పుస్తకం
All about booksపుస్తకాలు

October 9, 2014

కళాపూర్ణోదయం – 2: మణికంధరుడు

More articles by »
Written by: అతిథి
Tags: , ,

వ్యాసకర్త: జాస్తి జవహర్
******
మణికంధరుడు గంధర్వుడు. కాని ఇతర గంధర్వులవలే విషయలోలుడుగాడు. సున్నితమనస్కుడు. పరోపకారబుద్ధిగలవాడు. కళాతపస్వి. అనంతదేవవ్రతోద్యాపనకోసం అనంతపద్మనాభుని ఆలయాన్ని దర్శించాడు. అక్కడ కవులు పండితులు అనంతపద్మనాభుని వివిధరీతుల కీర్తించటం చూచాడు. అదొక మహాభాగ్యంగా భావించాడు. అటువంటి కవితాశక్తి తనకుగుడా ఉంటే దేవుని కీర్తించి తానుగూడా తరించేవాడినిగదా! అని చింతించాడు. మృగేంద్రవాహన అనుగ్రహంతో అటువంటి కవితాశక్తిని పొందవచ్చునని తెలిసి అక్కడికి ప్రయాణమయ్యాడు. ఆ ఆలయంలోని శిలాశాసనాలను తిలకించి, ఆ నియమప్రకారం అక్కడ ఉన్న కత్తితో తననాలుకను కోసుకుని సారస్వత ప్రౌఢిని పొందాడు. అనంతపద్మనాభుని ఆలయానికి తిరిగి వచ్చి తన కవితాశక్తితో అక్కడ ఉన్న కవిపండితుల నందరినీ ఆశ్చర్యపరిచాడు. వారితో చేరి వినయవిధేయతలతో భగవంతుని కీర్తించాడు. వారి మన్ననలు పొందాడు. ‘ఈవిధంగా ఏకాగ్రతతో భగవంతుని కీర్తించటం వల్ల అతని కృప తప్పక కలుగుతుందని’ వారి ఆశీర్వాదం పొందాడు.

కాని అంతటితో తృప్తి పడలేదు. కాశీలో శారదాపీఠంలోని కవిపండితుల ప్రశంస పొందటమే తన ప్రతిభకు తార్కాణంగా ఎంచుకున్నాడు. అతడు శారదాపీఠం చేరేసరికి అక్కడ వేదఘోషలతోను, సామగానాలతోను, ధర్మశాస్త్ర చర్చలతోను, మీమాంసప్రసంగాలతోను ప్రతిధ్వనిస్తున్నది. ఒక మండపం మీద బ్రహ్మవర్చస్సుతో కూర్చుని బ్రహ్మచారులకు బోధిస్తున్న ఒక ఆచార్యుని గుర్తించాడు. అతనిని చేరి తన కోరిక విన్నవించాడు. ఇంతలో అతని శిష్యుడొకడు పరుగున వచ్చి సుగాత్రీశాలీనులు శతతాళదఘ్న హ్రదములో బడిన వార్త దెలిపె. అందుకా ఆచార్యుడు చింతించుచు సుగాత్రీశాలీనుల విషాదగాథ వినిపించాడు. అది విన్న తరువాత తన పాండిత్యప్రదర్శనకది సమయముగాదని గ్రహించి మణికంధరుడు తిరిగి వచ్చి సంగీతసాధన కోసం నారదునిదగ్గర శిష్యుడుగా చేరాడు.

సంగీత విద్యలో తుంబురుని జయించాలన్న పట్టుదలతో నారదుడు శ్రీకృష్ణునాశ్రయించాడు. అతని భార్యలదగ్గర సంగీతం నేర్చుకోవటానికి నిత్యమూ ద్వారకకు వస్తున్నాడు. అతనితో పాటు శిష్యుడు మణికంధరుడు గూడా వీణ మోసుకుని రోజూ అతని వెంటనే వస్తూ ఉంటాడు. కాని అతనికి అంతఃపురప్రవేశం లేదు. అందువలన ద్వారం దగ్గర వీణను గురువునకిచ్చి అక్కడే బయట నిలబడి ఉంటాడు రోజూ. అప్పుడు కలభాషిణి అనేవేశ్యగూడా నిత్యమూ కృష్ణుని సభకు వస్తూ ఉండేది. ఒకనాడు మణికంధరుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఆశువుగా దండకం చదివాడు.  అందుకు కృష్ణుడు సంతోషించి అతనికి ఒక మణిహారం బహూకరించాడు. అప్పుడక్కడే ఉన్న కలభాషిణి ఏకసంథాగ్రాహి కావటంవలన ఆ దండకాన్ని తరువాత తిరిగి వినిపించింది. అందుకు నారదుడు ఎంతగానో సంతోషించాడు. ఆమె మణికంధరుని కవిత్వాన్ని ఎంతగానో శ్లాఘించింది. ఉత్తమకవితా లక్షణాలను వివరించింది. అటువంటి ప్రజ్ఞ కలవారికి బహుమానాలు, గౌరవము దక్కటంలో ఆశ్చర్యం లేదన్నది.

ఆవిధంగా రోజూ చేస్తున్న గగనయానంలో ఒకనాడు ద్వారకను సమీపిస్తున్నప్పుడు క్రింద పూదోటలో చెలికత్తెలతో తీగటుయ్యాలలూగుతున్న కలభాషిణిని చూచి మణికంధరుడు ముగ్ధుడై, నారదునితో-
మ. తమిబూదీగెల తూగుటుయ్యెలల పంతాలాడుచుందూగునా
కొమరుంబ్రాయపు గబ్బిగుబ్బెతల యంఘ్రుల్ చక్కగా జాగి మిం
టిమొగంబై చనుదెంచు ఠీవిగనుగొంటే దివ్యమునీంద్ర నా
కమృగీనేత్రలమీద కయ్యమునకున్ కాల్చాచులాగొప్పెడిన్.
అతని గురువైన నారదుడుగూడా అదే ఉద్దేశాన్ని బలపరిచాడు.
మ. బళిరా సత్కవివౌదు నిక్కమ తగన్ భావించి నీవన్న యా
యెలబ్రాయంపు మిటారికత్తెల బెడంగేనెందునుంగాన, వా
రల డోలాచలనోచ్చరణముల్ త్రైవిష్టపస్త్రీల యౌ
దల దన్నం జనునట్లు మించెననినందప్పేమి? యొప్పేయగున్
అని సమర్థించాడు. అది గురుశిష్యుల మధ్య జరిగిన సంభాషణ. కాని అదేసమయంలో నలకూబరునితోపాటు విమానంలో పోతున్న రంభ విన్నది. ఇద్దరినీ తమ విమానంలోనికి ఆహ్వానించింది. నారదుడు వారిని ‘పరస్పర ప్రేమతో భాసిల్లండని’ దీవించాడు. అందుకు రంభ నిష్ఠూరంగా నలకూబరుని చూపి ‘ఇకపై ఇతడు నరభామల అందాలకు లొంగకుండా ఉంటాడా?’ అన్నది. నారదునికి ఆమె అంతరంగం అర్థమయింది. “ఏమిటో మళ్ళీ చెప్పు” అన్నాడు. అందుకామె “క్రింద పూదోటలో విహరిస్తున్న స్త్రీలగురించి తమరు తమ శిష్యునితో ఏమన్నారు?” అని అడుగుతుంది. అందుకు నారదుడు తానన్న మాటలు తిరిగి వినిపించాడు. ‘ఇందులో ఏమైనా పొరపాటున్నదా?’ అనిగూడా అడిగాడు. అందుకు రంభ “తమబోటిపెద్దలు ఏమైనా అనవచ్చు. కాని అతిశయోక్తికన్న మాటలుగాకపోతే మమ్ముమించిన అందగత్తెలుంటారా? అందుకీ కుబేరనందనుడే సాక్షిగదా” అంటుంది.

