మూడు గ్రాఫిక్ పుస్తకాలు

ఈ వ్యాసం ఇటీవలి కాలంలో చదివిన మూడు గ్రాఫిక్ పుస్తకాల గురించి. మొదటి రెండు పుస్తకాలకూ, మూడో పుస్తకం రచయితకూ, అమెరికన్ కామిక్ ప్రపంచానికి ఆస్కార్ అవార్డులు అనదగ్గ Eisner Award రావడం వీటిని కలిపే దారం. గత రెండు నెలల్లో ఒకదాని వెంబడి ఒకటి వరుసగా చదవడంతో, వివిధ స్థాయుల్లో మూడూ నన్ను ఆకట్టుకోవడంతో, వీటిని గురించి సంక్షిప్తంగా పరిచయం చేయాలనుకుంటున్నాను.

ఆ పుస్తకాలు:
* Mom’s Cancer – Brian Fies, Best Digital Comic/Webcomic, 2005.
* I Killed Adolf Hitler – Jason, Best U.S. Edition of International Material, 2008.
* Maus -1 by Art Spiegelman. ఈ Maus సిరీస్ లోని ఇతర గ్రాఫిక్ రచనలకి ఒకసారి 1992లో, మళ్ళీ 2012లో ఈయన ఈ అవార్డును అందుకున్నారు.

Mom’s Cancer
ఆ మధ్యన Emperor of all Maladies చదివినప్పుడు ఈ పుస్తకం గురించి తెలిసింది. ఇంతలో “Fun House” అన్న అద్భుతమైన గ్రాఫిక్ పుస్తకం (ఇదీ Eisner Award అందుకున్నదే!) చదివినందువల్ల ఈ పుస్తకం నాకు Goodreads related booksలో కూడా కనబడ్డంతో, లైబ్రరీ నుండి తెచ్చుకుని చదివాను. ఇది నిజజీవిత కథ. రచయిత తల్లికి క్యాన్సర్ అని తేలాక వాళ్ళ జీవితాల్లో కలిగిన మార్పుల గురించి, క్యాన్సర్ గురించి రోగి కుటుంబ దృక్కోణం నుండి రాయబడ్డ పుస్తకం. డాక్టర్లు చూసే కోణానికి, పేషంటు చూసేదానికి, పేషంటు కుటుంబ సభ్యులు చూసేదానికి మధ్య తేడాలను చూపే బొమ్మలు నన్ను ఆకట్టుకున్నాయి. విషయం సీరియస్సే అయినా, అక్కడక్కడా మంచి హాస్యం కూడా ఉంది. నిజజీవిత కథ కనుక మరి నవరసాలూ ఉంటాయి కద!

ఎటొచ్చీ, ఈ పుస్తకంలో నాకు నచ్చని పేజీ ఒక్కటుంది – రచయిత తల్లికి పొగతాగడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తే, ఒక చోట బొమ్మలో ఎటు చూసినా పొగ తాగే యువతులు ఓ పక్కా, వాళ్ళమ్మ లా క్యాన్సర్ బారిన పడ్డవారోపక్కా కనిపిస్తారు. ఈ బొమ్మ, అక్కడి టెక్స్ట్ నాకు – అక్కడికి పొగతాగే వారందరూ స్త్రీలే, వాళ్ళకి మట్టుకే పొగతాగితే క్యాన్సర్ వస్తుంది – అంటున్నట్లు అనిపించింది. ఇలా ఒకట్రెండు చోట్ల చిరాకేసింది రచయిత దృక్కోణంపై (అది అతని ఉద్దేశ్యం కాకపోవచ్చు – నేనే అలా అనుకుని ఉండవచ్చు). కానీ, క్యాన్సర్ ని అర్థం చేసుకోడం గురించి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు – వాళ్ళు చేసే ప్రయత్నాలు – వీటి గురించి ఈ పుస్తకం చదివితే కొంచెం అవగాహన కలగవచ్చు.

