ఓ బాపు బొమ్మ కథ

bapu_bomma

 

గతవారం బాపుగారి మరణానంతరం ఫేస్‌బుక్‌లో చాలామంది స్నేహితులు బాపు గారి ఫొటోలు, బొమ్మలతో తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. ఈ పైన పెట్టిన బొమ్మ కూడా ఫేస్‌బుక్‌లో కనిపించింది. ఈ బొమ్మలో కుడి ఎడమల ఉన్న ఇద్దరూ నాకు చాలా ఇష్టులే. ఈ ఫొటోలో ఎడమపక్కన ఉన్న పెద్దాయన గురించి మీకు తెలుసు కానీ కుడిపక్కన ఉన్న బొమ్మాయి కథ నాకు మాత్రమే తెలుసు.

ముద్దుగా చేతులు జోడించి స్వాగతం చెప్తున్నట్లున్న ఈ అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు మా ఇంటి పాపను చూసిన ఆనందం కలుగుతుంది.  ఈ చిన్నిపాప నాకు పందొమ్మిదేళ్ళుగా తెలుసు మరి. ఈ అమ్మాయి పుట్టినప్పుడు ఇలా ఉండేది కాదు. ఈ అమ్మాయికి జన్మనిచ్చింది బాపుగారే ఐనా, ఈ అమ్మాయి రూపం మారటంలో నాదీ చిన్న పాత్ర ఉంది.

ఈ బొమ్మాయిని ఇంతకు ముందు మీరు చాలా చోట్ల చూసి ఉండవచ్చు. ఉదాహరణకు, దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్‌వారు పిల్లల కోసం ప్రచురించి వేల సంఖ్యలో పంచిపెట్టిన చిన్నిపొత్తాల మీద ఈ అమ్మాయి కనిపిస్తుంది.

balalageyaalu

వీరికి ఈ బొమ్మ ఎక్కడనుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే మనం తిరుపతి వెళ్ళాలి. ఈ ఫౌండేషన్ నిర్వాహకులు దేవినేని మధుసూదనరావుగారికి తిరుపతిలో ఉన్న మిత్రులు (బహుశా సాకం నాగరాజగారు) ఈ బొమ్మని ఇస్తే దానికి రంగులద్దించి తమ పుస్తకాలకు ముఖచిత్రంగా వాడుకున్నారట.

ఈ బొమ్మ తిరుపతి ఎలా చేరిందనుకుంటున్నారా? నాగరాజ గారి మిత్రుడు,  తిరుపతి నివాసి నామిని సుబ్రమణ్యం నాయుడుగారు ఆంధ్రజ్యోతి వారపత్రిక సంపాదకులుగా పనిచేస్తున్నప్పుడు 1998లో వెలువరించిన దీపావళి ప్రత్యేక సంచికలో విషయసూచిక పేజీలో ఈ అమ్మాయి బొమ్మ ఉంది.

img3

మరి నామిని గారి దగ్గరకు ఈ బొమ్మ ఎలా వచ్చింది? ఆ మతలబు నంబర్ ఒన్ పుడింగి చదివినవారికి తెలుస్తుంది. ఆ పుస్తకంలో నామినిగారు చెప్పినదాని ప్రకారం, ఆ దీపావళి ప్రత్యేక సంచిక తయారు చేయడానికి కొత్త రచనలు సంపాదించే వ్యవధి లేదట. నామిని అప్పుడు ప్రముఖ రచయిత శ్రీరమణగారి దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర ఉన్న పాత మేలిమి బంగారపు కథలు కొన్ని తీసుకొని ఆ సంచిక తయారు చేశారట (గొప్ప కథలు ఉన్న ఆ ప్రత్యేక సంచిక పెద్ద హిట్; కలెక్టర్స్ ఇస్స్యూ). ఆ కథలతో పాటు శ్రీరమణగారి దగ్గర ఉన్న బాపు బొమ్మలు, కార్టూన్లు కూడా ఆ సంచికను అలంకరించటానికి వాడుకున్నారు. అలా వాడిన బొమ్మల్లో ఈ అమ్మాయి బొమ్మ ఒకటి.

