కళాపూర్ణోదయంలో శృంగారభావ వైవిధ్యం: 1-కలభాషిణి

వ్యాసకర్త:జాస్తి జవహర్లాల్
(కళాపూర్ణోదయం సంక్షిప్త రూపంలో, సులభ వచనంలో కె.వి.ఎస్.రామారావు గారి మాటల్లో, ఈమాట.కాం వెబ్ పత్రికలో చదవవచ్చు.)
******
శ్రీకృష్ణుని పాలనలోనున్న ద్వారకాపురిలో ఒక నటశేఖరుని ప్రియనందన కలభాషిణి. ఆమె లలితకళావిలాసిని. నవయవ్వనంతో మిరుమిట్లుగొలిపే అందంతో తనసహచరులతో పూదోటలో ఉయ్యాలలూగుతూ ఆడుకుంటున్న సమయంలో ఆకాశమార్గానపోతున్న విమానంనుంచి ఏవో గుసగుసలు వినిపించినవి. ఆమె ఆవిమానం వంకే చూస్తుండగా అది తనతోటలొనే దిగింది. ఆమె ఆశ్చర్యంతో పొదలమాటుగా దగ్గరికి చేరి గమనించటం మొదలుపెట్టింది. అందులోనుంచి ఇద్దరు వ్యక్తులు దిగారు. వారిని నారదుడు, మణికంధరులుగా గుర్తించింది. వారిని ఆమె ఇదివరకే కలుసుకున్నది. అందులో మిగిలిన ఇద్దరూ సవినయంగా నారదునికి నమస్కరించి వీడ్కోలు చెప్పి తిరిగి పయనమయ్యారు. అప్పుడు వారు మాట్లాడుకున్న మాటలన్నీ ఆమె విన్నది. కాని ఆమాటలకంటే అందులో ఉన్న యువకుని అందమే ఆమెను ఆకట్టుకున్నది. “ఇంతటి రూపవంతుని కైవశం చేసుకున్న ఆ అదృష్టవంతురాలెవరో” అని ఈర్ష్య పడింది. అంతలో వారి మాటలలో ‘అర్థపతి ముద్దుకుమారు’డన్న మాట విన్నట్లుగా గుర్తుకు వచ్చింది. అంటే అతగాడు నలకూబరుడా? ఐతే ఆమె రంభ అయి ఉండాలి. తప్పకుండా ‘వారేవీరు’ అని నిర్ధారణ చేసుకున్నది కలభాషిణి. ఐనా ఒకసారి నారదుని కలిసి తెలుసుకుంటే మంచిదని తోచింది. నారదుని ముందుకేగి సవినయంగా నమస్కరించి అడిగింది “ఇప్పుడావిమానంలో వెళ్ళినవాళ్ళు రంభానలకూబరులేనా?” అని. 

నారదుడు ఔనని సమాధానమిచ్చి “ఆవిషయం నీకెలా తెలిసింది?” అని అడిగాడు.
“వారు మాట్లాడుకోవటం విన్నాను.”
“ఇంకా ఏమివిన్నావు?”
“తన అందానికి సాటిలేదనీ, అందుకు అర్థపతి ముద్దుకుమారుడే సాక్షియనటము, దానికి తమరు కోపగించుకోవటము విన్నాను.”
“అవునుమరి..అంతగర్వం పనికిరాదుగదా! ఆమెవంటి అందమైన స్త్రీ గాని, అతని వంటి పురుషుడుగాని తారసపడవచ్చు. అప్పుడాగర్వం ఏమవుతుంది? ఎవరో ఎందుకు దేవుడు మీలుచేస్తే నీవే ఆమెకు సవతివి కావచ్చు..” అన్నాడు నారదుడు.
“మాలాంటివారికంత అదృష్టం కూడానా?”
“ఎందుక్కాకూడదు? రంభకన్నా నువ్వేంతక్కువ?…ఐనా నిన్నెక్కడో చూచినట్లున్నది. ఇంతకుముందు ఎక్కడైనా కలుసుకున్నామా? ఎప్పుడైనా కృష్ణుని కొలువుకు వచ్చావా?”
“వచ్చాను…అక్కడ మీగురుశిష్యులిద్దరి దర్శనం చేసుకున్నాను…”
‘ఆ…గుర్తువచ్చింది.. అప్పుడు మాశిష్యుడు మణికంధరుడు కృష్ణస్తుతికి ఆశువుగా చెప్పిన దండకం తిరిగి వినిపించావుగదూ! ఏకసంథాగ్రాహివి!.. ఏదీ..ఆదండకం ఇంకొకసారి వినిపిస్తావా?” అని అడిగాడు నారదుడు.

ఆమె వెంటనే అప్పటి దండకం వినిపించింది. నారదుడెంతో సంతోషించాడు. “అప్పుడు కృష్ణుడు సంతోషించి ఇచ్చిన మణిహారమేగదా ఇప్పుడు మీశిష్యుని మెడలో ఉన్నది?” అని గూడా అంటుంది. మణికంధరుని కవిత్వాన్ని, సత్కవితాలక్షణాలను వివరించి “అటువంటి కవిత్వం చెప్పిన వారికి కృష్ణుడు బహుమానాలివ్వటంలో ఆశ్చర్యం ఏముంది?” అంది కలభాషిణి. అవకాశాన్ని వృధాపోనివ్వకుండా కలభాషిణి నారదునితో “తమరు కృష్ణుని అంతఃపురప్రవేశం చేసేటప్పుడు, శిష్యుని బయటనే నిలిపి వీణను తమరే మోసుకుపోవటం గమనించాను. స్త్రీనైన కారణంగా అంతఃపురంలోకి రావటానికి నాకేమీ అభ్యంతరం ఉండదు. ఆవీణను మోసేభాగ్యం నాకు కలిగిస్తే తమసేవలో నాజీవితాన్ని ధన్యం చేసుకుంటాను..” అని అడుగుతుంది. అందుకు నారదుడంగీకరించాడు. తరువాత మణికంధరుడు దగ్గరలేని సమయం చూచి నారదునితో “మీరు విమానం దిగినతరువాత నలకూబరుడు రంభతో ‘కళాపూర్ణుని కథ తరువాత ఏమయిందో చెప్పు’ అని అడిగాడు. అందుకు రంభ ‘ఆకథ చెప్పినా, విన్నా మనకు ప్రమాదం. అందువల్ల చెప్పను’ అంటుంది. ఆకళాపూర్ణుడెవరు? అతని కథ ఏమిటి?” అని అడుగుతుంది.
నారదునికి ఆశ్చర్యం వేసింది. కనపడనీయకుండా “ఆకథ ఎవరు చెప్పినా ప్రమాదమే. కనుక నేనూ చెప్పగూడదు.” అన్నాడు.
“కథ చెప్పకపోతే మానె. వారిద్దరిమధ్యా ఆప్రసంగం ఎందుకొచ్చిందో సెలవివ్వండి.”

