పుస్తకం
All about booksపుస్తకభాష

October 29, 2014

కళాపూర్ణోదయం – 3 : రంభానలకూబరులు

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: జాస్తి జవహర్
*********
కళాపూర్ణోదయకావ్యానికి సంబంధించినంతవరకు రంభానలకూబరుల పాత్ర చాలా పరిమితం. కాని అవి ముఖ్యమైన పాత్రలే! కథకు సంబంధించినంతవరకు వారు నిర్వహించవలసిన ముఖ్య కార్యం – కలభాషిణికి, మణికంధరునికి శాపాలివ్వటం. అందుకోసం కవి సృష్టించిన సన్నివేశం అద్భుతం, అనితరసాధ్యం! అందులో కవి ప్రదర్శించిన చతురత, చిలిపితనము, కవితాప్రతిభ అద్వితీయాలు. తెలుగు సాహిత్యంలో మణిపూసలు. రంభానలకూబరులు గంధర్వులు. నిత్య యవ్వనులు; నిత్యశృంగారలీలాలోలురు. వారికి వేరే వ్యాపకం లేదు. వారి అనుబంధానికి ఆధారం వారి పరస్పరానుబంధమేగాని మానవనిర్మితాలైన వివాహం లాంటి వ్యవస్థలేవీ అక్కడ లేవు. వారిది స్వేచ్ఛాప్రణయం. కవిరాజుగారి సూతపురాణంలో సూతమహర్షి అక్కడి పరిస్థితులను ఈవిధంగా వివరించాడుః

ఇండ్లొయున్నవిగాని పెండిండ్లు లేవు
ఆండ్రొయున్నారుగాని ఇల్లాండ్రు లేరు
బాగు శివ! శివా! ఇది వట్టి భోగ భూమి
ఉండరాదిందు మావంటి యోగులకును.

వారి నీతులు, నియమాలు వేరు. కోరుకున్నట్లు జీవించటం తప్ప ఇంకా కోరుకోవలసిన వేవీ లేవు. వారికి గగనవిహారం ఇచ్ఛానుగతం. కోరుకున్నప్పుడల్లా చేసే వాహ్యాళి. ముల్లోకాలకూ వారు పయనించగలరు. వీసాలేవీ అక్కరలేదు. రంభానలకూబరులిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండే సమయాలు చాలా అరుదు. ఒకరినొకరు విడిచి ఉండలేరు.

ఒకనాడు భూలోకంలో విమానంలో విహరిస్తూ ద్వారకాపురికి దగ్గరలో గగనతలంలో ఉన్నారు. అదేసమయంలో  నారదుడు తన శిష్యుడు మణికంధరునితో కృష్ణుని దగ్గర సంగీతశిక్షణకోసం వస్తున్నాడు. క్రింద ఒక ఉద్యానవనంలో కలభాషిణి తన చెలికత్తెలతో తీగెటుయ్యాలలూగుతున్నది. అది గమనించిన మణికంధరుడు గురువైన నారదునితో –

తమిబూదీగెల దూగుటుయ్యెలల బంతాలాడుచుం దూగునా
కొమరుంబ్రాయపు గబ్బిగుబ్బెతల యంఘ్రుల్ చక్కగా సాగి మిం
టిమొగంబై చనుదెంచు ఠీవి కనుగొంటే దివ్య మౌనీంద్ర, నా
కమృగీనేత్రలమీద కయ్యమునకున్ కాల్చాచులాగొప్పెడిన్

అన్నాడు. అందుకు నారదుడుగూడా సంతసించి –

బళిరా! సత్కవివౌదు నిక్కమ తగన్ భావించి నీవన్నయా
యెలబ్రాయంపు మిటారికత్తెల బెడంగేనెందునుం గాన వా
రల డోలాచలనోచ్చరణముల్ త్రైవిష్టప స్త్రీల యౌ
దలదన్నం జనినట్లు మించెననినం దప్పేమి యొప్పేయగున్

అని సమర్థించాడు. అది కేవలం గురుశిష్యుల మధ్య జరిగిన సంభాషణ. కాని వారి ప్రక్కనే మబ్బు చాటున విమానంలో ప్రియునితో పయనిస్తున్న రంభ ఆమాటలు విన్నది. నలకూబరుడు గూడా వినే ఉంటాడు. కాని అతనికివేమీ పట్టవు. అతనికి రంభ ప్రక్కన ఉంటే ఇంకేమీ అక్కరలేదు. రంభకలా కాదు. తాను అందరికన్నా అందగత్తెననీ, నలకూబరునికి తానొక్కతెనే తగినదానననీ ఇతరులు గుర్తించి గౌరవించాలి. మానవకాంతల అందాలు తనకంటే ఆకర్షణీయంగా ఉన్నవని తెలియని మణికంధరుడంటే అనవచ్చు, అర్భకుడు. కాని త్రిలోకసంచారియైన నారదుడు గూడా దానిని సమర్థించటమేమిటి? ఆమె అహం దెబ్బతిన్నది. తన గొప్పతనమూ, ప్రత్యేకతా వెంటనే నారదునికి గుర్తు చెయ్యాలని తలచింది. అందుకోసం తన విమానాన్ని నారదులవారి ప్రక్కకు చేర్చి, ప్రణామాలాచరించింది. వారిని చూచి నారదుడుగూడా సంతుష్టుడై “ఒండొరులపై వదలని ప్రేమగలిగి భాసిలుడని” దీవించాడు. అందుకు ప్రతిగా రంభ “తమదీవెన కారణంగా ఇప్పటికి ఇతని ప్రేమ నాపైన నిలిచిందేమోగాని ఇక నరభామల అందాలకు అతడు చలించడన్న నమ్మకమేమిటి?” అన్నది నిష్ఠూరంగా. ఆమె భావం నారదునికి అర్థమయింది. అదేదో వివరంగా చెప్పమన్నాడు.

