Revolutionary Road

“రెవల్యూషనరీ రోడ్” 1950లలో వచ్చిన ఒక అమెరికన్ నవల. రచయిత రిచర్డ్ యేట్స్. దీన్నే 2008లో లియొనార్డో డి కాప్రియో, కేట్ విన్స్లెట్ ప్రధానపాత్రలుగా సినిమాగా కూడా తీశారు.

కథ 1950ల నాటి అమెరికాలో నడుస్తుంది. ఇద్దరు యువ దంపతులు, తమ పరిసరాల పట్ల వాళ్ళలో పెరుగుతున్న అసంతృప్తి, వాళ్ళ ఆశలు, ఆశయాలు, వాళ్ళ పిల్లలు, భవిష్యత్ ప్రణాళికలు, ఆ ప్రాంతంలో వాళ్ళ జీవితం – ఇదే ఈ నవలకి కథా వస్తువు. నవలలో మొదటి దృశ్యం – ఏప్రిల్ వీలర్ ఒక పేలవమైన నాటక ప్రదర్శన లో పాల్గొన్న తరువాత, భర్త ఫ్రాంక్ వీలర్ తో రోడ్డు మీద వాళ్ళ జీవితం గురించి, భవిష్యత్తు గురించి, అన్నింటి గురించీ గొడవ పడ్డం. వీళ్ళ మధ్య దూరం క్రమంగా పెరగడం మొదలవుతుంది. ఇంతలో ఏప్రిల్ కి ఓ ఆలోచన వస్తుంది. తాము ఆ ప్రాంతం, దేశం వదిలేసి మరోచోటికి వెళ్ళిపోదామనీ, అక్కడ కొత్త జీవితం మొదలుపెడదామని, ఫ్రాంక్ కుటుంబ పోషణకోసం అతని ఆశయాలని పూర్తిగా మర్చిపోనక్కర్లేదనీ, తాను కుటుంబ నిర్వహణ భారం కొన్నాళ్ళు చూస్తాననీ అతన్ని ఒప్పిస్తుంది. ఓ పక్క పక్కింటావిడ కొడుకు కూడా వీళ్ళలాగానే ఆ ప్రాంతపు మధ్యతరగతి జీవన విధానాన్ని నిరసిస్తూ మాట్లాడ్డంతో వీళ్ళ అభిప్రాయాలని బలం చేకూరినట్లవుతుంది. చివరికి వాళ్ళ కోర్కెలు నెరవేరాయా? వాళ్ళ ఆశయాలను వాళ్ళు అందుకున్నారా, వాళ్ళ జీవితాలు ఏ మలుపులు తిరిగాయి – ఇదంతా తెలుసుకోవాలంటే, నవల చదవండి లేదా సినిమా చూడండి. బద్దకంగా ఉంటే వికీపేజి చదవండి.

పాత్రలన్నీ యాభై ఏళ్ళ నాటి అమెరికన్ మధ్యతరగతి జీవితాల్లో తారసపడే పాత్రలే అయినా – నా మట్టుకు నాకు చాలా contemporaryగా అనిపించాయి. కథా వస్తువు కూడా నాకు ఇప్పటికీ చాలా వర్తిస్తుంది అనిపించింది. వాళ్ళ వాదోపవాదాలు, మిత్రులతో, ఇరుగుపొరుగులతో జరిగే సంభాషణలు, మధ్య మధ్యన వచ్చే వర్ణనలు, ఫ్రాంక్ ఆఫీసు జీవితం – ఇవన్నీ చాలా సహజంగా చిత్రీకరించినట్లు అనిపించింది నాకు. అయితే, వీళ్ళకి ఇద్దరు పిల్లలుంటారు కానీ, నవలలో వారి పాత్ర చాలా తక్కువ. అదొక్కటే కొంచెం అసహజంగా అనిపించింది నాకు.

