పుస్తకం
All about booksపుస్తకభాష

December 25, 2014

 వేయి పడగలు లో స్త్రీ పాత్రలు

More articles by »
Written by: అతిథి
Tags: , ,
 వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
 తనపట్ల, సమాజం పట్ల మానవుల దృష్టికోణం  ఒక్కొక్కరిదీ ఒక్కొక్కలా ఉంటుంది. ఇందులో స్త్రీ పురుషభేదం లేదు. ఇటువంటి దృష్టికోణం వారి వ్యక్తిత్వాన్నీ, స్వభావాన్నీ ప్రభావితం చేస్తుంది. దృష్టికోణం అనేది తానెదుర్కొనే పరిస్థితులను బట్టి మారవచ్చు, మారకపోవచ్చుకూడా. ఒకటి మాత్రం నిజం. వారు సమాజాన్ని చూసే దృష్టికోణాన్ని బట్టే సమాజం వారిపై ఏ అభిప్రాయంతో ఉంటుందన్నది ఆధారపడిఉంటుంది.

 సమాజంలో మనం చూస్తున్న విభిన్న స్వభావాలు గల పాత్రలు వేయి పడగలు నవలలో మనకు కనిపిస్తాయ్. ఇక్కడ ముఖ్యంగా స్త్రీ పాత్రల స్వభావాల గురించి పరిశీలిద్దాము.

ముందుగా అరుంధతి పాత్ర మొదట కనిపించే ముఖ్యపాత్ర, నవలలో చాలాభాగం మనకు కనిపిస్తూనే ఉండే పాత్ర. ఇందులో అరుంధతికి చాలా చిన్న వయస్సులోనే పెళ్ళి అయి ఉంటుంది.

యుక్తవయస్సు వచ్చి కాపురానికి పోయే వరకూ కొన్నేళ్ళపాటు ఆమె తన తల్లిదండ్రులతో ఉంటుంది. వారికి వియ్యంకులపై గౌరవాభిమానాలు లేకపోవడం వల్ల రాకపోకలూ తక్కువే. పైగా వియ్యాలవారి ప్రస్తావన వచ్చినపుడంతా వారిని విమర్శిస్తూ , హేళన చేస్తూ ఉండడం వల్ల అరుంధతికి భర్త అన్నా, అతని కుటుంబమన్నా ఏమాత్రమూ ప్రేమాభిమానాలుండవు. అప్పటి సమాజరీతులవల్ల, ఇంట్లో పెద్దల మాట కాదనలేని కారణం వల్ల మాత్రమే అరుంధతి, ఆమె తల్లిదండ్రులు పెళ్ళికి, తర్వాత కాపురానికి పంపడానికి బలవంతంగా ఒప్పుకున్నట్లు కనిపిస్తారు. ఈ విధంగా అరుంధతి తన జీవితంలో భర్త ప్రాముఖ్యత, తను వారింటికి వెళ్ళడంలో అనివార్యత తెలిసినప్పటికీ తల్లిదండ్రుల ప్రభావంతో విముఖత ప్రదర్శిస్తూనే ఉంటుంది.

అత్తవారింటికి చేరిన తర్వాత అక్కడి బంధుమిత్రులు భర్తకు, ఆకుటుంబానికి ఇచ్చే గౌరవప్రపత్తులు, భర్తగారి స్వభావం , అత్తగారింటి వాతావరణం అన్నీ చూసి ఆమెలో వైముఖ్యత తగ్గిపోయి, భర్త, కుటుంబం పట్ల అనురాగంతో, అంకితభావంతో, కర్తవ్యనిష్ఠతో ఉంటుంది. కానీ అక్కడితో పుట్టింటిని పూర్తిగా విడిచిపెడుతుంది. పుట్టింటిలో ఆమెకు కొన్ని చేదు అనుభవాలున్నా ఏళ్ళతరబడి తల్లిదండ్రులను చూడాలని కూడా అనుకోకపోవడం విచిత్రంగా ఉంటుంది. తలిస్తే ఒక్క చీరమాత్రం అదీ ఒక ముఖ్యవ్యక్తి తనకిచ్చిన చీర పుట్టింట్లో ఉండడం వల్ల దాన్ని తెచ్చిపెట్టమని భర్తను అడుగుతుంది కానీ కన్నవారిని చూడాలనుకోదు.