“తమరేదో ప్రయాణంలో ఉన్నట్లున్నారు. ఆగటమెందుకు?విమానంలోకి దయచేయండి. మాట్లాడుకుంటూ వెళ్ళవచ్చు.” అన్నది. తన విమానంలోగురుశిష్యులిద్దరికీ ఉచితాసనాలిచ్చి గౌరవించింది. “ఉద్యానవనంలో ఉయ్యలలూగుతున్న భామల గురించి తమశిష్యునితో తమరేదో అన్నారు. సెలవివ్వండి.” అన్నది రంభ. నారదుడు అదే పద్యం మళ్ళీ చదివాడు. “ఇందులో తప్పేమైనా ఉన్నదా? ఎందుకడుగుతున్నావు?” అని అడిగాడు తెలియనట్లుగ “తమరు త్రైలోక్యారాధ్యులు, ఏమైనా అనగలరు. అతిశయోక్తి కాకపోతే భూలోకభామలు మమ్ములను మించిపోవటమేమిటి? మా అందానికి ఈ కుబేర నందనుడే సాక్షిగదా!” అన్నది రంభ.

నారదుడు చిరునవ్వు నవ్వాడు. ఆమె తన అందానికేగాక తన ప్రియుని అందానికి గూడా గర్విస్తున్నదని గమనించాడు. సాలోచనగా నారదుడు – “ఔనుగదా! అతని ప్రేమను చూరగొన్న నీవు ఏమైనా అనగలవు. కాని రోజులు ఎప్పుడూ ఒకలాగుండవుగదా!
“నినుబోలు వనిత నీకును
వనజముఖీ! యితని బోలువాడితనికి నెం
దునుగలిగి కలచునో? యి
ట్టినిగాఢపు ముదము సొంపు ఠీవులు చనునే?”

-అని చురక తగిలించాడు. ఆమాట వినేసరికి రంభకు తన తప్పు తెలిసి వచ్చింది. నారదునితో పరాచికాలా? వెంటనే సర్దుకుని “తమరు ఎగతాళికన్నా అది నిజమయ్యే ప్రమాదముంది. అటువంటి మాటలిక చాలించండి.” అని మొరపెట్టుకున్నది. నారదుడు కోరినట్లు వారిద్దరినీ ఆ ఉద్యానవనంలో దించి, అతని వద్ద సెలవు తీసుకుని ప్రియునితోసహా ఆకాశమార్గాన వెళ్ళిపోయింది.

ఉద్యానవనానికి దగ్గరై, అక్కడే దిగుతున్న విమానాన్ని, అందులోనించి అస్పష్టంగా వినబడుతున్న మాటలను కలభాషిణి శ్రద్ధగా గమనించింది. ఉయ్యాలదిగి ఆవిమానం దిగినచోటికి పొదలమాటుగా వెళ్ళింది. అందులోనుంచి నారదుడు, అతని శిష్యుడు మణికంధరుడు దిగటం చూచింది. వారిద్దరూ తనకిదివరకు పరిచయమైన వారే! విమానంలో ఇంకా ఇద్దరున్నారు. అందులో ఉన్న యువకుడు అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు. అతడెవరో! అతనిని పొందగలిగిన ఆయువతి ఎంత అదృష్టవంతురాలో! అని ఈర్ష్య పడింది గూడాను.

