పుస్తకం
All about booksఅనువాదాలు

October 8, 2014

కథా చిత్రాలు, బతుకు పాఠాలు

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: మద్దిరాల శ్రీనివాసులు, టీచర్
*****

పుస్తకం పేరును గమనిస్తే “కథాచిత్రాలు” అనగా “మన కళ్ళముందు కనపడే ఆ కథల భావ దృశ్యాలు” అనీ, “బతుకు పాఠాలు” అనగా “మన జీవితాలలో జరిగే అనుభవసారాలు” గా వెరసి, జీవితంలో ఎదుర్కొనబోయే అనుభవ సారాలు అనే అద్భుత భావాన్ని పుస్తకం పేరులోనే స్ఫురింపజేశారు. జీవిత సత్యాన్ని తెలియజేసే మంచి బొమ్మ ముఖచిత్రంగా చక్కగా, ఆకర్షణీయంగా, తగినదిగా పాణిగారి కుంచె అద్భుతాన్ని సృష్టించింది.

నేటి కాలంలో దాదాపుగా ప్రతి పాఠశాలలో కూడా “చదువు, పరీక్ష, ర్యాంకు” అనే ముచ్చటైన మూడు ముక్కలాటకు తప్ప, నైతిక విలువలకు, కళలకు ఏ మాత్రం ప్రాధాన్యత లేని పరిస్థితి నెలకొని వున్నది. ఇటువంటి తరుణంలో దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ వారు పిల్లలలో నైతిక విలువలను పెంపొందించడానికి, రేపటి కాలానికి ఒక మంచి తరాన్ని అందివ్వాలనే సదుద్దేశంతో ఇటువంటి ఒక మంచి పుస్తకాన్ని విడుదల చేయడం ముదావహం.

ఈ పుస్తకం లోని కథలలోకి తొంగి చూస్తే –

ప్రారంభంలోనే తాను జైలులో వుండి కూడా ముసలివాడైన తన తండ్రికి ఎలాగైనా సాయపడాలని మనసులో ఒక ధృఢ సంకల్పంతో కేవలం ఒక ఉత్తరం రాయడం ద్వారా నాన్న పొలాన్ని దున్నింపజేస్తాడు. అలా మనసులో సంకల్పం వుండాలే కాని, ఏదైనా
సాధించవచ్చుననే మంచి మనస్తత్వంతో కూడిన విలువున్న కథ “ఉత్తరం దున్నిన పొలం” పుస్తకానికే హైలెట్.

“నిజమైన స్నేహితుడు” కథలో హరీష్ అనే అబ్బాయికి లుకేమియా వ్యాధి రావడం వలన కీమో థెరపి చేయాల్సివస్తుంది. దాని సైడ్ ఎఫెక్ట్ వలన బాబుకు జుట్టు అంతా రాలి పోతుంది. తోటి పిల్లలంతా ఎగతాళి చేస్తారు. హరీష్ బడికి రావడానికే భయపడతాడు. కాని, ఆ తరగతిలో చదువుతున్న ఏడేళ్ళ సింధు అనే పాప మాత్రం ఆ బాబు ఇంటికి వెళ్ళి, ధైర్యం చెప్పి, తాను బడికి రావాలని, ఎగతాళి వ్యవహారం తాను చూసుకుంటానని చెపుతుంది. హరీష్ కు తోడుగా తాను ఆడపిల్ల అయి వుండీ కూడా తన తల్లిదండ్రులచే ఒట్టు వేయుంచుకొని మరీ, వాళ్ళు బాధపడినా తన జుట్టు మొత్తం తీయుంచుకుంటుంది. విషయం తెలిశాక పాప తల్లిదండ్రులు కూడా కూతురు చిన్నదైనా అంత ఉన్నతంగా ఆలోచించినందుకు సంతోషపడతారు. అలా ఎగతాళి చేస్తున్న పిల్లలకు అంత చిన్న వయసులోనే
కనువిప్పు కలిగించిన సింధు అనే పాప నడవడిక ఈ కథ చదివిన పిల్లలకైనా, పెద్దలకైనా కళ్ళు చెమర్చేలా చేస్తుంది.

పిల్లలలో నైతిక విలువలు పెంపొందింప జేయడానికి సంబంధించిన కథలు వుండడం ఒక ఎత్తైతే, అహింసా మార్గంలో కూడా పిల్లలలో మంచి గుణాలను పెంపొందించవచ్చునని చెప్పే “గాంధేయవాదం”, ఎంతటి క్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం వుంటుందని తెలిపే
“మెదడుకు మేత” లాంటి పెద్దలకు, పిల్లలకు సంబంధించిన కథలుండడం మరో ఎత్తు.

ఈ విధంగా ఈ పుస్తకంలోని ఇరవై ఐదు కథలలో ప్రతి కథా అద్భుతమే. విలువలతో కూడినదే. చిన్నా, పెద్దా అందరూ చదువదగిన పుస్తకం ఇది. నేటి పిల్లలు అందరూ రాబోయే కాలానికి వారధులు, సమాజ నిర్మాణ సారథులు కాబట్టి, ఆ పిల్లల బాల్యం ఎప్పుడూ తల్లి, తండ్రి, ఉపాధ్యాయుల చెంతనే వుంటుంది కాబట్టి, ఈ పుస్తకాన్ని ముందుగా వారు చదవాలి. అప్పుడు తప్పకుండా
సమజంలో కొంత మార్పు వస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం.

