Sons and Lovers: D.H. Lawrence

వ్యాసకర్త: చైతన్య

నిద్ర…రచన…పఠన…ఈ మూడింటికి ఏమిటి సంబంధం?

ఏమిటంటే, ఈ మూడింటికీ కూడా కృత్యాద్యవస్థ ఉంటుంది. నిద్రకు ఉపక్రమించినప్పుడే చూడండి, వెంటనే నిద్ర రాదు. పెనుగులాడవలసివస్తుంది. ఆ తర్వాత క్రమంగా మన ప్రయత్నం ఏమీలేకుండా నిద్ర తెరలు తెరలుగా వచ్చి మన కళ్లను తన మంత్రపాశంతో బంధించేస్తుంది. నిద్రలోకి జారుకున్నాక ఇక మనం మనం కాదు. ఒక్కోసారి మనలో అద్భుత స్వప్నప్రపంచాలు ఆవిష్కృతమవుతాయి.

రచనకు కృత్యాద్యవస్థ ఉంటుందనేది ప్రసిద్ధమే. అలాగే పఠనానికీ ఉంటుంది. నిద్రకు ఉపక్రమించినప్పుడులానే పఠనకు ఉపక్రమించినప్పుడు కూడా రచనాస్వాద నిద్రలోకి జారుకోడానికి కొన్ని పుటల సేపు పెనుగులాడవలసివస్తుంది. క్రమంగా ఆస్వాదన నిద్రలోకి జారుకుంటాం. నిద్రలోలానే అప్పుడు కూడా మనలో అద్భుత స్వప్నాలు ఆవిష్కృతమవుతాయి.

పగలు రైల్లో దూరప్రయాణం చేస్తూ, లంచ్ చేసి కిటికీ పక్కన కూర్చుని డి. హెచ్. లారెన్స్ రచన ‘సన్స్ అండ్ లవర్స్’ చదవడం ప్రారంభించాను.  పఠన నిద్ర ఆవహించడానికి కొన్ని పుటల సమయం పట్టింది…

ఆ తర్వాత…ఓహ్! ఏమి నిద్ర అది! ఏమి మైకమది! నా పక్కన ఎవరు కూర్చున్నారో నాకు తెలియదు. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. ఎక్కడెక్కడెక్కడో రైలు ఆగడం, ఎవరెవరో దిగడం, ఎక్కడం పలచని పొగమంచులోంచి చూసే దృశ్యాలలా కనిపిస్తున్నాయి. మధ్య మధ్య కళ్ళకు అలసటయ్యో మరెందుకో గాని, పుస్తకం నుంచి పక్కకు మళ్లినప్పుడు పరిసరాలను చూస్తున్నాయి. కానీ ‘నేను’ చూడడంలేదు. కిటికీ పక్కనుంచి కదిలిపోతున్న పొలాలు, చెట్లు, కొండలు, గుట్టలు, పశువులు, పక్షులు, మనుషులు…ప్రకృతి సమస్తం… నా పుస్తకప్రపంచంలోకి నేరుగా జాలువారుతూ, అందులోని వస్తువుకు అదనపు నేపథ్యం అందిస్తోంది. క్రమంగా ఎండలో చురుకు తగ్గి చల్లబడడం తెలుస్తోంది. ఇంకా అద్భుతం, అక్కడక్కడ వర్షం పడుతోంది. ఎండా-వానల నీరెండ నులివెచ్చని వేళ్ళతో హృదయాన్ని తాకుతోంది. ఎండా-వానల నీరెండ నాకు చాలా ఇష్టం.

సాయం సంధ్యలోకి రైలు ప్రయాణిస్తోంది. రైల్లో వెడుతూ పుస్తకం చదువుకుంటున్నప్పుడు సాయం సంధ్య అన్నా కూడా నాకు ఎంతో ఇష్టం. ఆ సమయంలో విషాదమో, ఆనందమో తెలియని ఒకానొక అవస్థ నాలో చుక్క చుక్కలుగా జారుతూ ఉంటుంది,  సాయం సంధ్య నాకు నా జీవితం తాలూకు పురా స్మృతులను తన గర్భంలో ఇముడ్చుకున్న స్మృతి కావ్యంగా అనిపిస్తుంది. నన్ను స్వప్నానికీ, నిజానికీ మధ్య వేలాడదీస్తుంది.

క్షమించాలి. సన్స్ అండ్ లవర్స్ గురించి రాయబోతున్నప్పుడు పూర్తిగా ఇలా ప్రారంభించాలని అనుకోలేదు. కానీ రాసినందుకు ఇప్పుడు సంతృప్తిగా ఉంది. ఆ రచనకు ఈ మాత్రం కవిత్వోపహారం(ఇదెంత పేలవమైన కవిత్వమైనా అవుగాక) న్యాయమే ననిపించింది.

