కొల్లేటి జాడలు : అక్కినేని కుటుంబరావు

పోయిన వారం కథా నేపథ్యం రెండవ భాగం ఆవిష్కరణ సభకు వెళ్తే, అక్కడ అక్కినేని కుటుంబరావుగారు నాకొక పుస్తకం ఇచ్చారు. దాని పేరు “కొల్లేటి జాడలు”. ఆయన దగ్గర పుస్తకం తీసుకొని, నా చేతిలో అప్పటికే ఉన్న పుస్తకాల మీద పెట్టాను. ఇంతలో ఇంకెవరో వచ్చి, “ఏం పుస్తకమమ్మా ఇది? కథలా? నాన్-ఫిక్షనా?” అని అడిగారు. “ఏమోనండి, నాకసలేం తెలీదు. మీరే చూడండి” అని ఆయనకు పుస్తకం ఇచ్చాను. ఇంటికొచ్చాక, పుస్తకాలన్నీ తిరగేస్తుంటే, కథల సంపుటులూ, కవితా సంకలనాలు  కాకుండా ఉన్న ఏకైక నవల ఈ కొల్లేటి జాడలు. పుస్తకం కూడా చిన్నగా అనిపించింది. ఏలా ఉందో చూద్దామని తెరిచాను. నిద్ర ఆపుకొని మరీ చదివేంత బాగుంటుందని తెల్సుకున్నాను. పుస్తకం ఆపి ఏవో పనులు చేయాల్సి వచ్చినప్పుడల్లా విసుకున్నాను. ముందుమాటలో, “ఇది నా కథా, నా వాళ్ళ కథ” అని చూచాయిగా రచయిత చెప్పారు. పుస్తకం పూర్తయ్యే సరికి, ఆయన కథా, వారి వాళ్ళ కథా ఎంతో కొంత నా కథ, నా వాళ్ళ కథా అని కూడా అనిపించుకొంది.

కథ విషయానికి వస్తే: ఇది ఒక్కప్పటి కొల్లేటి కథ. అక్కడి మనుషుల కథ. అక్కడి పశుపక్షాదుల కథ. అక్కడి వానలూ – వరదలూ కథ. అక్కడి పోలాలు – చేపలూ కథ. కనుచూపమేర కనిపించే కొల్లేటి కథ.  అనంతమైన అద్దంలా మెరిసే కొల్లేటి కథ. కొంపలు కొల్లేరయ్యే కథ కూడా. దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘సమిష్టి వ్యవసాయం’ అనే దానికి నాంది పలికినప్పటి కథ. అది విజయవంతమై, మరెందరికో ఆదర్శమై, దేశమంతా పాకి, సుభిక్షం అవ్వాల్సినంతటి ఘనకార్యం. అయినా, అది ఇచ్చిన కొద్దిపాటి విజయానికి విర్రవీగి, భవిష్యత్తుకన్నా భావావేశాలకు ప్రాధాన్యతనిచ్చి, కొందరు ఉన్నదంతా దండుకొని, లేనివాళ్ళు లేనట్టుగానే ఉండిపోయిన కథ. కొంపలని కొల్లేరు చేసే కొల్లేటి కొంపే నాశనం అయినప్పటి కథ. ఎన్నెన్నో జీవరాశలకి నివాసయోగ్యమై, అందరికి అన్నపానాదులు అందించే కొల్లేటి నీటిని ఇప్పుడు తాగేవీల్లేకుండా మారిన కథ.  మన సంపదను మనమే ఎలా నాశనం చేసుకుంటున్నామో, ఇందులో ఉన్నది కొల్లేటి గురించే అయినా, మనం చుట్టూ అనేకానేక ప్రకృతి వనరులను మన చేతులారా చంపుకుంటున్నామో గుర్తుచేసే కథ.

రచయిత కథను చాలా అందంగా చెప్పుకొచ్చారు. కళ్ళకు కట్టినట్టుగా, అంతా కళ్ళముందు కదలాడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. రచన చదువుతున్నంత సేపూ మనం కొల్లేటి దగ్గరే ఉంటాము. అక్కడ ఒక మారుమూల గ్రామం “పులపర్రు”లో మనల్ని చేయి పట్టుకొని తిప్పుతారు. ఆ ఊర్లో కొందర్ని పరిచయం చేస్తారు. ఇంకొందర్ని మనకి దగ్గర చేస్తారు. ముఖ్యంగా, శీనూ అనే ఆరేడేళ్ళ కుర్రాడిని, అతని తల్లిదండ్రులు రంగయ్య, లక్ష్మమ్మలను. నవల పూర్తయ్యేసరికి వాళ్ళ ముగ్గురూ నాకు ఎన్నాళ్ళగానో తెల్సినవాళ్ళగా అనిపించారు. ముఖ్యంగా లేకలేక కలిగిన మగబిడ్డపై చూపే మమకారం మాటల్లో చెప్పలేనిది. కానీ కథనంలో దాన్ని ఎంత అందంగా embed చేశారో రచయిత.  వాళ్ళ ఇరుగు పొరుగునూ, గ్రామంలో పెద్దలనూ, చదువుకుంటూ, పనులు చేసుకుంటూ ఉండే యువతనూ పరిచయం చేస్తూ కథను నడుపుతారు. ఒక్కో సంఘటనను ఒక్కో సీనులా మన ముందుకు తీసుకొస్తారు.

