పుస్తకం
All about booksపుస్తకభాష

September 16, 2014

The Storyteller’s Daughter: Saira Shah

More articles by »
Written by: Purnima
Tags:
ఓ అందమైన యువతి. మాటల్లో చెప్పలేనంత అందం. ఆమె గురించి, ఆమె అందం గురించి చిన్నప్పటి నుండి ఎన్నెన్నో కథలు. కథల్లో అందం. కథల్లో ఆమె అందం. అంత అందాన్ని కళ్ళారా చూడాలని ఆశ. ఎంత దూరమైనా, ఎన్ని కొండలెక్కాల్సి వచ్చినా ఆ అందాన్ని చూడాలని ఆశ. అందుకు తగ్గట్టుగానే ఎంతో శ్రమకు ఓర్చి, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని ఆమె చూడ్డానికని వెళ్తే… అక్కడ ఆమె కనిపించింది. ఆసిడ్ ఎటాక్‌లో కాలిపోయిన చర్మం ఊడిపోగా, లోపలి ఎముకులు కూడా కనిపించేంత వికృతంగా కనిపించింది. అప్పటివరకూ ఊహల్లో ఉన్న అందమైన రూపం,  ఇప్పుడు కళ్ళెదుట ఉన్నా.. క్షణకాలం పాటు చూడలేని పరిస్థితి. కళ్ళ ముందు ఉన్న వాస్తవంలో కథలు చెప్పిన నిజాన్ని వెతుక్కోవటమా? లేక, కథలన్నీ అబద్ధాలని కొట్టిపారేసి, వచ్చేయడమా?

ఏ వారపత్రికలో వచ్చిన కథ అయితే ఇది, పావుగంటలో చదివేసి, కొంచెం నిట్టూర్చి వదిలేయచ్చు. కానీ, ఇది నిజంగా జరిగినది అనీ, ఆమె పేరు ఫలానా, ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్ళినవాళ్ళు ఫలానా అని తెలిస్తే, ఇంకొంచెం ఎక్కువ బాధ. ఫిక్షనల్ కారెక్టర్ల మీద జాలికన్నా చుట్టుపక్కల మనుషుల మీద జాలి ఎక్కువ మోతాదులో పొంగుకొస్తుంది కదా! అయితే, ఇది నిజంగా జరిగిందే అయినా, ఇందులో “ఆమె” అఫ్ఘనిస్థాన్ అనే దేశమనీ, ఆ దేశం గురించి కథలుకథలు విన్న “సైరా షాహ్” అనే యువతి, తన దేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళాక, అక్కడ చూసిన దారుణ మారణహోమాన్ని చూస్తూ కూడా, చిన్ననాటి కథలోవి ఏవైనా కనిపిస్తాయేమోనని ఆశగా వెతికి వెతికి వేసారి, కనీసం చేతనైంత సాయం చేద్దామనుకున్నా, అదీ సాధ్యపడక, తిరిగి తాను పుట్టిపెరిగిన దేశానికి తిరిగివచ్చేయడం గురించి. సాటి మనిషిని గురించి బాధపడినంత సునాయాసంగా, మనం ఓ దేశం గురించి, ముఖ్యంగా మనది కాని దేశం గురించి బాధపడగలమా? ఏమో..

ఈ పుస్తక రచయిత నా మట్టుకు నాకు ప్రత్యేకం. ఆవిడ నా మనసుకు చాలా దగ్గరైన ఇద్రీస్ షాహ్ కూతురు. అసలు, ఈ పుస్తకం చేతికందగానే పనులన్నీ మానుకొని చదువుకున్నది, స్టోరీటెల్లర్ కూతురు చెప్పే కథల్లో స్టోరిటెల్లర్ చెప్పిన కథలు తప్పకుండా ఉంటాయన్న ఆశతో. ఆయన కథల కోసం. ఎందుకంటే, ఈ కథలు చెప్పేవాళ్ళు అందరికీ మంచి మంచి కథలు చెప్పినా, తమ పిల్లలకు ప్రత్యేకమైన కథలు చెప్తారని నాకు అనుమానం. ఇద్రీస్ షాహ్ రాసిన పుస్తకాలెన్నో మార్కెట్లో ఉన్నాయి. ఈయన చెప్పే కథలు మామూలు కథల్లాంటివి కావు. జీవితసారాన్నంతటి కథల్లో వడబోసి, తరతరాలుగా అందిస్తున్న పరంపరలోని కథలు. ఇవి చదివీ చదవగానే “బాగుంది”, “నచ్చింది” అనేసుకొని పక్కకు పెట్టేసే కథలు కావు. మనలో మనతో పాటు ఉండగల కథలు. వీటిని గురించి రాయడం చాలా కష్టం. అంతకన్నా ముఖ్యంగా అనవసరం. ఎందుకంటే, these are the stories that “do” something to you, rather than simply convey something. ఆ “do” అనేది పూర్తవ్వడానికి ఓ జీవితకాలం కూడా పట్టచ్చు. అందుకే ఆ కథలని గురించి మాట్లాడ్డం కన్నా ఆ కథలతోనే మాట్లాడుకోవడం ఉత్తమం.

