గిలియన్ ఫ్లిన్ – నా స్వగతం

Gillian Flynn ఇటీవలి కాలంలో చాలా పేరు తెచ్చుకున్న అమెరికన్ నవలా రచయిత్రి. ఓ పక్క పేరూ, ఓ పక్క ఆవిడ పాత్రలని చిత్రించే విధానం గురించీ, రచనల్లోని చీకటికోణాలని గురించి విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇటీవలి కాలంలో ఈవిడ రాసిన మూడు నవలలనీ వరుసగా వారం పది రోజుల వ్యవధిలో చదవడం జరిగింది. వాటి గురించి, రచయిత్రి గురించి నా అభిప్రాయాలు:

మొత్తానికి రచయిత్రి రాసినవి మూడు నవలలు: (నేను సరిగ్గా కిందనుంచి పైకి చదివాను)
Sharp Objects (2006)
Dark Places (2009)
Gone Girl (2012) – ఇది ఈమధ్యనే సినిమాగా వచ్చింది. మిగితా రెంటికీ కూడా సినిమా/టీవీ వర్షన్లు రాబోతున్నాయి.
(కథలు తెల్సుకుంటే చాలు, పుస్తకం చదవక్కర్లేదు అనుకుంటే, పై వికీ లంకెలు చూడండి.)

మొదట Gone Girl గురించి: ఒక భార్య సరిగ్గా వాళ్ళ పెళ్ళి ఐదవ వార్షికోత్సవం నాడు తప్పిపోతే, సహజంగా భర్తపైనే పడుతుంది అనుమానం పోలీసులకి. పరిశోధనా సమయంలో దొరికిన ఆవిడ డైరీలో ఏళ్ళ తరబడి రాయబడ్డ విషయాలు కూడా అతనిమీదే అనుమానం పెంచుతాయి. కానీ, నవలలో అతని స్వగతంలా వచ్చే వర్షన్ చూస్తే మనకు అతను అమాయకుడేమో అనిపిస్తుంది. చివరికి అసలు సంగతి ఏమిటన్నది అటు పెడితే – ఈ కథలో ముఖ్యాంశం – మనుషులు, మీడియా ఎంత manipulation చేయగలరు – తాము కోరుకున్నది పొందేందుకు ఎంత దూరం పోగలరు? అన్నది. మొదట్లో కొంచెం బోరు కొట్టింది కానీ, మొదటి యాభై పేజీలు అలా దాటాక ఇంక ఆపడం కష్టమైంది. నవలలో నేను అవాక్కైన సందర్భాలు లెక్కలేనన్ని. “ఏమిటి, ఇలా కూడా ఆలోచిస్తారా? ఇంత క్రిమినల్ బుర్రతో కాపురం చేయడమా?” అని ఆ పాత్రల బారిన పడ్డ పాత్రలకంటే ఎక్కువగా నేను ఖంగారు పడిపోయా. ఎక్కడికక్కడ ఇంక ఇంతకంటే ఏం చేస్తారు? అనుకోవడమూ, అపైన “కెవ్వ్!” అనుకోవడమూ. చివరి దాకా నన్ను అలా ఆశ్చర్య పరిచే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి నవలలో! నవలలో టీవీ మీడియా హైప్ ని వర్ణించిన తీరు సరేసరి! మీడియా ఎక్కడైనా ఇంతే అనమాట అనిపించింది.

నిజానికి ఇందులో కొన్ని చోట్ల అతి-హింసాత్మకంగా, జుగుప్త్స కలిగించే దృశ్యాలూ లేకపోలేదు – కానీ, పుస్తకం చదవడం మనచేతుల్లో పని కనుక అలాంటి చోట్ల పైపైన తిప్పేశాను. కానీ, మొత్తంగా అయితే, నవల మంచి psychological thriller అని చెప్పవచ్చు (మంచి అంటే pleasant కాదు). ఇలాంటి psychopathలు మన చుట్టుపక్కల ఉంటే ఎలా? అన్న ముక్క ఊహించుకోకుండా ఉంటే చాలు. “మీ తదుపరి నవల ఏమిటి?” అని ఎవరో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకి రచయిత్రి – “Whatever it is, it is going to be darker and scarier” అన్న తరహా జవాబు ఇచ్చింది ఒక ఇంటర్వ్యూలో. అది చూసి, “వామ్మో, ఇంతకంటేనా?” అనుకున్నాను కానీ, నిజానికి తర్వాత తెలిసింది నాకు – తక్కిన రెండు నవలలతో పోలిస్తే ఇదే కాస్త నయం ఆ కోణంలో అని. సినిమాగా కూడా నవల మూలం చెడకుండా బాగా తీశారు – రచయిత్రే స్క్రీన్ ప్లే అందించడం వల్లనేమో!

