కళాపూర్ణోదయం – 4 : సుగాత్రీశాలీనులు

వ్యాసకర్త: జాస్తి జవహర్
*********
కాశ్మీరంలోని శారదాపీఠము సకలకళాప్రపూర్ణము. ఋగ్వేదఘోషలతోను, సామగాన ధ్వనులతోను, ధర్మశాస్త్ర మీమాంసలతోను నిత్యమూ విలసిల్లుతూ ఉంటుంది. ఆ శారదాపీఠంలో నిత్యమూ శారదాదేవిని భజించి పూజించే పూజారి ఏకారణం చేతనో ఎవరికీ చెప్పకుండా సంసారం విడిచి వెళ్ళిపోయాడు. దేశాటనం వెళ్ళాడని తలచి అక్కడివారందరూ అతనిని మరచిపోయారు.

అతనికొక్కతే కూతురు, సుగాత్రి. సకల సద్గుణశీలి. ఆమెకు వయసు వచ్చినతరువాత తల్లి ఒక సాత్వికునికిచ్చి పెండ్లిచేసి, అల్లుని ఇల్లరికంతీసుకుని వచ్చి తనయింటిలోనే ఉంచినది. కూతురూ, అల్లుడూ సుఖంగా సంసారం చేసుకుంటూ తనకొక వారసుణ్ణి ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నది. కాని కూతురి సంసారం కుదుటపడలేదు. ఆమెను సర్వాలంకారాలతో శోభనం గదికి పంపినప్పుడు అతడామెను కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. ఆమె ఎవరోనన్నట్లు నిద్రకుపక్రమించాడు. చాటునుంచి చూస్తున్న ఆమె చెలికత్తెలు అది గమనించి, అత్తగారికెరిగించి, అతనిని చులకనగా మాట్లాడటం మొదలు పెట్టారు. వారిని మందలించి, కూతురుని అదేవిధంగా అలంకరించి ప్రతిరాత్రీ అతని వద్దకు పంపటము, అతడదేవిధంగా నిర్లక్ష్యం చెయ్యటమూ జరిగింది. అందుకు సుగాత్రి ఎంతగానో బాధపడింది. తల్లి చెలికత్తెలద్వారా ఆమెకు జ్ఞానబోధ చెయ్యాలని ప్రయత్నించింది. భర్త సరసుడయినప్పుడు భార్య సిగ్గరి కావచ్చు. కాని అతడె నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు భార్యకూడా దూరంగా ఉంటే ఇక జీవితం గడిచేదెట్లా? నీవే చొరవ చేసుకుని అతనికి సపర్యలు చెయ్యటం మొదలుపెట్టాలి. ఆకులు ముడిచి ఇచ్చేనెపంతో అతని దగ్గరకు చేరాలి. అని సుద్దులు చెప్పటం మొదలుపెట్టారు. సుగాత్రి అన్నీ విని, అందరిముందూ నిరాకరించి, గదిలో మాత్రం అతనిని చేరటానికి ప్రయత్నించింది. కాని అతనిలో ఏమాత్రమూ ప్రతిస్పందన కలగలేదు. ఆమెకు ఎంతో నిరాశ కలిగింది. ‘పోనీలే! మంగళసూత్రమైనా దక్కింది’ అని తృప్తిపడి, కళ్ళకద్దుకుని, తన ఇష్టదైవం సరస్వతిని ప్రార్థిస్తూ కాలం గడుపుతున్నది.