ఒక ఊరి పరిచయంతోనూ, ఒక తల్లి తలపోతలతోనూ రచన మొదలవుతుంది. ఆమెకు ఏడేళ్ళ కొడుకు, అయిదేళ్ళ కూతురు. ఆమె తన ప్రపంచంలో తను ఉంటుంది. పిల్లలు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. ఆ రెండు ప్రపంచాలు కలసిపోయి ఉంటాయి. ఆమె పిల్లల్ని పొదవుకున్నట్టు వాళ్ళ ప్రపంచాన్ని కూడా పొదవుకుంటుంది. దానికి రక్షణ ఇస్తుంది. పిల్లలకు తల్లి ప్రపంచం ఇంకా తెలియదు. అర్థం కాదు. ఓరగా తెరచి ఉన్న తల్లి ప్రపంచం వాకిట పిల్లలు నిలబడి ఉంటారు. క్రమంగా అందులోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పిల్లలకు ఊహ వస్తున్న కొద్దీ, అవసరమైన మేరకు తల్లి తన ప్రపంచపు తలుపులు తీస్తూ ఉంటుంది. తల్లి-పిల్లల జీవితం పొడవునా వివిధ వయోదశల మీదుగా ఇది జరుగుతూనే ఉంటుంది.

ఆశ్చర్యం…ఈ తల్లి-పిల్లల ప్రపంచంలో తండ్రికి ఉనికి లేదు. ఉన్నా నామమాత్రం. అతను అపరిచితుడు, ఔట్ సైడర్. తండ్రి పొద్దున పనికి పోయి సాయంత్రానికి తిరిగివస్తాడు. అతని ప్రపంచం అతనికి వేరే ఉంది. అతని పరోక్షంలో తల్లీ పిల్లలు అతనికి పూర్తిగా అపరిచితమైన ప్రపంచాన్ని రోజంతా పంచుకుంటారు. బహుశా జీవితమంతా పంచుకుంటారు. అతనికి భార్య తెలుస్తుంది. ప్రేమించిన మొదట్లో, ఆ తర్వాత పెళ్ళైన మొదట్లో హృదయంతో ఏ కొంచెమైనా తెలుస్తుందేమో; ఆ తర్వాత క్రమంగా దైహికంగా, దైహికమైన అవసరంగా, తనకు వండిపెట్టే మనిషిగా, తనకు ఉన్న ఒక బాధ్యతగా, లేక బాధ్యతారాహిత్యంగా తెలుస్తుంది. కానీ అతనికి పిల్లలు తెలియరు. వాళ్ళ ప్రపంచం తెలియదు. ఒకరికొకరు అపరిచితులుగా ఉండిపోతారు. పిల్లలు-తండ్రి అనే అపరిచితుల మధ్య తల్లి ఒక పరిచితమైన లింకుగా ఉంటుంది.

తండ్రిని విలన్ గానో, తల్లిని విక్టిమ్ గానో చూపించడం ఈ రచనలో లారెన్స్ ఉద్దేశం కాదు. ఒక తటస్థ దృష్టినుంచి కుటుంబ చిత్రాన్ని అతను ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తను పుట్టి పెరిగిన కుటుంబచిత్రాన్నే ఇస్తున్నాడు. సన్స్ అండ్ లవర్స్ అతని ఆత్మకథ.

***

640px-D_H_Lawrence_passport_photograph1913లో తన 27వ ఏట లారెన్స్ ఈ రచన చేశాడు. 1928లో లేడీ చాటర్లీస్ లవర్ రాయడానికీ ఈ రచనకు మధ్య 15 ఏళ్ల అంతరం ఉంది. కథ చెప్పడంలోనూ, వస్తువులోనూ కూడా ఆ అంతరం కనిపిస్తుంది. లేడీ చాటర్లీస్ లవర్ లో సిద్ధాంతాల పరిశీలన, తాత్విక గాఢత, సమాజమూ, ప్రపంచమూ కొంచెం ఎక్కువ మోతాదులో కనిపిస్తాయి. సన్స్ అండ్ లవర్స్ లో తాత్విక స్పర్శ లేకపోలేదు కానీ అది చాలావరకు కథనంలో కలసిపోయి ఉంటుంది. సిద్ధాంతాల పరిశీలన, సమాజమూ, ప్రపంచమూ అంత ఎక్కువ మోతాదులో కనిపించవు. అందులో ప్రధానంగా కుటుంబం, కుటుంబ సంబంధాలు కనిపిస్తాయి. ఒక అబ్బాయి బాల్య. కౌమార, యవ్వన దశల గురించి ఈ రచన చెబుతుంది.  వయసుతోపాటు వస్తున్న మార్పులకు అనుగుణంగా అతను ప్రకృతికి, స్త్రీకి, తన ఆంతరిక ప్రపంచానికి అభిముఖంగా తెరచుకుంటూ వచ్చిన క్రమాన్ని చెబుతుంది. వాటన్నింటికీ అంతర్లీనంగా తల్లి అనే కొక్కేనికి అతని జీవితం ఎలా వేలాడుతూ వచ్చిందో చెబుతుంది.