“చెప్పటానికేముందమ్మా? వీళ్ళకెప్పుడూ మోహావేశమే! మేఘంచాటునుంచి వస్తున్న సూర్యుని చూచి ‘బ్రహ్మతోఉన్న శారదలాగా ఉన్న’దని పోలిక చేసింది రంభ. దానికి సంతసించి నలకూబరుడు ఆమె పెదవిని పంటనొక్కాడు. ఆప్రేమావేశానికి ఆమె ఒక చిత్రమైన మణితకూజితం చేసింది. దానితో అతని కోరిక ఇనుమడించింది. ‘ఇంతకు మున్నెన్నడూలేని ఈకూజితం మధురంగా ఉన్నది. ఎక్కడ నేర్చావు చెప్పు’ అని బలవంతం చేశాడు. అందుకు రంభ ‘అది నాకు చాలాకాలంగా తెలుసు. కాని కావాలని దాచాను’ అన్నది.  ‘ఎందుకు దాచావు?’ అని అడిగాడు నలకూబరుడు. ‘అది చెప్పాలంటే కళాపూర్ణుని కథ చెప్పవలసి ఉంటుంది. ఆకథ చెపితే మనం భూలోకంలో జన్మించవలసి వస్తుంది.’ అని రంభ వివరించింది. ఆభయంతోనే నేనుగూడా నీకు ఆకథ చెప్పలేను” అని నారదుడు వివరించాడు.

కృష్ణుని కొలువుకు వేళయిందని గరుశిష్యులిద్దరూ వెళ్ళిపోయారు. అప్పటినుంచి కలభాషిణికి నలకూబరుని మీద కోరిక తప్ప వేరే ఆలోచనలేదు. కాని అతడేమో స్వర్లోకవాసి. తాను భూలోకంలో కేవలం ఒక మానవకన్య. అతనిని కలిసే భాగ్యం లేదని బాధపడుతుందిగాని ఆశ చావలేదు.

ఈలోపల నారదుడు నిత్యమూ సంగీతశిక్షణకోసం కృష్ణుని భార్యలవద్దకు రావటము, కలభాషిణి వీణను మోసుకుని అతని వెంట వెళ్ళటము, సంగీతం నేర్చుకోవటము జరుగుతున్నవి. కృష్ణుడుగూడా నారదుని శిష్యరికం చేస్తున్నందుకు కలభాషిణిని అభినందించి తద్వారా ఆమెకు గూడా సంగీతజ్ఞానం అబ్బుతుందని ప్రోత్సహించాడు. నారదుని శిక్షణ పూర్తి అయినతరువాత వీడ్కోలు చెప్పేటప్పుడు కృష్ణుడు మణికంధరునికి గూడా సకలసంగీతసారము అబ్బేటట్లు వరమిస్తాడు. అతని దగ్గర సెలవు తీసుకుని వెళ్ళేటప్పుడు నారదునికి ఒక సందేహం కలుగుతుంది – శ్రీకృష్ణుడు, అతని భార్యలు తనకు సంగీతవిద్యలో వేరెవరూ సాటిరారని నమ్మబలికారు. అది నిజమా? లేక మోమాటానికి అన్నారా? అని శిష్యులతో అన్నాడు. అందుకు కలభాషిణి తనకు అంతఃపురప్రవేశార్హత ఉన్నదిగాని తనముందు ఈవిషయం ప్రస్తావించటానికి వారెవరూ ప్రయత్నించకపోవచ్చు. అలాకాక అంతఃపురకాంతలలో ఒకరిరూపు ధరించిపోగలిగితే వారి నిజమైన ఉద్దేశం తెలుసుకుని రాగలను అని చెపుతుంది. నారదుడు ఆవులిస్తే ప్రేవులు లెక్కపెట్టే రకంగదా! ఆమె కోరిక ఏమిటో తెలుసుకున్నాడు. అది తనపథకానికి గూడా సరిపోతుంది. అందుకే కలభాషిణికి కామరూపధారణశక్తిని ప్రసాదించాడు. ఆవిధంగా కలభాషిణి వేరు రూపం ధరించి, అంతఃపురప్రవేశం చేసి, నారదునికి సంగీతంలో ఎదురులేదన్న విషయం నిజమేనని చెపుతుంది. అందుకు సంతసించిన నారదుడు ఆమెకింకొక వరం ప్రసాదించాడు.

“కొమ్మ! మున్ను నీవాత్మలోగోరినట్టి
కాంతు రంభామనోహరాకారుడగుచు
మెరయువానిని గూడి రమింపగలవు!
నమ్ము పొమ్మిక నీ భవనమునకనియె”

కలభాషిణికి నలకూబరుని మీద మనసయిందని నారదునికి తెలుసు. దాని నాధారం చేసుకుని రంభగర్వం అణచవలెనని తన కోరిక. కాని ఆ వరం ఇవ్వటంలో ఒక చిక్కు పెట్టాడు. “రంభామనోహరాకారుడగుచు మెరయువాని గూడి రమింపగలవు” అన్నాడుగాని “రంభామనోహరునిగూడి” అని అనలేదు. అంటే కలభాషిణి నలకూబరునితో సుఖించటం నారదునికి ఇష్టంలేదు. కాని ఆసంతోషంలో కలభాషిణి ఆభేదం గమనించకుండా తనకోరిక నెరవేరబోతున్నదని సంబరపడిపోతుంది. అదీగాక నలకూబరుని రూపం ఇంకెవరికైనా ఉండటం అసంభవంగదా! కలభాషిణి సంతసించి నారదునికి కృతజ్ఞత తెలిపింది. కోరిక నెరవేరే సమయం కోసం ఎదురు చూస్తున్నది.
ఒకనాడు ఒకసిద్ధుడు సింహవాహనంతో ఆతోటలో దిగాడు. కలభాషిణి అతనికి సపర్యలు చేసిన పిమ్మట ఆసిద్ధుడు ఆమెను పేరుతో సంబోధించి కుశలప్రశ్నలు వేశాడు. ఆమె నారదునితోపాటు కృష్ణుని అంతఃపురానికి వెళ్ళటము, సంగీతవిద్య నేర్చుకోవటము, నారదుడు ఆమెకు వరమివ్వటము అన్నీ ప్రస్తావించాడు. నారదుని మాట వృధాకాదని, ఆమెకోరిక తప్పక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు.