నారదుని అడిగి వారెవరో తెలుసుకోవాలనుకున్నది. నలకూబరుడు అందరికంటే అందగాడంటారు! అవును, వారి మాటలలో కుబేర నందనుడన్న మాటగూడా వినబడింది. అతడు నలకూబరుడేనేమో! ఐనా, ఒకసారి నారదుని అడిగి తెలుసుకుంటే మంచిదిగదా! అనుకున్నది. అప్పుడే విమానం దిగి కృష్ణదర్శనానికి వెళుతున్న నారదుని సమీపించి, నమస్కరించి, అడిగింది “మునివర్యా! ఆ విమానంలో వెళుతున్నది రంభానలకూబరులేనా?”అని. అవునని చెప్పి, నారదుడు ‘ఆవిషయం నీకెలా తెలిసింది?’ అని అడిగాడు. ‘మీరు మాట్లాడుకోవటం విన్నాను’ అని చెప్పింది. నారదునికి కొంత ఉత్సాహం కలిగింది. “ఇంకా ఏమి విన్నావు?” అని అడిగాడు. “ఆమె తన అందానికి గర్వపడటము, తమరు మందలించటము విన్నాను.” “అవునుగదామరి? ఎవరికైనా అంతగర్వం పనికి రాదు. అంత విర్రవీగుతున్నదిగాని, ఒక సవతి తగిలితే తెలుస్తుంది…ఏవరో ఎందుకు? నీవే ఆసవతివి కావచ్చుగూడాను!” – అందుకు కలభాషిణి లోలోన సంతోషించింది. బయటికి మాత్రం “మాబోంట్లకు అంతటి రూపలావణ్యాలు కలగటం సంభవమా?” అన్నది.

“ఏమి? ఎందుకు సంభవం కాదు? రంభకంటేను, ఇతర అప్సరసలకంటేను నీ అందం ఏమి తక్కువ?” అన్నాడు నారదుడు. రంభకు గుణపాఠం చెప్పటానికి కలభాషిణి తగిన ఆయుధం అని గుర్తించాడు. అతనికి ఒక బాధ్యత తీరినట్లయింది. కలభాషిణి గూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నది. నారదుని వీణను మోసి, సేవించి తరించే అవకాశం కలిగించమని కోరింది. అందుకతడంగీకరించాడు. ఎవరు గర్వం ప్రదర్శించినా నారదునికి గిట్టదు. వేరొక సందర్భంలో సత్యభామనుగూడా ఇదేవిధంగా గర్వభంగం చేశాడు. అప్పుడు ఆమెను గురించి పారిజాతాపహరణంలో అతడన్న మాటలు ఇప్పుడు రంభ విషయంలో అక్షరాలా సరిపోతవి.

“చక్కనిదాననంచు, నెరజవ్వనినంచు జగంబులోన పే
రెక్కిన దాననంచు పతి యెంతయు నాకనురక్తుడంచు దా
నిక్కుచు విర్రవీగుచు గణింపదు కాంతల సత్య….”

అన్నాడు. కాని ‘సత్య’ అన్నచోట ‘రంభ’ అని పెట్టినా అతని ఉద్దేశం తెలుస్తుంది. అప్పటి సత్యభామను గురించిన అభిప్రాయమే ఇప్పుడు రంభను గురించిగూడా ఉన్నది నలకూబరునికి.

తరువాత ఎవరూ లేనప్పుడు కలభాషిణి నారదునితో “తమరు విమానం దిగినతరువాత నలకూబరుడు రంభతో ‘తరువాత కళాపూర్ణుని కథ ఏమయిందో చెప్పు’ అని అడిగాడు అందుకు రంభ ‘ఆకథ చెప్పినా, విన్నా ప్రమాదం జరుగుతుంది. అందుకే చెప్పగూడదు’ అన్నది. ఆకళాపూర్ణుడెవరు?” అని అడిగింది. అందుకు నారదుడుగూడా “ఆమె చెప్పగూడని కథ నేనుగూడా చెప్పగూడదు” అని దాటవేశాడు. అందుకు కలభాషిణి “అది చెప్పగూడని కథ ఐనప్పుడు ఆకథనుగురించిన ప్రసంగం వారి మధ్య ఎందుకు వచ్చింది?” అని అడిగింది “చెప్పటానికేముంది? వాళ్ళిద్దరూ ఎప్పుడూ రతిక్రీడా పరాయణులే! ఐనా కొందరికి కొన్ని సమయాలలో మన్మథావేశం కలుగుతుంటుంది. మేఘాలమాటున ఉదయిస్తున్న సూర్యుని చూచి రంభ ‘బ్రహ్మ ప్రక్కన సరస్వతి ఉన్నట్లుగా ఉన్నది గదూ!’ అన్నది. ఆవర్ణనకు నలకూబరుడెంతగానో సంతసించి, ఉద్రిక్తుడై రంభను చుంబించటంతోపాటు దంతక్షతం గూడా చేశాడు.

ఆమధురానుభవానికి రంభ అనుకోకుండా ఒక మణితకూజితం చేసింది. అందుకు నలకూబరుడు మరింత సంతోషించి ‘ఈకూజితం ఎంతో మధురంగా ఉన్నది. ఇదివరకెన్నడూ వినలేదు. ఎక్కడ నేర్చావు?’ అని అడిగాడు. అందుకు రంభ ‘నేర్చి చాలా కాలమయింది. కాని అది నీకు వినిపిస్తే ఆకథ చెప్పమని అడుగుతావు. అది చెప్పగూడని కథ. చెపితే చెప్పిన వారు, విన్నవారు భూలోకంలో పుడతారని ఒక సత్యవాక్ప్రభావంగల ప్రసిడ్ఢుడు చెప్పాడు. ఆకథ నేను విన్నతరువాత చెప్పాడుగనుక నాకు తగలలేదు. కాని ఇప్పుడు చెపితే దాని ప్రభావం నుంచి తప్పించుకోలేము. అందువలన నీకాకథ చెప్పటం కుదరదు’ అన్నది. అదే కారణంగా నేనుగూడా ఆకథ చెప్పలేను. ఎప్పుడైనా అది భూలోకంలో తెలియకపోదు.” అని వివరించాడు నారదుడు.

