The Marvel of Sankarabharanam: C. Subba Rao

కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం చిత్రం, తెలుగునాటే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ మారుమోగిందని వినికిడి. ఢిల్లీలోని రిక్షావాళ్ళు కూడా, ఆ కాలంలో, ఈ సినిమా పాటలు పెట్టుకుని వింటుండేవారన్న కథలూ ఉన్నాయి. “ఓ ముసలి సంగీత విద్వాంసుడు. ఓ పొడుగమ్మాయి. మధ్యమధ్యన పాటలు. ప్రేమా లేదూ, దోమా లేదూ” అని ఈ సినిమాకు వచ్చిన మొదటి టాక్ అని అప్పటివాళ్ళు కొందరు చెప్పారు నాకు. ఆ తర్వాత వారం, పదిరోజుల్లో ఎక్కడ చూసినా ఈ సినిమానే, ఎవరు మాట్లాడినా దీని గురించే అని కూడా చెప్పారు. వాళ్ళు కాక, విశ్వనాథ ఓవర్‌రేటెడ్ అన్న అభిప్రాయంతో ఉన్నవాళ్ళు, ఈ సినిమా అంటే నోరు చప్పరించటం కూడా చూశాను. నాకు నచ్చిన సినిమాల గురించి అడిగితే, ఈ సినిమా పేరు మొదటి పదిలో ఉండకపోవచ్చు. పుస్తకాల్లానే, సినిమాలనూ నేను తూచి బాగుందో, లేదో చెప్పలేను. నచ్చిందో, నచ్చలేదో మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ వ్యాసం, ఓ తెలుగు సినిమా గురించి రాయబడ్డ చిట్టి ఇంగ్లీషు పుస్తకం: The Marvel of Sankarabharanam, గురించి. అందుకని పుస్తకంలోని విశేషాల గురించే రాస్తాను, సినిమా గురించి కాకుండా.

ఇది 1981లో ప్రచురితమైన పుస్తకం. రచయిత ఇంగ్లీషు ప్రొఫెసర్. తెలుగు సినిమా గురించి ఇంగ్లీషులో రాయడానికి వృత్తిరిత్యా ఆ భాషపై ఉన్న మమకారం ఒకటైతే, తెలుగేతరులకు ఈ పుస్తకం ద్వారా ఆ సినిమాను పరిచయం చేయడమో, లేదా దాని గురించి మాట్లాడుకోడానికి వీలుగా ఉంటుందన్నది మరో కారణంగా రచయిత చెప్పుకొచ్చారు. హింది సినిమాల గురించి అడపాదడపా ఇంగ్లీషు పుస్తకాలు చదివానుగానీ, తెలుగు సినిమా గురించి ఇంగ్లీషులో చదవటం నాకిదే మొదటిసారి.

ముందుమాటలు, మెచ్చుకుంటూ రాసిన మాటలు అయ్యాక, రచయిత సినిమాను పరిచయం చేస్తూ, అందులో తనకు గొప్పవని, ప్రత్యేకమని అనిపించిన అంశాలను గురించి చర్చిస్తారు. సినిమా అంటేనే ఎన్నో కళల, కలల కలయిక. ఒక సినిమా బా వచ్చిందంటే, అది సమిష్టి కృషి. ఐడియా వచ్చినవాడెంతటి గొప్పవాడో, ఐడియాను ఆచరణలో పెట్టి చూపించిన వారూ అంతే గొప్పవారు. అందరూ, కె.విశ్వనాథ్ శంకరాభరణం అంటారు, ఎందుకంటే, సినిమాకు దర్శకుడే ఆద్యుడు కాబట్టి. అయినా, ఈ సినిమా బాలూది, వాణీజయరాంది, వేటూరిది, మహదేవన్‌ది, జంధ్యాలది, సోమయాజులది, మంజు భార్గవిది, తులసిది. ఆఖరకి, భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అవహేళన చేస్తూ ఒకట్రెండు సీనులలో కనిపించే నలుగురు కుర్రాల్లది.  ఈ పుస్తకంలో వాళ్ళందరి గురించి రచయిత మాట్లాడతారు. అందరూ ఏ విధంగా ఈ ఆణిముత్యానికి దోహదపడ్డారో తెలియజేస్తారు.