ఈ రచన చేసేనాటికే లారెన్స్ రెండు నవలలు రాశాడు…The White Peacock (1911), The Trespasser (1912). అయినాసరే, ఒక తొలిరచనలో ఉండేటంత తాజాదనం, అప్పుడప్పుడే కొండల్లో పుట్టి కిందికి దూకడంలో ఒక జలపాతం చూపించే ఉత్సాహం, ఉరవడి; తన్మయత్వం సన్స్ అండ్ లవర్స్ లోనూ కనిపిస్తాయి. బహుశా లారెన్స్ రచనలన్నిటిలోనూ  అవి కనిపిస్తాయనుకుంటాను.

ఓహ్! ఏమి జీవితం అతనిది! 44 ఏళ్ల స్వల్ప జీవితాన్ని అతను రచనే శ్వాసగా జీవించాడు!

బాల్యం నుంచి యవ్వనం వరకూ తన జీవితాన్నే లారెన్స్ ఇందులో కళ్ళకు కట్టించాడు. ఆ కట్టించడంలో బాహ్య, ఆంతరిక జీవితాలకు సంబంధించిన ఏ వివరాన్నీ అతను విడిచిపెట్టలేదు. మామూలుగా పైపైన చదివినా ఈ పుస్తకపఠనం ఆసక్తికరంగా, ఆహ్లాదభరితంగా సాగుతుంది. అయితే ఒక తేడా… ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్య పెరిగినవారు ఈ రచనతో ఎక్కువ తాదాత్మ్యం చెందుతారు. అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్లతో తమ అనుబంధాలు, అనుభవాలు, జ్ఞాపకాల ప్రతిబింబాన్ని, తాము పుట్టి పెరిగిన కుటుంబ వాతావరణాన్ని ఇందులో దర్శిస్తారు. నేటి పరిమిత కుటుంబ కాలంలో ఒంటిగానో, లేదా ఒకే ఒక్క తోడుతోనో పెరిగినవారికి ఇది ఎటువంటి అనుభూతిని ఇస్తుందో చెప్పలేను. బహుశా వారికి కూడా ఈ రచన థ్రిల్లింగ్ గా అనిపించవచ్చు. తమ కుటుంబ వాతావరణంలోని ఒక వెలితిని సూచించి విషాదం నింపినా నింపవచ్చు.

సామాజిక చరిత్ర కోణం నుంచి చెప్పుకుంటే, 19వ శతాబ్ది చివరిలోని ఇంగ్లండులోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉండేవో ఈ రచన చెబుతుంది. అంతకంటే విశేషం ఏమిటంటే, దాదాపు ఒకే విధమైన కట్టుబాట్లు, కుటుంబ, మానవసంబంధాలు, విశ్వాసాలతో ఇంగ్లండు కుటుంబవ్యవస్థ కూడా భారతీయ కుటుంబ వ్యవస్థలానే ఉంటుంది. అయితే ఒక తేడా ఉంది. భారతీయ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబంలోని సభ్యులతో పోల్చితే అదే తరగతులకు చెందిన ఇంగ్లండు కుటుంబాలలో ప్రకృతిని, అందాన్ని, కళను, సాహిత్యాన్ని ఆస్వాదించే దృష్టి ఎక్కువగా కనిపించి ఆశ్చర్యం కలిగిస్తుంది.

