పుస్తకం
All about booksపుస్తకలోకం

August 8, 2014

నేటి సాహిత్య విమర్శ

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: నోరి నరసింహశాస్త్రి

(గమనిక: ఈ వ్యాసం నోరి నరసింహశాస్త్రి గారి‌ “సారస్వత వ్యాసములు” లోనిది. మొదట 1969 నాల్గవ అఖిల భారత తెలుగు రచయితల సమావేశం సావనీర్ లో వచ్చింది. ఈ వ్యాసాన్ని ఇక్కడ తిరిగి ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో కాపీహక్కుదారులు editor@pustakam.netకి ఈమెయిల్ ద్వారా తెలియజేయగలరు. – పుస్తకం.నెట్)
****

ఆధునిక విజ్ఞానము సమకూర్చిన సౌకర్యాల వల్ల ప్రపంచమంతా నేడు సన్నిహితమైనది. ఇందువల్ల మానవులలో సహజంగా ఉన్న మానవత్వమూ, సాధనవల్ల సాధ్యమయ్యే దివ్యత్వమూ వ్యాపించి ఈ లోకమే స్వర్గతుల్యమవుతుందని బుద్ధిమంతులు భావించడము సహజము. కాని ఫలితము అందుకు విపరీతముగా కనిపిస్తున్నది. మానవులలో నిహితమై ఉన్న పశు ప్రవృత్తీ, సులభ సాధ్యమైన అసురభావమూ ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు కనిపిస్తున్నది. శాంతి సామరస్యాల కంటె కల్లోల ద్వేషాలే విజృంభిస్తున్నవి. పూర్వ కాలంలో ఒకచోట పుట్టిన కల్లోలము ఆ ప్రాంతాన్నే బాధించేది. కాని ఈ కాలంలో ఏ మారుమూలనో పుట్టిన ఏ చిన్న కల్లోలమూ ప్రపంచమంతా వ్యాపించి కలుషితం చేసి సర్వనాశనానికి దారితీసే అవకాశాలు కనబడుతున్నవి. ఈ ప్రమాదాన్ని అరికట్టగలిగినది సాహిత్యమొక్కటే!

ఐతే బాహ్య ప్రపంచంలో వ్యాప్తమైన ఈ కల్లోలము సాహిత్య కళా ప్రపంచంలో కూడా ప్రతిబింబిస్తూనే ఉన్నది. అట్లా ప్రతిబింబించిన కల్లోలాన్ని శత సహస్ర గుణంగా వృద్ధిచేసి లోకమంతటా వెదజల్లుతున్నది. సాహిత్యానికి ఉన్న ఈ మహత్తరశక్తిని ముందు బాగా గ్రహించినవారు రాజకీయ నాయకులు! ప్రతి రాజకీయ పార్టీ తన ఆశయాలకు అనుకూలమైన కల్లోలాన్ని సృష్టించే రచయితలను కూడదీసి ఆకాశానికి ఎత్తి వారినే మహాకవులుగా, గొప్ప రచయితలుగా ప్రచారము చేస్తున్నది. కవులూ, రచయితలూ వారి పొగడ్తలకూ, వారు సమకూర్చే ఆర్థికాది లాభాలకూ వశులై ఆయా రాజకీయ పార్టీలకు క్రీతదాసులై తమ దాస్యమే ప్రభుత్వమూ, స్వాతంత్ర్యమూ అనే భ్రాంతిలో పడిపోతున్నారు. ఈ పరిస్థితి సాహిత్యానికే‌కాక లోకశ్రేయస్సుకే చాలా ప్రమాదకరమైనది!

పూర్వము కవులు శారీరకంగా ఇతరుల ప్రభుత్వాలకు బద్ధులైనప్పుడు కూడా తమ హృదయాలను స్వతంత్రంగా ఉంచుకుని, తమ క్రూరప్రభువులను కూడా మానవులనుగా మార్చి సన్మార్గములో నడిపించేవారు. నేడు కవుల హృదయాలనే రాజకీయాలకు బానిసత్వము ఆవేశించినది. కవులూ కావ్యకర్తలూ కానివారు మహాకవులుగా మహా రచయితలుగా చలామణీ‌ అవుతున్నారు. ఈకాలంలో ఎందరో మంచి కవులూ రచయితలూ తమకు తెలియకుండానే దాస్య శృంఖలాలకు బద్ధులై ఆ సంకెళ్ళు బంగారువని పొంగిపోతున్నారు. ఆ సంకెళ్ళు కూడా‌బంగారువి కాదు. బంగారు పూతవి మాత్రమే. సాహిత్యాన్ని రాజకీయాల దాస్యములో నుంచి ఉద్ధరించి దానికి స్వాతంత్ర్యము చేకూర్చవలసిన అవసరమిప్పుడెంతో ఉన్నది. లేకపోతే సాహిత్యము తన స్వరూపమే కోలుపోయి ప్రమాదకర సాధనంగా పరిణమించే స్థితి వస్తున్నది.