కలభాషిణి ఆశ్చర్యపడటంతోపాటు ఆశపడిందిగూడాను. తనప్రయాణానికి కారణం అడగకుండా అతడే వివరించాడు. అతడు రోజూ మణికంధరుని వీణావాదనం విని తరిస్తుండేవాడట. కాని కొన్నాళ్ళుగా మణికంధరుడు తపసులోపడి వీణ వాయించటం లేదట. అతనితోపాటు వీణ వాయించగలశక్తి ఆమెకే ఉండటం వలన ఆమె వీణానాదం విని తరించటం కోసం వచ్చాడట! అందుకు కలభాషిణి వినయంగా నమస్కరించి “తమరు దేవుడిలా వచ్చారు. ఇంతకూ తమరెవరు? ఇన్నివిషయాలు మీకెలా తెలిశాయి?” అని అడిగింది. తనకు దూరదృష్టి, దూరశ్రవణ విద్యలుండటం వలన అన్నీ తెలుసుకోగలిగానని అతడు వివరించాడు. శిక్షణ పూర్తి అయినతరువాత నారదుడు మణికంధరునికి విష్ణుసేవలో తరించమని చెప్పటము, అతడు తీర్థయాత్రలు ముగించుకుని తపసుకుపక్రమించటము అన్నీ వివరంగా చెప్పాడు. మణికంధరుడింకా తపసులోనే ఉన్నాడా? అని అడిగింది. వారి సంభాషణలు వింటున్న చిలుక ఒకటి చెట్టుమీదనుంచి సిద్ధుడు చెపుతున్నదంతా నిజమేనని పలుకుతుంది. కలభాషిణి ‘నీకెలా తెలుసు? నువ్వెవరు?’ అని అడిగింది. తాను రోజూ నందనవనానికి భూలోకానికి తిరుగుతుంటానని, అక్కడ మణికంధరుని తపసు చెడగొట్టటానికి ఇంద్రుడు రంభను పంపించాడని చెపుతుంది. కలభాషిణి వీణానాదంతో సిద్ధుని సంతోషపెట్టి కొన్నాళ్ళు తనఆతిధ్యం స్వీకరించవలసిందిగా కోరుతుంది. అతని నుంచి ఇంకా చాలా సమాచారం తెలుసుకోవచ్చునని ఆమె కోరిక. రోజూ వీణ వినిపిస్తూ తానే స్వయంగా సపర్యలు చేస్తుంది. “రంభ మణికంధరుని తపసు చెడగొట్టగలిగిందా?” అని అడుగుతుంది. అతడు తనదూరదృష్టితో చూచి “ఇంకెక్కడి తపసు? రంభాపరిష్వంగంలో తేలుతున్నాడు” అని చెపుతాడు. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే మణికంధరుడు తపస్వి అయ్యాడని తెలిసినప్పుడుగాని, తపసు భగ్నమై రంభకు దాసుడయ్యాడని తెలిసినప్పుడుగాని ఆమె ఏవిధంగానూ విచారం వ్యక్తం చెయ్యలేదు. తాను బయట పడకుండా నలకూబరుని జాడ తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ‘రంభామణికంధరులు ఇప్పుడేస్థితిలో ఉన్నారో చూడండి’ అంటుంది. అతడు సన్యాసి గనుక రాసలీలలు చూడటానికి సందేహిస్తాడేమోనని ‘సందేహించకుండా చూడండి’ అంటుంది. అతడు తననిగ్రహశక్తిని చాటుకోవటం కోసం తానొక రాతిబొమ్మనని, తనకు చక్కిలిగింతలు లేవని చెప్పి, మణికంధరుని వైపు చూస్తాడు.
చూసి ఫక్కున నవ్వుతాడు. “నవ్వెందుకు?” అంటుంది ఆమె.

“ఏంచెప్పమంటావు? మణికంధరుడు పాపం శృంగారక్రీడలో ఉన్నప్పుడు రంభ ‘విడువిడురా నలకూబర, అలసితి’ అని పరవశంతో అన్నది.” అన్నాడు.
“దానికి నవ్వెందుకు? ఆమెకు నలకూబరునిమీద అంత మోహమేమో! ఇంతకు ఇప్పుడు నలకూబరుడెక్కడున్నాడు?” అని అడిగింది. నిజానికి ఆమెకు కావలసింది అదే. ఆవిషయం సిద్ధునికీ తెలుసు.
“నీకదే ముఖ్యంగదా! చెపుతా విను. రంభ ఇంద్రుని ఆజ్ఞతో మణికంధరుని తపసు భగ్నం చెయ్యటానికి వచ్చింది. తాను రంభకు దగ్గరగా ఉంటే రంభ తనపని సక్రమంగా నిర్వహించలేకపోవచ్చు. అది ఇంద్రునికి కోపకారణమవుతుంది. అందువలన నలకూబరుడు ఇటువంటిసమయాలలో రంభదాపులకు రాడు. దూరాన చెట్టు క్రింద కూర్చుని ఉన్నాడు.” అని చెప్పి, “నేను వచ్చి చాన్నాళ్ళయిందిగదా! పోయివస్తా” నని బయలుదేరుతున్నట్లు నటించాడు. కలభాషిణి ఏమంటుందో అతనికి తెలుసు.

అతడూహించినట్లుగానే ఆమె “ఈస్థితిలో నన్ను వదిలి వెళ్ళటం న్యాయమా? ఎలాగైనా నన్ను నలకూబరుని దగ్గరకు చేర్చి పుణ్యం కట్టుకోమని” ప్రాధేయపడింది. అందుకాతడు “అది అంత తేలిక కాదుగదా! అక్కడికి చేరటానికి కనీసం నాలుగు ఘడియల కాలం పడుతుంది. అందుకు ఈ సింహవాహనం తప్ప వేరు మార్గం లేదు. దీనిమీద నిన్ను ఎక్కించుకుని పోతే చూచిన వాళ్ళు నన్ననుమానించవచ్చు. అదీగాక నీవంటివారి స్పర్శ మాకు నిషిద్ధం. అందువలన నీకోరిక తీర్చటం నావల్లకాదు” అని నిష్కర్షగా చెప్పాడు. అందుకు కలభాషిణి “నాస్పర్శనే సహించలేనన్నావు. నామరణాన్ని సహించగలవా? అంతకన్నా నాకు గత్యంతరం లేదు. చెలులు వచ్చేలోపల ఇక్కడినుంచి వెళ్ళాలి. మారుమాటాడవద్దు” అని బలవంతం చేసింది. సిద్ధుని కోరికకూడా అదేగనుక అతడంగీకరించి ఇద్దరూ సింహవాహనం మీద గగనమార్గంలో బయలుదేరారు. దారిలో వారికి రంభసఖులు కనిపించారు.
“రంభను వదిలి ఎక్కడికి పోతున్నారు?” అని వారిని సిద్ధుడు అడిగాడు. “ఆమె తనప్రియుడు నలకూబరునితో కలిసి సరసాలలో పడింది.ఇక మేమెందుకులెమ్మని పోతున్నాము” అని చెప్పారు వాళ్ళు. అదివిని కలభాషిణి దిగులు పడింది. తనకు నలకూబరుని కలుసుకునే అవకాశం లేదని నిరాశపడింది. “దిగులెందుకు? ఇంకొంచెం సేపట్లో నీ సమస్య తీరుస్తాను చూడు” అన్నాడు సిద్ధుడు.
“అంతనమ్మకంగా ఎలాచెప్పగలవు?”
“తినబోతూ రుచి అడగటమెందుకు? చూస్తుండు” అన్నాడు సిద్ధుడు. ఇంకొంచెం దూరం వెళ్ళినతరువాత సింహవాహనం ముందుకు కదలక మొరాయించింది. ఎంత అదిలించినా అది కదలలేదు. అంతలో తనకు అప్పుడే గుర్తుకు వచ్చినట్లుగా “నేను మరచిపోయాను. ఇక్కడ మృగేంద్రవాహనాలయం ఉన్నది. ఆ దేవి అనుజ్ఞ లేకుండా సింహవాహనం నడవదు. దేవికి పూజచేసి మనం వెళ్ళవచ్చు” అని వాహనాన్ని క్రిందికి దించాడు. అది ఆలయం దగ్గరలో దిగింది. “నేను పూజాపుష్పాలు తీసుకువస్తాను. నీవు ఆలయంలో ఉండు” అని చెప్పి ఆమెనక్కడ వదిలి అతడు వెళ్ళాడు.

