యు.ఆర్.అనంతమూర్తి

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు
(ఈ వ్యాసం మొదట చినవీరభద్రుడు గారు ఫేస్బుక్ లో ప్రచురించారు. తిరిగి పుస్తకం.నెట్ లో వేసుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

*****
ఆగష్టు 31, ఆదివారం సాయంకాలం విశ్వనాథ సాహిత్యపీఠం తరపున వెల్చాల కొండలరావుగారు, రావెల సోమయ్యగారు యు.ఆర్. అనంతమూర్తికి శ్రద్ధాంజలి సభ ఏర్పాటు చేసారు. బి.నరసింగరావు, మృణాళిని, సుజాతా పట్వారీ, ఆదిత్య వంటి మిత్రులతో పాటు నేను కూడా అనంతమూర్తి గురించి కొన్ని ఆలోచనలు అక్కడ పంచుకున్నాను.

ఉడుపి రాజగోపాలాచార్య అనంతమూర్తి (1932-2014) ఇరవయ్యవ శతాబ్ది ఉత్తరార్థంలో భారతీయ సాహిత్య ప్రపంచంలో అగ్రశ్రేణి సాహితీకారుడిగా గుర్తింపు పొందాడు. ఆయన 1965 లో రాసిన సంస్కార నవలని 1970 లో పఠాభి తెరకెక్కించడం, ఆ సినిమాకు అవార్డులతో పాటు సంచలనాలు కూడా సొంతం చేసుకోవడంతో అనంతమూర్తికీ, నవ్య కన్నడ సాహిత్యానికీ దేశంలోనే కాక ప్రపంచంలో కూడా ప్రశస్తి రావడం మొదలయ్యింది.

అనంతమూర్తి 6 నవలలూ, 42 కథలూ, ఒక నాటకం, 5 కవితాసంపుటాలు వెలువరించినప్పటికీ, ఆయన విలువ ఆయన వ్యాసాల్లోనూ, తన చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఆయన మనముందుంచుతూ వచ్చిన అంతర్దృష్టిలోనూ ఉందనుకుంటాను.

స్వాతంత్ర్యానంతర భారతదేశ పరిణామాల్ని అర్థం చేసుకోవడంలో, భారతీయ సమాజంలో సంభవిస్తున్న పరివర్తనను అవగాహనకు తెచ్చుకోవడంలో మనమంతా కూడా ఒక గందరగోళానికి లోనవుతూ వున్నాం. మనముందు సిద్ధాంతాలకీ, వాదాలకీ కొరతలేదు గానీ, ఏ ఒక్క వాదమూ మనని సంతృప్తి పరచలేకపోవడమే మన సమస్య. అటువంటి పరిస్థితినే అనంతమూర్తి కూడా అనుభవించాడు. ఆ అగమ్య స్థితిలోంచి ఆయన తనకై తాను ఆలోచించుకున్న కొన్ని భావనలూ, వాటినుంచి మనకోసం చేసిపెట్టిన కొన్ని సూత్రీకరణలూ చాలా విలువైనవిగానూ, స్పష్టతనిచ్చేవిగానూ కనిపిస్తాయి.

U.R.Anantamurti Obmnibus (అర్వింద్ కుమార్, 2007) పేరిట ఎన్.మనూ చక్రవర్తి సంకలనం చేసిన పుస్తకంలో ఎనిమిది వ్యాసాలున్నాయి. తక్కిన అనంతమూర్తి సాహిత్యమంతా వినష్టమైనా, ఆ ఎనిమిది వ్యాసాలూ చాలు, ఆయన సమకాలిక భారతీయచింతనకు అందించిన ఉపాదానం విలువైందని చెప్పడానికి. నేనా సాయంకాలం ప్రధానంగా ఆ వ్యాసాల మీంచే మాట్లాడేను. వాటిలో ఒకటి రెండు ఇక్కడ మీ ముందుంచుతాను.

అనంతమూర్తి పశ్చిమకర్ణాటకకు చెందిన మధ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినవాడు. మాధ్వ బ్రాహ్మణ కుటుంబాల్లో ఆచారాలు కాలక్రమంలో ఎట్లా సంకుచితంగానూ, అమానుషంగానూ మారిపోయాయో ఆయన తన సాహిత్యమంతటా ఎత్తిచూపుతూ విమర్శిస్తూ వచ్చాడు. కాని ఒక చింతనావైఖరిగా ఆయనలో మాధ్వం బలంగా మిగిలి ఉండటమే కాక ఆయన్ను చివరిదాకా నడిపించిందనే నాకనిపించింది.