అది గమనించిన తల్లికి అల్లునిపైన ద్వేషం పెరిగింది. అతనినవమానకరంగా చూడటం మొదలు పెట్టింది. తల్లి ప్రవర్తనకు సుగాత్రి బాధపడింది. నివారించాలని ప్రయత్నించింది. చివరికి తల్లి “ఇంట్లో ఊరక కూర్చోకపోతే తోటలో చెట్లకి నీళ్ళయినా పొయ్యవచ్చుగదా!” అన్నది. ఆమాట విన్న శాలీనుడు అది సబబేనని తలచి తోటపనికి సిద్ధమయ్యాడు. అతడు శాంతస్వభావుడు. నిగర్వి. అందులోను బీదకుటుంబం నుంచి వచ్చినవాడు. వారిమీద ఆధారపడి ఉండటం వలన ఆపని చెయ్యటంలో అతనికేమీ తక్కువనిపించలేదు. శారదాదేవి పూజకు రకరకాల పూవులు పూయించాడు. అతని శ్రమకు సుగాత్రి బాధపడుతున్నది. కాని ఏమీ అనలేదు. మూగబాధ. అతనితోపాటు తానుగూడా పనిచెయ్యాలని కోరుతుంది. కాని నవవధువు కావటం వల్ల సిగ్గుపడి విరమిస్తుంది. పూలను కోయటం, మాలగా గుచ్చటం, శారదాదేవికి అలంకరించటము, అన్నీ శాలీనుడే చేస్తున్నాడు. అతనికి తోడుగా వెళ్ళాలని ఉన్నా ఆమెకు జంకుగా ఉంటున్నది. ఆజంకు పోవటానికి అవసరమైన సాన్నిహిత్యం ఏర్పడలేదు. అతడింకా తనను చేరదియ్యటం లేదు. తాను పరాంగనగానే ఉన్నది. తనకు తానుగా వెళ్ళటం సతికి సమంజసం కాదని యోచించింది.

ఇలా జరుగుతుండగా ఒకనాడు ఉరుములుమెరపులతో ఒక పెద్ద గాలివాన వచ్చింది. చెట్లు ఊగిపోతున్నవి. ఎప్పుడైనా విరిగి పడవచ్చుననిపిస్తున్నది. చీకటి కమ్మింది. భూనభోంతరాళాలేకమవుతున్నట్లుగా వర్షం కురుస్తున్నది. అప్పుడు తోటలో ఉన్న తనపతి ఏమయ్యాడోనని సుగాత్రి కలత చెందింది. అతనికే ఆపదా రాకుండా కాపాడమని శారదాదేవిని వేడుకున్నది. ఐనా మనసు నిలువక, తల్లికి తెలియకుండా చాటుగా వెళ్ళి పతి ఏస్థితిలో ఉన్నాడో చూచి రావాలని బయలుదేరింది. అక్కడున్న ఒక కుటీరంలో అతడు క్షేమంగా ఉన్నాడని చూచి, తృప్తిచెంది, అతనికి కనిపించకుండా తిరిగి వచ్చింది. దేవికి నమస్కరించింది. అలాగే కొన్నాళ్ళు గడిచింది. ఆమె మనసులో ఒకే ఆవేదన. అతడు నిత్యమూ తోటలో పని చేస్తున్నాడు. తాను ఇంటిలో  సుఖంగా ఉండగలదా? అది సమంజసమా? కాని తనకుతాను అతనిని చేరితే నలుగురూ ఏమనుకుంటారు? అగౌరవంగా ఉండదా? తల్లిగాని, సహచరులుగాని తోటలోకి వెళ్ళి అతనికి సహాయం చెయ్యమని చెప్పరు. వారి దృష్టిలో అది స్త్రీలక్షణం కాదు. ఐనా ఆమెకు మనసు నిలవటం లేదు.