లేడీ చాటర్లీస్ లవర్ కు, సన్స్ అండ్ లవర్స్ కు ఇంకో ముఖ్యమైన తేడా ఉంది. ఇందులో కూడా ప్రణయావేశం, ప్రేమావేశం ఉన్నా అంగాంగవర్ణలతో కూడిన సెక్స్ దాదాపు లేదు. ఆవిధంగా ఇది సంసారపక్షంగా ఉంటుంది. అలాగే, లేడీ చాటర్లీస్ లవర్ లో ఉన్నట్టు ప్రత్యేకంగా ఎత్తి ఉటంకించుకోవలసిన నిర్వచనాలు తక్కువగా ఉంటాయి. కథాక్రమంలోనే అక్కడక్కడ కొన్ని వాక్యాలు కళ్లను, బుద్ధిని తటిల్లుమనిపిస్తాయి. కథ మొత్తం చెప్పకూడదన్న నా నిర్ణయానికి యథాశక్తి కట్టుబడుతూనే అటువంటి కొన్ని వాక్యాలను ఇక్కడ ఇస్తాను:

కథానాయకుడు ఒక అన్న, అక్క తర్వాత మూడో సంతానం. నిజానికి తల్లి వద్దనుకున్నా పుట్టిన సంతానం అతడు. ఆ తర్వాత కూడా ఆమె ఇంకొక కొడుకును కంది. ఈ వద్దనుకున్న రెండో కొడుకే ఆమె ఆత్మిక ప్రపంచంలో భాగమయ్యాడు. అతని ప్రపంచంలో కూడా తల్లి భాగమైంది. వారి మధ్య తల్లీ-కొడుకుల సంబంధంతోపాటు మరొక సంబంధాన్ని కూడా రచయిత ఎంతో మృదువుగా సూక్ష్మంగా సూచిస్తూ ఉంటాడు. భర్తతో ఉన్న సంబంధంలో ఉన్న ఒక వెలితిని, హృదయసంబంధమైన వెలితిని ఆ కొడుకు భర్తీ చేస్తాడు. భర్తతో పొందలేకపోయిన అనుభవాలను ఆమె కొడుకుతో పొందుతుంది. భర్త కళ్ళతో తను చూడలేకపోయిన వాటిని కొడుకు కళ్ళతో చూస్తుంది.

కథానాయకుడు తన పద్నాలుగవ ఏట ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు. ఆ ఘట్టం చివరిలో రచయిత ఇలా రాస్తాడు:

“ Then he told her the budget of the day. His life-story, like an Arabian Nights, was told night after night to his mother. It was almost as if it were her own life.”

ఒకరోజు కథానాయకుడు తన తల్లికి స్నేహితులైన ఒక వ్యవసాయకుటుంబాన్ని కలసుకోడానికి తల్లితో కలసి బయలుదేరాడు. ఆ కుటుంబంలోనే అతను తన తొలి ప్రేయసిని కలసుకోబోతున్నాడు:

“Go and get dressed while I was wash up,” he said.

She did so. He washed the pots, straightened, and then took her boots. They were quite clean. Mrs. Morel was one of those naturally exquisite people who can walk in mud without dirtying their shoes. But Paul had to clean them for her. They were kid boots at eight shillings a pair. He, however, thought them the most dainty boots in the world, and he cleaned them with as much reverence as if they had been flowers.”  (ఇటాలిక్స్ నావి)

తల్లి డ్రస్ చేసుకుంటుంటే కొడుకు వంట పాత్రలు కడగడం, ఆమె బూట్లను, అవి పువ్వులా అన్నట్లుగా ఎంతో భక్తితో శుభ్రం చేయడం, అంత అభిరుచిని చాటే బూట్లు ప్రపంచంలోనే  ఉండవనుకోవడం ఎంత సుకుమారమైన అభివ్యక్తి! తల్లితో కొడుకు బంధాన్ని ఇంత మృదుగాఢంగా వ్యక్తీకరించిన వాక్యాలు విశ్వసాహిత్యంలో ఇంకా ఎన్ని ఉన్నాయి? నాకు తెలియదు.

అన్నట్టు కథానాయకుడు చిత్రకారుడు కూడా. తల్లీ-కొడుకులు రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. అది బొగ్గు గనులున్న ప్రాంతం. తండ్రి గని కార్మికుడు:

“On the fallow land the young wheat shone silkily. Minton pit waved its plumes of white stream, coughed, and rattled hoarsely.

“Now look at that!” said Mrs. Morel. Mother and son stood on the road to watch. Along the ridge of the great pit-hill crawled a little group in silhouette against the sky, a horse, a small truck, and a man. They climbed the incline against the heavens. At the end the man tipped the wagon. There was an undue rattle as the waste fell down the sheer slope of an enormous bank.

“You sit a minute, mother,” he said, and she took a seat on a bank, whilst he sketched rapidly. She was silent whilst he worked, looking round at the afternoon, the red cottages shining among their greenness.