అందుకు నారదుడు “నీప్రియుని ప్రేమ చెదరకుండా ఉన్నదిగనుక నీవేమైనా అనవచ్చు. కాని రోజులు ఎప్పుడూ ఒకేలాగుండవుగదా! నీవంటివనిత, అతనివంటి యువకుడు ఎప్పుడైనా తారసపడవచ్చు. చెప్పలేము గదా!” అన్నాడు. అందులోని భావం రంభ వెంటనే గ్రహించింది. నారదునిమాట పొల్లుబోదని తెలుసు. అందుకు క్షమాపణకోరి వారిని ఉద్యానవనంలో దించి వెళ్ళిపోయింది. ఇదంతా మణికంధరుని సమక్షంలోనే జరిగింది. తాను కల్పించుకోవలసిన సందర్భంగాని, అవసరంగాని లేకపోవటంతో ముభావంగానే ఉన్నాడు.
గురుశిష్యులిద్దరూ విమానం దిగినతరువాత కలభాషిణి వారిని కలిసి రంభానలకూబరుల విశేషాలడిగింది. అన్నిటికీ నారదుడు సమాధానం చెప్పాడు. మణికంధరుడు పూదోటను తిలకిస్తూ కొంతదూరంలో ఉండగా కలభాషిణి రంభానలకూబరుల చర్చలో వచ్చిన కళాపూర్ణుని విషయం అడిగింది. అందుకు నారదుడు ఆకథ తానుగూడా చెప్పలేనని వివరించాడు. ఆవిషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు మణికంధరుడు అక్కడ లేకపోవటంతో ఆ చర్చ విషయం అతనికి తెలియదు. కాని తరువాత కలభాషిణి తన పూర్వ పరిచయంతో నారదుని శిష్యరికం కోరింది. అతడు సరేనన్నాడు. అంతఃపురంలో నారదును వీణను మోసే అవకాశం ఆమెకు దక్కింది. అందువలన నారదుడు సంగీతం నేర్చుకునేటప్పుడు దగ్గరే ఉండే అవకాశం ఆమెకు దక్కింది. తద్వారా ఆమెకూడా సంగీతవిద్వాంసురాలయింది.

నారదుని వీణను మణికంధరుడు అంతఃపుర ద్వారం వరకు తీసుకురావటము, అక్కడ కలభాషిణికి అందించటము నిత్యకృత్యమయింది. అదే వారిపరిచయం. ఇద్దరూ ఒకేగురువు శిష్యులు. అదే వారి స్నేహానికి ఆలంబనం. నారదుని శిక్షణ పూర్తయ్యేసరికి కలభాషిణికి గూడా సంగీతజ్ఞానం అబ్బింది. కృష్ణుని వరం కారణంగా మణికంధరునికి గూడా సంగీతజ్ఞానం కలిగింది. అందుకు నారదుడు “నేనెంతో కష్టపడి నేర్చుకున్న సంగీతసారం మీయిద్దరికీ కృష్ణుని కృపవలన శ్రమలేకుండా దొరికింది. సంతోషం” అన్నాడు. అందుకు మణికంధరుడు “తమసేవాభాగ్యం వలన ఇది వీలయింది. ఇక వైకుంఠంలో విష్ణుమూర్తిని కొలిచే భాగ్యం ఎప్పటికి కలుగుతుందో” నని కోరిక వెలిబుచ్చాడు. అందుకు నారదుడు సంతసించి అతనికి మనుధర్మం బోధించాడు. విష్ణుపదం చేరటానికి మార్గాలు సూచించాడు. ఫలాపేక్షలేకుండా సత్కర్మలు చెయ్యాలన్నాడు. విష్ణుక్షేత్రాలు దర్శించాలన్నాడు. కృష్ణానుగ్రహం వలన కలిగిన ఈసంగీతవిద్యను వృధాచేయక, పురుషోత్తముని దివ్యనామసంకీర్తనం చెయ్యమన్నాడు.