ఒకనాడు తనకుతానే గట్టిగా నిర్ణయించుకున్నది. ఆభరణాలన్నీ అలంకరించుకున్నది. అవిలేకుండా వెళ్ళటం ఆమెకు తప్పనిపించింది. అతడు ఆమెను గమనించినా తనపనిలో తానున్నాడు. ఆమె తన ఆభరణాలను తొలగించి ప్రక్కన పెట్టింది. జుట్టు కొప్పుపెట్టింది. పైట బిగించింది. తానుకూడా అతని ప్రక్కనే పనిచెయ్యటం మొదలు పెట్టింది. అప్పుడతడామెను గమనించాడు. ఆమె నేలను త్రవ్వుతున్నప్పుడు తృళ్ళిపడుతున్న చనుదోయి, నడకలో కదులుతున్న నితంబాలసొగసులు, చంద్రబింబం వంటి ముఖం మీదకు దూకుతున్న ముంగురులు, ముఖాన చెమటబిందువులు, అవి తుడుచుకోవటానికి ఆమె పడుతున్న శ్రమ – అతనినెంతో ఆకర్షించాయి. ఆ సహజసౌందర్యమే అతని రహస్యం! ఆమె దగ్గరికి చేరి “వెర్రిదానా! నీకీపనేమిటి?” అన్నాడు. తన ఉత్తరీయంతో ఆమె ముఖాన చెమటను తుడిచాడు. ‘నా శ్రమ చూడలేక ఇటు వచ్చావుకదూ!’ అని ఆమెను కుటీరంలోనికి తీసుకుపోయాడు. గాఢంగా హత్తుకున్నాడు. ఆమె పరవశించింది. ఇద్దరికీ అదే ప్రథమ సమాగమమయింది. అతడు కౌగిలి విడువడు. ఆమెకదే స్వర్గం. తన కోరికతీరింది. కాని ఎంతసేపని తానక్కడ ఉండగలదు? వేళకాని వేళ. వాళ్ళకి తెలిస్తే ఎలా? అతనిని బ్రతిమాలి బయట పడింది. తన ఆభరణాలను తిరిగి ధరించి ఇంటికి చేరింది. ఆమె లోని మార్పు దాగలేదు. చెలులు కనిపెట్టారు. ఆటపట్టించారు. ఆమె తల్లికి చెప్పారు. ‘అడ్డు తొలగిందిగదా!’ అని అందరూ సంతోషించారు. కాని ఆ ‘అడ్డు’ ఏమిటో గ్రహించలేకపోయారు.

రాత్రికి ఆమెను సర్వాలంకారాలతో అతని దగ్గరకు పంపించారు. ఆమెను చూడగానే అతడు నిరుత్సాహుడయ్యాడు. పలకరించలేదు. దగ్గరకు తియ్యలేదు. మొదటి రాత్రిలాగానే నిద్రకుపక్రమించాడు. ఆమెకేమీ పాలుపోలేదు. పగలు తోటలో అంతప్రేమతో చేరిన పతి, రాత్రి ఏకాంతంలో ఎందుకింత ముభావంగా ఉన్నాడు? నేనతని దాననుకానా? అనుకుంటూ మూసిన తలుపుదగ్గరగానే నిలబడిపోయింది. ఎంతకూ అతడు తనవైపు చూడలేదు. దగ్గరకు చేరి “పగలంతా శ్రమించి ఉన్నారుగదా! నిద్రవస్తున్నట్లున్నది. నేను పోయిరానా?” అన్నది. అతడు ఆమెవైపు తిరిగి ‘ఇప్పుడెందుకొచ్చావు?’ అని అడిగాడు, అది సమయం కాదన్నట్లు. ఆమెకి కొంత ధైర్యం వచ్చింది. “భర్త దగ్గరకు భార్యెలెందుకు వస్తారో తెలియదా?” అని ఎదురు ప్రశ్నించింది. అతడేమీ మాట్లాడలేదు. “పోనీలెండి, ఆమాత్రమైనా పలకరించారు. ధన్యురాలిని. వేకువజామయింది. దగ్గరకు రమ్మనిగానీ, కాళ్ళుపట్టమనిగానీ లేదు. తోటలో జరిగినదానికి మీకు నామీద దయకలిగిందనుకున్నాను. పతివ్రతలకిది పద్ధతిగాదని తెలుసు…మీకంటే రాయైన మేలుగదా?” అని నిష్ఠూరమాడింది. దగ్గరికి చేరి పాదాలొత్తటం మొదలుపెట్టింది. అందులో తనకోరిక తెలిసేటట్లు ప్రయత్నించింది. అతనిలో చలనం లేదు. ఆమెకెంతో బాధ కలిగింది. “ఒకవేళ మీమనసు వేరొకరిపైన ఉన్నదేమో! ఆమెను తీసుకురండి. ఇద్దరికీ సేవచేసి తరిస్తాను. మీకోరిక తీరటమే నాకూ సంతోషంగదా! వద్దనుకుంటే నన్ను అమ్ముకోండి. కాదనను… కాని మీమనసేమిటో తెలియటంలేదు..” అని గద్గదికంగా అన్నది. అతడు చలించలేదు. ఆరాత్రి అలాగే తెల్లవారింది.