గిరిక గురించి ముందు తేలికభావంతో ఉంటుంది. తర్వాత భర్త ఆమెకిచ్చే గౌరవం చూసినాక,గిరిక మాటలు విన్నాక ఆమెను గౌరవించడం మొదలుపెడుతుంది. గిరిక భక్త్యావేశపు ఎల్లలు దాటి భగవంతునితో తాను అభిన్నమని భావించి చేసే నృత్యకార్యక్రమాలు చూసినతరువాతే అరుంధతిలో తన భగవంతుని  మీద అంటే తన భర్తమీద ప్రేమావేశం పొంగుతుంది. ఈ విషయాలన్నీ చూసినపుడు ఈమె ఆలోచనా రీతులన్నీ మరొకరి ద్వారా ఎట్ల ప్రభావితమైతూ ఈమె దృష్టికోణాన్ని మారుస్తున్నాయో చూడవచ్చు.ముందు తల్లిదండ్రుల మాటలు పూర్తిగా నమ్మి భర్తను ద్వేషించడం, తర్వాత భర్త స్వభావంతో ప్రభావితమై తల్లిదండ్రులను పూర్తిగా విస్మరించడం, గిరికపై అభిప్రాయాన్ని భర్త తో ప్రభావితమై మార్చుకొనడం, ప్రేమావేశపు ప్రకటనలో గిరిక వల్ల ప్రభావితమై తన భర్త విషయంలో ఆచరించడం వల్ల ఈమె ప్రతి విషయంలోనూ ఒక వ్యక్తి , సంఘటన ప్రోద్బలం వల్ల మాత్రమే తన భావప్రకటన చేయగలగడం చూడవచ్చు.  ఇది మనలో ఎంతోమందికి జరిగే సహజమైన విషయమే.

రెండవ ముఖ్యపాత్ర, సాధారణంగా అందరినీ ఆకర్షించగల పాత్ర గిరిక. గిరిక చిన్న వయస్సులో తీవ్రమైన ఆసక్తితో ధర్మారావు ద్వారా విన్న ఆధ్యాత్మిక విషయాలపై మానసికంగా ప్రభావితమైతుంది. వాటి గురించి అతనితో సమానంగా కొండొకచో మరింత పరిణతితో , అంకితభావంతో చర్చించగల స్థాయికి చేరుకుంటుంది. భక్తిమార్గంలో వచ్చిన చిన్న అవరోధాలను ఏమాత్రం లెక్క చేయకుండా సాధన కొనసాగిస్తుంది. చివరకు స్వామి కళ్యాణోత్సవాలలో స్వామికి తనకు అభిన్నత్వాన్ని అత్యుత్తమ స్థాయిలో అనుభవించి భవబంధాల నుండి ముక్తి పొందుతుంది.

పాత్ర మొదటినుంచి చివరివరకు ప్రతి సాధకుని మెప్పు పొందగల స్వభావం తో ఉంటుంది. సాధన భగవంతుని ఆరాధనే కాదు ఏ విషయంపట్ల అయినా సాధకులకు కావలసిన అంకితభావం, జంకని స్వభావం ఈమెలో అడుగడుగునా కనిపిస్తుంది. ఈమె నుంచి సాధకులు నేర్చుకోవలసింది ఎంతైనా ఉందనిపించే ఆదర్శపాత్ర.

మంగమ్మ అమాయకురాలుగా ఉండి తన జీవితంలో వచ్చిన ప్రతిమలుపుకూ తన ప్రమేయం లేకుండానే తిరుగుతూ విధి తీసుకుపోయిన చోటికి పోతుంది.  చివరకు తను చేరిన గమ్యాన్ని చూసి పశ్చాత్తాపంతో కళ్ళు తెఱచి తన మార్గం ఏమి గమ్యం ఏమి అన్నది గుర్తించగలుగుతుంది. ఆ తరువాత తన వాళ్ళకు, పరాయివాళ్ళకు, మరణానికి కూడా భయపడకుండా తాను నిర్ణయించుకున్నది రాగద్వేషాలకు గురికాకుండా చేసిపోతుంది.