కలభాషిణి మృగేంద్రవాహనాలయంలోనికి ప్రవేశించింది. అక్కడ ఒక ముదుసలి కనిపించి, ఆమెను సిద్ధుడు తీసుకువచ్చాడని తెలిసి చాలా దఃఖించింది. సిద్ధుడు ఆమెను దేవికి బలియిచ్చి రాజ్యాధికారాలు పొందటానికి ప్రయత్నిస్తున్నాడనీ, వెంటనే పారిపొమ్మనీ సలహా ఇస్తుంది. కలభాషిణికి అప్పటికి సిద్ధుని కపటనాటకం తెలియవచ్చినది. కాని తాను తప్పించుకోలేనని గూడా గుర్తించింది. అతనికి దూరశ్రవణ, దూరదృష్టిశక్తులున్నవి. తనఖర్మమింతేనని వగచి కూర్చున్నది. అప్పుడుగూడా తాను నలకూబరుని మోహించటం ఎంత తప్పో గమనించలేదు.

ఇంతలో సిద్ధుడు పూజాపుష్పాలతో వచ్చాడు. పూజకు దేవిసన్నిధికి రమ్మన్నాడు. “నాకు భయంగా ఉన్నది. నీవు తోడురావా!” అని మదుసలితో అన్నది. దానితో తనరహస్యం చెప్పిందన్న అనుమానం అతనికి కలిగింది. ఆలస్యం చెయ్యకుండా కలభాషిణిని జుట్టుపట్టిలాగి బలియివ్వటానికి సిద్ధమయ్యాడు. “నీబిడ్డను, కాపాడవే!” అని వేడుకున్నది. ఆముదుసలి దయతలచి “ఆమెను బలియివ్వకు, దేవిమీద ఆన” అని తనతల అడ్డుగా పెట్టింది. సిద్ధుని కత్తివేటుకి ఆమెతలతెగింది. సిద్ధుడు తనప్రయత్నం విరమించుకోకుండా తిరిగి కత్తి ఎత్తి కలభాషిణిని చంపబోయాడు. దేవిమీది ఆన కారణంగా ఎత్తిన చేయిపట్టి అతనిని దూరంగా విసిరివేసింది.

అతనిచేతిలో కలభాషిణి కొప్పు ఉన్నది. అతనితోపాటు ఆమెకూడా దూరంగా పడింది.కత్తిపట్తిన సిద్ధుని చూచి భయంతో వణికిపోయింది. ఆవిధంగా భయకంపిత ఐన భామను చూచేసరికి సిద్ధునికి మోహావేశం కలిగింది. కత్తి పారవైచి ఆమెను కౌగిలించాడు. ఆమె ఎలుగెత్తి రక్షించమని కేకలు వేసింది. ఆకేక విన్నవెంటనే ‘ఇదేవస్తున్నా’ అంటూ నలకూబరుడు పరుగున వచ్చాడు. అతనిని చూచి సిద్ధుడు ఆమెను వదలి పారిపోయాడు. నలకూబరుడు అతనిని వెంటాడి, పట్టితెచ్చి “నీవెవరివి? ఆమె ఎవరు?” అని గద్దించి అడిగాడు. కాని అప్పటికి ఆమె అక్కడలేదు. ప్రాణం దక్కింది చాలునన్నభావంతో ఆమె పారిపోయిందని అనుకున్నారు. సిద్ధుడు భయంతో వణికి పోతున్నాడు. ఏమిచెప్పటానికీ అతనికి తోచటంలేదు. ఇంతలో అక్కడికి రంభ వచ్చి “చేతిలో ఆయుధం లేకుండా అలా రావచ్చునా?…ఎలాగైతేనేమి, ఆమెను రక్షించావుగదా! ఇక ఇతడితో పనేమిటి? సిద్ధుడిలాగున్నాడు. వదిలెయ్” అని అతనిని లాగుకుని వెళ్ళింది. నిజానికి ఆమె రంభకాదు. కలభాషిణి. నలకూబరుడు పొదరింటినుంచి బయటికి రాగానే అతని వెంట రంభకూడా రావాలని చూచింది. కాని ఆమెకు అపశకునం తగలటంతొ ఆగిపోయింది. కలభాషిణి అది కనిపెట్టి, నారదుని వరం కారణంగా రంభరూపం దాల్చి అతనిని సమీపించింది. సిద్ధునితో తగవు పెట్టుకుని కాలయాపన చెయ్యటం ఇష్టం లేక తొందరచేసి అతనిని తీసుకుపోయింది. పొదరింటచేరి సల్లాపాలు మొదలుపెట్టింది. ఆమెతోపోతూ నలకూబరుడు సిద్ధుని కత్తిని చేతబట్టుకు పోయాడు. అది మహిమాన్వితమైన బహుమానం. దానిని పోగొట్టుకోవటం అతనికి ఇష్టం లేదు. దానిని చేజిక్కించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ అతడక్కడే నిలిచాడు. కలభాషిణి ఏమై పోయిందన్న సమస్య అతనికీ తీరలేదు. తాను కోరి తెచ్చిన భామ, ఏమైపోయి ఉంటుంది? అతని దూరదృష్టికి గూడా ఆమెజాడ తెలియలేదు.