“The world is a wonderful place,” she said, “and wonderfully beautiful.” (ఇటాలిక్స్ నావి)

తర్వాత తల్లీ-కొడుకులు లేచి చెట్ల కిందుగా రోడ్డు మీద నడక సాగించారు:

“The mother and son went through the wheat and oats, over a little bridge into a wild meadow. Pewits, with their white breasts glistening, wheeled and screamed about them. The lake was still and blue. High overhead a heron floated. Opposite, the wood heaped on the hill, green and still.

‘It’s a wild road mother,” said Paul. “Just like Canada.”

“Isn’t it beautiful!” said Mrs. Morel, looking round.

“See that heron-see-see her legs?”

He directed his mother, what she must see and what not. And she was quite content. (ఇటాలిక్స్ నావి)

ఏం చూడాలో, ఏం చూడక్కర్లేదో తల్లికి అతనే చెప్పాడు. తల్లి అతను చెప్పినట్టు వింది.

కొడుకు గీసిన చిత్రాలను ఒక ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తారు. కొడుకుకు తెలియకుండా తల్లి ఆ ఎగ్జిబిషన్ కు చాలాసార్లు వెడుతుంది:

“Several times during the exhibition Mrs. Morel went to the Castle unknown to Paul. She wandered down the long room looking at other exhibits. Yes, they were good. But they had not in them a certain something which she demanded for her satisfaction. Some made her jealous, they were so good. She looked at them a long time trying to find fault with them. Then suddenly she had a shock that made her heart beat. There hung Paul’s picture! She knew it as if it were printed on her heart.

“Name-Paul Morel-First Prize”

కథానాయకుడి తొలి ప్రేయసి పరిచయం ఇలా జరుగుతుంది:

“Her great companion was her mother. They were both brown eyed, and inclined to be mystical, such women as treasure religion inside them, breathe it in their nostrils, and see the whole of life in a mist thereof. So to Miriam, Christ and God made one great figure, which she loved tremblingly and passionately when a tremendous sunset burned out the Western sky, and Ediths, and Lucys, and Rowenas, Brian de Bois Guilberts, Rob Roys, and Guy Mannerings, rustled the sunny leaves in the morning, or sat in her bedroom aloft, alone, when it snowed.  That was life to her.”

ఆమె గురించి రచయిత ఇంకా ఇలా అంటాడు:

“All the life of Miriam’s body was in her eyes, which were usually dark as a dark church, but could flame with light like a conflagration. Her face scarcely ever altered from its look of brooding. She might have been one of the women who went with Mary when Jesus was dead. Her body was not flexible and living. She walked with a swing, rather heavily, her head bowed forward, pondering. She was not clumsy, and yet none of her movements seemed quite the movement.”

ఆమె భావుకురాలు. ఎప్పుడూ తన ఆలోచనల్లో తను ఉంటుంది. కథానాయకుడితో తన పరిచయం ఆమెలోని ఒక పార్స్వాన్ని గాఢంగా స్పృశించింది. ప్రకృతి, పుస్తకాలు, చదువు పట్ల ఆమెలో అస్పష్టంగా ఉన్న అభిరుచికి అతని పరిచయం ఒక స్పష్టమైన రూపం ఇస్తూవచ్చింది. ఆ అభిరుచి ప్రపంచాన్ని ఆమె ముందు తెరచి చూపించే కిటికీ అయ్యాడు అతను. ఆమె అతనికి విద్యార్థిని కూడా అవుతుంది. అతను గీసే చిత్రాలను ఆమె ఎంతో ఆసక్తిగా, తమకంతో చూస్తూ ఉంటుంది. తనలోని అభిరుచికి ఆకృతి ఇస్తున్న అతను క్రమంగా ఆమె ఆత్మిక ప్రపంచంలో భాగమైపోయాడు. అలాగే తన అభిరుచులకు స్పందిస్తూ, పంచుకుంటూ ఉన్న ఒక తోడుగా ఆమె కూడా అతని ఆత్మిక ప్రపంచంలో భాగమైంది. అలా ఒక కోణంలో వారిద్దరూ ఒక అఖండచిత్రం అయ్యారు.

