నిత్యయవ్వనుడయ్యాడు. దేవిముందు బలియైన కారణంగా సుముఖాసత్తి యవ్వనంతో పునర్జన్మ సాధించింది. ఇద్దరికీ అనుబంధం రమ్యమయింది.  వారిద్దరూ అక్కడే ఉండి యోగాభ్యాసంతో దేవిని స్తుతించి, సేవించి ధన్యులయ్యారు.

సుగాత్రీశాలీనులే సుముఖాసత్తి, మణిస్తంభులుగా రూపాంతరం చెందినా వారి స్వభావాలలో వచ్చిన మార్పులు గమనించదగ్గవి. సుగాత్రి సుముఖాసత్తియై, ముదుసలియై మృగేంద్రవాహనాలయానికి చేరి అక్కడ పూజాపునస్కారాలతో ఒద్దికగా కాలం గడుపుతున్నది. దయార్ద్రహృదయంతో కలభాషిణిని రక్షించటంకోసం ఆత్మబలి చేసుకుని దేవిప్రభావంతో తిరిగి యవ్వనవతియై పునర్జన్మ పొందింది. ఐనా తనపూర్వజన్మ వృత్తాంతం ఆమెకు తెలుసు. స్వభావంగూడా మారలేదు. సౌమ్యత, సౌహార్ద్రత అలాగే ఉన్నవి. శాలీనుడు మణిస్తంభుడైనాడు. అతని స్వభావంలో విపరీతమైన మార్పు వచ్చింది. సౌమ్యుడు, సహనశీలి ఐన శాలీనుడు కఠినుడుగాను, దురాశాపరుడుగాను మారిపోయాడు. ఇల్లరికపుటల్లుడై అత్తగారి ఆరళ్ళు మౌనంగా భరించిన వాడు దూరదృష్టికోసం కన్నులు పెరుక్కున్నాడు. దూరశ్రవణశక్తికోసం చెవులలో నారసాలు దించుకున్నాడు. రాజ్యకాంక్షతో సంగీతవిద్యాపారంగతురాలైన ఒక అందమైన యువతిని నిర్దాక్షిణ్యంగా బలియివ్వటానికి సిద్ధపడ్డాడు. అతనిలో ఉన్న ఈకాఠిన్యం కొత్తగా వచ్చినదేమీకాదు. పొందుగోరి వచ్చిన భార్య సుగాత్రిని పలకరించకపోవటంతో ఎంతో మృదుభాషిణియైన సుగాత్రికూడా

“రాయైనగొంతమేల్ నా
రాయణ! మీమనసుకంటె…” (చతుర్ధాశ్వాసం-119)
అని బాధపడుతుంది. అందుకే అంత అందగత్తె ఐన కలభాషిణి తో “రాతిబొమ్మకు చక్కిలిగింతలా?” అని తనను తానే వివరించుకున్నాడు. ఆమెను దేవికి బలియిచ్చి సంపదలు పొందాలనే ఉద్దేశంతో ఉన్నాడుగాని, అమెఅందంతోపనిలేదు.                                                                               
నిరాలంకృతయై పనిలో అలసిన భార్యను చూచి మోహావేశాం పొందిన వాడు, భయకంపితయైన కలభాషిణిని చూచి మోహించాడు.  కాని అప్పుడు కలిగిన అనుభవంతోను, రంభానలకూబరుల వినోదదర్శనంతోను అతనిలో కొంత ఆలోచన, స్వవిమర్శ కలిగినవి. దానికి తోడు తనభార్య పునర్జీవంతో యవ్వనంతో తిరిగి తనవద్దకు చేరింది. కొంతశాంతించాడు. యవ్వనవతియైన భార్య ప్రక్కనే ఉన్నా నిగ్రహంతో, మృగేంద్రవాహనాలయంలో జితేంద్రియుడై అష్టాంగ యోగవిద్యాభ్యాసనతోనే కాలం గడిపాడు. సుముఖాసత్తిమాత్రం సుగాత్రిలాగానే పతిసేవలో నిమగ్నమయింది.