శశిని అను విదేశీ పాత్ర అటు తల్లిదండ్రులకు, ఇటు భర్తకు కూడా విశ్వాసంగా ఉండలేని పాత్ర. రెండింటికి చెడ్డ రేవడి యైతుంది. తల్లిదండ్రులకు, కుటుంబానికి తనే ఆధారం అని తెలిసి కూడా దూరదేశాలకు పెళ్ళి చేసుకొని వస్తుంది. ఉన్నంత వరకు కుటుంబానికి, రాచరికానికి పెద్ద సమస్యలేమీ తేకపోయినా భర్త కోలుకోలేని స్థితిలో ఉన్నప్పుడు విడిచిపెట్టిపోతుంది. అప్పుడుగూడా గౌరవం నిల్పుకోవాలని కాకుండా ధనం కూడగట్టుకోవాలనుకుంటుంది. వంశపారంపర్య సంపదకూడా పెట్టెల్లో చేర్చుకుంటుంది. హరప్ప అడిగినపుడు మనసుమార్చుకొని ఇచ్చినా, చివరకు కోటలోని మరొకరిని నమ్మి మిగిలిన మర్యాదతో పాటుడబ్బు కూడా పోగొట్టుకుంటుంది.

ఇంకా ఈ నవలలో రంగాజమ్మ, రుక్మిణమ్మ, రాజ్యలక్ష్మి, సావిత్రమ్మ, సరోజినీదేవి రత్నగిరి వంటి పాత్రలు తమ కర్తవ్యం ఏమన్నది తెలుసుకొని ఆ సమయాల్లో తగినట్టు ప్రవర్తించి వెళ్ళిపోయే పాత్రలైతే, చిన్న అరుంధతి, శశిరేఖ  అత్యుత్సాహంతో వయసుకు మించిన పరిణతి ప్రదర్శించే పాత్రలు.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.6 Comments


 1. లక్ష్మి దేవి గారికి నమస్కారాలు,
  వేయిపడగలు నవలలోని స్త్రీ పాత్రల గురించి చక్కని విశ్లేషణ ఇచ్చారు. ఈ నవల నేను ఇంకా చదవలేదు. మీరు ఇచ్చిన విశ్లేషణలో అరుందతి పాత్ర గురించి వివరించారు. తనకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా సమాజంలోని వ్యక్తుల వ్యక్తిత్వాల మీద ఆధారపడి తనను తాను మలచుకుంటుంది అని అర్ధం అవుతుంది. ఇలా ఉసరవెల్లిల వ్యక్తిత్వాలు మార్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం. తన బర్తని ఆరాధించడం తప్పు కాదు మరి అలా అని తల్లిదండ్రులని మర్చిపోయి ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? ఎంత తప్పు చేసిన వాళ్ళు తల్లిదండ్రులు కదా! నాకు తెలిసి ఇలాంటి వ్యక్తిత్వాలు ఆడవారిలో మాత్రమే ఎరుగుదుము.


  • కిశోర్ గారు,
   స్వార్థం కోసం రంగులు, వ్యక్తిత్వాలు మార్చేవారిని మాత్రమే ఊసరవెల్లితో పోలుస్తారు. (నిజానికి ఊసరవెల్లి రంగులు మార్చేది తనను చంపగల ప్రాణినుంచి ఆత్మరక్షణకొఱకు మాత్రమే)
   మీరనుకున్నట్టు అరుంధతి పాత్ర తన స్వార్థం కోసం ఏమాత్రం తన అభిప్రాయాలు మార్చుకున్నట్టు నాకనిపించలేదు. తనవారు అనుకున్నవారి అభిప్రాయాలతో ప్రభావితం అవుతుంది అంతే. నేను వ్రాసినదీ అదే. ఆమె స్వాభిమానం గలది.
   చిన్నతనంలో తల్లిదండ్రులు తప్ప మరో లోకం లేదు కాబట్టి భర్తను, అతని కుటుంబాన్ని గురించి సరిగ్గా తెలుసుకోలేకపోయింది. తెలుసుకున్నాక తల్లి దండ్రులు స్వార్థంతోనో , మూర్ఖత్వం తోనో పొరబాటుగా ప్రవర్తించి ఉన్నారనుకుంటే ఆమెకు వారిపై కోపం రావడం, రాకపోకలు మానుకోవడం జరిగితే అదీ మానవ సహజ చర్యనే. ఇందులో ఆడ, మగ తేడా లేదు.
   ఇక నవలా కాలం 1934.ఇప్పట్లా రవాణా సౌకర్యాలు, సెల్ ఫోన్లు, ఫేస్ బుక్లు, వాట్సప్ లు లేవు.
   తర్వాత ఆడవారు తల్లిదండ్రుల కుటుంబాలు మఱచి పోయి తన అత్తవారింటికి అంకితమవడం లో చెడు మాత్రమే చూడలేము. ప్రతి విషయంలో లాభనష్టాలు మంచిచెడులు ఉంటాయి. వ్యక్తిగత బాంధవ్యాలకు తక్కువ ప్రాధాన్యత నిచ్చి సమాజసేవలోనో, ఉద్యోగధర్మంలోనో నిమగ్నమవడం లో రెండూ ఉన్నట్టుగానే దీంట్లోనూ.
   ఏమైనా అరుంధతి పాత్ర మీద మీకు ఒక తప్పు అభిప్రాయాన్ని నా వ్యాసం కలిగించిఉంటే అందుకు నేను క్షంతవ్యురాలను కాననుకుంటాను. నేను వ్రాసే విధానం మెఱుగు పర్చుకోవాల్సి ఉందని భావిస్తాను.