అతడావిధంగా సందిగ్ధంలో ఉండగా అక్కడికి ఇంకొకస్త్రీ వచ్చింది అచ్చం రంభలాగే ఉన్నది. రంభ నలకూబరునితో పొదరింట్లో ఉన్నది. మరి ఈమె ఎవరు? నలకూబరుడామెను చూచి బయటికి వచ్చి ఆశ్చర్యపడ్డాడు. తనరంభలాగానే ఉన్నది. ఇద్దరినీ తరచి తరచి చూచాడు. ఏమీభేదం కనిపించలేదు. అసలువారెవరో, ప్రతిబింబమెవరో తెలియక అయోమయంలో పడ్డాడు. కలభాషిణి రూపం మారిందిగాని మనసు మారలేదుగదా! ప్రమాదం గుర్తించి అతనిని కౌగిలించి “వెనుకటికి రాముడిని సీతనుంచి వేరు చెయ్యటానికి ఒక రాక్షసి ఇలాగే మారురూపంలో వచ్చిందని విన్నాము. ఇప్పుడు మనలను వేరుచెయ్యటానికే ఈమాయలాడి వచ్చింది. నిన్ను విడువలేను. వెళదాం, పద” మని తొందరచేసింది. నలకూబరుడు రెండవ రంభను చూచి “నీవెవరవు? నారంభరూపం నీకెలావచ్చింది?” అని అడిగాడు. “మనం పొదరింట ఉన్నప్పుడు ఒకస్త్రీ ఆక్రందన విని నీవు వెంటనే లేచి వచ్చావు. నీవెంటనేనుగూడా రావాలని ప్రయత్నించాను. కాని ఒక అపశకునం కారణంగా ఆగిపోయాను. ఆసమయం చూచి ఈమాయలాడి నారూపం ధరించి నిన్ను చేరింది” అని వివరించింది.

అందుకు (మొదటి) మాయారంభ “ఇది యెవతెయో మనల చేష్టలు కనిపెట్టి నీకోసం పన్నాగం పన్ని వచ్చింది. ఇది మగువగాదు, పెనుగదర. దీనినుంచి దూరంగా ఉండటమే మంచిది.” అని అతనిని లాగటం మొదలుపెట్టింది. “ఎక్కడికి పోతావు? నిజం తేల్చకుండా తప్పించుకు పోదామనుకున్నావా? నాప్రాణనాధుని అంతతేలికగా నీకు అప్పగిస్తాననుకున్నావా?” అని రెండవ రంభ కయ్యానికి దిగింది. ఇద్దరూ తిట్లు, ఒట్లు మొదలుపెట్టారు. ఇంతలో అక్కడికి వచ్చాడు కలహభోజనుడు. అతనికి కావలసినంత సంతోషము, తృప్తి! ఇదంతా తనమాట మూలాననేనని అతనికి తెలుసు. అతనిని చూడగానే నలకూబరుడతనికి నమస్కరించాడు. “నలకూబరా! ఈయిద్దరిలో నీరంభయెవరో చెప్పు. త్వరగా దీవించి వెళతాను…అనర్హులను దీవించటం తగదుగదా!” అన్నాడు నారదుడు. ‘అదే తెలియటంలేదని’ మొరపెట్టుకున్నాడు నలకూబరుడు. నారదుడది పట్టించుకోకుండా “తనకన్నా అందగత్తెలెవరూలేరని విర్రవీగుతున్న రంభకు బుద్ధి చెప్పటానికి నీవే ఇంకొకరంభను సృష్టించావా? లేక నీతో అనుభవించటానికి ఒకశరీరం చాలక తానే ఇంకొకదానిని రంభ సృష్టించినదా?” అన్నాడు. “మహాత్మా! ద్వారకను సందర్శించినప్పుడు తమరాడిన మాటఫలితమే ఇదంతా!” అన్నది రెండవ రంభ. “అవును మునీంద్రా! మీదీవెన ఫలితమే ఇదంతా!” అన్నది మొదటి రంభకూడా. “ఇద్దరూ నిజమే చెప్పారు. నామాటలు గుర్తున్నవిగదా!” అని నవ్వాడు నారదుడు.
నలకూబరుడు “మహాత్మా! ఈయిద్దరిలో తథ్యమెవరో, మిధ్య ఎవరో తెలపండి” అని వేడుకున్నాడు.

“తథ్యమిధ్యా బాధలు నీకెందుకయ్యా! నీవుమాత్రం తథ్యమా? ఒకరిని చూపి ఒకరిని కట్టడి చెయ్యవచ్చు. నీపంట పండిందిలే!” అని నవ్వి వెళ్ళిపోయాడు నారదుడు. దానితో నారదునికి నిజం తెలిసినట్లు గ్రహించాడు నలకూబరుడు. నిజానికి అతడు ఆరూపంలో ఉన్న మణికంధరుడు. నారదుడు తనగురువు. అతనికి నిజం తెలియకపోదు. కాని తనకేదైనా దారిచూపుతాడేమోనన్న ఆశతో అడిగాడు. నారదుడంత తేలికగా లొంగుతాడా?

“మేమేకాంతంలో ఉండగా రావటానికి సిగ్గులేదూ? నీకేదైనా సాక్ష్యముంటే తీసుకురా! అంతవరకూ ఇటుచూడకు” అని మొదటిరంభ రెండవ రంభను రెట్టించింది. అందుకు రెండవ రంభ “సాక్ష్యాలు ఇక్కడకాదు. ఇంద్రసభకురా! అక్కడ ఎవరు నిజమో తేలుతుంది” అన్నది. కలభాషిణికి గొంతులో పచ్చివెలక్కాయపడినట్లయింది. ఆమె స్వర్గానికి ఎలాగూ వెళ్ళలేదు. అందుకు తగిన వంక కనిపెట్టాలి. “సాటిలేని అందగత్తెనని అప్సరసలందరిలో మన్ననలందుకుంటున్నదానిని. ఇప్పుడు నాకు పోటీ వచ్చిందని అందరిలో చెప్పుకోవటం నాకు సిగ్గుచేటు. ఇప్పటికి కాదుగదా, ఎప్పటికీ భూలోకం వదలి రాను.” అని ప్రకటించింది.

రెండవరంభకు అవకాశం చిక్కింది.”చూచితిరా! ఇదిరంభగాదు, మాయలాడి. గగనవిహారశక్తి దీనికి లేదు. అందుకే ఎప్పటికీ స్వర్గానికి రానంటున్నది.” అని తేల్చి చెప్పింది. నలకూబరునికి నమ్మక తప్పలేదు. మొదటిరంభను గెంటివేశాడు. రెందవరంభ (నిజరంభ) కోపంపట్టలేక   “ఖడ్గాఘాతంతో మరణిస్తా”వని శపించింది. నలకూబరుడుగూడా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటం కోసం “నీపేరేమిటి? ఎక్కడిదానవు?” అని ప్రశ్నించాడు. దానితో కలభాషిణి పారిపోయింది. ఆమె తానుతెచ్చిన కలభాషిణియేనన్న విషయం చూస్తున్న మణిస్తంభునికి తెలియదు.

