మూలింటామె

వ్యాసకర్త: కె. సురేష్
*******

ఒక మంచి కథకుడు కథని చెప్పాలి, కథ కాకుండా ఏదో చెప్పటానికి ప్రయత్నించకూడదు. నిజమైన పరిశోధకుడిలాగా ఎటువంటి కళ్లజోళ్లు లేకుండా, పాత్రలలోకి జొరబడిపోకుండా, సందేశాలని చొప్పించకుండా కథనాన్ని చిక్కగా నడపాలి. దాంట్లోంచి పాఠకులు ఏం అర్థం చేసుకుంటారు, దానినుంచి ఏమి తీసుకుంటారు, ఎలా అన్వయించుకుంటారు అన్నది వాళ్ల ఆలోచనను బట్టి ఉంటుంది. సముద్రం దగ్గరకి మనం ఎంత పాత్రతో వెళితే అంతే నీళ్లు దక్కుతాయంట. చలం పుస్తకాల్లో బూతే కనపడిదంటే, దానిని వెతుక్కునేవాళ్లకు అదికాక మరొకటి ఎలా కనపడుతుంది?

మూలింటామెలో నామిని ఏం చేశాడు? ఒక సంవత్సరలోపు కాలంలో ఒకానొక గ్రామంలో జరిగిన పరిణామాలను చెప్పాడు. మూలింటి కొనామె ‘లేచిపోవటంతో’ మొదలైన కథ ఆ ఇంటి మొదటామె ఆత్మహత్యతో ముగుస్తుంది. నడుమ జరిగింది ఒక కుటుంబానికి సంబంధించినదా, గ్రామీణ సమాజంలోని మనుషుల మనస్తత్వానికి సంబంధించినదా, భారతీయ గ్రామీణ ప్రాంతాలు లోనవుతున్న మార్పులకు సంబంధించినదా, లేదా ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిందంటున్న మార్కెటు శక్తుల మాయాజాలానికి సంబంధించినదా? (అసలు మూలింటి అస్తిత్వమే, గుర్తింపే అంగడిల్లుగా మారిపోవటం ఎవరూ గుర్తించనంత, పట్టించుకోనంత సహజంగా జరిగిపోతుంది.)

కుటుంబంలో ఏం జరిగింది? ‘అన్నీ ఉన్న’ రూపావతి ‘ఏమీలేని’ కళాయివాడితో వెళ్లిపోయింది. ఎందుకు వెళ్లిపోయింది అని అమ్మమ్మ (ఆమె అత్త కూడా) పదేపదే ప్రశ్నించుకుంటుంది కానీ సమాధానం దొరకదు. ఈ ప్రశ్న వేసుకునే పాఠకుల పరిస్థితీ అంతే. కారణం, ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క రూపావతి దగ్గరే ఉంది. ‘మైదానం’లో రాజ్యలక్ష్మి ఎందుకు వెళ్లిపోయిందని చర్చపెడితే ఎలా ఉంటుందో, ఇదీ అలాగే ఉంటుంది. ఒక్క కళాయివాడు మాత్రం ‘ఎలా వచ్చిందో మహాలక్ష్మి అలాగే వెళ్లిపోయింది,’ అంటాడు.

ఇల్లాంటివి ఊళ్లో జరిగితే పెంటను చూసి కెలికే కోళ్లమాదిరిలాంటి వాళ్లకు అదొక సంబరం, మంచి కాలక్షేపం. ఇల్లు కాలుతుంటే మరమరాలు వేయించుకునేవాళ్లు, ఇతరులు కష్టాల్లో ఉంటే పైకి సానుభూతి కురిపిస్తూ లోపల్లోపల సంతోషపడేవాళ్లు తయార్. ‘పోతా పోతా బంగారం కూడా తీసుకు పోయిందేమో చూసుకోండి,’ అన్నవాళ్లు బంగారం కూడా పోవాలని కోరుకున్నవాళ్లే. రూపావతిని వెనక్కి తీసుకురావటానికి వెళ్లినప్పుడు జరిగిన ఘటనలను రంజకం చెప్పినదానికి, చీమంతమ్మ చెప్పినదానికి ఎంత తేడా?! ఇంతగా కూడా కల్పించి చెప్పగలరన్న విస్మయం మళ్లీ మళ్లీ కలగక మానదు.