గురుబోధన ననుసరించి మణికంధరుడు తీర్థయాత్రలు చేశాడు. పుణ్యనదులలో స్నానాలు చేశాడు. చివరికి ఒక వనంలో తపసుకుపక్రమించాడు. పద్మాసనం వేసుకుని సమాధిస్థితిలో కూర్చున్నాడు. గురూపదేశం ప్రకారం ఆతపసు విష్ణుమూర్తిని గురించే ఐఉండాలి. కాని ఎప్పుడెక్కడెవరు తపసు చేసినా ముందు భయపడేది ఇంద్రుడే! అందరికన్నా ఉన్నతుడతడేగదా! అందుకే అందరికన్నూ తనపైనే ఉంటుందని అతని భయం. అందుకోసం ఏతపసునైనా వీలయినంత త్వరగా భగ్నం చెయ్యటానికి ప్రయత్నిస్తాడు. ఆలస్యం చేస్తే తపశ్శక్తి పెరుగుతుంది. భగ్నం చెయ్యటం కష్టమవుతుంది. అందుకని వెంటనే రంభను పిలిపించి మణికంధరుని తపసు భగ్నం చెయ్యవలసిందిగా ఆజ్ఞాపించాడు. మణికంధరుడు నారదులవారి శిష్యుడన్నవిషయం రంభకు తెలుసు. అతని శిష్యుని తపసు భగ్నం చేస్తే నారదునికి ఎక్కడ కోపం వస్తుందోనని ఆమె భయం. అదీగాక మణికంధరుడు ఒక పట్టాన చలిస్తాడా? అనిగూడా ఆమె సందేహం. ఆసందేహమే వెలిబుచ్చింది. ఆమెకు ధైర్యం కలిగించటానికి రంభకున్న రూపలావణ్యాలు చాలవన్నట్లు ‘తొంటికంటె నవవయోరూపలావణ్య విలాసాలు’ వరంగా ఇచ్చి ఆమెను మణికంధరుని మీదికి ప్రోత్సహించి పంపాడు ఇంద్రుడు. అప్పుడు రంభ చెలికత్తెలతో మణికంధరుడు తపసు చేస్తున్న వనానికి బయలుదేరి వెళ్ళింది. అతడు సమాధిలో కూర్చున్న తీరు చూచి అబ్బురపడింది. అతనిని కదిలించటం కష్టమేనని గుర్తించింది. ఐనా తన ప్రయత్నం మొదలు పెట్టింది. మణికంధరుడెప్పుడూ మన్మధవికారాలను మనసులోనికి రానిచ్చిన వాడు కాదు. ఒక పట్టాన చలించలేదు. ఐనా రంభాప్రభావం ముందు యవ్వనపు బిగువులు కదలటం మొదలయింది. ధ్యానం చెడి కన్నులు తెరచుకున్నవి. వెంటనే తిరిగి అతి ప్రయత్నంతో “కృష్ణ కృష్ణ” అని కన్నులు మూసుకున్నాడు. ఐనా చివరికి మన్మథుడే గెలిచాడు. మణికంధరుడు ఓడిపోయాడు. రంభ కర్తవ్యం నెరవేరింది. వచ్చిన పని ఐపోయింది. ఇక తాను వెళ్ళిపోవచ్చునుగదా! కాని వెళ్ళదు. అది సాంప్రదాయం కాదు. న్యాయం కాదు. తపసు చెడగొట్టిన నేరానికి అతనికి ప్రతిఫలం ఇవ్వాలి.

అతని తపశ్శక్తిని నిర్వీర్యం చెయ్యాలి. అందుకోసం ఎదురుచూస్తూ అతనితో కాలం గడుపుతున్నది. ఆయిద్దరిలో ఎవరికీ తనివి తీరలేదు. ఐనా ఒకనాడు ఒక పొరపాటు జరిగింది. రతిక్రీడ పరాకాష్ఠలో ఉండగా రంభ ‘నలకూబర! విడువిడురా! అలసితి’ అన్నది. అంటే తాను రమిస్తున్నది నలకూబరునితోనేగాని మణికంధరునితో కాదని ఆమె మనసులో ఉన్నది. అది వినగానే మణికంధరునికి రోసం పొడుచుకొచ్చింది. ఆమె తనతో ఉన్నప్పుడు నలకూబరుడు పరపురుషుని క్రిందనే లెక్క. క్రీడాసమయంలో ఇతరులపేరెందుకు రావాలి? అది అవమానంగా భావించాడు మణికంధరుడు. ఆత్మాభిమానంగల వారెవరికైనా అలాగే అనిపించవచ్చు. నిజానికి రంభ తనమీద ప్రేమతో రాలేదు. ఇంద్రుని ఆజ్ఞప్రకారం అదొక బాధ్యతగా తనను ప్రేరేపించటానికే వచ్చింది. ఆవిషయం మణికంధరునికి తెలియకపోలేదు. కాని తనకుతానై వచ్చి ఈవిధంగా అవమానించటం సహించలేక పోయాడు. ఆమెనదే స్థితిలో వదలి వెళ్ళటానికి పైకి లేచాడు. వెనుదిరిగి చూచేసరికి రంభ అసహాయ స్థితిలో కనిపించింది. రతిక్రీడాభంగం వలన కలిగిన నిరాశ, విజృంభించిన కోర్కెల కోలాహలం, ఉవ్వెత్తున పొంగిన ఉద్వేగం ధాటికి ఆమె వికలమై పోతున్నది. రతిక్రీడాసక్తయైన రంభకు ఇది భరించరాని పరిస్థితి. దీనంగా అతనివంక చూస్తున్నది. ఆమెపైన జాలికలిగింది. ఆస్థితినుంచి బయటపడటంకోసమైనా ఆమెను తృప్తిపరచటం తన బాధ్యతగా భావించాడు.” అవ్వెలది రతుల దనియమి తదాత్మ రంజన దనర గలయవలయునని” నిర్ణయించి తన తపశ్శక్తిని ధారబోసి, నలకూబరుని రూపమెత్తి, ఆమెను కలిసి రంజింపజేశాడు. అందులో అతని కరుణాస్వభావం తెలుస్తున్నది.

నలకూబరుని పేరుచ్చరించగానే అతని అహం దెబ్బతిన్నది. ఆత్మాభిమానంతో పైకి లేచాడు. మనసు పరాయత్తమైన దేహాన్ని అనుభవించటం అతనికిష్టం లేదు. కాని ఆమె పరిస్థితి వేరు. అలవాటుప్రకారం నలకూబరుని పేరు పలికింది. రతిక్రీడలో నిమగ్నమయింది. అర్థాంతరంగా ఆగిపోవటంతో బాధపడింది. అది ఆమెకిదివరకు లేని అనుభవం. ఆబాధను తీర్చటానికే అతడు నలకూబరుని రూపంలో తిరిగి వచ్చి ఆమెను తృప్తిపరచాడు. అది తనకామం తీరక కాదు. రతులదనియించని ‘తదాత్మ రంజన’ కోసమే చేశాడు. అంటే ఆమెకోసం. నలకూబరుని రూపంలో రంభతో ఉన్నప్పుడు అతనికి స్త్రీ ఆక్రందన వినిపించింది. రంభాపరిష్వంగం విడిచి – విష్ణుమూర్తి గజరాజుకోసం వచ్చినట్లుగా – వచ్చాడు. అతనిని చూచి మణిస్తంభుడు ఆమెను వదిలి పారిపోయాడు. నలకూబర రూపంలో ఉన్న మణికంధరుడతనిని వెంబడించి, పట్టితెచ్చి, చూచేసరికి ఆమె అక్కడలేదు. “ఆమె ఎవరు? ఆమెనేంచేశావు?” అని మణిస్తంభుని అడుగుతుండగా అక్కడికి ‘రంభ ఏతెంచె మిగుల సంరంభమమర’. ముంగురులు దిద్దుకుంటూ, జుట్టుముడివేసుకుంటూ, పైట సరిచేసుకుంటూ అప్పుడే సయ్యాటనుంచి వస్తున్నట్లుగా వచ్చింది. మణికంధరుడు తిరిగి రంభవద్దకు వెళ్ళేలోపల రంభయే అతనిని వెదుక్కుంటూ వచ్చింది. ఆమె మాయారంభ. అదనుచూచి కలభాషిణి రంభరూపం ధరించి నలకూబరునికోసం వచ్చింది. అతడు మాయానలకూబరుడని ఆమెకు తెలియదు. మణిస్తంభునితో తగవు మానిపించి అతనిని తనతో తీసుకుని పొదరింటికి పోయింది.