అందువలనకలభాషిణి ఏమైపోయిందోనని ఆదుర్దా పడ్డాడుగాని రంభను పట్టించుకోలేదు. ఆమె తన నిజరూపం ధరించి తిరిగి మృగేంద్రవాహనాలయానికి చేరింది. అంతకుతప్ప ఆమెకు తెలిసిన ప్రదేశమేదీలేదు.తరువాత కొంతసేపటికి మణికంధరుడక్కడికి వచ్చాడు. అతనిని చూసి ఆమె, ఆమెనుచూచి అతడు ఆశ్చర్యంలో పడ్డారు. ఇద్దరూ   చాలాకాలం తరువాత కలుసుకోవటం జరిగింది. కలుసుకున్నందుకు సంతోషంగానే ఉంది. కాని అక్కడికి ఎవరెలా వచ్చారో తెలియదు. వారిద్దరూ ఆశ్చర్యంలోనే ఉండగా మణిస్తంభుడు గూడా అక్కడికి చేరాడు. వచ్చి తాను చూచిన వింతలను వల్లించటం ప్రారంభించాడు. తాను చూచిన విషయాలను బయటికి చెప్పేవరకు అతనికి మనసు నిలవటం లేదు. అవి అంత ఆశ్చర్యాన్ని కలిగించినవి. మొదట మాయారంభ విషయం చెప్పాడు. అంతవరకు కలభాషిణికి గూడా తెలుసు. తరువాత జరిగిన మాయానలకూబరుని విషయం కూడా చెప్పాడు. మొదటి నలకూబరుడు మాయగాడని, తరువాత వచ్చిన నలకూబరుడు నిజమైన వాడని చెపుతాడు. దానితో కలభాషిణి కలత చెందుతుంది. అంతవరకూ తాను రమించినది నలకూబరునితోనేననుకుంటున్నది. కాని అతడు నిజమైన నలకూబరుడు కాడని తెలిసి ఇందులోకూడా తాను మోసపోయానని తెలుసుకున్నది. తన మానాన్ని ఎవరో అపరిచితుడు దొంగిలించినట్లుగా బాధపడటం మొదలు పెట్టింది. ఆమొదటి మాయారంభను తానేనని అందరిముందూ ఒప్పుకున్నది.  ఆమె చెప్పకపోతే ఆవిషయం అక్కడున్నవారెవరికీ తెలిసే అవకాశం లేదు.  కాని ఆమె ఆవిషయం దాచటానికి ప్రయత్నించలేదు. అందుకు ముఖ్య కారణం ఆమె నిస్పృహలో ఉండటమే! మోసపోయి సిద్ధుని చేతికి చిక్కింది. ఇప్పుడు మరొకసారి మోసపోయి తన శీలాన్ని అపరిచితునికి పణంగా పెట్టవలసి వచ్చింది. ఏకోరికా తీరలేదు.

అంతలో ఆమాయానలకూబరుడు తానేనని మణికంధరుడు వివరిస్తాడు. ఆమెకు ఆశ్చర్యం కలిగిన మాటనిజమే! అంతకన్నా కొంత ఊరట కలిగింది. తాను రమించినది అపరిచితునితోకాదు. తనకు తెలిసిన, తాను అభిమానించే మణికంధరుడే! అతడే తనస్థితిని వివరించాడు.”నేను రంభనాశించి పొందినది నీవయ్యావు. నీవు నలకూబరునాశించి పొందినది నేనయ్యాను. మనం సంగీతం నేర్చుకున్న రోజులలో నాకు నీమీద మనసైన మాట నిజమే! కాని ఎవరికీ తెలియగూడదని మనసు దాచుకున్నాను. అదృష్టం కొలది నిన్నేపొందగలిగాను.” అన్నాడు.

దానికి కలభాషిణికూడా సంతసించింది. “నాకుగూడా నీపైన మనసున్న మాట నిజమే! కాని నీకు తగినదానను కానని మనసు చంపుకున్నాను. నారదునికి తెలిస్తే శపిస్తాడేమోనని భయపడ్డాను. నలకూబరునికి నీపోలికలున్న కారణంగా నామనసుని అతనిపైన లగ్నం చేశాను. ఏదుర్ముహూర్తాన నలకూబరుని చూచానో ఇన్ని కష్టాలు పడవలసి వచ్చింది. చివరికి నీపొందు దొరికినా అది నీవని తెలియని అభాగ్యురాలనయ్యాను. నీసాంగత్యం దొరికిందన్న సంతోషం కూడా అనుభవించలేకపోయాను. ఇప్పుడామాటలెవరూ నమ్మరు. నేనొక వేశ్యనుగదా! అందులోనూ నలకూబరుని మోహించానని అందరికీ తెలుసు. నీపైన నాప్రేమకు నామనసే సాక్షి” అని వాపోతుంది. అందుకు మణికంధరుడు ఆమెను ఎంతగానో ఓదార్చటానికి ప్రయత్నించాడు. నారదుడిచ్చిన వరం గుర్తు చేశాడు. ‘అతడు నీవు నలకూబరుని గూడెదవని చెప్పలేదు. నీవుకోరినవానిని, నలకూబరాకారుడైన వానిని పొందుతావని చెప్పాడు. మునివాక్యం పొల్లుపోదుగదా! అందువలన నీవు నన్నుకోరుతున్నావన్నమాట నమ్మదగినదేగాని అనృతం కాబోదు.’ అనిచెప్పి శృంగారభావంలో వివిధరీతులుంటయ్యని ఋజువు చెయ్యటంకోసం ఆమెకు సుగాత్రీశాలీనుల కథ చెపుతాడు.

