Ten Days in a Mad-House

“On being sane in insane places” అని “Science” పత్రికలో 1973లో ఒక వ్యాసం వచ్చింది. రాసినాయన అమెరికా సంయుక్త రాష్ట్రాలకి చెందిన సైకాలజిస్ట్ David Rosenhan. ఈ వ్యాసంలో ప్రధానాంశం మానసికరోగనిర్థారణ (Psychiatric Diagnoses కి నా అనువాదం) పద్ధతులను ప్రశ్నించడం. తదనంతర కాలంలో Rosenhan Experiment గా పేరు తెచ్చుకున్న ఒక అధ్యయనం గురించిన వివరాలు ఈ వ్యాసంలో కనిపిస్తాయి. చాలా ఆసక్తికరమైన ఈ అధ్యయనం అనేక చర్చలకి దారితీసిందని, వివాదాస్పదం అయిందనీ విన్నాను. ఒక సోషల్ సైకాలజీ కోర్స్ లెక్చర్లలో భాగంగా ఈ సైన్స్ పత్రిక వ్యాసం చదివాక, ఇంకొన్ని వివరాలు తెలుసుకుందామని దాని గురించిన వికీ పేజీ చదువుతూండగా Nellie Bly అన్న జర్నలిస్టు తన సొంత అనుభవాల ఆధారంగా 1887లో రాసిన “Ten Days in a Mad House” అన్న పుస్తకం గురించి తెలిసింది. పుస్తకం చిన్నది కావడంతో, అంతర్జాలంలో ఉచితంగా లభ్యం కావడంతో, వెంటనే చదవడం సంభవించింది. ఆ పుస్తకం గురించి ఒక చిన్న పరిచయం ..

నెల్లీ బ్లై అన్నావిడ అమెరికాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. ఆవిడ అసలు పేరు: Elizabeth Jane Cochrane. “New York World” అన్న పత్రికలో పనిచేస్తున్నప్పుడు 1887లో ఒకసారి మానసిక రోగుల శరణాలయంలోని పరిస్థితుల గురించి తెలుసుకోవాలన్న అండర్కవర్ అసైన్మెంటుకి ఒప్పుకుంది. మానసిక రోగిగా నటించి ఒక మానసిక చికిత్సాలయంలో చేరి, ఓ పదిరోజులు ఉండి, తాను తెలుసుకున్న విషయాలు పుస్తకంగా రాసింది. అదే ఈ “Ten Days in a Mad House” పుస్తకం. ఆవిడ మొదట ఒక మహిళా శరణాలయ గృహానికి వెళ్ళి, అక్కడ వాళ్ళకి తన మానసిక స్థితి మీద అనుమానం కలిగేలా ప్రవర్తించడంతో కథ మొదలవుతుంది. ఇలా పోలీసులను, డాక్టర్లను కూడా మభ్య పెట్టి మొత్తానికి ఆ ప్రాంతంలో పేరొందిన ఒక పిచ్చాసుపత్రికి వెళ్తుంది. దాదాపు పదిరోజులు ఉండి- అక్కడి దారుణ పరిస్థితులు, రోగులతో అక్కడి నర్సులు-డాక్టర్లు ప్రవర్తించే విధానం, వాళ్ళ దైనందిన జీవితం, నెల్లీకి మామూలుగా కనిపించి – ప్రపంచానికి/డాక్టర్లకి మానసిక రోగుల్లా కనిపించే వాళ్ళ వెతలు, తన సొంత అనుభవాలు – ఇవన్నీ కలిపితే ఈ పుస్తకం. నెల్లీ వీళ్ళందరినీ తనకి మానసిక సమస్య ఉందని ఒప్పించగలగడం నాకు ఆశ్చర్యంగానే తోచింది. అక్కడి పరిస్థితులని గురించి చదువుతూంటే మట్టుకు చాలా భయంకరంగా తోచింది ఆ ఆసుపత్రి నాకు. పుస్తకం చాలా చిన్నది. కనుక ఆట్టే వివరాల్లోకి వెళ్ళలేదనుకుంటాను – కానీ, అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక అవగాహన మట్టుకు కలుగుతుంది పుస్తకం చదువుతూంటే.

పుస్తకం మొత్తం ఈ అనుభవాలపై నెల్లీ వ్యాఖ్యలే అయినా, ఒక్కోచోట ఆ వ్యాఖ్యల్లో ఆకాలం నాటి జీవితం గురించి కొన్ని సంగతులు చెబుతూంటుంది – నాకవి ఆసక్తికరంగా అనిపించాయి. ఉదాహరణకి ఆ కాలం నాటి ఖర్చు: ఒక రాత్రికి అక్కడ గదికి అద్దె -అక్షరాలా ముప్ఫై సెంట్లు మాత్రమే!! భోజనానికి కూడా అంతే రేటు ఉండడం విశేషమే నాకైతే. ఈ పుస్తకంలో ఎక్కడో కొంచెం ఆహ్లాదకరంగా ఉన్నవి ఇలాంటి అంశాలు మాత్రమే. మొత్తానికి పుస్తకం నభూతో నభవిష్యతి అనను కానీ పందొమ్మిదవ శతాబ్దంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మానసిక శరణాలయాల్లో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోవడానికి పనికిరావొచ్చు. నాకైతే అధికారం చేతిలో ఉంటే మనుషులు తోటి మనుషులపట్ల ఎంత కౄరంగా ప్రవర్తించగలరో కూడా గమనించవచ్చు అనిపించింది. ఎలాగైనా నాకైతే‌ ఇది ప్రమాదకరమైన పరిశోధనే! కనుక నెల్లీ బ్లై నాకు చాలా ధైర్యవంతురాలిలా తోచింది.