అంతవరకు మణికంధరుని దృష్టిలో ఉన్నది ఒకటే రంభ. తనకోసం వచ్చినదే ఆమె. కాని అంతలో ఇంకొక రంభ వచ్చేసరికి అతనికి అయోమయమయింది. అసలెవరో, కొసరెవరో తెలియరాలేదు. ఇద్దరిలోను ఏవిధమైన భేదమూ కానరాలేదు. తానే నిజమైన రంభనని చెప్పటానికి ఇద్దరూ ఋజువులు చూపిస్తున్నారు. ఒకరితో ఒకరు పోరాడుకుంటున్నారు. నిందించుకుంటున్నారు. ఇద్దరూ తననే నిజమైన నలకూబరునిగా భావిస్తున్నారు. తనకోసమే తలపడుతున్నారు. తనవిషయం బయటపడితే ఏమవుతుందోననే భయమూ ఉన్నది. ఆనిజం తనకొక్కడికే తెలుసు. ఈతగవు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నాడు మణికంధరుడు. ఆసమయంలో వచ్చాడు కలహభోజనుడు. నిజం అతనికి తప్పక తెలిసి ఉంటుందనీ, ఈతగవు అతడే తీర్చగలడనీ ఆశించాడు. కాని అతగాడు తీర్పు చెప్పకపోగా ఎగతాళి చెయ్యటం మొదలు పెట్టాడు. అతని స్వభావమే అంత. రంభ గర్వం అణచటానికి ఇంకొక రంభను నీవే సృష్టించావా? లేక నీతో సుఖించటానికి తృప్తి చెందక రంభ తానే ఇంకొకతనువు దాల్చినదా? అని అడిగాడు. తగవు పెట్టటమేగాని తీర్చటం అతని పనికాదు. నిజం చెప్పమని అడిగితే నీవుమాత్రం నిజమా? అన్నాడు. అవునుమరి! వారిద్దరిలో నిజమైన రంభ ఎవరో అతనికి తెలిస్తే తాను మారు రూపంలో ఉన్న విషయం మాత్రం అతనికి తెలియకుండా ఉంటుందా? “నీకు సవతి కలుగుతుందేమోనని నన్ను భయపెట్టారు. ఇప్పుడదే నిజమయింది” అని వాపోయింది రెండవ రంభ. ఆమె నిజమైన రంభ. వెంటనే మొదటి రంభ “ఇదంతా మీవరం వల్లనే” అని నిష్ఠూరమాడింది. ఆమె మాయారంభ. ఆవిషయాలన్నీ అతనికి తెలుసు. కాని ఆమెను బరిలోనికి దించినవాడతడే! అందువలన ఆమెను రచ్చ చెయ్యటం అతనికి ఇష్టం లేదు. ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. తనను బయటపెట్టకుండా వెళ్ళిపోయినందుకు ఒక విధంగా మణికంధరుడుగూడా సంతోషించాడు.

రంభలిద్దరూ ఈవివాదం నారదుని కారణంగానే జరిగిందని చెపుతున్నారు. రంభకు సవతి రావచ్చునన్న మాట నారదుడు తనముందే అన్నాడు. అందువలన మణికంధరునికి అది నిజమని తెలుసు. కాని ఈరెండవ ఆమె ఎవరు? నారదుడు “రంభకు నీవే సవతివి కావచ్చు” అని కలభాషిణితో అన్నప్పుడు మణికంధరుడు అక్కడలేడు. అందువలన ఆమె కలభాషిణి కావచ్చునన్న గమనం అతనికి లేదు. శిక్షణ పూర్తి అయినతరువాత కలభాషిణితో నారదుడు “మున్ను నీవాత్మలో గోరినట్టి కాంతు, రంభామనోహరాకారుడైన వాని గూడి రమింపగలవు” అనటం తనముందరనే జరిగింది. కాని ఆరంభామనోహరాకారుడు తానే కావచ్చునన్న అనుమానం అతనికి కలగలేదు. కలిగే అవకాశంగూడా లేదు. కలభాషిణికైతే ఆవరం తనకు రంభామనోహరుని ఇస్తున్నదనుకున్నదేగాని, అతని ఆకారంలో ఉన్న ఎవరినో కూరుస్తున్న విషయం అసలు గమనంలోనే లేదు. కాని ఈ రంభలసంరంభంలో మణికంధరుడు గతవిషయాలను గుర్తు తెచ్చుకుని, విశ్లేషించి మాయారంభ కలభాషిణి కావచ్చునని తెలుసుకునే స్థితిలో లేడు. తనవిషయం ఎప్పుడు బయట పడుతుందోననే భయం గూడా కొంత కారణం. రంభ తననిజాయితీని ఋజువు చేసుకుని, మాయారంభను పోద్రోలినప్పుడు, మణికంధరుడు “ఓసి నీపేరెద్ది? ఎట్టిదానవు?” అని అడుగుతాడు.  అతడాప్రశ్న వెయ్యటం ద్వారా కలభాషిణిని అవమాన పరచాడనే విమర్శ ఉన్నది. కాని అతనికి ఆమె కలభాషిణి అన్నవిషయం తెలిసి ఉంటే ఆవిమర్శ సబబే అవుతుంది. అటువంటి అనుమానం అతనికి కలగనప్పుడు అతడు చేసినది తప్పు అనటానికి ఆస్కారం లేదు. నిజమైన రంభదగ్గర తన స్థితిని భద్రపరచుకోవటం కోసం చేసిన ప్రయత్నమే ఆప్రశ్న. “నేను కాసేపు కనుమరుగయ్యేసరికి ఇంకొకదానిని తెచ్చుకున్నావా? మగవారి ప్రేమలింతేగదా?” అని నిందవేసింది రంభ. “నీలాగా ఉంటే నీవేననుకున్నాను. కాదని తెలియగానే తోలివేశానుగదా? ఇంకా నిందలెందుకు?” అని సంజాయిషీ చెప్పుకున్నాడు నలకూబరుని రూపంలో ఉన్న మణికంధరుడు.