అంతా ఐన తరువాత తనకు తగిలిన శాపవిషయం ప్రస్తావించి, తాను కత్తివేటుతో చావవలసి ఉన్నదని, మణిస్తంభుని కత్తి నాపైన ఎత్తి ఉండటం వలన అది నన్ను ఎప్పుడైనా వధించక తప్పదనీ, అందువలన మణిస్తంభుడు తనను దేవికి బలియిచ్చి తానుకోరిన వరం పొందటం ఉత్తమమని సూచిస్తుంది. అందుకు మణిస్తంభుడు అది దేవియాననతిక్రమించినట్లవుతుందని, అందువలన తానాపని చెయ్యలేనని చెపుతాడు. తరువాత మణికంధరునికి నలకూబరుడిచ్చిన శాపం కారణంగా అతడు అచిరకాలంలోనే మరణించక తప్పదు. అందువలన మణికంధరుడే ఈపని చేసి ముక్తి పొందటం భావ్యంగా ఉంటుందని మణిస్తంభుడు సూచించాడు. అకారణంగా మరణించటం కంటే తనను ఆకత్తితో దేవికి బలియిచ్చి రాజ్యసంపదలను పొందవచ్చునని సూచిస్తుంది కలభాషిణి. అందుకు మణికంధరుడు అంగీకరించిన తరువాత కలభాషిణి మనసు దిటవు చేసుకున్నది. ఆత్మత్యాగంతో తనను రక్షించిన సుముఖాసత్తికి – అప్పటికి ఆమె సుగాత్రియని తెలిసింది – మణిస్తంభుడైన శాలీనునికి నమస్కరించింది. ఆమె పాతివ్రత్యాన్ని కొనియాడి అటువంటి పాతివ్రత్యాన్ని తన మరుజన్మలో తనకు ప్రాప్తించేటట్లు వరమడిగింది. అందుకు సుగాత్రి గూడా ‘మీయిద్దరూ ఎప్పటికీ మమ్ములను మరచిపోరని’ చెపుతుంది. స్థిరమైన మనసుతో దేవికి అభిముఖంగా కూర్చుని మణికంధరుని తనపని కానిమ్మని ప్రోత్సహించింది. మణిస్తంభుడిచ్చిన కరవాలంతో మణికంధరుడు ఆమెను ఖండించాడు. అంతలోనే ఆమె దేహం అక్కడినుంచి మాయమయింది. దేవి ప్రత్యక్షమై స్థిరచిత్తంతో తనముందు బలియైన కారణంగా కలభాషిణికి తిరిగి జన్మనిచ్చినట్లు చెపుతుంది. మణిస్తంభుడు బలియివ్వటానికి కొంత సందేహించిన కారణంగా అతనికి వెంటనేకాక మరుజన్మలోనే రాజ్యప్రాప్తి కలుగుతుందని, జన్మతః యవ్వనం కూడా కలుగుతుందని చెపుతుంది. దానితో ఈకావ్యంలో కలభాషిణికథ ముగుస్తుంది. మరుజన్మలో ఆమె మధురలాలసగా జన్మించిందని చెప్పారుగాని, కలభాషిణిగా ఆమె జీవితం ఏవిధంగా ముగిసిందో వివరించలేదు.

తనకు మొదటినుంచి మణికంధరుని పైననే ప్రేమ ఉన్నదని, అందువలన ఇప్పుడు జరిగిన దానికి సంతోషమేగాని విచారం లేదని చెపుతుంది. అది ఎంతవరకు నిజమనేది ప్రశ్న. నలకూబరుని మీద ప్రేమ ప్రత్యక్షంగా కనపడుతున్నది. దానికివేరే సాక్ష్యాలేమీ అక్కరలేదు.  కాని అది అసలు నిజమైన ప్రాథమిక ప్రేమ కాదనీ, మణికంధరుని పైన కలిగిన ప్రేమను అణచి, దానిని నలకూబరునిద్వారా పొందటానికి ప్రయత్నించినట్లు చెప్పబడుతున్నది. అటువంటి మానసిక స్థితి సంభవమే ననటానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి మానసిక శాస్త్రవేత్తల ఉదాహరణలు గూడా విమర్శకులు చూపించారు. కట్టమంచి రామలింగారెడ్డిగారు, గురువర్యులు జి.వి.కృష్ణరావు గారు ఆసిద్ధాంతాన్నే బలపరిచారు. తద్వారా అదొక విధమైన శృంగారభావనగా అంగీకరించారు. ఆవిధంగా ఆమె ప్రవర్తనను సమర్థించకపోతే ఆమెను అబద్ధం చెప్పినట్లుగా తప్పుపట్టవలసి వస్తుంది. ఒక వ్యక్తికి ఒకేసారి ఇద్దరిపైన ప్రేమ ఉండటం సమంజసమేనని, సంభవమే నని అంగీకరించారు. అలా చెప్పకపోతే ఆపాత్రకు అన్యాయం చేసినట్లవుతుందని వారు భావించి ఉండవచ్చు. లేక కవి సూరన పాత్రచిత్రణలో లోపం ఉన్నట్లవుతుందని, అది ఇష్టం లేక సమర్థించటానికి ప్రయత్నించి ఉండవచ్చు. కాని కలభాషిణి పాత్రను తప్పు పట్టకుండా ఆమె ప్రవర్తనను వివరించగలిగితే ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన పనిలేదు.

ఆవిధంగా చెయ్యాలంటే ప్రేమకు సుహృద్భావానికి భేదం గమనించవలసి ఉంటుంది. ఒక వ్యక్తిపైన సద్భావం ఏర్పడినంత మాత్రాన అది ప్రేమ అనుకోవటానికి వీలు లేదు. ఆరెంటికీ చాలా వ్యత్యాసం ఉన్నది. ఆభేదాన్ని గమనించకపోవటం వల్ల కలిగే అనర్థాలను ఇప్పటి యువతరం లో గూడా చూస్తున్నాము. ఒక వ్యక్తి స్నేహంగా ఉన్నంత మాత్రాన ప్రేమించుకుందామనో, పెళ్ళిచేసుకుందామనో తొందర పడటము, అది నెరవేరకపోతే హింసకు దిగటము జరుగుతున్నది. కలభాషిణి ఆతప్పు చెయ్యలేదని అంగీకరిస్తే ఆమె స్వభావానికి ఏవిధమైన లోటూ రాదు. మణికంధరుని ప్రేమించటంగాక అతని పైన ఆమెకు సద్భావం మాత్రమే ఉన్నదని, తరువాత అనుకోకుండా అతనితో రమించటం జరిగిందిగనుక, అందుకు బాధపడకుండా సరిపుచ్చుకున్నదని ఎందుకనుకోగూడదు? ఆమె నలకూబరుని కోరటం తప్పని ఎవరూ అనలేదు. కాని ప్రేమ మణికంధరుని మీద ఉన్నప్పుడు నలకూబరుని కోరటం తప్పని ఎవరైనా అనగలరు. దానిని సమర్థించటం కోసం ఆమె తనప్రేమను అచేతనస్థితికి అణచివేసిందని, అందుకు ప్రత్యామ్నాయంగా మనసుని నలకూబరుని మీదికి మళ్ళించిందనీ చెప్పవలసిన అవసరం లేదు. ఆమెకు మణికంధరుని పైన ప్రేమలేదు. నలకూబరుని చూచినతరువాతనే ఆమెకు ప్రేమావేశం కలిగింది. అంత బలమైన కోరిక అంతకుముందు ఆమెకు ఎవరితోను కలగలేదు. నలకూబరుని కోసం తపించింది. “అతనిని పొందిన రంభ ఎంత అదృష్టవంతురాలో”నని ఈర్ష్య పడింది.

