The Puffin Mahabharata: Namita Gokhale

ఇప్పుడు, మహాభారతం గురించి జనాలు మాట్లాడుకోవాలంటే, ఒక టివి సీరియల్ రావాలి. లేదా, అడపాదడపా వచ్చే ఆనిమేషన్ సినిమాలు. భారతంలో కొంత భాగాన్ని తీసుకొని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి సినిమాలు తీస్తున్నారుగానీ, ఎవరూ పౌరాణిక సినిమాల జోలికి పోవటం లేదు. ఇహ, ఇళ్ళల్లో బామ్మలు, అమ్మలు ఎంతమంది పిల్లలకి భీష్ముడి, కర్ణుడి, అర్జునుడి కథలు చెప్తురాన్నది నాకు అనుమానమే! కారణాలు ఏవైనా, మహాభారతం గురించి అసలు తెలియనివాళ్ళకి, ఆ ఎపిక్‌కి ఓ మంచి పరిచయాన్ని ఇచ్చే పుస్తకం, నమిత గోఖలే రాసిన మాహాభారత అనే పుస్తకం. కేవలం రెండొందల పేజీలలో ఆ మహద్గ్రంధాన్ని అత్యంత తేలికైన భాషలో, పిల్లలకి అర్థమయ్యే విధంగా రాయటం అభినందనీయం.

భారతానికి అనేక వర్షన్లు ఉన్నా, ఇందులో మాత్రం సూత మహాభారత కథను చెప్తున్నట్టు ఆరంభంలో చెప్పారు. గంగా, శాతనుడి వివాహం నుండే కథ మొదలవుతుంది. యుద్ధం ముగిసి, పాండవులు రాజ్యాన్ని ఏలి, చివరకి వాళ్ళంతా స్వర్గానికి చేరేంత వరకూ కథ సాగుతుంది. నాకు తెల్సిన భారతం తక్కువే అయినా, ఈ పుస్తకంలో కీలకమైన ఘట్టాలన్నీ ఉన్నాయనే అనిపించింది.

పుస్తకంలో ప్లస్ పాయింట్లు:

  • భాష సరళంగా ఉంది.
  • కథను కూడా సరళంగా చెప్పడానికి ప్రయత్నించారు, వీలైనంతగా. ముఖ్యంగా, భారతంలో కథల్లోంచి కథలు పుట్టుకొస్తుంటాయి. అలా వచ్చిన సందర్భాల్లో అంతా, “ఆ కథ సంగతి మరోసారి చూద్దాం” అంటూ అక్కడికి కట్ చేసేశారు.
  • అలానే, ఆకాలంలో ఆచారాలను, వ్యవహారాలను ఈ తరం వారికి చెప్తున్నప్పుడు ఎదురయ్యే ప్రశ్నలకు కథనంలోనే భాగంగా జవాబులు ఇచ్చుకుంటూ వెళ్ళారు. అప్పట్లో, అలా చేసేవారులే.. అని అంటూ. దీనితో, ఇప్పటి మన ఆచారవ్యవహారాలకి, అప్పటి పరిస్థితులకు మధ్య తేడాను గమనించే అవకాశం ఇచ్చినట్టు అనిపించింది.
  • బొమ్మలు బాగున్నాయి. కీలక ఘట్టాలన్నీ బొమ్మలుగా చూపే ప్రయత్నం చేశారు.
  • చివర్న, భారతంలో వచ్చే పాత్రల చిట్టాను ఇచ్చారు. మొదటిసారిగా ఈ కథను తెల్సుకుంటున్నవారికి ఇది బాగా పనికొస్తుంది.

పుస్తకంలో లోట్లు:

  • కథని మొత్తం వేర్వేరు ఘట్టాలుగా విభజించారు. “గంగా దేవి”, “ఖాండవ దహనం”, “భీముని మీద హత్యా ప్రయత్నం” ఇలా. దీనికన్నా, కథను పర్వాలుగా ప్రెజెంట్ చేసుంటే ఇంకా బాగుండేది అని నాకనిపించింది. కథపై ఒక అవగాహన వచ్చాక, ఏదైనా ఒక కీలక ఘట్టంపై ఇంకా ఎక్కువ చదువుదామనుకున్నప్పుడు, అది ఏ పర్వంలో ఉందో తెలియడం ఉపయోగపడుతుందని నా ఆలోచన.
  • కృష్ణుడి గురించి ఇందులో ఎక్కువగా లేదు. ముఖ్యంగా పాండువులకి, కృష్ణుడికి మధ్య అనుబంధం గురించి పెద్దగా తెలియకపోవచ్చు. అయితే, అవన్నీ చెప్పుకుంటూ పోతే, సరళత లోపించేది.

మహాభారతాన్ని పరిచయం చేసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా చదవాల్సిన పుస్తకం. టీన్స్ లో ఉన్న పిల్లలకు బహుమతిగా ఇవ్వదగ్గ పుస్తకం. అయితే, ఇది కేవలం ఔట్‌లైన్ మాత్రమే అని, మహాభారతం ఒక ఎపిక్ అనీ వారికి సూచించడం కూడా ముఖ్యమే. ఎందుకంటే, సంక్లిష్టత అనేది మహాభారతంలో చాలా ముఖ్యమైనది. అందులో ఏ పాత్ర బ్లాక్ ఆర్ వైట్‌గా ఉండదు. అందరిలోనూ మంచి ఉంటుంది. అందరూ ఏదో పరిస్థితుల్లో తప్పులు చేస్తారు. ఈ విషయం అర్థం చేసుకోవడానికి, ఈ పుస్తకం అంతగా సాయం చేయదని నా అభిప్రాయం. అందుకే, దీన్ని కేవలం ఒక ఇంట్రోగా పరిగణించాలి.

The Puffin Mahabharata
Namita Gokhale
Fiction
The Puffin

You Might Also Like

Leave a Reply