రెండవ నవల – Dark Places:
ఈ మూడింటిలో కథనం కొంచెం మందకొడిగా సాగే నవల. కానీ, చివరికి వచ్చేసరికి మటుకు విపరీతమైన మలుపులు. మూడింటిలో కొంచెం కొన్ని దశాబ్దాల క్రితం నాటి అమెరికన్ జీవితంతో పరిచయం ఉండడం అవసరం అనిపించిన నవల ఇదే నాకు. కొన్ని కొన్ని దృశ్యాలు అయితే ఊహించుకోడానికి భయానకంగా ఉన్నాయి. కొన్ని కొన్ని పాత్రలు, వాటి చీకటి గతాలు కూడా. ప్రధాన పాత్ర లిబ్బీ డే తాలూకా mean ness, cheap behavior వర్ణించడానికి నాకైతే మాటల్లేవు. అయితే, మూడింటినీ నాకు నచ్చిన వరుసలో పెట్టుకుంటే మట్టుకు – Sharp Objects మొదటిది, ఇది చివరిది. ఆ చివరి క్లైమాక్స్ బాంగ్ కోసం ముప్పావు భాగాన్ని తట్టుకోడం కష్టమే – సైకో పాత్రలని భరించలేనివారికి. ఈ నవలకి చివర్లో రాసిన acknowledgements లో రచయిత్రి రాసిన ఈ వాక్యం… “What can I say about a man who knows how I think and still sleeps next to me with the lights off?” … పుస్తకం ముగుస్తూండగా సరిగ్గా నేను కూడా అనుకున్నాను, ఈవిడ భర్త గురించి! ఈ పుస్తకం కూడా త్వరలో సినిమాగా రాబోతోంది.

మూడవ నవల – Sharp Objects: ఈ నవలాత్రయంలో అన్నింటికంటే నన్ను ఆకట్టుకున్న నవల. మొదట్నుంచీ కథనం వేగంగా, ఆసక్తికరంగా సాగింది. ఊహించని మలుపులకి కొదువేం లేదు ఇందులో కూడా – పైగా ఇందులో మర్డర్ల మిస్టరీ కూడా ఉంది! భయంకరమైన సాడిస్టు స్త్రీ పాత్రలు ఉండడంతో – నాకు చాలా ఆశ్చర్యమేసింది, ఒక అమ్మాయి ఇంత భయంకరమైన స్త్రీ పాత్రలని సృష్టించడం ఏమిట్రా బాబూ అని. కథలో Münchausen Syndrome అన్న మానసిక సమస్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతకు ముందెప్పుడూ అలాంటిది ఒకటి ఉంటుందని నాకు తెలిసి ఉండకపోవడం వల్ల నేను అవాక్కయ్యాననే చెప్పాలి. వీటికి తోడు ఆవిడ గ్రాఫిక్ వర్ణనల వల్ల – నాకు ఓ రెండు మూడు రోజులు నిద్ర కరువైంది ఈ నవల చదివాక! మూడింటిలో ఈ నవల ప్రత్యేకంగా నా మీద మానసికంగా ప్రభావం చూపించిందని అనుకుంటున్నాను. ఇది చదివి రెండు నెలలు అవుతున్నా ఇంకా కొన్ని దృశ్యాలు అలా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి! ఈ నవల చదివినప్పుడు ఓ స్నేహితురాలిని కలిశాను – ఆమెకి ఈ కథాంశం అంతా వివరించాక మేము ఇలాంటి భయంకరమైన చీకటి కోణాలు ఉన్న నవలలు చదవడం వల్ల మనకి చేకూరే ప్రయోజనం ఏమైనా ఉందా? అని కూడా చాలా సేపు చర్చించుకున్నాము (మాకు ఒకట్రెండు ప్రయోజనాలు తోచాయి కానీ, అవి ఇక్కడ ప్రస్తావించ దలచలేదు). ఇదంతా చెప్పింది ఎందుకంటే – నా స్నేహితురాలు ఇంకా ఈ నవల చదవకపోయినా కూడా, ఆ తరువాత మేము ఎక్కడ కలిసినా ఇంకా దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము! అంతగా ప్రభావితం చేసిందనమాట – చదివిన నన్నూ, చదవని ఆమెనీ!