నారదునికి – అతనితో పాటు మణికంధరునికి, కలభాషిణికి గూడా – సంగీతశిక్షణ పూర్తి అయిన తరువాత, నారదుని సలహాననుసరించి మణికంధరుడు తీర్థయాత్రలు చేసి, విష్ణుసంకీర్తనతో తన సంగీతవిద్యను సార్థకం చేసుకుని, తపసుకుపక్రమించాడు. అతని తపసు విషయం కొన్నాళ్ళకు ఇంద్రునికి తెలిసింది. ఎవరెక్కడ తపసు చేసినా అది తన సింహాసనంకోసమేనని ఇంద్రుని భయం. అందువలన తపసులను భగ్నం చెయ్యటం అతని ముఖ్య కలాపాలలో ఒకటి. వెంటనే రంభను పిలిపించి మణికంధరుని తపసును భగ్నం చెయ్యవలసిందిగా ఆజ్ఞాపించాడు. మణికంధరుడు నారదుని శిష్యుడనేగాక, మణికంధరుడు చాలా నిష్ఠాగరిష్ఠుడని రంభకు తెలుసు. అతని తపసు భగ్నం కష్టసాధ్యమేగాని తేలికగాదు. అదీగాక దానివలన నారదునికి కోపం రావచ్చు. రంభ భయపడుతూనే ఇంద్రునికి తన అనుమానం చెప్పింది. అందు కాతడు “నీకు తొల్లిటికంటే రూపలావణ్యవిలాసంబులెక్కుడుగా వరంబొసగితిని. సందియము వలదని” ధైర్యం చెప్పి ప్రోత్సహించి పంపాడు.

చెలికత్తెలతో రంభ మణికంధరుని తపోవనంలో దిగింది. వనంకూడా వికసించిన పూలతో, మలయమారుతంతో ఆమెకు సహకరించింది. మణికంధరుడు చలించాడు. నిగ్రహించుకోవటానికి ప్రయత్నించాడు. కాని సాధ్యం కాలేదు. మునులు నవ్వనీ, తపసు భగ్నం కానీ – ఈమెను అనుభవించకుండా ఉండలేనని తీర్మానించుకున్నాడు. ‘నాతపఃఫలం నీవే’నని ఆమె వెంట పడ్డాడు. అందుకోసమే వచ్చిన రంభ అతనికి అన్ని రుచులూ చూపించింది. వారి కలయికను గమనించిన సఖులు ‘రంభ ముందు మునుల నిగ్రహమెంత?’ అని నవ్వుకుంటూ, వాళ్ళమానాన వాళ్ళను వదలి, కనుమరుగయ్యారు. ఇనుపకచ్చడాలుగట్టుకున్న మునికుమారులకు నిగ్రహం తప్పితే ఉగ్రరూపమేగదా! కొత్తగా రుచి మరిగితే శుచి తెలియదు. రంభాపరిష్వంగంలో క్రీడ పరాకాష్ఠలో ఉండగా రంభ తన్మయత్నంలో నలకూబరుని స్మరించింది. ‘నలకూబర!విడువిడురా! అలసితి’ అన్నది. అదివిన్న మణికంధరునికి సహజంగానే రోసం కలిగింది. రంభ తనతపసు భగ్నం చెయ్యటానికే వచ్చిందిగాని తనమీద ప్రేమతో రాలేదు. తానుగూడా ఆమెకోసం తపసు చెయ్యలేదు. తానే కావాలని వచ్చింది. తన్మయత్వంలో వేరొకరి పేరు ఉచ్చరించటమేమిటి? నలకూబరుడామెకు ప్రియుడేకావచ్చు. కాని ఇప్పుడతడు పరపురుషుడు. ఆమె మనసు అతనితోనే ఉన్నదా? తాననుభవిస్తున్నది మనసులేని శరీరాన్నేనా? ఆభావనకు రోసి ఆమెను వదిలి వెళ్ళాలని లేచాడు. ఒకసారి వెనుదిరిగి ఆమెను చూచాడు. ఆమె తన పొరపాటు గ్రహించింది. అలిఖిత నియమాలనుల్లంఘించింది. తత్కారణంగా తనకే అసంతృప్తి కలిగింది. ఆమెలోని నిర్వేదము, అసంతృప్తి, వ్యాకులత, మదనక్రీడ పరాకాష్ఠ దశలో ఆగిపోవటంవలన కలిగే ఆవేదన స్పష్టంగా కనిపించినవి. ఆమెకు తనివితీరలేదు. ఆస్థితిలో ఆమెను వదలి వెళ్ళటం క్రూరమనిపించింది. “అవ్వెలది రతులదనియమి తదాత్మరంజనదనర గలయవలయునని” నిర్ణయించుకున్నాడు. తనకోసం కాదు. ఆమె ఆత్మను రంజింపజెయ్యటం కోసం. తన తపశ్సక్తి ధారబోసి నలకూబరుని రూపం ధరించాడు. ఆమెకోర్కె తీర్చాడు. తానూ తృప్తిజెందాడు. కాని అవి తీరేకోరికలుకావు. ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. అదే వ్యసనం. ఇద్దరి పరిస్థితీ అదే. మణికంధరుడు పోయి తన ప్రియుడు నలకూబరుడే వచ్చాడని సంతోషించింది. ఇంకా ఆర్తితో సహకరించింది, ప్రేరేపించింది.