సాహిత్యానికి దాస్యము తొలగించి స్వాతంత్ర్యము చేకూర్చగల శక్తి సాహిత్యవిమర్శకు ఒక్కదానికే ఉన్నది. ఈ గురుతర బాధ్యత తమమీద ఉన్నదని సాహిత్య విమర్శకులు గుర్తించినప్పుడే, వారు తమ విధి నిర్వహించినవారవుతారు. అప్పుడే ఉత్తమ సాహిత్యము రూపొంది-పెంపొంది లోకులకు గ్రాహ్యమై, లోకంలో మానవత్వాన్ని, దివ్యత్వాన్నీ ప్రతిష్ఠించి విశ్వశ్రేయస్సు సాధించగలుగుతుంది.

లోకమంతటా వ్యాపించిన కల్లోలము సాహిత్య విమర్శలోకి కూడా ప్రసరించకపోలేదు. పైగా రాజకీయవాదుల పంచమాంగదళాలు సాహిత్య విమర్శకులలోకి కూడా చొచ్చుకుని వచ్చి ఉన్నవి. ఐనా సాహిత్య విమర్శకులు, విమర్శకులు గనుక ఎక్కువ బుద్ధిమంతులు! నిశితంగా ఆత్మవిమర్శ, పరవిమర్శ చేసుకుని ఋజుమార్గంలోకి శీఘ్రంగా రాగలవారు; రాగద్వేషాలు మధ్య వచ్చినా వాటిని నిగ్రహించుకుని సన్మార్గము దర్శించి ఇతరులకు ప్రదర్శింపగలవారు.

నేడు పాఠకలోకము విపరీతంగా వృద్ధి ఐనది. అందులో గొప్ప ప్రమాదముతో పాటు సముద్ధరణ బీజం కూడా ఇమిడి ఉన్నది. సాహిత్య విమర్శకులు వారిని ప్రమాదంలో నుంచి తప్పించి సముద్ధరించే బాధ్యత కూడా తాము వహించవలె.

లోకమంతటా ఎంత కల్లోలమున్నా ఉత్తమ సాహిత్య సృష్టికి నేడున్నంత విస్తారమైన అవకాశము పూర్వమెప్పుడూ ఎక్కడా లేదు. ప్రపంచం అంతటా మారుమూలలతో సహా, ఎక్కడెక్కడ ఉత్తమ సాహిత్యం ఏ కాలంలో ఉన్నదైనా మనము గ్రహించి రసానుభూతి పొందే అవకాశము ఇప్పుడెంతైనా ఉన్నది. ఉత్తమ సాహిత్యము నాగరిక జాతులలోనే కాన అనాగరిక జాతులలో కూడా ఉన్నది. ఒక విధంగా యోచిస్తే నాగరికులమనుకునే వారికంటే, అనాగరికులుగా పరిగణింపబడే వారిలోనే ఉత్తమ సాహిత్యసృష్టికి ఎక్కువ అవకాశాలు కన్పిస్తున్నవి. ఉత్తమ సాహిత్యము ఎక్కడ ఉన్నా, సాహిత్య విమర్శకులు దానికి వెలికి తీసి లోకమంతటా దాని సౌరభాలూ వ్యాపింపజేయవలసి ఉన్నది.

సామాన్య మానవుని సాధారణ ప్రవృత్తి ఆలోచిద్దాము. ఒకనికి ఇంకొకనిమీద ద్వేషము కలిగితే అవతలవాణ్ణి హింసించినపుడే గాని తృప్తి కలగదు. ఇతరుల వస్తువు కావలెనని లోభము కలిగినప్పుడు, దొంగతనంగానో, దొరతనంగానో దాన్ని పొందినప్పుడే తృప్తిపడతాడు. ఒక పురుషునికి స్త్రీ యందో, స్త్రీకి పురుషునియందో తీవ్రకామము అవేశించినప్పుడు యుక్తాయుక్త విచక్షణ లేకుండా తీర్చుకొన్నప్పుడే తృప్తి కలుగుతుంది. ఇటువంటి తృప్తులే ఇంకా చాలా లోకంలో ఉన్నవి. ఆ విధంగా కలిగే తృప్తి పశువులకు కలిగే తృప్తి గాని ఉత్తమ సాహిత్యము కలిగించగల ఆనందము కాదు. నేడు పెరిగిన పాఠకలోకానికి నేడు పెరిగిన రచయితలు అందిస్తున్నది ఎక్కువభాగము వారి పశువృత్తికి పరోక్షంగా కలిస్తున్న ఈదృశ్యమైన తృప్తే కాని కావ్యానందము కాదు.