పొందికైన వాక్య నిర్మాణాలతో, అలతి అలతి పదాలతో చిన్నారులకు సైతం అతి తేలికగా అర్థమయ్యేలా వున్న ఈ అనువాద రచన చేసిన చిలకపాటి రవీంద్రకుమార్ సృష్టి అనిర్వచనీయం.

ఇంత మంచి విలువలున్న ఈ పుస్తకాన్ని కేవలం 22-00 రూపాయలకే అందిస్తున్నారు దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ వారు. పుస్తకమును పొందుటకు దేవినేని మధుసూధనరావు, చైర్మన్, దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్, తెన్నేరు-521 260, కృష్ణా జిల్లా చిరునామాలో గానీ, లేదా ఫోన్:0866-2862424 లోనూ మరియు email:mdevineni@gmail.com ద్వారా సంప్రదించవచ్చును.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.6 Comments


 1. Harish Mikkilineni

  నేను ఈ పుస్తకాన్ని చదివాను.అతి చిన్న కథలను మనసకు హత్తుకొనేలా దాని మాతృకలోని అర్థాన్ని చక్కగా అర్థమయ్యేలా ఈ పుస్తకాన్ని రచించిన చిలకపాటి రవీంద్ర కుమార్ గారికి కృతజ్ఞతలు. మధుసూధనా రావు గారిని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పుస్తకాలపై ఆయనకు ఉన్న అభిమానం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. వారిదగ్గర ఉంది చదువుకున్నందుకు మేము నిజాంగానే ఎంతో అదృష్టవంతులం.


 2. suresh kumar

  పుస్తక పరిచయమే మనసును అద్దుకొనే విధంగా ఉంది. పుస్తకం చదవాలని ఆత్రుత కలుగచేస్తుంది. ధన్యవాదాలు మధుసూదనరావు గారు.


 3. “ఇది అద్భుతమైన బుల్లి పుస్తకం! మధుసూదనరావుగారు ప్రచురించిన ఈ పుస్తకం ప్రతులను తూర్పు గోదావరి జిల్లాలోని నా మిత్రులకు, చుట్టాలకు ఇచ్చాను. అందరూ ఆ కథలను మెచ్చుకున్నవారే! ఇందులో అరపేజీ కధలు కూడ ఉన్నాయి! ముందుగా- మొదటిసారి అంతర్జాలంలోని ఆంగ్ల కథలను సేకరించి తెలుగులోకి అనువదించి, పాఠకులకు అందజేసిన చిలకపాటి రవీంద్రకుమార్‌ను అభినందిస్తున్నాను. ఇతడు నాకులాగే బోటనీ వాడు. వృక్షశాస్త్రాన్నే కాక సాహిత్యాన్ని కూడ ప్రేమిస్తున్నవాడు. తరువాత అభినందనలకు అర్హమైనవారు మధుసూదనరావుగారే! ఈ పుస్తకం ముందుమాటలో ఆయనే చెప్పుకున్నట్లు… ఈ కథలంటే వారికి చాల ఇష్టం. “ఇందులోని 25 కథలు మనలను ఆలోచింపచేస్తాయి. ఆర్ద్రత కలిగిస్తాయి. కళ్ళు చెమర్చేలా చేసి, చివరకు ఔరా! అనిపిస్తాయి. కథకు ఇంతకన్నా పెద్ద ప్రయోజనం ఏముంటుంది.” అని కదా ఆయనగారి హృదయ స్పందన?
  ఇకపోతే, ఇందులోని చాల కథలు, ముఖ్యంగా మొదటిదీ (ఉత్తరం దున్నిన పొలం), అలాగే చివరిదీ (అమ్మా! నాకెందుకిలా?) ఇప్పటికే కొందరు “కబుర్లపోగులైన” కాలమిస్టుల దయవలన అందరికీ సుపరిచితమైపోయాయి.” —హేమాద్రి


 4. స్టోరీస్ అన్ని చాల చాల మంచివి. అందరు చదువ దగినవి .అట్టి కథలను అందించిన వారికీ అభినందనలు . ఇ సు నాయుడు


 5. raja

  మా మనవరాలికి ,తెలుగు రాకపోయినా ,తెలుగు నేర్పుతూ యీ కథలు అన్ని వినిపిస్తూ ,తన బంగారు భవిష్యత్తుకి ఉపయోగ పడేట్టు చేస్తున్నాం ,దేవినేని మధు సూధనరావు గారికి ధన్య వాదాలు


 6. సమీక్షకుడు మూల రచయిత పేరు తెలియచేయలేదు. దేవినేని గారికి అభినందనలు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నొప్పి డాక్టరు

వ్యాసకర్త: మద్దిరాల శ్రీనివాసులు, టీచర్, త్రిపురాంతకం, సెల్: 9010619066 ********** పిల్లలకు సరదాగా,...
by అతిథి
2

 
 

చదవడం అంటే ఏమిటి… నేర్చుకోవడం అంటే ఏమిటి…

వ్యాసకర్త: మద్దిరాల శ్రీనివాసులు, సెల్:9010619066 ********* పుస్తకం పేరు: చదవడం అంటే ఏమిటి… నేర్...
by అతిథి
0

 
 

నేటి విద్యార్థులు,ఉపాధ్యాయులకు ఆదర్శం – హెలెన్ కెల్లర్ జీవిత గాథ

వ్యాసకర్త: మద్దిరాల శ్రీనివాసులు, టీచర్ ********* రచయిత్రి డాక్టర్ నన్నపనేని మంగాదేవి గార...
by అతిథి
1