కాని నిజమైన నలకూబరుడు అప్పుడక్కడ లేడు. అతనికీవిధమైన వియోగం కొత్తకాదు. ప్రియురాలిని పరులకప్పగించి తాను గుటకలు మింగుతూ కూర్చోవటం అతనికి అలవాటే. అది రాచకార్యం. రంభ నేర్పరితనం మీద ఇంద్రునికి ఎక్కువ నమ్మకం. అందుకని ఎక్కువగా ఆమెనే తపోభంగానికి పంపుతుంటాడు. కాదనలేడు. ఆమెకున్న పలుకుబడి, ప్రాచుర్యము అటువంటివి. నిజానికి అందుకు గర్వించాలి. నలకూబరునితో అటువంటి అవసరం రాదు. ఎందుకనో స్త్రీలు ఎక్కువగా తపసు చెయ్యరు. చేసినా అది ఇంద్రాసనంకోసం కాదు. అందువలన ఇంద్రుడు తపోభంగ ప్రయత్నం చెయ్యడు. అందువలన నలకూబరునికి గాని, ఇతర గంధర్వులకుగాని అంత పలుకుబడి లేదు. మరి నారదుడన్నట్లు వారిద్దరూ నిత్యమూ రతిక్రీడా పరాయణులు.

ఎవరో ఒకరితో రంభకా కోరిక తీరుతుంది. కాని నలకూబరునికా అవకాశం లేదు. రంభ రాచకార్యంలో ఉన్నప్పుడు అతడు ఒంటరిగా ఆమె తిరిగి వచ్చేవరకు ఎదురు చూపులు చూస్తూ కూర్చోవలసిందే! ఆమె ఉన్న చోటికిగూడా వెళ్ళలేడు. తాను కనపడితే రంభ రాచకార్యం సరిగా నిర్వహించలేకపోవచ్చు. అందుకు ఇంద్రుడు కోపగించవచ్చు. రంభను తననుంచి వేరుచేస్తే తాను బ్రతకగలడా? అప్సరసలున్నా వారెవరూ రంభకు సాటిరారుగదా! పురుషులలో తాను, స్త్రీలలో రంభ – వారిద్దరి బంధమే అపురూపం, అపూర్వం. తన కార్యం ముగించుకుని రంభ తనకోసం వస్తుంది. కాని ఇప్పుడు మణికంధరుడు నలకూబరుని రూపంలోనే ఆమెదగ్గర ఉన్నాడు. అందువలన ఆమెకు అతనిని విడిచి వెళ్ళాలనే ధ్యాస లేదు. ఆసమయంలో వినిపించింది ఒక స్త్రీ ఆర్తనాదం. అది వినగానే మణికంధరుడు రంభను విడిచి ఆమెను రక్షించటం కోసం పరుగుతీశాడు. ఆమె ఎవరనేది చూడలేదు. నేరస్తుడిని పట్టుకోవటానికి ప్రయత్నించాడు. వెంబడించి పట్టుకున్నాడు. అతనిని తిరిగి తీసుకు వచ్చేసరికి ఆమె ‘బ్రతుకు జీవుడా’ అనుకుంటూ పారిపోయి ఉండవచ్చునని సరిపుచ్చుకున్నాడు. నేరస్తుడిని శిక్షించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ‘రంభ యేతెంచె మిగుల సంరంభమమర’. వచ్చీ రావటంతోనే “ఏమిటీ తొందర? చేతిలో ఆయుధమేమీ లేకుండా రావటమేనా?…ఇంతకూ ఆమె ను రక్షించారుగదా! ఇక వీడితో పనేమిటి? పద పోదాం” అని పొదరింటికి దారితీసింది.