వివాహేతర సంబంధాలు స్త్రీలు పెట్టుకోవటం అన్నవి పరువు, మర్యాదలపైనే కాకుండా ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుందన్న అంశం నిర్వివాదాంశం. ‘ఓనమాలు’లో పాలేరుతో విధవరాలైన అక్క అక్రమ సంబంధం పెట్టుకుంటే అభ్యంతరం వ్యక్తపరచని వాళ్లు పెళ్లి అనేటప్పటికి ఎంతో అభ్యంతరం పెడతారు. కారణం, అక్రమ సంబంధమే ఉన్నంతవరకు ఆమె చేసే శ్రమ తమ్ముడికి చెందుతుంది, అదే పెళ్లి అయితే అది భర్తకి చెందుతుంది. అదే విధంగా ఎవరితోటి, ఎందుకు ఇటువంటి సంబంధాలు పెట్టుకోవాలో, ఎవరితోటి, ఎందుకు పెట్టుకోగూడదో ములకమ్మ పండు వలిచినట్టు సుకుమార్‌కి చెపుతుంది.

చచ్చిన పాముని చంపటంలో మనవాళ్లు దిట్టలు. అలాగే ‘ప్రభ’ వెలిగిపోతున్న వాళ్లకి వందిమాగధులుగా మారటానికి ఒకళ్ల కాళ్లనొకళ్లు తొక్కుకుంటూ పోటీపడుతుంటారు. శ్రీశ్రీ ‘ఆః!’ అన్న తన ఆరు వాక్యాల కవితలో దీనిని చక్కగా చెప్పాడు. దీనికి అరవై పేజీల వ్యాఖ్యానాన్ని ఈ నవల ఆధారంగా చెయ్యవచ్చు.

మొదటామె పాపం నిజంగా చచ్చిన పామే. ఏమి అంటే మనవరాలు లేచిపోయింది సాకుగా చేసుకుని ఏమేమి అంటారోనని మౌనంగా ఉంటుంది. మనవరాలు ‘తప్పు’ తెలుసుకుని తిరిగివస్తే తలుపులు ‘తెరిచి ఉండేలా’ చూడటానికి తపన పడుతుంది. కానీ నడిపామె అన్నకి మళ్లీ పెళ్లి చెయ్యటం ద్వారా పోయిన పరువేదో తిరిగి పొందాలనుకుంటుంది కానీ ఆమెకీ మిగిలింది ఏమీ లేదు.

పోతే ‘కొనాకి కథే’ అసలు కథా? దీనికి మొదటి భాగం ఒక ఉపోద్ఘాతమా? కావచ్చు. ఏం ‘చెప్పటానికి’ రచయిత ఇంత రంగాన్ని తయారుచేసుకున్నాడు?

‘అనివార్యంగా’ గ్రామీణ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న మార్పులను చూపించాడు. పల్లెలు, పర్యావరణం, ప్రశాంతత, అనుబంధాలు (ఇవన్నీ కూడా ఏ కళ్లతో చూస్తున్నారన్న దానిబట్టి కూడా ఉంటాయి) అంటూ ఎవరు, ఎంత మొత్తుకుని ఏడ్చినా, నాస్టాల్జియాకి లోనైనా మార్పులు పంది వసంతలా బుల్డోజ్ చేసుకుంటూ వచ్చేస్తాయి (అవును, వెక్కిరింత పేరుని కూడా అదొక భూషణం అయినట్లు ఆ పేరు ఎంతగా నప్పేట్లు చేశాడు!)