నేను ఆశించినట్టే ఇందులో బోలెడు కథలు ఉన్నాయి. ఆ కథల ద్వారా తనకు తెల్సిన అఫ్ఘానిస్థాన్‌ను వెతుక్కుంటూ, ఉద్యోగరిత్యా జర్నలిస్ట్ అయిన సైరా ఆ దేశానికి వెళ్తుంది. కానీ అప్పటికే అఫ్ఘనిస్థాన్ సోవియట్ రష్యా, అమెరికాల కోల్డ్ వార్‍లో మగ్గిపోతూ ఉంటుంది. అసలు, షాహ్ కుటుంబం అఫ్ఘాన్ కు చెందినదే! కాకపోతే, కొన్ని అనివార్యకారణాల వల్ల అక్కడ నుండి తరలిపోయారు. అయినా, తమ నేలనూ, తమ సంస్కృతిని పరాయి దేశంతో కూడా మర్చిపోలేదు. ఆ భాషను రేడియోలో వినిపిస్తూ, అక్కడి కథలు చెబుతూ పిల్లల్ని పెంచారు. దానివల్ల సైరాకు ఒక  existential dilemma పుట్టుకొస్తుంది. Where does she belong to? To the east? Or the west? ఆ వేదన ఈ పుస్తకమంతా కనిపిస్తుంది. ఆమె పుట్టి పెరిగిన పాశ్చాత్య సంస్కృతికి, తన తాతముత్తాతల సంస్కృతికి మధ్య నలుగుతూ ఉంటుంది. ఆ రకంగా చూస్తే, ఇదో పర్సనల్ జర్నీ. తన మూలాలను తాను వెతుక్కునే ఓ ప్రయత్నం.

అయితే, ఆ పర్సనల్ జర్నీలో మనల్నీ భాగస్తులని చేస్తుంది. మనకి చాలా relevant అయ్యుండాల్సి కూడా అవ్వని చాలా విషయాలను మన ముందుకు తెస్తుంది. మనం వార్తల్లో హైడ్‍లైన్స్ లా విని మర్చిపోయిన చేదు నిజాలను బయోస్కోప్‌లో పెట్టి చూపిస్తుంది. అందమైన తోటలతో, పసందైన విందులతో కళకళాడే ఒక దేశంలో ఈ పుస్తకం రాసేనాటికి కేవలం బాంబులు చేయడం, వాటిని విసరడం మాత్రమే జీవనోపాధిగా మిగలడం కనిపిస్తుంది. సాయం చేస్తానంటూ వచ్చిన వాళ్ళూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని, మొత్తం దేశాన్ని నాశనం చేసి వదిలేశారు. 9/11న కూలిన WTC Towers visuals చూసి మనమెంత గొల్లున గోలెత్తిపోయామో, మరి దానికి ముందు అప్ఘాన్‌లో జరిగిన దాడులెన్నింటిలోనో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారే? అని వాపోతుంది రచయిత. నిజమే కదా? ఓ మలాలా ప్రపంచ వేదిక మీద తన గొంతు వినిపించగలదు కానీ, అమెరికా బాంబు దాడుల వల్ల సర్వస్వాన్ని పోగొట్టుకున్న అమ్మాయి, “మాదేం తప్పు? మా మీద ఎందుకు బాంబులు వేశార”ని ప్రశ్నించే వేదిక ఉందా? ఇలాంటి ప్రశ్నలను రేగ్గొడుతుందీ పుస్తకం. ఇంకెందరి దీన బతుకులనో మనకి పరిచయం చేస్తుంది.

ఆవిడకు ఏ అనుభవంలో అయినా, వాళ్ళ నాన్న కథలు గుర్తు చేసుకోవటం అలవాటు. ఆ కథల మధ్యనే, తాను చూసినవి, తాను అనుకున్నవి, అనుకుంటున్నవి, తన భయాలు, అభిప్రాయాలు అన్నీ చెప్పుకొస్తుంది. ఓ రకంగా, వాళ్ళ నాన్న కథలూ, రూమీ రాసిన కవిత్వం ఒక frame అయితే, దాని చుట్టూ తన అనుభవాలను అల్లి మనకి అందించిందని చెప్పుకోవచ్చు. ప్రతి చాప్టర్ తను చిన్నప్పుడు ఇష్టంగా చదువుకున్న, విన్న కథలు కవితలతో మొదలవుతుంది. ఆ చాప్టర్ లో అంతర్లీనంగా అదే థీమ్ నడుస్తూ ఉంటుంది. చివర్న మళ్ళీ ఆ కథో, కవితో హైలైట్ చేసి, అది తన అనుభవానికి ఎలా సరిపోతుందో చెప్పుకొస్తుంది. అఫ్ఘన్‌లో తిరుగుతూ ఈవిడ తీసిన డాక్యుమెంటరి పేరు: Behind the veil. అది తాలిబన్ల దుర్మార్గాలని, ముఖ్యంగా స్త్రీలపై అత్యాచారాలని చూపిస్తుంది. అసలు అప్ఘాన్‌లో చుట్టాలింట్లో, బంధువులందరి మధ్యలో ఉన్నప్పుడే, ఈవిడకు అక్కడ స్త్రీ స్వేచ్చ తక్కువ అని అనిపించింది. ఆ సందర్భంలో, “నాకు కథలు చెప్పిన నాన్న స్త్రీ కాదుగా! అందుకే ఇవేవీ ఆ కథల్లో తెలియలేదు.” అని వాపోతుంది.

ఈ పుస్తకం నాకు నచ్చడానికి కారణం ముందే చెప్పాను. దాన్ని పక్కకు పెట్టినా కూడా, ఇది ఒక దేశాన్ని, దాని సంస్కృతిని, దాని పతనాన్ని అర్థం చేసుకునే వీలు కలిపించే పుస్తకం. జర్నలిస్టులనే వాళ్ళు ఎంతటి ధైర్యసాహసాలకు ఒడిగట్టు ప్రపంచానికి నిజాన్ని చూపిస్తారో తెలిపే పుస్తకం. నన్ను అడిగితే, తప్పక చదవమనే అంటాను.

 
The Storyteller's Daughter

Saira Shah

Memoir
HardcoverAbout the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0