పగలాతడు తోటపనిలో నిమగ్నమై ఉండగా క్రిందటిరోజులాగానే ఆమె అతనిని చేరింది. ఆభరణాలు ప్రక్కన పెట్టి పనికి ఉపక్రమించింది. ఆస్థితిలో ఆమెను భర్త దగ్గరకు తీశాడు. ఆమె సంతోషించింది. అప్పుడే జ్ఞానోదయమయింది. అతనికి దగ్గర కావాలంటే ఇప్పుడున్నట్లుగానే ఉండాలనీ, ఆభరణాలు, అలంకారాలు అతనికి గిట్టవనీ తెలుసుకుంది. అందుకు కారణమేమిటనేది ఆమె చర్చించుకోదలచలేదు. భర్తకిష్టమైనట్లుగా ఉండటమే తన బాధ్యతగా భావించింది.

అతనిని సుఖపెట్టటం ద్వారా తాను సుఖపడవచ్చు. అతనిని సంతోషపెట్టటం ద్వారా తానుగూడా సంతోషించవచ్చు. పతి హృదయాన్ని ఆకట్టుకున్నది. తనకంతకన్నా ఇంకేమి కావాలి? సంసారజీవితం సుఖంగా సాగుతున్నది. అది గ్రహించిన తల్లి తన ప్రవర్తనకు సంజాయిషీ చెప్పుకున్నది. “నీతండ్రి దేశాలు పట్టిపోయాడు. నీకోసం బ్రతికాను. నీసంతానము, సంతోషము చూచి తృప్తిపడాలని ఆశించాను. అల్లుని ప్రవర్తనతో ఆకోరిక తీరదన్న బాధతో అతనిని నిర్లక్ష్యం చేశాను. అది నీవు సహించక నన్నే మందలించావు. అతడు నిన్నొల్లని సమయంలో గూడా అతనినే సేవించావు. అటువంటి పతివ్రతవుగనుకనే ఎవరికీ అందని శారదాదేవి నీతో మాట్లాడుతుంది..” అని కూతురుని కౌగిలించింది. కాని ఆమె మనసులో ఇంకొక సందేహం ఉన్నది. నవదంపతులిద్దరూ పగలే ఉద్యానవనంలో కలుస్తున్నారు. ఇటువంటి అకాలసంబంధంతో కలిగే సంతానం గుణసంపన్నులు గారని ఆమె భయం. మెల్లగా ఆభయాన్ని కూతురిదగ్గర బయట పెట్టింది. ‘తోటపని చెయ్యటానికి పనివాళ్ళు లేకపోయారా? మీరు ఇంటిలోనే ఉండవచ్చుగదా?’ అన్నది. అందుకు సుగాత్రి సంతోషించి “అమ్మా! పతికి ఏది ఇష్టమో అదే సత్ప్రవర్తనగదా! అతనికిష్టం కానిది నాకుగూడా ఇష్టం కాదు. నాకతడే సర్వస్వము. అతని కోరిక తీర్చటమే నా బాధ్యత. విధినిషేధాలను లెక్కచెయ్యను. అతనికిష్టమయినది ఏదయినా చేస్తాను. అతనికిష్టంకానిది ఏదీ చెయ్యను.” అని నిష్కర్షగా చెప్పింది. తల్లి సందేహించినా సంతోషించింది. ఆమె పతిభక్తికి మెచ్చి వాణి ప్రత్యక్షమై ఆమెను దీవించింది. సుగాత్రి తల్లితో “ఈమె ప్రవర్తనకు వంకలు పెట్టవలదు. మీవంశాన్ని ఈమె పునీతం చేసింది. అంతేకాదు. ఇక ముందుగూడా ఈమె జీవితం పవిత్రంగా సాగి నాకు ప్రీతిపాత్రమవుతుంది.” అని చెప్పి మాయమయింది. కూతురి సుగుణాలకు తల్లి ఎంతగానో సంతోషించింది, గర్వించింది. సుగాత్రీశాలీనుల ప్రణయగాథను శారదాదేవి స్వయంగా లిఖించి, ఆగ్రంథాన్ని శరదాపీఠంలోని వారందరికీ కలలో కనిపించి ఇచ్చిందని అక్కడి పండితులు చెపుతారు. ఆగ్రంథాన్ని రోజూ ఉదయం చదువుకోమని చెప్పిందట!