 2. Dr.B.UMADEVI

  బావుందండి.అరుంధతి పాత్రను చక్కగా విశ్లేషించారు.ఆ గ్రంథాన్ని ఎప్పుడు చదివినా మరో కొత్త భావన కొత్త ఆలోచన కల్గుతుంది.చాతుర్వర్ణ్యవ్యవస్థ కీ నవల ప్రతీక.


  • ఉమాదేవి గారు,
   అవును. గిరిక పాత్ర నాకు నచ్చిన ఆదర్శపాత్ర అయినప్పటికీ అరుంధతితో ఎక్కువ కనెక్ట్ అయినట్టున్నాను.


 3. kameswari yaddanapudi

  లక్ష్మి దేవిగారు చక్కని విశ్లేషణ చేశారు. గణాచారి పాత్రను మరిచారెందుకో!


  • కామేశ్వరిగారూ, ధన్యవాదాలు.
   నిజమే. గణాచారి పాత్ర ప్రవృత్తి నా ఆలోచనాస్థాయికి మించినదనిపించింది. మిగతా పాత్రలన్నీ సాధనా మార్గంలో ముందువెనుకలుగా ఉన్నాయి. కానీ సిద్ధిపొందిన గణాచారి పాత్ర గురించి ఏం చెప్పగలనో తెలియలేదు.
   ఒకటి మాత్రం చెప్పాలని మఱచినదుంది. అదేమంటే స్త్రీల పాత్ర లో ఆహార్యం గురించిన వర్ణన ముఖ్యమైనది.
   నవలలో అరుంధతి, గిరిక, గణాచారి వస్త్రధారణ గురించిన వర్ణన కనిపిస్తుంది. తెల్లని చీర , నల్లంచు గల తెల్లని చీర, నల్లని చీర, తెల్లని రవిక ఈ విధంగా తప్పితే వేరే రంగులు కనిపించవు. ఇవీ అందమైన వస్త్రాలే . 🙂  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

విశ్వనాథునకు వివిధ కవి నాథుల పద్య నివాళి

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** ముందు మాట ఈ నెల (అక్టోబ...
by అతిథి
0

 
 

విశ్వనాథ చిన్న కథలు

విశ్వనాథ గారివి ఇదివరలో నవలలు కొన్ని, ఆత్మకథాత్మక వ్యాసాలు/ఇంటర్వ్యూలు చదివాను కాన...
by సౌమ్య
1

 
 

నీలాంబరి – నా అభిప్రాయం

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ******************* కథలు అనేకకోణాల్ని స్పృశించి ఆలోచించ...
by అతిథి
1

 

 

తెలుగు సాహిత్యంలో బలమైన స్త్రీ పాత్రలు-మొదటి భాగం:విశ్వనాథ నాయికలు

వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన...
by అతిథి
2

 
 

కథా కబుర్లూ కాలక్షేపమూ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************* పొత్తూరి విజయలక్ష్మి గారు హాస్యకథలకు ప...
by అతిథి
0

 
 

తెఱచిరాజు – ఒక పరిశీలనా ప్రయత్నము

వ్యాసకర్త: శ్రీకాంత్ గడ్డిపాటి (విశ్వనాథ గారి తెఱచిరాజు నవలపై బెంగుళూరులో జరిగిన సా...
by అతిథి
7