రెండు “డిప్రెషన్” కథలు

సిద్ధార్థ ముఖర్జీ క్యాన్సర్ గురించి రాసిన “The Emperor of All Maladies” చదువుతున్నప్పుడు నాకు డిప్రెషన్ గురించి అలాంటి పుస్తకం ఏదన్నా ఉంటే చదవాలనిపించింది. అందుకు కొన్నికారణాలున్నాయి:

౧) “depression is the common cold of mental illnesses” అంటారు, మరి ఎందుకు ఎవరికన్నా డిప్రెషన్ అనగానే మనకి (మనకంటే మామూలు సగటు మనుషులకండి) అలా అనిపించదు? అన్న సందేహానికి సమాధానం తెలుసుకోవడం.
౨) అసలు రకరకాల స్థాయుల్లో డిప్రెషన్ ని ఎలా కనుక్కుంటారు? ఆ తర్వాత అది తగ్గడానికి ఏం చేస్తారు? – అంత కామన్ కోల్డ్ లాంటిదైతే ఎందుకు ఇదంతా అంత కామన్ నాలెడ్జ్ కాదు? అన్న అనుమానం.
౩) అసలు డిప్రెషన్ గురించి డాక్టర్లు చెప్పేది అటు పెడితే, సామాన్య ప్రజానీకం అభిప్రాయాలు ఇంకోవైపుకి పెడితే, అనుభవించేవాళ్ళకి ఎలా ఉంటుంది? అన్నది అన్నింటికంటే పెద్ద అనుమానం.

ఇదే సమయంలో ఒకపక్క ఒక సైకాలజీ క్లాసులో మానసిక రోగానిర్థారణ గురించి చర్చ ఒకటి చదవడంతో, మరింత కుతూహలం కలిగింది ఈ అంశాల మీద. నాకు తెలిసిన వారిలో ఇటువంటి అంశాల గురించి జంపాల చౌదరి గారికైతే‌ బాగా తెలిసి ఉంటుందని అనుకుని ఆయన్ని అడిగాను. ఆయన సూచించిన పుస్తకాలలోనివే ఈ రెండూ. అవడానికి రెండూ స్వీయకథనాలే అయినా, వీటి ద్వారా కూడా నా పై ప్రశ్నలకి కొన్ని జవాబులు దొరికాయి. ఈ పుస్తకాలు రెండు చదవడం వలన నేను మానసిక రుగ్మతలను గురించి ఆలోచించే దృక్పథంలో ఎంతోకొంత మార్పు వచ్చిందనే భావిస్తున్నాను. అందువల్ల ఈ రెంటి గురించి ఓ చిన్న పరిచయం.

మొదటి పుస్తకం: An Unquiet Mind: A Memoir of Moods and Madness – Kay Redfield Jamison
పుస్తకం గురించి చెప్పేముందు రచయిత్రి గురించి చెప్పాలి. రచయిత్రి అమెరికాకు చెందిన ప్రముఖ క్లినికల్ సైకాలజిస్టు. డిప్రెషన్ గురించి, ముఖ్యంగా bipolar disorder అన్న సమస్య గురించి విస్తృతంగా పరిశోధన చేశారు, పుస్తకాలు రాశారు. మానసిక రుగ్మతల చికిత్స గురించి చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఇవన్నీ అటుపెడితే, ఆవిడ స్వయంగా డిప్రెషన్ కి గురై చికిత్స పొందుతున్న వ్యక్తి. ఇంత నేపథ్యం తెలిశాక, ఇక పుస్తకం చదివే ముందే నాకు దాని గురించి ఒక విధమైన సద్భావం కలిగిందనే చెప్పాలి.

పుస్తకం విషయానికొస్తే, ఇందులో రచయిత్రి తన కుటుంబ నేపథ్యం, చిన్నతనం, చదువు, ప్రేమలు-పెళ్ళిళ్ళు, శాస్త్ర పరిశోధన, వీటన్నింటి మధ్యా ఆవిడ మానసిక రోగంతో సంఘర్షణ గురించి చెప్పుకొస్తారు. డిప్రెషన్ ని ఒక పేషంటుగానే కాక, అవతలి పక్క నుండి కూడా వివరిస్తారు. డిప్రెషన్ ఉరించి రచయిత్రికి శాస్త్ర పరమైన అవగాహన చాలా ఉంది. దానితో పాటు దాన్ని పదుగురితో (సామాన్య ప్రజానీకంతో) వారికి అర్థమయ్యేలా పంచుకోగల నేర్పు కూడా చాలా ఉంది.