ఆపండితుడొకడు ఆగ్రంథాన్ని చేతబట్టుకుని ఒకనాడు సుగాత్రీశాలీనులను దర్శించటానికి వెళ్ళి, కొంతసేపు సమాలోచనలయిన తరువాత ఆగ్రంథాన్ని అక్కడే మరచి వచ్చాడట! అప్పుడు గుర్తు వచ్చి ఆగ్రంథాన్ని తెమ్మని శిష్యుని పంపించాడు. ఆశిష్యుడు సుగాత్రీశాలీనుల తోటకు చేరేసరికి శాలీనుని పాదాలు తన ఒడిలో పెట్టుకుని సుగాత్రి సేవచేస్తున్నది. ఆశిష్యుని చూడగానే శాలీనుడు ‘ఆగ్రంథంకోసం వచ్చావుగదూ! ఆకొమ్మపైన పెట్టాను. తీసుకుందువుగాని అక్కడ కూర్చో” అని ప్రక్కనే చెట్టుక్రింద అరుగు చూపించాడు. ఆకొమ్మక్రిందనే వారిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అందుకే దానిని వెంటనే తీసుకోవటానికి వీలయిందికాదు. అప్పుడు శాలీనుడు సుగాత్రితో “మగవారికంటే మగువలకు త్వరగా వయసు తీరుతుందంటారు. నీవేమో ఇలా రోజురోజుకూ నవయవ్వనం వస్తున్నట్లుగా కనపడుతున్నావు. ఏమిటారహస్యం? అమృతం సేవించావా?” అన్నాడు నవ్వుతూ. అందుకు సుగాత్రి “నాకైతే ఏమీ తెలియదు. కాని తమకు ప్రేమకలిగినప్పుడు అలా కనిపించటం సహజం కదా!” అన్నది. “అదికాదు. అసలుకారణం నేను చెపుతాను విను.” అని శాలీనుడు ఆమె చెవిలో ఏదో చెప్పాడు. అందుకు సుగాత్రి “అదెలా జరుగుతుంది?” అని అతని చెవిలో ఇంకేదో చెప్పింది. వారు చెవిలో చెప్పుకున్నదేదీ ఆశిష్యునికి వినిపించలేదుగాని వారి మాటలు వినిపించాయి. ఆమె చెవిలో ఏదో చెప్పగానే శాలీనుడు కోపోద్రిక్తుడై వెంటనే లేచి, వేగంగా పరుగెత్తి గ్రామం ప్రక్కనే ఉన్న శతతాళదఘ్నమైన సరసులో దూకాడు. అతని వెంటనే సుగాత్రికూడా పరుగెత్తి అతడు దూకటం చూచింది. అందులో దూకినవారు ప్రాణాలతో బయట పడటం కల్ల. భర్తలేని జీవితం తనకెందుకని ఆమెగూడా అందులో దూకింది. ఆవిధంగా ఇరువురూ తనువులు చాలించారని ఊరంతా గుప్పుమన్నది. వారిద్దరూ ఆవిధంగా వెళ్ళగానే ఆశిష్యుడు ఆగ్రంథాన్ని తీసుకుని పోయి గురువుగారికి జరిగిన విషయం విన్నవించాడు. ‘వారిజీవితం ఈవిధంగా ముగిసిందా?’ అని అతడుగూడా చింతించాడు.

