Light of Asia: Indian Silent Cinema 1912-1934

ప్రతి ఏడూ ఇటలీలోని Pordenone అన్న ఊరిలో ఒక Silent Film Festival జరుగుతుంది. ప్రతి ఏడాది ఏదో ఒక అంశం మీద ఫోకస్ ఉంటుంది. 1994 లో భారతీయ నిశబ్ద చిత్రాల మీద ఫోకస్ చేశారు. ఆ సమయంలో వెలువరించిన “Retrospective of Indian Silent Cinema” పుస్తకం ఇది. పుస్తకంలో మొత్తం నాలుగు వ్యాసాలున్నాయి, ఆపైన భారతీయ నిశబ్ద చిత్రాల జాబితా. వీటి గురించి ఒక చిన్న పరిచయం (నా మాటల్లో మాత్రమే సుమా!)

“Before our eyes: A short history of Indian Silent Cinema” అన్న Suresh Chabria వ్యాసం భారతదేశంలో నిశబ్ద చిత్రాల గురించి విహంగ వీక్షణ వ్యాసం. సాధారణంగా సినీరంగంలో లేని వారికి, చరిత్రకారులు కాని వారికి తొలినాటి భారతీయ సినీరంగం అంటే ఫాల్కే పేరు ఒక్కటే తెలిసిన పేరు (నేనేం పరిశోధనలు, సర్వేలు నడపలేదు ఈ విషయం మీద. నా అనుభవంలో చెబుతున్నానంతే. దయచేసి అసలు సంగతి వదిలేసి ఈ విషయం నేనెలా కనిపెట్టాను? అన్న విషయంపైన దృష్టి పెట్టకండి). ఈ వ్యాసం చదివితే ఆ కాలంలో సినిమాల నేపథ్యం ఏమిటి? మన దేశంలో ఈ సినిమా అన్న దానికి precursors ఏవి? ఆ కాలంలో ఫాల్కే కాకుండా ఇంకెవరెవరు సినిమాలు తీశారు? ఎలా తీశారు? భారత సినీరంగ నిర్మాణంలో ఫాల్కే పాత్ర ఏమిటి? అసలు ఈ సినిమాలన్నీ తరువాత ఏమైనాయి? ఎన్ని మిగిలాయి? ఇలాంటి అంశాల మీద అవగాహన కలుగుతుంది. భద్రపరుచుకోదగిన వ్యాసం.

తరువాతి వ్యాసం Ashish Rajadhyaksha రాసిన “India’s Silent Cinema: A ‘Viewer’s View'” అన్న వ్యాసం. నాకు బాగా అకడమిక్గా అనిపించింది ఈ వ్యాసం. అయితే, మంచి సమాచారం అందించిందనడంలో సందేహంలేదు. ఈ పుస్తకానికి బహుశా టార్గెట్ రీడర్స్ సినిమాని అలా అధ్యయనం చేసేవారే కనుక, వ్యాసం అకడమిక్ గా అనిపించడంలో విడ్డూరం ఏమీ లేదు కూడానూ.

మూడో వ్యాసం – మళ్ళీ Suresh Chabria నే రాసిన: “Notes on the Indian Silent Cinema Retrospective, Pordenone, 1994” అన్న వ్యాసం. ఇందులో ఆ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడ్డ మన నిశబ్ద చిత్రాలు, లఘు చిత్రాల గురించి సంక్షిప్త పరిచయాలు ఉన్నాయి. ఈ చిత్రాల గురించి నాకు అసలుకేమీ తెలియదు కనుక నేను ఈ పరిచయాలు చిన్నవే అయినా చాలా ఆసక్తితో చదివాను.