సాధారణంగా నాకు తెలిసిన చిన్న ప్రపంచంలో డిప్రెషన్ కి వాడే మందులని విమర్శించేవాళ్ళే ఎక్కువగా కనబడ్డారు, అదీ ఏమాత్రం మెడికల్ నేపథ్యం లేని వారు కూడా. ఇదే విషయంలో ఆ మధ్య మానసిక సమస్య ఉన్న ఓ సైంటిస్టు ప్రధాన పాత్రగా “హసీ తో ఫసీ” హింది సినిమా వచ్చినప్పుడు నాకు కొందరితో ఓ చర్చ కూడా నడిచింది..”మందులు పనికొస్తున్నాయో లేదో మనం కాదు కదా చెప్పాల్సింది – డాక్టర్లు, పేషంట్లు కదా” అన్న పాయింటు మీద మాకు అంగీకారం కుదరకపోవడం నాకైతే ఆశ్చర్యం కలిగించింది అప్పట్లో. ఈ నేపథ్యంలో ఈవిడ ఒక పేషంటు-డాక్టర్ గా మందుల వాడకం గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు నాకైతే చాలా ఉపయోగకరమైన సమాచారం అందించాయని చెప్పాలి.

ఈవిడ అనుభవించినన్ని కష్టాలు ఇంకెవరూ అనుభవించలేదని కాదు. నిజానికి ఆవిడ అదృష్టవంతురాలు అనిపించింది నాకు – ఆవిడకి అందుబాటులో ఉన్న వనరులను చూస్తే. ఇది ఒక మనిషి కథ. ఇలాంటి రోగమే ఉండి మొత్తానికి జీవితం నాశనమైన వారూ ఉంటారు. అందరి కథనీ ఒక్క పుస్తకంలో…అదీ ఆత్మకథాత్మక కథనంలో చూడాలని ఆశించకపోతే, ఈ పుస్తకం తప్పక చదవండి.

ఈవిడ Manic Depressive Disorder మీద రాసిన పుస్తకం ఆ అంశంపై అత్యుత్తమ గ్రంథమట. మరి ఆరంగంలో పరిశోధకుల కోసం రాసిన పుస్తకం కావొచ్చు – నాకు అర్థమవుతుందో లేదో ప్రయత్నించాలి. ప్రస్తుతానికైతే “Touched With Fire” అని డిప్రెషన్ కు, సృజనాత్మకత కు మధ్య సంబంధాలను అన్వేషిస్తూ, అనేక కళాకారుల జీవితాలను అధ్యయనం చేసిన ఓ పుస్తకాన్ని దొరకబుచ్చుకున్నాను. చదవాలి భవిష్యత్తులో.

***
ఇక రెండో పుస్తకం:
Shadows in the Sun: Healing from Depression and Finding the Light Within by Gayathri Ramprasad

shadowsinsun

పుస్తకం గురించి, రచయిత్రి గురించి: రచయిత్రి గాయత్రి రాంప్రసాద్ ప్రస్తుతం ASHA International అన్న సంస్థ ను నడుపుతూ, మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగించే పనిలో ఉన్నారు (Mental Health Advocate). ఈ పుస్తకం ఆమె స్వీయకథ. టీనేజి నుండి దాదాపు ముప్పయ్యేళ్ళ పాటు డిప్రెషన్ తో ఆవిడ సంఘర్షణ, అది ఆవిడ జీవితాన్ని అతలాకుతలం చేసినా చివరికి ఎలా బయటపడిందో, ఆవిడ జీవితంలో ముందడుగు వేసి ఎలా కెరీర్ పరంగా విజయవంతమైందో తెలియజెప్పే కథ.

ఈ పుస్తకంలో ప్రత్యేకంగా నన్ను ఆకట్టుకున్న అంశాలు మూడు. మొదటిది -ఇది ఒక భారతీయ వనిత కథ. మన సమాజం, మన మనస్తత్వాలు, మన కుటుంబాలలో మానసిక సమస్యల గురించి సాధారణంగా ఉండే అవగాహనారాహిత్యం, దాన్ని దాచడానికి జనాలు పడే ప్రయత్నం – అన్నీ కనిపిస్తాయి. రెండవది: ఆవిడ నిజాయితీ గా, ధైర్యంగా అంతా చెప్పుకున్న తీరు, అలాగే ఇండియా-అమెరికాల మధ్య మానసిక రోగ నిర్థారణ, చికిత్స, వీటి గురించి చర్చించే విధానాల గురించి ఆవిడ పరిశీలనలు. ముఖ్యంగా అన్నింటికంటే నన్ను ఆకట్టుకున్నది – ఈవిడ భర్త ఈవిడకి అందించిన తోడ్పాటు, భారతీయ ఆధ్యాత్మికత, దైవ భక్తి ఈ క్రమంలో వీళ్ళ జీవితాల్లో పోషించిన పాత్రా! ఈ మూడు అంశాలలోనూ ఈ పుస్తకం పైన ప్రస్తావించిన పుస్తకంతో పోలిస్తే ఎన్నో కొత్త విషయాలు, కొత్త దృక్కోణంలో తెలియజేస్తుంది.