ఈకథ అంతా మణికంధరుడు తన కవితాశక్తిని కాశ్మీరపండితులదగ్గర ప్రదర్శించాలని వచ్చినప్పుడు జరిగింది. కాని సుగాత్రీశాలీనుల మరణం కారణంగా అందరూ శోకార్తులై ఉండటం వలన అది తగినసమయం కాదని మణికంధరుడు తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత నలకూబరుని రూపంలో రంభననుభవించినందుకు నలకూబరుని శాపం తగిలి మృగేంద్రవాహనాలయానికి వచ్చినప్పుడు అతనికి కలభాషిణి కనిపించింది. ఆమె మాయానలకూబరుని రూపంలో తనశీలాన్ని ఎవరో అపరిచితుడు దోచుకున్నాడని చింతిస్తున్న సమయంలో ఆ మాయానలకూబరుడు తానేనని మణికంధరుడు చెపుతాడు. అందుకు కలభాషిణి సంతోషించి తనకు మొదటినుంచీ మణికంధరుని పైననే ప్రేమ ఉన్నదనీ, అతనికి తాను తగనని తెలిసి తన మనసును నలకూబరునిపైకి మళ్ళించాననీ చెపుతుంది. కాని తాను వేశ్య కావటం వలన తనమాటనెవరూ నమ్మరని వాపోతుంది. అందుకు మణికంధరుడు ఆవిధంగా వివిధ పరిస్థితులలో ప్రేమజనించటం సహజమేనని, అందుకు ఉదాహరణగా సుగాత్రీశాలీనుల కథ చెపుతాడు. అది కాశ్మీరకథ గనుక అక్కడ ఉన్న సుముఖాసత్తితో ఆమెకు ఈకథ తెలిసి ఉండవచ్చునని అంటాడు. దానికి సుముఖాసత్తి ఆసుగాత్రిని తానేనని చెపుతుంది. ఆవిధంగా సరసులో దూకినతరువాత తన కథను వివరించింది.

ఆవిధంగా తటాకంలో దూకిన సుగాత్రిని ఒక మొసలి మింగింది. కాని జీర్ణించుకోలేక, ఒడ్డుకుచేరి, తన్నుకుని ఆమెను బయటికికక్కి తిరిగి సరసులోకి వెళ్లిపోయింది. ఆవిధంగా బయటపడిన సుగాత్రి ఇంటికిచేరేసరికి తల్లి ఎంతగానో సంతోషించింది. సుగాత్రి తనభర్తను గూడా తిరిగి రక్షించమని శారదాదేవిని నిత్యమూ పూజిస్తూ కాలం గడుపుతున్నది. ఆమెకు శారదాదేవిమీద అమితమైన భక్తి. కాని ఆదేవి తనకిటువంటి సంకటస్థితిని ఎందుకు కలిగించిందని ఆమెకు తీరనవేదన. తెగని సమస్య. తాను ఎప్పుడూ అందంగా కనపడటం కోసం తనకు గర్భం రాకూడదని భర్త దేవిని అర్థించాడు. దేవి అందుకు సరేనన్నది. కాని  సుగాత్రి భర్తద్వారా తనకు సంతానం కావాలని దేవిని వేడుకున్నది. అందుకూ దేవి సరేనన్నది. ఆవిషయం భర్తచెవిలో చెప్పగానే అతనికి కోపం వచ్చింది. తనకోరికకు భిన్నంగా వరంపొందినందుకు కుపితుడై తటాకంలో దూకి ప్రాణత్యాగం చేశాడు. అది అనుకోకుండా జరిగిపోయింది. తానుకూడా ప్రాణత్యాగం చెయ్యాలనుకున్నది. కాని మొసలి రక్షించింది. ఇక భర్తలేకుండా తానెలా జీవించాలి? దేవి ఈవిధంగా విరుద్ధమైన వరాలెలా ఇచ్చింది? పరస్పరవ్యతిరేకమైన ఆ వరాలు ఏవిధంగా నిజం కాగలవు?  మరి దేవి వరం వృధాకాదుగదా! సుగాత్రికి ఏమీ అంతుపట్టటంలేదు. శారదాదేవి పూజ ఒక్కటే ఆమె దినచర్య అయింది. వైరాగ్యభావం ఆవహించింది. శారదాపీఠంలోని వేదాంతుల దగ్గర, యోగప్రయోగాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నది. నిత్యమూ శాస్త్రకోవిదుల మధ్య వారి సేవలో కాలం గడుపుతున్నందువలన ఆమెను అందరూ ‘సుముఖాసత్తి’ అన్నారు. అప్పటినుంచీ ఆమె ఆపేరుతోనే పరిచయమయింది.