శ్రీరమణగారికి ఈ బొమ్మ ఎలా దొరికింది? నా దగ్గరనుంచే. ఈ బొమ్మ ఉన్న పుస్తకాన్ని నేనే శ్రీరమణగారికి అమెరికానుంచి పంపించాను. ఆ పుస్తకం ఏమిటంటారా? 1995లో చికాగోలో జరిగిన దశమ తానా సమావేశాల సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచిక (సావెనీర్) – తెలుగు వెలుగు; ఆ సావెనీర్‌కు నేను ముఖ్య సంపాదకుణ్ణి.

img4

సరేనోయ్, సంపాదకుడివైనంత మాత్రాన బాపు గీసిన బొమ్మలో నీ చెయ్యి ఉందంటావేమిటి అని మీరు అడగవచ్చు. ఇక్కడ ఒక పిట్టకథ ఉంది. సావకాశంగా చెపుతాను, అవధరించండి (కొంత స్వోత్కర్ష కూడా ఉంటుంది, క్షమించండి).

ఆ తానా సమావేశాలకు కొంతకాలం ముందు నేను చికాగో వదలి మూడొందల మైళ్ళ దూరంలో ఉన్న డేటన్ వెళ్ళిపోయాను. సావెనీర్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు ఉప్పులూరి సుబ్బారావుగారు పాత స్నేహంతో నన్ను వారి కమిటీలో సభ్యుడిగా చేర్చుకొని, దరిమిలా సంపాదకత్వ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. ఆ రోజుల్లో నేను సహసంపాదకుడిగా తానాపత్రికను నిర్వహిస్తూ ఉండేవాణ్ణి. అప్పుడప్పుడు వాకాటి పాండురంగారావుగారి వారపత్రికకు ప్రవాసి పేర అమెరికా కబుర్లు అనే కాలం వ్రాస్తుండేవాణ్ణి. సావెనీరుకు రచనలు పంపమని ఆంధ్రప్రభలో ప్రకటిస్తే ఇండియానుంచి చాలా రచనలు వచ్చాయి. వాటిలోనుంచి ఎన్నుకున్న కొన్ని రచనల్లో ‘పట్టులంగా బుట్టబొమ్మ’ అన్న కథ ఒకటి.

ఆ సావెనీర్ కమిటీ తరపున మేం చేసిన ఒక మంచి పని ఏమిటంటే బాపురమణల మొదటిప్రచురణల స్వర్ణోత్సవాన్ని దశమ తానా సమావేశాలలో ముఖ్యాంశంగా సంబరంగా జరపుకోవటం. ఆ వివరాలు కొన్ని ఇంతకు ముందు ఒక వ్యాసంలో వ్రాశాను.

సమావేశం సావెనీరు చాలా ప్రత్యేకంగా తయారు చేశాము. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులు వ్రాసిన (లేక వారి గురించి వ్రాసిన) విశేష వ్యాసాలు సేకరించి, వ్రాయించీ ప్రచురించాము.   ముళ్ళపూడి  గారి గురించి నండూరి రామమోహనరావు, బాపు గురించి ముళ్ళపూడి, రావణుడి గురించి ఎన్‌టీరామారావు, ఇలా అన్న మాట. బాపు గారితో మీ బొమ్మల గురించి ఎవరు వ్రాయగలరు అంటే ఆయన గురువు, ప్రముఖ చిత్రకారులు పిలకా లక్ష్మీనరసింహమూర్తిగార్ని అడగమన్నారు. మద్రాసులో వారి ఇల్లు వెతికిపట్టుకుని ఆయన్ని కోరితే, చక్కటి వ్యాసం వ్రాసిచ్చారు. లక్ష్మీనరసింహమూర్తిగారు తనగురించి వ్రాశారని బాపుగారు సంబరపడుతూ రమణగారితో చెప్పుకోటం చూడటం మరవలేని అనుభూతి.
img5