పుస్తకం మొదట వెబ్-కామిక్ గా మొదలయినా, పుస్తకం గా వచ్చాక ఇప్పుడు వెబ్ లో ఉచితంగా దొరకడం లేదు.

jsoncomicI Killed Adolf Hitler
పుస్తకం మొదలవడమే బహు విచిత్రంగా మొదలైంది – కథ సెట్ చేసిన ప్రపంచంలో ఏ చిన్న కారణానికైనా కాంట్రాక్ట్ కిల్లర్స్ వద్దకెళ్ళి చెబితే మనక్కావాల్సిన వాళ్ళని చంపి పెడుతూంటారు. అలాంటి కాంట్రాక్ట్ కిల్లర్ హిట్లర్ ని చంపడానికి ఒప్పుకుని ఒకతను టైం-మెషీన్ సాయంతో యాభై ఏళ్ళు వెనక్కెళతాడు. తీరా చూస్తే, అక్కడ హిట్లర్ ఇతన్ని దెబ్బతీసి అక్కడే వదిలేసి తాను వర్తమానానికి వచ్చేస్తాడు!! మరి తర్వాతేమైందంటే, ఆ చిరుపొత్తం దొరకబుచ్చుకుని చదివి తెల్సుకోవాలి. నాకైతే తెలివిగా రాసినట్లు అనిపించింది. ఆట్టే వర్ణనలు అవీ లేవు – సూటిగా, బొమ్మలు-మాటలూ రెండూ అవసరమైన మేరకి మాత్రమే వాడారు. అంత చిన్న పుస్తకం గురించి ఇంకేకాస్త చెప్పినా spoiler లాగానే ఉంటుంది కనుక ఇక్కడితో ముగిస్తున్నాను.

maus1Maus -1
ఇదీ ఒక విధంగా ఆత్మకథే. రచయిత తల్లితండ్రులు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూరోప్ నుండి తప్పించుకుని అమెరికా చేరుకున్న యూదు మతస్థులు. ఈ పుస్తకంలో రచయిత వాళ్ళ కథని తన మాటల్లో చెబుతాడు. వివిధ జాతుల మనుషుల్ని వివిధ జంతువుల్లా చూపిస్తాడు – యూదులు ఎలుకలు, జర్మన్లు పిల్లులు, ఇలా అనమాట. రచయిత దృక్కోణంలో అతని తండ్రి పాత్రని చిత్రించిన విధానం – అతని ప్రవర్తన లోని విపరీతాలను వాటిని పట్టుకుని విశ్లేషించిన విధానం – నన్ను ఆకట్టుకున్నాయి.. నాజీల దురాగతాలను గురించి బొమ్మల రూపంలో చెప్పిన కథలేవీ నేను చదవలేదు – ఆ పరంగా కూడా ఈ పుస్తకం చదవడం ఓ కొత్త అనుభవం అనే చెప్పాలి. పుస్తకంలో రచయిత తండ్రిని చిత్రీకరించిన విధానానికి ఆయన తండ్రి ఎలా స్పందించాడో – అన్నది మట్టుకు నాకు సందేహంగానే ఉంది ఇంకా! ఈ భాగం నేను ఒక పుస్తకాల షాపులో కూర్చుని చదివేశాను ఇదీ ఒక రెండు, మూడు గంటల్లో పూర్తి చేసేయగల పుస్తకమే. ఈ మొదటి భాగం ఒక విధంగా సస్పెన్స్ గానే ముగిసింది. మిగితా భాగాలు త్వరలో చదవాలి!

అన్నట్లు, ఇది పులిట్జర్ ప్రైజు పొందిన మొదటి గ్రాఫిక్ నవలట!

మొత్తానికైతే మూడూ చిన్న పుస్తకాలే. మౌస్ కొంచెం పెద్దది కానీ, తక్కిన రెండూ గంట-గంటన్నర లోపు చదివేయొచ్చు. అయితే, రెండు మూడు సార్లు చదివినా బోరు కొట్టవు.

You Might Also Like

Leave a Reply