మరి నారదుని మాటేమిటి? “మున్ను నీవాత్మలోగోరినట్టి కాంతుని” పొందగలవని ఆశీర్వదించాడు.  ఆమె కోరినది ఎవరినని అతని ఉద్దేశము? కలభాషిణి మాత్రం అది నలకూబరుని గురించేనని ఆశించింది. ఆమె మనసులో మణికంధరుని మీద కోరిక ఉన్నదని నారదుడు గ్రహించాడా? లేక ఊహించాడా? అతడెప్పుడూ వారిని వారించినట్లుగాని, ప్రోత్సహించినట్లుగాని కవి చెప్పలేదు. పైగా ఆమె రంభకు సవతి కావచ్చునని గూడా ఆశపెట్టాడు. కాని అతని మాట వమ్మయింది. కలభాషిణి రంభకు సవతి కాలేదు. రంభరూపం మాత్రందాల్చింది. మాయానలకూబరునికి సతి అయింది. నలకూబరునికి కాలేదు. రంభగర్వభంగమే నారదుని కోరిక. అందుకు కలభాషిణిని పావుగా వాడుకున్నాడు. కామరూపధారణకు కలభాషిణికి వరమిచ్చాడు. కాని మణికంధరునికి ఇవ్వలేదు. మణికంధరునికి కామరూపధారణశక్తి తపస్సుతరువాతనే వచ్చింది. తపశ్సక్తిని ధారబోసి నలకూబరరూపం ధరించాడు. కలభాషిణిని కలవబోయే రంభామనోహరాకారు డెవరనేది నారదునికనవసరం. ఆమె తన మనసులో నలకూబరునితో పొందు కోరుతున్నదన్న మాట నిజం. చివరికి కలభాషిణితో కలిసిన రంభామనోహరాకారుడు మణికంధరుడయ్యాడు. అందువలన నారదుని దృష్టిలో కలభాషిణికి అతనిపైన అంతకుముందునుంచి ప్రేమ ఉన్నట్లు వివరించబడుతున్నది.    ఆవిధంగా చెప్పకపోతే నారదుని మాట పొల్లుపోయినట్లవుతుంది. అంతకు మించి వారిద్దరి ప్రేమకు వేరే ఆధారం లేదు. నారదుని ప్రతిమాటా నిజం కావాలంటే, కలభాషిణి రంభకు సవతి ఎందుకు కాలేదు? ఆమె నలకూబరునితో కలిసినప్పుడే ఆమె రంభకు సవతి అయిందని అనుకోవాలి. ఆమె మణికంధరునితో కలిసిందిగాని నలకూబరునితో కలవలేదు. నారదుని మాట తప్పినట్లేనా? అలాకాక నారదుడు తనమాటలలో ప్రతిదీ నిజం కావాలని అనుకోడని, అతడావిధంగా కోరుకున్నవే నిజమవుతవని వివరించవచ్చు.

అందువలన అతడు చెప్పినా కలభాషిణి రంభకు సవతి కాలేదు. అలాగే నారదుడు కలభాషిణికిచ్చిన ఆశీర్వాదం ఆధారంగా కలభాషిణి ‘మున్నుకోరుకున్న ప్రియుడు’ మణికంధరుడే ననటానికి ఆస్కారం లేదు. నలకూబరాకారుడైన వాడొకడు రావటం నారదునికి ముఖ్యం. అలాగే రంభరూపంలో ఒకరు రావటం అంతకన్నా ముఖ్యం. అందుకు కలభాషిణి పనికి వచ్చింది. నలకూబరాకారుడెవరనేది నారదునికి అనవసరం. సందర్భాన్నిబట్టి ఎవరైనా కావచ్చు. అది మణికంధరుడయ్యాడు. అది యాదృచ్చికమే! అందువలన అంతా ఐన తరువాత మణికంధరుడు, కలభాషిణి పరస్పర ప్రేమానురాగాలు ప్రదర్శించుకోవటం ఒకరినొకరు ఓదార్చుకోవటానికేగాని వారి మధ్య అంతకు ముందు నిజంగా ప్రేమ ఉన్నదనటానికి అవసరంగాని, అవకాశంగాని లేవు.

మణికంధరుడు తపసుకుపక్రమించాడని తెలిసినప్పుడుగాని, అతని తపసు రంభకారణంగా భగ్నమయిందని తెలిసినప్పుడుగాని కలభాషిణికి కించిత్తుగూడా చింత కలుగలేదు. మణికంధరునిమీద ఆమెకు ఏమాత్రమైనా సానుభూతి ఉన్నా, కోరిక ఉన్నా ఆమె ప్రతిచర్య అందుకు భిన్నంగా ఉండేది. ఆమె కేవలం నలకూబరుని మాత్రమే తన దృష్టిలో పెట్టుకున్నది. అది మణికంధరుని మీది మనసుని మళ్ళించటం వలన కాదు. ఒకవేళ ఆమెకు నిజంగానే మణికంధరునిమీద ప్రేమకలిగి, అతడు తనకు అందడన్న ఉద్దేశంతో వేరొకరి మీదికి మనసును మళ్ళించుకున్నదంటే అతడు మణికంధరునికన్నా దగ్గరైనవాడు, సానుకూలమైనవాడు కావాలి. కాని నలకూబరుడు అటువంటి స్థితిలో లేడు. మణికంధరునికన్నా దూరంగా, దుర్లభంగా ఉన్నాడు. అందువలన మణికంధరుని మరచిపోవటానికి కలభాషిణి నలకూబరుని మీదికి మనసు మళ్ళించిందనటం సమంజసంగాలేదు. కలభాషిణి వేశ్య కనుక ఎవరిమీదనైనా మనసుపడుతుందని విమర్శించటానికి గూడా వీలు లేదు. నిజంగా వేశ్యాస్వభావమే ఐతే సుమతిశతక కారుడు చెప్పినట్లుగా రొక్కానికే లొంగాలి.

క.  కొక్కోకమెల్ల చదివిన
చక్కనివాడైన రాజచంద్రుండైనన్
మిక్కిలి రొక్కమునీయక
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ!
అన్నాడు శతకకారుడు. కలభాషిణి నలకూబరుని అందంచూసి అతనిని కోరిందిగాని సంపదలు చూచికాదు..

ఆమె అసలు మనసుపడినదే నలకూబరుని మీద. అదే ఆమె తరువాతి ప్రవర్తనను శాసించింది. అంతా ఐన తరువాత తనకు లభించినది నలకూబరుడు కాదని తెలిసినప్పుడు మోసపోయానని చింతించింది. తనతో సుఖించిన వాడు మణికంధరుడని తెలిసినప్పుడు కొంత ఉపశమనం పొందింది. అతడపరిచితుడు కాదు. మణిస్తంభునివంటి కౄరుడు కాదు. సహృదయుడే. సహాధ్యాయి కూడాను. అదే కొంత తృప్తి. జరిగిపోయిన దానికి అంతకన్నా చేసేదేమున్నది? అది తప్పని ఎవరనగలరు? కాని దానిని సమర్థించటం కోసం ఆమెకు ఇద్దరిమీదా ప్రేమ ఉన్నదని సిద్ధాంతీకరించ వలసిన అవసరం లేదు. దానిని సమర్థించవలసిన అవసరమూ లేదు.

You Might Also Like

Leave a Reply