కొన్నాళ్ళకు తల్లి మరణించింది. ఒంటరిగా అక్కడ ఉండలేక తీర్థయాత్రలు చేసింది. ముసలితనం వచ్చింది. శాలీనుడు ఆమెను నిత్యయవ్వనిగా చూడాలని ఉబలాటపడ్డాడు. శారదాదేవిదగ్గర వరం కోరేటప్పుడు ఆమెకు గర్భం రాకూడదని కోరాడుగాని, వయసు పెరగకూడదని కోరలేదు. అందువలన ఆమె సహజంగానే ముసలి వగ్గయింది. అది దేవి వరానికి విఘాతం కాదు. తీర్థయాత్రల తరువాత మృగేంద్రవాహనాలయం చేరి అక్కడ దేవి సేవలో కాలం గడుపుతున్నది. భార్యమీదికోపంతో శతతాళదఘ్నమైన తటాకంలో దూకిన శాలీనుని మొసలి మింగలేదు. అతడు మునిగి, అడుగున జలస్థంభవిద్యాప్రభావంతో అక్కడ ఉంటున్న ఒక సిద్ధుని చేరాడు. అప్పుడతడు సమాధిలో ఉన్నాడు. కొంతసేపటికి అతడు కన్ను తెరచి చూచేసరికి ఎదురుగా  శాలీనుడు కనిపించాడు. అతనికి శాలీనుడు ప్రణామం చేశాడు. తనవృత్తాంతం వినిపించాడు. సిద్ధుడు నవ్వి, ‘అంతకోపివా?’ అన్నాడు. “ఇది ఏకాంత ప్రదేశమని నేనిక్కడ ఉంటున్నాను. ఎవరూ ఇక్కడ ఎక్కువసేపు ఉండరాదు.” అని చెప్పాడు. ఆరోజంతా తనదగ్గరే ఉంచుకున్నాడు. శాలీనుడతనిని భక్తితో సేవించాడు. అందుకు సిద్ధుడు సంతోషించి శాలీనునికి ఒక మణిని ప్రసాదించాడు. అది వయఃస్తంభన ప్రభావం కలమణి. అది ఎవరిదగ్గర ఉంటే వారికి ఉన్న వయసులోనే వయసు స్తంభించిపోతుంది. అప్పుడు శాలీనుడు యవ్వనంలో ఉండటం వలన అతడెప్పుడూ యవ్వనుడుగానే ఉండగలడు. ఆమణికారణంగా వయసు స్తంభించటం వలన మణిస్తంభుడయ్యాడు. దానితోపాటు సిద్ధుడతనికి ఒక సింహవాహనాన్ని, దానిని వశంచేసుకునే ఔషధజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఒక కత్తిని బహూకరించాడు. ఆకత్తి ఎవరిమీదకు ఎత్తినా అది చివరకు వారిని వధించక మానదు అని చెప్పాడు. ఆవరాలతోను, ఆయుధాలతోను సింహవాహనాన్ని ఎక్కి మణిస్తంభుడు తటాకం నుంచి బయటపడి వేరొక జీవితాన్ని ప్రారంభించాడు.

సుగాత్రి సుముఖాసత్తి అయింది. శాలీనుడు మణిస్తంభుడయ్యాడు. వారి కథ ఆవిధంగా ముగిసింది. సుముఖాసత్తి, మణిస్తంభులకథ మొదలయింది.