కాని వారిస్నేహం ఎక్కువసేపు నిలవలేదు. అటువెళ్ళిన నారదుడు రంభ రాకకోసం ఎదురు చూస్తున్న నలకూబరునితో “ఇంకా ఇక్కడే ఉన్నావా? నీరూపంలో ఇంకొకడెవరో వచ్చి నీభార్యతో ఉన్నాడు, పో” అని తోలాడు. రంభ ఇంద్రుని ఆజ్ఞప్రకారం మణికంధరునితో ఉన్నదనే అనుకుంటున్నాడుగాని, వేరెవరో తనరూపంలో వచ్చి ఆమెను మోసం చేస్తున్నాడనేసరికి అతనికి ఆగబుద్ధిగాలేదు. వెంటనే ఆమెను వెతుక్కుంటూ వచ్చి తగవు పెట్టుకున్నాడు. రంభతో తానే ఆమె భర్తనని చెప్పుకున్నాడు. మాయానలకూబరుని మీదికి ఉరికి గొంతు పట్టుకున్నాడు. “అయ్యో, నాభర్తనెవడో చంపేస్తున్నాడని” రంభ కేకలేసింది. “నిరాయుధుడిని చంపేటంత నికృష్టుడను గాను” అని అతడు తనఖడ్గం తెచ్చుకున్నా సరే! లేకపోతే మల్లయుద్ధమైనా సరే నని అతనిపైకి లంఘించాడు. ఇద్దరూ బాహాబాహి, ముష్టాముష్టి తలపడుతున్నారు ఎవరూ తీసిపోయిన వారుగాదు. వారిపోరు చూచిన రంభ ఒక ఉపాయం ఆలోచించింది. వారి పోరునాపించి తన ప్రశ్నకు సమాధానం చెప్పమన్నది. దానితో ఎవరు నిజమైన వాడో తేలుతుందని చెప్పింది దానికి ఇద్దరూ అంగీకరించారు. ఆమె ఒక్కొక్కరినీ వేరుగా పిలిచి తమ మధ్య కళాపూర్ణుని వృత్తాంతం ఎప్పుడు వచ్చినదీ చెప్పమని అడిగింది. దానికి రెండవ వాడు సమాధానం చెప్పాడుగాని మొదటివాడు చెప్పలేకపోయాడు. దానితో రంభ అతనిని మాయావిగా నిందించింది. నలకూబరుడతనిని ‘అల్పావశిష్టాయువుగమ్మని’ (అచిరకాలంలోనే చస్తావని) కసిదీరా శపించాడు. మొదట మాయారంభను తానడిగినట్లుగానే, ఇప్పుడు రంభ తనను అడిగింది “నీవెవ్వడవు? ఈరూపం నీకెలా వచ్చినది?” అని. అప్పుడు మాయారంభ తనను తొందర చేసినట్లుగానే ఇప్పుడు నలకూబరుడు రంభను తొందర చేసి “వీడెవడైతే మనకేమిటి? మనం పోదాం పద” అని లాక్కుపోయాడు. మణికంధరుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చి, నిజరూపం ధరించి , తన వీణను, మణిహారాన్ని తీసుకుని మృగేంద్రవాహనాలయానికి చేరాడు. ఆతరువాత అతడు వదిలి పెట్టిన కత్తిని తీసుకుని మణిస్తంభుడు గూడా అక్కడికి చేరాడు. కలభాషిణి అంతకుముందే అక్కడికి వచ్చి ఉన్నది. ఆమెను చూచి మణికంధరుడు ఆశ్చర్యంతోను, సంతోషంతోను “ఎలా వచ్చావు?” అని అడిగాడు. ఇద్దరూ తమ పూర్వపరిచయాలను స్మరించుకున్నారు. సిద్ధుడు తాను చూచిన వింతలను చెప్పిన తరువాత మాయారంభను తానేనని కలభాషిణి ఒప్పుకున్నది. కాని తాను నలకూబరుడనుకున్న వాడు మాయానలకూబరుడని తెలిసి తాను మోసపోయానని, తనశీలాన్ని ఎవరో అపరిచితునికి అర్పించినందుకు విచారిస్తున్నది. అందుకు మణికంధరుడు మాయానలకూబరుడు తానేనని వివరించాడు.

అప్పటివరకు అతనికి మాయారంభ కలభాషిణియేనని తెలియదు. రంభను, మాయారంభను ఇద్దరినీ అనుభవించినవాడతడొక్కడే! రంభతో తననిజరూపంతోను, తరువాత నలకూబరుని రూపంతోను శృంగారం నెరపాడు. రంభరూపంలో ఉన్న కలభాషిణిని తాను నలకూబరుని రూపంలో ఉండి అనుభవించాడు. అప్పుడామె కలభాషిణియని అతనికి తెలియదు. ఇద్దరూ నిజరూపాలు వదలి కోరుకున్న రూపాలను తెచ్చుకున్నారు. తనననుభవించినది ఎవరో అపరిచితుడనుకున్న వ్యక్తి, తనకు చిరపరిచితుడైన సహాధ్యాయియేనని తెలిసి కలభాషిణి సంతసించింది. మణికంధరుడు గూడా తనకు మొదటినుంచి కలభాషిణి పైన కోరిక ఉన్నదనీ, నారదుని భయంతో బయటపడకుండా ప్రేమను దాచుకున్నానని చెపుతాడు. ఇప్పుడీవిధంగా తనకోరిక తీరినందుకు సంతోషంగా ఉన్నదంటాడు.