సమావేశపు ముఖ్యాంశం (కొత్త తరాలు, సరికొత్త తీరాలు), తెలుగువారి చిత్రకళ, రెండు దశాబ్దాల తెలుగు రాజకీయ, సాంస్కృతిక పరిణామాలపై సింహావలోకనం వంటి విభాగాలతో సావెనీరు చాలా అందంగానూ, చదువదగ్గ విశేషాలతోనూ వచ్చింది (సావెనీరుకు వ్యాసం కావాలని అడిగినప్పుడు సావెనీర్ల గురించి ఎగతాళిగా మాట్లాడిన శ్రీరమణగారు సావెనీరు చూశాక అభినందిస్తూ ఉత్తరం వ్రాయటం ఒక మంచి జ్ఞాపకం). చిత్రకళ విభాగంలో చాలా అందంగా ముద్రించిన (హైదరాబాదు ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్) తెలుగు చిత్రకారుల 32 వర్ణచిత్రాలు, నార్ల, సంజీవదేవ్, చలసాని ప్రసాదరావు‌ల వ్యాసాలతోపాటు, ఎస్.వీ.రామారావు పై వేలూరి వేంకటేశ్వరరావు వ్రాసిన సమగ్రమైన వ్యాసం ఉంది. నేను కూడా బాపు బొమ్మలపై ఆంగ్లంలో ఒక వ్యాసం వ్రాశాను (కొన్నాళ్ళ తర్వాత బంగళూర్లో బాపు గారికి సన్మానం చేస్తున్న ఒక సంస్థ బాపుగారిపై ఆంగ్లవ్యాసం కావాలంటే, నా వ్యాసాన్ని పునర్ముద్రించుకోమని ఆయనే సూచించారు).

image60001

ఆ సావెనీర్ అంతా చికాగోలోనే కూర్చాము. ఆ సైజు సావనీరు మొత్తం అమెరికాలోనే తయారు చేయటం అదే మొదటిసారి. ఎవరికీ ముద్రణారంగంలో సరైన అనుభవం లేకపోయినా, ప్రతిపేజీ అందంగా రావాలని అందరం చాలా తాపత్రయపడ్డాం. దాదాపు ఆరువారాలు నేను సంసారం, ఉద్యోగం వదిలేసి చికాగోలో ప్రెస్సులోనే కాపురమున్నాను. ఇంటర్నెట్, ఈమెయిల్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్ సాఫ్ట్‌వేర్ (ముఖ్యంగా తెలుగు) చాలా ప్రాథమిక దశలో ఉన్న రోజులు.
ఇంగ్లీషు నేను, మంతెన కృష్ణ టైప్ చేశాము. పాతూరి రాఘవేంద్రరావు, ద్రోణంరాజు శివరామకృష్ణ, రేవులూరి కృష్ణయ్యగార్లు తెలుగు పేజీలు పోతన ఫాంట్‌లో కంపోజ్ చేశారు. అచ్చుతప్పులు సరిచూడటంలో నా చాదస్తంతో, పాపం చాలా హింస అనుభవించారు. వాసుదేవన్ అనే తమిళ గ్రాఫిక్స్ ఆర్టిస్ట్ పేజ్‌మేకింగ్‌కు సాయపడ్డాడు. ఆ రోజుల్లో కంపోజ్ చేసిన మ్యాటర్ని, బొమ్మలని కాయితాలపై అంటించి, ఫోటో తీసి, ప్లేట్లు చేసుకొని ప్రింట్ చేసేవారు (ట్రై విలేజ్ గ్రాఫిక్స్ ఉమ, భాస్కర్).

సావెనీరు మొత్తాన్ని బాపు చిత్రాలతో, కార్టూన్లతో అలంకరించాము (ఈ ప్రయత్నంలో నాకు నవోదయ రామ్మోహనరావు, భరాగో, బ్నిం, రచన శాయి, ఈనాడు శ్రీధర్ వంటి అనేక బాపు అభిమానులను కలసి వారి దగ్గర ఉన్న కొన్ని వేల బాపు బొమ్మల్ని చూసే అపురూప అవకాశం కలిగింది). సావెనీరుకు ఎన్నుకున్న రచనలన్నిటికీ బాపుగారు బొమ్మలు వేసిచ్చారు. అన్ని బొమ్మలు అద్భుతంగా వచ్చాయి అని వేరే చెప్పక్కరలేదు కదా. పట్టులంగా బుట్టబొమ్మ కథకు వేసిన బొమ్మ క్రింద ఉంది. ఆ బొమ్మలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారుకదా.

img7

మామూలుగా ఐతే ఈ బొమ్మ ఆ కథతో పాటే రావాలి. ఈలోపు ఇంకో సమస్య వచ్చింది.