శతతాళదఘ్నమైన తటాకం అడుగున శాలీనుడు కలుసుకున్న సిద్ధుని పేరు స్వభావుడు. అతడు సుగాత్రికి తండ్రి. అతడక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియదు. శాలీనుడు చెప్పినదానిని బట్టి అతడు తన అల్లుడేనని గ్రహించాడు స్వభావుడు. ‘అంతకోపిష్టివా?’ అనిమాత్రం చిరునవ్వు నవ్వాడు. అతడు సంసారం విడిచి దేశాటనం చేశాడు. మాహురీపురం చేరాడు. అక్కడ తపసు చేసి అఖిలయోగవిద్యారహస్యవిదుడైన దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకుని యోగవిద్యారహస్యాలు తెలుసుకున్నాడు. యోగవిద్యాప్రభావం వలన  “భావమెప్పుడూ తనయందు బాదుకొలుపుచునికి జేసి” స్వభావుడన్నపేరుపొందాడు. ఆత్మయోగసమాధికి అనువైన నిర్జనప్రదేశంకోసం వెదకుతూ, తన జన్మస్థానంలోనే ఉన్న శతతాళదఘ్నతటాకం అందుకనువుగా ఉన్నందున అక్కడ సమాధిలో కూర్చున్నాడు. తన అల్లుని చూచి అతనికి బహుమానాలిచ్చి పంపించాడుగాని తన బాంధవ్యం విషయం అతనికి చెప్పలేదు. ‘వదిలించుకున్న బంధాలు మళ్ళీ తగిలించుకోవటమెందుకను’ కున్నాడు. కాని తరువాత కొన్నాళ్ళకు యోగనిష్ఠవదలి తటాకం నుంచి బయటపడి శ్రీశైలం చేరాడు.

అక్కడ పవిత్ర విచిత్ర మహత్తులు కలిగిన కొండపైన ఎక్కి, మల్లికార్జునమహాదేవుని సేవించి వస్తున్నప్పుడు కొండచరియనుండి దూకి ఆత్మార్పణం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న మణికంధరుని చూచాడు. అతని ఆత్మార్పణానికి కారణమడిగాడు. మణికంధరుడు తనకథ వినిపించాడు. అందులో సుగాత్రీశాలీనులను తాను కలుసుకున్న విషయం కూడా చెప్పాడు. అందుకు స్వభావుడు సంతసించి తానే సుగాత్రి తండ్రినని తెలుపుతాడు. వారికి శారదాదేవి ఇచ్చినవరాలు ఏవిధంగా పరిణమిస్తాయో తెలియదని వాపోతాడు. ఐనా అది ఎదోవిధంగా సఫలం కాకతప్పదని ధైర్యం చెప్పుకున్నాడు. నారదుని సేవలతోను, కృష్ణుని భార్యల శిష్యరికంతోను, తీర్థయాత్రలతోను సంపాదించిన పుణ్యప్రభావం ఊరకేపోదని మణికంధరుని  ఓదార్చాడు. అందువలన ఇంకా భృగుపాతానికి పాల్పడవలసిన అవసరం లేదన్నాడు. కాని మణికంధరుడు తాను శ్రీమహితులై, శుచివర్తనులైన వారికి పుత్రుడుగా జన్మించాలని కోరుకుంటున్నానని, అందుకోసం ఈ ఆత్మత్యాగం చెయ్యకతప్పదని చెప్పాడు. అందుకు సిద్ధుడు తనకూతురు అల్లుడు తలిదండ్రులుగా కావాలని కోరుకొమ్మని సలహా ఇచ్చాడు. అందుకు ప్రతిగా తాను నిత్యజయప్రదమైన విల్లును, నవశరమ్ములను, శాస్త్రవిద్యాపారంగతులనాకర్షించే ఒక మణిని సృష్టించి, వాటిని మణికంధరుడు తనకూతురుకి పుత్రుడుగా జన్మించగానే వచ్చి బహూకరిస్తానని చెపుతాడు. అప్పుడే అక్కడికి చేరిన మదాశయుడు తనకు విజయాన్ని, సంతానాన్ని కలిగించేటట్లుగా వరమడుగుతాడు. అందుకు ఒక్క మణికంధరుని తప్ప అందరినీ జయించగలవని అతనిని దీవిస్తాడు. మణికంధరుని సేవలో ఉండగా అతనికి సంతానం కూడా కలుగుతుందని చెపుతాడు. ఆమదాశయుని సంతానమే మధురలాలస – కలభాషిణి మరుజన్మ!

You Might Also Like

Leave a Reply