కావ్యారంభంలో నారదునితో మణికంధరుడు ఉయ్యాలలూగుతున్న కలభాషిణిని, ఆమె చెలికత్తెలను చూచి వారి అందాన్ని పొగిడాడు. అందుకు నారదుడు ఏమీ అభ్యంతరం చెప్పకుండా అతని పొగడ్తను బలపరచాడు. ‘బళిరా!’ అన్నాడు. గురుశిష్యులమధ్య అటువంటి చనవు ఉన్న సందర్భంలో నారదుడంటే భయం కారణంగా మణికంధరుడు కలభాషిణి పట్ల తన ప్రేమను దాచుకున్నానని చెప్పటం ఎంతవరకు నమ్మవచ్చు? కలభాషిణితో క్రీడించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉన్నదని అనవచ్చు. కాని అంతకుముందునుంచీ ఆమె పైన తనకు కోరికగా ఉన్నదని అనవలసిన అవసరమేమిటి? నిజంగా ‘ఆ’ కోరిక ఉంటే అంత చనవు ఉన్న గురువు దగ్గర దాచవలసిన పనిలేదు. కలభాషిణికి మణికంధరునిపైన కోరిక ఉన్నదని చెప్పిన విమర్శకులు, ఆమె ఆకోర్కెను దాచుకుని, అచేతనస్థితికి అణచిపెట్టి, మనసును నలకూబరుని వైపుకు తిప్పుకున్నదని వివరించారు. కాని మణికంధరుడు దాచుకున్న తన కోరికను ఎటూ మరల్చుకున్నట్లు చెప్పలేదు. పైగా అతడు నారదునితో విష్ణుపదసేవ చేసే విధం చెప్పమని అడిగాడుగాని ఏవిధమైన ఐహిక సుఖాలూ కోరినట్లు చెప్పలేదు. మణికంధరుడు మొదటినుంచీ ఆధ్యాత్మిక దృష్టి కలవాడేగాని, శృంగారపరమైన ఆలోచనలు కలవాడు కాదు. కలభాషిణి వేశ్యగనుక ఆమెకు మణికంధరుని పైన కోరిక కలిగిందని ఆరోపించవచ్చు. కాని మణికంధరుని విషయంలో అటువంటి ఆరోపణకు అవకాశం లేదు. మాయారంభతో సంగమం తరువాత కలభాషిణితో ‘ఆమాయానలకూబరుడను నేనే…నాకుగూడా నీపైన ఉన్నకోరిక ఈవిధంగా తీరినందుకు సంతోషంగా ఉన్నది’ అంటాడు. అది కలభాషిణిని తృప్తి పరచటం కోసమేగాని నిజంగా అతనికి ఆమె పైన కోరిక ఉన్నట్లు కథలో ఎక్కడా సూచించలేదు.

రంభ చెలికత్తెలతోపాటు చేసిన శృంగారప్రదర్శనకు మణికంధరుడు చలించిన మాట నిజమే! నిగ్రహం చూపాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. లొంగిపోయాడు. ఒకసారి ఆ రసార్ణవంలో పడిన తరువాత బయట పడటం అంత తేలిక కాదు. మణిస్తంభుని పట్టి తెచ్చిన తరువాత తనకోసం వచ్చినది మాయారంభ అన్నవిషయం మణికంధరునికేగాదు. పాఠకునికి గూడా తెలియదు. నిజమైన రంభ వచ్చినతరువాతనే ఆరహస్యం బయట పడుతుంది. అందువలన ఆవిషయం మణికంధరునికి తెలిసే అవకాశం ఉన్నదని, తెలిసే ఉండాలని, ఐనా ఆమెతో పరుషంగా ప్రవర్తించాడని అతనిని నిందించటం సహేతుకం కాదు.

నిజానికి ఆ రభస ముగిసిన తరువాత తాను రంభకులోనై, తనతపసును విస్మరించినందుకుగూడా మణికంధరుడు చింతిస్తూ ఉండవచ్చు. “అమ్మాయారూపంబునకు సద్యఃఫలితంబుగా నట్టి శాపంబుదెచ్చుకొని యంతట బుద్ధిమంతుడనై, యచ్చటి పర్ణశాలకుజని, యెల్ల మాయలుంజాలించి, నా వీణయు రత్నమాలికయు బుచ్చుకొని” ఈమృగేంద్రవాహనాలయానికి వచ్చానని చెపుతాడు. కలభాషిణి కూడా మణికంధరుని వంటి సచ్చీలుని మరచి నలకూబరుని రూపానికి దాసురాలై, ఆశపడి ఇన్ని శ్రమలు తెచ్చుకున్నందుకు తనను తానే నిందించుకున్నది.

“శ్రీయుతమైన దివ్యమణి చేతికినబ్బగ బారవైచి త
చ్చాయ యొకింతయున్కిగని చాలగృశించితి గాజుపూసకై
నాయవివేకమేమందు…”
అని వాపోయింది. ఆమెను ఓదార్చటం కోసం మణికంధరుడు ఆమెకు నారదుడిచ్చిన వరాన్ని గుర్తుజేస్తాడు. ఆమెకు నిజంగానే తనపైన ప్రేమ ఉన్నదన్న విషయాన్ని తాను ఒప్పుకుంటున్నట్లు, అందుకు నారదుని వరమే సాక్షియని వివరిస్తాడు.

“కొమ్మ! నీవాత్మలో మును గోరినట్టి
కాంతు రంభామనోహరాకారుడగుచు
మెరయువాని గూడి రమింపగలవు”
అని చెప్పాడు నారదుడు అప్పుడు. అంటే ఆమె కలుసుకునేది నలకూబరుని కాదనీ, అతనిరూపంలో ఉన్న వేరువ్యక్తిననీ, ఆవ్యక్తి మున్ను ఆమె మనసులో ఉన్నవాడే అవుతాడనీ చెప్పి ఉన్నాడు నారదుడు. ఇప్పుడు ఆమె కలసినది మణికంధరునితో కావటం వలన ఆమె మనసులో ఉన్నవాడు మణికంధరుడే ననటంలో సందేహం లేదని ఆమెను ఓదార్చాడు మణికంధరుడు. ఆమెను ఓదార్చటంకోసం ఆవిధంగా చెప్పాడుగాని ఆమె మనసులో ఉన్నది తానుకాదని మణికంధరునికి తెలుసు. అందుకే తరువాత “రంభాసాన్నిత్యశోభితాభినవ విలాసభాసురుడైన నలకూబరుని రూపున హత్తినట్టి చిత్రమునకు తదన్యంబెట్టిది యైనను మరియింపుగామియు చిత్రముగాదు” అని చెపుతాడు. అంటే నలకూబరుని వంటివాని మీద మనసైన తరువాత ఇంకెవరూ నచ్చరని, అది సహజమేనని, ఇందులో ఆమె తప్పేమీలేదనీ ఆమెకు నచ్చజెపుతాడు.