పుస్తకానికి అనుబంధంగా నెల్లీ రాసిన మరి రెండు వ్యాసాలున్నాయి. అందులో ఒకటి – పనిమనుషులకు, వాళ్ళని వెదికేవారికి మధ్య సంబంధం కుదిర్చే ఒక జాబ్ ఏజన్సీ లో పనిమనిషి పోస్టుకని నెల్లీ అప్లికేషన్ పెట్టి రాసిన రెండ్రోజుల అనుభవాలు. రెండవది – న్యూయార్క్ లోని ఒక paper boxes తయారుచేసే కంపెనీలో ఉద్యోగిగా చేరాక ఆమె అనుభవాలు. ఈ రెండు వ్యాసాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎక్కువ వర్ణనలూ అవీ లేకుండా వీలైనంత సూటిగా రాసినట్లు ఉంది. ఒక వందేళ్ళ క్రితం అమెరికాలో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోడం, వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటే ఈ వ్యాసాలు నచ్చుతాయి. మరి ఈ పరిశోధనల పరిణామాలు ఏమిటో నాకింకా అవగతం కాలేదు. నెల్లీ జీవితం గురించి ఎక్కువ తెలుసుకుంటే ఇవన్నీ తెలుస్తాయేమో. మొత్తానికి అయితే, నెల్లీ బ్లై ఆసక్తికరమైన వ్యక్తిలాగా అనిపించింది నాకు.

ఇక నేను ఈ వ్యాసం రాయడానికి గల అసలు కారణాన్ని చెప్పి ముగిస్తాను: స్టాటిస్టిక్స్ పరిభాషలో – Type 1, Type 2 Errors అని ఉంటాయి. వైద్యరంగానికి అన్వయించినపుడు టైప్ 1 అంటే – జబ్బులేని వ్యక్తికి జబ్బు ఉందని రోగనిర్థారణ సమయంలో తీర్మానించడం (false positive). టైప్ 2 అంటే రోగం ఉన్న వ్యక్తికి రోగనిర్ణయ సమయంలో రోగం లేదని చెప్పడం (false negative). సాధారణంగా మొదటి రకం కంటే రెండో రకంవి ప్రమాదకరం అని భావిస్తారు. కనుక, టైప్ 2 తప్పులని నివారించడానికి కొంచెం అతి జాగ్రత్తగా రోగనిర్ణయం చేసినప్పుడు Rosenhan Experiment, Nellie Bly కథ వంటి వాటిల్లో మానసిక సమస్యలు లేని వారు కూడా రోగులుగా నిర్థారించబడతారని, రోగం ఉన్న వాడికి రోగం లేదని వెనక్కి పంపేయడం కంటే‌ ఇది నయం అనీ ఒక వాదన అట. Rosenhan Experiment కి ప్రతిస్పందనగా – మానసికరోగ నిర్థారణలో రోగి చెప్పినదానిమీదే ప్రధానంగా ఆధారపడతారు కనుక రోగే అబద్ధమాడితే, అప్పుడు తప్పుడు రోగనిర్ణయానికి బాధ్యత రోగిది కానీ నిర్థారణ పద్ధతిది కాదని కూడా కొందరు వాదించారని మరొకచోట చదివాను. ఇది తప్ప మనోరోగ నిర్థారణ గురించి, అందులోని ఆధునిక పద్ధతుల గురించి నాకేమీ తెలియదు. రెంటి లక్ష్యాలూ వేరైనా, Rosenhan Experiment, Nellie Bly ఉదంతం ఇటువంటి వాటి వల్ల ఈ మనోరోగ నిర్థారణ పద్ధతులపైన పడిన ప్రభావం ఏమిటన్నది కూడా నాకింకా సరిగా అర్థమవలేదు. ఎవరన్నా ఏదన్నా వివరాలు తెలుపగలిగితే వారికి ముందస్తు ధన్యవాదాలు – ఈ వివరాలు అడగడానికి ఇదంతా రాశానన్నమాట! 🙂

“Ten days in a mad house” పుస్తకం అంతర్జాలంలో ఉచితంగా చదవడానికి, వినడానికి కూడా లభ్యం. “On Being Sane in insane places” వ్యాసం కూడా అంతర్జాలంలో లభ్యం. (సైన్స్ పత్రిక అధికారిక లంకె, వీరి అనుమతితో మరోచోట ఉచితంగా వ్యాసం‌ లభించే లంకె)

Ten Days in a Mad-House
Nellie Bly
Investigative Journalism
1887

You Might Also Like

One Comment

  1. sarath

    బాగుంది,చదవటానికి,లింక్ కూడా ఇచ్చారు అది మరీ బాగుంది,థంక్ యు సో ముచ్.

Leave a Reply