పుస్తకం రాసినది స్వతహాగా రచనలు చేసే వ్యక్తి కాదు. ఆ విషయం కథనంలో అర్థమవుతుంది. నిజానికి దాదాపు మొదటి సగభాగం అంతా చాలా నెమ్మదిగా, అనాసక్తంగా సాగుతుంది. అయితే, పుస్తకంలోని విషయం, రచయిత్రి నిజాయితీగా దాన్ని పంచుకోవడం మూలాన రెండో సగంలో కథన,శిల్పనిర్మాణ లోపాలు ఆట్టే అడ్డుకోలేదు నా పఠనానుభవాన్ని. మొదటి నలభై యాభై పేజీలు చదివి పుస్తకం మూసేద్దామనిపించినవాళ్ళకి నేను కొంచెం ఓపిక వహించమని మట్టుకు సూచించగలను. ఒక మంచి ఓపికగల ఎడిటర్ వల్ల కూడా పుస్తకం లాభపడేదేమో అనిపించింది. నన్ను అడిగితే, ఈ పుస్తకం డిప్రెషన్ గురించి పేషంటు దృక్కోణంలో, వారి కుటుంబ దృక్కోణంలో తెలుసుకోవాలంటే తప్పకుండా చదవాలి. భారతీయులైతే మరీ తప్పక సూచిస్తాను -ఇందులో మన సామాజిక కోణం కనిపిస్తుంది కనుక!

ఇటీవలే నటుడు రాబిన్ విలియమ్స్ మరణించినప్పుడు ఆయన కూడా డిప్రెషన్ కు గురయ్యాడని వార్తల్లో వేశారు. ఆ సమయంలో వెల్లువలా వచ్చిన వ్యాసాలు, ట్వీట్లు, స్టేటస్-మెసేజిలలో నేను ఒక అంశం గమనించాను. ఆయనేదో తొందరపడ్డాడని, ఆయన్ని ప్రేమించేవాళ్ళు బయట ఇంతమంది ఉన్నారని ఆయనకి తెలియలేదని – అభిమానులు కొంతమంది వాపోయారు. కొంతమంది ఏమో -“It is a state of mind. Its all in our hands.” అని రాహుల్ గాంధీ పద్ధతిలో వాపోయారు. నేనూ బహుశా అలాగే వాపోయి ఉందును కొన్నేళ్ళ క్రితమైతే. బయటి వ్యక్తిగా గత కొన్నేళ్ళలో కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు, అందునా ముఖ్యంగా ఈ పుస్తకాలు చదివాక, చూస్తూ చూస్తూ అలా అని ఆయా వ్యక్తులని అగౌరవపరచలేనేమో అనిపిస్తోంది. ఏదో ఒక స్థాయిలో వైద్యపరిభాషలో డిప్రెషన్ అనదగ్గ వ్యాధి గురించి తెలుసుకోవాలి అనుకుంటే (మామూలుగా అందరం ఏదో ఒక సమయంలో అనుభవించే డిప్రెషన్ గురించి అనడం లేదు), ఈ పుస్తకాలు మంచి స్టార్టింగ్ పాయింట్స్ అని నా అభిప్రాయం. అందరి కథలూ సుఖాంతాలో దుఖాంతాలో అవ్వవు. అయితే, ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల కొంతైనా అవగాహన కలిగి, ఈ సమస్యలు ఉన్న వ్యక్తులతో వృత్తిపరంగానో, వ్యక్తిగతంగానో కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు కొంత ప్రయోజనం ఉంటుందనే ప్రస్తుతానికి విశ్వసిస్తున్నాను.

పుస్తకాలు సూచించినందుకు జంపాల చౌదరి గారికి అనేక ధన్యవాదాలు!

You Might Also Like

3 Comments

  1. S. Narayanaswamy

    Interesting. There was a long essay by a research psychologist recently in the Atlantic Monthly on the connection between creativity and depression.

    1. Sowmya

      నారాయణ స్వామి గారూ: మొదటి పుస్తకం రచయిత్రి మెనిక్ డిప్రెషన్ కి క్రియేటివిటీ మధ్య సంబంధాన్ని విశ్లేషిస్తూ మరొక పుస్తకం కూడా రాసారు. ఆ మధ్య ఇంట్రడక్షన్ చదివాను – చాలా బాగుంది – కుతూహలం కలిగించింది పుస్తకం. పేరు: Touched with Fire: Manic-Depressive Illness and the Artistic Temperament

  2. mythili abbaraju

    An essay much needed

Leave a Reply to S. Narayanaswamy Cancel