పెట్టుబడిదారీ విధానానికి ఏం కావాలి? ప్రతి వస్తువూ, ప్రతి అవసరమూ, ప్రతి ఒక్కరూ వ్యాపార సంబంధాలలోకి రావాలి. నవల ఆరంభంలో మూలింటామె మాదిరి స్వయం సమృద్ధిగా, సంతృప్తిగా ఉంటే కుదరదు. తమకు కావలసినవన్నీ స్వయంగా ఉత్పత్తి చేసుకునే రైతు కుటుంబమూ, ఏమీ ఉత్పత్తి చెయ్యని బికారీ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా ఒక్కటేనంట. ఎందుకంటే వీళ్లిద్దరూ స్థూల జాతీయోత్పత్తికి (జిడిపికి) ఏమీ దోహదపడటం లేదు. ఉత్పత్తి చేసినది ముందుగా అమ్మి, తిరిగి తన అవసరాల కోసం ప్రతిదీ మార్కెట్టునుంచి కొనుక్కుంటూ ఉంటే అప్పుడు ఆర్థిక వ్యవస్థకి పుష్ఠి చేకూరుతుందంట (ఆ క్రమంలో ఆ వ్యక్తికి ఏమైనా కానీ). ‘లిటిల్ ప్రిన్స్’ నవలలో చిట్టి రాకుమారుడు ‘ఒక ఇల్లు అందంగా ఉందంటే పెద్దవాళ్లకు అర్థం కాదు, దానికి ఎంత ఖర్చు అయ్యిందని అడుగుతారు,’ అన్నట్టు ప్రతిదీ మార్కెట్టు, డబ్బు కళ్లతో అంచనా వేయబడుతుంది. ఒక పాట బాగుందనటానికి ప్రామాణికం అది ఎంత వ్యాపారం చేసిందని చూస్తారు (‘గోల్డెన్ డిస్క్’ కొట్టిందా?). పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతా డబ్బు కొలతల్లోకి మారిపోవాలి, అప్పుడే వాటికి అర్థమూ, గౌరవమూ, విలువా.

ఈ monetisation of economyలోకి మన గ్రామాలు ఎలా మారాయో నామిని కథలో అంతర్భాగంగా మనకు చూపిస్తాడు. మూలింటికి అంగడి రావటమే ఒక ప్రధాన మార్పు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అప్పటివరకు ఉన్న చెట్ల ఉపయోగాలు అన్నీ పోయి డబ్బుగా మారేసరికి వాటి ‘విలువ’ తెలిసివచ్చింది. ముఖంపుల్ల పోయి బ్రష్షు, పేస్టు వచ్చాయి. చద్దన్నం స్థానంలో టిఫిన్లు వచ్చాయి. ఇంట్లో కోళ్లన్నీ కోసుకుని, పొరుగింటినుంచి కోడిని తెచ్చుకుని తిన్న తరువాత చివరికి బయటనుంచి కొనితెచ్చిన ఫారం కోడి వచ్చింది. ‘దూదిలాగా’ ఉండే ఫారం కోడి రుచి నచ్చిన తరువాత ఇక వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు.

నారాయుడు భూమి అమ్మటానికి కారణం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం కాదు, సంక్షోభంలో ఉండడమూ కాదు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు నవల మొదలు అయ్యే సమయానికి మూలింటి కుటుంబం సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉంది. నారాయుడు పొలం వెళ్లాడు, వచ్చాడు అని తప్పించి, మొదటామె, నడిపామె అన్నం తీసుకెళ్లారు, గడ్డిమోపుతో వచ్చారు అని తప్పించి వ్యవసాయం ఈ నవల కథాంశం కాదు. నారాయుడు భూమి అమ్ముతున్నప్పుడు మాత్రం కొనే రైతు ద్వారా వ్యవసాయం ఏమంత గిట్టుబాటుగా లేదన్నట్టు ఉంటుంది.

అయితే సుఖంగా ఉన్నవాళ్లను సంక్షోభంలోకి నెట్టటం, పల్లెల్లో ఉన్నవాళ్లను పట్టణాలకు నెట్టటం అన్నది ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి అవసరం. ఇది ఒక ముఖ్యమంత్రిదో, ప్రపంచ బ్యాంకుదో ఏజండా కాదు, వీళ్లందరినీ వెనకనుంచి నడిపే పెట్టుబడిదారీ విధానానిది.