అయితే ఆమెలో అదనపు కోణం ఉంది. అది, ఆధ్యాత్మిక దృష్టి. ఆమెలో దైవభావన, మతదృష్టి ప్రబలంగా ఉంటాయి. అది అతనికి అంత ఆసక్తిని కలిగించని కోణం. దేహసంబంధమైన, భౌతికమైన వన్నీ ఆమెకు అల్పంగా, నీచంగా కనిపిస్తాయి. ఆమె పట్ల అతనిలో ఒక రూపం దిద్దుకుంటున్న ప్రేమకు అసంపూర్ణతను కలిగించే పార్శ్వం అది. వారిద్దరి మధ్య ఇంకొక వైరుధ్యం కూడా ఉంది. అతను ఆత్మిక ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి, బాహ్య ప్రపంచం నుంచి ఆత్మిక ప్రపంచంలోకి ఉండి ఉండి ప్రవహిస్తూ ఉంటాడు. కానీ ఆమె ఆత్మిక ప్రపంచంలోనే ఎప్పుడూ ఉండిపోతుంది. ఈ వైరుధ్యాలు క్రమంగా ఆమెపట్ల అతనిలో అసంతృప్తిని కలిగించాయి. ఆమెపై తీవ్రవైముఖ్యానికి దారి తీసాయి. అయితే ఆమె అతనిలోని ఒక పార్స్వాన్ని సంతృప్తి పరుస్తోంది కనుక ఆమెతో అతని సంబంధం వలపూ-వైముఖ్యమూ కలగలసిన దైంది. ఆమెను అతను చూడకుండా, గంటల తరబడి కలసి గడపకుండా ఉండలేకపోయేవాడు. అతనితో ఆమెదీ సరిగ్గా అలాంటి ద్వైధీ సంబంధమే. ఆమె అతనిని కోరుకుంటోంది. ప్రేమిస్తోంది. కానీ అతను కోరుకుంటున్నట్టు దైహికంగా తనను తాను అతనికి అర్పించుకోలేకపోతోంది.

ఈ ద్వైధీ సంబంధంపట్ల ఇద్దరూ సంఘర్షణకు లోనవుతారు. చివరికి అతని ప్రేమను దక్కించుకోడానికి ఆమె దైహికంగా కూడా తనను అర్పించుకుంటుంది. అయినాసరే, ఇద్దరి సంబంధంలోనూ ఉన్న వెలితి చివరివరకూ అలాగే ఉండిపోయింది. ఇద్దరూ శాశ్వత బంధానికి దూరంగానే ఉండిపోయారు.

వీరిద్దరి సంబంధం త్రికోణ సంఘర్షణగా కూడా పరిణమిస్తుంది. మూడో కోణం అతని తల్లి. ఆ అమ్మాయిని కొడుకు తరచు కలసుకోవడం గంటల తరబడి ఆమెతో గడపడం తల్లికి ఇష్టముండదు. ఆమెపట్ల తల్లికి ఫలానా అని చెప్పలేని అయిష్టత. తన కొడుకును మంత్రించి తన వెంట తిప్పుకునే ఒక మంత్రగత్తెలా ఆమెను భావించినట్టు అనిపిస్తుంది. తల్లీ-కొడుకుల ప్రపంచం నుంచి కొడుకును వేరు చేసి తన ప్రపంచంలోకి లాక్కునే ఒక దుష్టశక్తిగా ఆమె కనిపిస్తుంది. కొడుకు జీవితంలోకి మరో స్త్రీ ప్రవేశించినప్పుడు తల్లి ఆ స్త్రీ పై ప్రకటించే అసూయ, వ్యతిరేకత ఎంతో సహజంగా, సున్నితంగా, వ్యక్తావ్యక్తంగా రచయిత చిత్రిస్తాడు. కొడుకు కూడా తల్లి-ప్రేయసుల మధ్య నలిగిపోతాడు. ప్రేయసిపై తనకు ఉన్న అసంతృప్తికి తోడు తల్లి వ్యతిరేకత కూడా అతనిపై ప్రభావం చూపిస్తుంది. అతను ముమ్మూర్తులా తల్లి కొడుకు.

విశేషమేమిటంటే, తల్లికి ఆ అమ్మాయిపట్లనే తెలియని వైముఖ్యం తప్ప కొడుకు జీవితంలోకి ఏ స్త్రీ అడుగుపెట్టకూడదని అనుకోదు. మరో స్త్రీ గురించి తనతో కొడుకు ఆసక్తిగా మాట్లాడినప్పుడు అడ్డు చెప్పదు. ఆమె వివాహితే కాక అతని కన్న ఆరేళ్లు పెద్దది కూడా. అయితే ఆమె భర్తకు దూరంగా ఉంటోంది తప్ప విడాకులు తీసుకోలేదు. ఆమెపై కథానాయకుడు ఆకర్షితుడయ్యాడు. అయితే అది కూడా సంపూర్ణత్వానికి, శాశ్వతబంధానికి దారితీయలేదు. ఆమెతో అతనికి దైహికమైన సంతృప్తి కలిగింది కానీ ఆత్మికమైన సంతృప్తి లోపించింది. దైహికంగా అతను తనతో ఉన్నా మానసికంగా లేడనే అసంతృప్తి ఆమెలోనూ కలిగింది.