మధ్వ మతం ప్రధానంగా ద్వైతం. బ్రహ్మ సత్యమ్, జగన్మిథ్య అనే అద్వైత సూత్రాన్ని ఖండిస్తూ సత్యమ్ జగత్ అని చెప్పడానికి సాహసించిన మతం. బాహ్యప్రపంచం యథార్థంగా ఉందనే ఆ ఎరుక వెనుక, క్రైస్తవం,ఇస్లాం ప్రభావాలున్నాయని కూడా అంటారు. కాని గమనించవలసిందేమిటంటే, ప్రపంచం అసత్యం అనేవాళ్ళున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రపంచం సత్యం అని చెప్పడం,అలా చెప్పవలసిన అవసరముందని గుర్తించడం. అనంతమూర్తి ఆలోచనా ధారని నిశితంగా చూసినప్పుడు ఆయన తన జీవితమంతా ఈ వైఖరినే అనుసరించాడని అర్థమవుతుంది.

మొదట, ఆయన ఒక ద్వంద్వాన్ని చూస్తాడు. (నేను ఈ మాట అన్నప్పుడు నా తరువాత మాట్లాడిన ఒక వక్త, ప్రపంచంలో ద్వైతమంటూ లేదనీ, సంభావ్యతలు అనేకమనీ, కేవలం తార్కికసౌలభ్యం కోసం మాత్రమే మనం ద్వైతాన్ని ప్రతిపాదిస్తామనీ అన్నాడు. కాని ఆయన ప్రతిపాదిస్తున్నది బహుళతావాదమనీ, అనేకాంతవాదమనీ, దాన్ని ఒకప్పుడు జైనులూ, ఇప్పుడు పోస్ట్ మోడర్న్ తత్త్వవేత్తలూ మాట్లాడుతున్నారనీ ఆయనకి తెలియదు.) ప్రపంచంలో ఒక ద్వైతాన్ని, లేదా ద్వంద్వాన్ని చూసిన తరువాత అనంతమూర్తి అందులో రెండు వర్గాల వారితోనూ మాట్లాడటానికి చొరవచేసి ఒకరిముందు మరొకరి ఆలోచనని కూడా ప్రస్తావిస్తాడు. ఉదాహరణకి, సంప్రదాయం, ఆధునికత అనే రెండు దృక్పథాలున్నాయనుకోండి, అందులో సంప్రదాయవాదులు ఆధునికతనీ, ఆధునికులు సంప్రదాయాన్నీ వ్యతిరేకించడం సహజమే. కాని అనంతమూర్తి ఆధునికులతో సంప్రదాయం గురించీ, సంప్రదాయవాదుల్తో ఆధునికత గురించీ మాట్లాడతాడు. ఇరువర్గాలవారూ తమ తమ దృక్పథాల్లో ఎంత సంకుచితంగా ఉన్నారో ఎత్తిచూపుతాడు. తమ self లో కూరుకుపోయినవాళ్ళకి other అంటూ ఒకటుందనీ, ఆ ఇతరాన్ని తెలుసుకోవలసిన, అర్థం చేసుకోవలసిన, దానికింత చోటు ఇవ్వవలసిన అవసరముందనీ వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.

ఒక రకంగా ఇది గాంధీవైఖరి. భారత జాతీయోద్యమం అతివాదులు, మితవాదులు అనే రెండువర్గాలుగా చీలిపోయినప్పుడు గాంధీ అతివాదుల్లో మితవాదిగా, మితవాదుల్లో అతివాదిగా మసిలాడు. అలా చెయ్యడం వల్ల ఆ రెడువర్గాలవాళ్ళనీ ఒకేతాటిమీద నడిపించడమే కాకుండా ఒక ద్వంద్వాన్ని ఆయన మిథునంగా మార్చగలిగాడు.

ద్వంద్వం మిథునంగా మారినప్పుడు ఆలోచన సృజనశీలమవుతుంది, సృష్టికారకమవుతుంది. ఈ సంగతి ప్రాచీన గ్రీకు తాత్త్వికులకి తెలుసు. దాన్ని వాళ్ళు డయలెక్టిక్ అన్నారు. అనంతమూర్తి ముందొక ద్వంద్వాన్ని ఎత్తిచూపుతాడు. అది ప్రాచీనకాలంనుంచీ భారతీయ చింతనలో ప్రచలితంగా ఉన్న ఏదో ఒక ద్వంద్వభావన , వైదిక-శ్రమణ, మార్గ-దేశి, స్థావర-జంగమ వంటివి కావచ్చు, లేదా నేటి సమాజంలో కొత్తగా ఆవిష్కృతమవుతున్న ద్వంద్వాలు: సంప్రదాయం-ఆధునికత, పునరుద్ధరణ-ఆధునికత, ప్రాచ్యం-పాశ్చాత్యం, సమకాలికత-ఆధునికత, గాంధి-మార్క్స్, గాంధీ-నెహ్రూ, సెల్ఫ్-అదర్, పితృభాష-మాతృభాష, గ్రామీణ-పట్టణ వంటివి కావచ్చు. కొన్ని సార్లు ఆయన కొత్త ద్వంద్వాల్ని కనిపెడతాడు. ఉదాహరణకి civil society అనే భావన ఉంది. దానికి ప్రతిగా మార్క్స్ human society అనే భావనని ప్రతిపాదించాడు. అనంతమూర్తి civil society అనే భావనకు ప్రతిద్వంద్విగా saintly society అనే భావనని ప్రవేశపెడతాడు. అలాగే టాల్ స్టాయి, లెనిన్ అనే ఇద్దరు రష్యన్ మహనీయుల్ని మనం విడివిడిగానే చూస్తాం. కాని ఆయన ఆ ఇద్దర్నీ టాల్ స్టాయి-లెనిన్ అనే ద్వంద్వంగా మార్చి మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాడు. అలా ఎన్నో ద్వంద్వాల్ని వివరిస్తూ, నిశిత పరీక్షకు గురిచేస్తూ అతడు సాగించే ఆలోచన ఎంతో భావస్ఫోరకంగానూ, జాగృతికారకంగానూ ఉంటుంది.

