అస్తమించిన రవి రావిశాస్త్రి

(గమనిక: ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. రావిశాస్త్రి మరణించినప్పుడు వచ్చిన సంపాదకీయం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్. ఈ పుస్తకం నుండి స్వీకరించిన ఇతర సాహిత్య సంబంధిత వ్యాసాలను ఇక్కడ చూడవచ్చు. పుస్తకం గురించిన పరిచయ వ్యాసం ఇక్కడ.)
******
“అది కొమ్ముల తోటలా వుంది. ఆ కొమ్ములు కత్తుల జంటల్లా వున్నాయి. ఆ జంటలు కెరటాల్లేచినట్టూ, కొమ్ములు కదిలినట్టూ లేచి కదుల్తున్నాయి. ఆ కదిలే కొమ్ములు వింత వింత కళ్ళతో వికారంగా చూస్తున్నాయి. ఆ చూపుల్లో ఆకలి చాకులున్నాయి. ఆ చాకులికి పాముల మెరుపులున్నాయి. ఆ మెరుపుల వెనుక నిప్పుల నాలికలున్నాయి.”

రచయిత ఎవరో చెప్పనక్కరలేదు. ఈ కొద్ది వాక్యాలు చాలు అవి వ్రాసిందెవరో పోల్చుకోవడానికి. అది సంతకం అక్కరలేని వచనం. అది ఆయన సొంత బాణీ. ఉరవడిగా, ఉవ్వెత్తున లేచిపడే అల వెనుక అలలా, ఉపమానం తర్వాత ఉపమానంగా, ఒక మహాసముద్రంలా ఘార్ణిల్లుతూ, హోరెత్తుతూ, పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ సాగిపోయే ఆ శైలి రావిశాస్త్రి స్వీయ ముద్రాంకితమైన, అనితరసాధ్యమైన అద్భుత శైలి.

మిత్రులకు ఆయన శాస్త్రిగారు, వేలాది అభిమానులకు రావిశాస్త్రి గారు. తెలుగు ఆధునిక సాహిత్యంలో చిరకాలం నిలిచిపోయే రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి గారు. మృత్యువుతో పోరాడి పోరాడి అలసి బుధవారంనాడు శాశ్వతంగా కన్నుమూసి ఆప్తుల, అభిమానుల హృదయాలలో తీరని వెలితి మిగిల్చి వెళ్ళిపోయారు. శ్రీశ్రీ అస్తమయ వార్త తర్వాత ఇంతటి దుర్వార్త వినలేదన్నంత బాధ రగిల్చి భువి నుంచి నిష్క్రమించారు.

తొలిరోజులలో ఏవేవో మారుపేర్లతో వ్రాసేవారు. నలభై ఏళ్ళకు పూర్వం భారతిలో “మెరుపు మెరిసింది” కథానిక వ్రాసినప్పుడు ఎవరీ జాస్మిన్ పేరు వెనుక దాగిన మంచి రచయిత అని పాఠకులు ఆరాతీశారు. ఆ రోజులలోనే, భారతిలోనే “అల్పజీవి” సీరియల్‌గా వెలువడినప్పుడు ఓహో ఈయన రాచకొండ విశ్వనాథశాస్త్రిగారా అనుకుని, తెలుగు కథాగగనం మీద ఒక ఉజ్వల తార ఉదయించినదని సంబరపడిపోయారు. ఇక ఆ పిదప ఆయన కథ తర్వాత కథతో పాఠకుల అభిమానాన్ని కొల్లగొట్టారు.

చలం తన కథలతో ఒక వైపు కొత్త తలుపులు తెరిస్తే, రావిశాస్త్రి మరొక వైపు తలుపులు తెరిచారు. తెరిచి, శ్రీశ్రీ పేర్కొన్న అశాంతులను, అభాగ్యులను, అనాథులను, పతితులను, భ్రష్టులను, బాధాసర్పదష్టులను, దగాపడిన తమ్ముళ్ళను, చల్లారిన సంసారాలను, మెరుపు మెరిసి మాయమైన తర్వాత చీకట్లు ముసిరిన బ్రతుకులను, “ఇది మెరుపు లేని మబ్బు. ఇది తెరిపి లేని ముసురు. ఇది ఎంతకీ తగ్గని ఎండ. ఇది ఇప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి. ఇది గ్రీష్మం. ఇది శిశిరం. ఇది దగ్ధం చేసే దావానలం. ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం … ఒక్కటి! ఒక్కటే సుమండీ. ఒక్క జరీ అంచు తెల్లచీర” కోసం ఏకధారగా వరద వరదగా ఏడ్చే విశాలాక్షి వంటి పెళ్ళికాని కన్నెపిల్లలను, ఇంకా ఎన్నెన్నో యదార్థ జీవిత వ్యథార్త దృశ్యాలను చూపించారు.