తరువాత కొన్నాళ్ళకు మణిస్తంభునికి దేశాటనం మీద కోరిక కలిగింది. సింహవాహనం మీద ఇద్దరూ బయలుదేరారు. గగనమార్గాన పోతూ క్రింద సముద్రాన్ని చూచాడు మణిస్తంభుడు. తిమింగలాలు నీటిని పైకి ఊదుతున్నవి. అదిచూచి సముద్రుడు ఆకాశగంగ మీదికి అనురాగంతో నీటిని చిమ్ముతున్నట్లున్నదని భావించాడు. ఉత్తుంగతరంగాలు ఆకాశగంగను కౌగిలించటంకోసం తాపత్రయపడుతున్నట్లుగా ఉన్నదని వర్ణించాడు. సముద్రం మీదికి వంగుతున్న నీలిమేఘాలు శయనించిన విష్ణువు మీదికి పురుషాయితాసక్తురాలైన లక్ష్మీదేవికురులలాగా ఉన్నవని తలచాడు. ఆభావనతో తన శృంగారాభిలాషను ప్రదర్శించాడు. అది గమనించిన సుముఖాసత్తి లజ్జావనతవదనయై “తమయిష్టం నేనెప్పుడైనా కాదన్నానా?” అని అతని పైకి వాలింది. తనకామకేళికనువుగా ఉన్న ఒకఉద్యానవనంలో సింహవాహనాన్ని దించాడు. దంపతులిరువురూ రతికేళిలో తేలియాడారు.

ఆసమయంలో మణిస్తంభుడు ఒక చిత్రమైన కోరిక కోరాడు. “నేను స్త్రీనై, నీవు పురుషుడవైతే రతిక్రీడానుభవం పొందాలని ఉన్నదని” భార్యతో అన్నాడు. అతని కోరిక ఆమెకు ఆజ్ఞ. కాని అతడుకోరుకున్నంత మాత్రాన ఆకోరిక తీరదు. వారి స్థితి మారదు. ఆకోరికను సుముఖాసత్తి మన్నించి “మీరు స్త్రీరూపం పొందండి. నేను పురుషుడనవుతాను” అన్నది. ఆమె అన్నవెంటనే అలాగే జరిగింది. మణిస్తంభుడు స్త్రీగా మారిపోయాడు. సుముఖాసత్తి పురుషరూపం పొందింది. మణిస్తంభునికిది ఆశ్చర్యం కలిగించింది. అందుకు సమాధానంగా సుముఖాసత్తి వివరించింది. కలభాషిణిని రక్షించటంకోసం ఆమెను చంపగూడదని దేవిమీద ఆనపెట్టింది. ఐనా సిద్ధుడు – అదే, సిద్ధునిరూపంలో ఉన్న మణిస్తంభుడు – దానిని లెక్కపెట్టక ఆమెను వధించటానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు సుముఖాసత్తి తన తలను అడ్డంపెడుతూ దేవిని తనవాక్కు నిజం చెయ్యమని కోరింది. అప్పుడు ఆమె ఉద్దేశం తాను పెట్టిన ఆన ఫలవంతం కావాలనే! కాని అదేవరంగా సుముహాసత్తి మాట నిజమయ్యే శక్తి పొందింది.అందువలన ఆమె నోటితో అనగానే వారి స్వరూపాలు మారిపోయాయి. రూపాలు మారినవిగాని అంతరాంతరాలలో మార్పులేదు. తమలైంగికరూపాలు పరస్పరం మార్చుకున్న విషయం గమనంలో ఉన్నది. అప్పుడతనికి వాగ్దేవి వారికిచ్చిన వరాలవిషయం గుర్తుకు వచ్చింది.

“నీకు గర్భం రాకూడదని నేను కోరుకున్నాను. దేవి అంగీకరించింది. నాతో సంతానం పొందాలని నీవు కోరావు. దేవి అందుకూ సరేనన్నది. పరస్పర వైరుధ్యంగల ఈవరాల ప్రభావం ఏవిధంగా ఉంటుందోనని భయపడ్డాము. ఇప్పుడది నిజమయ్యే అవకాశం కనిపిస్తున్నది. దేవి వాక్కు వృధాకాదుగదా!” అన్నాడు.  సుముఖాసత్తి సిగ్గుపడింది. తరువాత ఆభేదంలోని మాధుర్యాన్ని గ్రహించి “మరుసంగరంలో మగవారికంటే ఆడువారికే ఎక్కువ సంతృప్తి కలుగుతుందంటారు.  అది నేనూ అనుభవించాలని ఉన్నది. మనం కొన్నాళ్ళు ఇలాగే ఉందాం” అన్నాడు. అందుకామె గూడా సమ్మతించింది. “మీ కోరిక తీర్చటమేగదా నాబాధ్యత” అన్నది. కొంతకాలం వనంలో ఆవిధంగా గడిపిన తరువాత తిరిగి సింహవాహనంపైన యాత్రకు బయలుదేరారు.