రెండో భాగంలో Virchand Dharamsey సంకలనం చేసిన భారతీయ నిశబ్ద చిత్రాల ఫిల్మోగ్రఫీ ఉంది, ఒక చిన్న పరిచయ వ్యాసంతో. 1912 నుండి 1934 దాకా దేశంలోని వివిధ ప్రాంతాలలో వచ్చిన నిశబ్ద చిత్రాల జాబితా అది. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది అంత ఓపిగ్గా అన్నీ సేకరించారంటే. మరీ క్షుణ్ణంగా చూడలేదు కానీ, పైపైన చూశాను ఈ జాబితాని నేను. పౌరాణికాలు కాని తొలి చిత్రం – “Death of Narayanarao Peshwa” అన్న చారిత్రక చిత్రం కావడం, దాని తరువాతి పౌరాణికేతర చిత్రం ఒక క్రైం సినిమా కావడం నాకు ఆసక్తికరంగా తోచింది. నేను సాంఘికం కథ ఏదో ఉంటుందేమో అనుకున్నాను.. ఆపైన కొన్నాళ్ళకి గాని కామెడీ, సాంఘిక కథలు వచినట్లు లేవు. మధ్య మధ్యలో కొందరు విదేశీ‌ దర్శకుల చిత్రాలు కూడా ఉన్నాయి. ఎలాగైనా, టైటిల్స్ చూడ్డం కూడా నా మట్టుకు నాకు ఆసక్తికరంగా అనిపించింది. వీటిలో ప్రస్తావించబడ్డ “విగత కుమారన్” తీసిన జె.సి.డేనియల్స్ జీవితకథని “సెల్యులాయిడ్” అన్న మళయాళ సినిమాగా తీశారు – దాన్నీ ఓమారు తల్చుకున్నాను.

మొత్తానికైతే నేను పుస్తకంలో పాత నిశబ్ద చిత్రాల కాలంలో విశేషాల గురించి చిన్న చిన్న వ్యాసాలుంటాయేమో – అన్న అంచనాతో చదవడం మొదలుపెట్టా కనుక కొంచెం నిరాశచెందాను. రెండో వ్యాసం కొంచెం అకడమిక్ భాషలో ఉంది కానీ, కొంచెం కష్టపడి చదివితే‌ ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. నిశబ్ద చిత్రాల గురించి, అందునా మన దేశపు చిత్రాల గురించి ఆసక్తి ఉంటే చదవదగ్గ పుస్తకం.

మరాఠీ దర్శకుడు Paresh Mokashi తీసిన “హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ” సినిమా చూశాక దాదాసాహెబ్ ఫాల్కే గురించి ఆసక్తి కలిగి, Bapu Watve రాసిన ఆయన జీవిత చరిత్ర చదివాను. నిశబ్ద చిత్రాల గురించి కొంచెం కుతూహలం కలిగింది. ఆ సమయంలో పరుచూరి శ్రీనివాస్ గారు, విజయవర్ధన్ గారు “Light of Asia” అన్న పుస్తకాన్ని గురించి చెప్పారు. ఆ పుస్తకం అప్పట్లో దొరకలేదు కనుక నేనంతగా‌ పట్టించుకోలేదు. తరువాత మా లైబ్రరీలో కనబడ్డది. అయితే అప్పటికి నా ఆసక్తి సన్నగిల్లడంతో పట్టించుకోలేదు. కానీ, ఈ మధ్యనే ఓ స్నేహితురాలితో ఫాల్కే గురించి తల్చుకున్న సందర్భంలో మళ్ళీ‌ ఈ పుస్తకంపైన ఆసక్తి కలిగింది. అందువల్ల ఆమెకి ధన్యవాదాలు.

పుస్తకం వివరాలు:
Light of Asia: Indian Silent Cinema 1912-1934
Editor: Suresh Chabria
National Film Archive of India, 1994
ISBN: 8122406807
అమేజాన్.ఇన్ లంకె

Light of Asia: Indian Silent Cinema 1912-1934
Suresh Chabria (Editor)

You Might Also Like

One Comment

  1. 2014లో నా పుస్తక పఠనం | పుస్తకం

    […] * The Emperor of all Maladies: A Biography of Cancer – Siddhartha Mukherjee * Light of Asia: Indian Silent Cinema 1912-1934 * Letters to a Young Scientist – Edward O.Wilson – కొన్ని […]

Leave a Reply to 2014లో నా పుస్తక పఠనం | పుస్తకం Cancel