నచ్చినదాని గురించి పదిమందితో పంచుకోవడం కత్తి మీద సామే! మనకున్న అభిమానం అవతలివారికి మితిమీరినట్టు అనిపించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. పైగా, అభిప్రాయాలతో ఏకీభవించేవారూ ఉంటారు, ఎదురుతిరిగేవారూ ఉంటారు. ఇందులో రచయిత వెలుబుచ్చిన అభిప్రాయాలతో పాఠకులుగా, ఆ సినిమా చూసిన ప్రేక్షకులుగా మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ, పుస్తకం మాత్రం పూర్తి చేయకుండా ఉండలేమని నాకనిపించింది. ఇందులో తెలిసున్న విషయాలు కొన్ని ఉన్నాయి. మనం, బహుశా, ఆలోచన చేయని కొన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా, మంజు భార్గవి పోషించిన తులసి పాత్రను గురించి చేసిన విశ్లేషణ, నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. సభ్యసమాజం చీదరించుకునే కుటుంబం నుండి వచ్చినా, బలాత్కారానికి గురైనా, ఆమెలోని స్వచ్చతను చూపించడంలోనూ, ఆమె బిడ్డ సంగీతంపై అంత పట్టు ఉండడానికి గల కారణాలు వెతకడంలోనూ రచయిత విశ్లేషణ నాకు నచ్చింది. ఈ సినిమా మరుగునపడిపోతున్న శాస్త్రీయ సంగీతం గురించి కన్నా, సంగీతం తప్ప మరో లోకం తెలియన ఓ విద్వాంసుడు, ఆయనను ఆరాధించే ఓ స్తీ మూర్తుల కథ ఇది. ఆ విషయాన్ని ఈ పుస్తకంలో నొక్కి వక్కాణించారు.

వేటూరి గురించి, జంధ్యాల గురించి మరింతగా రాసుంటే బాగుండనని అనిపించింది. అయితే, ఇదేం ఆయా కళాకారులతో సంభాషణలు నెరపి రాసిన పుస్తకం కాదు కాబట్టి, మరిన్ని వివరాలు కోరుకోవడం అత్యాశ అవుతుందేమో. మధ్యమధ్యన సినిమాలోని కొన్ని స్టిల్స్, ప్రముఖుల ఫోటోలు ఉన్నాయి. జాతీయ బహుమతులు అందుకుంటున్న ఫోటోలూ ఉన్నాయి.  సినిమా గురించి పలువురు ప్రముఖుల అభిప్రాయాలూ ఉన్నాయి.

ఇప్పుడీ పుస్తకం ప్రచురణలో ఉందో, లేదో నాకు అనుమానమే! ఎక్కడైనా, ఎప్పుడైనా కనిపిస్తే, ఒకసారి చదవదగ్గ పుస్తకం. చదివాక, సినిమా మళ్ళీ చూడాలనిపిస్తుంది.

The Marvel of Sankarabharanam : A film by K.Viswanath
C. SubbaRao
Non Fiction
April, 1981
Paperback
59

You Might Also Like

2 Comments

  1. pavan santhosh surampudi

    భలే విషయం రాశారండీ. దొరికితే బావుణ్ణు.

  2. వేణు

    ‘శంకరాభరణం’ విజయవంతమైన తొలి రోజుల్లో వంశీ రాసిన వెండితెర నవల వచ్చింది. ఇంగ్లిష్ లో ఇలాంటి పుస్తకం ఒకటి వచ్చిందని ఈ కథనం ద్వారానే తెలిసింది. రాసిన విశేషాలూ బాగున్నాయి.

    పుస్తకం ముఖచిత్రం సినిమా ను గుర్తుచేస్తూ అర్థవంతంగా ఉంది. ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్ చేసిన గంగాధరే ఈ ముఖచిత్రకారుడు కూడా!

Leave a Reply