దారిలో ఒకనాడు వారికి కాసారపురం కనిపించింది. ఆప్రదేశాన్ని తానిదివరకు చూచానని, కొన్నాళ్ళు అక్కడ గడపవలెనని కోరికగా ఉన్నదని స్త్రీరూపంలో ఉన్న మణిస్తంభుడు సింహవాహనాన్ని క్రిందికి దించాడు. వారిద్దరూ అక్కడ ఉద్యానవనంలో తిరుగుతుండగా ఆపట్టణాన్ని పాలిస్తున్న సత్వదాత్ముడు స్త్రీరూపంలో ఉన్న మణిస్తంభుని చూచి మోహించాడు. “ఇంతటి అందగత్తె నాకలోకం నుంచి వచ్చినదా? ఈమెకు సిద్ధుని బంధమేమిటి?” అని ఆమె దృష్టిని తనవైపు మరల్చుకోవటానికి శతవిధాల ప్రయత్నించాడు. ఎలాగైనా ఆమెను తనవశం చేసుకోవాలనుకున్నాడు. వారిని చేరి, పురుషరూపంలో ఉన్న సుముఖాసత్తితో (మణిస్తంభునితో) “మహాత్మా! తమరెవరు? ఎక్కడినుంచివచ్చారు? ఎక్కడికి పోతున్నారు? భక్తితో మిమ్ములను కొన్నాళ్ళు కొలిచేభాగ్యం ప్రసాదించండి. మాభవనంలో తమకు అన్ని సౌకర్యాలు కలిగిస్తాను” అని విన్నవించాడు. అందుకు ఇద్దరూ సమ్మతించారు.”మనకెక్కడున్నా ఒకటేగదా!” అనుకున్నారు. వారికి పరివారాన్ని సమకూర్చాడు సత్వదాత్ముడు. ఐనా ఏదో ఒకవంకతో రోజూవచ్చి కొంతసమయం వారితో గడపటం మొదలుపెట్టాడు. చివరికి ఆగలేక సుముఖాసత్తికోసం కబురుపెట్టాడు. ఆమెకూడా కాదనకుండా తాను గర్భవతిననీ, సిద్ధుని బిడ్డను అతనికప్పగించకుండా అన్యులతో పొత్తుపెట్టుకోనని చెప్పి పంపిస్తుంది. సత్వదాత్ముడు నిరాశ చెందినా, ఆశ చంపుకోలేదు. కొన్నాళ్ళకు ఒక శుభలగ్నంలో సుముఖాసత్తిరూపంలో ఉన్న మణిస్తంభునికి “శౌర్య, గాంభీర్య,సౌజన్య, నీతి, సత్యకీర్తిప్రతాపాది సకల సుగుణసంపన్నుడైన” పుత్రుడుదయించాడు. ఆవిధంగా మణిస్తంభుడు తల్లిగాను, సుముఖాసత్తి తండ్రిగాను కళాపూర్ణుడుదయిస్తాడన్న బ్రహ్మవాక్కు నిజమయింది.

సుముఖాసత్తికి గర్భం రాకుండా వారికి సంతానం కలగాలన్న వాగ్దేవి వరం కూడా నిజమయింది. మణిస్తంభుడిక తన స్త్రీరూపం చాలించాలనుకున్నాడు. సుముఖాసత్తి ఆకోరిక కోరింది. వారి నిజరూపాలు వారికి తిరిగి వచ్చాయి. ఎవెరెవరో ఇతరులకు తెలియదుగదా! పుట్టిన బిడ్డ పుట్టగానే యవ్వనుడయ్యాడు. వెంటనే సిద్ధుడు వచ్చి అతనికి ఒక మణిని, విల్లమ్ములను బహూకరించాడు. అతనికి కళాపూర్ణుడని నామకరణం చేశాడు. ఇదంతా గమనిస్తున్న సత్వదాత్ముడు తనతప్పు తెలుసుకున్నాడు. వారు సామాన్యమానవులు కారని గుర్తించాడు. ఆమెను కాంక్షించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తనతప్పు మన్నించమని వేడుకున్నాడు. తనరాజ్యాన్ని వారికి ధారాదత్తం చేసి వారికి మంత్రిగా సేవించటం మొదలు పెట్టాడు. ఆవిధంగా కళాపూర్ణుడు రాజై, అతనికి సత్వదాత్ముడు మంత్రి అయ్యాడు. సుముఖాసత్తి, మణిస్తంభులు వారి పూర్వరూపాలనుపొంది కాసారపురంలోనే యోగాభ్యాసంతో కాలం గడుపుతున్నారు. ఇద్దరూ నిత్యయవ్వనులేగడా! ఆతరువాత వారి విషయం కావ్యంలో ప్రస్తావించబడలేదు.