అంతా సద్దు మణగిన తరువాత ‘రంభ వేరొకతె డాయన్ వచ్చె చిత్రంబుగన్’. వచ్చి నలకూబరునికోసం వెదికింది. ఇద్దరు రంభలను చూచి నలకూబరుడు తబ్బిబ్బయ్యాడు. ఎవరు నిజమో, ఎవరు మాయయో తెలుసుకునే విధం తెలియదు. ఎంత వెదకినా ఇద్దరిలో ఏభేదమూ కనపడ లేదు. ఇద్దరూ రెండో వారిని మాయలాడి అంటున్నారు. మొదటి రంభ అతనిని గట్టిగా కౌగలించుకుని వదలకుండా ఉన్నది. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. నలకూబరుడు చేసేదిలేక చూస్తూ ఉన్నాడు. తాను నిజమైన నలకూబరుని కాదన్న భయం ఒక ప్రక్క ఉండి ఉండవచ్చు. స్త్రీ ఆక్రందనం విన్నతరువాత అతనితోపాటు తాను గూడా రావాలని బయలుదేరింది రెండవ రంభ. కాని ఒక అపశకునం కారణంగా ఆగిపోయింది. ఇంతలోనే ఈఉపద్రవం వచ్చి పడింది. అని వాపోతున్నది. అందుకు మొదటి రంభ ‘ఈ మాయలాడి మన చర్యలన్నీ గమనించింది. ఈ విద్యలెక్కడ నేర్చిందో’నని నలకూబరుని మనసుని ఆకట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నది.

రెండవరంభకు తానే నిజమైన దాననని తెలుసు. కాని నలకూబరునికి చూపించటానికి తనదగ్గర ఏ ఋజువూలేదు. మాయారంభను తిట్టటం తప్ప ఏమీ చెయ్యలేక పోతున్నది. ఇంతలో వచ్చాడు నారదుడు, కలహభోజనుడు. నలకూబరునికీ రెండవ రంభకూ ఆశ కలిగింది – అతనికి నిజం తెలిసి ఉంటుందనీ, తగవు తీరుస్తాడనీ. కాని అతగాడు, తగవు తీర్చటం అటుంచి తమాషా చూసి ఆనందిస్తున్నాడు. “రంభ గర్వం అణచటానికి ఇంకొక రంభను సృజించావా?” అని నలకూబరుని రెట్టించాడు. “నలకూబరునితో అనుభవించటానికి నీవు చాలక ఇంకొక రూపాన్ని సృష్టించావా?” అని రంభను ఆట పట్టించాడు. ‘ఇద్దరిలో నిజమెవరో చెప్పమని” నలకూబరుడడిగితే “నువ్వు మాత్రం నిజమా?” అని ప్రశ్నించాడు. “మీమాట వలననే ఇదంతా జరుగుతున్నది” అని ఇద్దరు రంభలూ అన్నారు. అందుకాతడు నవ్వుకున్నాడుగాని ఔననీ, కాదనీ అనలేదు. నిజరూపమెవరో, ప్రతిరూపమెవరో అతనికి తెలుసు. కాని ఎవరినీ బయట పెట్టకుండా తనదారిని వెళ్ళి పోయాడు.

ఇంతలో రెండవ రంభ మెదడులో ఒక మెరుపు మెరిసింది. ఇక్కడ తనకు తెలిసినవారెవరూ లేరు. అందువలన తానెవరో ఋజువు చేసుకోలేక పోతున్నది. అదే ఇంద్రసభ ఐతే అంతా తననెరిగినవారే! ‘దీని అంతు తెలుస్తుంది’ అను కున్నది. అప్పుడు వారితో “ఈవిషయం ఇక్కడకాదు. ఇంద్రసభకు రండి. అక్కడ అందరి సమక్షంలో నిజం తేలుతుంది. రంభ ఎవరో, మాయలాడి ఎవరో తెలుస్తుంది” అని సవాలు చేసింది. మొదటి రంభకు భయం వేసింది. తన రహస్యం బయటపడి పోతున్నది. తాను మాయారంభనన్న విషయం తెలిసిపోతుంది. ఇంద్రసభకు వెళ్ళాలంటే గగనమార్గం గుండా వెళ్ళాలి. తనకా శక్తి లేదు. మణికంధరునికి ఆశక్తి ఉన్నది. అతడు గంధర్వుడు. ఆమెకు వెంటనే ఒక ఉపాయం తోచింది. తాను రానని నిష్కర్షగా చెప్పింది. “ఇన్నాళ్ళూ తనకు సాటిలేదనిపించుకుని, అందరి మన్ననలూ పొందిన దానను. ఇప్పుడు నన్నుబోలిన స్త్రీ ఇంకొకతె ఉన్నదంటే నాకెంత అవమానము? అందరిలో తలెత్తుకోలేను. అందువలన ఇక ముందెప్పుడూగూడా భూలోకం విడిచి ఇంద్రసభకు రాను.” అని చెప్పింది. నిజమైన రంభకు గూడా ఇది అనుకోకుండా దొరికిన ఆధారమే! ఆమె వెంటనే “ఈమెకు గగన విహారం చెయ్యగల శక్తి లేదు. అందుకే భూలోకం విడిచి రానంటున్నది. ఈమె కేవలం మానవకాంత. మాయలాడి.” అని నలకూబరునికి చెప్పింది. అతడు కాదనలేక పోయాడు. మొదటి రంభను విడిచి రెండవ రంభను కౌగిలించాడు. నిజమైన రంభకు నిజంగానే కోపం వచ్చింది. ‘హేతిఘాత నిమిత్తంబు చేతనే’ మరణింతువని ఆమెను శపించింది. మణిస్తంభుడు ఆమెపైకి ఎత్తిన కత్తికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది ఎవరిమీదకు ఎత్తినా వారిని వధింపక మానదు. రంభశాపం ఆవిధంగా సంభవమయింది. తనరహస్యం బయటపడిపోయేసరికి కలభాషిణి అక్కడినుంచి పారిపోయింది.

