My Dinner With André

కొన్నాళ్ళ క్రితం “My Dinner with André” అన్న సినిమా చూశాను. సినిమా కథేమిటంటే: ఇద్దరు స్నేహితులు చాలా రోజుల తరువాత ఒక రాత్రి భోజనానికని ఒక రెస్టారెంటులో కలుస్తారు. ఆ గంటన్నర సేపూ ఏవో ఆర్డర్ చేస్కుంటారు, తింటారు, మాట్లాడుకుంటారు. తరువాత సెలవు తీసుకుని వెళ్ళిపోతారు. అంతే. అదే కథ. అందులో కథేముంది తల్లీ? అని అడగవచ్చు ఎవ్వరైనా. నిజమే. అందులో కథేమీ లేదు. ఎవరన్నా దీన్ని కథగా రాస్తే తెలుగు సాహితీ విమర్శకులైతే వాళ్ళ డొక్క చించి డోలు కట్టినా ఆశ్చర్యం లేదు. మరి కానీ దాన్నే సినిమాగా తీశారు. జనం చూశారు. సినీ విమర్శకులు మెచ్చుకున్నారు కూడానూ!

ఈ సినిమా తీసిన విధానం గురించి అనేకులు అనేక రకాలుగా పొగిడారు. సినిమా గురించి తెలుసుకోవాలనుకునే వారు ప్రముఖ విమర్శకుడు Roger Ebert ఈ సినిమా గురించి రాసిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు. తెలుగులో చదవాలనుకుంటే నవతరంగం.కాం లో రెండు వ్యాసాలు ఇక్కడ. అయితే ఏమిటి? ఇదేమన్నా సినిమాల గురించి వ్యాసాలు రాసే వెబ్సైటా? అంటారా? సినిమా చుశాక దాని స్క్రిప్టు పుస్తకంగా వచ్చిన విషయం తెలిసింది. నాకు సినిమా చూడ్డానికి ఎంత కొత్తగా, ప్రయోగాత్మకంగా అనిపించిందో, సంభాషణలు కూడా అంత సహజంగా తోచాయి. సినిమా,సంభాషణలు నాకు నచ్చినందువల్ల స్క్రిప్టు అరువు తెచ్చుకుని చదివాను. ఇప్పుడు దాని గురించే వ్యాసం.

ఇక కథకి వస్తే – వాలీ (Wallace Shawn) అతని ఒకప్పటి దగ్గరి స్నేహితుడు, ప్రస్తుతం కొన్నాళ్ళుగా కాంటాక్ట్ లో లేని ఆంద్రె (Andre Gregory – వాళ్ళ నిజజీవిత పేర్లే సినిమాలో పాత్రల పేర్లు కూడా!) ని కలిసేందుకు బయలుదేరడంతో కథ మొదలవుతుంది. అతన్ని కలవడానికి వాలీ కి ఇష్టం లేకపోయినా కలుస్తాడు. ఆపైన వాళ్ళు భోజనం చేస్తూ, ప్రపంచం గురించి, జీవితం గురించి, నాటకరంగం గురించి, ఆరంగంలో ప్రయోగాల గురించి – ఇలా తాత్విక లోకాభిరామాయణం మాట్లాడుకుంటారు.

చాలా వరకు ఆంద్రె నే మాట్లాడతాడు. అతనికి ఎదురైన విచిత్రమైన, ఆధ్యాత్మికంగా అనిపించే అనుభవాలను గురించి అతను చెబుతూంటే వాలీ వింటూంటాడు. చాలాసేపటి తరువాత వాళ్ళు ఆ అనుభవాలు నెమరేస్కోడం నుంచి వర్తమానంలోకి వచ్చాక గానీ వాలీ కొంచెం పెద్ద వాక్యాలు మాట్లాడ్డం మొదలవదు. వాలీ కి – ఆంద్రె కి జీవితం గురించి, ప్రపంచం గురించి గల అభిప్రాయాల్లో ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్లు గా అనిపిస్తుంది. ఎలాగైతేనేం – ఈ క్రమంలో ఆంద్రె అనుభవాలు చదవడానికి నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. దానితో పాటు, వివిధ విషయాల మీద అతని అభిప్రాయాలు కూడా ఆలోచింపజేశాయి. వాలీ మాట్లాడిన కొన్నింటిలో కూడా చాలా వాక్యాలని నేను రెండు మూడు సార్లు చదువుకున్నాను. వచనం కూడా బాగుంది. ఈ ఆంద్రె ఎంత ఆసక్తికరంగా అనిపిస్తాడో అంత చిరాకూ తెప్పిస్తాడు – ఒక్కోచోట మరీ self-obsessed గా అనిపించి. వాలీ భలే మంచి శ్రోత లా అనిపించాడు ఇతనితో పోలిస్తే. ఎలాగైనా, వీళ్ళ సంభాషణ వినడానికి బహు గొప్పగా ఉంది. నిజజీవితంలో కూడా ఇలాగే సంభాషించుకుంటూంటే – వీళ్ళ పరిసరాల్లో ఉండేవాళ్ళకి గొప్ప తాత్విక కాలక్షేపమే! ఒక్క ముక్కలో చెప్పాలంటే – extremely interesting movie/dialogues.