అంటే కలభాషిణి “ఆత్మలోమునుగోరినట్టి కాంతుడు” నలకూబరుడేగాని మణికంధరుడనటానికి ఆస్కారం లేదు. ఆవిషయాన్ని మణికంధరుడు స్వయంగా ఒప్పుకున్నట్లే! కాని కలభాషిణి నిజంగా నలకూబరుని కలవటం నారదునికి ఇష్టంలేదు. అందుకే “రంభామనోహరాకారుడైనవాని” కలుస్తావని చెప్పాడుగాని, నలకూబరుని కలుస్తావని ఆమెతో చెప్పలేదు. మోహావేశంలో ఉండటం వలన కలభాషిణి ఆ మెలికను గమనించకుండా, తనకు నలకూబరునితో కలిసేటట్లుగా నారదుడు వరమిచ్చాడని సంతోషించింది. తరువాత జరిగిన కలభాషిణీమణికంధరుల కలయికను సమర్థించటంకోసం నారదుని ఆశీర్వాదాన్ని ఆధారంగా చూపటం జరిగింది. కాని నారదును వచనాన్ని విశ్లేషిస్తే అటువంటి ఆధారమేమీ కనపడదు.  కలభాషిణిమణికంధరుల మధ్య ప్రేమభావం ఉన్నట్లుగాని, దానిని నారదుడు అంగీకరించాడనటానికి గానీ కావ్యంలో ఎక్కడా ఆధారంలేదు. కలభాషిణి ‘ఆత్మలో మునుగోరినట్టి కాంతుడు’ నలకూబరుడే. అతని ఆకారంలో ఉన్నవానిని ‘కూడిరమింపగలవు’ అని నారదుని వరం. ఆ ఆకారుడెవరైనా కావచ్చు. అది మణికంధరుని ద్వారా ఫలించింది.
పురుషులలో గూడా ఇటువంటి వింతలుగలవని, అందుకు నిదర్శనంగా సుగాత్రీశాలీనుల కథ చెపుతాడు మణికంధరుడు. ఇదంతా ఆమెను ఓదార్చటానికి అతడెంత తాపత్రయపడ్డాడో సూచిస్తుంది. కాని ఆకథ ఒక్కొక్కరికి ఒక్కొక్కపరిస్థితులలో మోహావేశం కలుగుతుందని చెప్పటానికి పనికి వస్తుందిగాని, ఒకరిపైన ఉన్న మోహాన్ని ఇంకొకరిపైకి మళ్ళించుకోవటానికి ఉదాహరణగా పనికి రాదు. కాని ఈకథను కలభాషిణి తనకు మణికంధరునిపైన ఉన్నప్రేమను నలకూబరునిపైకి మలచుకోవటానికి ఉదాహరణగా సూచించబడింది. అది సమంజసంగా కనిపించదు.

అప్పుడిక కలభాషిణికి తన శాపం గుర్తుకు వస్తుంది. శాపకారణంగా తాను కత్తివేటుతో చావవలసి ఉన్నది. మణిస్తంభుని కత్తి ప్రభావంగూడా తన మరణానికి కారణం కాకతప్పదు. అందువలన ఆకత్తితో తనను వధించి, శాపవిమోచనం కలిగించి మణిస్తంభుడు రాజ్యాధికారం పొందవచ్చునని చెపుతుంది. కాని అందుకు మణిస్తంభుడు తానావిధంగా చెయ్యటం దేవియానను అతిక్రమించినట్లవుతుందనీ, ఆకారణంగా ఒకసారి దేవి అతనిని శిక్షించిందనీ, తిరిగి ఆపనిని చెయ్యబోనని. చెపుతాడు. ఆపని మణికంధరుడు చెయ్యటం సముచితంగా ఉంటుందని సూచిస్తాడు. దాని వలన అతని శాపప్రభావం నిజమవుతుంది. అతనికి రాజ్యప్రాప్తి కలుగుతుంది. కనుక అతడు చెయ్యటమే సమంజసం అంటాడు. అందుకు మణికంధరుడంగీకరించడు. “త్వరలోనే చావబోతున్న నాకు ఈరాజ్యాలెందుకు? దానికోసం కలభాషిణి వంటి ఉత్తమురాలిని వధించేటంత కౄరకర్మం చెయ్యటం ఎందుకు? అది నావల్లకాదు” అని తిరస్కరిస్తాడు. సుముఖాసత్తి, మణిస్తంభుడు అతనికి నచ్చజెపుతారు. “నీవు చేసేది రాజ్యం కోసం కాదు. ఆమెకు శాపవిముక్తికోసం అది నీచేతులమీదుగా జరిగితే ఆమె సంతోషిస్తుంది. అందువలన నీవే ఆపని చెయ్యాలి.” అని అతనిని ఒప్పిస్తారు.

ఆప్రకారమే కలభాషిణి మణికంధరుని చేతులమీదుగా దేవికి బలి అవుతుంది. అప్పుడు మృగేంద్రవాహన ప్రత్యక్షమై అతనిని రాజ్యలక్ష్మి వరిస్తుందని, కాని అతడు బలియివ్వటానికి సందేహించిన కారణంగా అది వెంటనే జరగదనీ, అతని మరుజన్మలో రాజ్యాన్ని పాలించి సుఖించగలడనీ చెపుతుంది. అప్పటి వరకూ అతనికిగాని అక్కడున్నవారెవరికిగాని అతనికి మరుజన్మ ఉంటుందన్న విషయం తెలియదు. మరుజన్మలో అతడు సద్యోయవ్వనుడై రాజ్యం చేపడతాడని దేవి చెపుతుంది. అవి జరగటానికి ముందు తాను మరణించవలసి ఉన్నది. ఏవిధంగా మరణించేదీ శాపంలో లేదు. శ్రీశైలక్షేత్రం చేరి, అక్కడ పర్వతాగ్రం నుంచిదూకి తనువు చాలించటానికి నిర్ణయించుకున్నాడు. తనకు కృష్ణుడిచ్చిన మణిహారాన్ని అక్కడే ఉన్న అలఘువ్రతునికిచ్చి, తన వీణను మృగేంద్రవాహనాలయంలోనే భద్రపరచి శ్రీశైలం చేరాడు.
అక్కడ లోయలోకి దూకటానికి సన్నద్ధుడవుతుండగా స్వభావుడనే సిద్ధుడు అతనిని సమీపించి అతని ఆత్మహత్యకు కారణం అడుగుతాడు. అందుకు మణికంధరుడు తన కథనంతా వివరించాడు. అందులో తాను మృగేంద్రవాహనాలయంలో సుముఖాసత్తి, మణిస్తంభులను కలిసిన విషయం కూడా చెప్పాడు. దానికి సిద్ధుడెంతగానో సంతోషించి సుగాత్రి తండ్రిని తానేనని అల్లునికి చెప్పని తన రహస్యాన్ని మణికంధరునికి చెప్పాడు. సుగాత్రీశాలీనులకు శారదాదేవి యిచ్చిన విరుద్ధవరాలు ఏవిధంగా పరిణమిస్తయ్యోనని ఆవేదన చెందుతాడు. తరువాత మణికంధరునితో “శ్రీకృష్ణుని కృపతో సంగీతసాధన చేశావు. నారదుని సలహా ప్రకారం తీర్థయాత్రలు చేశావు. తపసు చేశావు. పరిస్థితులప్రభావం కారణంగా వచ్చిన శాపంగూడా రాజ్యం వచ్చేటట్లు చేసింది. నీపుణ్యఫలం ఊరకపోదు. మరుజన్మలో నీవు తప్పక సద్గుణసంపన్నుడవవుతావు. రాజ్యాలేలతావు.” అని దీవిస్తాడు.