రంభల తగవు తీర్చకుండా వెళ్ళిన నారదునికి ఇంకా కడుపు నిండలేదు. ఆ ఆకలి తీరాలంటే ఇంకొక తగవు కావాలి. రంభకోసం ఎదురు చూస్తూ చెట్టుక్రింద కూర్చుని ఉన్న నలకూబరుని వద్దకు పోయి “ఇంకా ఇక్కడేం చేస్తున్నావయ్యా! ఎవడో నీరూపంలో వచ్చి నీరంభనేలుకుంటున్నాడు…పో!” అని అతనిని ప్రేరేపించాడు. నలకూబరునికి అనుమానం వచ్చింది. ఆమె మణికంధరునితో ఉన్నదని అనుకుంటున్నాడు. అతడైతే తనరూపంలో ఉండవలసిన అవసరం లేదు. కాని ఎవరో తనరూపంలో ఉన్నారంటే అది మణికంధరుడు కాడు. వేరెవరో రంభను మోసం చేస్తున్నాడన్నమాట! నలకూబరుడు భరించలేకపోయాడు. ఇంద్రుని ఆజ్ఞను ఉల్లంఘించలేక రంభను మణికంధరుని వద్దకు పోనిచ్చాడు. ఇతరులెవరైనా ఐతే ఎలా సహిస్తాడు? రంభను వెదుక్కుంటూ వచ్చాడు. రాగానే “ఎవడురా నారంభను చేరినవాడు?” అని తనరూపంలో ఉన్న మణికంధరుని మీదకు దూకాడు. రంభకు ఇది మరీ ఆశ్చర్యంగా ఉన్నది.

ఇంతవరకు తనరూపంలో ఒక స్త్రీ తనప్రియుని దొంగిలించాలని చూచింది. ఇప్పుడితడెవడో తన ప్రియుని రూపంలో వచ్చి తనను మోసగించాలని చూస్తున్నాడు. ఎవరో తనపైన పగబట్టారు. లేకపోతే ఈవింతలేమిటి? అని భయపడుతున్నది. వచ్చినవాడు తనప్రియుని పైన లంఘించి బలప్రదర్శన చేస్తున్నాడు. “అయ్యో, నాప్రియుని రక్షించండి” అని ఎలుగెత్తి రోదించింది. వచ్చినవాడు తానే నిజమైన నలకూబరుడనని, ఆమె నిజం తెలుసుకుని ఇతనిని విడిచి తనతో రావాలని చెపుతున్నాడు. నిజమేమిటో తెలియటానికి మల్లయుద్ధం చేసి చూపుతానంటున్నాడు. ఆమె మాట వినకుండా మొదటి నలకూబరునితో తలపడి మల్లయుద్ధం చేస్తున్నారిద్దరూ. ఎవరూ తక్కువ వారుకాదు. ఆమెకేమి చెయ్యటానికీ పాలుపోలేదు. చివరికి వారి పోరాటాన్ని ఆపి తనప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరింది. దానికి సరయిన సమాధానం చెప్పిన వారినే నిజమైన నలకూబరునిగా అంగీకరిస్తానని చెప్పింది. అందుకు ఇద్దరూ అంగీకరించారు. ఒక్కొక్కరినీ వేరుగా పిలిచి తమ మధ్య కళాపూర్ణుని వృత్తాంతం ఎప్పుడు వచ్చినదనీ, అప్పటి సంభాషణ ఏమిటనీ అడిగింది. అందుకు రెండవ నలకూబరుడు సరయిన సమాధానం చెప్పాడు. అతడే నిజమైన నలకూబరుడని రంభకు తెలిసి వచ్చింది. మొదటివానిని విడిచి రెండవ నలకూబరుని చేరింది. మొదటివాడు మాయానలకూబరుడని తెలిసింది. కాని అతడే మణికంధరుడని వారికి తెలియదు. తన సమస్య తీరినందుకు రంభ సంతోషించింది. “వాడితో మనకేమి పని? పోదాంపద” అని తన నలకూబరుని తొందర చేసింది. కాని నలకూబరుని కసి తీరలేదు. ఏమీతోచక ‘అచిరకాలంలోనే చస్తావు’ అని శపించాడు. రంభతో కలసి వెళ్ళిపోయాడు.