పంది వసంత నారాయుడితో బీడీలు మాన్పించి సిగరెట్లు తాగించింది, మద్యం అలవాటు చేసింది, లుంగీలు పోయి ప్యాంట్లు వచ్చాయి, భూమి అమ్మి, బండి, ఎడ్లు అమ్మేసిన తరువాత మోపెడ్ మీద సరుకులు చేరవేసే పనే మిగిలింది. ఒకటికి రెండుసార్లు నారాయుడిని పంది వసంత ‘నువ్వు కూర్చో, నేను తిండిపెడతాను,’ అంటుంది.

ఒక్క క్షణం నారాయుడిని పల్లెటూరి వస్తుమార్పిడి సంస్కృతికీ, పంది వసంతను డబ్బుతో కూడిన పట్టణ వ్యవహారాలకీ ప్రతినిధిగా అనుకుంటే! అది నారాయుడి అమాయకత్వమా, అర్థంగానితనమా, అసమర్థతా? బలవంతంగా నోరు తెరిచి పలకమన్నట్టల్లా పలికే చిలకపలుకులా? అటువంటి బలవంతాన్ని ముందుతరం మొదటామె నిరోధించగలిగింది కానీ, ఆ తరువాత తరం నారాయుడు నిరోధించలేదు.

చెట్టు నరకటం పాపం అన్న భావన ఉన్న కాలంనాటి కథ ఇది. ఇప్పుడు అటువంటి భావాన్ని బద్దలుకొట్టవలసిన అవసరం పెట్టుబడిదారీ సమాజానికి ఉంది. వడ్డీ తీసుకోవటం పాపం, నేరం, తప్పు అన్న బావజాలం నుంచి వడ్డీ మామూలు విషయంగా మారటానికి ‘పాత భావాలతో’ ‘కొత్త భావాలు’ తప్పనిసరిగా ఘర్షణపడాల్సి ఉంటుంది. పంది వసంత ‘ప్రాక్టికల్’ దృష్టికోణంతో మొదలయ్యి, ‘చెట్లు నరకటం పాపమంటే అందరికీ అవసరమయ్యే కలప ఎలా దొరుకుతుంది, పెరట్లో కోడి పెరట్లో తిరుగుతూ ఉండాలి, తింటానికి కోడి కూర కావాలంటే ఎలా,’ అన్న సామిల్లు వ్యాపారి తర్కంతో, ‘దండం పెట్టకుండా గొడ్డలి దెబ్బ వెయ్యొద్దన్న’ పైపై గౌరవంతో మొత్తానికి చెట్లు సఫా అయిపోతాయి.

‘చెట్టు మొత్తం ఎరుక లేకుండా ఒక్క ఆకు కూడా పండుబారనట్టు, సమాజం మొత్తం ఆమోదం లేకుండా ఒక్క నేరం కూడా జరగదు,’ అంటాడు ఖలీల్ జిబ్రాన్. పంది వసంత చేసే ప్రతి పనికీ, అది రంకుతనం కానివ్వండి, వడ్డీకి డబ్బులు తిప్పటం కానివ్వండి, చెట్లు కొట్టటం, భూమి అమ్మటం కానివ్వండి ఊరి మొత్తం ఆమోదం ఉంది – మౌన ప్రేక్షకులైన ఇద్దరు ఆడవాళ్లు, బలహీనంగా వినిపించే ఒక కుర్రవాడు, సణుగుడులాగా అనిపించే ఒక ముసలివాడు గొంతుక తప్ప. అయితే పంది వసంత ఈ నవలలో విలన్ కాదు. సామాజిక మార్పులో పెట్టుబడిదారీ విధానానికి అవసరమైన ఒకానొక పాత్ర. ఆ భూమిక ఆమె పోషించకపోతే ఇంకెవరైనా పోషిస్తారు. పెట్టుబడిదారీ సుడిగుండాల ప్రవాహంలోకి తన తిరుగులేని విజయాలతో ఇతరులను ఆకర్షించటం ఆమె నిర్వర్తించాల్సిన చారిత్రిక కర్తవ్యం. పెట్టుబడిదారీ భావజాలం, సంస్కృతి, వినిమయతత్వాల పట్ల అందరూ దాసోహమనేలా చెయ్యాలి. ఆ సడిగుండాలలో ఎంతమంది మునిగిపోయినా, కొట్టుకుపోయినా తమ సమర్థత మీదో, అదృష్టం మీదో నమ్మకం ఉంచుకుని సర్వమూ పణంగా పెట్టి ప్రజలు అందులోకి దూకటానికి పంది వసంతలాంటి మార్గదర్శకులు, స్ఫూర్తిదాతలు, ఆదర్శ వ్యక్తులు ఈ సమాజానికి కావాలి.