ఉత్తమ కవికూడా క్రోధాన్నీ, ద్వేషాన్నీ, కామాన్నీ తన కావ్యవస్తువులుగా తీసుకోకపోడు. కాని అవి విశృంఖలంగా విహరించినప్పుడు పశువుల మవుతామనీ, ధర్మమార్గములో ప్రవర్తించునప్పుడే మానవులమూ, దివ్యులమూ అవుతామనీ సూచిస్తాడు. ఈ విధంగా పాఠకలోకానికి నిగ్రహములో ఉన్న సున్నితమైన మాధుర్యమూ, ఆనందమూ అందిస్తాడు. దీని విలువను పాఠకులలో ప్రచారము చేసి రసానందాన్ని అనుభవించగల శక్తి కలిగించడము సాహిత్య విమర్శకుల విధి. కాబట్టి సాహిత్య విమర్శకులు ఇటు రచయితలనూ, అటు పాఠకులనూ సన్మార్గములో నడిపించుటకు పాటుపడవలసి ఉన్నది.

నేడు రచయితల స్వాతంత్ర్యాన్ని హరించి వారిని తమ క్రీతదాసులనుగా చేసుకొనడానికి కాచుకుని కూర్చున్న రాజకీయవాదలయు, వివిధ ‘ఇజము’లయు పెద్ద పాముల నోళ్ళలో వారిని పడకుండ రక్షించవలసిన గురుతర బాధ్యత సాహిత్య విమర్శకుల మీద ఉన్నది.

కవులు ప్రధానంగా ఋషులు! అందుచేత వారు ధర్మ ప్రవర్తకులు కాగలుగుతారు. అప్పుడే వారు ఆనంద సంధాతలవుతారు. ఈ విధంగా శాంతిదూతలుగా‌ పరిణమిస్తారు. సాహిత్య శబ్దములలోనే సర్వలోక హితము ఇమిడి ఉన్నది. ఈ విషయమును సాహిత్య రచయితల కందరికీ, సద్గురువు శిష్యునికి ఆత్మస్వరూపము ఉపదేశించినట్లే, సాహిత్య విమర్శకుడు ప్రదర్శింపవలసి ఉన్నది. అప్పుడే రచయిత స్వతంత్రుడు కాగలుగుతాడు. అది లేని నాడు సాహిత్య విమర్శకుడు తాను గోతిలోకి దిగుతూ, తనతోపాటు రచయితలనూ, వారితోపాటు పాఠకలోకాన్నీ ఆ చీకటి గోతిలోనికి లాగగలడు. అట్లుకాక సాహిత్య విమర్శకులు రచయితలనూ, పాఠకులనూ, చల్లని వెన్నెల వెలుగులోకి వెళ్ళేదారి చూపి, నడిపించి ఆనందధామము చేరుస్తారు గాక!About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.2 Comments


 1. Madhu

  చక్కటి వ్యాసం, అందరిని అలోపింప చేసే వ్యాసం ప్రచురించి నందుకు ధన్య వాదాలు. రచయితలే కాదు పాటకులు కుడా తప్పక చదవ వలసిన వ్యాసం. ఈ పుస్తకం లో ఇంకా ఎటువంటి వ్యాసాలు ఉన్నాయో కూడా తెలియ చేస్తే బాగుండేది


  • సౌమ్య

   మధు గారూ
   “సారస్వత వ్యాసములు” గురించి ఇటీవలే ఒక పరిచయం వచ్చింది పుస్తకం.నెట్లో. ఈ పరిచయానికి లంకెని ఈ వ్యాసం పైన రాసిన disclaimer లో కూడా చూడవచ్చు. ఇదిగో లంకె – http://pustakam.net/?p=17026  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

సారస్వత వ్యాసములు

వ్యాసకర్త: Halley ******** ఈ పరిచయము “కవి సామ్రాట్” నోరి నరసింహ శాస్త్రిగారి “సారస్వత వ్య...
by అతిథి
6

 
 

కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారి సాహిత్యవ్యాసాలు

రాసిన వారు: మాలతి నిడదవోలు ******************* నోరి నరసింహశాస్త్రిగారు (1900-1978) పిన్నవయసులోనే కవిత్...
by అతిథి
4