మరో స్త్రీతో అతని సంబంధం గురించి తొలి ప్రేయసి స్పందన ఇలా ఉంటుంది:

“It made Miriam bitter to think that he should throw away his soul for this flippant traffic of triviality with Clara. She walked in bitterness and silence, while the other two rallied each other, and Paul sported.

And afterwards, he would not own it, but he was rather ashamed of himself, and prostrated himself before Miriam. Then again he rebelled.

ఆ సందర్భంలో అతను తొలి ప్రేయసితో అన్న మాటలు ఈ రచనలో చాలా అరుదుగా వాచ్యమైన తాత్విక గాఢత కలిగిన వాక్యాలు:

“It is not religious to be religious,” he said. “I reckon a crow is religious when it sails across the sky. But it only does it because it feels itself carried to where it’s going, not because it thinks it is being eternal.”

But Miriam knew that one should be religious in everything, have God, whatever God might be, present in everything.

“I don’t believe God knows such a lot about Himself,” he cried. “God doesn’t know things, He is things. And I’m sure He’s not soulful.”

తొలి ప్రేయసితో తను ఎదుర్కొన్న ఘర్షణ సారాంశాన్ని అతను ఇలా చెప్పుకుంటాడు:

“She was his conscience; and he felt, somehow, he had got a conscience that was too much for him. He could not leave her, because in one way she did not hold the best of him. He could not stay with her because she did not take the rest of him, which was three quarters. So he chafed himself into rawness over her.”

ఇలా తల్లి-ఇద్దరు ప్రేయసులు అనే ముగ్గురు స్త్రీల మధ్య అతని జీవితం ఉయ్యాలలూగుతూ ఉంటుంది. ప్రేయసులతో అతనికి ద్వైధీ భావం ఉండచ్చు. కానీ తల్లితో అతని సంబంధంలో ఎలాంటి ద్వైధీభావమూ లేదు. ఒక చెట్టు జీవితం తన వేళ్ళలో ఎలా పాతుకుని ఉంటుందో అలాగే అతని జీవితం తల్లి అస్తిత్వంలోనే పాతుకుని ఉంటుంది. అతని బాహ్య, ఆంతరికజీవితం ఒక చెట్టుకు గల అనేక కొమ్మలుగా ఎటైనా వ్యాపించి ఉండచ్చు. కానీ అతని జీవన మూలం తల్లి అస్తిత్వంలో స్థిరంగా ఆద్వయంగా ఉండిపోతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, అతనొక గాలిపటంలా ఎంతో ఉత్సుకతతో ఎటెటో పయనిస్తూ చిత్ర విచిత్ర జీవనానుభవాల కోసం అర్రులు చాచవచ్చు. కానీ ఆ గాలిపటం దారం తల్లి చేతిలో భద్రంగా ఉంటుంది. తల్లి చేతిలో తన జీవన సూత్రం భద్రంగా ఉందన్న స్పృహ అతనిలో ఉంటుంది.

అంతిమంగా రచయిత తల్లీ-కొడుకుల గురించే చెబుతున్నాడు. మిగిలిన ఇద్దరు స్త్రీలూ ఆగంతకులే.

తొలి పాఠకులను దృష్టిలో పెట్టుకుని మొత్తం కథ చెప్పకూడదన్న నా నిర్ణయాన్ని ఇప్పటికే కొంతవరకు ఉల్లంఘించినట్టు ఉన్నాను. ఒక ముఖ్యమైన ప్రస్తావనతో ఈ వ్యాసాన్ని ఇక ముగించేస్తాను.

తల్లి చనిపోతుంది. తల్లి మరణంతో అతని జీవితంలో ఒక దశ ముగిసిపోతుంది. అది రెండు ముక్కలుగా ఖండితమైపోతుంది. బాల్యం నుంచి యవ్వనం వరకూ తల్లితో పెనవేసుకున్న అతని జీవనోత్సుకత ఒక్కసారిగా చల్లారిపోతుంది.  మలి జీవిత దశను అతను ఎలా ఎదుర్కొన్నాడో తెలియదు. తల్లి మరణం అతనిపై కలిగించిన ప్రభావం గురించి రచయిత ఇలా రాస్తాడు:

“Everything seemed to have gone smash for the young man. He could not paint. The picture he finished on the day of his mother’s death- one that satisfied him- was the last thing he did. At work there was no Clara (అతని రెండో ప్రేయసి). When he came home he could not take up his brush again. There was nothing left.”

“The people hurrying along the streets offered no obstruction to the void in which he found himself…There was no time, only space.”