నవల మొదట్లో, శీను అనే పిల్లవాడు మొదటిసారిగా కొల్లేటిని ఈదడానికి వెళ్తాడు. కొల్లేటిని అంతా ఆ పిల్లవాడి అనుభవంగా, అప్పటి కొల్లేటిలో జీవరాశులని అన్నింటినీ మనకి పరిచయం చేస్తారు. ప్రకృతి దూరంగా సిటిలో పెరిగిన నాకు అవన్నీ చదువుతుంటే అబ్బురంగా అనిపించింది. నవల ముగిసేసరికి, పారిశ్రామక కాలుష్యం వల్ల కొల్లేరంతా కలుషితమైపోయి, ఆ నీరు తాగడానికి పనికి రాకుండా పోతుంది. ఓ రకంగా, ఇదో ట్రాజిక్ ముగింపు. నవలలోనే కాదు, వాస్తవంలో కూడా ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి చెరువుకి ప్రస్తుతం కలిగిన దుఃస్థితి అసలు ట్రాజెడి. నవలలో ఇంకా అనేకానేక విషయాలు చెప్పుకొచ్చారు. పులపర్రులో ముఖ్యంగా రెండు వర్గాలు వారు: వ్యవసాయం చేసుకునే కమ్మలు. చేపలు పట్టుకునే వడ్డి రాజులు. వీరి జీవన విధానం. వీరి వీరి కులకట్టుబాట్లు. దాని వలన కలిగే లాభాలూ, నష్టాలూ. పిల్లల్ని చదివించుకోడానికి వీళ్ళు పడే కష్టాలు. కోర్టులు, పోలీసుల అవసరం లేకుండా, వారి తగాదాలను కులపెద్దల దగ్గరే తీర్పు చెప్పించుకునే వైనం. ఆ పెద్దలే “తప్పు” చేసి, వీళ్ళ చేతే “తప్పు” కట్టించుకుంటుంటే, దానికి యుక్తితో అడ్డుపడ్డ యువకుల గురించి కూడా చెప్పుకొస్తారు. ప్రకృతి వైపరిత్యాలకు విలవిల్లాడిపోయి, దానికి విరుగుడుగా “సమిష్టి వ్యవసాయా”న్ని సమర్థవంతంగా చేసుకొచ్చినా, స్వార్థాలు అధికమై, ఎవరికి వారు వేరు పడి, కొందరు జేబులు బాగానే నిండినా, రోజూ బంగారు గుడ్డు పెట్టే బాతును మాత్రం ఎండగట్టి చంపుతున్నారన్న నిజాన్ని మళ్ళీ మన ముందుకు తెచ్చారు.

అందుకే ఇది కేవలం కొల్లేటి కథ మాత్రమే కాదు. హైదరాబాదులోని మూసీ కథ., హుస్సేన్ సాగర్ కథ, కబ్జాకు గురి అవుతున్న ఎన్నో చెరువుల కథ. ఇంకెన్నో ఊర్లల్లో ఇంకెన్నింటి కథో!

ఇది నిజజీవితాల నుండి తీసుకున్న కథ. అందుకని వాస్తవం ఎక్కడ ఆగుతుందో, కథ ఎక్కడ మొదలవుతుందో తెల్సుకోవడం నాకు కొంచెం కష్టమయ్యింది. అన్ని ముఖ్య పాత్రలూ ఒకప్పుడు అక్కడ జీవించినవారేనట. అలా చూసుకుంటే, దీన్ని నవల కన్నా, ఒక ఊరి బయోగ్రఫీ అని అనుకోవచ్చునేమో. వీలు చేసుకొని తప్పక చదవవలసిన రచన అని నా అభిప్రాయం.

కినిగె.కామ్ లో కొనుగోలుకై: http://kinige.com/book/Kolleti+Jaadalu

మరికొన్ని చోట్ల వచ్చిన పరిచయాలు: ఆంధ్రప్రభలో, సాక్షిలో

 

కొల్లేటి జాడలు
అక్కినేని కుటుంబరావు
Fiction
స్వేచ్ఛ ప్రచురణలు
Paperback
209

You Might Also Like

2 Comments

  1. amarnath

    చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో “కొల్లేటి సరస్సు మంచి నీటి సరస్సు, పులికాట్ సరస్సు ఉప్పు నీటి సరస్సు” అని చదివిన వాక్యాలు ఎందుకో గాని బాగా గుర్తుండి పోయాయి 🙂

    పులికాట్ అసలు పేరు ప్రళయ కావేరి అని “ప్రళయ కావేరి కథలు” చదివాక తెలిసింది. చాలా అందమైన కథలు అవి.

    ఇప్పుడు కొల్లేరు గురించిన పుస్తకం పరిచయం చేసిన పూర్ణిమ గారికి ధన్యవాదాలు!

  2. Madhu

    చాలా బాగా పరిచయం చేసారండి. ఈ పుస్తకాన్ని వీలయినంత తొందరలో చదవాలి.

Leave a Reply