సమకాలిక సమాజంలోని అసమానతలను, అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాలను చీల్చి చెండాడే ఆగ్రహంతో, ఆవేశంతో, అసహనంతో, అదే సమయంలో అట్టడుగు బడుగుజీవుల పట్ల అంతులేని ఆర్ద్రతతో, కరుణతో, జాలితో కథ తర్వాత కథ వ్రాశారు. అంతకు ముందు ఏ రచయిత తొంగిచూడని సమాజపు చీకటి కోణాలను వెలుగులోకి తెస్తూ వ్రాశారు. కవిత్వంలో శ్రీశ్రీ చేసిన పని కథలతో రావిశాస్త్రి చేశారు. తెలుగు కథాసాహిత్యాన్ని ఒక మలుపు తిప్పారు.

అరుదుగా వ్రాసేవారు. తన మనస్సులో కథ, దాని సంవిధానం, పాత్ర చిత్రణం అన్నీ విస్పష్టంగా రూపుదిద్దుకునేవరకు వ్రాసేవారు కాదు. ఒక గొప్ప శిల్పంలో వలె అన్నీ దేని స్థానంలో అది అతికినట్టు అమరేవరకు కథ వ్రాసి అచ్చుకిచ్చేవారు కారు. కాని, వ్రాసిన ప్రతి కథ పాఠకలోకంలో గన్‌షాట్ లా పేలేది. రోజుల తరబడి పాఠకులు దాన్ని గురించి చర్చించుకునేలా వుండేది.

అయినా, కడచిన నాలుగు, నాలుగున్నర దశాబ్దాలలో రావిశాస్త్రి సాహిత్య సృష్టి తక్కువేమీ కాదు. సారో కథలు, సారా కథలు, బాకీ కథల వంటి కొన్ని వందల కథలు, రాజు-మహిషి, రత్తాలు-రాంబాబు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్ములు పోనాయండి వంటి నవలలు, నిజం, విషాదం, తిరస్కృతి వంటి నాటకాలు, ఇంకా ఎన్నో ఇతర రచనలు ఆయన తెలుగువారికిచ్చిపోయిన సాహిత్య వారసత్వం.

తెలుగువాడైపోయారుగాని రచయితగా రావిశాస్త్రి ఔన్నత్యం ఏ ప్రపంచ రచయితకు తీసిపోదు. ఆయనను పోలిస్తే ఒక చెఖోవ్ తో పోల్చాలి. ఒక గోర్కీతో పోల్చాలి. మొదటి నుంచి ఆయన చాలా “కాన్షస్” రచయిత. తాను వ్రాసేదేమిటో, ఎవరి గురించి, ఎవరి కోసం వ్రాస్తున్నాడో తెలిసిన రచయిత. “రచయిత అయిన ప్రతివాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను …. ప్రతి రచయిత తాను ఎవరి మంచికోసం రాయాలో ఎప్పుడో ఒకప్పుడు నిర్ణయించుకుంటాడని నేను అనుకుంటాను” అని ఆయన చాలా స్పష్టంగా తన సాహిత్య ధ్యేయం గురించి వ్రాసుకున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికాన్ని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల భాషను అంత సొగసుగా, అంత పదునుగా, అంత శక్తితో వ్రాసిన రచయిత మరొకరు లేరు. ఆధునిక వచన సాహిత్యంలో ఆయనదొక ఆచార్య పీఠం. ఆయనొక కులపతి. రెండు మూడు దశాబ్దాల యువ రచయితలపై ఆయన రచనల ప్రభావం, వ్యక్తిగత ప్రభావం పడింది. ఇకపై మన సాహిత్య వీథులవలె విశాఖపట్టన వీథులు కూడా ఆయన లేని లోటుతో వెలవెలపోతాయి.

(నవంబర్ 11, 1993)

You Might Also Like

2 Comments

  1. వంశీ

    చలం గారి తర్వాత అంత పదునైన భాష రావి శాస్త్రి గారి రచనల్లోనే చూడగలం…ఈ తరం వారు ఎంతో శ్రమ పడితే కానీ దొరకబుచ్చుకోలేని ఆర్టికల్ని అందించినందుకు కృతజ్ఞతలు…

  2. వంగా రాజేంద్ర ప్రసాద్

    ఆపుకోలేని దుఖం, కోపం, బాధ, జాలి, ఆవేశం, ఆనందం కలిగించే కథలు రావి శాస్త్రి గారి కథలు.

Leave a Reply to వంగా రాజేంద్ర ప్రసాద్ Cancel