ఏప్రిల్ లో అనుకుంటాను – ఒక స్నేహితురాలు Gone Girl నవలను గురించి చెప్పింది. ఎప్పుడూ దేని గురించి ఆమె అంత స్ట్రాంగ్ గా చెప్పి ఉండకపోవడంతో, ఆశ్చర్యం వల్ల వెంటనే చదవడం మొదలుపెట్టా. ఓ పాతిక పేజీలేమో చదివేసరికి బోరు కొట్టేసింది. మరో ఇరవై చదివేసరికి – ఇదంతా చదివి ఆస్వాదించగల ఓపిక నాకు లేదు అనిపించి పుస్తకం మూసేశాను. అలా ఓ ఐదు నెలలు గడిచాయి. సెప్టెంబర్ లో యూఎస్ వెళ్తూండగా ఆగిన అన్ని ఎయిర్ పోర్టులలోనూ ఆంగ్ల, జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో ఈ పుస్తకం మళ్ళీ మళ్ళీ కనబడ్డది. అక్కడున్నప్పుడు వెళ్ళిన పుస్తకాల షాపుల్లోను, తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ వేర్వేరు విమానాశ్రయాల్లో కూడా ఇదే పుస్తకం!

అప్పటికింకా నాకు అది సినిమాగా వస్తోందని తెలీదు. ఇలా ఎక్కడ పడితే అక్కడ నన్ను stalk చేసేసరికి నేను ఇంక ఆ పుస్తకం మళ్ళీ తెరువక తప్పింది కాదు. ఈసారి మట్టుకు బోరు కొట్టలేదు అదేమిటో గానీ – అసలు రోజూ సాయంత్రం అవగానే, ఇంటికి రాగానే, ఎంత తొందరగా వంటా వార్పూ అయిపోతుందా? ఎంత తొందరగా కథ కొనసాగుతుందా? -ఇదే వరసగా ఉండింది. ఆపైన పొద్దున్న లేవగానే రాత్రి చదివినంత మేర కథ గురించి పైన చెప్పిన స్నేహితురాలితో చర్చ అనమాట. ఈ నవల అవగానే ఇంక ఆవేశంగా రచయిత్రి రాసిన తక్కిన రెండు నవలలు కూడా చదివేశాను – టీనేజిలో వరుసగా ఒకే రచయితవి అదే పనిగా చదివినట్లు. ఈ విధంగా నాలోని టీనేజర్ ని ఇలా దశాబ్దం పైగా దాటిపోయాక ఈ రచయిత్రి రచనలు తట్టి లేపాయి!

అందరికీ నచ్చకపోవచ్చు కానీ, కొన్ని బ్రతుకుల్లోని కొన్ని భయంకరమైన చీకటి కోణాలని దర్శించి తట్టుకునే ఓపిక ఉంటే ప్రయత్నించవచ్చు. అన్నట్లు, చీకటి అంటే సెక్సు కాదు. 50 shades of grey నవలల లాగనా? అని అడిగారు నన్నెవరో. అవి నేను చదవలేదు కానీ, అది పార్న్-నవలలా ఉంటుందని మరెవరో చెబితే విన్నాను. సినిమా గా తీస్తున్నప్పుడు కూడా మరి హాలీవుడ్ సినిమాల్లో కరెక్టుగా వీటి మీదే దృష్టి పెడతారు (ఒక్కోసారి కథనుండి దృష్టి మరలేంతగా!) – కానీ, పుస్తకంలో నేను అంటున్న చీకటి కోణం మట్టుకు అది కాదు. దయచేసి అపార్థం చేసుకోవద్దని మనవి!

You Might Also Like

One Comment

  1. మేధ

    మీరు వివరంగా వ్రాయడం మంచిదైంది.. అంతకుముందు మీరు ముఖపుస్తకంలో కొంచెం వెరైటీ అన్నట్లు కామెంట్ చేసినట్లున్నారు.. అలా ఐతే కష్టంలే అనుకున్నా, But now it looks interesting ..
    Thanks for the details 🙂

Leave a Reply