“అందుకే శ్రీమహితులై, శుచివర్తనులైనవారికి పుత్రుడుగా జన్మించటం కోసం ఎదురు చూస్తున్నానని” మణికంధరుడు సమాధానమిచ్చాడు.” అలాగైతే అందుకు తన కూతురు, అల్లుడు తగినవారనీ, వారికి పుత్రుడై జన్మించాలని కోరుకోవటం ఉచితంగదా అని సిద్ధుడు కోరతాడు. “ఒకప్పుడు నాగురువులు నావంశం క్షాత్రవంశమవుతుందని గూడా చెప్పారు. అదిగూడా నిజమవుతుంది. ఆవిధంగా కోరుకొమ్మ”ని అతనికి విన్నవిస్తాడు. అందుకు మణికంధరుడు “పావనుల ఇంటబుట్టినా రాజ్యాధికారం పొందినతరువాత అరిషడ్వర్గాలను, బాహ్యశత్రువులను జయించటం కష్టమవుతుంది. అందుకు చింతాక్రాంతుడనవటం గాక ఉత్తమద్విజుల నాకర్షించి ఆరాధించవలయునని కోరికగానున్నది” అని విన్నవించుకుంటాడు. అందుకు సిద్ధుడు సంతసించి  అతనికి జయం ప్రసాదించే ఒక విల్లును, అమ్ములను దత్తాత్రేయకృపవలన అప్పటికప్పుడు సృష్టించి అతనికి ఇచ్చాడు. వాటితోపాటు ఒక మణిని సృష్టించి అది శాస్త్రవిద్యలు నేర్చినవారిని అతనివద్దకు ఆకర్షిస్తుందని చెపుతాడు. కాని వాటిని అప్పుడే అతనికి ఇవ్వకుండా అతడు మరుజన్మదాల్చగానే వచ్చి ఇస్తానని మాటయిస్తాడు.

అప్పుడు మదాశయుడనేరాజు భార్యతోను, పురోహితులతోను సిద్ధుని సమీపించి తనకు దత్తాత్రేయులవారు కలలో కనిపించి తనభక్తుడైన సిద్ధుని శ్రీశైలంలో కలిసి కోర్కెలు తీర్చుకోమని చెప్పాడని, అందువలన అతనిని వెదకుతూ ఇప్పటికి ఆసిద్ధును చేరానని చెపుతాడు. సంతోషము, విజయోత్సాహము తనకోరికలని చెపుతాడు. అందుకు సిద్ధుడు అతనితో తాను సృష్టించిన విల్లమ్ములు చూపి ఇవి మణికంధరుని కోసం సృష్టించానని, అతనిని తప్ప అందరినీ గెలవగలవని చెపుతాడు. అందుకు మదాశయుడు ‘చివరకు ఆవిల్లమ్ములబలమెంతో తాను చూడగలనులె’మ్మంటాడు. అందుకు సిడ్ఢుడు కోపించి మణికంధరుని మరుజన్మలో మదాశయుడు అతనికి బానిసయై, భార్యాపురోహితులతో అతనికి సేవచేస్తాడని శపిస్తాడు. ఆసేవలు చేస్తున్న సమయంలోనే అతనికి సంతాన కాంక్షగూడా తీరుతుందని అభయమిస్తాడు. అంతటితో స్వభావుడు, మదాశయుడు తమదారిన తాము వెళ్ళిపోయారు.

మణికంధరుడిక లోయలో దూకి ప్రాణత్యాగం చెయ్యటానికి సిద్ధమవుతుండగా, అభినవకౌముది అనే స్త్రీ ఒకతె అతని దగ్గరకు పరుగున వచ్చి, అతని చేతికి ఒక కత్తిని ఇచ్చి ‘ఈరాక్షసుని నుంచి తనను రక్షించినా ఆభృగుపాత ఫలం కలుగుతుందని’ వేడుకుంది. అందుకు మణికంధరుడు “నీవెవ్వరవు? నీకోసం నేనెందుకు ఈపని చెయ్యాలి?” అని అడుగుతాడు. తనకథ చెప్పే సమయం లేదని, ఆరాక్షసుడు తనను వెంబడిస్తున్నాడని చెప్పి దూరంగా పోతుంది. ఆరాక్షసుడు శల్యాసురుడు. మహిషాసురుని మేనల్లుడు. అతడుగూడా మృగేంద్రవాహనాలయంనుంచి ఒక వరం పొందాడు. అతనిని చంపినవారెవరైనా వెంటనే చస్తారని ఆవరఫలితం. చిత్రం! అతనినెవరూ చంపలేరని కాదు. అతనిని చంపినవారుకూడా వెంటనే చస్తారని మాత్రమే! మణికంధరుడు ఆకత్తితో శల్యాసురుని సంహరిస్తాడు. అతనితో పాటు మణికంధరుడుగూడా మరణిస్తాడు. ఆవిధంగా మణికంధరుడు అవతారం చాలిస్తాడు. మరుజన్మలో కళాపూర్ణుడుగా ఉదయిస్తాడు.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

కళాపూర్ణోదయం – 7: కళాపూర్ణుడు – మధురలాలస

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* బ్రహ్మ చెప్పిన కథ ప్రకారం కళాపూర్ణుడే కథానాయకుడు. కళాపూ...
by అతిథి
0

 
 

కళాపూర్ణోదయం – 6 : అభినవకౌముది – శల్యాసురుడు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* మహిషాసురుని మేనమామకొడుకు శల్యాసురుడు. అతనికి ఒంటినిండా ...
by అతిథి
0

 
 

కళాపూర్ణోదయం – 5 : సుముఖాసత్తి – మణిస్తంభుడు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* వయస్తంభన ప్రభావం కలమణిని పొంది నిత్యయవ్వనుడుగా ఉన్న కార...
by అతిథి
0

 

 

కళాపూర్ణోదయం – 4 : సుగాత్రీశాలీనులు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* కాశ్మీరంలోని శారదాపీఠము సకలకళాప్రపూర్ణము. ఋగ్వేదఘోషలత...
by అతిథి
0

 
 

కళాపూర్ణోదయం – 3 : రంభానలకూబరులు

వ్యాసకర్త: జాస్తి జవహర్ ********* కళాపూర్ణోదయకావ్యానికి సంబంధించినంతవరకు రంభానలకూబరుల ప...
by అతిథి
0

 
 

కళాపూర్ణోదయంలో శృంగారభావ వైవిధ్యం: 1-కలభాషిణి

వ్యాసకర్త:జాస్తి జవహర్లాల్ (కళాపూర్ణోదయం సంక్షిప్త రూపంలో, సులభ వచనంలో కె.వి.ఎస్.రామ...
by అతిథి
0