కథకి మూలం వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణే అయినా, అది వాళ్ళిద్దరి జీవితాన్ని మట్టుకే ప్రభావితం చేసేది కాదు కదా – నాకు వీళ్ళు పిల్లల సంగతి ఎక్కువ ఆలోచించడం లేదేమో అనిపించింది. పైగా అంత అసంతృప్తి, సందిగ్ధత మధ్యలో మళ్ళీ ఆవిడ గర్భవతి కావడం బాధ్యతా రాహిత్యమని కూడా అనిపించింది – ఆ విధంగా చూస్తే, ప్రత్యేకంగా ఈ పాత్రలు నాకు నచ్చాయని చెప్పలేను. ఒక్కో చోట – ఈ ప్రధాన పాత్రలు మరీ అతి గా, elitist గా ప్రవర్తిస్తున్నారు అనిపించింది. ఇలా మొదట్నుంచి చివరిదాకా ఏమిటి వీళ్ళు ఇలా చేస్తారు? వీళ్ళేమైనా పెద్ద గొప్పనుకుంటున్నారా? – ఇలా అనేకమార్లు అనుకున్నాను. ఒక్కోసారి మళ్ళీ అవే దృశ్యాలను మరో సందర్భంలో తల్చుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళనే, ఆ సన్నివేశాల్లోనే మరోలా దర్శిస్తే వాళ్ళ frustration అర్థమయింది అనిపించింది. అంత తీవ్ర భయంకర నిర్ణయాలను నేను సమర్థిస్తానో లేదో చెప్పలేను కానీ, నా మట్టుకు నేను అంత తీవ్రమైన మనిషిని కాకపోయినా ఆ పాత్రలని పూర్తిగా ద్వేషించలేకపోయాను. ఒక్కోచోట ముచ్చటేసింది కూడానూ! ఇద్దరిలో తమ జీవితం పట్ల రగులుతున్న అసంతృప్తి ని చాలా lively గా చూపినట్లు అనిపించింది నాకు. ఇలా అన్ని రకాల ఉద్వేగాలనూ కలిగించింది కనుక నేను ఇది సహజ చిత్రీకరణ అనుకుంటున్నాను.

మొత్తానికి అయితే, ఆ టైపులో మొదట్నుంచి చివరిదాకా పాత్రల్లో లీనమయిపోయి అక్కడికి అదేదో నా జీవితమన్నట్లు ఫీలైపోయి ఖంగారు పడిపోయేలా చేసింది కనుక, నవల నా మట్టుకు నాకు గొప్ప నవలే. నన్ను అడిగితే ఈ పుస్తకాన్ని యువతీయువకులకు తప్పకుండా చదవమని సూచిస్తాను. తక్కిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అభిరుచులనుబట్టి వాళ్ళనే ఆలోచించుకోమని చెబుతాను 🙂

ఈ “రెవల్యూషనరీ రోడ్” పుస్తకం గురించి 2008-09 ప్రాంతంలో దాని ఆధారంగా సినిమా వచ్చినప్పుడు మొదటిసారి విన్నాను. అప్పట్లో ఇద్దరు స్నేహితులు ఈ పుస్తకం గురించి చెప్పిన విధానానికి ఊరికే విన్నంతమాత్రానికే నాకు పూనకం వచ్చేసింది. అప్పట్నుంచి అక్కడ కొన్ని పేజీలూ, ఇక్కడ కొన్నీ చదువుతూండగా, 2012లో ఈ పుస్తకం మళ్ళీ మొదట్నుంచి మొదలుపెట్టాను. దాదాపుగా పూర్తి కావొస్తూండగా నాకో సమస్య మొదలైంది. మొదటి పేజీ నుండి ఈ ప్రధాన పాత్రలు, వాటి సంఘర్షణలు, ఆనందాలు, తగాదాలూ – అన్నీ నాకు చాలా పరిచయం ఉన్నవిగా అనిపించాయి. అలా ఈ పాత్రలతోఅంత ఇన్వాల్వ్ అయ్యాక ఆ ముగింపుని తట్టుకోడం కష్టం (సినిమా వచ్చింది కనుక ముగింపు తెలుసు నాకు) అనుకుని సరిగ్గా ముగింపు దృశ్యానికి ముందు ఆపేశాను పుస్తకం చదవడం.

సరిగ్గా రెండేళ్ళకి అప్పుడు పుస్తకం కొన్న ఊరికే వెళుతూ, బహుశా అప్పుడు వెళ్ళిన ట్రెయిన్ లోనే మళ్ళీ మొదట్నుంచి మొదలుపెట్టాను ఈమధ్యే, ఆగస్టు-సెప్టెంబరు ప్రాంతంలో… ఈసారి మట్టుకు ఏకబిగిన చదివి పూర్తి చేశాను. విచిత్రంగా – పుస్తకం అంతా ఈసారీ కదిలిపోయి, హీరో-హీరోయిన్ పాత్రల్లో లీనమైపోయి, నాకు తెలిసిన మనుషుల్ని చూసుకుంటూనే చదివినా కూడా, ఆ ముగింపు నేను ఊహించినంత ప్రభావం చూపలేదు నా మీద. దానితో “హమ్మయ్య!” అనుకోకుండా ఉండలేకపోయాను. కనుక, ఈ వ్యాసం రాస్తున్నా,ప్రశాంతంగా!

ఈ రచయిత రాసిన ఇతర రచనలను చదవాలి వీలైతే!

You Might Also Like

Leave a Reply