టైటిల్ పేజ్ డిజైన్ చేస్తున్నప్పుడు, పేజీ మధ్యలో ఏం బొమ్మ పెట్టాలి అని వెతికితే మాకు నచ్చినవి, ఆ పేజీకి నప్పినవి ఏమీ దొరకలేదు.  స్వాగతం పలుకుతున్నట్టున్న ఈ చిన్నారి బొమ్మని ఆ టైటిల్ పేజీలో పెడితే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. కుడివైపు పేజీలో వస్తున్న ఆ బొమ్మ కుడిపక్కకే తిరిగి ఉండటం సరిగా కుదరలేదు అనిపించింది. అప్పుడు ఆ బొమ్మను ఎడమపక్కకు తిరిగి ఉండేలాగా కాపీ మెషీన్లో రివర్స్‌లో కాపీ తీయించాను. అలా కుడి ఎడమైన బొమ్మని టైటిల్ పేజీ మధ్యలో అతికిస్తే, పొరపాటు లేకుండా భేషుగ్గా అమరింది.

img8

సమావేశపు స్టేజిని మానేజ్ చేసిన మిత్రుడు రామరాజ భూషణుడికి ఈ బొమ్మ నచ్చింది. అట్లా ఎడమకు తిరిగిన బొమ్మనే స్లైడుగా తీయించి వేదిక పక్కన అమర్చిన పెద్ద స్క్రీన్లపై ప్రొజెక్ట్ చేయించాడు. అలా ఈ ముద్దుబొమ్మ ఆహూతుల మనసుల్లో నిలచిపోయింది. ఆ తర్వాత ఎడమవైపు తిరిగి నమస్కారం పెడుతున్న ఈ అమ్మాయి బొమ్మ అమెరికాలో చాలాచోట్ల స్లైడుగానో, బానర్‌గానో కనిపించింది. నెమ్మదిగా తెలుగునాట కూడా ప్రచారంలోకి వచ్చింది.

img9

ఈ అమ్మాయి బొమ్మని అందంగా గీయటమే కాకుండా,  బాపుగారు (ఆయన బొమ్మల్లో ఎప్పుడూ చేసేట్లుగానే) ఒక గమ్మత్తు చేశారు. బాపు బొమ్మల ప్రత్యేకతని గురించి ఆ సావెనీర్లో నేను వ్రాసిన వ్యాసంలో, ఈ బొమ్మ గురించి చెప్పిన మాటలు: “…Look at that little girl on the title page. At first glance, you see a cute little Indian, if not Telugu, girl saying ‘Namaste’. Look again. You will notice the stars and stripes on the little girl’s skirt. This is not just another Indian girl, but the one from the Land of the Stars and Stripes welcoming you…”

ఈ స్టార్స్ అండ్ స్ట్రైప్స్‌ వంటి తమాషాలు అమెరికావారి కోసం వేసిన మరి కొన్ని బాపు బొమ్మల్లో కూడా కనిపిస్తాయి (ఉదాహరణకు మా తెలుగునాడి మొదటి సంచిక ముఖచిత్రంలో ముగ్గులు పెడుతున్న తల్లి చీర అంచు గమనించండి).

img10

టైటిల్ పేజీలో వాడిన అమ్మాయి బొమ్మను మళ్ళీ లోపలపేజీలో కూడా వాడటం ఇష్టం లేక, పట్టులంగా బుట్టబొమ్మ కథకు ఈ బొమ్మని వాడకుండా బాపుగారి రాతలో టైటిల్ మాత్రం వేశాం. ఇప్పటికీ ఈ విషయం తలచుకున్నప్పుడల్లా ఆ కథకు, రచయిత్రికి అన్యాయం చేశానన్న అపరాధభావన నాకు ఉంటుంది (ఒక్కసారైనా తమ రచనలకు బాపుగారు బొమ్మ వేయాలని తెలుగు రచయితలు చాలామందికి కోరిక కదా).