“Persona” అని స్వీడిష్ సినిమా ఒకటుంది. 2007-08 లో అనుకుంటా మొదటిసారి చూశాను. ఆ సినిమా ఇప్పటిదాకా నాకర్థం కాలేదు, దాని మీద క్యూరియాసిటీ తగ్గనూ లేదు. రెండు సార్లు దాని స్క్రిప్టు కూడా చదివాను. స్క్రిప్టు కూడా సరిగా అర్థం కాలేదు ఇప్పటి దాకా. ఆ సినిమాలోనూ రెండే ప్రధాన పాత్రలు. ఒక పాత్రే రోజస్తమానం మాట్లాడుతూ ఉంటుంది. అందులో రెండో పాత్ర అసలుకే మాట్లాడదనుకోండి – కానీ, బేసిక్ గా డైలాగులు (అదే, మోనోలాగులు) ప్రధానంగా సాగుతుంది ఆ సినిమా. ఆ పర్సోనా అనుభవంతో అంత భారీ అంశాల మీద పూర్తిగా సంభాషణల్లోనే నడిచే కథలు చదవాలంటే భయం పట్టుకుంది, నా తెలివిని మించినవి అర్థం చేసుకోబోయి బొక్కబోర్లా పడితే ఎలాగని. My Dinner With André ఒక విధంగా అలాంటిదే కానీ, ఇందులో డైలాగులు నా తెలివితేటలకి ఒక మెట్టుపైనే ఉన్నా, మరీ కొన్ని అంతస్థుల పైన లేవు. అందువల్ల, ఈ సినిమాని, దాన్ని మించి స్క్రీన్ ప్లే ని నేను ఆస్వాదించగలిగాననే చెప్పాలి.

మొత్తానికైతే, ఆ తరహా సంభాషణలు మీకూ-మీ స్నేహితులకి (మరీ ఆ స్థాయిలో కాకపోయినా, మామూలు మనుషుల స్థాయిలో) అయ్యేట్లు అయితే, ఇది తప్పకుండా చదవవలసిన పుస్తకం. నాకైతే చాలా నచ్చింది. సినిమా చూశాక పుస్తకం చదవడం మంచిదైంది – ఎందుకంటే పుస్తకం చదివితే “దీన్ని సినిమాగా తీస్తారా! వామ్మో! పర్సోనా టైపులో ఉంటుందో ఏమిటో!” అనుకుని వెనక్కి తగ్గేదాన్ని 🙂

పుస్తకంలో ఈ స్క్రిప్టుతో పాటు Wallace Shawn రాసిన మరొక నాటకం – Marie and Bruce కూడా ఉంది. మరి పై సినిమా-స్క్రిప్టు నచ్చడం వల్ల, ఇతగాడు రాసినవేవైనా చదవాలన్న కుతూహలం కలగడం సహజం కనుక, ఇదీ చదవడం మొదలుపెట్టాను. ఏమాటకామాటే, అక్కడక్కడా కొన్ని చక్కటి వాక్యాలున్నాయి కానీ, మొత్తానికి పరమ బోరు కొట్టింది. ఒక భార్యా-భర్తా, దాదాపుగా విడిపోయే స్టేజిలో ఉన్న వివాహం – అన్నది థీం. మొదట్నుంచి చివ్వరిదాక ఆమె ఆయన్ని నానా తిట్లు తిడుతుంది. ఆయన గురించిన వర్ణన కూడా ఆయన మీద మనకేం సదభిప్రాయం కలుగజేయదు. ఇలా క్లైమాక్స్ సీన్ దాకా కొట్లాడుకుంటారు – ఇంటికొస్తారు – నిద్రపోతారు. అంతే. కథైపోయిందనమాట. ఒక విధంగా చూస్తే My Dinner With Andre కూడా అంతే – వచ్చారు, తిన్నారు, వెళ్ళారు. కథైపోయింది. కానీ, ఈ రెండింటికీ ఎంత తేడా! సినిమాలోని డైలాగుల్లో బాగా లోతు ఉన్నట్లు అనిపించింది నాకు. అలాగే, అక్కడ ప్రస్తావించబడ్డ విషయాల పరిధి కూడా పెద్దదే. కానీ, నాకైతే దానితో పోలిస్తే ఈ నాటకం పేలవంగా అనిపించింది. మరి చూస్తే కొంచెం నయంగా ఉంటుందేమో. దీన్ని సినిమాగా తీయడమేమిట్రా బాబూ! అనుకున్నా.

రెండింటిలోనూ పొడవైన వాక్యాలు – ఏకపాత్రాభినయం తరహా డైలాగులు ఉన్నాయి. కానీ, ఇందాకన్నట్లు, Marie and Bruce లో ఈ సంభాషణలు విసుగు పుట్టిస్తే, My Dinner with Andre లో అవే సంభాషణలు, ఆ పొడవైన డైలాగులు – ఆపకుండా చదివించాయి మరి! ఏమాటకామాటే, Wallace Shawn రచనాశైలి గురించి మట్టుకు ఇంకా ఆసక్తి తగ్గలేదు. వీలైతే ఇతర రచనలు ఏవైనా చదివేందుకు ప్రయత్నించాలి.

పుస్తకం ఇప్పుడు ముద్రణలో ఉందో లేదో తెలియదు. సినిమా చూడాలనుకుంటే మట్టుకు యూట్యూబులో వెదికితే దొరకవచ్చు. డీవీడీలు కూడా లభ్యమని విన్నాను. సబ్ టైటిల్స్ ఫైలు లో ఉన్న వాక్యాలకీ, పుస్తకానికి ఆట్టే తేడా లేదనుకుంటాను – సంభాషణలు తప్ప ఎక్కువ వర్ణనలు లేవు కనుక.

My Dinner with Andre, Marie and Bruce
Methuen's New Theatre scripts
Wallace Shawn, Andre Gregory
Film & Drama
Methuen, London
1983

You Might Also Like

Leave a Reply