సుగాత్రి, శాలీనుడు – సుముఖాసత్తి, మణిస్తంభుడు – పేరులు వేరైనా వారిజీవితాలు అవిచ్చిన్నంగా సాగినవి. సుగాత్రి సుముఖాసత్తిగా మృగేంద్రవాహనాలయం చేరినది. అక్కడ దేవికి స్వచ్చందంగా బలియై తిరిగి యవ్వనంతో పునర్జన్మ సాధించింది. కాని ఆమె వ్యక్తిత్వంలో, స్వభావంలో ఎటువంటి మార్పూ రాలేదు. శాలీనుని స్వభావంలో మాత్రం మౌలికమైన మార్పు వచ్చింది. ఐనా వ్యక్తి అతడే. వ్యక్తిత్వం మారింది. స్వభావం వేరయింది. అతడు తనకుతానై తానే శాలీనుడనని చెప్పుకునేటంతవరకు అతనిని ఆరాధించే భార్యకుగూడా అతడేనన్న అనుమానం రాకపోవటానికి కారణం కేవలం అతని ప్రవర్తన. అతని స్వభావంలో వచ్చిన మార్పు. శాలీనుడుగా ఉన్నప్పటి స్వభావానికి, మణిస్తంభుడుగా ఉన్నప్పటి స్వభావానికి హస్తిమశకాంతరం ఉన్నది. భార్యతో తిరిగి కలిసిన తరువాత అతనిలో ఇంకొకసారి మార్పు కలిగింది. క్రౌర్యము, దురాశ హరించిపోయినవి. ఒక్క శృంగారాభిలాష విషయంలో తప్ప అన్ని విషయాలలోను తిరిగి శాలీనుడే అయ్యాడు.

మణిస్తంభుని జీవితంలోనే కవి ఎంతో శృంగారభావ వైవిధ్యం చూపించాడు. సముద్ర దృశ్యాలను చూచినప్పుడు శృంగారభావాలు కలగటం చాలా అరుదు. ఆదృశ్యాన్ని చూచి ఏవేవో ఊహించుకుని తాను లైంగికానుభవంకోసం తాపత్రయపడ్డాడు. తరువాత స్త్రీగా శృంగారానుభవం ఎలా ఉంటుందో చూడాలని ఉబలాటపడతాడు. ఆకారణంగా పుట్టబోయే పుత్రునికి తల్లిగా శారదాదేవి వరాన్ని, బ్రహ్మ వాక్కుని నిజం చేస్తాడు. బ్రహ్మ ఆవిధంగా అన్నప్పుడు సరస్వతి రెట్టించి అడుగుతుంది “ఆరాజునకు సుముఖాసత్తియనునది తండ్రియు, మణిస్తంభనాముడగువాడు తల్లియునయ్యెదరే!” అని. అందుకు బ్రహ్మ “అందేమి సందియంబదియు నీదు చేష్టావిశేషంబు చేతన కాగలదు” అంటాడు. అందుకు సరస్వతి “మీరేదైనా అనండి. మధ్యనన్నెందుకు ఈడుస్తారు?” అని వ్యతిరేకిస్తుంది.కాని సుగాత్రికి శాలీనునికి విరుద్ధఫలంగల వరాలిస్తుంది. బ్రహ్మ చెప్పిన మాట నిజం కాకపోతే ఆమె ఇచ్చినవరాలు సఫలమయ్యే అవకాశం లేదు. ఆ వరాలను ఇచ్చేటప్పుడు ఆమెకు ఆవిషయం గుర్తులేదా? బహుశ బ్రహ్మవాక్ప్రభావం కారణంగా ఆవరాలు ఆమె నోటినుంచి ఊడిపడినవేమో!About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

కళాపూర్ణోదయం – 7: కళాపూర్ణుడు – మధురలాలస

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* బ్రహ్మ చెప్పిన కథ ప్రకారం కళాపూర్ణుడే కథానాయకుడు. కళాపూ...
by అతిథి
0

 
 

కళాపూర్ణోదయం – 6 : అభినవకౌముది – శల్యాసురుడు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* మహిషాసురుని మేనమామకొడుకు శల్యాసురుడు. అతనికి ఒంటినిండా ...
by అతిథి
0

 
 

కళాపూర్ణోదయం – 4 : సుగాత్రీశాలీనులు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* కాశ్మీరంలోని శారదాపీఠము సకలకళాప్రపూర్ణము. ఋగ్వేదఘోషలత...
by అతిథి
0

 

 

కళాపూర్ణోదయం – 3 : రంభానలకూబరులు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* కళాపూర్ణోదయకావ్యానికి సంబంధించినంతవరకు రంభానలకూబరుల ప...
by అతిథి
0

 
 

కళాపూర్ణోదయం – 2: మణికంధరుడు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ****** మణికంధరుడు గంధర్వుడు. కాని ఇతర గంధర్వులవలే విషయలోలుడుగాడ...
by అతిథి
0

 
 

కళాపూర్ణోదయంలో శృంగారభావ వైవిధ్యం: 1-కలభాషిణి

వ్యాసకర్త:జాస్తి జవహర్లాల్ (కళాపూర్ణోదయం సంక్షిప్త రూపంలో, సులభ వచనంలో కె.వి.ఎస్.రామ...
by అతిథి
0