అయితే ఇవేవీ రచయిత పనికట్టుకుని చెప్పటం లేదు. మనం చూడాలనుకుంటే, అర్థం చేసుకోవాలనుకుంటే, విశ్లేషించుకోవాలనుకుంటే మనకు కనపడతాయి. అదీ ఒక మంచి రచయిత చెయ్యాల్సిన పని. ఆ పనిని నామిని ఎంతో సమర్థంగా చేశాడు.

విశ్లేషించాలంటే, చర్చించుకోవాలంటే ఇంకా ఈ నవలలో చాలా విషయాలు ఉన్నాయి. గడపదాటిన మొదటి రాత్రే రూపావతి ‘తప్పు చేసాను, మళ్లీ ఆ గడప తొక్కలేనని,’ అని ఎందుకు ఏడ్చినట్టు? ఆమెను ‘మూదేవి కమ్మేసిందంట’. అలా ఒక క్షణికావేశంలో జరిగిన తప్పుకి నిష్కృతి లేకుండా ఎందుకు పోయినట్టు? ఒక్క మొదటామె మినహాయించి తల్లితో సహా మిగిలిన వాళ్లందరూ ఆమె తిరిగి వచ్చినా లోనికి అడుగు పెట్టనివ్వం అని ఎందుకు తేల్చి చెప్పినట్టు? ఇది నిజంగానే ఇతరులకు ‘గుణపాఠం’ చెప్పేందుకేనా? ఏమి లేకపోయినా సరే ‘పై’కులమని చెప్పుకునే అభిజాత్యమా?

భిన్న ధృవాల మాదిరి తీర్చిదిద్దిన రూపావతి, వసంతల పాత్రలు ఒక పి.హెచ్.డి. థీసిస్‌కి సరిపోతాయి. అలాగే మంచి, చెడుల తెలుపు, నలుపుల భిన్న ఛాయలలో కనపడే ఈ నవలలోని ప్రతి పాత్రనీ ఎంతైనా విశ్లేషించవచ్చు.

ఇంత నాజూకైన, సంక్లిష్టమైన అంశాన్ని కథా వస్తువుగా ఎంచుకోవటం చాలామందికి సాహసమనే అనిపించవచ్చు. కానీ ఇట్లాంటి అంశాన్ని ఎంచుకుని కొన్ని వెక్కిరింతలూ, వ్యంగ్యపు విసుర్లూ (అంత పెద్ద రెడ్డి ఆ అడ్డాపింట్లో వనవాసం చేసాడంట వంటివి) తప్పించి కథలో అంతర్లీనంగా గ్రామీణ పరిణామాలు గోచరించేలా నవలని నడిపించటం కొంతమందికే సాధ్యం. వాళ్లల్లో నామిని ఒకడు.

ఒక కథ, నవల రాయటంతో రచయితగా అక్కడికి ఆ బాధ్యత ముగుస్తుంది. అయితే రచయిత కూడా మనిషే. సమాజం మెప్పును వాళ్లు కోరుకుంటారు. ఈ మెప్పులు, శాలవలు, ప్రశంసల్లో పడి తన రచనా పటుత్వాన్ని కోల్పోతే మనం ఒక మంచి రచయితను కోల్పోతాం. ఏ గుర్తింపూ లేకపోతే ‘ఇంకా నేను రాయటం ఎందుకు?’ అన్న నిరాశకులోనై రచనా వ్యాసంగానికి దూరమైనా ఒక మంచి రచయితను కోల్పోతాం.