శాస్త్రీయ, సామాజిక విశ్లేషణకి రూపకలంకారాన్ని వాడుకోవడం అనంతమూర్తిలో మరో గొప్ప విశేషమని అందరూ అంగీకరించిందే. సోదాహరణంగా సత్యాన్ని వివరించడం కొత్తకాదు. ప్లేటో ఈ పనిచేసాడు. ప్రాచీన భారతీయ దార్శనికులు ఘటపటాదుల్తో ఇదే చేసారు. అయితే నువ్వెంచుకునే రూపకాలంకారం ఎంత స్థానికంగా, ఎంత సమకాలికంగా ఉంటే అదివ్వగల స్ఫూర్తి అంత తీవ్రంగా ఉంటుంది. మానవ చైతన్యంలోని అవస్థలని వివరించడానికి రామకృష్ణ పరమహంస బెంగాల్లోని మిద్దె ఇంటిని ఉదాహరణగా వాడుకున్నప్పుడూ, కంటి ముందు కనిపించే దృశ్యం అనిత్యమని చెప్పడానికి రమణమహర్షి సినిమాతెరను ఉదాహరణగా చెప్పినప్పుడూ ఆ రూపకాలంకారాలు శక్తివంతంగా కనిపించింది అవి వారి వారి స్థానికతనుంచీ, సమకాలిక వాస్తవికతనుంచీ రావడమేకారణం. ఆ పద్ధతిలోనే అనంతమూర్తి భారతీయ సభ్యతలోని రెండుముఖాల్ని వివరించడంకోసం ఇంటిముంగిలి-పెరడు (front yard-backyard) అనే రూపకాన్ని ఎంతో ప్రజ్ఞతో వాడుకున్నారు. ఆ ఒక్క ఉదాహరణద్వారా ఆయన భారతీయ సభ్యతకీ,సంస్కారనికీ, భాషాప్రయోగానికీ,సాహిత్యానికీ, ఎన్నింటినో వివరించే ప్రయత్నం చేసారు.

ఇక రాజకీయంగా అనంతమూర్తిది లోహియా మార్గమని చెప్పవచ్చు. 1975 లో దేశంలో ఎమర్జెన్సీ విధించడం ఆయన ఆలోచనని ఒక మలుపు తిప్పింది. 75 ముందుదాకా ఈ దేశంలో మార్పుని కోరుకునేవారికి గాంధీ లేదా మార్క్స్ ఒక దిక్సూచిగా ఉండేవారు. కాని ఎమర్జెన్సీలో ఒక గాంధేయుడు, వినోబా ఇందిరాగాంధీని సమర్థిస్తే మరొక గాంధీవాది జయప్రకాశ్ ఆమెని వ్యతిరేకించారు. మార్క్సిస్టుల్లో ఒక వర్గం ఆమెని సమర్థిస్తే మరొక వర్గం ఆమెను వ్యతిరేకించారు. ఈ విషయం చెప్తూ అనంతమూర్తి ఏమంటాడంటే మారుతున్న కాలాన్ని అర్థం చేసుకోవడంలో గాంధీ, మార్క్స్ ముందులాగా ఒకేతోవ చూపించలేకపోయారనీ, కాబట్టి దేశానికొక కొత్త రాజకీయ మార్గదర్శకత్వం అవసరమైందనీ. ఆ దారి ఎటువంటిదో తేల్చుకోవడం కోసమే ఆయన చివరిదాకా అన్వేషిస్తూ ఉన్నాడు.

ఆ రోజు సంస్మరణ సభలోనూ, ఆ తర్వాత 3వ తేదీ లా మకాన్ లోనూ అనంతమూర్తి మీద తీసిన ఒక డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ప్రసిద్ధ కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవల్లి ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా వారికోసం తీసిన చిత్రం. 75 నిమిషాల నిడివిగల అటువంటి చిత్రం లాంటిది ఎందరో మహనీయులైన తెలుగు రచయితలమీదా, కవులమీదా ఇప్పటిదాకా రాలేదనే చింత నన్నిప్పటికీ వదల్లేదు.

You Might Also Like

Leave a Reply