“Mother!” he whispered-“mother”

She was the only thing that held him up, himself, amid all this. And she was gone, intermingled herself. He wanted her to touch him, have him alongside her.

***

సన్స్ అండ్ లవర్స్ తర్వాత 15 ఏళ్ళకు రాసిన లేడీ చాటర్లీస్ లవర్ లో లారెన్స్ వివాహేతరసంబంధాన్ని చిత్రిస్తాడు. సన్స్ అండ్ లవర్స్ లో అతనితో రెండో ప్రేయసి సంబంధం కూడా వివాహేతరమే(ఆమె భర్త ప్రవర్తన నచ్చక దూరంగా ఉండిపోయింది కానీ విడాకులు తీసుకోలేదు). కానీ అతను సన్స్ అండ్ లవర్స్ లో వివాహసంబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తాడు.

అతని తల్లి, తండ్రి ఒకరికొకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత కొంతకాలానికే అతనితో ఆమె అసంతృప్తికి లోనవుతూ వచ్చింది. అతను ఇంటి ఖర్చులకు సరిపోయే డబ్బు ఇవ్వడు. అప్పులు చేస్తాడు. తాగి వచ్చి భార్యను దుర్భాషలాడడం, కొట్టడం చేస్తాడు. అయితే, వారి సంబంధం గురించి కొడుకు తొలి ప్రేయసితో ఇలా అంటాడు:

“… my mother, I believe, got real joy and satisfaction out of my father at first. I believe she had passion for him; that’s why she stayed with him. After all, they were bound to each other.”

“Yes,” said Miriam.

“That’s what one must have, I think”, he continued-“the real, real flame of feeling through another person-once, only once, if it only lasts three months.”

దాంపత్య సంబంధాన్ని ఒక ఆదర్శం నుంచో, వ్యవస్థాపరంగానో కాక ఫీలింగ్ నుంచి ఈ వాక్యాలు నిర్వచిస్తున్నాయి.

ఇంకా విశేషమేమిటంటే, తన రెండో ప్రేయసిని తిరిగి భర్త దగ్గరకు పంపడానికి కథానాయకుడే ప్రయత్నిస్తాడు. అతని కంటే భర్తే తనను నిజంగా ప్రేమించాడని ఆమె తెలుసుకుంటుంది. పశ్చాత్తాపపడుతుంది. తిరిగి భార్యాభర్తలు ఒకటవుతారు. తేడా ఏమిటంటే, తిరిగి ఆమె భర్త దగ్గరికి వెళ్లడానికి కథానాయకుడితో ఆమె అనుభవమే ప్రాతిపదిక అవుతుంది.

ఈ సందర్భంలో నాకు రెండు తెలుగు రచనలు గుర్తొస్తున్నాయి. మొదటిది, నాకు గుర్తున్నంతవరకు, విశ్వనాథ వారి ‘చెలియలికట్ట’. రెండోది, ఉన్నవ లక్ష్మీనారాయణగారి ‘మాలపల్లి’. ఈ రెండు  రచనలూ కూడా వివాహేతర సంబంధంతో పశ్చాత్తాపం చెంది, తిరిగి వివాహసంబంధం వైపు మొగ్గడాన్ని చిత్రిస్తాయి.

ఇక, సన్స్ అండ్ లవర్స్ తో బాగా దగ్గర పోలిక ఉన్న తెలుగు రచన నాకు ప్రస్తుతానికి ఒకటే కనిపిస్తోంది. అది, బుచ్చిబాబు ‘చివరకి మిగిలేది’. అందులో కూడా కథానాయకుడైన దయానిధిపై తల్లి ప్రభావం ఉంటుంది. అతనికి కూడా ఇద్దరు స్త్రీలతో సంబంధం ఉంటుంది. ఇంకా ఎలాంటి దగ్గరి పోలికలు ఉన్నాయో ‘చివరికి మిగిలేది’ మరోసారి చదివితే కానీ చెప్పలేను. ఆ రచనపై సన్స్ అండ్ లవర్స్ ప్రభావం ఉన్నట్టు ఎవరైనా చెప్పారో లేదో కూడా నాకు గుర్తులేదు.

SONS AND LOVERS
D.H. LAWRENCE
Fiction
Paperback

You Might Also Like

One Comment

  1. ramanajeevi

    భాస్కరం గారు,
    మీరు చెప్పిన తీరు చాలా స్పష్టంగా, ఆసక్తికరంగా వుంది. చదవడంలో వున్నఆహ్లాదాన్ని కూడా భలే చెప్పారు. అభినందనలు.

Leave a Reply to ramanajeevi Cancel