అయినా మేమంతా చప్పచప్పగా, ప్రబోధాత్మకంగా ఉండే కథలు రాసుకుంటుంటే జీవితాలను ఇంత అద్భుతంగా చిత్రిస్తూ రాస్తే ఎలా మెచ్చుకుంటాం? ‘నీ శైలి గొప్పది కానీ నువ్వు రాసేది చెత్త’ అని చలంని తిట్టినట్టు నిన్ను కూడా తిడతాం కానీ మెచ్చుకోనుగాక మెచ్చుకోం. మమ్మల్ని క్షమించేసి నువ్వు మంచి రచనలు చేస్తూనే ఉండు నామినీ.

మూలింటామె
నామిని

You Might Also Like

8 Comments

  1. varaprasaad.k

    అచ్చంగా నామిని కథ చదివినట్టే ఉంది,ఇంచుమించు నామిని బుక్స్ అన్నీ చదివాను,ఇది తప్ప ఇపుడు వేట మొదలు పెట్టాలి దొరికేదాకా.చాలా సంతోషం సురేష్ గారు,నామినిని మళ్లీ గుర్తు చేసినందుకు.ఆయనో మొండోడు గబా గబా ఇంకో నాలుగు పుస్తకాలు గెలికితే చదివి తరిద్దామని మనం చూస్తుంటే తీరిగ్గా తిరుపతి లో కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడు మహానుభావుడు.అందుకేనేమో మొండోడు రాజుకన్నా బలవంతుడన్నారు.ఈ మొండి మనిషి మారేదెన్నడు,నాలుగు ముక్కలు రాసేదెన్నడు చెప్పు తిరుమలేశా గట్టిగా.

  2. మూలింటామె | నా ప్రస్థానం

    […] పుస్తకం గురించి మరిన్ని వివరాలు యిక్కడ. […]

  3. pavan santhosh surampudi

    అస్పష్టమైన ఇమేజినరీలు, ఎక్కడెక్కడివో రచయితకు సంబంధంలేని తాత్త్వికతలు ఎత్తుకొచ్చే పొగిడేవారు, దారుణాఖండల శస్త్రయుక్తంగా ఖండించేవారు, ఈ ఇద్దరి మధ్యా సంతకాలు సేకరించేవారు, హంగామా హంగామా చేసేశారు.
    వాన వెలిసిన ఆకాసం మల్లే ఓ మంచి వ్యాసం ఇన్నాళ్ళకొచ్చింది.

  4. రవి

    ఈ వ్యాసం చాలా ఒరిజినల్ గా ఉంది. ఇలా ఒరిజినాలిటీ ఉన్న వ్యాసాలు కాస్త అరుదు.

    నామిని నవల పైన అభిప్రాయాల మాట ఎలా ఉన్నా, ఆయన మరిన్ని రచనలు చేయాలని అందరూ కోరతారు. ఇది మటుకు నిజం.

  5. రాధ మండువ

    చాన్నాళ్ళ తర్వాత నామిని రాసిన ఈ నవల ఇది. నిజంగా కళ్ళెదుట జరిగేవి చూసి రాసినదని స్పష్టంగా తెలుస్తోంది. దానికి ఎవరెన్ని పేర్లు పెట్టుకున్నా, ఏం మాట్లాడినా రచయితకెలా అంటుతాయి గాని…. బావుంది సురేష్ గారూ మీ వ్యాసం. నా కోరికా ఇదేనండీ “నువ్వు మంచి రచనలు ఇంకా చేయాలి నామినీ”

    1. varPrasad

      Andaroo koredi ade kadaa

  6. సౌమ్య

    జంపాల గారు అన్న మాట తో అంగీకరిస్తాను. నేనింకా ఈ పుస్తకం చదవలేదు. దీని గురించి ఇప్పటిదాకా నేను చదివిన వ్యాసాల్లో ఏదీ నేను పుస్తకం చదవాలి అనుకునేలా చేయలేదు. ఇది చేసింది. త్వరలో చదివేందుకు ప్రయత్నిస్తాను. వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు.

  7. Jampala Chowdary

    ఈ నవలపై ఇప్పటి వరకు నేను చదివిన సమీక్షలలో సంయమనం, సమతూకంతో ఉన్న సమీక్ష. ధన్యవాదాలు సురేశ్ గారూ.

Leave a Reply to varaprasaad.k Cancel