బాపుగారు గీసిన చాలా బొమ్మలు ఏ సందర్భంలో గీయబడినా, అవసరాన్ని బట్టి భిన్నసందర్భాల్లో విభిన్నరీతుల్లో ఎవరికి ఇష్టమైనట్టు వాళ్లు మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవటం పరిపాటే. కాపీలు, అనుకరణలూ సరేసరి. ఎవరు ఎన్నిసార్లు తన బొమ్మలుఎన్ని రకాలుగా వాడుకున్నా, ఆ మహానుభావుడు అభ్యంతరపెట్టేవారు కాదు. ఎవరైనా చెప్పి వాడుకుంటే, చెప్పినందుకు సంతోషపడేవారు. అందువల్ల కొన్ని బాపు బొమ్మలు మళ్ళీ మళ్ళీ కనిపించి మనకు చిరపరిచయమైపోతాయి. ఆ జాబితాలో కుడి ఎడమైన మా పందొమ్మిదేళ్ళ పట్టులంగా బుట్టబొమ్మ కూడా చేరడం గమ్మత్తుగా, సరదాగా, కొద్దిగా గర్వంగా కూడా ఉంటుంది.

జంపాల చౌదరి

సెప్టెంబరు 5, 2014

You Might Also Like

13 Comments

  1. m.Hemalatha writer of " pattulanga buttabomam

    Doctor choudaryggaru rachana 11-2014 lo mee vyasan chadivaanu .naa swandana sayigaariki raasanu.
    . m.హేమలత

  2. Sitharentala

    ఒక మనిషి ఉన్నత స్తాయి కి చేరాలంటే ఎంతో కృషి ఉండాలి అలాగే ఒక కళాఖండం వాసి కేక్కాలన్న
    నాలుగుకాలాలు నిలవాలన్నా దాని కిముందుగా చక్కని సౄజనాత్మకత ఆపై చిత్తశుద్ధి తో కూడిన కృషికావాలి .దానికి మంచి ఉదాహరణ మీ వివరణ వ్యాసం .చిత్తసుద్ధితో చేశిన కృషి వృధా కాదు .చాలా ఇంటరెస్టింగ్
    ఉంది .ఈరోజుల్లోనిజమయిన కళాభిమానులు ఉన్నారా అనే అనుమానం,భయం కలిగేవి .ఇలాటి సంఘటనల వలన ఎందఱో రుషులలా తమ పని తాము చెసుకుపోతూనేవుంటారు,నిశ్శబ్దంగా .

  3. Anil battula

    చాలా బాగుంది.

  4. Jampala Chowdary

    ఫేస్ బుక్ లో పెట్టిన బొమ్మని తయారుచేసింది – హైదరాబాద్ లో ఉండే గ్రాపిక్స్ ఆర్టిస్ట్ బంగారు బ్రహ్మంగారు. గంధం ప్రసాద్ గారు తయారు చేసిన బాపు వర్ణచిత్రాల కాటలాగు పుస్తకం ‘హరివిల్లు’ (2007) వెనుక అట్టమీద ఈ బొమ్మాయి బ్రహ్మంగారికి కనిపించిందట.

  5. పంతుల గోపాల కృష్ణ

    ఇంత చిన్న పాప వెనుక నున్న అంత పెద్ద కథనీ చాలా చక్కగా చెప్పారు.ఇలాంటివి మా వంటి వారికి ఆసక్తి కలిగించే విషయాలు. మీ వంటి వారు చెప్పక పోతే మాకు తెలియకుండానే ఉండి పోతాయి.వీలయితే మీరు పేర్కొన్న ఆ సావనీరును మేమందరం నెట్లో చదువుకునే భాగ్యాన్ని కలుగ జేయండి. అది అందరికీ చదవడానిక అందుబాటులోకి రావడమే అప్పట్లో మీరు దానిని తయారు చేయడానికి పడ్డ శ్రమకి ధ్యేయం కదా?

  6. E.DAKSHINAMURTHY

    సర్, చాలా చాలా అద్భుతంగా ఉన్నది మీ రచన. వీలైతే ఆ magzine తెలుగు పలుకు ని కూడా నెట్ లో పెట్టండి. మరిన్ని బాపు బొమ్మల దర్శన భాగ్యం కలిగించండి. ధన్యులం.