మాయారంభరూపంలో ఉన్న కలభాషిణిని రంభ శపించింది. మాయానలకూబరుని రూపంలో ఉన్న మణికంధరుని నలకూబరుడు శపించాడు. ఆశాపాలు రెండూ కథకు అవసరం.అందుకోసమే సూరన వారిద్దరినీ ఈకావ్యంలోకి తీసుకు వచ్చాడు. ఆపని ఐపోయింది. తరువాత వారికి కావ్యంలో చోటులేదు. నిజానికి నారదుని పాత్రకూడా అంతవరకే! కలభాషిణి సరస్వతి శాపకారణంగా వేశ్యగా జనించింది. ఆ శాపోపశమనం కోసం బ్రహ్మయిచ్చిన వరం కారణంగా ఆమె మరుజన్మలో మధురలాలసగా అవతరించవలసి ఉన్నది. పతివ్రతగా తరించవలసి ఉన్నది. అందుకు కళాపూర్ణునికి భార్యగా స్థానం సంపాదించుకోవాలి. ఆమె మధురలాలసగా జన్మించేసరికి కళాపూర్ణుడు అవతరించి ఉండాలి. మణికంధరుడే కళాపూర్ణుడుగా జన్మించాలి. కాని మణికంధరుడు శాపగ్రస్తుడు కావటం వలన జన్మించలేదు.

నలకూబరుని శాపకారణంగా మరణించి, వేరొక వరం కారణంగా కళాపూర్ణుడుగా జన్మిస్తాడు. ఈరెండుజన్మలను సమన్వయపరచటానికి కలభాషిణికి, మణికంధరునికి శాపాలు అవసరమయ్యాయి. కథకు ఆ అవసరాలను నారదుడు, రంభ, నలకూబరుడు తీర్చారు. అందువలన ఈమూడుపాత్రలూ కావ్యంలో తరువాత కనిపించవు. ఆశాపాలు సంభవించటానికి అవసరమైన సంఘటనలు సృష్టించటంలో సూరన చూపిన కథాకథన పాండితి అద్భుతం. రంభానలకూబరులకు తగినట్టుగా మాయాపాత్రలను సృష్టించి, వారిమధ్య చిత్రమైన సంబంధాలను కల్పించి, ఔచిత్యం చెడకుండా, రసాభాస కాకుండా ఒక రమణీయచిత్రాన్ని చూపించాడు. అద్భుతమైన దృశ్యాన్ని చూపించాడు. ఒకసారి హాస్యం తొణికిసలాడుతుంది. ఒకసారి శృంగారభావం చిప్పిలుతుంది. చివరికి కలభాషిణి, మణికంధరులు శాపగ్రస్తులయిన తరువాత కరుణ కలుగుతుంది. ఒక్క దృశ్యంలో వివిధరసానుభూతులను కలిగించటమేగాక తన కవితాపటిమను గూడా అనితరసాధ్యంగా ప్రదర్శించాడు. రంభామాయారంభల తగవును స్త్రీసహజమైన నిందలతోను, నలకూబరుడు మాయానలకూబరుల తగవును పురుషసహజమైన బాహాబాహి సంఘటనలతోను దిద్ది సహజత్వం చూపించాడు. అందుకే ఆదృశ్యం తెలుగు సాహిత్యంలో ఒక మణిపూస. అతడొక మహాకవి. అతనికతడేసాటి.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

కళాపూర్ణోదయం – 7: కళాపూర్ణుడు – మధురలాలస

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* బ్రహ్మ చెప్పిన కథ ప్రకారం కళాపూర్ణుడే కథానాయకుడు. కళాపూ...
by అతిథి
0

 
 

కళాపూర్ణోదయం – 6 : అభినవకౌముది – శల్యాసురుడు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* మహిషాసురుని మేనమామకొడుకు శల్యాసురుడు. అతనికి ఒంటినిండా ...
by అతిథి
0

 
 

కళాపూర్ణోదయం – 5 : సుముఖాసత్తి – మణిస్తంభుడు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* వయస్తంభన ప్రభావం కలమణిని పొంది నిత్యయవ్వనుడుగా ఉన్న కార...
by అతిథి
0

 

 

కళాపూర్ణోదయం – 4 : సుగాత్రీశాలీనులు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* కాశ్మీరంలోని శారదాపీఠము సకలకళాప్రపూర్ణము. ఋగ్వేదఘోషలత...
by అతిథి
0

 
 

కళాపూర్ణోదయం – 2: మణికంధరుడు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ****** మణికంధరుడు గంధర్వుడు. కాని ఇతర గంధర్వులవలే విషయలోలుడుగాడ...
by అతిథి
0

 
 

కళాపూర్ణోదయంలో శృంగారభావ వైవిధ్యం: 1-కలభాషిణి

వ్యాసకర్త:జాస్తి జవహర్లాల్ (కళాపూర్ణోదయం సంక్షిప్త రూపంలో, సులభ వచనంలో కె.వి.ఎస్.రామ...
by అతిథి
0