  7. Rama Bhaskar

    చౌదరి గారు కథ పెద్దది ఇనా ,చాలా బాగుంది ,కస్టపడి, ఇష్టపడి మాకు అందించినందుకు ధన్యవాదాలు

  8. Satish

    ఈ బొమ్మ వెనుక ఇంత కథ యున్నదని చాల అచర్యమ్ గ ఉంది. స్టార్స్ స్త్రిపెస్ ప్రతిభావించిన విలువ మీరు చెబితేనే తెలుసుకున్నాము. అందువలన నేను ఈ బొమ్మని అమెరికా అమ్మాయి అని అంటాను.
    ధన్యవాదాలు

  9. raja

    అ ఆ లుమాత్రమే వచ్చిన మాకు దేవినేనిమదుసుదనరావు గారి కుటుంబంతో పరిచయం కావటం ఎన్నో గొప్ప రచనలు చదవటమే కాకుండా పుస్తక ఆవిష్కరణకి వెళ్లి ఎందఱో మహానుభావుల మధ్య కుర్చునేవరకు ఎదిగామంటే మధు గారి స్నేహ పరిమళ ప్రభావమే

  10. Dr Vasu

    జంపాల చౌదరి గారు అన్నట్లు “ఈ అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు మా ఇంటి పాపను చూసిన ఆనందం కలుగుతుంది”, నిజంగా బాపు గారు గీసిన ఆ చిన్న బొమ్మ మన తెలుగు వారినందరినీ అదొక మైన అనుభూతికి గురిచేస్తుంది. మన ఇళ్ళళ్ళో పట్టు లంగాలు కట్టుకుని, బుడి బుడి అడుగులు వెసుకుంటూ నడిచే చిన్నారి ముద్దు గుమ్మలే గుర్తుకు వస్తారు.

    బాపు గారి బొమ్మల్లు చిన్న చిన్న గీతలతొ గీసినట్లున్నా, అవన్నీ కూడా జీవం ఉట్టి పడుతూ ఉంటాయి.

    జంపాల గారి ఈ ఆర్టికల్ ద్వారా ఆ బొమ్మ వెనుక ఉన్న కథ గురించి తెలిసింది.

    మధుసూదన రావు గారి దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ “బాలల గేయాలకు” ఈ బొమ్మ అతికి నట్లు సరిపోయింది.

    అలాంటి బాపు గారు, రమణ గారిని చేరుకోవడానికి ఇంత తొందరగా వెళ్ళడం, చాలా బాధ కలిగిస్తుంది. ఐనా తప్పదు గా, కాలం తన పని తను చేసుకపోతుంది.

  11. మద్దిరాల శ్రీనివాసులు

    ఈ బొమ్మకున్న ఇంత విచిత్రమైన మలుపుల కథ చదివాక ఒకింత నాకే ఆశ్చర్యము, మహదానందభూతి కలుగుతోంది. ఇక జంపాల చౌదరి గారికి, మధుసూధనరావు గారికి, యుగంధర్ , నరసరాజు గార్లకు ఇదొక మధురానుభూతి అవుతుంది. కథ భలే గమ్మత్తుగా వుంది.

  12. Madhu

    Dr చౌదరి గారు, ధన్యవాదాలండి. మీది గాని, బాపు గారి అనుమతి లేకుండానే మీ కూతురు బొమ్మని
    ఉపయోగించు కొన్నాము. దీని గురించి కొన్ని విషయాలు2012 లోను 2014 లోనుఉదాహరించారు. అప్పుడు కూడా మీ కూతురు వెనక ఇంత కథ ఉందని ఇది చదివే దాక తెలియ లేదు. బాపు గారు సృష్టించిన మీ కూతురును 50,000 మందికి పైగా పరిచయం చేయ గలిగానని సంతోషం గా ఉంది. నేను మీ కూతురుబొమ్మను మా పద్య పుస్తకాలకు ఉపయోగించటం మిమ్ములను ఇబ్బంది పెట్ట లేదని అనుకుంటున్నాను. మళ్ళి ఒక్క సారి మీకు ధన్యవాదాలు. మీ వ్యాసం బాగున్నదండి. బాపు గారికి స్మరించు కోవటానికి మా పద్యపుస్తకాల ద్వారా చేయటం మా ఫౌండేషన్ అదృష్తం

  13. రహ్మానుద్దీన్

    చాలా బాగుందీ పట్టులంగా బుట్టబొమ్మ కథ.

Leave a Reply to Dr Vasu Cancel